కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సభ్యులు సత్యంలో లేకపోయినా సంతోషంగా ఉండడం సాధ్యమే

కుటుంబ సభ్యులు సత్యంలో లేకపోయినా సంతోషంగా ఉండడం సాధ్యమే

కుటుంబ సభ్యులు సత్యంలో లేకపోయినా సంతోషంగా ఉండడం సాధ్యమే

‘మీ భర్తను లేక భార్యను రక్షించెదరో లేదో మీకేమి తెలియును?’—1 కొరిం. 7:16.

వీటికి జవాబులు కనుక్కోగలరేమో చూడండి:

సత్యం అంగీకరించని వ్యక్తులున్న ఇంట్లో సమాధానాన్ని పెంపొందించడానికి సాక్షులు ఏమి చేయవచ్చు?

అవిశ్వాసులుగా ఉన్న కుటుంబ సభ్యులు సత్యారాధనను అంగీకరించాలంటే ఒక క్రైస్తవుడు ఏమి చేయాలి?

సత్యం అంగీకరించని కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న క్రైస్తవులకు సంఘంలోని వాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?

1. ఒక వ్యక్తి రాజ్య సందేశాన్ని అంగీకరించినప్పుడు ఆయన/ఆమె కుటుంబంలో ఎలాంటి పరిస్థితి తలెత్తవచ్చు?

 యేసు ఒక సందర్భంలో తన శిష్యుల్ని పంపిస్తూ ఇలా అన్నాడు, ‘మీరు వెళ్లుచూ, పరలోకరాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి.’ (మత్త. 10:1, 7) ఆ రాజ్య సువార్తను అంగీకరించేవాళ్లకు సమాధానం, సంతోషం కలుగుతాయి. అయితే, అపొస్తలులు చేస్తున్న రాజ్య ప్రకటనాపనిని చాలామంది వ్యతిరేకిస్తారని యేసు ముందుగానే వాళ్లను హెచ్చరించాడు. (మత్త. 10:16-23) అంతేకాక, సొంత కుటుంబ సభ్యులు రాజ్య సందేశాన్ని తిరస్కరించినప్పుడు మరింత బాధ కలుగుతుంది.—మత్తయి 10:34-36 చదవండి.

2. కుటుంబ సభ్యులు సత్యాన్ని అంగీకరించకపోయినా సంతోషాన్ని పొందవచ్చని ఎలా చెప్పవచ్చు?

2 అయితే కుటుంబ సభ్యులు సత్యాన్ని అంగీకరించకపోతే అసలు సంతోషాన్నే పొందలేమా? నిశ్చయంగా పొందవచ్చు. కుటుంబం నుండి కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా, అన్ని సందర్భాల్లో అలా జరగకపోవచ్చు. అలాగే, కుటుంబం నుండి వచ్చే వ్యతిరేకత శాశ్వతంగా ఉంటుందని చెప్పలేం. సత్యాన్ని అంగీకరించిన వాళ్లు వ్యతిరేకతకు స్పందించే తీరు కూడా ప్రాముఖ్యమే. అంతేకాక, యెహోవా తన పట్ల యథార్థంగా ఉన్నవాళ్లకు అననుకూల పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండేందుకు సహాయం చేయడం ద్వారా వాళ్లను ఆశీర్వదిస్తాడు. సత్యాన్ని అంగీకరించినవాళ్లు, (1) ఇంట్లో సమాధానాన్ని పెంపొందించడానికి ప్రయత్నించడం ద్వారా, (2) సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులను సత్యారాధన వైపుకు నడిపించేందుకు నిజాయితీగా కృషిచేయడం ద్వారా, తమ సొంత ఆనందాన్ని పెంచుకోవచ్చు.

ఇంట్లో సమాధానాన్ని పెంపొందించండి

3. సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో సమాధానాన్ని పెంపొందించడానికి ఒక క్రైస్తవుడు ఎందుకు కృషి చేయాలి?

3 కుటుంబంలో నీతి అనే విత్తనం మొలకెత్తి ఫలించాలంటే ఇంట్లో సమాధానకరమైన పరిస్థితులు ఉండాలి. (యాకోబు 3:18 చదవండి.) సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులు ఉన్నా, ఒక క్రైస్తవుడు ఇంట్లో సమాధానాన్ని పెంపొందించడానికి పట్టుదలతో కృషి చేయాలి. ఇంతకీ దీన్ని ఎలా చేయవచ్చు?

4. క్రైస్తవులు తమ మనశ్శాంతిని ఎలా కాపాడుకోవచ్చు?

4 క్రైస్తవులు తమ మనశ్శాంతిని కాపాడుకోవాలి. అలా చేయాలంటే మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అప్పుడు సాటిలేని “దేవుని సమాధానము” లభిస్తుంది. (ఫిలి. 4:6, 7) యెహోవా గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా, జీవితంలో లేఖన సూత్రాలను పాటించడం ద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని పొందవచ్చు. (యెష. 54:13) అంతేకాక సంఘ కూటాల్లో పాల్గొనడం, క్షేత్ర పరిచర్యలో ఉత్సాహంగా భాగం వహించడం వంటివి చేయడం ద్వారా కూడా వాటిని పొందవచ్చు. సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఏదోవిధంగా క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనడం సాధ్యమౌతుంది. ఎన్జా a అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె భర్త సత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఆమె ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత ప్రకటనాపనిలో పాల్గొంటుంది. ఎన్జా ఇలా చెబుతోంది, “ఇతరులకు సువార్త ప్రకటించడానికి నేను ప్రయత్నించే ప్రతీసారి యెహోవా నన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు.” అలాంటి ఆశీర్వాదాల వల్ల సమాధానం, సంతృప్తి, సంతోషం కలుగుతాయి.

5. సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులున్న క్రైస్తవులకు తరచూ ఎలాంటి సవాలు ఎదురుకావచ్చు? దాన్ని వాళ్లు ఎలా పరిష్కరించుకోవచ్చు?

5 సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులతో సమాధానకరమైన సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి మనం పట్టుదలతో కృషిచేయాలి. కొన్నిసార్లు, వాళ్లు మనల్ని చేయమని అడిగే కొన్ని పనులు బైబిలు సూత్రాలకు విరుద్ధంగా ఉండవచ్చు. అప్పుడు మనం వాళ్లతో సమాధానంగా ఉండడం కష్టంకావచ్చు. మనం బైబిలు సూత్రాలకు స్థిరంగా కట్టుబడి ఉండడం వల్ల మొదట్లో వాళ్లకు కోపం రావచ్చు కానీ, కాలం గడిచేకొద్దీ పరిస్థితులు కాస్త అనుకూలంగా మారవచ్చు. అయితే, బైబిలు సూత్రాలకు విరుద్ధంగా లేని కొన్ని పనులు చేయడానికి మనం ఇష్టపడకపోతే అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంది. (సామెతలు 16:7 చదవండి.) ఏదైనా సవాలు ఎదురైనప్పుడు, లేఖన ఉపదేశం కోసం నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అందించే ప్రచురణలను చదవాలి, సంఘ పెద్దలను సంప్రదించాలి.—సామె. 11:14.

6, 7. (ఎ) తమ కుటుంబ సభ్యులు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పుడు కొందరు ఎందుకు వ్యతిరేకించవచ్చు? (బి) కుటుంబంలో వచ్చే వ్యతిరేకతతో బైబిలు విద్యార్థి ఎలా వ్యవహరించాలి?

6 ఇంట్లో సమాధానాన్ని పెంపొందించాలంటే యెహోవాపై నమ్మకం ఉండాలి, సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యుల భావాల గురించిన అవగాహన ఉండాలి. (సామె. 16:20; 24:3) కొత్తగా బైబిలు అధ్యయనం చేస్తున్నవాళ్లు కూడా ఈ విషయంలో వివేచనను చూపించవచ్చు. సత్యాన్ని అంగీకరించని కొంతమంది తమ భర్త లేక భార్య బైబిలు అధ్యయనం చేయడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు. అంతేకాక, అది కుటుంబానికి మంచి చేస్తుందని కూడా వాళ్లు అనుకోవచ్చు. అయితే మరికొంతమంది మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు యెహోవాసాక్షిగా ఉన్న ఎస్టర్‌, తన భర్త యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పుడు తాను “చాలా కోపంగా” వ్యవహరించానని ఒప్పుకుంటోంది. “నేను సాహిత్యాలను పారవేసేదాన్ని లేదా తగలబెట్టేదాన్ని” అని ఆమె చెప్పింది. మొదట్లో తన భార్య బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు వ్యతిరేకించిన హౌవర్డ్‌ ఇలా అన్నాడు, “తమ భార్యలు కొత్త మత తెగలో సభ్యులుగా చేరేలా మోసగించబడుతున్నారని చాలామంది భర్తలు భయపడతారు. అలాంటి పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో తెలియక భర్త బైబిలు అధ్యయనమే వద్దని ఒత్తిడిచేయవచ్చు.”

7 సత్యాన్ని వ్యతిరేకిస్తున్న భర్త ఉన్నంతమాత్రాన బైబిలు అధ్యయనాన్ని ఆపాల్సిన అవసరం లేదని గుర్తించేందుకు కొత్తగా బైబిలు అధ్యయనం చేస్తున్న విద్యార్థికి సహాయం చేయాలి. సత్యాన్ని అంగీకరించని తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు సాత్వికంతో, ప్రగాఢమైన గౌరవంతో మాట్లాడితే పరిస్థితులు సర్దుకుపోవచ్చు. (1 పేతు. 3:15) హౌవర్డ్‌ ఇలా అంటున్నాడు, “నా భార్య ప్రశాంతంగా ఉండి ఆవేశపడనందుకు నేను ఆమెను ఎంతో మెచ్చుకుంటున్నాను.” ఆయన భార్య ఇలా అంటోంది, “నేను బైబిలు అధ్యయనాన్ని ఆపేయాల్సిందేనని హౌవర్డ్‌ పట్టుబట్టాడు. యెహోవాసాక్షులు తమ మతనమ్మకాలను బలవంతంగా నాపై రుద్దుతున్నారని ఆయన అన్నాడు. ఆయనతో వాదించే బదులు, ఆయన చెబుతున్నది నిజమే కావచ్చని ఒప్పుకొని, నిజానికి వాళ్లు నాపై తమ నమ్మకాలను ఎలా రుద్దుతున్నారో నాకు అర్థం కావడం లేదని అన్నాను. అందుకే నేను అధ్యయనం చేస్తున్న పుస్తకాన్ని చదవమని ఆయనకు చెప్పాను. ఆయన ఆ పుస్తకాన్ని చదివి, దానిలో చెప్పబడిన విషయాలను కాదనలేకపోయాడు. దానివల్ల ఆయన మనసు మారింది.” భాగస్వామి క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు తనను విడిచిపెట్టి వెళ్తున్నారనే భావన లేదా భయం భర్తలో లేక భార్యలో చోటుచేసుకోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని అలాంటి భావాలను తీసివేయడానికి భాగస్వామితో ప్రేమగా, దయగా మాట్లాడుతుండాలి.

సత్యారాధనను అంగీకరించేలా వాళ్లకు సహాయం చేయండి

8. సత్యాన్ని అంగీకరించని భార్య/భర్త ఉన్న క్రైస్తవులకు పౌలు ఏ సలహా ఇచ్చాడు?

8 భార్య/భర్త సత్యాన్ని అంగీకరించలేదనే కారణంతో వాళ్లను వదిలిపెట్టకూడదని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు సలహా ఇచ్చాడు. b (1 కొరింథీయులు 7:12-16 చదవండి.) ప్రస్తుతం అవిశ్వాసిగా ఉన్న తమ భాగస్వామి భవిష్యత్తులో సత్యాన్ని అంగీకరించవచ్చనే విషయాన్ని క్రైస్తవులు మనసులో ఉంచుకుంటే తమ సంతోషాన్ని కాపాడుకోగలుగుతారు. అవిశ్వాసిగా ఉన్న కుటుంబ సభ్యునితో సత్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. దాని గురించి మనం తర్వాతి పేరాలోని అనుభవాల్ని చదివి తెలుసుకుందాం.

9. అవిశ్వాసిగా ఉన్న భార్యతో/భర్తతో సత్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి?

9 బైబిలు సత్యాన్ని తెలుసుకున్న కొత్తలో, “దాని గురించి ప్రతీ ఒక్కరికి చెప్పాలని నాకు అనిపించింది” అని జేసన్‌ అంటున్నాడు. లేఖనాల నుండి తాను నేర్చుకున్న విషయాలు ఎంత సత్యమైనవో గ్రహించినప్పుడు బైబిలు విద్యార్థి ఎంతో సంతోషించవచ్చు. అందుకే ఆయన ప్రతీ సమయంలో దాని గురించి మాట్లాడుతుంటాడు. అవిశ్వాసులుగా ఉన్న కుటుంబ సభ్యులు కూడా వెంటనే సత్యాన్ని అంగీకరిస్తారని ఆయన అనుకుంటాడు. కానీ వాళ్లు సత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. సత్యం తెలుసుకున్న కొత్తలో జేసన్‌ చూపించిన ఉత్సాహాన్ని బట్టి ఆయన భార్యకు ఏమనిపించింది? “నాకు అంతా అయోమయంగా అనిపించింది” అని ఆమె గుర్తుచేసుకుంటోంది. భర్త సత్యం తెలుసుకున్న 18 ఏళ్ల తర్వాత సత్యాన్ని అంగీకరించిన మరో స్త్రీ ఇలా అంటోంది, “నేను మాత్రం మెల్లమెల్లగా నేర్చుకోవాల్సి వచ్చింది.” సత్యారాధనపై అసలేమాత్రం ఆసక్తి లేని భార్య/భర్త ఉన్న విద్యార్థితో మీరు బైబిలు అధ్యయనం చేస్తున్నట్లయితే, ఆయా సందర్భాల్లో సత్యాన్ని నేర్పుగా ఎలా పంచుకోవచ్చో చూపించేందుకు కొన్ని సన్నివేశాలను క్రమంగా వాళ్లతో ప్రాక్టీసు చేయించండి. మోషే ఇలా అన్నాడు, ‘నా ఉపదేశము వానవలె కురియును. నా వాక్యము మంచువలెను, లేతగడ్డిమీద పడు చినుకులవలెను ఉండును.’ (ద్వితీ. 32:2) బైబిలు సత్యాలను ఒకేసారి వడగండ్ల వానలా కురిపించే బదులు జాగ్రత్తగా ఆలోచించి చిరుజల్లులా కురిపిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

10-12. (ఎ) సత్యం అంగీకరించని భాగస్వామి ఉన్న క్రైస్తవులకు అపొస్తలుడైన పేతురు ఏ సలహా ఇచ్చాడు? (బి) ఒక బైబిలు విద్యార్థి 1 పేతురు 3:1, 2 వచనాల్లోని సలహాను ఎలా పాటించింది?

10 సత్యం అంగీకరించని భర్తలున్న క్రైస్తవ భార్యలకు అపొస్తలుడైన పేతురు దైవప్రేరేపిత ఉపదేశాన్నిచ్చాడు. ఆయన ఇలా రాశాడు, “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” (1 పేతు. 3:1, 2) అవిశ్వాసియైన భర్త తనతో కఠినంగా వ్యవహరించినా సరే, క్రైస్తవ భార్య ఆయనకు లోబడి ప్రగాఢ గౌరవాన్ని చూపిస్తే ఆయన సత్యారాధనను అంగీకరించవచ్చు. అలాగే, క్రైస్తవ భర్త సత్యాన్ని అంగీకరించని భార్య నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా, దైవిక సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ప్రేమగల కుటుంబ శిరస్సుగా ఉండాలి.—1 పేతు. 3:7-9.

11 మనకాలంలోని చాలా అనుభవాలను బట్టి పేతురు ఇచ్చిన సలహాను పాటించడం ఎంత ప్రయోజనకరమో తెలుస్తోంది. సెల్మ అనే సహోదరి గురించి ఆలోచించండి. ఆమె యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పుడు, దాన్ని ఆమె భర్త స్టీవ్‌ ఇష్టపడలేదు. ఆయన ఇలా ఒప్పుకున్నాడు, “నాకు చాలా కోపం వచ్చింది, ఈర్ష్య కలిగింది, ఆమె నా చెప్పుచేతల్లో ఉండాలనిపించింది, నాలో అభద్రతా భావం చోటుచేసుకుంది.” సెల్మ ఇలా అంటోంది, “నేను సత్యం నేర్చుకోక ముందు కూడా స్టీవ్‌తో కలిసి జీవించడం కష్టంగానే ఉండేది. ఆయన ముక్కోపి. నేను బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పుడు, ఆయనకున్న కోపం ఇంకా ఎక్కువైంది.” ఇంతకీ ఆయనెలా మారాడు?

12 సెల్మ తనతో అధ్యయనం చేసిన సాక్షి నుండి నేర్చుకున్న ఒక పాఠాన్ని గుర్తుచేసుకుంటోంది. ఆమె ఇలా చెబుతోంది, “ఒకరోజు, నాకు బైబిలు అధ్యయనం చేయాలనిపించలేదు. ఎందుకంటే అంతకుముందు రోజు రాత్రి ఒక విషయం గురించి స్టీవ్‌కూ నాకూ మధ్య మాటామాటా పెరిగి ఆయన నన్ను కొట్టాడు. నాకు చాలా బాధనిపించింది, నా పరిస్థితిని బట్టి నా మీద నాకే జాలేసింది. జరిగినదాని గురించి, దానివల్ల నాకు కలిగిన బాధ గురించి ఆ సహోదరికి చెప్పినప్పుడు ఆమె 1 కొరింథీయులు 13:4-7 వచనాలను చదవమని చెప్పింది. నేను ఆ వచనాలు చదువుతూ, ‘స్టీవ్‌ ఈ వచనాల్లోని ప్రేమపూర్వకమైన పనులేవీ చేయడం లేదు’ అని తర్కించడం మొదలుపెట్టాను. అందుకు ఆ సహోదరి, ‘ఈ వచనాల్లో ప్రస్తావించబడిన ప్రేమపూర్వకమైన వేటిని నువ్వు నీ భర్త పట్ల చూపించావు?’ అని అడిగింది. అప్పుడు నేను, ‘దేన్నీ చూపించలేదు, ఎందుకంటే ఆయనతో జీవించడం కష్టంగా ఉంది’ అన్నాను. దానికి ఆ సహోదరి మృదువైన స్వరంతో, ‘సెల్మ, క్రైస్తవులుగా ఉండడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? నువ్వా? నీ భర్తా?’ అని అడిగింది. దానితో నాలో మార్పులు అవసరమని గుర్తించి, స్టీవ్‌ పట్ల మరింత ప్రేమగా వ్యవహరించడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాను. పరిస్థితులు నెమ్మదిగా మారాయి.” 17 ఏళ్ల తర్వాత స్టీవ్‌ సత్యాన్ని అంగీకరించాడు.

సంఘంలోని వాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?

13, 14. సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులున్న క్రైస్తవులకు సంఘంలోని వాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?

13 వర్షపు చిరుజల్లులు నేలను మెత్తబరచి మొక్క ఎదగడానికి సహాయం చేసినట్లే, సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులున్న క్రైస్తవులు సంతోషంగా ఉండడానికి సంఘంలోని చాలామంది సహాయం చేయవచ్చు. “సహోదర సహోదరీలు చూపించిన ప్రేమవల్లే నేను సత్యంలో స్థిరంగా నిలబడగలిగాను” అని బ్రెజిల్‌కు చెందిన ఎల్వీన చెప్పింది.

14 సంఘంలోని వాళ్లు దయను, వ్యక్తిగత శ్రద్ధను చూపించడం వల్ల సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యుల మనసు మారే అవకాశం ఎంతగానో ఉంటుంది. నైజీరియాలో ఉంటున్న ఒక భర్త తన భార్య సత్యం తెలుసుకున్న 13 సంవత్సరాల తర్వాత సత్యాన్ని అంగీకరించాడు. ఆయన ఇలా చెబుతున్నాడు, “నేను ఒక సాక్షితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వాహనం పాడైపోయింది. అప్పుడు ఆయన దగ్గర్లోని పల్లెటూరిలో ఉన్న తోటి సాక్షుల సహాయాన్ని కోరాడు. వాళ్లు మాకు ఆ రాత్రి ఉండడానికి వసతి కల్పించారు. వాళ్లు మమ్మల్ని, ఏదో చిన్నప్పటి నుండి పరిచయం ఉన్నవాళ్లలా చూసుకున్నారు. నా భార్య నాతో ఎప్పుడూ చెప్పే సహోదర ప్రేమను నేను ఆ సందర్భంలోనే రుచి చూశాను.” ఇంగ్లాండ్‌లో ఉంటున్న ఒక భార్య తన భర్త సత్యం తెలుసుకున్న 18 ఏళ్ల తర్వాత సత్యాన్ని అంగీకరించింది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది, “సాక్షులు మమ్మల్నిద్దరినీ భోజనాలకు పిలిచేవాళ్లు. నన్ను కూడా తమతో కలుపుకోవడం వల్ల నాకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించేదికాదు.” c అదే దేశంలో ఉంటున్న మరో సహోదరి భర్త కూడా చాలాకాలానికి సత్యాన్ని అంగీకరించాడు. ఆయన ఇలా అన్నాడు, “సహోదర సహోదరీలు మా ఇంటికి వచ్చేవాళ్లు లేదా మమ్మల్ని వాళ్లింటికి పిలిచేవాళ్లు. వాళ్లెంతో వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తున్నారని నేను గ్రహించాను. ముఖ్యంగా నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి చాలామంది వచ్చారు.” సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యుల పట్ల ఏవిధంగానైనా మీరూ అలాంటి శ్రద్ధనే చూపించగలరా?

15, 16. ఒకవేళ కుటుంబ సభ్యులు అవిశ్వాసులుగానే మిగిలిపోయినా, సత్యంలో ఉన్న వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి?

15 సరైనది చేస్తూ, నేర్పుగా సాక్ష్యమివ్వడానికి ఎన్నో సంవత్సరాల పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది భర్తలు, భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు లేదా బంధువులు సత్యాన్ని అంగీకరించకపోవచ్చు. కొంతమంది తీవ్రమైన వ్యతిరేకులుగానే మిగిలిపోతారు. (మత్త. 10:35-37) అయితే, క్రైస్తవులు దైవిక లక్షణాలను చూపించడం వల్ల మంచి ఫలితాలు రావచ్చు. ఒకప్పుడు అవిశ్వాసిగా ఉన్న భర్త ఇలా అన్నాడు, “సత్యంలో ఉన్న భార్య మంచి లక్షణాలను కనబరుస్తున్నప్పుడు, ఇంకా సత్యాన్ని అంగీకరించని భర్త మనసుపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్పలేం. కాబట్టి మీ ప్రయత్నాలను మానుకోకండి.”

16 ఒకవేళ కుటుంబంలోని ఒక సభ్యుడు అవిశ్వాసిగానే మిగిలిపోయినా, సత్యంలో ఉన్న వ్యక్తులు సంతోషంగా ఉండడం సాధ్యమే. ఒక సహోదరి 21 ఏళ్ల పాటు కృషి చేసిన తర్వాత కూడా ఆమె భర్త సత్యాన్ని అంగీకరించలేదు. అయినా ఆమె ఇలా అంటోంది, “యెహోవాకు ఇష్టమైనవి చేయడానికి కృషి చేస్తూ, ఆయన పట్ల నమ్మకంగా ఉంటూ, ఆయనతో నాకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం వల్ల నా సంతోషాన్ని కాపాడుకోగలుగుతున్నాను. వ్యక్తిగత అధ్యయనం, కూటాలకు హాజరవడం, పరిచర్య చేయడం, సంఘంలోని ఇతరులకు సహాయం చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నమవడం వల్ల నేను యెహోవాకు మరింత దగ్గరయ్యాను, నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోగలిగాను.”—సామె. 4:23.

పట్టువిడువకండి!

17, 18. సత్యం అంగీకరించని కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నప్పుడు కూడా ఒక క్రైస్తవుడు ఎలా ఆశలు వదులుకోకుండా ఉండవచ్చు?

17 సత్యం అంగీకరించని కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నట్లయితే మీరు ఆశలు వదులుకోకండి. ‘యెహోవా తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను విడనాడడు’ అని గుర్తుంచుకోండి. (1 సమూ. 12:22) మీరు ఆయనను హత్తుకొని ఉన్నంతవరకు ఆయన మీతో ఉంటాడు. (2 దినవృత్తాంతములు 15:2 చదవండి.) కాబట్టి, ‘యెహోవాను బట్టి సంతోషించండి. మీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి. మీరు ఆయనను నమ్ముకోండి.’ (కీర్త. 37:4, 5) ‘ప్రార్థనయందు పట్టుదల కలిగివుండండి.’ అన్నిరకాల కష్టాలను తాళుకోవడానికి మన ప్రేమగల పరలోక తండ్రి మీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి.—రోమా. 12:12.

18 ఇంట్లో సమాధానాన్ని పెంపొందించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి. (హెబ్రీ. 12:14) సమాధానకరమైన పరిస్థితులు ఏర్పడేలా చేయడం సాధ్యమే. దానివల్ల, కాలం గడిచేకొద్దీ అవిశ్వాసులుగా ఉన్న కుటుంబ సభ్యుల మనసు మారవచ్చు. “సమస్తమును దేవుని మహిమకొరకు” చేస్తుండగా మీరు సంతోషాన్ని, మనశ్శాంతిని పొందుతారు. (1 కొరిం. 10:31) మీరు ఆ ప్రయత్నాలు చేస్తుండగా, క్రైస్తవ సంఘంలోని సహోదర సహోదరీల ప్రేమగల మద్దతు మీకు ఉంటుందని తెలుసుకోవడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా!

[అధస్సూచీలు]

a అసలు పేర్లు కావు.

b పౌలు ఇచ్చిన సలహా, పరిస్థితులు విషమించినప్పుడు చట్టబద్ధంగా విడిపోవడాన్ని ఖండించడం లేదు. అది గంభీరంగా ఆలోచించి తీసుకోవాల్సిన వ్యక్తిగత నిర్ణయం. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ పుస్తకంలోని 251-253 పేజీలు చదవండి.

c అవిశ్వాసులతో కలిసి భోజనం చేయడాన్ని లేఖనాలు ఖండించడం లేదు.—1 కొరిం. 10:27.

[అధ్యయన ప్రశ్నలు]

[28వ పేజీలోని చిత్రం]

మీ నమ్మకాలను పంచుకోవడానికి సరైన సమయాన్ని ఎంచుకోండి

[29వ పేజీలోని చిత్రం]

అవిశ్వాసులుగా ఉన్నవాళ్ల పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించండి