కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సేవకు ఎందుకు మొదటిస్థానం ఇవ్వాలి?

యెహోవా సేవకు ఎందుకు మొదటిస్థానం ఇవ్వాలి?

యెహోవా సేవకు ఎందుకు మొదటిస్థానం ఇవ్వాలి?

“నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును.”—కీర్త. 71:15.

మీరు ఎలా జవాబిస్తారో చూడండి:

నోవహు, మోషే, యిర్మీయా, పౌలు ఎందుకు యెహోవా సేవకు మొదటిస్థానం ఇచ్చారు?

మీ జీవితంలో మీరేమి చేస్తారో నిర్ణయించుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

యెహోవా సేవకు మొదటిస్థానం ఇవ్వాలని మీరు ఎందుకు నిశ్చయించుకున్నారు?

1, 2. (ఎ) సమర్పించుకున్నప్పుడు ఒక వ్యక్తి నిజానికి యెహోవాతో ఏమంటాడు? (బి) నోవహు, మోషే, యిర్మీయా, అపొస్తలుడైన పౌలు తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే మనమెలా ప్రయోజనం పొందుతాం?

 సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకొని యేసు అనుచరులవడమనేది ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం. ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం కన్నా ప్రాముఖ్యమైన నిర్ణయం ఇంకేదీ ఉండదు. అలా సమర్పించుకున్నప్పుడు బహుశా ఆ వ్యక్తి ఇలా అనుకోవచ్చు: ‘యెహోవా, నా జీవితంలోని ప్రతీ రంగంలో నువ్వే నాకు యజమానిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నీ సేవకుణ్ణి/సేవకురాలిని. జీవితంలో నేనేమి చేయాలో, దేనికి మొదటిస్థానం ఇవ్వాలో, నాకున్న వనరుల్నీ సామర్థ్యాల్నీ నేనెలా ఉపయోగించాలో నువ్వే నిర్ణయించాలి తండ్రీ.’

2 ఇప్పటికే మీరు సమర్పించుకొన్న క్రైస్తవులైతే నిజానికి యెహోవాకు అలాంటిదే చెప్పారు. ఆ నిర్ణయం తీసుకున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే; అదే సరైన, జ్ఞానయుక్తమైన నిర్ణయం. అయితే యెహోవాను మీ యజమానిగా గుర్తిస్తే మీరు మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారు? నోవహు, మోషే, యిర్మీయా, అపొస్తలుడైన పౌలు ఉదాహరణలు పరిశీలిస్తే మీ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో పరిశీలించుకోవచ్చు. వాళ్లు నలుగురూ పూర్ణ హృదయంతో యెహోవా సేవ చేసినవాళ్లే. మనం కూడా వాళ్లున్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. జీవితంలో దేనికి ప్రాధాన్యతను ఇవ్వాలనే విషయంలో వాళ్లు తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో పరిశీలించుకోవాలనే ప్రోత్సాహాన్ని పొందుతాం.—మత్త. 28:19, 20; 2 తిమో. 3:1.

జలప్రళయానికి ముందు

3. మన కాలంలోని పరిస్థితులకు, నోవహు కాలంలోని పరిస్థితులకు ఎలాంటి పోలిక ఉంది?

3 యేసు మన కాలంలోని పరిస్థితులను, నోవహు కాలంలోని పరిస్థితులతో పోల్చాడు. “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును” అని చెబుతూ, “నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు” పట్టించుకోలేదని ఆయన అన్నాడు. (మత్త. 24:37-39) అలాగే, ఇప్పుడు మనమెంత ప్రాముఖ్యమైన కాలాల్లో జీవిస్తున్నామో చాలామంది పట్టించుకోవడం లేదు. దేవుని సేవకులు ప్రకటించే హెచ్చరికల్ని వాళ్లు పట్టించుకోవడం లేదు. అంతేగాక, నోవహు కాలంలోని ప్రజల్లాగే ఇప్పుడు చాలామంది, దేవుడు మానవుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడనే తలంపును అపహాస్యం చేస్తున్నారు. (2 పేతు. 3:3-7) అంతటి ప్రతికూల పరిస్థితుల్లో నోవహు తన సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు?

4. యెహోవా నోవహుకు ఒక పని అప్పగించినప్పుడు ఆయన తన సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు? ఎందుకు?

4 దేవుడు తాను చేయాలనుకున్న దాని గురించి, నోవహు చేయాల్సిన పని గురించి ఆయనకు చెప్పిన తర్వాత ఆయన మనుష్యుల్ని, జంతువుల్ని కాపాడడానికి ఒక ఓడ కట్టాడు. (ఆది. 6:13, 14, 22) అంతేగాక, ఆయన రాబోయే యెహోవా తీర్పు గురించి ప్రకటించాడు. అప్పటి ప్రజలు తామెలాంటి పరిస్థితుల్లో ఉన్నారో గ్రహించేందుకు ఆయన వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నించాడని సూచిస్తూ ఆయన ‘నీతిని ప్రకటించాడని’ అపొస్తలుడైన పేతురు అన్నాడు. (2 పేతురు 2:5 చదవండి.) వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, సమకాలీనుల కన్నా పెద్ద హోదాలో ఉండడానికి, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి కృషిచేయాలని నోవహు, ఆయన కుటుంబం అనుకొనివుంటే సమంజసంగా ఉండేదా? లేదు! జరగబోయే దాన్ని మనసులో ఉంచుకొని వాళ్లు అలాంటి వాటికి దూరంగా ఉన్నారు.

ఐగుప్తు రాకుమారుడు తీసుకున్న నిర్ణయం

5, 6. (ఎ) ఐగుప్తీయుల విద్యలను మోషేకు ఎందుకు అభ్యసింపజేసి ఉంటారు? (బి) ఐగుప్తులో తన ముందున్న అవకాశాలను మోషే ఎందుకు వదులుకున్నాడు?

5 ఇప్పుడు మనం మోషే ఉదాహరణ పరిశీలిద్దాం. ఆయన ఫరో కుమార్తెకు దత్తపుత్రునిగా ఐగుప్తు రాజ గృహంలో పెరిగాడు. యువకునిగా ఈ రాకుమారుడు, ‘ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు.’ (అపొ. 7:22; నిర్గ. 2:9, 10) ఫరో ఆస్థానంలో బాధ్యతలు చేపట్టేలా ఆయనను సిద్ధం చేయడానికే ఆ విద్యలను అభ్యసింపజేసి ఉంటారు. ఆ కాలంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వంలో ఆయన ప్రముఖ స్థానాన్ని చేజిక్కించుకోగలిగేవాడే. దాని వల్ల ఎన్నో గొప్ప అవకాశాలు పొంది, విలాసవంతమైన జీవితం గడిపి ఉండేవాడే. కానీ, మోషే వాటన్నిటికీ మొదటిస్థానం ఇచ్చాడా?

6 చిన్నప్పుడు తన సొంత తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణ వల్ల తన పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానం గురించి మోషేకు తెలిసివుండవచ్చు. ఆయన ఆ వాగ్దానాలపై విశ్వాసం ఉంచాడు. తన భవిష్యత్తు గురించి, యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం గురించి ఆయన జాగ్రత్తగా ఆలోచించి ఉంటాడు. ఐగుప్తు రాకుమారునిగా ఉండాలా, ఇశ్రాయేలు దాసునిగా ఉండాలా అనేది ఎంపిక చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడు? ‘అల్పకాలము పాపభోగము అనుభవించే బదులు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని’ ఆయన నిర్ణయించుకున్నాడు. (హెబ్రీయులు 11:24-26 చదవండి.) ఆ తర్వాత ఆయన యెహోవా నిర్దేశానికి అనుగుణంగా జీవించాడు. (నిర్గ. 3:2, 6-10) మోషే ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే ఆయనకు దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంది. ఐగుప్తులో జీవితం అల్పకాలమేనని ఆయన గ్రహించాడు. నిజానికి, ఆ తర్వాత కొంతకాలానికే దేవుడు పది తెగుళ్లు రప్పించి ఆ జనాంగాన్ని అణచివేశాడు. నేడు యెహోవాకు సమర్పించుకున్న క్రైస్తవులకు అందులో ఏ పాఠం ఉందో గ్రహించారా? ఈ విధానంలో మంచి భవిష్యత్తును కలిగివుండడానికి లేదా ఈ లోకంలోని సుఖభోగాలను అనుభవించడానికి మొదటిస్థానం ఇచ్చే బదులు యెహోవాకు, ఆయన సేవకు ప్రాముఖ్యతనివ్వాలి.

దేవుని తీర్పు గురించి యిర్మీయాకు ముందుగానే తెలిసింది

7. యిర్మీయా పరిస్థితికి, నేడు మన కాలంలోని పరిస్థితికి ఎలాంటి పోలిక ఉంది?

7 యెహోవా సేవకు మొదటిస్థానం ఇచ్చిన మరో వ్యక్తి యిర్మీయా ప్రవక్త. మతభ్రష్ట యెరూషలేము యూదాలపై తీర్పు సందేశాన్ని ప్రకటించమని యెహోవా తన ప్రవక్తయైన యిర్మీయాకు ఆజ్ఞాపించాడు. ఒక విధంగా యిర్మీయా “అంత్యదినములలో” జీవించాడు. (యిర్మీ. 23:19, 20) ఆ విధానం ఖచ్చితంగా అంతమౌతుందని ఆయనకు ముందుగానే తెలిసింది.

8, 9. (ఎ) బారూకు ఆలోచనను యెహోవా ఎందుకు సరిదిద్దాల్సి వచ్చింది? (బి) ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు మనం దేన్ని మనసులో ఉంచుకోవాలి?

8 ఆ విధానం ఖచ్చితంగా అంతమవుతుందని నమ్మినందువల్ల యిర్మీయా ఏ నిర్ణయం తీసుకున్నాడు? దేవుడు నాశనం చేయాలనుకున్న ఆ విధానంలో ఆయన మంచి భవిష్యత్తు కోసం పాటుపడలేదు. ఒకవేళ అలా పాటుపడితే ప్రయోజనమేమైనా ఉంటుందా? అయితే, యిర్మీయా కార్యదర్శియైన బారూకు అప్పుడున్న పరిస్థితిని కొంతకాలం పాటు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందుకే దేవుడు ఈ మాటలు బారూకుకు చెప్పమని యిర్మీయాను ప్రేరేపించాడు, “నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించుచున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను.”—యిర్మీ. 45:4, 5.

9 బారూకు ఏ “గొప్పవాటిని” సంపాదించుకోవడానికి ప్రయత్నించాడో మనకు తెలియదు. a కానీ యెరూషలేముతో పాటు నాశనమయ్యేవాటిని ఆయన ఆశించాడని మాత్రం మనకు తెలుసు. నిజానికి, సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును జయించినప్పుడు అవన్నీ నాశనమైపోయాయి. బారూకు ఉదాహరణలో మనకు ఏ హెచ్చరిక ఉందో గ్రహించారా? జీవితావసరాల కోసం మనం కొన్ని ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. (సామె. 6:6-11) కానీ నాశనం కాబోతున్న వాటికోసం మనం ఎక్కువ సమయాన్ని, శక్తిని వినియోగించడం తెలివైన పనేనా? నిజమే, యెహోవా సంస్థ కొత్త రాజ్యమందిరాలూ బ్రాంచి కార్యాలయాలూ నిర్మించడానికి, రాజ్యసంబంధమైన ఇతర కార్యకలాపాలు చేపట్టడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ రాజ్యసంబంధ పనుల కోసం కాబట్టి భవిష్యత్తులో కూడా అవి ప్రయోజనకరంగా ఉంటాయి. యెహోవాకు సమర్పించుకున్న ప్రజలందరూ ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు అలాంటి వాటికి మొదటిస్థానం ఇవ్వడమే సరైనది. ‘రాజ్యాన్ని, యెహోవా నీతిని మొదట వెదకుతున్నాను’ అని మీరు మనస్ఫూర్తిగా చెప్పగలరా?—మత్త. 6:33.

“సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను”

10, 11. (ఎ) క్రైస్తవునిగా మారకముందు పౌలు వేటికి ప్రాముఖ్యతనిచ్చాడు? (బి) పౌలు ఎందుకు మారాడు?

10 చివరిగా మనం పౌలు ఉదాహరణను పరిశీలిద్దాం. క్రైస్తవునిగా మారకముందు ఆయన ఎదుట ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఆయన ఆ కాలంలో ఎంతో ప్రముఖుడైన ఒక పండితుని దగ్గర యూదా ధర్మశాస్త్రాన్ని అభ్యసించాడు. యూదా ప్రధాన యాజకుని నుండి అధికారాన్ని పొందాడు. యూదా మతంలో తన సమకాలీనుల కన్నా ఎంతో ఉన్నతంగా ఎదుగుతూ వచ్చాడు. (అపొ. 9:1, 2; 22:3; 26:10; గల. 1:13, 14) యూదా జనాంగంపై యెహోవా అనుగ్రహం ఇక లేదని గ్రహించినప్పుడు ఆయన మారాడు.

11 యూదా విధానంలో ఎంత ఉన్నతంగా ఎదిగినా యెహోవా దృష్టిలో వ్యర్థమేనని ఆయన గ్రహించాడు. నిజానికి ఆ తర్వాత యూదా విధానం అంతమైంది. (మత్త. 24:2) గతంలో పరిసయ్యుడిగా ఉన్న ఈయన దేవుని సంకల్పాల విషయంలో తనకు కలిగిన కొత్త అవగాహనను బట్టి, క్రైస్తవ పరిచర్య చేసే గొప్ప అవకాశాన్ని బట్టి తాను ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యమైనవిగా భావించిన ‘సమస్తాన్ని నష్టంగా’ పరిగణించాడు. యూదా మతంలో తాను చేస్తున్న వాటిని మానేసి, ఈ భూమ్మీద ఉన్నంత కాలం రాజ్య సువార్తను ప్రకటించడానికే అంకితమయ్యాడు.—ఫిలిప్పీయులు 3:4-8, 15 చదవండి; అపొ. 9:15.

మీరు వేటికి మొదటిస్థానం ఇస్తున్నారో పరిశీలించుకోండి

12. బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు తన జీవితాన్ని దేనికి అంకితం చేశాడు?

12 నోవహు, మోషే, యిర్మీయా, పౌలు, అలాగే ఇంకా చాలామంది రాజ్యసంబంధమైన విషయాలకే తమ సమయాన్ని, శక్తిని ఎక్కువగా వెచ్చించారు. వాళ్లు మనకు ఆదర్శంగా ఉన్నారు. యెహోవా సేవకులందరిలో యేసే మనకు గొప్ప ఆదర్శం. (1 పేతు. 2:21) ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ భూమ్మీద ఉన్నంతకాలం రాజ్యసువార్త ప్రకటించడానికి, యెహోవాను ఘనపర్చడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. యెహోవాయే తన యజమాని అని గుర్తించిన క్రైస్తవుడు తన జీవితంలో ఆయన సేవకే మొదటిస్థానం ఇవ్వాలి. మరి మీరలా ఇస్తున్నారా? మన అవసరాల కోసం డబ్బు సంపాదించుకుంటూనే, దేవుని సేవకు మొదటిస్థానం ఎలా ఇవ్వవచ్చు?—కీర్తన 71:15; 145:2 చదవండి.

13, 14. (ఎ) దేని గురించి ఆలోచించమని యెహోవా సంస్థ సమర్పిత క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది? (బి) దేవుని ప్రజలు ఎలాంటి సంతృప్తిని పొందవచ్చు?

13 పయినీరు సేవ చేయగలరేమో ఆలోచించమని యెహోవా సంస్థ క్రైస్తవులను ఎన్నో సంవత్సరాల నుండి ప్రోత్సహిస్తూనే ఉంది. వేర్వేరు పరిస్థితుల వల్ల, నమ్మకస్థులైన కొంతమంది యెహోవా సేవకులకు నెలకు సగటున 70 గంటలు ప్రకటనాపనిలో గడపడం కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. (1 తిమో. 5:8) అయితే మీ విషయం ఏమిటి? పయినీరు సేవ చేయడం నిజంగానే మీకు వీలవ్వదా?

14 దేవుని ప్రజల్లో చాలామంది ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో అనుభవించిన ఆనందం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రత్యేక ఏర్పాటు వల్ల, మార్చి నెలలో సహాయ పయినీరు సేవ చేసేవాళ్లు 30 గంటలు గానీ 50 గంటలు గానీ ఎంచుకునే అవకాశం లభించింది. (కీర్త. 110:3) దానితో లక్షలాదిమంది సహాయ పయినీరు సేవ చేశారు, సంఘాల్లో మరెప్పుడూ లేనంతగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మరింత తరచుగా ఆ ఆనందాన్ని పొందడానికి మీరు సర్దుబాట్లు చేసుకోగలరా? సమర్పిత క్రైస్తవులకు రోజు ముగిసే సరికి, “యెహోవా, నీ సేవలో నేను చేయగలిగిందంతా చేశాను” అని చెప్పగలిగేంత సంతృప్తి దొరుకుతుంది.

15. పైచదువుల విషయంలో యౌవన క్రైస్తవుల లక్ష్యం ఏమై ఉండాలి?

15 మీరు పాఠశాల విద్య ముగిస్తున్న యౌవనస్థులైతే, బహుశా మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, మీకు ఏమంత పెద్ద బాధ్యతలు కూడా ఉండకపోవచ్చు. క్రమ పయినీరు సేవ మొదలుపెట్టడం గురించి జాగ్రత్తగా ఆలోచించారా? మీరు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని మీ టీచర్లు సదుద్దేశంతోనే మీకు సలహాలు ఇవ్వవచ్చు. ఎందుకంటే, వాళ్ల నమ్మకమంతా త్వరలో నాశనం కాబోయే సాంఘిక, ఆర్థిక వ్యవస్థల మీదే. అయితే మీరు దేవుని సేవ చేస్తే నిజంగా విలువైన, శాశ్వతమైన లక్ష్యాలను చేపట్టగలుగుతారు. అప్పుడు మీరు యేసును ఆదర్శంగా తీసుకొని ఆయనను అనుకరించగలుగుతారు. అలాంటి తెలివైన నిర్ణయం తీసుకున్నందుకు మీరు ఎలాంటి ఉరిలోనూ చిక్కుకోరు, ఎంతో ఆనందాన్ని పొందుతారు. దానివల్ల, మీ సమర్పణకు తగినట్లుగా జీవించాలనే కృతనిశ్చయం మీకుందని చూపిస్తారు.—మత్త. 6:19-21; 1 తిమో. 6:9-12.

16, 17. ఉద్యోగం, మరితర విషయాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు?

16 నేడు చాలామంది దేవుని సేవకులు తమ కుటుంబ కనీస అవసరాలు తీర్చడానికి ఎన్నో గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ కొంతమంది అవసరమైన దానికన్నా ఎక్కువ గంటలు పనిచేస్తుండవచ్చు. (1 తిమో. 6:7, 8) మార్కెట్లోకి వచ్చే ఎన్నో ఉత్పత్తులు, వాటిలో ప్రతీ కొత్త మోడల్‌ మన దగ్గర లేకపోతే జీవితమే గడవదని ఒప్పించడానికి వాణిజ్య ప్రపంచం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ దేనికి ప్రాధాన్యతనివ్వాలనే విషయంలో సాతాను ప్రపంచం తమను శాసించడానికి నిజ క్రైస్తవులు అనుమతించరు. (1 యోహా. 2:15-17) ఉద్యోగ విరమణ పొందినవాళ్లు యెహోవా సేవకు మొదటిస్థానం ఇస్తూ పయినీరు సేవ చేస్తే తమ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.

17 యెహోవాకు సమర్పించుకున్న క్రైస్తవులందరూ తమను తాము ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నా జీవితంలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నాను? రాజ్య సంబంధ విషయాలకు మొదటిస్థానం ఇస్తున్నానా? యేసులాగే స్వయంత్యాగ స్ఫూర్తిని చూపిస్తున్నానా? తనను అనుసరిస్తూ ఉండాలని యేసు ఇచ్చిన ఉపదేశాన్ని నేను పాటిస్తున్నానా? ప్రకటనాపనికి లేదా రాజ్య సంబంధ విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించడానికి నా రోజువారీ పనుల్ని సర్దుబాటు చేసుకోగలనా? నా పరిస్థితులను బట్టి ఇప్పుడు నేను ఎక్కువగా సేవ చేయలేకపోయినా స్వయంత్యాగ స్ఫూర్తిని అలవర్చుకుంటున్నానా?’

“ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును”

18, 19. మీరు దేని కోసం ప్రార్థించవచ్చు? అలా ప్రార్థించడం యెహోవాను ఎందుకు సంతోషపెడుతుంది?

18 దేవుని ప్రజల ఉత్సాహాన్ని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. అయితే తమ పరిస్థితులు అనుకూలించినప్పటికీ కొంతమంది పయినీరు సేవ చేయడానికి ఇష్టపడరు లేదా ఆ సేవ చేయడానికి తాము అర్హులం కాదనుకుంటారు. (నిర్గ. 4:10; యిర్మీ. 1:6) అలాంటప్పుడు ఏమి చేయవచ్చు? ఆ విషయం గురించి ప్రార్థన చేయడం మంచిది. పౌలు తోటి విశ్వాసులతో ఇలా చెప్పాడు, ‘మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై దేవుడు మీలో కార్యసిద్ధి కలుగజేస్తాడు.’ (ఫిలి. 2:13) ఒకవేళ మీకు పరిచర్యను ఎక్కువగా చేయాలనే ఇష్టం కలగకపోతే, అలాంటి ఇష్టాన్ని కలిగించమని, సామర్థ్యాన్ని ఇవ్వమని యెహోవాను అడగండి.—2 పేతు. 3:9, 11.

19 నోవహు, మోషే, యిర్మీయా, పౌలు, యేసు, వీళ్లందరూ దేవుని సేవకే అంకితమయ్యారు. యెహోవా హెచ్చరికల్ని ప్రకటించడానికి వాళ్లు తమ సమయాన్ని, శక్తిని ఉపయోగించారు. తమ సేవకు ఆటంకం కలిగించేవాటికి దూరంగా ఉన్నారు. ఈ విధానం త్వరలోనే అంతమౌతుంది, కాబట్టి దేవుని సమర్పిత సేవకులమైన మనమందరం, బైబిల్లో ప్రస్తావించబడిన ఆ ఆదర్శవంతులను అనుకరించడానికి మనం చేయగలిగిందంతా చేస్తున్నామో లేదో చూసుకోవాలి. (మత్త. 24:42; 2 తిమో. 2:15) అలాచేస్తే యెహోవాను సంతోషపెట్టవచ్చు, ఎన్నో ఆశీర్వాదాలు పొందవచ్చు.—మలాకీ 3:10 చదవండి.

[అధస్సూచి]

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

నోవహు హెచ్చరికను ప్రజలు పట్టించుకోలేదు

[24వ పేజీలోని చిత్రం]

క్రమ పయినీరు సేవ మొదలుపెట్టడం గురించి జాగ్రత్తగా ఆలోచించారా?