కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ‘మర్మాలను బయలుపర్చే’ దేవుడు

యెహోవా ‘మర్మాలను బయలుపర్చే’ దేవుడు

యెహోవా ‘మర్మాలను బయలుపర్చే’ దేవుడు

‘మీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై యున్నాడు.’—దాని. 2:47.

మీరెలా జవాబిస్తారో చూడండి:

భవిష్యత్తు గురించి యెహోవా మనకు ఏయే వివరాలు ఇచ్చాడు?

క్రూర మృగానికి ఉన్న మొదటి ఆరు తలలు వేటిని సూచిస్తున్నాయి?

నెబుకద్నెజరుకు దానియేలు వివరించిన కలలోని ప్రతిమకు, క్రూర మృగానికి మధ్యవున్న సంబంధం ఏమిటి?

1, 2. యెహోవా మనకు ఏమి బయలుపర్చాడు? ఎందుకు?

 దేవుని రాజ్యం మానవ పరిపాలనను అంతం చేసే సమయానికి భూమ్మీద ఏయే ప్రభుత్వాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటాయి? దానికి జవాబు మనకు తెలుసు. ఎందుకంటే ‘మర్మాలను బయలుపర్చే’ దేవుడైన యెహోవా దాన్ని మనకు తెలియజేశాడు. ప్రవక్తయైన దానియేలు, అపొస్తలుడైన యోహాను రాసిన గ్రంథాల్లో ఆ ప్రభుత్వాల్ని గుర్తించడానికి కావాల్సిన వివరాలను యెహోవా మనకు తెలియజేశాడు.

2 యెహోవా వాళ్లిద్దరికి కొన్ని దర్శనాలను ఇచ్చాడు. ఆ దర్శనాల్లో వాళ్లకు ఒకదాని తర్వాత ఒకటిగా కొన్ని మృగాలు కనిపించాయి. అంతేకాక, ఒక దర్శనంలో కనిపించిన పెద్ద లోహపు ప్రతిమ వేటిని సూచిస్తుందో కూడా యెహోవా దానియేలుకు తెలియజేశాడు. యెహోవా వాటన్నిటినీ మన ప్రయోజనం కోసం బైబిల్లో నమోదు చేయించి భద్రపర్చాడు. (రోమా. 15:4) త్వరలోనే తన రాజ్యం మానవ ప్రభుత్వాలన్నిటినీ నిర్మూలం చేస్తుందనే మన నిరీక్షణను బలపర్చడానికే యెహోవా అలా చేశాడు.—దాని. 2:44.

3. దానియేలు, యోహాను రాసిన ప్రేరేపిత భాగాల్ని అర్థంచేసుకోవాలంటే ముందుగా మనం దేన్ని గ్రహించాలి? ఎందుకు?

3 దానియేలు, యోహాను రాసిన భాగాలన్నిటినీ కలిపి చూస్తే, ఎనిమిది మంది రాజులను లేక ఎనిమిది మానవ ప్రభుత్వాలను మనం గుర్తించవచ్చు. అంతేకాక, ఆ ప్రపంచాధిపత్యాల్లో దేని తర్వాత ఏది వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. అయితే, బైబిల్లో నమోదు చేయబడిన మొట్టమొదటి ప్రవచనాన్ని అర్థంచేసుకుంటేనే మనం ఆ ప్రభుత్వాల గురించిన ప్రవచనాల ఖచ్చితమైన భావాన్ని గ్రహించగలుగుతాం. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, బైబిల్లోని లేఖనాలన్నీ, అందులోని ప్రవచనాలన్నీ ఆ ప్రవచనంతోనే ముడిపడి ఉన్నాయి.

సర్పసంతానం, క్రూరమృగం

4. స్త్రీ సంతానంలో ఎవరెవరు ఉన్నారు? ఆ సంతానం ఏమి చేస్తుంది?

4 ఏదెనులో తిరుగుబాటు జరిగిన వెంటనే యెహోవా ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలో, ఒక “స్త్రీ” ఓ ‘సంతానానికి’ జన్మనిస్తుందని ఆయన అన్నాడు. a (ఆదికాండము 3:15 చదవండి.) చివరకు ఆ సంతానం, సర్పంగా వర్ణించబడిన సాతానును తలమీద కొడతాడు. ఆ సంతానం అబ్రాహాము వంశ క్రమంలో, ఇశ్రాయేలు జనాంగంలో, యూదా గోత్రంలో, రాజైన దావీదు వంశంలో పుడతాడని యెహోవా కొంతకాలానికి బయలుపర్చాడు. (ఆది. 22:15-18; 49:10; కీర్త. 89:3, 4; లూకా 1:30-33) క్రీస్తుయేసే ఆ సంతానంలోని ప్రథమ భాగం. (గల. 3:16) రెండవ భాగం, క్రైస్తవ సంఘంలోని ఆత్మాభిషిక్త సభ్యులు. (గల. 3:26-29) యేసు, ఆ అభిషిక్తులు కలిసి దేవుని రాజ్యంగా ఏర్పడతారు. ఆ రాజ్యం ద్వారానే యెహోవా సాతానును చితకతొక్కుతాడు.—లూకా 12:32; రోమా. 16:20.

5, 6. (ఎ) దానియేలు, యోహాను ఎన్ని గొప్ప ఆధిపత్యాల గురించి మాట్లాడారు? (బి) ప్రకటన గ్రంథంలో వర్ణించబడిన క్రూర మృగానికి ఉన్న తలలు వేటిని సూచిస్తున్నాయి?

5 ఏదెనులో యెహోవా చెప్పిన ఆ మొదటి ప్రవచనం, సాతానుకు ఒక ‘సంతానం’ ఉంటుందని కూడా సూచించింది. ఆ సంతానానికి స్త్రీ సంతానం పట్ల శత్రుత్వం లేదా ద్వేషం ఉంటుంది. ఇంతకీ సాతాను సంతానంలో ఎవరెవరు ఉంటారు? సాతానులా దేవుణ్ణి ద్వేషించి ఆయన ప్రజల్ని వ్యతిరేకించేవాళ్లంతా సాతాను సంతానమే. చరిత్రంతటిలో, సాతాను తన సంతానాన్ని వివిధ రాజకీయ శక్తులుగా లేదా రాజ్యాలుగా వ్యవస్థీకరించాడు. (లూకా 4:5, 6) అయితే కొన్ని మానవ రాజ్యాలు మాత్రమే దేవుని ప్రజల మీద అంటే అప్పటి ఇశ్రాయేలీయుల మీదైనా, ఇప్పటి అభిషిక్త క్రైస్తవుల సంఘం మీదైనా ఎంతగానో ప్రభావం చూపించాయి. ఈ వాస్తవం గురించి ఎందుకు తెలుసుకోవాలి? అది తెలుసుకుంటేనే దానియేలుకు, యోహానుకు కలిగిన దర్శనాలు ఎందుకు అలాంటి ఎనిమిది గొప్ప ఆధిపత్యాలను మాత్రమే వర్ణిస్తున్నాయో అర్థంచేసుకోగలుగుతాం.

6 పునరుత్థానం చేయబడిన యేసు సా.శ. మొదటి శతాబ్దం ముగింపులో అపొస్తలుడైన యోహానుకు ఆశ్చర్యం కలిగించే కొన్ని దర్శనాలను ఇచ్చాడు. (ప్రక. 1:1) ఒక దర్శనంలో, ఘటసర్పంగా వర్ణించబడిన అపవాది సముద్ర తీరాన నిలబడి ఉండడాన్ని యోహాను చూశాడు. (ప్రకటన 12:17–13:1, 2 చదవండి.) అంతేకాక, ఆ సముద్రంలో నుండే ఒక విచిత్రమైన మృగం పైకి వచ్చినట్లు, అది అపవాది నుండి గొప్ప అధికారాన్ని పొందినట్లు కూడా యోహాను చూశాడు. ప్రకటన 13:1లో వర్ణించబడిన మృగపు ప్రతిమయైన ఎర్రని క్రూర మృగానికి ఉన్న ఏడు తలలు ‘ఏడుగురు రాజుల్ని’ లేక ఏడు ప్రభుత్వాల్ని సూచిస్తున్నాయని ఒక దేవదూత ఆ తర్వాత యోహానుకు తెలియజేశాడు. (ప్రక. 13:14, 15; 17:3, 9, 10) యోహాను ఆ మాటలు రాసే సమయానికి ఐదుగురు రాజులు కూలిపోయారు, ఒకరు రాజ్యాధికారంలో ఉన్నారు, చివరి రాజు “ఇంకను రాలేదు.” ఆ రాజ్యాల్ని లేక ప్రపంచాధిపత్యాల్ని ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు మనం, ప్రకటన గ్రంథంలో వర్ణించబడిన మృగానికి ఉన్న ఒక్కొక్క తల గురించి పరిశీలిద్దాం. ఆ రాజ్యాల్లో చాలావాటి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దానియేలు రాసిన విషయాలు ఎలా సహాయం చేస్తాయో కూడా చూద్దాం. కొన్ని రాజ్యాల గురించైతే అవి ఉనికిలోకి రావడానికి ఎన్నో శతాబ్దాల క్రితమే దానియేలు రాశాడు.

మొదటి రెండు తలలు—ఐగుప్తు, అష్షూరు

7. మొదటి తల దేన్ని సూచిస్తుంది? అలాగని ఎందుకు చెప్పవచ్చు?

7 క్రూర మృగానికి ఉన్న తలల్లో మొదటిది ఐగుప్తును సూచిస్తుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, దేవుని ప్రజల్ని శత్రువులుగా చూసిన మొదటి పెద్ద రాజకీయ శక్తి ఐగుప్తే. మనం ముందు చూసినట్లుగా వాగ్దానం చేయబడిన స్త్రీ సంతానం అబ్రాహాము వంశంలో నుండి వస్తాడు. ఐగుప్తులో అబ్రాహాము వంశస్థుల సంఖ్య అంటే, ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని ఎంతో కష్టపెట్టారు. వాగ్దాన సంతానం రాకముందే దేవుని ప్రజలు తుడిచిపెట్టుకుపోయేలా చేయడానికి సాతాను ప్రయత్నించాడు. ఎలా? ఇశ్రాయేలీయులకు పుట్టిన ప్రతీ మగ శిశువును చంపేసే విధంగా సాతాను ఫరోను ప్రేరేపించాడు. యెహోవా ఆ ప్రయత్నాన్ని విఫలం చేసి తన ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేశాడు. (నిర్గ. 1:15-20; 14:13) ఆ తర్వాత వాళ్లు వాగ్దానదేశంలో స్థిరపడేటట్లు చేశాడు.

8. రెండవ తల దేన్ని సూచిస్తుంది? అది ఏమి చేయడానికి ప్రయత్నించింది?

8 మృగానికి ఉన్న రెండవ తల అష్షూరును సూచిస్తుంది. శక్తివంతమైన ఈ రాజ్యం కూడా దేవుని ప్రజల్ని మట్టుపెట్టడానికి ప్రయత్నించింది. ఇశ్రాయేలు పది గోత్రాల ప్రజలు విగ్రహారాధన చేసినందుకు, తిరుగుబాటు చేసినందుకు వాళ్లను శిక్షించడానికి యెహోవా అష్షూరీయులను పావుగా వాడుకున్నాడన్నది నిజమే. కానీ, అష్షూరీయులు ఆ తర్వాత యెరూషలేముపై దాడి చేశారు. యేసు రావాల్సిన రాజరిక వంశాన్ని నామరూపాల్లేకుండా చేయాలని సాతాను అనుకొని ఉంటాడు. అష్షూరీయులు యెరూషలేముపై దాడి చేయాలన్నది యెహోవా ఉద్దేశం కాదు కాబట్టి ఆయన అష్షూరు సైన్యాలను నాశనం చేయడం ద్వారా నమ్మకమైన తన ప్రజల్ని అద్భుతరీతిలో కాపాడాడు.—2 రాజు. 19:32-35; యెష. 10:5, 6, 12-15.

మూడవ తల—బబులోను

9, 10. (ఎ) ఇశ్రాయేలీయుల్ని ఏమి చేసేందుకు యెహోవా బబులోనీయుల్ని అనుమతించాడు? (బి) మెస్సీయకు సంబంధించిన ప్రవచనం నెరవేరాలంటే ఏమేమి జరగాలి?

9 దర్శనంలో యోహాను చూసిన మృగానికి ఉన్న మూడవ తల బబులోను రాజధానిగా ఉన్న రాజ్యాన్ని సూచిస్తోంది. బబులోనీయులు వచ్చి యెరూషలేమును నాశనం చేసి తన ప్రజల్ని చెరగా తీసుకుపోవడానికి యెహోవా అనుమతించాడు. అయితే, తిరుగుబాటు కారణంగా ఇశ్రాయేలీయులు అలా చెరగా తీసుకొనిపోబడతారని యెహోవా ఆ సంఘటన జరగడానికి ముందే వాళ్లను హెచ్చరించాడు. (2 రాజు. 20:16-18) యెరూషలేములో “యెహోవా సింహాసనం” మీద కూర్చొనే రాజరిక వంశం ఇక ఉండదని యెహోవా ప్రవచించాడు. (1 దిన. 29:23) అయితే, రాజైన దావీదు వంశం నుండి ఒక “స్వాస్థ్యకర్త” వచ్చి ఆ అధికారాన్ని తిరిగి చేపడతాడని కూడా యెహోవా వాగ్దానం చేశాడు.—యెహె. 21:25-27.

10 వాగ్దానం చేయబడిన మెస్సీయ లేక అభిషిక్తుడు వచ్చే సమయానికి యూదులు ఇంకా యెరూషలేము దేవాలయంలో యెహోవాను ఆరాధిస్తుంటారని మరో ప్రవచనం సూచించింది. (దాని. 9:24-27) అభిషిక్తుడు బేత్లెహేములో పుడతాడని ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగా తీసుకొనిపోబడకముందు రాయబడిన ఒక ప్రవచనం చెప్పింది. (మీకా 5:2) ఆ ప్రవచనాలు నెరవేరాలంటే యూదులు చెర నుండి విడుదలై, స్వదేశానికి తిరిగి వచ్చి ఆలయాన్ని మళ్లీ కట్టాలి. అయితే, బబులోనీయులు ఎవరినైనా ఒకసారి చెరగా తీసుకుపోయారంటే, వాళ్లను విడుదల చేసే ప్రసక్తే ఉండేది కాదు. మరి ఆ చిక్కుముడి ఎలా వీడింది? యెహోవా తన ప్రవక్తల ద్వారా దాన్ని బయలుపర్చాడు.—ఆమో. 3:7.

11. ఏవేవి బబులోను సామ్రాజ్యాన్ని సూచించాయి? (అధస్సూచి చూడండి.)

11 బబులోనుకు చెరగా తీసుకొనిపోబడిన వాళ్లలో దానియేలు ప్రవక్త కూడా ఉన్నాడు. (దాని. 1:1-6) అప్పుడు ప్రపంచాధిపత్యంగా ఉన్న బబులోను తర్వాత వరుసగా వచ్చే ప్రపంచాధిపత్యాల గురించి యెహోవా దానియేలు ద్వారా బయలుపర్చాడు. వివిధ రూపాలను ఉపయోగించి యెహోవా ఆ రహస్యాలను వెల్లడించాడు. ఉదాహరణకు యెహోవా, వివిధ లోహాలతో చేయబడిన ఒక పెద్ద ప్రతిమ బబులోను రాజైన నెబుకద్నెజరుకు కలలో కనిపించేలా చేశాడు. (దానియేలు 2:1, 19, 31-38 చదవండి.) ఆ ప్రతిమలోని బంగారు తల బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుందని యెహోవా దానియేలు ద్వారా బయలుపర్చాడు. b ఆ తర్వాత, ఆ ప్రతిమలోని వెండి రొమ్మూ భుజాలూ బబులోను తర్వాత తెర మీదికి వచ్చే ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తున్నాయి. ఇంతకీ ఆ ప్రపంచాధిపత్యం ఏది? అది దేవుని ప్రజలతో ఎలా వ్యవహరించింది?

నాలుగవ తల—మాదీయ పారసీక సామ్రాజ్యం

12, 13. (ఎ) బబులోను ఓటమి గురించి యెహోవా ఏమి బయలుపర్చాడు? (బి) మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని క్రూర మృగానికి ఉన్న నాలుగవ తలగా వర్ణించడం ఎందుకు సబబు?

12 బబులోనును ఏ ప్రపంచాధిపత్యం జయిస్తుందో దానియేలు జీవించడానికి వంద కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితమే ప్రవక్తయైన యెషయా ద్వారా యెహోవా బయలుపర్చాడు. బబులోను పట్టణం ఎలా ఓటమి పాలౌతుందో చెప్పడమే కాక, దాన్ని ఓడించే రాజు పేరును కూడా యెహోవా వెల్లడించాడు. ఆయన పేరు కోరెషు, ఆయన పారసీక దేశస్థుడు. (యెష. 44:28–45:2) మాదీయ పారసీక ప్రపంచాధిపత్యం గురించి దానియేలుకు రెండు వేరే దర్శనాలు కూడా కలిగాయి. ఒక దర్శనంలో ఆ రాజ్యం ఒక ఎలుగుబంటితో పోల్చబడింది, “విస్తారముగా మాంసము భక్షించుము” అని దానికి చెప్పబడింది. (దాని. 7:5) దానియేలుకు కలిగిన వేరే దర్శనంలో, ఈ సంయుక్త ప్రపంచాధిపత్యం రెండు కొమ్ములు గల పొట్టేలులా కనిపించింది.—దాని. 8:3, 20.

13 మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని బబులోను సామ్రాజ్యాన్ని కూలద్రోసి, ఇశ్రాయేలీయులను స్వదేశానికి తీసుకురావడం ద్వారా యెహోవా తన ప్రవచనాన్ని నెరవేర్చాడు. (2 దిన. 36:22, 23) అయితే ఒక సమయంలో, ఈ మాదీయ పారసీక సామ్రాజ్యం దేవుని ప్రజల్ని మట్టుబెట్టడానికి ప్రయత్నించింది. పారసీక సామ్రాజ్యంలో ప్రధాన అధిపతిగా ఉన్న హామాను పన్నిన పన్నాగం గురించి బైబిల్లోని ఎస్తేరు గ్రంథంలో ఉంది. హామాను విస్తారమైన పారసీక సామ్రాజ్యంలో ఉన్న యూదులందర్నీ తుడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేసి, ఆ జాతి నిర్మూలన కోసం ఒక తేదీని కూడా నిర్ణయించాడు. యెహోవా జోక్యం చేసుకోవడం వల్లే ఆయన ప్రజలు సాతాను సంతానం చేతుల్లో బలి కాకుండా మరోసారి తప్పించుకోగలిగారు. (ఎస్తే. 1:1-3; 3:8, 9; 8:3, 9-14) కాబట్టి, మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని ప్రకటన గ్రంథంలోని మృగానికి ఉన్న నాలుగవ తలగా వర్ణించడం సబబే.

ఐదవ తల—గ్రీసు

14, 15. ప్రాచీన గ్రీసు సామ్రాజ్యం గురించి యెహోవా ఏయే వివరాలు బయలుపర్చాడు?

14 ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన క్రూర మృగానికి ఉన్న ఐదవ తల గ్రీసును సూచిస్తుంది. నెబుకద్నెజరుకు దానియేలు వివరించిన కలలోని ప్రతిమకున్న ఇత్తడి ఉదరమూ తొడలూ ఈ ప్రపంచాధిపత్యాన్నే సూచిస్తున్నాయి. దానియేలుకు కలిగిన మరో రెండు దర్శనాల్లో, ఈ ప్రపంచాధిపత్యం ఎలాంటిదనే దాని గురించి, ఆ సామ్రాజ్యపు అత్యంత ప్రసిద్ధమైన పరిపాలకుని గురించి కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు ఇవ్వబడ్డాయి.

15 ఆ దర్శనాల్లోని ఒక దానిలో, గ్రీసు సామ్రాజ్యాన్ని సూచిస్తున్న నాలుగు రెక్కలు గల చిరుత పులిని దానియేలు చూశాడు. ఆ సామ్రాజ్యం అతి వేగంగా విజయాలు సాధిస్తుందని ఆ చిరుతపులి సూచిస్తుంది. (దాని. 7:6) రెండవ దానిలో దానియేలు ప్రసిద్ధమైన ఒక్క కొమ్ము గల మేకపోతును చూశాడు. అది మాదీయ పారసీక సామ్రాజ్యానికి సూచనగా ఉన్న రెండు కొమ్ముల పొట్టేలును వేగంగా చంపేస్తుంది. ఆ మేకపోతు గ్రీసు సామ్రాజ్యాన్ని సూచిస్తుందని, దానికున్న పెద్ద కొమ్ము ఆ సామ్రాజ్యానికి చెందిన ఒక రాజును సూచిస్తుందని యెహోవా దానియేలుకు బయలుపర్చాడు. అయితే, ఆ పెద్ద కొమ్ము విరిగిపోయి, దాని స్థానంలో నాలుగు చిన్న కొమ్ములు పుట్టినట్లు దానియేలు చూశాడు. గ్రీసు సామ్రాజ్యం తెర మీదికి రావడానికి దాదాపు రెండు శతాబ్దాల క్రితమే ఈ ప్రవచనం రాయబడినా, దానిలోని ప్రతీ చిన్న వివరం నెరవేరింది. ప్రాచీన గ్రీసు సామ్రాజ్యపు ప్రసిద్ధ పరిపాలకుడైన అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ నాయకత్వంలో మాదీయ పారసీక సామ్రాజ్యం కూలిపోయింది. అయితే అతి తక్కువ సమయంలోనే ఈ కొమ్ము విరిగి పోయింది, అంటే ఆధిపత్యంలో తారాస్థాయికి చేరుకున్న ఆ రాజు కేవలం 32 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. ఆ తర్వాత, ఆయన కింద పనిచేస్తున్న నలుగురు అధిపతులు చివరకు రాజ్యాన్ని పంచుకున్నారు.—దానియేలు 8:20-22 చదవండి.

16. ఆంటియోకసు IV ఏమి చేశాడు?

16 పారసీక సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత గ్రీసు సామ్రాజ్యం దేవుని ప్రజల్ని పరిపాలించింది. ఆ సమయానికల్లా యూదులు వాగ్దానదేశానికి తిరిగి వచ్చి, యెరూషలేము దేవాలయాన్ని మళ్లీ కట్టారు. అప్పటికి వాళ్లింకా దేవుడు ఎంచుకున్న జనాంగంగానే ఉన్నారు, యెరూషలేము దేవాలయంలో సత్యారాధన చేస్తున్నారు. అయితే సా.శ.పూ. రెండవ శతాబ్దంలో, క్రూర మృగానికి ఉన్న ఐదవ తలయైన గ్రీసు దేవుని ప్రజలపై దాడి చేసింది. అలెగ్జాండర్‌ సామ్రాజ్యం చీలిపోయినప్పుడు ఏర్పడిన రాజ్యాల్లోని ఒక రాజ వంశానికి చెందిన ఆంటియోకసు IV, యెరూషలేము దేవాలయంలో ఒక అన్యమత బలిపీఠాన్ని పెట్టించాడు, అంతేకాక యూదా మతాన్ని అవలంబించడం మరణశిక్షకు తగిన నేరమనే చట్టాన్ని ప్రవేశపెట్టాడు. సాతాను సంతానంలో భాగమైన వాళ్లు ఆ పనిచేసి ఎంత ద్వేషాన్ని వెళ్లగ్రక్కారో కదా! అయితే, కొంతకాలానికి గ్రీసు ప్రపంచాధిపత్యం కూలిపోయింది. మరి, క్రూర మృగానికి ఉన్న ఆరవ తల దేన్ని సూచిస్తుంది?

ఆరవ తల—‘ఘోరమైన, భయంకరమైన’ రోము

17. ఆదికాండము 3:15లోని ప్రవచన నెరవేర్పులో ఆరవ తల ఎలాంటి కీలకమైన పాత్ర పోషించింది?

17 యోహానుకు క్రూర మృగం గురించిన దర్శనం కలిగే సమయానికి రోము ప్రపంచాధిపత్యంగా ఉంది. (ప్రక. 17:10) ఆదికాండము 3:15లోని ప్రవచన నెరవేర్పులో ఈ ఆరవ తల కీలకమైన పాత్ర పోషించింది. సాతాను రోమా అధికారులను ఉపయోగించుకొని స్త్రీ సంతానం “మడిమె మీద” కొట్టి, ఆ సంతానాన్ని తాత్కాలికంగా అశక్తుణ్ణి చేశాడు. ఎలా? రాజద్రోహం చేశాడనే అబద్ధ ఆరోపణతో యేసును విచారణకు అప్పగించి మరణశిక్ష విధించారు. (మత్త. 27:26) యెహోవా యేసును పునరుత్థానం చేశాడు కాబట్టి “మడిమె మీద” తగిలిన గాయం త్వరగా మానిపోయింది.

18. (ఎ) యెహోవా ఏ కొత్త జనాంగాన్ని ఎంచుకున్నాడు? ఎందుకు? (బి) స్త్రీ సంతానం మీద సాతాను సంతానం ఎలా ద్వేషాన్ని వెళ్లగ్రక్కుతూనే ఉంది?

18 ఇశ్రాయేలు మతనాయకులు రోమా ప్రతినిధులతో కుమ్మక్కై యేసుకు వ్యతిరేకంగా కుట్రపన్నారు, చాలామంది ఇశ్రాయేలీయులు కూడా యేసును తిరస్కరించారు. అందుకే, సహజ ఇశ్రాయేలీయుల్ని తన నిబంధన ప్రజలుగా పరిగణించేందుకు యెహోవా నిరాకరించాడు. (మత్త. 23:38; అపొ. 2:22, 23) ఆ తర్వాత ఆయన ఒక కొత్త జనాంగాన్ని అంటే, “దేవుని ఇశ్రాయేలును” ఎంచుకున్నాడు. (గల. 3:26-29; 6:16) యూదులూ అన్యులతో కూడిన అభిషిక్త క్రైస్తవ సంఘమే ఆ కొత్త జనాంగం. (ఎఫె. 2:11-18) యేసు చనిపోయి, పునరుత్థానం చేయబడిన తర్వాత కూడా స్త్రీ సంతానం మీద సాతాను సంతానం ద్వేషాన్ని వెళ్లగ్రక్కుతూనే ఉంది. స్త్రీ సంతానంలో రెండవ భాగమైన అభిషిక్త క్రైస్తవ సంఘాన్ని తుడిచిపెట్టడానికి రోమా సామ్రాజ్యం ఎన్నోసార్లు ప్రయత్నించింది. c

19. (ఎ) దానియేలు ఆరవ ప్రపంచాధిపత్యాన్ని ఎలా వర్ణించాడు? (బి) మరో ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

19 నెబుకద్నెజరుకు దానియేలు వివరించిన కలలోని ప్రతిమకున్న ఇనుప మోకాళ్లు రోము ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తున్నాయి. (దాని. 2:33) దానియేలు చూసిన మరో దర్శనంలో, రోమా సామ్రాజ్యం గురించే కాక దాని నుండి పుట్టే తర్వాతి ప్రపంచాధిపత్యం గురించి కూడా ఉంది. (దానియేలు 7:7, 8 చదవండి.) ఎన్నో వందల సంవత్సరాల వరకు రోమా సామ్రాజ్యం శత్రువులకు ‘ఘోరమైనదిగా, భయంకరమైనదిగా, మహాబల మహాత్మ్యములు గలదిగా’ కనిపించింది. అయితే, ఈ సామ్రాజ్యం నుండే “పది కొమ్ములు” పుట్టుకొస్తాయని, వాటిలో ఒకటి ఎంతో ప్రసిద్ధికెక్కుతుందని ప్రవచనం ముందే చెప్పింది. ఇంతకీ ఆ పది కొమ్ములు వేటిని సూచిస్తున్నాయి? వాటిలో ప్రసిద్ధికెక్కిన ఆ చిన్న కొమ్ము దేన్ని సూచిస్తుంది? నెబుకద్నెజరు కలలో చూసిన ఆ పెద్ద ప్రతిమ వివరణకు, ఆ చిన్న కొమ్ముకు సంబంధమేమిటి? ఈ ప్రశ్నలకు 14వ పేజీలో మొదలయ్యే ఆర్టికల్‌లో జవాబులు చూస్తాం.

[అధస్సూచీలు]

a ఈ “స్త్రీ” పరలోకంలో ఉన్న ఆత్మ ప్రాణులతో కూడిన సంస్థను సూచిస్తుంది. ఆ సంస్థ యెహోవాకు భార్య లాంటిది.—యెష. 54:1; గల. 4:26; ప్రక. 12:1, 2

b దానియేలు గ్రంథంలో ప్రస్తావించబడిన ప్రతిమలోని తల, ప్రకటన గ్రంథంలో వర్ణించబడిన క్రూర మృగానికి ఉన్న మూడవ తల బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తున్నాయి. 12-13 పేజీల్లోని చార్టు చూడండి.

c సా.శ. 70లో రోమన్లు యెరూషలేమును నాశనం చేసినప్పటికీ, ఆగ్రహంతో కూడిన ఆ పని ఆదికాండము 3:15 నెరవేర్పులో భాగం కాదు. ఆ సమయానికల్లా, సహజ ఇశ్రాయేలీయులు దేవుని నిబంధన జనాంగంగా లేరు.

[అధ్యయన ప్రశ్నలు]