కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుమారుడు తండ్రిని ఇష్టపూర్వకంగా బయలుపర్చాడు

కుమారుడు తండ్రిని ఇష్టపూర్వకంగా బయలుపర్చాడు

కుమారుడు తండ్రిని ఇష్టపూర్వకంగా బయలుపర్చాడు

“తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడు.”—లూకా 10:22.

వీటికి మీ జవాబులేమిటో చూడండి:

తండ్రిని బయలుపర్చేందుకు యేసు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడని ఎందుకు చెప్పవచ్చు?

తండ్రిని యేసు ఇతరులకు ఎలా బయలుపర్చాడు?

యేసులా మీరు తండ్రిని ఏయే విధాలుగా ఇతరులకు బయలుపర్చవచ్చు?

1, 2. చాలామందికి ఏది ఒక చిక్కుపశ్నగా ఉంది? ఎందుకు?

 చాలామందికి ‘దేవుడు ఎవరు?’ అనేది ఒక చిక్కుపశ్న. ఉదాహరణకు, చాలామంది నామకార్థ క్త్రెస్తవులు దేవుడు ఒక త్రిత్వము అని నమ్మినప్పటికీ వాళ్లలో ఎక్కువమంది ఆ సిద్ధాంతాన్ని అర్థంచేసుకోవడం అసాధ్యమని అంగీకరిస్తారు. రచయిత, చర్చి బోధకుడు అయిన ఒక వ్యక్తి, “ఈ సిద్ధాంతం మానవ పరిమిత జ్ఞానానికి మించినది. ఇది మానవ సహజ తర్కానికి అందనిది” అని ఒప్పుకున్నాడు. మరోవైపు, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే చాలామంది అసలు దేవుడే లేడంటారు. ఈ అద్భుతమైన సృష్టంతా దానంతటదే వచ్చిందని వాళ్లు వాదిస్తారు. అయితే, చార్లెస్‌ డార్విన్‌ మాత్రం దేవుడు లేడని అనలేదు కానీ, దేవుని గురించి పూర్తిగా అర్థం చేసుకొనే సామర్థ్యం మానవులకు లేదని అన్నాడు.

2 తాము ఏమి నమ్ముతున్నా, చాలామందికి దేవుని ఉనికి విషయంలో సందేహాలు ఉన్నాయి. అయితే, వాళ్లు వాటికి సరైన జవాబులు కనుక్కోలేకపోవడం వల్ల చివరికి దేవుని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నాలను విరమించుకున్నారు. నిజానికి సాతాను “అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” (2 కొరిం. 4:4) అందుకే, విశ్వాన్ని సృష్టించిన తండ్రి గురించిన సత్యం తెలియక ఎంతోమంది అయోమయంలో ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.—యెష. 45:18.

3. (ఎ) మనకు తండ్రిని ఎవరు బయలుపర్చారు? (బి) మనమిప్పుడు ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 అయినా ప్రజలు దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకు? ఎందుకంటే “యెహోవా నామమున” ప్రార్థన చేసేవాళ్లు మాత్రమే రక్షింపబడతారు. (యోవే. 2:32) యెహోవా నామమున ప్రార్థన చేయాలంటే ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. ఈ ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు అందించాడు. ఆయన వాళ్లకు తండ్రిని బయలుపర్చాడు. (లూకా 10:22 చదవండి.) తండ్రిని ఎవ్వరూ బయలుపర్చలేనంత బాగా యేసే ఎందుకు బయలుపర్చగలిగాడు? ఆయన ఎలా బయలుపర్చాడు? యేసును ఆదర్శంగా తీసుకొని మనం తండ్రిని ఎలా బయలుపర్చవచ్చు? ఇప్పుడు మనం ఈ ప్రశ్నలను పరిశీలిద్దాం.

యేసుక్రీస్తు ప్రత్యేకమైన రీతిలో అర్హుడు

4, 5. తండ్రిని బయలుపర్చడానికి యేసు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడని ఎందుకు చెప్పవచ్చు?

4 యేసు తన తండ్రిని బయలుపర్చడానికి ప్రత్యేకమైన రీతిలో అర్హుడు. ఎందుకు? ఎందుకంటే ఆత్మ ప్రాణిగా ఉండి ఆ తర్వాత మానవునిగా వచ్చిన యేసు సమస్తం సృష్టించబడక ముందే ‘దేవుని అద్వితీయకుమారునిగా’ పరలోకంలో ఉనికిలో ఉన్నాడు. (యోహా. 1:14; 3:18) అది ఎంత ప్రత్యేకమైన స్థానమో కదా! ఏ ప్రాణీ సృష్టించబడక ముందు కుమారుడు తండ్రి సమక్షంలో ఎంతో ఆనందిస్తూ ఆయన గురించి, ఆయన లక్షణాల గురించి తెలుసుకున్నాడు. తండ్రి కుమారులు ఎన్నో యుగాల పాటు చాలా చాలా విషయాలు మాట్లాడుకొని ఒకరిపట్ల ఒకరు ఎంతో ఆప్యాయతను పెంచుకొని ఉంటారు. (యోహా. 5:20; 14:31) ఆ విధంగా ఆయన తండ్రి వ్యక్తిత్వం గురించి ఎంతో అవగాహన సంపాదించుకొని ఉంటాడు.కొలొస్సయులు 1:15-17 చదవండి.

5 తండ్రి కుమారుణ్ణి తన ప్రతినిధిగా అంటే ‘వాక్యముగా’ ఉపయోగించుకున్నాడు. (ప్రక. 19:13) కాబట్టి తండ్రిని బయలుపర్చడానికి యేసు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు. అందుకే సువార్త రచయితయైన యోహాను, “వాక్యము” అయిన యేసు “తండ్రి రొమ్మున” ఉన్నాడని చెప్పాడు. (యోహా. 1:1, 18) యోహాను ఈ మాటలను ఉపయోగించి తన కాలంలోని ప్రజలు భోజనం చేసేటప్పుడు పాటించే ఒక పద్ధతి గురించి చెప్పకనే చెప్పాడు. అప్పట్లో ఒక అతిథి ఒక పరుపు మీద కూర్చున్నప్పుడు మరో అతిథి అదే పరుపు మీద ఆయన రొమ్మున ఆనుకున్నట్టుగా ఆయనకు దగ్గరగా కూర్చునేవాడు. అలా కూర్చోవడం వల్ల వాళ్లిద్దరూ మాట్లాడుకోవడానికి అనువుగా ఉండేది. అలాగే కుమారుడు “తండ్రి రొమ్మున” ఉంటూ తండ్రితో ఎంతో సన్నిహితంగా సంభాషించేవాడు.

6, 7. తండ్రి కుమారుల మధ్య అనుబంధం ఎలా పెరుగుతూ వచ్చింది?

6 కాలం గడుస్తుండగా తండ్రి కుమారుల మధ్య అనుబంధం పెరుగుతూ వచ్చింది. అలా కుమారుడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా తయారయ్యాడు. (సామెతలు 8:22, 23, 30, 31 చదవండి.) కలిసి పని చేయడం వల్ల, కుమారుడు తన తండ్రి లక్షణాలను చూపించడాన్ని నేర్చుకోవడం వల్ల వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం పెరిగిందని అర్థమౌతోంది. తెలివిగల ఇతర ప్రాణులు సృష్టించబడిన తర్వాత ఒక్కొక్కరితో యెహోవా ఎలా వ్యవహరించాడో చూసినప్పుడు, యెహోవా వ్యక్తిత్వం గురించి కుమారుడు మరింత తెలుసుకోగలిగాడు.

7 యెహోవా సర్వాధిపత్యం సరైనదేనా అనే సవాలును సాతాను లేవనెత్తినప్పుడు, ఏదైనా క్లిష్టమైన పరిస్థితి ఎదురైతే యెహోవా తన ప్రేమను, న్యాయాన్ని, జ్ఞానాన్ని, శక్తిని ఎలా ప్రదర్శిస్తాడో చూసే అవకాశం కుమారునికి దొరికింది. దానివల్ల, భూపరిచర్యలో తనకు ఎదురవగల కష్టతరమైన పరిస్థితులతో వ్యవహరించడానికి కుమారుడు సిద్ధపడి ఉంటాడు.—యోహా. 5:19.

8. తండ్రి లక్షణాల గురించి మరింత బాగా అర్థం చేసుకోవడానికి సువార్త వృత్తాంతాలు ఏ విధంగా సహాయం చేస్తాయి?

8 కుమారుడికి తండ్రితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి తండ్రి గురించి ఎవ్వరూ వివరించనంత ఎక్కువగా ఆయన వివరించగలిగాడు. కాబట్టి తండ్రి గురించి తెలుసుకోవాలంటే ప్రాముఖ్యంగా అద్వితీయ కుమారుని బోధలను, ప్రవర్తనను పరిశీలించాలి. ఉదాహరణకు, “ప్రేమ” అనే పదానికి నిఘంటువులో ఉన్న అర్థాన్ని చూసి దాన్ని పూర్తిగా గ్రహించడం చాలా కష్టం. అయితే, సువార్త పుస్తకాల్లో యేసు పరిచర్య గురించి, ఆయన ప్రజలపై శ్రద్ధ చూపించిన విధానాల గురించి తెలిపే వృత్తాంతాలను పరిశీలిస్తే, “దేవుడు ప్రేమాస్వరూపి” అనే మాటలను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం. (1 యోహా. 4:8, 16) యేసు భూమ్మీద ఉన్నప్పుడు తన శిష్యులకు బయలుపర్చిన దేవుని ఇతర లక్షణాల విషయంలో కూడా అలాగే చెప్పవచ్చు.

తండ్రిని యేసు ఎలా బయలుపర్చాడు?

9. (ఎ) ప్రాథమికంగా ఏ రెండు విధాలుగా యేసు తన తండ్రిని బయలుపర్చాడు? (బి) యేసు తన బోధల ద్వారా తండ్రిని ఎలా బయలుపర్చాడో చూపించే ఒక ఉదాహరణ ఇవ్వండి.

9 యేసు తన శిష్యులకు, అలాగే భవిష్యత్తులో తనను అనుసరించే వాళ్లకు తండ్రిని ఏ విధంగా బయలుపర్చాడు? ఆయన ప్రాథమికంగా రెండు విధాలుగా అంటే తన బోధల ద్వారా, తన ప్రవర్తన ద్వారా అలా చేశాడు. మొదట, మనం ఆయన బోధల గురించి పరిశీలిద్దాం. యేసు తన శిష్యులకు బోధించిన విషయాలను బట్టి, ఆయనకు తన తండ్రి తలంపులపై, భావాలపై, మార్గాలపై ఎంత అవగాహన ఉందో తెలుస్తుంది. ఉదాహరణకు, యేసు తన తండ్రిని మందలో నుండి తప్పిపోయిన ఒక్క గొర్రెను వెదకడానికి వెళ్లిన శ్రద్ధగల కాపరితో పోల్చాడు. తప్పిపోయిన గొర్రెను కనుగొన్నప్పుడు ఆ కాపరి మందలో ఉన్న “తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించునంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించును” అని యేసు చెప్పాడు. ఆ ఉపమానాన్ని ఆయన ఎలా అన్వయించాడు? ‘ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తముకాదు’ అని ఆయన వివరించాడు. (మత్త. 18:11-14) ఈ ఉపమానం నుండి యెహోవా గురించి మీరు ఏమి నేర్చుకోవచ్చు? పనికిరాని వాళ్లమనీ లేదా ఇతరులు పట్టించుకోవడం లేదనీ కొన్నిసార్లు మీకు అనిపించినా మీ పరలోక తండ్రికి మీరంటే ఎంతో ఆసక్తి, శ్రద్ధ ఉన్నాయని గుర్తుంచుకోండి. ఆయన దృష్టిలో మీరు “ఈ చిన్నవారిలో” ఒకరు.

10. యేసు తన ప్రవర్తన ద్వారా తండ్రిని ఏ విధంగా బయలుపర్చాడు?

10 రెండవదిగా, యేసు తన ప్రవర్తన ద్వారా తండ్రిని తన శిష్యులకు బయలుపర్చాడు. అందుకే, “తండ్రిని మాకు కనబరచుము” అని అపొస్తలుడైన ఫిలిప్పు అడిగినప్పుడు, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పగలిగాడు. (యోహా. 14:8, 9) యేసు తన తండ్రి లక్షణాలను ఏ విధంగా చూపించాడో తెలియజేసే కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఒక కుష్ఠరోగి తనను బాగుచేయమని యేసును అడిగినప్పుడు, ఆయన “కుష్ఠరోగముతో నిండిన” ఆ మనుష్యుని ముట్టి “నాకిష్టమే, నీవు శుద్ధుడవుకమ్ము” అని చెప్పాడు. ఆ కుష్ఠరోగి బాగుపడినప్పుడు, యేసు తనతో వ్యవహరించిన తీరులో అతను యెహోవా కనికరాన్ని చూసి ఉంటాడు. (లూకా 5:12, 13) అలాగే, లాజరు చనిపోయినప్పుడు యేసు ‘కలవరపడి ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచినప్పుడు’ శిష్యులు తండ్రి కనికరాన్ని తప్పక చూసివుంటారు. లాజరును తాను పునరుత్థానం చేస్తానని యేసుకు తెలిసినా లాజరు కుటుంబ సభ్యులు, స్నేహితులు పడుతున్న బాధను చూసి ఆయన కూడా బాధపడ్డాడు. (యోహా. 11:32-35, 40-43) యేసుకు సంబంధించిన బైబిలు వృత్తాంతాల్లో మీకు నచ్చినవి ఉండే ఉంటాయి, అవి యెహోవా కనికరాన్ని గుర్తించేందుకు మీకు సహాయం చేసి ఉంటాయి.

11. (ఎ) యేసు దేవాలయాన్ని శుభ్రపర్చినప్పుడు తన తండ్రి గురించి ఏమి బయలుపర్చాడు? (బి) ఆ వృత్తాంతం మనకు ఎందుకు ఓదార్పునిస్తుంది?

11 యేసు దేవాలయాన్ని శుభ్రపర్చడం నుండి మీరేమి నేర్చుకోవచ్చు? ఒకసారి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. యేసు త్రాళ్లతో కొరడాలుచేసి పశువులు అమ్మేవాళ్లను దేవాలయంలో నుండి తరిమేశాడు. రూకలు మార్చేవాళ్ల రూకలను చల్లివేసి, వాళ్ల బల్లల్ని పడద్రోశాడు. (యోహా. 2:13-17) యేసు చేసిన ఆ శక్తివంతమైన పనిని చూసినప్పుడు, “నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది” అని దావీదు రాజు రాసిన ప్రవచనాత్మక మాటలు శిష్యులకు గుర్తుకొచ్చి ఉంటాయి. (కీర్త. 69:9) గట్టి చర్య తీసుకోవడం ద్వారా సత్యారాధనను సమర్థించాలనే బలమైన కోరికను యేసు వ్యక్తం చేశాడు. ఆ వృత్తాంతంలో మీకు యెహోవా వ్యక్తిత్వం కనిపిస్తోందా? భూమ్మీదున్న దుష్టత్వాన్ని నిర్మూలించేందుకు యెహోవాకు అంతులేని శక్తే కాక, దాన్ని అంతం చేయాలనే బలమైన కోరిక కూడా ఉందని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. తప్పుచేస్తున్న వాళ్లమీద యేసు శక్తివంతంగా చర్య తీసుకున్న తీరును బట్టి ఇప్పుడు భూమ్మీద పెచ్చుపెరిగిపోయిన దుష్టత్వాన్ని చూసి తండ్రి ఎలా భావిస్తాడో మనం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడం వల్ల, మనకు అన్యాయం జరిగినప్పుడు ఎంతో ఓదార్పును పొందుతాం.

12, 13. యేసు తన శిష్యులతో వ్యవహరించిన విధానం నుండి మీరు తండ్రి గురించి ఏమి తెలుసుకోవచ్చు?

12 యేసు తన శిష్యులతో ఎలా వ్యవహరించాడో ఇప్పుడు చూద్దాం. తమలో ‘ఎవరు గొప్ప’ అని వాళ్లు వాదించుకుంటూ ఉండేవాళ్లు. (మార్కు 9:33-35; 10:43; లూకా 9:46) ఆయన ఎంతో కాలంపాటు తండ్రియైన యెహోవాతో కలిసి ఉన్నాడు కాబట్టి యెహోవా అలాంటి అహంకార స్వభావాన్ని ఎలా ఎంచుతాడో ఆయనకు తెలుసు. (2 సమూ. 22:28; కీర్త. 138:6) అంతేకాక, అపవాదియైన సాతాను అలాంటి స్వభావాన్ని కనబరచడం యేసు చూశాడు. స్వార్థపరుడైన సాతాను ప్రముఖ స్థానం కోసం ఆరాటపడ్డాడు. యేసు తాను శిక్షణ ఇచ్చిన శిష్యుల మధ్య ‘నేనే గొప్ప’ అనే వైఖరి ఉండడం చూసి ఎంతో బాధపడివుంటాడు. ఒక్కసారి ఆలోచించండి, యేసు స్వయంగా ఎంచుకున్న అపొస్తలుల మధ్య కూడా ఆ వైఖరి ఉండేది! యేసు భూజీవితపు చివరి రోజు వరకు వాళ్లు అదే వైఖరి చూపిస్తూ వచ్చారు. (లూకా 22:24-27) అయినా, యేసు ఆశలు వదులుకోకుండా వాళ్లు ఏనాటికైనా తనలాగే వినయం చూపించడం నేర్చుకుంటారనే ఉద్దేశంతో దయగా వాళ్లను సరిదిద్దుతూ వచ్చాడు.—ఫిలి. 2:5-8.

13 యేసు తన శిష్యుల తప్పుడు ఉద్దేశాలను తండ్రిలాగే ఓపికగా సరిదిద్దడాన్ని మీరు చూస్తున్నారా? తన ప్రజలు ఎన్నిసార్లు విఫలమైనా వాళ్ల చేయి విడిచిపెట్టని తండ్రిని యేసు మాటల్లో, చేతల్లో మీరు చూస్తున్నారా? దేవుని లక్షణాల గురించిన ఆ అవగాహన మనకుంటే, మనం తప్పులు చేసినప్పుడు ఆయన ముందు మన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాం.

తండ్రిని కుమారుడు ఇష్టపూర్వకంగా బయలుపర్చాడు

14. తండ్రిని బయలుపర్చడానికి ఇష్టపడుతున్నానని యేసు ఎలా చూపించాడు?

14 చాలామంది నియంతలు ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి చాలా విషయాల్ని వాళ్లకు చెప్పకుండా దాస్తారు. కానీ, యెహోవా గురించి తన శిష్యులు తెలుసుకోవాల్సిన ప్రతీ విషయాన్ని యేసు బయలుపర్చాడు. అలా చేయడం ద్వారా తండ్రి గురించి తనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నట్లు ఆయన చూపించాడు. (మత్తయి 11:27 చదవండి.) దానితోపాటు, ‘సత్యవంతుడైన’ యెహోవా దేవుణ్ణి తెలుసుకోవడానికి యేసు తన శిష్యులకు ‘వివేకాన్ని అనుగ్రహించాడు.’ (1 యోహా. 5:20) అంటే, తండ్రి గురించి తాను బోధించిన విషయాలను శిష్యులు అర్థం చేసుకోగలిగేలా వాళ్ల మనసులను తెరిచాడు. వాళ్లకు తండ్రి గురించిన సత్యాన్ని మరుగుపర్చలేదు, అంతుబట్టని త్రిత్వంలో తండ్రి ఒక భాగమని బోధించలేదు.

15. తండ్రి గురించి యేసు కొన్ని విషయాల్ని ఎందుకు చెప్పలేదు?

15 తండ్రి గురించి తనకు తెలిసిన ప్రతీ విషయాన్ని యేసు బయలుపర్చాడా? లేదు, యేసు వివేచనను ఉపయోగించి, తన తండ్రి గురించి తనకు తెలిసిన చాలా విషయాల్ని వాళ్లకు తెలియజేయలేదు. (యోహాను 16:12 చదవండి.) ఎందుకు? అలా తెలియజేస్తే ఆయన శిష్యులు అప్పుడు ‘వాటిని సహించే’ స్థితిలో లేరు. అయితే, ‘సర్వసత్యములోనికి నడిపించే’ పరిశుద్ధాత్మ వాళ్ల మీదికి వచ్చినప్పుడు వాళ్లు దాని సహాయంతో చాలా విషయాలు తెలుసుకోగలుగుతారని యేసు వివరించాడు. (యోహా. 16:7, 13) వివేకంగల తల్లిదండ్రులు తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యేంత వరకు పిల్లలకు కొన్ని విషయాల్ని చెప్పనట్లే, తండ్రి గురించిన కొన్ని వాస్తవాల్ని అర్థం చేసుకునేంత పరిణతి తన శిష్యుల్లో వచ్చేవరకు యేసు వేచి ఉన్నాడు. యేసు వాళ్ల పరిమితులను అర్థంచేసుకున్నాడు.

యేసులా యెహోవా గురించి ఇతరులకు తెలియజేయండి

16, 17. మనం ఇతరులకు దేవుని గురించి తెలియజేసే స్థానంలో ఉన్నామని ఎందుకు చెప్పవచ్చు?

16 మీకు ఎవరి గురించైనా బాగా తెలిసుండి ఆయన ప్రేమగల వ్యక్తిత్వం మీకు ఎంతగానో నచ్చితే ఆయన గురించి ఇతరులతో చెబుతారు కదా? అలాగే యేసు భూమ్మీద ఉన్నప్పుడు తన తండ్రి గురించి మాట్లాడాడు. (యోహా. 17:25, 26) యేసులా యెహోవా గురించి ఇతరులకు తెలియజేయడం సాధ్యమేనా?

17 మనం ఇప్పటివరకు గమనించినట్లుగా, యెహోవా గురించి ఎవ్వరికీ తెలియనన్ని విషయాలు యేసుకు తెలుసు. అయితే, ఆయనకు తెలిసిన వాటిలో కొన్ని విషయాలను ఇతరులకు ఇష్టపూర్వకంగా తెలియజేశాడు. దేవుని వ్యక్తిత్వానికి సంబంధించిన లోతైన విషయాలను అర్థంచేసుకునేలా తన అనుచరులకు వివేకాన్ని కూడా అనుగ్రహించాడు. తండ్రి గురించి చాలామందికి తెలియని విషయాలను యేసు సహాయంతో మనం తెలుసుకోగలిగాం. యేసు తన బోధల ద్వారా, ప్రవర్తన ద్వారా తండ్రిని ఇష్టపూర్వకంగా బయలుపర్చినందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా! నిజానికి, మనకు తండ్రి గురించి తెలుసని సగర్వంగా చెప్పుకోవచ్చు. (యిర్మీ. 9:24; 1 కొరిం. 1:31) మనం యెహోవాకు సన్నిహితం అవడానికి కృషి చేసినందువల్ల ఆయన మనకు దగ్గరయ్యాడు. (యాకో. 4:8) కాబట్టి ఇతరులకు దేవుని గురించి తెలియజేసే స్థానంలో మనం ఉన్నాం. మరి మనం ఎలా తెలియజేయవచ్చు?

18, 19. మీరు ఏయే విధాలుగా తండ్రిని ఇతరులకు బయలుపర్చవచ్చు? వివరించండి.

18 యేసులా మన మాటల్లో, చేతల్లో మనం తండ్రిని బయలుపర్చాలి. మనం పరిచర్యలో కలిసే చాలామందికి దేవుడు ఎవరో తెలియదని మనం గుర్తుంచుకోవాలి. దేవుని విషయంలో వాళ్ల అభిప్రాయం అబద్ధ బోధలతో కలుషితమైపోయి ఉండవచ్చు. దేవుని నామం గురించి, మానవుల పట్ల ఆయనకున్న సంకల్పం గురించి, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి బైబిల్లో బయలుపర్చబడిన విషయాల గురించి మనం వాళ్లకు తెలియజేయవచ్చు. అంతేకాక, మనం చదివిన కొన్ని బైబిలు వృత్తాంతాల్లో దేవుని వ్యక్తిత్వం గురించి మనకు ఇంతకు ముందుకన్నా బాగా అర్థమైన విషయాలను తోటి విశ్వాసులతో చర్చించవచ్చు. అలా చేస్తే వాళ్లు కూడా ప్రయోజనం పొందవచ్చు.

19 యేసులా మీరు మీ ప్రవర్తన ద్వారా తండ్రిని ఎలా బయలుపర్చవచ్చు? ప్రజలు మన ప్రవర్తనలో క్రీస్తు ప్రేమను చూసినప్పుడు వాళ్లు తండ్రికి, అలాగే యేసుకు దగ్గరౌతారు. (ఎఫె. 5:1, 2) “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. (1 కొరిం. 11:1) మన ప్రవర్తన ద్వారా ప్రజలకు యెహోవాను బయలుపర్చే గొప్ప అవకాశం మనకుంది! యేసులా మనమందరం తండ్రిని ఇతరులకు బయలుపరుస్తూ ఉందాం.

[అధ్యయన ప్రశ్నలు]