కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసును ఆదర్శంగా తీసుకొని మెలకువగా ఉండండి

యేసును ఆదర్శంగా తీసుకొని మెలకువగా ఉండండి

యేసును ఆదర్శంగా తీసుకొని మెలకువగా ఉండండి

“మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి.”—మత్త. 26:41.

మీరు వీటికి ఎలా జవాబిస్తారో చూడండి:

మనం మెలకువగా ఉన్నామని మన ప్రార్థనలు ఎలా చూపిస్తాయి?

ప్రకటనాపని విషయంలో మెలకువగా ఉన్నామని మనమెలా చూపించవచ్చు?

కష్టకాలాల్లో మెలకువగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? ఆ సమయంలో మనమెలా మెలకువగా ఉండవచ్చు?

1, 2. (ఎ) మెలకువగా ఉండే విషయంలో యేసును ఆదర్శంగా తీసుకోవడం గురించి ఏ ప్రశ్నలు రావచ్చు? (బి) పాపులైన మానవులు పరిపూర్ణుడైన యేసు నుండి నేర్చుకోవడం సాధ్యమౌతుందా? ఉదాహరణతో చెప్పండి.

 అపరిపూర్ణులమైన మనం మెలకువగా ఉండే విషయంలో పరిపూర్ణుడైన యేసును ఆదర్శంగా తీసుకోవడం సాధ్యమేనా? పైగా కొన్ని సందర్భాల్లో ఆయన వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలను కూడా స్పష్టంగా గ్రహించగలిగాడు. అలాంటప్పుడు ఆయనకు మెలకువగా ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా? (మత్త. 24:37-39; హెబ్రీ. 4:15) మనం ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే, ఆయనలా మనం కూడా మెలకువగా ఉండడం ఎంత అవసరమో, అది ఇప్పుడు ఎందుకు అంత ప్రాముఖ్యమో గ్రహించగలుగుతాం.

2 పాపులైన మానవులు ఒక పరిపూర్ణ వ్యక్తి నుండి నేర్చుకోవడం సాధ్యమౌతుందా? అవుతుంది. ఎందుకంటే, మంచి బోధకుడిని ఆదర్శంగా తీసుకొని ఆయన నుండి నేర్చుకోవడం విద్యార్థికి సాధ్యమే. ఉదాహరణకు, ఒక వ్యక్తి కొత్తగా విలువిద్య నేర్చుకుంటున్నాడని అనుకుందాం. కొత్తలో గురి చూసి కొట్టడం అతనికి సాధ్యం కాదు. అలా గురి చూసి కొట్టాలంటే అతను ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి అతను విలువిద్యలో నిపుణుడైన తన గురువు విల్లును ఎలా ఎక్కుపెడుతున్నాడో బాగా గమనిస్తాడు. ఆయన ఎలా నిలబడుతున్నాడో, భుజాలను ఏ భంగిమలో ఉంచుతున్నాడో, చేతివేళ్లతో విల్లు తీగెను ఎలా పట్టుకుంటున్నాడో అతను చాలా శ్రద్ధగా గమనిస్తాడు. అలా అతను ఎంతో కష్టపడి మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటాడు. గాలి ఎటు నుండి వీస్తుందో గమనించి విల్లు తీగెను ఎంత దూరం లాగాలో, ఎంత బలం ఉపయోగించాలో గ్రహిస్తాడు. గురువు దగ్గర గమనించిన విషయాలను మనసులో ఉంచుకొని, ఎన్నో బాణాలను ప్రయోగించీ ప్రయోగించీ చివరకు గురి చూసి కొట్టడం నేర్చుకుంటాడు. అలాగే మనం కూడా పరిపూర్ణుడైన యేసును ఆదర్శంగా తీసుకొని ఆయన ఇచ్చిన ఉపదేశాలను పాటిస్తూ ఉంటే, క్రైస్తవులముగా మనం రోజురోజుకూ ఎంతో ప్రగతి సాధించవచ్చు.

3. (ఎ) మెలకువగా ఉండాల్సిన అవసరం తనకుందని యేసు ఎలా చూపించాడు? (బి) మనం ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

3 యేసుకు మెలకువగా ఉండాల్సిన అవసరం వచ్చిందా? అవును వచ్చింది. ఉదాహరణకు, “నాతో కూడ మెలకువగా నుండుడి” అని యేసు భూమ్మీదున్న చివరి రాత్రి నమ్మకమైన తన అపొస్తలులతో చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు, “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి.” (మత్త. 26:38, 41) జీవితమంతా యేసు మెలకువగానే ఉన్నాడు. అయినా, వేదనకరమైన ఆ చివరి ఘడియల్లో మరిముఖ్యంగా మెలకువగా ఉండి తన పరలోక తండ్రితో సాధ్యమైనంత ఎక్కువగా మాట్లాడాలనుకున్నాడు. శిష్యులు కూడా ఆ సమయంలోనే కాక ఆ తర్వాతా అంతే మెలకువగా ఉండడం అవసరమని యేసుకు తెలుసు. కాబట్టి, మనం మెలకువగా ఉండాలని యేసు ఎందుకు చెప్పాడో ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత, మన రోజువారీ జీవితంలో యేసును ఆదర్శంగా తీసుకోగల మూడు విషయాలను పరిశీలిద్దాం.

మనం మెలకువగా ఉండాలని యేసు ఎందుకు చెప్పాడు?

4. భవిష్యత్తు గురించి మనకు అంతా తెలియకపోవడానికీ మనం మెలకువగా ఉండడానికీ మధ్య సంబంధమేమిటి?

4 ఒక్క మాటలో చెప్పాలంటే, భవిష్యత్తు గురించి మనకు ఇప్పటికే తెలిసిన వాటిని బట్టి, ఇంకా తెలియని వాటిని బట్టి మెలకువగా ఉండమని యేసు మనకు చెప్పాడు. యేసు భూమ్మీదున్నప్పుడు భవిష్యత్తు గురించి ఆయనకు అంతా తెలుసా? తెలియదు, ఎందుకంటే “ఆ దినమును గూర్చియు, ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు” అని ఆయన వినయంగా అంగీకరించాడు. (మత్త. 24:36) ఆ సమయంలో, దేవుని ‘కుమారుడైన’ యేసుకు దుష్టవిధానం ఎప్పుడు అంతమౌతుందో తెలియదు. ఇప్పుడు మన విషయమేమిటి? భవిష్యత్తు గురించి మనకు అంతా తెలుసా? తెలియదు. దేవుడు తన కుమారుని ద్వారా ఈ దుష్ట విధానాన్ని ఎప్పుడు నిర్మూలం చేస్తాడో మనకు తెలియదు. ఒకవేళ మనకు అది తెలిస్తే, మెలకువగా ఉండాల్సిన అవసరం నిజంగా ఉంటుందా? యేసు వివరించినట్లుగా, అంతం ఊహించని సమయంలో అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి, మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి.—మత్తయి 24:43 చదవండి.

5, 6. (ఎ) భవిష్యత్తు గురించీ దేవుని సంకల్పాల గురించీ మనకు తెలిసిన విషయాల వల్ల మనం ఎలా మెలకువగా ఉండగలుగుతాం? (బి) సాతాను గురించి మనకు తెలిసిన విషయాలను బట్టి మనం మెలకువగా ఉండాలని మరింత గట్టిగా ఎందుకు నిర్ణయించుకోవాలి?

5 అయితే భవిష్యత్తు గురించి తన చుట్టూ ఉన్న ప్రజలకు అసలేమాత్రం తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు యేసుకు తెలుసు. యేసుకున్న జ్ఞానంతో మన జ్ఞానాన్ని పోల్చుకుంటే అసలు మన జ్ఞానం ఏ మూలకూ రాదు. కానీ ఆయన చెప్పినవాటి వల్ల దేవుని రాజ్యం గురించి, అతి త్వరలో అది చేయబోయే పనుల గురించి మనకు ఎన్నో విషయాలు తెలిశాయి. స్కూల్లో, ఉద్యోగ స్థలంలో, పరిచర్యలో మనం కలిసే చాలామందికి ఆ అద్భుతమైన సత్యాలు తెలియక చిమ్మచీకటిలో ఉన్నట్లు మనం గమనించవచ్చు. దీన్నిబట్టి కూడా మనం మెలకువగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమని తెలుస్తోంది. దేవుని రాజ్యం గురించి మనకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి దొరికే అవకాశాల కోసం చూస్తూ యేసులా మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. అలా మనకు దొరికే ప్రతీ అవకాశాన్ని ఎంతో విలువైనదిగా పరిగణిస్తూ ఏ అవకాశాన్నీ వదులుకోవాలనుకోం. ఎందుకంటే ప్రాణాలు అపాయంలో ఉన్నాయి!—1 తిమో. 4:16.

6 యేసుకు మరో విషయం తెలిసినందువల్ల కూడా మెలకువగా ఉండగలిగాడు. తనను శోధించడానికి, హింసించడానికి, తన యథార్థతను దెబ్బతీయడానికి సాతాను గట్టిగా ప్రయత్నిస్తున్నాడని యేసుకు తెలుసు. ఆ క్రూరమైన శత్రువు యేసును శోధించడానికి మరో అవకాశం కోసం కాచుక్కూర్చున్నాడు. (లూకా 4:13) యేసు ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండలేదు. ఎలాంటి పరీక్షనైనా, శోధననైనా, వ్యతిరేకతనైనా లేదా హింసనైనా ఎదిరించడానికి ఆయన సిద్ధంగా ఉండాలనుకున్నాడు. మనం కూడా అలాగే చేయాలని కోరుకుంటాం కదా? సాతాను ఇప్పటికీ “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని మనకు తెలుసు. అందుకే “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి” అని బైబిలు మనల్ని హెచ్చరిస్తోంది. (1 పేతు. 5:8) ఇంతకీ మనం ఆ లేఖనాన్ని ఎలా పాటించవచ్చు?

మెలకువగా ఉండడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

7, 8. ప్రార్థన గురించి యేసు ఏ ఉపదేశం ఇచ్చాడు, ఆయన మనకు ఎలా ఆదర్శంగా ఉన్నాడు?

7 ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి, ప్రార్థించడానికి మధ్య బలమైన సంబంధం ఉందని బైబిలు చూపిస్తోంది. (కొలొ. 4:2; 1 పేతు. 4:7) తనతో కలిసి మెలకువగా ఉండమని శిష్యులకు చెప్పిన కొద్దిసేపటికే యేసు ఇలా అన్నాడు, “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి.” (మత్త. 26:41) ఆ వేదనకరమైన ఘడియల్లో మాత్రమే అలా చేయాలనే ఉద్దేశంతో యేసు ఆ ఉపదేశాన్ని ఇచ్చాడా? లేదు, మన రోజువారీ జీవితాల్లో మనం ఆ సూత్రాన్ని పాటించాలనే ఉద్దేశంతోనే యేసు ఆ ఉపదేశాన్నిచ్చాడు.

8 ప్రార్థించే విషయంలో యేసు మనకు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన ఒక సందర్భంలో రాత్రంతా తన తండ్రితో మాట్లాడాడు. మనమిప్పుడు ఆ సన్నివేశాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. (లూకా 6:12, 13 చదవండి.) బహుశా జాలర్ల ప్రాంతమైన కపెర్నహూముకు దగ్గర్లో ఆ సంఘటన జరిగి ఉంటుంది. యేసు వివిధ గ్రామాల్లో ప్రకటించిన తర్వాత కపెర్నహూములోని ఇంటికి తిరిగివస్తుండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆయన గలిలయ సముద్రానికి దగ్గర్లో ఉన్న ఒక కొండ మీదికి వెళ్లాడు. మెల్లగా చీకటి పడుతుండగా కిందవున్న కపెర్నహూములోని, దాని చుట్టుపక్కల గ్రామాల్లోని ఇళ్లలో దీపాల వెలుతురు ఆయనకు కనిపించి ఉంటుంది. అయితే యేసు యెహోవాతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థనపైనే మనస్సు నిలిపాడు. అలా నిమిషాలూ గంటలూ గడిచిపోతున్నాయి. దూరంలో ఉన్న దీపాలు ఒకదాని తర్వాత ఒకటి ఆరిపోతున్నాయి, చంద్రుడు ఆకాశంలో మెల్లగా కదులుతున్నాడు, నిశాచర జంతువులు ఆహారంకోసం పొదల్లో వెదుక్కుంటున్నాయి. కానీ ఆయన వేటినీ అంతగా పట్టించుకోలేదు. ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకోవడమనే పెద్ద నిర్ణయం గురించే ప్రార్థించి ఉంటాడు. నిర్దేశం కోసం, జ్ఞానం కోసం తండ్రిని వేడుకుంటూ ఒక్కో శిష్యుడి గురించి తన అభిప్రాయాలను, భావాలను యెహోవాకు తెలియజేయడాన్ని మనం ఊహించుకోవచ్చు.

9. యేసు ఒక రాత్రంతా ప్రార్థించడం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

9 యేసు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మనం కూడా గంటల తరబడి ప్రార్థించాలనా? కాదు. ఎందుకంటే, యేసు తన అనుచరుల పరిమితుల్ని అర్థం చేసుకొని ఇలా అన్నాడు, “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము.” (మత్త. 26:41) అయినా, మనం యేసును అనుసరించవచ్చు. ఉదాహరణకు మనల్ని, మన కుటుంబాన్ని, తోటి సహోదరులను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకొనే ముందు మన పరలోక తండ్రికి ప్రార్థిస్తామా? తోటి సహోదర సహోదరీల గురించి ప్రార్థిస్తామా? ఎప్పుడూ ఒకేలా ప్రార్థించకుండా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తామా? యేసు ఏకాంతంగా తన మనస్సులో ఉన్న విషయాల గురించి తన తండ్రితో మాట్లాడడాన్ని ఎంతో విలువైనదిగా ఎంచాడని కూడా గమనించండి. ఎంతో బిజీగా ఉన్న ఈ లోకంలో మనం కూడా ఉరుకులు పరుగులు తీస్తూ ప్రాముఖ్యమైన వాటిని చాలా సుళువుగా మరచిపోతాం. మన మనస్సులో ఉన్న విషయాల గురించి ఏకాంతంగా ప్రార్థించడానికి తగినంత సమయం తీసుకుంటే మనం ఆధ్యాత్మికంగా మరింత మెలకువగా ఉంటాం. (మత్త. 6:6, 7) అప్పుడు మనం యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపర్చుకోవాలన్న కోరికతో ఆయనకు దగ్గరవుతాం, ఆయనతో మనకున్న సంబంధాన్ని బలహీనం చేసే దేనికైనా దూరంగా ఉండగలుగుతాం.—కీర్త. 25:14.

ప్రకటనాపని విషయంలో మనమెలా మెలకువగా ఉండవచ్చు?

10. ఇతరులతో సువార్త పంచుకోవడానికి అవకాశాల కోసం చూస్తూ యేసు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాడని ఏ ఉదాహరణను బట్టి తెలుస్తోంది?

10 యెహోవా తనకు ఇచ్చిన పని చేసే విషయంలో యేసు మెలకువగా ఉన్నాడు. కొన్ని రకాల పనులకు ఏకాగ్రత నిలపాల్సిన అవసరం అంతగా ఉండకపోవచ్చు. కానీ చాలా పనులకు ఎంతో ఏకాగ్రత, అప్రమత్తత అవసరమౌతాయి. ప్రకటనాపని కూడా అలాంటిదే. ఇతరులతో సువార్త పంచుకోవడానికి అవకాశాల కోసం చూస్తూ యేసు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాడు. ఉదాహరణకు ఆయన, ఆయన శిష్యులు కలిసి ఉదయమంతా కాలినడకన ప్రయాణించి సుఖారు పట్టణానికి చేరుకున్నప్పుడు, శిష్యులు ఆహారం కొనుక్కురావడానికి వెళ్లారు. అప్పుడు యేసు విశ్రాంతి తీసుకోవడానికి ఆ ఊరి బావి దగ్గర ఆగాడు. అయినా ఆ సమయంలో ఆయన మెలకువగా ఉండి సాక్ష్యమివ్వడానికి ఒక అవకాశం దొరికిందని గ్రహించాడు. నీళ్ల కోసం ఒక సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది. యేసు ఆ సమయంలో కాస్త కునుకు తీద్దామని అనుకోలేదు. ఆమెతో మాట్లాడకుండా ఉండేందుకు సాకులు వెదకలేదు. కానీ, చొరవ తీసుకొని ఆమెతో సంభాషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయన ఒక చక్కని సాక్ష్యమివ్వడంతో ఆ పట్టణంలోని చాలామంది విశ్వాసులయ్యారు. (యోహా. 4:4-26, 39-42) రోజులో మనం కలిసే ప్రజలతో సువార్తను పంచుకోవడానికి అవకాశాల కోసం అప్రమత్తంగా ఉండడం ద్వారా మెలకువగా ఉండే విషయంలో యేసు మాదిరిని మరింత ఎక్కువగా అనుకరించడానికి కృషిచేయగలమా?

11, 12. (ఎ) తన పని నుండి పక్కకు మళ్లించడానికి ప్రజలు ప్రయత్నించినప్పుడు యేసు ఎలా స్పందించాడు? (బి) యేసు తన పని విషయంలో ఎలాంటి సమతుల్యాన్ని చూపించాడు?

11 కొన్నిసార్లు సదుద్దేశంగల కొందరు యేసును తన పని నుండి పక్కకు మళ్లించడానికి ప్రయత్నించారు. కపెర్నహూములో యేసు చేసిన స్వస్థతల్ని చూసి ప్రజలు ఆయనను తమ ఊర్లోనే ఉంచేసుకోవాలనుకున్నారు. ఎవరైనా అలాగే చేయాలనుకుంటారు కదా! కానీ యేసు ఆ ఒక్క పట్టణంలోనే కాక తప్పిపోయిన ఇశ్రాయేలీయులందరికీ ప్రకటించాల్సి ఉంది. (మత్త. 15:24) కాబట్టి, ఆయన ఆ ప్రజలకు ఇలా చెప్పాడు, “నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని.” (లూకా 4:40-44) దీన్నిబట్టి, యేసు తన జీవితంలో పరిచర్యకే మొదటిస్థానం ఇచ్చాడని తెలుస్తోంది. ఏదీ ఆయనను పక్కకు మళ్లించలేకపోయింది.

12 యేసు పరిచర్యకే మొదటిస్థానం ఇచ్చాడు. అలాగని, ఆయన విపరీతమైన మతనిష్ఠతో లేదా ఒక సన్యాసిలా ఆ పనిచేశాడా? ప్రజల అవసరాలను పట్టించుకోనంతగా పరిచర్యలో మునిగిపోయాడా? లేదు, ఆయన సమతుల్యాన్ని చూపించాడు. ఆయన కొన్ని సందర్భాల్లో తన స్నేహితులతో సంతోషంగా గడుపుతూ తన జీవితాన్ని ఆస్వాదించాడు. ఆయన ప్రజలను, వాళ్ల కుటుంబ అవసరాలను, సమస్యలను అర్థం చేసుకున్నాడు. అంతేకాక, పిల్లలపై ఎంతో ప్రేమ చూపించాడు.—మార్కు 10:13-16 చదవండి.

13. రాజ్య ప్రకటనాపనికి సంబంధించి మెలకువగా ఉండే విషయంలో, సమతుల్యాన్ని చూపించే విషయంలో మనం యేసును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

13 మెలకువగా ఉండే విషయంలో యేసును ఆదర్శంగా తీసుకుంటూ మనం ఆయనలా సమతుల్యాన్ని ఎలా చూపించవచ్చు? మనం ఈ లోకంలోని ప్రజల వల్ల మన పని నుండి పక్కకు మళ్లాలనుకోం. సదుద్దేశంగల మన స్నేహితులు లేదా బంధువులు కూడా మనం పరిచర్యలో ఎక్కువగా పాల్గొనకుండా నిరాశపర్చవచ్చు లేదా సాధారణ జీవితమని తమకు అనిపించిన జీవితాన్ని గడపమని మనల్ని ప్రోత్సహించవచ్చు. అయితే మనం యేసును అనుకరిస్తే పరిచర్యను ఆహారంతో సమానంగా పరిగణిస్తాం. (యోహా. 4:34) మనం చేసే పని వల్ల మనం ఆధ్యాత్మికంగా బలపడతాం, సంతోషాన్ని పొందుతాం. అలాగని మనం విపరీతమైన మతనిష్ఠతో స్వనీతిపరుల్లా ఉండాలనుకోం లేదా సన్యాసి జీవితాన్ని గడపాలనుకోం. యేసులా సమతుల్యాన్ని చూపిస్తూ, ‘సంతోషంగల దేవుణ్ణి’ ఆనందంగా ఆరాధించాలనుకుంటాం.—1 తిమో. 1:11, NW.

కష్టకాలాల్లో మనమెలా మెలకువగా ఉండవచ్చు?

14. కష్టకాలాల్లో మనం ఏమి చేయకూడదు? ఎందుకు?

14 మనం పైన చూసినట్లుగా, మెలకువగా ఉండమని ఇచ్చిన హెచ్చరికల్లో చాలావరకు యేసు తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటున్న సమయంలోనే ఇచ్చాడు. (మార్కు 14:37 చదవండి.) మన జీవితంలో ఎల్లప్పుడూ, ముఖ్యంగా కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఆయనను ఆదర్శంగా తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మరచిపోతారు. అది ఎంత ప్రాముఖ్యమంటే సామెతల పుస్తకంలో దాని గురించి రెండుసార్లు ఉంది. “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.” (సామె. 14:12; 16:25) మనం సొంత ఆలోచనలపై ఆధారపడితే, ముఖ్యంగా పెద్దపెద్ద సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో అలా చేస్తే, మనం ప్రమాదంలో పడతాం, మనం ప్రేమించేవాళ్లనూ ప్రమాదంలో పడేస్తాం.

15. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబ శిరస్సు ఏ శోధనకు లోనయ్యే అవకాశం ఉంది?

15 ఉదాహరణకు, ఒక కుటుంబ శిరస్సు “స్వకీయుల” వస్తుపర అవసరాలను తీర్చే విషయంలో తీవ్రమైన ఒత్తిడికి లోనుకావచ్చు. (1 తిమో. 5:8) ఎన్నోసార్లు క్రైస్తవ కూటాలకు హాజరవకుండా చేసే, కుటుంబ ఆరాధన నిర్వహించకుండా చేసే లేదా పరిచర్యలో పాల్గొనకుండా చేసే ఉద్యోగాన్ని స్వీకరించడానికి ఆయన శోధించబడే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆయన మానవ ఆలోచనా విధానంపై పూర్తిగా ఆధారపడితే, ఆ ఉద్యోగాన్ని స్వీకరించడంలో తప్పేమీ లేదనిపించవచ్చు, అంతేకాదు అది సరైనదిగానే కనిపించవచ్చు. కానీ, దానివల్ల ఆయన ఆధ్యాత్మిక అనారోగ్యానికి గురయ్యే లేదా ఆధ్యాత్మికంగా చనిపోయే ప్రమాదం ఉంది. సామెతలు 3:5, 6లోని సలహాను పాటించడం ఎంత మంచిదో కదా. సొలొమోను ఇలా అన్నాడు, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”

16. (ఎ) సొంత జ్ఞానంపై కాకుండా యెహోవా జ్ఞానంపై ఆధారపడే విషయంలో యేసు మనకు ఎలా ఆదర్శంగా ఉన్నాడు? (బి) చాలామంది కుటుంబ శిరస్సులు కష్టాలు వచ్చినప్పుడు యెహోవాపై ఆధారపడే విషయంలో యేసును ఆదర్శంగా తీసుకుంటున్నామని ఎలా చూపిస్తున్నారు?

16 యేసుకు పరీక్షలు ఎదురైనప్పుడు ఆయన తన సొంత జ్ఞానంపై ఆధారపడడానికి ఇష్టపడలేదు. ఒక్కసారి ఆలోచించండి! ఈ భూమ్మీద జీవించినవారిలోకెల్లా జ్ఞానవంతుడైన యేసే సాతానుకు జవాబులివ్వడానికి తన సొంత జ్ఞానంపై ఆధారపడలేదు. ఉదాహరణకు, సాతాను ఆయనను శోధించిన ప్రతీసారి ఆయన, “వ్రాయబడియున్నది” అనే మాటను ఉపయోగిస్తూ జవాబిచ్చాడు. (మత్త. 4:4, 7, 10) శోధనను ఎదిరించడానికి ఆయన తండ్రి జ్ఞానంపై ఆధారపడ్డాడు. అలా ఆయన సాతానుకు లేని, సాతాను చూపించడానికి ఇష్టపడని లక్షణాన్ని అంటే వినయాన్ని చూపించాడు. మనం కూడా యేసులా చేస్తామా? మెలకువగా ఉండే విషయంలో యేసును ఆదర్శంగా తీసుకునే కుటుంబ శిరస్సు అన్నివేళలా, ముఖ్యంగా కష్టకాలాల్లో నిర్దేశం కోసం దేవుని వాక్యంపై ఆధారపడతాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కుటుంబ శిరస్సులు అదే చేస్తున్నారు. వాళ్లు వస్తుపరమైన అవసరాల కన్నా దేవుని రాజ్యానికి, స్వచ్ఛారాధనకు తమ జీవితంలో మొదటిస్థానం ఇస్తున్నారు. అలా వాళ్లు తమ కుటుంబాలను మరింత బాగా చూసుకుంటున్నారు. తన వాక్యంలో వాగ్దానం చేయబడినట్లుగా, భౌతిక అవసరాలు తీర్చడానికి వాళ్లు చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడు.—మత్త. 6:33.

17. మీరు యేసులా మెలకువగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు?

17 మెలకువగా ఉండే విషయంలో సాటిలేని రీతిలో యేసు మనకు ఆదర్శంగా ఉన్నాడు. ఆయనను ఆదర్శంగా తీసుకోవడం సాధ్యమే. అలా తీసుకుంటే మనం ప్రయోజనం పొందుతాం, ప్రాణాల్ని రక్షించుకుంటాం. విశ్వాసంలో బలహీనమైపోయేలా, నామమాత్రపు ఆరాధన చేసేలా, యథార్థత విషయంలో రాజీపడేలా శోధిస్తూ మనం ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకునేలా చేయడానికి సాతాను కాచుక్కూర్చున్నాడు. (1 థెస్స. 5:6) సాతానును విజయం సాధించనివ్వకండి! ప్రార్థించే విషయంలో, ప్రకటనాపని విషయంలో, కష్టాలతో వ్యవహరించే విషయంలో యేసులా మెలకువగా ఉండండి. అలా చేస్తే, మనం ఇప్పుడు కూడా అంటే గతించిపోయే ఈ దుష్టవిధానపు చరమాంకంలో కూడా సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చు. మనం అప్రమత్తంగా ఉంటే మన యజమాని ఈ విధానాన్ని అంతం చేసే సమయానికి మనం తన తండ్రి చిత్తం చేస్తూ మెలకువగా, చురుగ్గా ఉన్నామని కనుగొంటాడు. నమ్మకంగా నడుచుకున్నందుకు మనల్ని యెహోవా ఎంతో సంతోషంగా ఆశీర్వదిస్తాడు.—ప్రక. 16:15.

[అధ్యయన ప్రశ్నలు]

[6వ పేజీలోని చిత్రం]

బావి దగ్గరికి వచ్చిన స్త్రీకి యేసు ప్రకటించాడు. ఆయనలాగే ప్రతీరోజు ప్రకటనాపని చేయడానికి మీరు ఎలాంటి అవకాశాలను సృష్టించుకుంటున్నారు?

[7వ పేజీలోని చిత్రం]

కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలను చూసుకోవడం ద్వారా మీరు మెలకువగా ఉన్నారని చూపించవచ్చు