కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంత్రతంత్రాలు ఎందుకు తప్పు?

మంత్రతంత్రాలు ఎందుకు తప్పు?

మంత్రతంత్రాలు ఎందుకు తప్పు?

బార్బారాకు a చిన్నప్పటి నుండి విచిత్రమైన కలలు వచ్చేవి, స్వరాలు వినిపించేవి, దాంతో చనిపోయిన తమ వాళ్ళు తనతో మాట్లాడుతున్నారని ఆమె అనుకుంది. ఆమె, ఆమె భర్త యోయకిమ్‌ అతీంద్రియ శక్తుల గురించిన పుస్తకాలు చదివి, బొమ్మలుండే టారోట్‌ కార్డుల ద్వారా భవిష్యత్తు తెలుసుకోవడంలో ప్రవీణులయ్యారు. తాము చాలా డబ్బు సంపాదించుకుంటామని వాళ్లకు ఆ కార్డుల ద్వారా తెలిసింది, అదే జరిగి వ్యాపారంలో వాళ్లకు చాలా డబ్బు వచ్చింది. ఒకరోజు ఆ కార్డుల మూలంగానే, ప్రమాదకరమైన మనుష్యులు తమ ఇంటికి రాబోతున్నారని వాళ్లకు తెలిసింది. అంతేగాక, వాళ్ళనుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో కూడా ఆ కార్డుల ద్వారానే వాళ్లకు తెలిసింది.

అతీంద్రియ శక్తులను నమ్మడం పాతకాలపు విషయంలా అనిపించవచ్చు, అయినా అందరూ మానవాతీత శక్తులపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి, దుష్టశక్తుల నుండి తమనుతాము కాపాడుకోవడానికి తాయెత్తులు కట్టుకుంటారు, వీజా బోర్డులు ఉపయోగిస్తారు, దయ్యాలను సంప్రదిస్తారు. ఫోకస్‌ అనే జర్మన్‌ పత్రికలో “ల్యాప్‌టాప్‌ అండ్‌ లూసీఫర్‌” అనే ఆర్టికల్‌ ఇలా తెలియజేసింది, “ఇంటర్నెట్‌ వల్ల మంత్రవిద్యకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి, కుతూహలం ఎక్కువౌతున్నాయి.”

బైబిల్లో కూడా మంత్రతంత్రాల గురించిన ప్రస్తావన ఉందని మీకు తెలుసా? దాని గురించి బైబిలు ఏమి చెబుతోందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు.

మంత్రతంత్రాల గురించి బైబిలు ఏమి చెబుతోంది?

ప్రాచీన ఇశ్రాయేలులోని తన ప్రజలకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇలా తెలియజేసింది, ‘శకునం చెప్పే సోదెగాళ్ళను, మేఘశకునాలను గానీ సర్పశకునాలను గానీ చెప్పేవాళ్ళను, చిల్లంగివాళ్ళను, మాంత్రికులను, ఇంద్రజాలికులను, కర్ణపిశాచిని అడిగేవాళ్ళను, దయ్యాల వద్ద విచారణ చేసే వాళ్ళను మీ మధ్య ఉండనివ్వకూడదు. వీటిని చేసే వాళ్ళు యెహోవాకు హేయులు.’ (ద్వితీయోపదేశకాండము 18:10-12) మంత్రతంత్రాల విషయంలో జాగ్రత్తవహించమని బైబిలు ఎందుకంత గట్టిగా చెబుతోంది?

ఆర్టికల్‌ ప్రారంభంలోని అనుభవం చూపిస్తున్నట్లుగా, బ్రతికివున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సంభాషించవచ్చనీ అతీంద్రియ శక్తుల్ని ఉపయోగించి సేకరించే సమాచారం మృతుల నుండే వస్తోందనీ చాలామంది నమ్ముతారు. చనిపోయిన తర్వాత మానవులు ఆత్మరూపంలో జీవిస్తారని చాలా మతాలు బోధిస్తున్నందుకే ప్రజలు అలా నమ్ముతున్నారు. కానీ ఈ బోధకు పూర్తి విరుద్ధంగా, ‘చనిపోయిన వాళ్ళు ఏమీ ఎరుగరు’ అని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (ప్రసంగి 9:⁠5) చనిపోయినవాళ్ళు గాఢనిద్రలాంటి స్థితిలో ఉంటారని, అంటే తమ చుట్టూ ఏమి జరుగుతోందో తెలుసుకోలేని స్థితిలో ఉంటారని బైబిలు చెబుతోంది. b (మత్తయి 9:18, 24; యోహాను 11:11-14) అలాంటప్పుడు మీకు ఈ ప్రశ్నలు తలెత్తవచ్చు: మానవాతీత శక్తుల ప్రభావాన్ని స్వయంగా ఎదుర్కొన్నవాళ్లు చెబుతున్న అనుభవాల సంగతేమిటి? అవి ఎవరి వల్ల జరుగుతున్నాయి?

దయ్యాలతో సంభాషించడం

యేసు భూమిపై ఉన్నప్పుడు దయ్యాలతో మాట్లాడాడని సువార్త వృత్తాంతాలు చూపిస్తున్నాయి. ఒక “అపవిత్రాత్మ” యేసుతో, ‘నీవెవరో నాకు తెలుసు’ అన్నట్లు మార్కు 1:23, 24 తెలియజేస్తోంది. మీరెవరో కూడా దయ్యాలకు తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వాటి గురించి మీకు తెలుసా?

దేవుడు మానవులను సృష్టించకముందు, కోటానుకోట్ల దేవదూతలను సృష్టించాడు. (యోబు 38:4-7) వాళ్ళు మానవులకన్నా ఉన్నతమైన ప్రాణులు. (హెబ్రీయులు 2:6, 7) వాళ్ళు చాలా శక్తిమంతులు, ఎంతో జ్ఞానం గలవాళ్ళు, దేవుడు కోరుకునేది చేయడానికి వాళ్ళు సృష్టించబడ్డారు. కీర్తనకర్త ఇలా పాడాడు, “యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.”​—కీర్తన 103:20.

కొంతకాలానికి దేవదూతలు మానవులతో దేవుడు ఆమోదించని రీతిలో సంభాషించడం మొదలుపెట్టారని బైబిలు తెలియజేస్తోంది. వాళ్ళు ఎందుకలా చేశారు? అలా చేసిన వాళ్ళలో మొదటి దేవదూత మొదటి మానవులైన ఆదాముహవ్వలను మోసం చేసి వాళ్ళను తమ సృష్టికర్తయైన దేవుని నుండి దూరం చేశాడు. ఆ దేవదూత అలా చేసి అపవాదియైన సాతానుగా మారాడు అంటే దేవునిపై కొండెములు చెప్పేవాడిగా, దేవుణ్ణి ఎదిరించేవాడిగా తయారయ్యాడు.​—ఆదికాండము 3:1-6.

ఆ తర్వాత వేరే దేవదూతలు పరలోకంలోవున్న “తమ నివాసస్థలమును విడిచి” వచ్చి, మానవ శరీరం దాల్చి భూమిపై ఉన్న అందమైన స్త్రీలతో జీవించడం మొదలుపెట్టారు. (యూదా 6; ఆదికాండము 6:1, 2) తిరుగుబాటు చేసిన ఆ దేవదూతలు, భారీకాయులైన వాళ్ళ పిల్లలు మానవజాతిని ఎంతగా గడగడలాడించారంటే, వాళ్ళ వల్ల భూమి ‘బలాత్కారముతో నిండిపోయింది.’ దేవుడు నోవహు కాలంలో జలప్రళయం రప్పించి, దౌర్జన్యపూరితమైన ఆ దుష్ట తరాన్ని ఎలా అంతమొందించాడో తెలియజేసే బైబిలు వృత్తాంతం గురించి మీకు తెలిసే ఉండవచ్చు.​—ఆదికాండము 6:3, 4, 11-13.

జలప్రళయం రావడంతో ఆ దేవదూతలు తమ భౌతిక శరీరాలను వదిలేసి ఆత్మ శరీరాలతో పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ సృష్టికర్త వాళ్ళను ‘తమ నివాసస్థలానికి’ తిరిగి రానివ్వకుండా ‘కటిక చీకటిగల బిలమును’ పోలిన స్థితిలో వాళ్ళను నిర్బంధించాడు. (2 పేతురు 2:4, 5) అలా తిరుగుబాటు చేసిన దేవదూతలను బైబిలు ‘దయ్యాలు’ అంటోంది. (యాకోబు 2:19) నిజానికి, మంత్రతంత్రాల వెనుకున్నది అవే.

దయ్యాలకు కావాల్సిందేమిటి?

మానవులు సత్యదేవుడైన యెహోవాను ఆరాధించకుండా వాళ్ళను చెడగొట్టాలన్నదే మానవులతో సంభాషించే దయ్యాల మొదటి లక్ష్యం. మంత్రతంత్రాలను అభ్యసించేవాళ్ళు తమకు వరాలు లేదా శక్తులు లభించాయని చెప్పుకుంటారు కానీ అవి, దేవుని గురించి సరైన జ్ఞానం సంపాదించుకొని ఆయనతో సంబంధాన్ని ఏర్పర్చుకోకుండా ప్రజల్ని మోసగించే విధానాలే తప్ప మరేమీ కాదు.

యేసును శోధించినప్పుడు దయ్యాల నాయకుడైన సాతాను చెప్పిన మాటల్లో వాళ్ళ రెండవ లక్ష్యం ఏమిటో అర్థమౌతుంది. ‘లోకరాజ్యాలన్నిటిని, వాటి మహిమను’ ఇస్తానని సాతాను యేసుతో అన్నాడు. దానికి ప్రతిఫలంగా సాతాను ఏమి ఆశించాడు? ‘సాగిలపడి నాకు నమస్కారం చేయి’ అని సాతాను యేసును అడిగాడు. మానవులు తనను ఆరాధించాలని సాతాను కోరుకుంటాడు, అతని దయ్యాలు కూడా అలాగే కోరుకుంటాయి. కానీ దేవుణ్ణి, సత్యారాధనను విడిచిపెట్టడానికి యేసు నిరాకరించాడు.​—మత్తయి 4:8-10.

ఈ రోజుల్లో దయ్యాలు అలా సూటిగా మనల్ని శోధించడానికి అంతగా ప్రయత్నించవు. కానీ స్ఫటిక గోళాలు, తేయాకులు, బొమ్మలుండే టారోట్‌ కార్డులు, లోలకాలు, జాతక చక్రాలు వంటి హానిరహితం అనిపించే ఉరులు ఒడ్డడానికి ప్రయత్నిస్తాయి. అలాంటి వాటివల్ల మోసపోకండి. అవి మనకు తెలియని లోకం గురించి తెలుసుకోవడానికి సహజ సిద్ధమైన మార్గాలేమీ కాదు. యెహోవాను ఆరాధించకుండా పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో ప్రజలను ప్రలోభపెట్టి వాళ్ళను ఉరిలో చిక్కించుకోవడానికి దయ్యాలు మంత్రతంత్రాలపై వాళ్ళకున్న మక్కువను ఉపయోగించుకుంటాయి. ఆ మార్గంలో తమ లక్ష్యం నెరవేరకపోతే దయ్యాలు సాధారణంగా తమ ఉరిలో చిక్కిన వాళ్ళను హింసిస్తాయి, వాళ్ళ జీవితం దుర్భరం చేస్తాయి. మీ విషయంలో అలా జరుగుతుంటే, వాటి నుండి తప్పించుకోవడానికి మీరేమి చేయవచ్చు?

ఆ ఉరి నుండి ఎలా తప్పించుకోవచ్చు?

మానవులతో సంభాషించే దయ్యాలు దేవుని శత్రువులనీ త్వరలోనే నాశనం చేయబడతాయనీ మర్చిపోకండి. (యూదా 6) అవి మోసం చేస్తాయి, అబద్ధాలు చెబుతాయి, చనిపోయిన వాళ్ళలా నటిస్తాయి. మీ స్నేహితుల్లో ఒకరు మిమ్మల్ని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిస్తే మీకెలా అనిపిస్తుంది? లైంగికంగా దాడిచేసే ఒక వ్యక్తితో మీకు తెలియకుండానే మీరు ఇంటర్నెట్‌ ద్వారా సంబంధం పెట్టుకున్నారని గ్రహిస్తే మీరేమి చేస్తారు? దయ్యాల ఉరిలో చిక్కుకోవడం ఎంతో ప్రమాదకరం. అందులో నుండి బయటపడడానికి మీరు చేయగలిగినదంతా చేయాలి. మీరేమి చేయవచ్చు?

ప్రాచీన ఎఫెసులోని కొంతమంది, మంత్రతంత్రాల గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన పుస్తకాలు ఎంతో ఖరీదైనవే అయినా వాటిని నాశనం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అందుకే వాళ్ళు ‘అందరి ఎదుట వాటిని కాల్చివేశారు.’ (అపొస్తలుల కార్యములు 19:19, 20) ఈ రోజుల్లో మంత్రతంత్రాలకు సంబంధించిన వస్తువులంటే పుస్తకాలు, తాయెత్తులు, వీజా బోర్డులు వంటివే కాదు ఎలక్ట్రానిక్‌ సమాచారం కూడా. మంత్రతంత్రాలకు సంబంధించినది అనిపించే ప్రతీ దానికీ దూరంగా ఉండండి.

ఈ ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించిన దంపతులను గుర్తుతెచ్చుకోండి. ప్రమాదకరమైన మనుష్యులు తమ ఇంటికి రాబోతున్నారని బొమ్మలుండే టారోట్‌ కార్డుల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. అంతేగాక, ఆ వచ్చినవాళ్ళు చెప్పింది వినకూడదనీ వాళ్ళిచ్చేవేవి తీసుకోకూడదనీ వాళ్ళు తెలుసుకున్నారు. అయితే కోనీ, గుడ్రూన్‌ అనే ఇద్దరు యెహోవాసాక్షులు వాళ్ళింటికి వచ్చి ‘దేవుని గురించిన సువార్త చెప్పడానికి వచ్చాం’ అనడంతో యోయకిమ్‌, బార్బారా వాళ్ళు చెప్పేది వినాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళ సంభాషణ మంత్రతంత్రాల వైపు మళ్ళడంతో కోనీ, గుడ్రూన్‌ లేఖనాల్లో నుండి దాని గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని వాళ్ళకు తెలియజేశారు. క్రమంగా బైబిలు చర్చ కొనసాగింది.

యోయకిమ్‌, బార్బారా దయ్యాలతో అన్ని సంబంధాలూ తెంచేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అలా చేయడం దయ్యాలకు ఇష్టం ఉండకపోవచ్చని సాక్షులు వాళ్ళకు వివరించారు. నిజంగానే, యోయకిమ్‌, బార్బారా ఎంతో కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు, దయ్యాలు వాళ్ళపై భయంకరంగా దాడిచేశాయి. కొంతకాలం పాటు వాళ్ళు ప్రతీ రాత్రి ఎంతో భయపడేవాళ్ళు, వేరే ఇంట్లోకి మారిన తర్వాత పరిస్థితి కాస్త కుదుటపడింది. వాళ్ళు ఆ కష్టకాలమంతటిలో “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని చెబుతున్న ఫిలిప్పీయులు 4:13లోని మాటలను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. యెహోవా వాళ్ళ కృతనిశ్చయాన్ని ఆశీర్వదించాడు, చివరికి దయ్యాలు వాళ్ళను హింసించడం మానేశాయి. ఈ రోజు యోయకిమ్‌, బార్బారా సత్యదేవుడైన యెహోవాను ఆరాధిస్తూ సంతోషంగా ఉన్నారు.

యెహోవా ఆశీర్వాదం పొందాలనుకునే వాళ్ళందరినీ లేఖనాలు ఇలా ప్రోత్సహిస్తున్నాయి, ‘దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్దనుండి పారిపోతాడు. దేవుని వద్దకు రండి, అప్పుడాయన మీ వద్దకు వస్తాడు.’ (యాకోబు 4:7, 8) మీరు దయ్యాల ప్రభావం నుండి బయట పడాలనుకుంటే యెహోవా దేవుడు మీకు సహాయం చేయగలడు, చేస్తాడు కూడా. యోయకిమ్‌, బార్బారా దయ్యాల బారినుండి తామెలా తప్పించుకున్నారో గుర్తుతెచ్చుకుంటూ, “యెహోవావలననే నాకు సహాయము కలుగును” అని చెబుతున్న కీర్తన 121:2లోని మాటలతో హృదయపూర్వకంగా ఏకీభవిస్తున్నారు. (w12-E 03/01)

[అధస్సూచీలు]

a అసలు పేర్లు కావు.

b చనిపోయినవాళ్ళ స్థితి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో, “చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు?” అనే 6వ అధ్యాయం చూడండి.

[27వ పేజీలోని బ్లర్బ్‌]

మంత్రతంత్రాలు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండకుండా చేస్తాయి

[28వ పేజీలోని బ్లర్బ్‌]

‘దేవుని వద్దకు రండి, అప్పుడాయన మీ వద్దకు వస్తాడు.’​—యాకోబు 4:8