కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నమ్మకద్రోహం—అంత్యదినాలకు సంబంధించిన ఒక సూచన

నమ్మకద్రోహం—అంత్యదినాలకు సంబంధించిన ఒక సూచన

నమ్మకద్రోహం—అంత్యదినాలకు సంబంధించిన ఒక సూచన

‘మేము ఎంతో భక్తిగా [“నమ్మకంగా,” NW], నీతిగా, అనింద్యముగా ప్రవర్తించితిమి.’ —1 థెస్స. 2:10.

ఈ ముఖ్యాంశాల కోసం చూడండి:

దెలీలా, అబ్షాలోము, ఇస్కరియోతు యూదా ఈ ముగ్గురూ చేసిన నమ్మకద్రోహం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

నమ్మకంగా ఉన్న యోనాతానును, పేతురును ఆదర్శంగా తీసుకొని మనం ఏమి చేయాలి?

భార్య పట్ల లేదా భర్త పట్ల, అలాగే యెహోవా పట్ల నమ్మకంగా ఉండాలనే మన కృతనిశ్చయాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

1-3. (ఎ) అంత్యదినాలకు సంబంధించిన ఒక సూచన ఏమిటి? (బి) నమ్మకద్రోహం అంటే ఏమిటి? (సి) మనం ఏ మూడు ప్రశ్నలకు జవాబులు పరిశీలిస్తాం?

 బైబిల్లో ప్రస్తావించబడిన దెలీలా, అబ్షాలోము, ఇస్కరియోతు యూదా గురించి ఆలోచించండి. ఆ ముగ్గురూ నమ్మకద్రోహం చేశారు. దెలీలా తనను ప్రేమించిన న్యాయాధిపతియైన సమ్సోనుకు ద్రోహం చేసింది. అబ్షాలోము తన తండ్రియైన దావీదు రాజుకు ద్రోహం చేశాడు. ఇస్కరియోతు యూదా తన బోధకుడైన క్రీస్తు యేసుకు ద్రోహం చేశాడు. ఆ ముగ్గురూ చేసిన ద్రోహం వల్ల అవతలి వ్యక్తులకు ఎంతో హాని జరిగింది, దుఃఖం కలిగింది. అయితే వాళ్ల గురించి ఇప్పుడు మనమెందుకు పరిశీలించాలి?

2 నమ్మకద్రోహం నేడు సాధారణ బలహీనతగా మారిపోయిందని చెప్పబడుతోంది. ఈ రోజుల్లో పరిస్థితి అలా ఉందంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. యేసు “యుగసమాప్తికి” సంబంధించిన సూచనలు ఇస్తున్నప్పుడు ‘అనేకులు, ఒకరినొకరు అప్పగించుకుంటారు’ అని చెప్పాడు. (మత్త. 24:3, 10) మోసం చేసి ఒకరిని శత్రువుకు అప్పగించడమే నమ్మకద్రోహం. ‘అంత్యదినాల్లో ద్రోహులు’ ఉంటారని పౌలు ప్రవచించాడు. నేడు ఎంతోమంది నమ్మకద్రోహం చేయడం మనం చూస్తున్నాం కాబట్టి మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని తెలుస్తోంది. (2 తిమో. 3:1-4) నమ్మకద్రోహాన్ని పుస్తకాల్లో, సినిమాల్లో ఎంతో ఆసక్తికరంగా చూపిస్తారు కానీ నిజ జీవితంలో అది చాలా బాధ, వేదన కలిగిస్తుంది. నిజంగా, నమ్మకద్రోహం అంత్యదినాలకు సంబంధించిన ఒక సూచన.

3 పూర్వకాలంలో నమ్మకద్రోహం చేసిన వాళ్ల గురించి బైబిల్లో మనకు ఏ పాఠాలు ఉన్నాయి? ఇతరుల పట్ల నమ్మకంగా ఉన్న ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు? మనం ఎవరెవరికి నమ్మకంగా ఉండాలని నిశ్చయించుకోవాలి? ఈ ప్రశ్నలకు జవాబులు పరిశీలిద్దాం.

పూర్వకాలంలోని చెడు ఉదాహరణలు

4. దెలీలా సమ్సోనుకు ఎలా నమ్మకద్రోహం చేసింది, అది ఎందుకు చెడ్డ పని?

4 ముందుగా మనం వంచకురాలైన దెలీలా గురించి చూద్దాం. ఆమె తనను ప్రేమించిన సమ్సోనును మోసం చేసింది. సమ్సోను, దేవుని ప్రజల పక్షాన ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలనుకున్నాడు. దెలీలా ఆయనను నిజంగా ప్రేమించడంలేదని ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారులకు తెలిసివుండవచ్చు. కాబట్టి ఆ సర్దారులు సమ్సోనును చంపాలనే ఉద్దేశంతో దెలీలా దగ్గరికి వచ్చి సమ్సోనుకున్న మహాబలానికి రహస్యమేమిటో కనుక్కుంటే చాలా సొమ్ము ఇస్తామని ఆశచూపించారు. దురాశాపరురాలైన దెలీలా దానికి అంగీకరించింది, కానీ సమ్సోను మహాబలానికున్న రహస్యాన్ని తెలుసుకోవడంలో మూడుసార్లు విఫలమైంది. అప్పుడు ఆమె “అనుదినమును మాటలచేత అతని బాధించి” ఆ రహస్యాన్ని చెప్పమని ఒత్తిడి చేసింది. చివరికి “అతడు ప్రాణము విసికి చావగోరెను.” అలా విసిగిపోయి, ఆయన తన జుట్టును ఎప్పుడూ కత్తిరించలేదని, అలా కత్తిరిస్తే తన బలం పోతుందని ఆమెకు చెప్పాడు. a ఆమెకు ఆ రహస్యం తెలియగానే, ఆయనను తన ఒడిలో నిద్రబుచ్చి, ఆయన జుట్టు కత్తిరించి ఆయనను శత్రువులకు అప్పగించింది. (న్యాయా. 16:4, 5, 15-21) ఎంత చెడ్డ పని చేసిందో కదా! దురాశతో దెలీలా తనను ప్రేమించిన వ్యక్తికే ద్రోహం చేసింది.

5. (ఎ) అబ్షాలోము దావీదుకు ఎలా నమ్మకద్రోహం చేశాడు? (బి) దాన్నిబట్టి అబ్షాలోము గురించి ఏమి తెలుస్తోంది? (సి) అహీతోపెలు తనకు నమ్మకద్రోహం చేసినందుకు దావీదు ఎలా భావించాడు?

5 ఇప్పుడు మనం వంచకుడైన అబ్షాలోము గురించి చూద్దాం. ఆయన అధికార దాహంతో తన తండ్రియైన దావీదు సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆయన బూటకపు వాగ్దానాలు చేసి, ప్రేమ ఉన్నట్లు నటించి ఇశ్రాయేలీయుల మనసు దోచుకొని వాళ్లనందరినీ ‘తనతట్టు త్రిప్పుకున్నాడు.’ వాళ్లమీద ఏదో నిజంగా ప్రేమ ఉన్నట్లు, వాళ్ల అవసరాలంటే పట్టింపు ఉన్నట్లు వాళ్లను కౌగలించుకొని, ముద్దుపెట్టుకునేవాడు. (2 సమూ. 15:2-6) దావీదుకు నమ్మినబంటులా ఉన్న అహీతోపెలును కూడా తనవైపు తిప్పుకొని, దావీదుకు నమ్మకద్రోహం చేసేలా పురికొల్పాడు. (2 సమూ. 15:31) అలాంటి నమ్మకద్రోహం తనను ఎంతగా బాధపెట్టిందో దావీదు 3వ కీర్తనలో, 55వ కీర్తనలో వర్ణించాడు. (కీర్త. 3:1-8; కీర్తన 55:12-14 చదవండి.) యెహోవా నియమించిన రాజుకు వ్యతిరేకంగా అబ్షాలోము కుట్ర పన్నాడు. ఎవరిని రాజుగా నియమించాలో ఎంచుకునే హక్కు దేవునికి ఉందనే విషయాన్ని అబ్షాలోము పట్టించుకోలేదని అది చూపించింది. (1 దిన. 28:5) చివరికి, అబ్షాలోము కుట్ర విఫలమైంది, యెహోవా అభిషేకించిన రాజుగా దావీదు తన పరిపాలన కొనసాగించాడు.

6. ఇస్కరియోతు యూదా యేసుకు ఎలా నమ్మకద్రోహం చేశాడు? కొన్ని భాషల్లో యూదా అనే పేరు దేనికి పర్యాయపదంగా తయారైంది?

6 ఇప్పుడు, ఇస్కరియోతు యూదా క్రీస్తుకు ఎలా నమ్మకద్రోహం చేశాడో చూద్దాం. యేసు తన 12 మంది అపొస్తలులతో చివరిసారిగా పస్కా భోజనం చేస్తూ, “మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అన్నాడు. (మత్త. 26:21) ఆ తర్వాత అదే రాత్రి యేసు గెత్సేమనే తోటలో పేతురు, యాకోబు, యోహానులతో “ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడు” అని చెప్పాడు. వెంటనే, ఇస్కరియోతు యూదా ఇతర మోసగాళ్లతో కలిసి తోటలోకి ప్రవేశించి, ‘యేసు వద్దకు వచ్చి—బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దుపెట్టుకున్నాడు.’ (మత్త. 26:46-50; లూకా 22:47, 52) యేసుక్రీస్తును శత్రువులకు అప్పగించడం ద్వారా ఇస్కరియోతు యూదా ‘నిరపరాధ రక్తమును అప్పగించాడు.’ దురాశాపరుడైన ఇస్కరియోతు యూదా దేనికోసం ఇదంతా చేశాడు? కేవలం ముప్పై వెండినాణెముల కోసం! (మత్త. 27:3-5) అప్పటినుండి కొన్ని భాషల్లో యూదా అనే పేరు నమ్మకద్రోహానికి పర్యాయపదంగా తయారైంది. b

7. (ఎ) అబ్షాలోము, ఇస్కరియోతు యూదా జీవితాల్లో మనకు ఏ పాఠం ఉంది? (బి) దెలీలా జీవితంలో మనకు ఏ పాఠం ఉంది?

7 ఈ చెడు ఉదాహరణల్లో మనకు ఏ పాఠం ఉంది? అబ్షాలోము, ఇస్కరియోతు యూదా ఇద్దరూ యెహోవా అభిషేకించిన వాళ్లకు నమ్మకద్రోహం చేయడం వల్ల అవమానకరంగా మరణించారు. (2 సమూ. 18:9, 14-17; అపొ. 1:18-20) దెలీలా పేరు కూడా మోసానికి, బూటకపు ప్రేమకు గుర్తుగా మిగిలిపోయింది. (కీర్త. 119:158) అధికార దాహం లేదా దురాశ లాంటివి యెహోవా అనుగ్రహం కోల్పోయేలా చేస్తాయి కాబట్టి అలాంటి ఆలోచనలు రాకుండా చూసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. నమ్మకద్రోహం చేయడం ఎంత నీచమైనదో, దానికి ఎందుకు దూరంగా ఉండాలో చెప్పడానికి ఇంతకన్నా శక్తివంతమైన పాఠాలు ఉండవు.

నమ్మకంగా ఉన్నవాళ్లను ఆదర్శంగా తీసుకోండి

8, 9. (ఎ) దావీదుకు నమ్మకంగా ఉంటానని యోనాతాను ఎందుకు ప్రమాణం చేశాడు? (బి) మనం యోనాతానును ఆదర్శంగా తీసుకొని ఏమి చేయాలి?

8 నమ్మకంగా ఉన్నవాళ్ల ఉదాహరణలు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి. వాళ్లలో ఇద్దరి గురించి పరిశీలించి, వాళ్లనుండి ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం. మొదటిగా దావీదుకు నమ్మకంగా ఉన్న యోనాతాను గురించి చూద్దాం. ఆయన సౌలు పెద్ద కుమారుడు కాబట్టి తన తండ్రి తర్వాత తానే సింహాసనాన్ని అధిష్ఠించి ఉండేవాడు. కానీ సౌలు తర్వాత ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి యెహోవా దావీదును ఎన్నుకున్నాడు. యోనాతాను దేవుని నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేగానీ, దావీదుపై అసూయపడి ఆయనను తన ప్రత్యర్థిగా చూడలేదు. దావీదుకు నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేసిన తర్వాత, “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను.” యోనాతాను దావీదుకు తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు ఇవ్వడం ద్వారా రాజుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు. (1 సమూ. 18:1-4) యోనాతాను ‘దావీదును బలపరచడానికి’ తాను చేయగలినదంతా చేశాడు, అంతేగాక తన ప్రాణాల్ని పణంగా పెట్టి సౌలుతో దావీదు తరఫున మాట్లాడాడు. యోనాతాను దావీదుకు నమ్మకంగా ఉండి, “నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినౌదును” అని అన్నాడు. (1 సమూ. 20:30-34; 23:16, 17) అందుకే యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు ఒక విలాపగీతంలో యోనాతానుపై తనకున్న ప్రేమను, తన బాధను వ్యక్తం చేశాడు.—2 సమూ. 1:17, 26.

9 ఎవరిపట్ల నమ్మకంగా ఉండాలో యోనాతానుకు తెలుసు. ఆయన సర్వాధిపతియైన యెహోవా దేవునికి సంపూర్ణంగా లోబడి, దేవుడు అభిషేకించిన దావీదుకు పూర్తి మద్దతునిచ్చాడు. ఇప్పుడు మనం కూడా సంఘంలో మనకు ప్రత్యేకమైన బాధ్యతలేమీ లేకపోయినా, బాధ్యతగల స్థానాల్లో ఉన్న సహోదరులకు ఇష్టపూర్వకంగా మద్దతునివ్వాలి.—1 థెస్స. 5:12, 13; హెబ్రీ. 13:17, 24.

10, 11. (ఎ) పేతురు ఎందుకు నమ్మకంగా యేసుతోనే ఉన్నాడు? (బి) మనం పేతురును ఆదర్శంగా తీసుకుంటే ఏమి చేస్తాం?

10 ఇప్పుడు మనం, నమ్మకంగా ఉన్న మరో వ్యక్తి గురించి అంటే అపొస్తలుడైన పేతురు గురించి చూద్దాం. ఆయన యేసుకు నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేశాడు. ఇక కొన్ని రోజుల్లో తాను బలిగా అర్పించబోయే తన శరీరం, రక్తం విషయంలో విశ్వాసం ఉంచడం ప్రాముఖ్యమని వివరించడానికి క్రీస్తు అలంకారిక భాష ఉపయోగించినప్పుడు ఆయన శిష్యుల్లో చాలామంది విభ్రాంతినొంది ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు. (యోహా. 6:53-60, 66) అందుకే యేసు తన 12 మంది అపొస్తలుల వైపు తిరిగి “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నాము” అని జవాబిచ్చింది పేతురే. (యోహా. 6:67-69) అంటే, ఈ విషయంలో యేసు చెప్పినదంతా పేతురుకు అర్థమైపోయిందా? అర్థమై ఉండకపోవచ్చు. అయినా దేవుని అభిషిక్త కుమారునికి నమ్మకంగా ఉండాలని పేతురు నిర్ణయించుకున్నాడు.

11 యేసు ఆ మాటలు అన్నప్పుడు తప్పుగా ఆలోచించాడనో, కొంతకాలానికి ఆయన ఆ పొరపాటును సరిదిద్దుకుంటాడనో పేతురు అనుకోలేదు. కానీ పేతురు ఎంతో వినయంగా, యేసు దగ్గర “నిత్యజీవపు మాటలు” ఉన్నాయని గ్రహించాడు. అలాగే నేడు మనం ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ అందించే క్రైస్తవ ప్రచురణలు చదువుతున్నప్పుడు, ఏదైనా ఒక విషయం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటే లేదా మన అభిప్రాయానికి విరుద్ధంగా ఉంటే ఎలా స్పందిస్తాం? మన అభిప్రాయానికి తగినవిధంగా దానిలో మార్పు వస్తుందని ఆశించే బదులు ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి కృషి చేయాలి.—లూకా 12:42 చదవండి.

మీ భార్యకు లేదా భర్తకు నమ్మకంగా ఉండండి

12, 13. దంపతుల మధ్య నమ్మకద్రోహం ఎలా చోటుచేసుకునే అవకాశం ఉంది? ఒక వ్యక్తి ఏ వయసులో ఉన్నా అలా చేయడం ఎందుకు తప్పు?

12 ఎవరికి నమ్మకద్రోహం చేసినా తప్పే. నమ్మకద్రోహం వల్ల క్రైస్తవ కుటుంబంలో, సంఘంలో శాంతి ఐక్యతలకు భంగం కలుగుతుంది. ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని భార్య పట్ల లేదా భర్త పట్ల, అలాగే దేవుని పట్ల నమ్మకంగా ఉండాలనే మన కృతనిశ్చయాన్ని ఎలా బలపర్చుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

13 భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు అక్రమ సంబంధం పెట్టుకొని నమ్మకద్రోహం చేస్తే అది నిర్దోషియైన జీవిత భాగస్వామిని చాలా బాధపెడుతుంది. అలా చేసేవాళ్లు తమ భార్యకు లేదా భర్తకు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోకుండా, మరో వ్యక్తిపై మోజు పెంచుకుంటారు. దానితో నమ్మకద్రోహానికి గురైన వ్యక్తులు ఒక్కసారిగా ఒంటరివాళ్లయిపోతారు, వాళ్ల జీవితం తలకిందులైపోతుంది. ఒకప్పుడు ఒకరినొకరు ప్రేమించుకున్న ఆ ఇద్దరి మధ్య అలాంటి పరిస్థితి ఎలా ఏర్పడుతుంది? ఒకరి భావాలను మరొకరు పట్టించుకోకపోవడంతో అది మొదలవుతుంది. దంపతులు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని బలపర్చుకోవడానికి తాము చేయగలిగినవన్నీ చేయడం మానేసినప్పుడు సాధారణంగా నమ్మకద్రోహం చోటుచేసుకుంటుందని సమాజశాస్త్ర ప్రొఫెసర్‌ అయిన గేబ్రీయెల్ల టూర్నాటూరీ వివరిస్తోంది. వివాహమై ఎంతోకాలం గడిచిపోయిన దంపతుల మధ్య కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఉదాహరణకు 50 ఏళ్లున్న ఒక వ్యక్తి మరో స్త్రీకి ఆకర్షితుడై ఆమెతో కలిసి జీవించడానికి, 25 సంవత్సరాలుగా తనకు నమ్మకంగా ఉన్న భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ వయసులో అలా జరగడం సాధారణమే అని కొందరు అంటారు. అయితే, అది సాధారణ విషయం కాదుగానీ పచ్చి నమ్మకద్రోహం. c

14. (ఎ) నమ్మకద్రోహాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు? (బి) భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండడం గురించి యేసు ఏమి చెప్పాడు?

14 లేఖనాధార కారణం లేకుండా భార్యను గానీ భర్తను గానీ విడిచిపెడితే యెహోవా ఎలా భావిస్తాడు? ‘పరిత్యజించడాన్ని’ లేదా విడాకులు ఇవ్వడాన్ని మన దేవుడు ‘అసహ్యించుకుంటాడు.’ భర్తను గానీ భార్యను గానీ హింసించే వాళ్లను, విడిచిపెట్టే వాళ్లను దేవుడు గద్దించాడు. (మలాకీ 2:13-16 చదవండి.) యెహోవాలాగే యేసు కూడా నమ్మకద్రోహాన్ని అసహ్యించుకుంటాడు. నిర్దోషియైన భార్యకు విడాకులిచ్చే లేదా ఆమెను ఇంట్లోనుండి వెళ్లగొట్టే భర్త దోషిగా ఎంచబడతాడని యేసు చెప్పాడు.మత్తయి 19:3-6, 9 చదవండి.

15. భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండాలనే తమ కృతనిశ్చయాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

15 భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ఎలా నమ్మకంగా ఉండవచ్చు? ‘నీ యౌవనకాలపు భార్యయందు లేదా భర్తయందు సంతోషింపుము’ అని, ‘నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో లేదా భర్తతో సుఖించుము’ అని దేవుని వాక్యం చెబుతోంది. (సామె. 5:18; ప్రసం. 9:9) వయసు పైబడుతుండగా వాళ్లిద్దరూ శారీరకంగా, మానసికంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని బలపర్చుకోవడానికి తాము చేయగలిగినదంతా చేయాలి. ఇద్దరూ ఒకరి అవసరాల గురించి ఒకరు పట్టించుకోవాలి, ఇద్దరూ కలిసి సమయం గడపాలి, ఒకరికొకరు మరింత దగ్గరవ్వడానికి ఇద్దరూ ప్రయత్నించాలి. వాళ్లు తమ వివాహ బంధాన్ని, యెహోవాతో ఉన్న సంబంధాన్ని కాపాడుకోవడానికే ప్రాముఖ్యతనివ్వాలి. అలా చేయాలంటే, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బైబిలు చదవాలి, క్రమంగా ఇద్దరూ కలిసి పరిచర్యలో పాల్గొనాలి, యెహోవా ఆశీర్వాదాల కోసం ఇద్దరూ కలిసి ప్రార్థించాలి.

యెహోవాకు నమ్మకంగా ఉండండి

16, 17. (ఎ) యెహోవాకు నమ్మకంగా ఉంటామో లేదో పరీక్షించే ఎలాంటి పరిస్థితులు కుటుంబంలో, సంఘంలో రావచ్చు? (బి) బహిష్కరించబడిన కుటుంబ సభ్యులతో సహవసించకూడదనే ఆజ్ఞకు లోబడితే మంచి ఫలితాలు వస్తాయని ఏ అనుభవం చూపిస్తుంది?

16 ఘోరమైన పాపాలు చేసిన కొంతమంది సహోదర సహోదరీలను, ‘విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము కఠినముగా’ గద్దించాల్సి వచ్చింది. (తీతు 1:13) ఇంకొంతమందినైతే ఏకంగా సంఘం నుండి బహిష్కరించాల్సి వచ్చింది. అలాంటి క్రమశిక్షణ వల్ల కొందరు దేవునితో తమకున్న సంబంధాన్ని తిరిగి సంపాదించుకోగలిగారు. (హెబ్రీ. 12:11) ఒకవేళ మన కుటుంబ సభ్యుణ్ణి లేదా దగ్గరి స్నేహితుణ్ణి సంఘం నుండి బహిష్కరిస్తే మనం ఏమి చేస్తాం? అప్పుడు మనం చేసేదాన్ని బట్టి మనం యెహోవాకు నమ్మకంగా ఉన్నామో లేదో తెలుస్తుంది. సంఘం నుండి బహిష్కరించబడింది ఎవ్వరైనా సరే ఆ వ్యక్తితో ఎలాంటి సంప్రదింపులూ జరపకూడదని తాను ఇచ్చిన ఆజ్ఞకు మనం లోబడుతున్నామో లేదో యెహోవా గమనిస్తాడు.—1 కొరింథీయులు 5:11-13 చదవండి.

17 బహిష్కరించబడిన కుటుంబ సభ్యునితో సహవసించకూడదని యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు కుటుంబం నమ్మకంగా లోబడితే మేలు జరుగుతుందని చూపించే ఒక ఉదాహరణను పరిశీలించండి. ఒక యౌవనస్థుడు బహిష్కరించబడి పది సంవత్సరాలు దాటిపోయాయి. ఆ సంవత్సరాలన్నిటిలో ఆయన తల్లిదండ్రులు, నలుగురు అన్నదమ్ములు ఆయనతో ‘సాంగత్యం చేయలేదు.’ కొన్నిసార్లు ఆయన వాళ్ల కుటుంబానికి సంబంధించిన పనుల్లో భాగం వహించాలని ప్రయత్నించాడు కానీ ఆ కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ఆయనతో అసలేమాత్రం సహవసించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ యౌవనస్థుణ్ణి సంఘంలోకి తిరిగి చేర్చుకున్న తర్వాత, అన్ని సంవత్సరాలు తన కుటుంబ సభ్యులతో సహవసించ లేకపోయినందుకు ఎంతో బాధపడ్డాననీ ముఖ్యంగా రాత్రుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు అలా అనిపించేదనీ ఆయన చెప్పాడు. ఒకవేళ తన కుటుంబ సభ్యులు తనతో కాస్త సమయం గడిపినా తాను తృప్తిపడి ఉండేవాణ్ణని ఆయన ఒప్పుకున్నాడు. కానీ, కుటుంబ సభ్యులు ఆయనతో అస్సలు మాట్లాడకపోవడం వల్ల వాళ్లతో కలిసి ఉండాలని ఆయనకు బలంగా అనిపించేది. యెహోవాతో ఉన్న సంబంధాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి అది కూడా ఆయనకు సహాయం చేసింది. బహిష్కరించబడిన కుటుంబ సభ్యులతో సహవసించకూడదనే ఆజ్ఞను అతిక్రమించే విధంగా శోధన కలిగినప్పుడు ఈ అనుభవాన్ని గుర్తుచేసుకోండి.

18. నమ్మకద్రోహం చేయడం వల్ల వచ్చే నష్టాల గురించి, నమ్మకంగా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి పరిశీలించాక మీ కృత నిశ్చయం ఏమిటి?

18 నమ్మకద్రోహం ఎక్కువగా జరుగుతున్న లోకంలో మనం జీవిస్తున్నాం. అయినా, క్రైస్తవ సంఘంలో మనం ఆదర్శంగా తీసుకోగల నమ్మకమైన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. వాళ్ల జీవిత విధానాన్ని చూస్తే వాళ్లు ఎంత ‘నమ్మకంగా, నీతిగా, అనింద్యముగా’ ఉన్నారో తెలుస్తుంది. (1 థెస్స. 2:10, NW) మనమందరం దేవుని పట్ల, ఒకరి పట్ల ఒకరం నమ్మకంగా ఉండాలనే కృతనిశ్చయాన్ని బలపర్చుకుంటూ ఉందాం.

[అధస్సూచీలు]

a సమ్సోను బలానికి మూలం, ఆయన జుట్టు కాదుగానీ నాజీరుగా ఆయనకు యెహోవాతో ఉన్న ప్రత్యేక సంబంధం. ఆయన జుట్టు ఆ సంబంధాన్ని సూచించింది.

b కొన్ని భాషల్లో, “యూదా పెట్టిన ముద్దు” అనే మాటకు “నమ్మకద్రోహంతో కూడిన పని” అనే అర్థం ఉంది.

c భర్త లేదా భార్య చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోవడానికి సంబంధించిన సమాచారం కోసం కావలికోట జూన్‌ 15, 2010 సంచికలో 29-32 పేజీల్లోవున్న “భర్త లేదా భార్య చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోవడం ఎలా?” అనే ఆర్టికల్‌ చదవండి.

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

దేవుని అభిషిక్త కుమారుణ్ణి ఇతరులు విడిచిపెట్టి వెళ్లిపోయినా పేతురు నమ్మకంగా ఆయనతోనే ఉన్నాడు