కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ బోధలు సమాజానికి ఎలా ఉపయోగపడతాయి?

క్రైస్తవ బోధలు సమాజానికి ఎలా ఉపయోగపడతాయి?

క్రైస్తవ బోధలు సమాజానికి ఎలా ఉపయోగపడతాయి?

నిజ క్రైస్తవులు రాజకీయాల్లో పాల్గొనరు. మరైతే సమాజాభివృద్ధికి దోహదపడాలనే కోరిక తమకుందని క్రైస్తవులు ఎలా చూపించవచ్చు? యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞను పాటించడం దానికొక మార్గం: ‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులుగా చేయండి; తండ్రియొక్క, కుమారునియొక్క, పరిశుద్ధాత్మయొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిస్తూ నేను మీకు ఏయే సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనమని వారికి బోధించండి.’​—మత్తయి 28:19, 20.

‘శిష్యులుగా చేయండి’ అని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికీ లోకానికి ఉప్పు, వెలుగు అయ్యుండమని ఆయన ఇచ్చిన సూచనను పాటించడానికీ సంబంధం ఉంది. (మత్తయి 5:13, 14) ఏమిటా సంబంధం? ఆ పని ప్రజలకు ఎలా ఉపయోగపడవచ్చు?

క్రీస్తు సందేశం—చెడిపోకుండా కాపాడుతుంది, జ్ఞానోదయం కలిగిస్తుంది

ఉప్పు ఆహార పదార్థాలు పాడైపోకుండా కాపాడుతుంది. అలాగే, సమస్త జనులకు ప్రకటించమని యేసు తన శిష్యులకు ఇచ్చిన సందేశం ప్రజలు చెడిపోకుండా కాపాడుతుంది. యేసు బోధలను విని వాటిని పాటించేవాళ్ళు, నేడు సర్వసాధారణమైపోయిన నైతిక కుళ్ళు నుండి తమను తాము కాపాడుకోగలుగుతారు. ఏ విధంగా? వాళ్ళు పొగత్రాగడం లాంటి ఆరోగ్యానికి హానికలిగించే అలవాట్లకు దూరంగా ఉండడం నేర్చుకుంటారు. ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం లాంటి లక్షణాలను అలవర్చుకుంటారు. (గలతీయులు 5:22, 23) దానివల్ల వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. సమాజానికి మేలు చేసే ఈ సందేశాన్ని తమ పొరుగువారికి చెప్పే క్రైస్తవులు సమాజానికి తమ వంతు సహాయం చేస్తారు.

మరి వెలుగై ఉండడం అంటే ఏమిటి? సూర్యుని నుండి వచ్చే కాంతిని చంద్రుడు ప్రతిబింబించినట్లే, యెహోవా దేవుని నుండి వచ్చే ‘వెలుగును’ క్రీస్తు శిష్యులు ప్రతిబింబిస్తారు. జ్ఞానోదయం కలిగించే సందేశాన్ని ప్రకటిస్తూ మంచి పనులు చేస్తూ వాళ్ళు ఆ వెలుగును ప్రతిబింబిస్తారు.​—1 పేతురు 2:12.

వెలుగై ఉండడానికి, శిష్యులుగా ఉండడానికి మధ్యవున్న పోలికను తెలియజేస్తూ యేసు ఇలా అన్నాడు: ‘మనుషులు దీపం వెలిగించి కుంచం కింద పెట్టరు కానీ అది ఇంట్లో వాళ్ళందరికీ వెలుగివ్వడానికి దీపస్తంభం మీదే పెడతారు. అలాగే మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి.’ ఎత్తైన స్థలంలో పెట్టిన వెలుగుతున్న దీపం, చుట్టూ ఉన్నవాళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నిజ క్రైస్తవులు చేసే ప్రకటనాపని, ఇతర మంచి పనులు తమ చుట్టూ ఉన్నవాళ్ళకు స్పష్టంగా కనిపించాలి. ఎందుకు? ఎందుకంటే ఆ మంచి పనుల్ని చూసే వాళ్ళు మనుషుల్ని కాక దేవుణ్ణి మహిమపరుస్తారని యేసు చెప్పాడు.​—మత్తయి 5:14-16.

అందరికీ ఉన్న బాధ్యత

యేసు, ‘మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు,’ ‘మీ వెలుగు ప్రకాశింపనివ్వండి’ అనే మాటలను శిష్యులందరినీ ఉద్దేశించి చెప్పాడు. యేసు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడం వివిధ మతాలకు చెందిన ఏదో కొంతమంది వల్ల అయ్యేదికాదు. కానీ ఆయన మీద విశ్వాసం ఉంచే వాళ్ళందరూ ‘వెలుగుగా’ ఉన్నారు. ప్రకటించమని యేసు తన అనుచరులకు ఇచ్చిన సందేశాన్ని తమ పొరుగువాళ్ళకు ప్రకటించాల్సిన బాధ్యత తమపై ఉందని దాదాపు 235 కంటే ఎక్కువ దేశాల్లో ఉన్న 70 లక్షలమంది యెహోవాసాక్షుల్లోని ప్రతీ ఒక్కరూ నమ్ముతారు.

యెహోవాసాక్షులు ముఖ్యంగా దేనిగురించి ప్రకటిస్తారు? యేసు తన శిష్యులను సామాజిక, రాజకీయ సంస్కరణల గురించో మతం, ప్రభుత్వం ఐక్యమవడం గురించో మరేదైనా లౌకిక ఆలోచనావిధానం గురించో ప్రకటించమనలేదు. కానీ ఆయన ఇలా ప్రవచించాడు: ‘ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటింపబడుతుంది; అటుతరువాత అంతం వస్తుంది.’ (మత్తయి 24:14) అందుకే నేడు నిజక్రైస్తవులు యేసు ఆజ్ఞకు విధేయత చూపిస్తూ దేవుని రాజ్యం గురించి అంటే సాతాను దుష్ట లోకాన్ని సమూలంగా నాశనం చేసి, నీతియుక్తమైన నూతనలోకాన్ని తీసుకురాగల ఏకైక ప్రభుత్వం గురించి తమ పొరుగువాళ్ళతో చెబుతున్నారు.

బైబిల్లోని నాలుగు సువార్తలు చదువుతున్నప్పుడు, నేటి నిజ క్రైస్తవుల కార్యకలాపాలపై ప్రభావం చూపించే, యేసు పరిచర్యకు సంబంధించిన రెండు ప్రాముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. వాటి గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం. (w12-E 05/01)

[16వ పేజీలోని బ్లర్బ్‌]

క్రైస్తవులు ప్రకటించే సందేశాన్ని ఉప్పుతో ఎందుకు పోల్చవచ్చు?

[17వ పేజీలోని బ్లర్బ్‌]

క్రీస్తు సందేశాన్ని చీకటిలో వెలుగిచ్చే దీపంతో ఎందుకు పోల్చవచ్చు?