కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రక్షణ కలిగేలా యెహోవా మనల్ని కాపాడతాడు

రక్షణ కలిగేలా యెహోవా మనల్ని కాపాడతాడు

రక్షణ కలిగేలా యెహోవా మనల్ని కాపాడతాడు

‘కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా మీరు దేవుని శక్తిచేత కాపాడబడతారు.’—1 పేతు. 1:5.

మీరు ఎలా జవాబిస్తారో చూడండి:

యెహోవా మనల్ని సత్యారాధన వైపుకు ఎలా ఆకర్షించాడు?

యెహోవా తన ఉపదేశాలతో ఇచ్చే నిర్దేశాన్ని మనమెలా స్వీకరించవచ్చు?

యెహోవా మనకు ఎలా ప్రోత్సాహాన్నిస్తాడు?

1, 2. (ఎ) మనం ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని చూపించే ఏ అభయం మనకుంది? (బి) యెహోవాకు మనలో ప్రతీ ఒక్కరి గురించి ఎంత బాగా తెలుసు?

 “అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” (మత్త. 24:13) సాతాను వ్యవస్థ మీద యెహోవా తన తీర్పును అమలు చేసినప్పుడు మనం రక్షించబడాలంటే అంతం వరకు మనం నమ్మకంగా ఉండాలని యేసు ఆ మాటల్లో స్పష్టం చేశాడు. అయితే సొంత జ్ఞానంతోనో, బలంతోనో మనం సహించాలని యెహోవా ఆశించడం లేదు. బైబిలు మనకు ఇలా అభయమిస్తోంది, “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” (1 కొరిం. 10:13) ఆ మాటల అర్థమేమిటి?

2 మనం సహించగలిగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధించబడనివ్వకుండా చూడాలంటే మనం ఎదుర్కొనే సవాళ్ల గురించి, మన వ్యక్తిత్వం గురించి, మనం ఎంతవరకు సహించగల్గుతామనే దాని గురించి యెహోవాకు పూర్తిగా తెలిసివుండాలి. మరి యెహోవాకు మన గురించి అంత బాగా తెలుసా? తెలుసు. మనలో ప్రతీ ఒక్కరి గురించి ఆయనకు పూర్తిగా తెలుసని లేఖనాలు చెబుతున్నాయి. మనం ప్రతీరోజు చేసే వాటన్నిటి గురించి, మన అలవాట్ల గురించి యెహోవాకు బాగా తెలుసు. ఆయన మన హృదయంలోని ఆలోచనలను, తలంపులను కూడా తెలుసుకోగలడు.—కీర్తన 139:1-6 చదవండి.

3, 4. (ఎ) యెహోవా ప్రతీ వ్యక్తిపై శ్రద్ధ చూపిస్తాడని దావీదు అనుభవం ఎలా నిరూపిస్తోంది? (బి) యెహోవా ఇప్పుడు ఏ అసాధారణమైన పని చేస్తున్నాడు?

3 అల్పులైన మానవుల విషయంలో దేవుడు అంత శ్రద్ధ చూపించడం అసాధ్యం అనిపిస్తోందా? కీర్తనకర్తయైన దావీదు ఈ ప్రశ్న గురించి ధ్యానిస్తూ యెహోవాతో ఇలా అన్నాడు, “నీ చేతిపనియైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?” (కీర్త. 8:3, 4) యెహోవా తనపై చూపించిన శ్రద్ధ వల్లే దావీదు బహుశా ఆ ప్రశ్న అడిగివుంటాడు. యెష్షయి చిన్న కుమారుడైన దావీదును యెహోవా “తన చిత్తానుసారమైన మనస్సుగల” వ్యక్తిగా పరిగణించి, ‘ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా’ నియమించేందుకు ‘గొఱ్ఱెల కాపులోనున్న’ ఆయనను ఎన్నుకున్నాడు. (1 సమూ. 13:14; 2 సమూ. 7:8) బాలుడైన దావీదు గొర్రెలకాపరిగా ఉన్నప్పుడే ఆయన ఆలోచనలు, భావాలు విశ్వ సృష్టికర్తకు తెలుసు. ఆ విషయాన్ని గుర్తించినప్పుడు దావీదుకు ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఊహించండి!

4 ఇప్పుడు మన విషయంలో యెహోవా చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధ ఎంతో అద్భుతం. యెహోవా ‘అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువుల్ని’ సత్యారాధనలో సమకూరుస్తున్నాడు, తన సేవకులు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండడానికి సహాయం చేస్తున్నాడు. (హగ్గ. 2:7) మనం ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండడానికి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో మరింత బాగా అర్థం చేసుకునేందుకు, ముందుగా సత్యారాధన వైపుకు ఆయన ప్రజల్ని ఎలా ఆకర్షిస్తున్నాడో పరిశీలిద్దాం.

దేవుడు మనల్ని ఆకర్షించాడు

5. గొర్రెల్లాంటి ప్రజల్ని యెహోవా ఎలా తన కుమారుని వైపుకు ఆకర్షిస్తాడు? ఉదాహరణతో చెప్పండి.

5 యేసు ఇలా అన్నాడు, “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” (యోహా. 6:44) మనం క్రీస్తు శిష్యులమవ్వాలంటే, మనకు దేవుని సహాయం అవసరమని ఆ మాటలు చూపిస్తున్నాయి. గొర్రెల్లాంటి ప్రజల్ని యెహోవా ఎలా తన కుమారుని వైపుకు ఆకర్షిస్తాడు? సువార్త ప్రకటనాపని ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా అలా చేస్తున్నాడు. ఉదాహరణకు పౌలు, ఆయన తోటి మిషనరీలు ఫిలిప్పీలో ఉన్నప్పుడు లూదియ అనే స్త్రీని కలిసి ఆమెకు సువార్త ప్రకటించారు. యెహోవా “ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను” అని ప్రేరేపిత వృత్తాంతం చెబుతోంది. పౌలు చెప్పిన సందేశాన్ని అర్థంచేసుకోవడానికి యెహోవా తన ఆత్మ సహాయాన్ని ఆమెకు ఇచ్చాడు. దానివల్ల ఆమె, ఆమె ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు.—అపొ. 16:13-15.

6. యెహోవా మనందరినీ సత్యారాధన వైపుకు ఎలా ఆకర్షించాడు?

6 లూదియ విషయంలో మాత్రమే అలా జరిగిందా? లేదు. మీరు యెహోవాకు సమర్పించుకున్న క్రైస్తవులైతే, ఒకప్పుడు మిమ్మల్ని కూడా యెహోవా సత్యారాధన వైపుకు ఆకర్షించాడు. పరలోక తండ్రి లూదియ హృదయంలో ఏదో మంచిని చూసినట్లే మీలో కూడా చూశాడు. మీరు సువార్త విని, బైబిలు అధ్యయనం మొదలుపెట్టిన తర్వాత తన పరిశుద్ధాత్మనిచ్చి సత్యాన్ని అర్థంచేసుకోవడానికి యెహోవా మీకు సహాయం చేశాడు. (1 కొరిం. 2:11, 12) నేర్చుకున్న విషయాల్ని అన్వయించుకోవడానికి మీరు ప్రయత్నించినప్పుడు మీరు తన చిత్తాన్ని చేసేలా ఆయన మీ ప్రయత్నాల్ని ఆశీర్వదించాడు. మీరు మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన సంతోషించాడు. నిజానికి, జీవమార్గంలో మీరు నడవడం మొదలుపెట్టినప్పటి నుండి మీరు వేస్తున్న ప్రతీ అడుగులో యెహోవా మీకు తోడుగా ఉన్నాడు.

7. మనం ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండేందుకు యెహోవా సహాయం చేస్తాడని మనకెలా తెలుసు?

7 తనతో నడవడం మొదలుపెట్టడానికి మనకు ఒకప్పుడు సహాయం చేసిన యెహోవా దేవుడు మనం నమ్మకంగా ఆ నడకను కొనసాగించడానికి ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. మనంతట మనమే సత్యంలోకి రాలేదన్న విషయం యెహోవాకు తెలుసు, అంతేకాక మనంతట మనమే సత్యంలో నిలబడలేమని కూడా ఆయనకు తెలుసు. అభిషిక్త క్రైస్తవులకు రాస్తూ అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు, ‘కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసం ద్వారా మీరు దేవుని శక్తిచేత కాపాడబడతారు.’ (1 పేతు. 1:5) ఆ మాటలు అభిషిక్తులకే కాదు క్రైస్తవులందరికీ వర్తిస్తాయి. అంతేకాదు, ఆ మాటల గురించి మనం ఆలోచించడం ప్రాముఖ్యం. ఎందుకంటే, దేవునిపట్ల ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండేందుకు మనకు ఆయన సహాయం అవసరం.

మనం తప్పు చేయకుండా యెహోవా ఆపగలడు

8. మనం ఎందుకు తప్పు చేసే అవకాశం ఉంది?

8 జీవితంలోని ఒత్తిళ్ల వల్ల, మన అపరిపూర్ణతల వల్ల మన ఆధ్యాత్మికత దెబ్బతిని, మనకు తెలియకుండానే తప్పు చేసే ప్రమాదం ఉంది. (గలతీయులు 6:1 చదవండి.) దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.

9, 10. దావీదు తప్పు చేయకుండా ఆపడానికి యెహోవా ఏమి చేశాడు? నేడు మన విషయంలో యెహోవా ఏమి చేస్తాడు?

9 అసూయాపరుడైన సౌలు రాజు తనను తరుముతున్నప్పుడు దావీదు ఆయనపై పగ తీర్చుకోకుండా ఉండేందుకు ఎంతో జాగ్రత్తపడ్డాడు. (1 సమూ. 24:2-7) కానీ కొంతకాలానికే, మరో సందర్భంలో దావీదు తన అపరిపూర్ణ భావావేశాలకు లొంగిపోయాడు. ఆయనకు, ఆయన మనుష్యులకు ఆహారం, నీళ్లు అవసరమైనప్పుడు తోటి ఇశ్రాయేలీయుడైన నాబాలు సహాయాన్ని కోరాడు. ఆ సందర్భంలో నాబాలు తనను అవమానపర్చడంతో దావీదు కోపంతో ఊగిపోయి, నిరపరాధులను చంపితే దేవుని దృష్టిలో రక్తాపరాధినైపోతాననే విషయాన్ని కూడా మరచిపోయి నాబాలు ఇంటివాళ్లందరినీ చంపి పగతీర్చుకోవాలనుకున్నాడు. సమయానికి అబీగయీలు వచ్చి ఆపకపోయివుంటే దావీదు ఘోరమైన తప్పు చేసివుండేవాడు. యెహోవాయే పరిస్థితుల్ని నిర్దేశించాడని గుర్తించి దావీదు అబీగయీలుతో ఇలా అన్నాడు, “నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక.”—1 సమూ. 25:9-13, 21, 22, 32, 33.

10 ఆ వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? దావీదు ఘోరమైన తప్పు చేయకుండా ఆపడానికి యెహోవా అబీగయీలును పంపించాడు. నేడు కూడా యెహోవా మన విషయంలో అలాంటిదే చేస్తాడు. అలాగని, మనం తప్పు చేసే పరిస్థితి వచ్చినప్పుడు యెహోవా ఎవర్నో ఒకరిని పంపిస్తాడని మనం ఆశించకూడదు. దేవుడు ఏదైనా ఒక పరిస్థితిలో ఎలా వ్యవహరిస్తాడో లేదా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏమి చేస్తాడో మనకు ఖచ్చితంగా తెలియదు. (ప్రసం. 11:5) అయినా, మన పరిస్థితుల గురించి యెహోవాకు తెలుసనే, మనం నమ్మకంగా ఉండడానికి సహాయం చేస్తాడనే విశ్వాసాన్ని కలిగివుండవచ్చు. “నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని ఆయన మనకు అభయమిస్తున్నాడు. (కీర్త. 32:8) యెహోవా మనకు ఎలా సలహా ఇస్తాడు? దాని నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? నేడు యెహోవా తన ప్రజల్ని నడిపిస్తున్నాడనే నమ్మకాన్ని మనం ఎందుకు కలిగివుండవచ్చు? ఈ ప్రశ్నలకు ప్రకటన గ్రంథము ఏమి జవాబిస్తుందో చూద్దాం.

ఉపదేశం మనల్ని కాపాడుతుంది

11. నేడు తన ప్రజల సంఘాల్లోని పరిస్థితుల గురించి యెహోవాకు ఎంత బాగా తెలుసు?

11 ప్రకటన 2, 3 అధ్యాయాల్లో నమోదు చేయబడిన దర్శనంలో, మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ఆసియా మైనరులోని ఏడు సంఘాలను తనిఖీ చేశాడు. ఆయన ఒక సంఘాన్ని మొత్తంగానే కాక నిర్దిష్టంగా కూడా గమనిస్తాడని ఆ దర్శనం చూపిస్తోంది. కొన్ని సందర్భాల్లో, ఆయన కొంతమంది పేర్లను కూడా ప్రస్తావిస్తూ వాళ్లను మెచ్చుకున్నాడు, కావాల్సిన ఉపదేశాలు ఇచ్చాడు. దీన్నిబట్టి మనకేమి అర్థమౌతోంది? ఆ దర్శన నెరవేర్పులో, ఏడు సంఘాలు 1914 తర్వాతి సంవత్సరాల్లోని అభిషిక్త క్రైస్తవులను సూచిస్తున్నాయి, ఆయన ఆ సంఘాలకు ఇచ్చిన ఉపదేశాలు ఇప్పుడు భూవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల సంఘాలన్నిటికీ వర్తిస్తాయి. కాబట్టి, యెహోవా తన కుమారుణ్ణి ఉపయోగించి తన ప్రజల్ని నిర్దేశిస్తున్నాడని అర్థమౌతోంది. ఆ నిర్దేశాల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

12. మనం యెహోవా నిర్దేశాలను ఎలా స్వీకరించవచ్చు?

12 యెహోవా ప్రేమతో ఇస్తున్న నిర్దేశాల నుండి ప్రయోజనం పొందాలంటే మనం వ్యక్తిగత అధ్యయనం చేయాలి. నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ప్రచురించే సాహిత్యాల ద్వారా యెహోవా ఎన్నో లేఖనాధార సలహాలు ఇస్తున్నాడు. (మత్త. 24:45) ఆ సలహాల నుండి ప్రయోజనం పొందాలంటే మనం సమయం తీసుకొని వాటిని అధ్యయనం చేయాలి, నేర్చుకున్న వాటిని అన్వయించుకోవాలి. మనం తప్పు చేయకుండా ఉండేందుకు యెహోవా మనకు సహాయం చేయాలంటే మనం వ్యక్తిగత అధ్యయనం చేయాలి. (యూదా 24) మన ప్రచురణలు చదువుతున్నప్పుడు, ‘ఇది నా కోసమే రాయబడింది’ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దిద్దుబాటు యెహోవా నుండి వస్తున్నట్లుగా భావించి దాన్ని స్వీకరించండి. మీ స్నేహితుడు మిమ్మల్ని తట్టి ఏదైనా విషయాన్ని మీ దృష్టికి తీసుకువచ్చినట్లే, యెహోవా తన ఆత్మను ఉపయోగించి మీ ప్రవర్తనకు లేదా వ్యక్తిత్వానికి సంబంధించిన ఏదైనా ఒక విషయంలో మీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందనేది మీ దృష్టికి తీసుకువస్తాడు. యెహోవా ఆత్మ ఇచ్చే నిర్దేశాలను గుర్తించడం ద్వారా మనం యెహోవా నడిపింపును స్వీకరించవచ్చు. (కీర్తన 139:23, 24 చదవండి.) కాబట్టి, మన అధ్యయన అలవాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవడం మంచిది.

13. మన అధ్యయన అలవాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవడం ఎందుకు మంచిది?

13 వినోదానికి ఎక్కువ సమయం వెచ్చిస్తే వ్యక్తిగత అధ్యయనానికి మనకు సమయం దొరకదు. తాను గమనించిన విషయం గురించి ఒక సహోదరుడు ఇలా అన్నాడు, “వ్యక్తిగత అధ్యయనాన్ని ఇట్టే ఎగ్గొట్టే అవకాశం ఉంది. ముందెన్నడూ లేనంతగా వినోదం అందుబాటులో ఉంది, దానికి ఒకప్పుడైనంత ఖర్చు కూడా అవడం లేదు. అది ఇప్పుడు టీవీలో, కంప్యూటర్‌లో, ఫోనులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మన చుట్టూ వినోదమే ఉంది.” మనం జాగ్రత్తగా లేకపోతే, మనం లోతైన వ్యక్తిగత అధ్యయనానికి వెచ్చించే సమయం తగ్గిపోయి చివరకు దాన్ని మానేసే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. (ఎఫె. 5:15-17) కాబట్టి, మనలో ప్రతీ ఒక్కరం ఈ ప్రశ్నలు వేసుకోవాలి, ‘నేను ఎంత తరచుగా దేవుని వాక్యాన్ని లోతుగా తవ్వుతూ అధ్యయనం చేస్తున్నాను? సంఘంలో ఏదైనా ప్రసంగం ఉన్నప్పుడు మాత్రమే లేదా ఏదైనా భాగం నిర్వహించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అధ్యయనం చేస్తున్నానా?’ ఒకవేళ పరిస్థితి అదే అయితే, రక్షణ కలిగేలా యెహోవా మనల్ని కాపాడడానికి ఇస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు బహుశా మన కుటుంబ ఆరాధనా సమయాన్ని లేదా వ్యక్తిగత అధ్యయన సమయాన్ని ఇంకా చక్కగా ఉపయోగించుకోవడం మంచిది.—సామె. 2:1-5.

ప్రోత్సాహం వల్ల సహించగలుగుతున్నాం

14. యెహోవాకు మన భావాలను అర్థం చేసుకుంటాడని లేఖనాలు ఎలా చూపిస్తున్నాయి?

14 దావీదు తన జీవితంలో ఎన్నో నిరుత్సాహకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. (1 సమూ. 30:3-6) దావీదు రాసిన ప్రేరేపిత మాటలను బట్టి ఆయన భావాలు యెహోవాకు తెలుసని అర్థమౌతోంది. (కీర్తన 34:18; 56:8 చదవండి.) మన భావాలు కూడా యెహోవాకు తెలుసు. ‘విరిగిన హృదయంతో, నలిగిన మనస్సుతో’ బాధపడుతున్నప్పుడు యెహోవా మనకు దగ్గరౌతాడు. ఆ ఆలోచనే మనకు ఎంతో ఓదార్పును ఇస్తుంది. దావీదు విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయనిలా పాడాడు, “నీవు నా బాధను దృష్టించి యున్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి యున్నావు. కావున, నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను.” (కీర్త. 31:7) యెహోవా మన బాధను చూడడమే కాదు, క్రైస్తవ కూటాల ద్వారా మనకు కావాల్సిన ఓదార్పును ఇచ్చి మనల్ని ప్రోత్సహిస్తాడు.

15. ఆసాపు అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

15 కీర్తనకర్తయైన ఆసాపు అనుభవాన్ని చూస్తే కూటాలకు హాజరవడం వల్ల వచ్చే ఒక ప్రయోజనం ఏమిటో తెలుస్తుంది. ఆయన అన్యాయాల గురించే ఆలోచించినందుకు, దేవుని సేవ చేయడం వల్ల ప్రయోజనమేమీ లేదనే భావన ఆయనలో కలిగింది. దాంతో ఆయన నిరుత్సాహపడ్డాడు. ఆయన తన నిరుత్సాహాన్ని ఇలా వర్ణించాడు, “నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.” ఆ భావన వల్ల ఆసాపు దేవుని సేవను దాదాపు ఆపేసే పరిస్థితి వచ్చింది. ఆసాపు ఎలా తన ఆలోచనను సరిదిద్దుకున్నాడు? “దేవుని పరిశుద్ధ స్థలములోనికి” వెళ్లినప్పుడు తన ఆలోచన మారిందని ఆయన అన్నాడు. అక్కడ తోటి యెహోవా ఆరాధకుల మధ్య ఉన్నప్పుడు ఆయన తన ఆలోచనను సరిదిద్దుకున్నాడు. దుష్టుల వైభవం తాత్కాలికమేనని, యెహోవా త్వరలోనే పరిస్థితులను చక్కదిద్దుతాడని ఆయన అర్థం చేసుకున్నాడు. (కీర్త. 73:2, 13-22) మన విషయంలో కూడా అంతే. సాతాను లోకంలోని అన్యాయాలతో పోరాడుతున్నప్పుడు కలిగే ఒత్తిడి వల్ల మనం పూర్తిగా నిరుత్సాహానికి లోనౌతాం. సహోదరులతో కలిసి కూటాలకు హాజరైతే మన మనసు నూతనోత్తేజం పొంది యెహోవా సేవలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం.

16. హన్నా ఉదాహరణ నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

16 ఒకవేళ సంఘంలో తలెత్తిన ఒకానొక పరిస్థితి వల్ల కూటాలకు హాజరవడం మీకు కష్టమనిపిస్తే ఏమి చేయాలి? బహుశా, మీరు ఏదైనా ఒక సేవాధిక్యతను వదులుకోవాల్సి వచ్చినందుకు మీకు అవమానకరంగా అనిపించవచ్చు లేదా ఒక సహోదరునితో/సహోదరితో అభిప్రాయభేదం ఏర్పడివుండవచ్చు. అలాగైతే, హన్నా ఉదాహరణ మీకు సహాయకరంగా ఉంటుంది. (1 సమూయేలు 1:4-8 చదవండి.) సవతియైన పెనిన్నా వల్ల తలెత్తిన ఒక సమస్యతో ఆమె విసిగిపోయింది. ప్రతీ సంవత్సరం షిలోహులో యెహోవాకు బలులు అర్పించేందుకు వెళ్లినప్పుడల్లా సమస్య మరీ విషమంగా తయారైంది. దానివల్ల ఆమె ఎంతగా నిరుత్సాహపడిందంటే, ‘ఆమె భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేది.’ అయినా, ఆమె యెహోవా ఆరాధన చేయడానికి వచ్చిన అవకాశాలను వదులుకోలేదు. ఆమె విశ్వాసాన్ని యెహోవా గమనించి ఆమెను ఆశీర్వదించాడు.—1 సమూ. 1:11, 20.

17, 18. (ఎ) మనం సంఘ కూటాల్లో ఏయే విధాలుగా ప్రోత్సాహాన్ని పొందుతాం? (బి) రక్షణ కలిగేలా యెహోవా మనపై ప్రేమపూర్వక శ్రద్ధ చూపించడం గురించి మీకు ఏమి అనిపిస్తోంది?

17 నేటి క్రైస్తవులు హన్నా మాదిరిని అనుకరిస్తూ, కూటాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలి. కూటాలు మనకు కావాల్సిన ప్రోత్సాహాన్నిస్తాయి. ఇప్పటికే మనం ఆ ప్రోత్సాహాన్ని చవిచూశాం. (హెబ్రీ. 10:24, 25) క్రైస్తవులు చూపించే ప్రేమ వల్ల మనం ఓదార్పును పొందుతాం. ఒక ప్రసంగంలో లేదా వ్యాఖ్యానంలో వచ్చిన ఏదైనా ఒక చిన్న విషయం మన హృదయాన్ని స్పృశించవచ్చు. కూటానికి ముందు లేదా తర్వాత మన బాధలు చెప్పుకుంటున్నప్పుడు ఒక సహోదరుడు/సహోదరి శ్రద్ధగా వినవచ్చు లేదా ఓదార్పుకరంగా మాట్లాడవచ్చు. (సామె. 15:23; 17:17) యెహోవాను స్తుతించడానికి మనం గళమెత్తి పాడినప్పుడు మనం ఎంతో ప్రోత్సాహాన్ని పొందుతాం. ముఖ్యంగా, మన మనసును కలవరపెట్టే ఆలోచనలతో మనం సతమతమౌతున్నప్పుడు కూటాల్లో ఇవ్వబడే ప్రోత్సాహం మనకు అవసరమౌతుంది. మనం సహిస్తూ, చివరివరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేసే తన ‘ఆదరణను’ యెహోవా ఇచ్చేది కూటాల్లోనే.—కీర్త. 94:18, 19.

18 మన దేవుడు చూపించే ప్రేమపూర్వక శ్రద్ధ వల్ల మనం కూడా ఆసాపులాగే భావిస్తాం. ఆయన యెహోవాను ఇలా కీర్తించాడు, “నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు.” (కీర్త. 73:23, 24) మనకు రక్షణ కలిగేలా యెహోవా మనల్ని కాపాడుతున్నందుకు మనం ఆయనకు ఎంత కృతజ్ఞులమో కదా!

[అధ్యయన ప్రశ్నలు]

[28వ పేజీలోని చిత్రం]

యెహోవా మిమ్మల్ని కూడా ఆకర్షించాడు

[30వ పేజీలోని చిత్రం]

యెహోవా ఇచ్చే ఉపదేశాలను అన్వయించుకోవడం వల్ల మనం కాపాడబడుతున్నాం

[31వ పేజీలోని చిత్రం]

మనకు దొరికే ప్రోత్సాహం వల్ల మనం కాపాడబడుతున్నాం