కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

సత్యంలో పెరిగి, దానికి దూరమైపోయిన వ్యక్తి తిరిగి సత్యంలోకి ఎలా వచ్చాడు? జీవితమంతా తండ్రి కోసం తపించిన యువకునికి ఆ లోటు ఎలా తీరింది? వాళ్ల మాటల్లోనే వినండి.

“నేను మళ్లీ యెహోవాకు దగ్గరవ్వాలి.”—ఈలీ కలిల్‌

జననం: 1976

దేశం: సైప్రస్‌

ఒకప్పుడు: తప్పిపోయిన కుమారుడు

నా గతం: నేను పుట్టింది సైప్రస్‌లోనే అయినా పెరిగింది మాత్రం ఆస్ట్రేలియాలో. నా తల్లిదండ్రులు యెహోవాసాక్షులు. యెహోవా పట్ల, ఆయన వాక్యమైన బైబిలు పట్ల నాలో ప్రేమను నాటడానికి వాళ్లు శాయశక్తులా కృషి చేశారు. కానీ నాకు టీనేజ్‌ వచ్చేసరికి వాళ్లకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. నా తోటివాళ్లను కలవడానికి రాత్రిళ్లు దొంగచాటుగా ఇంట్లోంచి వెళ్లేవాణ్ణి. మేము కార్లు దొంగిలించేవాళ్లం, దానివల్ల ఎన్నో ఇబ్బందుల్లో ఇరుక్కునేవాళ్లం.

మా అమ్మానాన్నలు బాధపడతారని, మొదట్లో అవన్నీ రహస్యంగా చేసేవాణ్ణి. కానీ మెల్లమెల్లగా ఆ భయం కూడా పోయింది. నాకన్నా పెద్దవాళ్లతో నేను స్నేహం చేసేవాణ్ణి, వాళ్లు యెహోవాను ప్రేమించేవాళ్లు కాదు కాబట్టి వాళ్ల చెడు ప్రభావం నామీద పడింది. చివరికి ఒకరోజు, ‘మీ మతంలో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు’ అని మా అమ్మానాన్నలతో చెప్పేశాను. వాళ్లు ఎంతో ఓపిగ్గా నాకు సహాయం చేయడానికి ప్రయత్నించారు, కానీ నేను వాళ్ల మాట ఖాతరు చేయలేదు. దాంతో వాళ్లు చాలా వేదనకు గురయ్యారు.

నేను ఇంటినుండి వెళ్లిపోయాక మత్తుమందులకు అలవాటుపడ్డాను. అంతేకాదు చాలా పెద్ద మొత్తంలో గంజాయి మొక్కలు పెంచి, అమ్మేవాణ్ణి. నేను చెడు జీవితం జీవించాను. ఎక్కువ సమయం నైట్‌ క్లబ్బుల్లోనే గడిపేవాణ్ణి. నేను కోపిష్ఠిగా తయారయ్యాను. ఎవరైనా నాకు నచ్చనిది చెప్పినా, చేసినా వాళ్లమీద అరిచేసేవాణ్ణి, కొట్టేవాణ్ణి కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే, ఒక క్రైస్తవుడు ఏమేం చేయకూడదని నేర్చుకున్నానో అవన్నీ చేశాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . . నాతోపాటు మత్తుమందులు తీసుకునే ఒకతను నాకు దగ్గరి స్నేహితుడయ్యాడు. చిన్నప్పుడే వాళ్ల నాన్న చనిపోయాడు. మేము తరచూ, రాత్రిళ్లు నిద్రపోకుండా చాలాసేపు మాట్లాడుకునేవాళ్లం. అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కోసారి, తండ్రిలేని లోటు తననెంతగా బాధిస్తుందో చెప్పేవాడు. చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారని చిన్నప్పుడే నేర్చుకున్నాను కాబట్టి, యేసు చనిపోయినవాళ్లను బ్రతికించాడనీ, భవిష్యత్తులో మళ్లీ అలాచేస్తానని వాగ్దానం చేశాడనీ అతనికి చెప్పడం మొదలుపెట్టాను. (యోహాను 5:28, 29) “మీ నాన్నగారిని మళ్లీ కలుసుకోవడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో! మనందరం పరదైసు భూమిపై నిరంతరం జీవించవచ్చు” అని నేను చెప్పేవాణ్ణి. అది అతని హృదయాన్ని తాకింది.

ఇంకొన్నిసార్లు అతను అంత్యదినాలు, త్రిత్వ సిద్ధాంతం వంటివాటి గురించి ప్రస్తావించేవాడు. అప్పుడు నేను అతని బైబిలే తీసుకుని వాటి గురించిన సత్యాన్ని వెల్లడిచేసే వివిధ లేఖనాల్ని చూపించేవాణ్ణి. (యోహాను 14:28; 2 తిమోతి 3:1-5) యెహోవా గురించి అతనితో ఎక్కువగా మాట్లాడే కొద్దీ నేను ఆయన గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాను.

మా అమ్మానాన్నలు ఎంతో కష్టపడి నాలో నాటిన సత్యపు విత్తనాలు క్రమక్రమంగా మొలకెత్తడం ప్రారంభించాయి. ఉదాహరణకు, నా స్నేహితులతో కలిసి పార్టీలో మత్తుమందులు తీసుకుంటున్నప్పుడు, నాకు ఒక్కసారిగా యెహోవా గుర్తొచ్చేవాడు. నా స్నేహితుల్లో చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునేవాళ్లు, కానీ వాళ్ల ప్రవర్తన చూస్తే అలా ఉండేది కాదు. వాళ్లలా ఉండకూడదంటే నేను మళ్లీ యెహోవాకు దగ్గరవ్వాలని నాకు అర్థమైంది.

ఏం చేయాలో తెలుసుకోవడం సులువే, కానీ అలా చేయడం చాలా కష్టం. కొన్ని మార్పులు సులువుగానే చేసుకోగలిగాను, ఉదాహరణకు మత్తుమందులు మానడం నాకు పెద్దగా కష్టమనిపించలేదు. నా పాత స్నేహాలను తెగతెంపులు చేసుకుని, ఒక సంఘ పెద్దతో కలిసి బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాను.

కానీ ఇంకొన్ని మార్పులు చేసుకోవడం చాలా కష్టమైంది. ముఖ్యంగా నా కోపాన్ని అణచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు బాగానే ఉండేవాణ్ణి, కానీ ఆ తర్వాత షరామామూలే. అలా కోప్పడిన ప్రతీసారి, నేనిక మారనేమో అనుకుంటూ చాలా బాధపడేవాణ్ణి. దాంతో నేను నిరుత్సాహానికి గురై, నాతో బైబిలు అధ్యయనం చేస్తున్న పెద్ద దగ్గరికి వెళ్లాను. ఆయన ఎప్పుడూ ఓర్పుగా, దయగా ఉంటూ నన్ను చాలా ప్రోత్సహించేవారు. ఒకసారి ఆయన, పట్టుదల ఎంత ప్రాముఖ్యమో తెలియజేసిన కావలికోటలోని ఒక ఆర్టికల్‌ను నాతో చదివించారు. a కోపం వచ్చినప్పుడు నేను ఏ చర్యలు తీసుకోవాలో చర్చించాం. ఆ ఆర్టికల్‌ను మనసులో ఉంచుకోవడం వల్ల, యెహోవాకు పట్టుదలగా ప్రార్థించడం వల్ల మెల్లమెల్లగా నా కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగాను. చివరికి, 2000వ సంవత్సరం ఏప్రిల్‌లో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షినయ్యాను. అప్పుడు నా తల్లిదండ్రులు ఎంత పులకించిపోయారో చెప్పనక్కర్లేదనుకుంటా!

నేనెలా ప్రయోజనం పొందానంటే . . . ఇప్పుడు నా శరీరాన్ని మత్తుమందులతో, అనైతిక పనులతో కలుషితం చేసుకోవట్లేదు కాబట్టి నాకు మనశ్శాంతిగా ఉంది, నా మనస్సాక్షి కూడా నిర్మలంగా ఉంది. ఇప్పుడు నేను ఏమి చేసినా అంటే పని చేస్తున్నా, క్రైస్తవ కూటానికి హాజరైనా, ఉల్లాస కార్యకలాపాలను ఆస్వాదిస్తున్నా మరింత సంతోషంగా ఉన్నాను. నాకు జీవితం పట్ల సానుకూల వైఖరి ఏర్పడింది.

నా తల్లిదండ్రులు నామీద ఆశలు వదులుకోకుండా ఎప్పుడూ సహాయం చేస్తూ వచ్చారు. ఆ విషయంలో నేను యెహోవాకు ఎంతో రుణపడివుంటాను. యోహాను 6:44లో యేసు చెప్పిన ఈ మాటల్ని కూడా గుర్తుచేసుకుంటాను: ‘నన్ను పంపించిన తండ్రి ఆకర్షిస్తేనే గాని ఎవరూ నా వద్దకు రాలేరు.’ యెహోవా నన్ను ఆకర్షించడంవల్లే నేను తిరిగి ఆయన దగ్గరకు రాగలిగానన్న ఆలోచన నన్ను ఎంతో కదిలించింది.

“నేను తండ్రి కోసం తపించాను.”—మార్కో ఆంటోన్యో ఆల్వారెజ్‌ సోటో

జననం: 1977

దేశం: చిలీ

ఒకప్పుడు: హెవీమెటల్‌ బృంద సభ్యుడు

నా గతం: మేము దక్షిణ అమెరికాలోని మాజిల్లాన్‌ జలసంధి దగ్గర ఉన్న పుంటా అరినాస్‌ అనే సుందరమైన నగరంలో ఉండేవాళ్లం. నేను మా అమ్మ దగ్గర పెరిగాను. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు విడిపోయారు. దానివల్ల నేను ఒంటరివాణ్ణి అయిపోయానని అనిపించేది. నేను తండ్రి కోసం తపించాను.

మా అమ్మ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసేది, నన్ను రాజ్యమందిరంలో జరిగే క్రైస్తవ కూటాలకు తీసుకువెళ్లేది. కానీ కూటాలకు వెళ్లడమంటే నాకు అస్సలు ఇష్టం ఉండేదికాదు, తరచూ దారిలో పేచీపెట్టేవాణ్ణి. నాకు పదమూడేళ్లు వచ్చేసరికి కూటాలకు వెళ్లడం పూర్తిగా మానేశాను.

అప్పటికల్లా నాకు సంగీతం మీద మక్కువ పెరిగింది, అందులో నాకు సహజ నైపుణ్యం ఉందని గుర్తించాను. నాకు పదిహేనేళ్లు వచ్చేసరికి పండుగల్లో, బార్‌లలో, పార్టీల్లో హెవీమెటల్‌ సంగీతాన్ని వాయించేవాణ్ణి. నిపుణులైన సంగీత కళాకారులతో కలిసి పనిచేయడం వల్ల శాస్త్రీయ సంగీతం మీద నాకు ఆసక్తి కలిగింది. స్థానిక విశ్వవిద్యాలయంలో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. 20 ఏళ్ల వయస్సులో పైచదువుల కోసం రాజధాని నగరమైన సాంటియాగోకు వెళ్లాను. అయినా హెవీమెటల్‌ బృందాలతో కలిసి సంగీతం వాయించడం మాత్రం మానలేదు.

ఆ సమయమంతా నా జీవితంలో ఏదో వెలితి ఉన్నట్టు అనిపించేది. ఆ బాధను మర్చిపోవడానికి బృందంలోని తోటి సభ్యులతో కలిసి బాగా తాగేవాణ్ణి, మత్తుమందులు తీసుకునేవాణ్ణి. వాళ్లే నా కుటుంబమని అనుకునేవాణ్ణి. నాది తిరుగుబాటు స్వభావం, ఆ విషయం చూసేవాళ్లకు ఇట్టే అర్థమయ్యేది. నేను నల్ల రంగు బట్టలు వేసుకునేవాణ్ణి, ఎప్పుడూ గడ్డం ఉండేది, జుట్టు నడుం వరకు ఉండేది.

నా స్వభావం వల్ల అస్తమానం ఎవరో ఒకరితో గొడవ పెట్టుకునేవాణ్ణి, పోలీసుల చేతికిచిక్కి తంటాలు పడేవాణ్ణి. నన్ను, నా స్నేహితులను మత్తుమందులు అమ్మే కొందరు విసిగిస్తున్నారని ఒకసారి తాగిన మత్తులో వాళ్లపై దాడిచేశాను. అప్పుడు వాళ్లు నన్ను చితకబాదారు, దాంతో నా దవడ ఎముక విరిగిపోయింది.

అంతకంటే తీవ్రమైన బాధ నాకు సన్నిహితంగా ఉన్నవాళ్ల వల్లే ఎదురైంది. నా ప్రియురాలు, నా సన్నిహిత మిత్రుడితో కలిసి తిరుగుతూ నన్ను చాలా సంవత్సరాలుగా మోసం చేస్తోందని ఒకరోజు నాకు తెలిసింది. ఆ విషయం నా స్నేహితులందరికీ తెలిసినా నాతో చెప్పకుండా దాచారు. దానివల్ల నేనెంతో కృంగిపోయాను.

నేను మళ్లీ పుంటా అరినాస్‌కు వెళ్లాను. అక్కడ సంగీతం నేర్పిస్తూ, సెల్లో (వయోలిన్‌లాంటి ఒక వాయిద్యం) వాద్యకారునిగా పనిచేశాను. మరోప్రక్క హెవీమెటల్‌ బృందాలతో కలిసి సంగీతం వాయిస్తూ, రికార్డింగు చేస్తూ ఉండేవాణ్ణి. ఆ సమయంలో నేను సూసాన్‌ అనే ఒక అందమైన అమ్మాయిని కలిశాను. మేము కలిసి జీవించడం ప్రారంభించాం. వాళ్ల అమ్మ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతుందని, నాకు మాత్రం దానిమీద నమ్మకంలేదని కొంతకాలానికి సూసాన్‌కు తెలిసింది. “ఇంతకీ ఏది సత్యమంటావ్‌?” అని నన్ను అడిగింది. త్రిత్వ సిద్ధాంతం తప్పని నాకు తెలుసు కానీ దాన్ని బైబిలు ఉపయోగించి ఎలా నిరూపించాలో తెలీదనన్నాను. అయితే దానిగురించి ఎవరు చెప్పగలరో నాకు తెలుసు. బైబిల్లోవున్న సత్యమేమిటో యెహోవాసాక్షులు చూపించగలరని చెప్పాను. అప్పుడు చాలా సంవత్సరాలుగా చేయని ఒక పని చేశాను. అదేంటంటే, యెహోవాకు ప్రార్థన చేసి సహాయం అడిగాను.

కొన్నిరోజుల తర్వాత ఒకతన్ని చూసినప్పుడు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించింది. దాంతో ‘మీరు యెహోవాసాక్షా?’ అని అడిగాను. ఆయన నా వాలకం చూసి మొదట కంగారుపడినా, రాజ్యమందిరంలో జరిగే కూటాల గురించి నేను అడిగిన ప్రశ్నలకు దయగా జవాబిచ్చాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడని నాకనిపించింది. నేను రాజ్యమందిరానికి వెళ్లి, ఎవరికీ కనపడకూడదని చివరి వరుసలో కూర్చున్నాను. అయినా, చిన్నప్పుడు నేను కూటాలకు వచ్చేవాణ్ణని చాలామంది గుర్తుపట్టారు. వాళ్లు నన్ను ఆప్యాయంగా పలకరించి, కౌగిలించుకునే సరికి నా మనసుకెంతో ప్రశాంతంగా అనిపించింది. నాకు ఇంటికి తిరిగి వచ్చినట్టు అనిపించింది. చిన్నప్పుడు నాకు బైబిలు విషయాలు బోధించిన వ్యక్తి కనిపించినప్పుడు, మళ్లీ నాతో బైబిలు అధ్యయనం చేయమని అడిగాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . . ఒకరోజు నేను సామెతలు 27:11 చదివాను. అక్కడ ఇలా ఉంది: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు.’ అల్పులైన మానవులు, ఈ విశ్వాన్నంతటినీ సృష్టించిన దేవుణ్ణి సంతోషపెట్టగలరన్న ఆలోచన నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది. ఇన్నాళ్లూ నేను అనుభవించిన తండ్రిలేని లోటును యెహోవాయే తీర్చగలడని నాకనిపించింది.

నా పరలోక తండ్రిని సంతోషపెట్టాలని, ఆయన చెప్పినవి చేయాలని అనుకున్నాను. కానీ నేను చాలా సంవత్సరాలుగా మద్యానికి, మత్తుమందులకు బానిసగా ఉన్నాను. మత్తయి 6:24లో, ‘ఎవరూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు’ అని యేసు చెప్పిన మాటలు నాకు అర్థమయ్యాయి. నేను మార్పులు చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు 1 కొరింథీయులు 15:33లోని, “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అనే సూత్రం నా మీద బాగా పనిచేసింది. నేను పాత చోట్లకే వెళ్తూ, పాత స్నేహాల్నే కొనసాగిస్తే, ప్రమాదకరమైన అలవాట్ల నుండి బయటపడడం అసాధ్యమని గ్రహించాను. ఈ విషయంలో బైబిలిచ్చే సలహా స్పష్టంగా ఉంది. నాకు అడ్డుతగిలే వాటిని వదిలించుకోవాలంటే నేను చాలా కఠినమైన మార్పులు చేసుకోవాలి.—మత్తయి 5:30.

సంగీతం మీద నాకున్న మక్కువ వల్ల హెవీమెటల్‌ సంగీతాన్ని వదిలిపెట్టడం చాలా కష్టమైంది. కానీ, సంఘంలోని స్నేహితుల సహాయంతో చివరికి దాన్ని వదిలిపెట్టగలిగాను. అతిగా తాగడం, మత్తుమందులు తీసుకోవడం మానేశాను. జుట్టు కత్తిరించుకున్నాను, గడ్డం తీసేశాను. అస్తమానం నల్ల బట్టలే ధరించడం కూడా మానేశాను. నేను జుట్టు కత్తిరించుకోవాలని అనుకుంటున్నానని సూసాన్‌తో అన్నాను. దాంతో, నేను రాజ్యమందిరానికి వెళ్లి ఏం చేస్తున్నానో తెలుసుకోవాలనే కుతూహలం తనలో పెరిగింది. “నేను కూడా నీతోపాటు రాజ్యమందిరానికి వచ్చి, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూస్తాను” అని నాతో అంది. అక్కడ చూసినవన్నీ తనకెంతో నచ్చాయి, త్వరలోనే తను కూడా బైబిలును అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. కొంతకాలానికి మేము పెళ్లి చేసుకున్నాం. 2008లో మేమిద్దరం బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులమయ్యాం. ఇప్పుడు మేము కూడా మా అమ్మతో కలిసి యెహోవాను సేవిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . . బూటకపు సంతోషం, కపట స్నేహితులు ఉండే ఈ లోకం నుండి నేను బయటపడ్డాను. ఇప్పటికీ సంగీతమంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు నేను మంచి సంగీతాన్నే ఎంచుకుంటున్నాను. నా జీవితానుభవాన్ని కుటుంబ సభ్యులకు, ఇతరులకు, ముఖ్యంగా యౌవనులకు ప్రయోజనం కలిగేలా ఉపయోగిస్తున్నాను. ఈ లోకం ఇవ్వజూపేవి ఆకర్షణీయంగా కనిపించినా, అవన్నీ కేవలం “పెంటతో సమానం” అనే విషయాన్ని వాళ్లు గ్రహించేలా సహాయం చేయాలనేది నా కోరిక.—ఫిలిప్పీయులు 3:10, 11.

నిజమైన ప్రేమ, శాంతి విలసిల్లే క్రైస్తవ సంఘంలో నాకు నమ్మకమైన స్నేహితులు దొరికారు. అంతకంటే గొప్ప విషయమేమిటంటే, యెహోవాకు దగ్గరవ్వడం వల్ల నాకు తండ్రిలేని లోటు తీరింది! (w12-E 04/01)

[అధస్సూచి]

[29వ పేజీలోని బ్లర్బ్‌]

“యెహోవా నన్ను ఆకర్షించడంవల్లే నేను తిరిగి ఆయన దగ్గరకు రాగలిగాను.”