కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“త్వరలో సంభవింపనైయున్న” వాటిని యెహోవా బయలుపర్చాడు

“త్వరలో సంభవింపనైయున్న” వాటిని యెహోవా బయలుపర్చాడు

“త్వరలో సంభవింపనైయున్న” వాటిని యెహోవా బయలుపర్చాడు

‘త్వరలో సంభవింపనైయున్న సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత.’—ప్రక. 1:1.

మీరెలా జవాబిస్తారో చూడండి:

దానియేలు వివరించిన ప్రతిమలోని ఏ భాగాలు ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తున్నాయి?

ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యానికి, ఐక్యరాజ్యసమితికి మధ్య ఉన్న సంబంధాన్ని యోహాను ఎలా వర్ణించాడు?

మానవ ప్రభుత్వాల అంతాన్ని దానియేలు, యోహాను ఎలా చిత్రీకరించారు?

1, 2. (ఎ) దానియేలు గ్రంథంలోని ప్రవచనాలు, ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలు వేటిని అర్థంచేసుకోవడానికి మనకు సహాయం చేస్తాయి? (బి) క్రూర మృగానికి ఉన్న మొదటి ఆరు తలలు వేటికి సూచనగా ఉన్నాయి?

 దానియేలు గ్రంథంలోని ప్రవచనాలు, ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగివున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న వాటిని, భవిష్యత్తులో జరగబోయే వాటిని మనం అర్థంచేసుకోవడానికి అది సహాయం చేస్తుంది. యోహాను చూసిన క్రూర మృగాన్ని, దానియేలు చూసిన పది కొమ్ములు గల భయంకరమైన మృగాన్ని, దానియేలు వివరించిన కలలోని ప్రతిమను పోల్చి చూడడం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు? ఆ ప్రవచనాల స్పష్టమైన భావాన్ని గ్రహించి మనం ఏమి చేయాలి?

2 ముందుగా మనం, దర్శనంలో యోహాను చూసిన క్రూర మృగం గురించి పరిశీలిద్దాం. (ప్రక., 13వ అధ్యా.) మృగానికి ఉన్న మొదటి ఆరు తలలు ఐగుప్తుకు, అష్షూరుకు, బబులోనుకు, మాదీయ పారసీక రాజ్యానికి, గ్రీసుకు, రోముకు సూచనగా ఉన్నాయని మనం ముందటి ఆర్టికల్‌లో చూశాం. ఆ ప్రపంచాధిపత్యాలన్నీ స్త్రీ సంతానంపై ద్వేషాన్ని వెళ్లగ్రక్కాయి. (ఆది. 3:15) యోహాను తనకు కలిగిన దర్శనం గురించి రాసిన తర్వాత ఎన్నో వందల సంవత్సరాల వరకు ఆరవ తలయైన రోము ఆధిపత్యం చెలాయించే రాజకీయ శక్తిగా కొనసాగింది. అలా చాలా ఏళ్లు గడిచాక రోము స్థానాన్ని ఏడవ తల ఆక్రమించింది. ఇంతకీ ఏ రాజ్యం ఏడవ తలగా ఉనికిలోకి వచ్చింది? స్త్రీ సంతానంతో అదెలా వ్యవహరించింది?

బ్రిటన్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆధిపత్యంలోకి వచ్చాయి

3. దానియేలు దర్శనంలోని భయంకరమైన మృగం దేన్ని సూచించింది? దానికి ఉన్న పది కొమ్ములు వేటిని సూచిస్తున్నాయి?

3 యోహానుకు కలిగిన దర్శనాన్ని, పది కొమ్ముల భయంకరమైన మృగం గురించి దానియేలుకు వచ్చిన దర్శనంతో పోల్చి చూస్తే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ప్రస్తావించబడిన క్రూర మృగానికి ఉన్న ఏడవ తలను మనం గుర్తించవచ్చు. a (దానియేలు 7:7, 8, 23, 24 చదవండి.) దర్శనంలో దానియేలు చూసిన మృగం ప్రపంచాధిపత్యమైన రోమా సామ్రాజ్యాన్ని సూచించింది. (12-13 పేజీల్లోని చార్టు చూడండి.) అయితే, సా.శ. ఐదవ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం ముక్కలైపోవడం మొదలైంది. దానియేలు దర్శనంలోని భయంకరమైన మృగానికి ఉన్న పది కొమ్ములు రోమా సామ్రాజ్యం నుండి పుట్టుకొచ్చిన రాజ్యాలను సూచిస్తున్నాయి.

4, 5. (ఎ) చిన్న కొమ్ము ఏమి చేసింది? (బి) ఏది క్రూర మృగానికి ఉన్న ఏడవ తల అయ్యింది?

4 భయంకరమైన ఆ మృగానికున్న నాలుగు కొమ్ముల లేదా రాజ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. “ఒక చిన్న కొమ్ము” మూడు కొమ్ముల్ని పెరికివేసింది. ఒకప్పుడు రోమా సామ్రాజ్యంలో భాగంగా ఉన్న బ్రిటన్‌ ప్రసిద్ధికెక్కినప్పుడు అది జరిగింది. 17వ శతాబ్దం వరకు బ్రిటన్‌కు అంత ఆధిపత్యం లేదు. కానీ ప్రాచీన రోమా సామ్రాజ్యంలోని మూడు ఇతర రాజ్యాలైన స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌ మాత్రం దానికన్నా ఎక్కువ అధికారాన్ని చెలాయించాయి. బ్రిటన్‌ ఆ రాజకీయ శక్తులను ఒకదాని తర్వాత ఒకటిగా వాటి అధికార స్థానాల నుండి పెరికివేసింది. 18వ శతాబ్దం మధ్య భాగంలో, బ్రిటన్‌ అత్యంత శక్తివంతమైన రాజ్యంగా తెర మీదికి వచ్చే దిశలో ప్రగతి సాధించడం కనిపించింది. కానీ, అప్పటికింకా అది క్రూర మృగానికి ఉన్న ఏడవ తల కాలేదు.

5 బ్రిటన్‌ అత్యంత శక్తివంతమైన రాజ్యంగా తెర మీదికి వచ్చినా, ఉత్తర అమెరికాలోని కాలనీలు ఒకదాని తర్వాత ఒకటి వేరైపోయాయి. బ్రిటీష్‌ నౌకాదళాల మద్దతుతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు శక్తివంతంగా తయారయ్యాయి. 1914లో ప్రభువు దినం మొదలయ్యే సమయానికి, చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెద్ద సామ్రాజ్యంగా బ్రిటన్‌ రూపుదిద్దుకుంది, అమెరికా సంయుక్త రాష్ట్రాలేమో భూమ్మీద అత్యంత గొప్ప పారిశ్రామిక వ్యవస్థగా తయారయ్యాయి. b మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు బ్రిటన్‌తో ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నాయి. దాంతో అది ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యంగా ఏర్పడి మృగానికి ఉన్న ఏడవ తల అయ్యింది. ఈ ఏడవ తల స్త్రీ సంతానంతో ఎలా వ్యవహరించింది?

6. ఏడవ తల దేవుని ప్రజలతో ఎలా వ్యవహరించింది?

6 ప్రభువు దినం మొదలైన కొంతకాలానికే, ఏడవ తల దేవుని ప్రజలపై అంటే భూమ్మీద మిగిలి ఉన్న క్రీస్తు సహోదరులపై దాడి చేసింది. (మత్త. 25:40) తన ప్రత్యక్షతా కాలంలో స్త్రీ సంతానంలోని మిగిలిన సభ్యులు ఈ భూమ్మీద చురుగ్గా పనిచేస్తారని యేసు సూచించాడు. (మత్త. 24:45-47; గల. 3:26-29) ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం ఆ పరిశుద్ధులతోనే యుద్ధం చేసింది. (ప్రక. 13:3, 7) మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, ఆ ప్రపంచాధిపత్యం దేవుని ప్రజల్ని అణచివేసింది, వాళ్ల ప్రచురణల్లో కొన్నింటిని నిషేధించింది, నమ్మకమైన దాసుని తరగతి ప్రతినిధుల్ని జైళ్లలో వేసింది. ఆ క్రూర మృగానికి ఉన్న ఏడవ తల కొంతకాలంపాటు ప్రకటనాపనిని ‘చంపేసినంత’ అంటే, ఆపేసినంత పనిచేసింది. ఈ నాటకీయ సంఘటన జరుగుతుందని యెహోవా ముందే తెలిసికొని, దాన్ని యోహానుకు బయలుపర్చాడు. స్త్రీ సంతానంలోని రెండవ భాగం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో తిరిగి పుంజుకుంటుందని కూడా ఆయన యోహానుకు చెప్పాడు. (ప్రక. 11:3, 7-11) యెహోవా సేవకుల ఆధునిక చరిత్రను చూస్తే ఆ ప్రవచనాల్లోని సంఘటనలు జరిగాయని స్పష్టంగా అర్థమౌతుంది.

ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం, మట్టీ ఇనుమూ కలిసిన పాదాలు

7. క్రూర మృగానికి ఉన్న ఏడవ తలకూ దానియేలు వివరించిన కలలోని ప్రతిమకూ మధ్య ఉన్న సంబంధమేమిటి?

7 క్రూర మృగానికి ఉన్న ఏడవ తలకూ దానియేలు వివరించిన కలలోని ప్రతిమకూ మధ్య ఉన్న సంబంధమేమిటి? బ్రిటన్‌ రోమా సామ్రాజ్యంలో నుండి పుట్టింది, అమెరికా సంయుక్త రాష్ట్రాలు బ్రిటన్‌ నుండి పుట్టాయి కాబట్టి, ఒక విధంగా అవి కూడా రోమా సామ్రాజ్యంలో నుండే పుట్టాయి. మరి ప్రతిమ పాదాల విషయమేమిటి? అవి మట్టీ ఇనుమూ కలిసిన పాదాలని ప్రవచనం వర్ణించింది. (దానియేలు 2:41-43 చదవండి.) పాదాల గురించిన ఆ వర్ణన, ఏడవ తలయైన ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం ప్రసిద్ధికెక్కిన కాలం గురించి చెబుతోంది. మట్టి కలిసిన ఇనుముతో చేయబడిన వస్తువు స్వచ్ఛమైన ఇనుప వస్తువు కన్నా బలహీనంగా ఉంటుంది. అలాగే, ఇనుము లాంటి ప్రపంచాధిపత్యమైన రోమా సామ్రాజ్యం నుండి పుట్టిన ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం దానికన్నా బలహీనంగా ఉంటుందన్న మాట. ఎలా?

8, 9. (ఎ) ఏడవ ప్రపంచాధిపత్యం ఇనుము లాంటి శక్తిని ఎలా ప్రదర్శించింది? (బి) ప్రతిమ పాదాల్లోని మట్టి దేన్ని సూచిస్తుంది?

8 కొన్ని సందర్భాల్లో ఏడవ తల ఇనుము లాంటి లక్షణాలను కనబర్చింది. ఉదాహరణకు, అది మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచి తన శక్తిని నిరూపించుకుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సైతం అది ఇనుము లాంటి శక్తిని చూపించింది. c యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఏడవ తల కొన్నిసార్లు ఇనుము లాంటి లక్షణాలను చూపించింది. అయితే, ముందు నుంచే ఇనుము మట్టితో మిళితమై ఉంది.

9 దానియేలు వివరించిన కలలోని ప్రతిమ పాదాలకున్న అలంకారిక భావాన్ని అర్థంచేసుకోవడానికి యెహోవా సేవకులు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇనుము, మట్టి మిశ్రమం చాలా రాజ్యాలు కాదుగానీ ఒకే “రాజ్యము” అని దానియేలు 2:41 చూపిస్తోంది. కాబట్టి, మట్టి ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం కిందవున్న సమాజాలను సూచిస్తోంది. వాటివల్లే ఆ ప్రపంచాధిపత్యం స్వచ్ఛమైన ఇనుము లాంటి రోమా సామ్రాజ్యం కన్నా బలహీనమైనదిగా అవుతుంది. మట్టి అంటే “మనుష్యజాతులు” లేక సామాన్య ప్రజలు అని లేఖనంలో ఉంది. (దాని. 2:43) ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం కింద ఉన్న ప్రజలు పౌర హక్కుల ఉద్యమాల పేరిట, లేబర్‌ యూనియన్ల పేరిట, స్వాతంత్రోద్యమాల పేరిట తమ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ ప్రపంచాధిపత్యం ఇనుము లాంటి శక్తిని చూపించకుండా సామాన్య ప్రజలు దాని సామర్థ్యాన్ని నిర్వీర్యం చేశారు. అంతేకాక పొసగని సిద్ధాంతాలు, సరైన మెజారిటీ రాక ఎటూ తేలని ఎన్నికల ఫలితాలు వంటి వాటివల్ల చివరికి పేరున్న నాయకులకు కూడా పూర్తి అధికారం లేకుండా పోతోంది. దాంతో ఆ నాయకులు తమ పాలసీలను అమలు చేయలేకపోతున్నారు. “ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును” అని దానియేలు ప్రవచించాడు.—దాని. 2:42; 2 తిమో. 3:1-3.

10, 11. (ఎ) ‘పాదాలతో’ సూచించబడిన ప్రపంచాధిపత్యానికి భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? (బి) పాదాల వేళ్ల సంఖ్య గురించి మనం ఏమి చెప్పవచ్చు?

10 ఈ 21వ శతాబ్దంలో బ్రిటన్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రపంచ వ్యవహారాల్లో తరచూ కలిసి పాల్గొనడం ద్వారా తమ ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. భవిష్యత్తులో ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిత్యం స్థానంలో ఇంకే ప్రపంచాధిపత్యమూ రాదని పెద్ద ప్రతిమ గురించిన ప్రవచనం, క్రూర మృగం గురించిన ప్రవచనం స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇనుప మోకాళ్లతో సూచించబడిన ప్రపంచాధిపత్యం కన్నా ఈ చివరి ప్రపంచాధిపత్యం బలహీనంగానే ఉంటుంది కానీ దానంతటదే ముక్కలైపోదు.

11 ప్రతిమ పాదాల వేళ్ల సంఖ్యకు ప్రత్యేకమైన భావం ఏదైనా ఉందా? ఒకసారి ఆలోచించండి, దానియేలు తనకు కలిగిన వేరే దర్శనాల గురించి చెబుతున్నప్పుడు స్పష్టమైన సంఖ్యల్ని చెప్పాడు. ఉదాహరణకు, వివిధ మృగాల తలల మీద ఎన్నెన్ని కొమ్ములున్నాయో ఆయన చెప్పాడు. ఆ సంఖ్యలకు ఏదోక ప్రత్యేకత ఉంది. అయితే, దానియేలు ప్రతిమ గురించి వివరిస్తున్నప్పుడు ఆ ప్రతిమ పాదాలకు ఎన్ని వేళ్లున్నాయో చెప్పలేదు. కాబట్టి ప్రతిమ భుజాల, చేతుల, చేతివేళ్ల, కాళ్ల, పాదాల సంఖ్యకు ప్రాముఖ్యత లేనట్లే, పాదాల వేళ్ల సంఖ్యకు కూడా ప్రాముఖ్యత లేదు. అయితే, పాదాల వేళ్లు ఇనుమూ మట్టితో మిళితమై ఉన్నాయని మాత్రం దానియేలు స్పష్టంగా చెప్పాడు. దానియేలు ఇచ్చిన ఆ వివరణను బట్టి, దేవుని రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న “రాయి” వచ్చి ప్రతిమ పాదాలను కొట్టే సమయానికి ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యమే అధికారం చెలాయిస్తూ ఉంటుందని మనం అర్థంచేసుకోవచ్చు.—దాని. 2:45.

ఆంగ్లో-అమెరికా, రెండు కొమ్ముల క్రూరమృగం

12, 13. రెండు కొమ్ముల క్రూర మృగం దేన్ని సూచిస్తోంది? అది ఏమి చేస్తుంది?

12 ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం ఇనుమూ మట్టీ కలిసినదే అయినా, అది అంత్యదినాల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుందని యేసు యోహానుకు ఇచ్చిన దర్శనాలు చూపిస్తున్నాయి. దానికి కీలకమైన పాత్ర ఉంటుందని ఎలా చెప్పవచ్చు? యోహాను ఒక దర్శనంలో, ఘటసర్పంలా మాట్లాడుతున్న రెండు కొమ్ముల క్రూర మృగాన్ని చూశాడు. విచిత్రమైన ఆ మృగం దేన్ని సూచిస్తుంది? దానికి రెండు కొమ్ములున్నాయంటే, అది రెండు రాజ్యాల సంయుక్త ఆధిపత్యమని అర్థంచేసుకోవచ్చు. అయితే యోహాను మళ్లీ ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యాన్నే ఈసారి ఒక ప్రత్యేకమైన పాత్రలో చూశాడు.—ప్రకటన 13:11-15 చదవండి.

13 ఆ రెండు కొమ్ముల క్రూర మృగం ఏడు తలల క్రూర మృగపు ప్రతిమను తయారు చేసేందుకు ప్రేరేపిస్తుంది. ఆ క్రూర మృగపు ప్రతిమ ఉనికిలోకి వస్తుందనీ, అగాధంలోకి పోతుందనీ, మళ్లీ పైకి వస్తుందనీ యోహాను రాశాడు. ప్రపంచ రాజ్యాలను ఐక్యపరచి, వాటికి ప్రాతినిధ్యం వహించేందుకు బ్రిటన్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాలు కలిసి ఏర్పాటు చేసిన ఒక సమితి విషయంలో యోహాను చెప్పినట్లే జరిగింది. d మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అది ‘నానాజాతి సమితి’ అనే పేరుతో ఉనికిలోకి వచ్చింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు అది అగాధంలోకి పోయింది. ప్రకటన గ్రంథంలోని ప్రవచనం ప్రకారం, ఆ క్రూర మృగపు ప్రతిమ మళ్లీ పైకి వస్తుందని ఆ యుద్ధం జరుగుతున్న కాలంలో దేవుని సేవకులు ప్రకటించారు. నిజంగానే, అది ‘ఐక్యరాజ్య సమితి’ అనే పేరుతో మళ్లీ పైకి వచ్చింది.—ప్రక. 17:8.

14. క్రూర మృగపు ప్రతిమ ఏవిధంగా “ఎనిమిదవ రాజు”?

14 ఆ క్రూర మృగపు ప్రతిమ “ఎనిమిదవ రాజు” అని యోహాను చెప్పాడు. ఏ విధంగా అది ఎనిమిదవ రాజు? మనం ముందు చూసిన ఏడు తలల క్రూర మృగానికి ఇది ఎనిమిదవ తలగా వర్ణించబడలేదు. ఇది ఆ ఏడు తలల మృగపు ప్రతిమ మాత్రమే. దానికి ఏదైనా అధికారం ఉందంటే అది, దానిలో సభ్యత్వం ఉన్న దేశాలు, ముఖ్యంగా దాన్ని పెంచిపోషిస్తున్న ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం దానికి ఇచ్చినదే. (ప్రక. 17:10, 11) అయితే, ఒక ప్రత్యేకమైన పని కోసం ఎనిమిదవ రాజుగా వ్యవహరించేందుకు దానికి అధికారం ఇవ్వబడుతుంది. ఆ పని వల్ల, చరిత్రను మలుపుతిప్పే సంఘటనలు చోటుచేసుకుంటాయి.

క్రూర మృగపు ప్రతిమ వేశ్యను భక్షిస్తుంది

15, 16. వేశ్య వేటిని సూచిస్తోంది? దానికి దొరికే మద్దతుకు ఏమౌతోంది?

15 యోహాను చెబుతున్న ప్రకారం, సూచనార్థక వేశ్య క్రూర మృగపు ప్రతిమయైన ఎర్రని క్రూర మృగం మీద కూర్చొని స్వారీ చేస్తూ దానిపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆ వేశ్యకు “మహా బబులోను” అనే పేరుంది. (ప్రక. 17:1-6) ఈ వేశ్య సరిగ్గానే అబద్ధమతాలన్నిటినీ సూచిస్తోంది, వాటిలో ప్రధానమైనవి క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలే. మత సంస్థలు క్రూర మృగపు ప్రతిమను ఆశీర్వదించి, దానిపై అధికారం చెలాయించడానికి ప్రయత్నించాయి.

16 అయితే ప్రభువు దినంలో, మహాబబులోను తనకు మద్దతునిచ్చే ప్రజల్ని సూచించే జలాలు ఎండిపోవడం చూసింది. (ప్రక. 16:12; 17:15) ఉదాహరణకు, క్రూర మృగపు ప్రతిమ ఉనికిలోకి వచ్చిన కొత్తలో, మహాబబులోనులో ప్రధాన భాగంగా ఉన్న క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీలు పాశ్చాత్య దేశాలన్నిటిపై గొప్ప ప్రభావం చూపించాయి. ఇప్పుడు చర్చీలు, వాటి మత గురువుల వర్గాలు ప్రజల గౌరవాన్ని, మద్దతును కోల్పోయాయి. నిజానికి, మతమే అల్లర్లకు కారణమని, దానివల్లే అల్లర్లు చెలరేగుతున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లోని మేధావి వర్గానికి చెందిన విప్లవకారులు, మిలిటెంట్లు సమాజంపై మతం ప్రభావాన్ని అంతం చేయాలని పిలుపునిస్తున్నారు. అలాంటి వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

17. త్వరలోనే అబద్ధమత సామ్రాజ్యానికి ఏమౌతుంది? ఎందుకు?

17 అయితే అబద్ధమతం నిర్మూలమవడం మెల్లమెల్లగా జరగదు. ఆధిపత్యంలో ఉన్న రాజులకు దేవుడు ఒక ఆలోచనను పుట్టించే వరకు రాజుల్ని తనకిష్టమొచ్చినట్లు మలచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఆ వేశ్య వాళ్లపై బలమైన ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. (ప్రకటన 17:16, 17 చదవండి.) త్వరలోనే అబద్ధమతంపై దాడిచేసేలా, సాతాను వ్యవస్థలోని రాజకీయ శక్తులకు అంటే వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐక్యరాజ్యసమితికి యెహోవా బుద్ధి పుట్టిస్తాడు. అవి వేశ్య ప్రభావాన్ని అంతమొందించి, దాని ఐశ్వర్యాన్ని పాడుచేస్తాయి. కొన్ని దశాబ్దాల క్రితమైతే అలా జరగడం అసంభవమని ప్రజలు అనుకొనివుంటారు. కానీ, వేశ్య ఎర్రని క్రూర మృగం మీద నుండి జారిపడే సమయం దగ్గరపడింది. అయితే ఆమె మెల్లగా జారిపడదు, ఒక్కసారే అకస్మాత్తుగా పడిపోయి క్రూరంగా నాశనమౌతుంది.—ప్రక. 18:7, 8, 15-19.

మృగాలు అంతమౌతాయి

18. (ఎ) క్రూర మృగం ఏమి చేస్తుంది? దాని ఫలితం ఎలా ఉంటుంది? (బి) దేవుని రాజ్యం ఏ రాజ్యాలను నాశనం చేస్తుందని దానియేలు 2:44 సూచిస్తోంది? (17వ పేజీలో ఉన్న బాక్సు చూడండి.)

18 అబద్ధమత సామ్రాజ్యం నాశనమయ్యాక, భూమ్మీద సాతాను చెప్పుచేతల్లో ఉన్న రాజకీయ వ్యవస్థను సూచిస్తున్న క్రూరమృగం దేవుని రాజ్యంపై దాడిచేసేందుకు ప్రేరేపించబడుతుంది. భూమ్మీది రాజులు పరలోకం వరకు వెళ్లలేరు, కాబట్టి భూమ్మీద ఉండి దేవుని రాజ్యానికి మద్దతునిస్తున్న వాళ్లపై తమ కోపాన్ని వెళ్లగ్రక్కుతారు. దాని ఫలితమేమిటో మనకు తెలుసు. (ప్రక. 16:13-16; 17:12-14) అంతిమ యుద్ధానికి సంబంధించి దానియేలు ఒక అంశాన్ని వివరించాడు. (దానియేలు 2:44 చదవండి.) ప్రకటన 13:1లో ప్రస్తావించబడిన క్రూర మృగం, దాని ప్రతిమ, రెండు కొమ్ముల క్రూర మృగం నాశనం చేయబడతాయి.

19. మనం ఏ నమ్మకాన్ని కలిగివుండవచ్చు? ఈ సమయంలో మనం ఏమి చేయాలి?

19 ఏడవ తల ఉనికిలో ఉన్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. అది త్వరలోనే నాశనమౌతుంది, ఈలోగా ఆ మృగానికి ఇంకొక తల ఏదీ పుట్టదు. అబద్ధమతం నిర్మూలమయ్యే సమయానికి ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యమే ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. దానియేలు, యోహాను చెప్పిన ప్రవచనాల్లో ఒక్క చిన్న వివరం కూడా తప్పిపోకుండా ప్రతీది నెరవేరింది. త్వరలోనే అబద్ధమతం అంతమౌతుందని, హార్‌మెగిద్దోను యుద్ధం జరుగుతుందని మనం గట్టిగా నమ్మవచ్చు. ఆ వివరాలను దేవుడు ముందుగానే బయలుపర్చాడు. మరి మనం ఆ ప్రవచనాల్లోని హెచ్చరికల్ని పట్టించుకుంటామా? (2 పేతు. 1:19) యెహోవా పక్షాన ఉండి ఆయన రాజ్యానికి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇదే.—ప్రక. 14:6, 7.

[అధస్సూచీలు]

a బైబిల్లో పది అనే సంఖ్య తరచుగా ఒక పూర్తి గుంపును సూచిస్తుంది. కానీ, ఈ సందర్భంలో మాత్రం రోమా సామ్రాజ్యం నుండి పుట్టుకొచ్చిన రాజ్యాలన్నిటినీ అది సూచిస్తుంది.

b ఈ ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యంలోని భాగాలు 18వ శతాబ్దం నుండే ఉనికిలో ఉన్నా, ఆ ప్రపంచాధిపత్యం ప్రభువు దినంలో ఉనికిలోకి వస్తుందని యోహాను చెప్పాడు. నిజానికి, ప్రకటన గ్రంథంలోని దర్శనాలు ‘ప్రభువు దినంలో’ నెరవేరతాయి. (ప్రక. 1:10) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతే ఆ ఏడవ తల ఒక సంయుక్త ప్రపంచాధిపత్యంగా పనిచేయడం మొదలుపెట్టింది.

c ఆ యుద్ధంలో ఈ ప్రపంచాధిపత్యం ఎంత భయంకరమైన నాశనాన్ని కలుగజేస్తుందో దర్శనంలో దానియేలు ముందుగానే చూశాడు. ఈ ప్రపంచాధిపత్యం ‘ఆశ్చర్యముగా [భయంకరంగా] నాశనము చేయును’ అని దానియేలు రాశాడు. (దాని. 8:24) ఉదాహరణకు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యానికి శత్రువుగా ఉన్న రాజ్యంపై రెండు అణుబాంబులు వేసినప్పుడు ముందెన్నడూ జరగనంత ఘోరమైన నాశనం జరిగింది.

d ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలోని 240, 241, 253 పేజీలు చదవండి.

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని బాక్సు]

“ముందు చెప్పిన రాజ్యములన్ని” అంటే ఏవి?

దేవుని రాజ్యం “ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును” అని దానియేలు 2:44లోని ప్రవచనం చెబుతోంది. ప్రతిమలోని వివిధ భాగాలతో సూచించబడిన ప్రభుత్వాల గురించి మాత్రమే ఆ ప్రవచనం మాట్లాడుతోంది.

ఇతర మానవ ప్రభుత్వాలన్నిటి విషయమేమిటి? ఆ ప్రవచనానికి సమాంతరంగా ఉన్న ఒక ప్రవచనం ప్రకటన గ్రంథంలో ఉంది, అది మనకు మరిన్ని వివరాలను అందిస్తోంది. “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులు” యెహోవాతో పోరాడడానికి పోగుచేయబడతారని అది చూపిస్తోంది. (ప్రక. 16:14; 19:19-21) కాబట్టి, ప్రతిమలోని రాజ్యాలే కాక ఇతర మానవ ప్రభుత్వాలన్నీ హార్‌మెగిద్దోనులో నాశనమౌతాయి.