కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు’

‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు’

‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు’

“ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.”—2 పేతు. 1:21.

ఈ విషయాలను ధ్యానించండి:

బైబిలు రచయితలకు తన సందేశాన్ని తెలియజేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగించాడు?

బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని చెప్పేందుకు ఏ రుజువులున్నాయి?

దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత కలిగివుండేందుకు మీరు ప్రతీరోజు ఏమి చేయవచ్చు?

1. దేవుని ప్రేరేపిత వాక్యం మనకు ఎందుకు అవసరం?

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది ఈ ప్రశ్నలు అడుగుతుంటారు: మనం ఎక్కడినుండి వచ్చాం? ఎందుకు ఇక్కడ ఉన్నాం? ఎక్కడికి వెళ్తాం? లోకం ఎందుకిలా ఉంది? చనిపోయినప్పుడు మనకు ఏమౌతుంది? దేవుని ప్రేరేపిత వాక్యం లేకపోతే ఈ ప్రశ్నలకు, ప్రాముఖ్యమైన ఇతర ప్రశ్నలకు మనం జవాబులు తెలుసుకోలేం. పరిశుద్ధ లేఖనాలు లేకపోతే మనం సొంత అనుభవం నుండే పాఠాలు నేర్చుకోవాల్సివుంటుంది. ఒకవేళ మనమలా నేర్చుకుంటే, “యెహోవా శాసనము” విషయంలో కీర్తనకర్తలా భావించలేం.—కీర్తన 19:7 చదవండి.

2. బైబిలు పట్ల మనకున్న కృతజ్ఞతను ఎలా కాపాడుకోవచ్చు?

2 విచారకరమైన విషయమేమిటంటే, కొంతమంది బైబిలు సత్యాలను ఒకప్పుడు ప్రేమించినంతగా ఇప్పుడు ప్రేమించడం లేదు. (ప్రకటన 2:4 పోల్చండి.) వాళ్లు ఇక యెహోవాకు ఇష్టమైనవిధంగా నడుచుకోవడం లేదు. (యెష. 30:21) మన విషయంలో అలా జరగకూడదు. బైబిలును, దానిలోని బోధలను ఇచ్చినందుకు మనం దేవునిపట్ల కృతజ్ఞతను కాపాడుకోవడానికి కృషిచేయవచ్చు, అలా చేయాలి కూడా. దేవుని వాక్యమైన బైబిలు ప్రేమగల మన సృష్టికర్త మనకిచ్చిన అమూల్యమైన బహుమానం. (యాకో. 1:17) “దేవుని వాక్యము” పట్ల మనం మరింత కృతజ్ఞతను ఎలా పెంచుకోవచ్చు? బైబిలు లేఖనాలను రాయడానికి దేవుడు మనుష్యులను ఎలా ఉపయోగించుకున్నాడో తెలుసుకోవడం ద్వారా, అది దేవుని నుండి వచ్చిందని ఎందుకు నమ్మవచ్చో చూపించే రుజువుల్లో కొన్నింటిని పరిశీలించడం ద్వారా మన కృతజ్ఞతను పెంచుకోవచ్చు. అప్పుడు మనం దేవుని వాక్యాన్ని ప్రతీరోజు చదివి, దానిలోవున్న ఉపదేశాన్ని పాటిస్తాం.—హెబ్రీ. 4:12.

వాళ్లు ఎలా ‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు’?

3. ప్రవక్తలు, బైబిలు రచయితలు ఎలా ‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు’?

3 దాదాపు 40 మంది వ్యక్తులు బైబిలును రాశారు. సా.శ.పూ. 1513 నుండి సా.శ. 98 వరకు అంటే 1,610 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలనిడివిలో దాన్ని రాశారు. వాళ్లలో ‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన’ కొంతమంది ప్రవక్తలు కూడా ఉన్నారు. (2 పేతురు 1:20, 21 చదవండి.) ఈ వచనంలో, ‘ప్రేరేపించబడ్డారు’ అని అనువదించబడిన గ్రీకు పదానికి పురికొల్పబడడం, నడిపించబడడం, పురికొల్పబడడానికి అనుమతించడం అనే అర్థాలున్నాయి. అపొస్తలుల కార్యములు 27:15లో ఆ పదం, గాలిలో చిక్కుకొని, గాలి వాటుకు కొట్టుకుపోయే ఓడను వర్ణించడానికి ఉపయోగించబడింది. బైబిలు ప్రవక్తలు, రచయితలు ‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు,’ అంటే దేవుడు వాళ్లతో మాట్లాడాడు, తన పరిశుద్ధాత్మతో వాళ్లను పురికొల్పి, వాళ్లకు నిర్దేశమిచ్చాడు. కాబట్టి వాళ్లు తమ సొంత తలంపులను కాదుగానీ దేవుని తలంపులను రాశారు. కొన్ని సందర్భాల్లో ప్రేరేపిత ప్రవక్తలకు, రచయితలకు తాము ప్రవచించిన, రాసిన వాటి అర్థమేమిటో అప్పుడు తెలియదు. (దాని. 12:8, 9) ‘లేఖనాలన్నీ దైవావేశము వలన కలిగినవే,’ వాటిలో మనుష్యుల అభిప్రాయాలు లేవు.—2 తిమో. 3:16.

4-6. యెహోవా తన సందేశాన్ని బైబిలు రచయితలకు ఏయే విధాలుగా తెలియజేశాడు? ఉదాహరణతో చెప్పండి.

4 మరి బైబిలు రచయితలకు తన సందేశాన్ని తెలియజేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగించాడు? ఏ పదాలు ఉపయోగించాలో దేవుడు వాళ్లకు తెలియజేశాడా లేక కేవలం తలంపులు తెలియజేస్తే వాళ్లు వాటిని తమ సొంత మాటల్లో చెప్పారా? ఒక వ్యాపారవేత్త ఎవరికైనా ఒక లేఖ పంపించాలనుకుంటే దాన్ని ఎలా సిద్ధం చేస్తాడో గమనించండి. ఫలానా పదాలే ఉపయోగించడం ప్రాముఖ్యం అనుకుంటే తనే ఆ లేఖ రాస్తాడు లేదా తన సెక్రటరీకి ప్రతీ పదం చెప్పి రాయిస్తాడు. ఆ తర్వాత ఆమె దాన్ని టైపు చేస్తుంది, కానీ కింద సంతకం మాత్రం ఆ వ్యాపారవేత్తదే ఉంటుంది. మరికొన్నిసార్లు, ఆయన కేవలం ముఖ్యమైన తలంపులు మాత్రం చెప్తాడు, సెక్రటరీ తనకు నచ్చిన పదాలను ఉపయోగించి, తనదైన శైలిలో లేఖ సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత వ్యాపారవేత్త దానిలో తప్పులు ఉన్నాయేమో చూసి, ఏవైనా మార్పులు అవసరమైతే వాటి గురించి సెక్రటరీకి చెబుతాడు. చివరికి, ఆ లేఖ మీద ఆయనే సంతకం చేస్తాడు కాబట్టి అది ఆయన రాసిన లేఖగానే పరిగణించబడుతుంది.

5 అలాగే, బైబిల్లోని కొన్ని భాగాలు “దేవుని వ్రేలి” సహాయంతో రాయబడ్డాయి. (నిర్గ. 31:18) ఖచ్చితంగా ఫలానా పదాలు ఉపయోగించడం ప్రాముఖ్యం అనుకున్నప్పుడు యెహోవా ఆ పదాలనే చెప్పి రాయించాడు. ఉదాహరణకు, నిర్గమకాండము 34:27లో ఇలా ఉంది, “యెహోవా మోషేతో ఇట్లనెను—ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను, ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను.” అలాగే, యిర్మీయా ప్రవక్తకు యెహోవా ఇలా చెప్పాడు, “నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.”—యిర్మీ. 30:2, 3.

6 అయితే చాలా సందర్భాల్లో, ఏ పదాలను ఉపయోగించాలనేది కాకుండా తలంపులు మాత్రమే దేవుడు అద్భుతరీతిలో బైబిలు రచయితలకు తెలియజేశాడు, అప్పుడు వాళ్లు తమకు నచ్చిన పదాలను ఉపయోగించి ఆ తలంపులను తెలియజేశారు. “ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను” అని ప్రసంగి 12:10 చెబుతోంది. సువార్త రచయితయైన లూకా ‘అన్ని సంగతులు వరుసగా రచించడానికి మొదటి నుండి వాటినన్నిటిని తరచి పరిష్కారముగా తెలుసుకున్నాడు.’ (లూకా 1:1-3) మానవ అపరిపూర్ణత వల్ల తన సందేశం కలుషితం కాకుండా చూసేందుకు దేవుడు తన పరిశుద్ధాత్మను ఉపయోగించాడు.

7. బైబిలును రాయించడానికి దేవుడు మనుష్యులను ఉపయోగించుకోవడంలో ఆయనకున్న గొప్ప జ్ఞానం ఎలా వెల్లడవుతోంది?

7 బైబిలును రాయించడానికి దేవుడు మనుష్యులను ఉపయోగించుకోవడంలో ఆయనకున్న గొప్ప జ్ఞానం వెల్లడవుతోంది. పదాలు కేవలం సమాచారాన్నే కాకుండా భావోద్వేగాలను కూడా తెలియజేస్తాయి. ఒకవేళ యెహోవా బైబిలు రాయడానికి దేవదూతలను ఉపయోగించి ఉంటే ఎలా ఉండేది? మనుష్యులకు సాధారణంగా కలిగే భయం, దుఃఖం, నిరాశ వంటి భావోద్వేగాలను వాళ్లు మనుష్యులకు అర్థమయ్యే విధంగా తెలియజేసి ఉండగలిగేవాళ్లా? అపరిపూర్ణ మనుష్యులు పరిశుద్ధాత్మ ద్వారా తమకు అందజేయబడిన తలంపులను రాయడానికి తమకు నచ్చిన పదాలను ఉపయోగించేందుకు అనుమతించడం ద్వారా దేవుడు తన సందేశాన్ని వాత్సల్యపూరితంగా, వైవిధ్యభరితంగా, మానవ భావోద్వేగాలకు ఆకర్షణీయంగా ఉండేలా అందజేశాడు.

బైబిలు దేవుని వాక్యమని నమ్మడానికి రుజువులు

8. బైబిలు ఇతర మతగ్రంథాల కన్నా ప్రత్యేకమైనదని ఎందుకు చెప్పవచ్చు?

8 బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని చెప్పడానికి రుజువులు కోకొల్లలు. దేవుని గురించి బైబిలు తెలియజేసినంతగా మరే మతగ్రంథమూ తెలియజేయడం లేదు. ఉదాహరణకు, హిందువుల మతగ్రంథాల్లో ఆచారాల గురించి, వేదాంతం గురించి, పురాణాల గురించి, నీతి నియమాల గురించి ఉంటుంది. బౌద్ధమత గ్రంథాల్లో సన్యాసులు, సన్యాసినులు పాటించాల్సిన నియమాల గురించి ఉంటుంది. అవి బౌద్ధమత సిద్ధాంతాల గురించి, బుద్ధుని బోధల గురించి కూడా తెలియజేస్తాయి. బుద్ధుడు తాను దేవుడినని చెప్పుకోలేదు, దేవుని గురించి ఎక్కువగా చెప్పనూలేదు. కన్ఫ్యూషియనిజమ్‌ అనే మతానికి సంబంధించిన గ్రంథాల్లో గత చరిత్ర, నీతి నియమాలు, మంత్రాలు, భక్తి గీతాలు ఉంటాయి. ముస్లిమ్‌ల మతగ్రంథం దేవుడు సర్వజ్ఞాని అని, ఆయనకు భవిష్యత్తు తెలుసని చెబుతుందన్నది వాస్తవమే కానీ, అది కనీసం ఆయన పేరేమిటో వెల్లడించడం లేదు. అయితే, దేవుని పేరైన యెహోవా బైబిల్లో వేలసార్లు కనిపిస్తుంది.

9, 10. బైబిలు ద్వారా దేవుని గురించి మనమేమి తెలుసుకోవచ్చు?

9 చాలా మతగ్రంథాలు దేవుని గురించి ఎక్కువేమీ చెప్పడం లేదు. కానీ బైబిలు మాత్రం యెహోవా దేవుని గురించి, ఆయన కార్యాల గురించి మనకెన్నో విషయాలు తెలియజేస్తోంది. ఆయన ఎలాంటివాడో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఆయన అధిక శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, న్యాయవంతుడు అని మాత్రమే కాక ఆయన ప్రేమగల దేవుడని కూడా అది తెలియజేస్తోంది. (యోహాను 3:16; 1 యోహాను 4:19 చదవండి.) అంతేగాక, ‘దేవుడు పక్షపాతి కాడు, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు’ అని బైబిలు చెబుతోంది. (అపొ. 10:34, 35) బైబిలు ఎక్కువమందికి అందుబాటులో ఉండడాన్ని బట్టి ఈ విషయం నిజమని తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 6,700 భాషల్లో, దాదాపు 100 భాషలను ప్రపంచ జనాభాలో 90 శాతం మంది ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ బైబిలు 2,400 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది, అయితే అలా అనువదించబడిన కొన్ని భాషల్లో పూర్తి బైబిలు, మరికొన్ని భాషల్లో బైబిల్లోని కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ బైబిల్లోని కొన్ని పుస్తకాలనైనా తమ భాషలో చదువుకునే సౌలభ్యం ఉంది.

10 “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను” అని యేసు చెప్పాడు. (యోహా. 5:17) ‘యుగయుగములు యెహోవాయే దేవుడు.’ కాబట్టి ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటాడో ఆలోచించండి! (కీర్త. 90:2) దేవుడు గతంలో ఏమి చేశాడో, ప్రస్తుతం ఏమి చేస్తున్నాడో, భవిష్యత్తులో ఏమి చేస్తాడో బైబిలు మాత్రమే మనకు తెలియజేస్తుంది. ఆయనకు ఏవి ఇష్టమో, ఏవి ఇష్టంలేదో, మనమాయనకు ఎలా సన్నిహితం కావచ్చో కూడా లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. (యాకో. 4:8) మనం సొంత విషయాల్లో మునిగిపోవడం వల్ల లేదా సొంత విషయాల గురించి చింతిస్తూ ఉండడం వల్ల దేవునికి దూరమైపోకుండా జాగ్రత్తపడాలి.

11. బైబిల్లో ఎలాంటి విస్తారమైన, నమ్మదగిన జ్ఞానం ఉంది?

11 బైబిలును మనుష్యుల కన్నా ఉన్నతుడు ఇచ్చాడని దానిలో ఉన్న విస్తారమైన, నమ్మదగిన జ్ఞానాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. “యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచిన వాడెవడు?” అని యెషయా ప్రవక్త తన కాలంలోని ప్రజలను అడిగాడు. (యెష. 40:13) ఆ తర్వాతి కాలంలో, అపొస్తలుడైన పౌలు కూడా ఇలా ప్రశ్నించాడు, “[యెహోవా] మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు?” (1 కొరిం. 2:16) నిజానికి ఎవ్వరూ యెహోవాకు నేర్పించలేరు, ఎందుకంటే ఆయన కన్నా ఎక్కువ ఎవ్వరికీ తెలియదు. అందుకే వివాహం, పిల్లల పెంపకం, వినోదం, సహవాసం, కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, నైతిక విషయాలు వంటి వాటి గురించి లేఖనాల్లో ఉన్న ఉపదేశాన్ని పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. బైబిల్లో ఉన్న ఉపదేశాలన్నీ మనకు మేలే చేస్తాయి. అయితే ఎప్పటికీ ఉపయోగపడే సలహాల్ని ఇచ్చేంత జ్ఞానం మనుష్యులకు లేదు. (యిర్మీ. 10:23) గతంలో తాము ఇచ్చిన సలహాల్లో లోపాలు ఉన్నాయని గుర్తించినప్పుడల్లా మనుష్యులు వాటిని మార్చి, కొత్త సలహాలు ఇస్తుంటారు. “నరుల ఆలోచనలు వ్యర్థములు” అని బైబిలు చెబుతోంది.—కీర్త. 94:11.

12. బైబిలును నాశనం చేయడానికి కొంతమంది ఎలా ప్రయత్నించారు?

12 బైబిలు సందేశం ప్రజలకు చేరకుండా కొంతమంది చేసిన ప్రయత్నాల గురించి చరిత్ర చెబుతున్న విషయాలను బట్టి కూడా అది దేవుని వాక్యమని రుజువౌతోంది. సిరియా రాజైన అంతియొకసు IV సా.శ.పూ. 168లో ధర్మశాస్త్రంలోని ప్రేరేపిత పుస్తకాలను వెదకిపట్టుకొని వాటిని తగలబెట్టించేందుకు ప్రయత్నాలు చేశాడు. రోమా చక్రవర్తియైన డయక్లీషన్‌ సా.శ. 303లో క్రైస్తవులు కూటాలు జరుపుకునే స్థలాలను ధ్వంసం చేయమని, బైబిళ్లను పుస్తకాలను తగలబెట్టమని ఆజ్ఞ జారీ చేశాడు. ఆయనిచ్చిన ఆజ్ఞ ఒక దశాబ్దం పాటు అమలులో ఉంది. సాధారణ ప్రజలు మాట్లాడే భాషల్లోకి లేఖనాల అనువాదం జరగకుండా అడ్డుకోవడం ద్వారా బైబిలు జ్ఞానం వ్యాప్తి చెందకుండా చూసేందుకు పోప్‌లు సా.శ. 11వ శతాబ్దం తర్వాత శతవిధాలా ప్రయత్నించారు. సాతాను, అతని ప్రతినిధులు అలాంటి ప్రయత్నాలు చేసినా బైబిలు ఇప్పటికీ అందుబాటులో ఉంది. మనుష్యులకు తానిచ్చిన బహుమతిని నాశనం చేయడానికి యెహోవా ఎవ్వరినీ అనుమతించలేదు.

ఎందరినో ఒప్పించిన రుజువులు

13. బైబిలును దేవుడు ప్రేరేపించాడని చెప్పేందుకు ఇంకా ఏ రుజువులు ఉన్నాయి?

13 బైబిలును దేవుడు ప్రేరేపించాడని చెప్పేందుకు మరిన్ని రుజువులున్నాయి. బైబిల్లోని అంతర్గత పొందిక, వైజ్ఞానిక ఖచ్చితత్వం, నెరవేరిన ప్రవచనాలు, అసాధారణమైన నిజాయితీ, ప్రజల జీవితాల్ని మార్చేందుకు దానికున్న శక్తి, చరిత్రాపరమైన వాస్తవాలు, మొదట్లో ప్రస్తావించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు వంటివాటిని బట్టి కూడా దాన్ని దేవుడే ప్రేరేపించాడని రుజువౌతోంది. బైబిలు దేవుని నుండి వచ్చిన వాక్యమని కొంతమందిని ఒప్పించిన విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

14-16. (ఎ) బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని ఒక ముస్లిమ్‌ను, ఒక హిందువును, దేవుని గురించి తెలుసుకోవడం అసంభవమని అనుకున్న ఒక అమ్మాయిని ఏది ఒప్పించింది? (బి) బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని చెప్పడానికి మీరు పరిచర్యలో ఏ రుజువులు చూపిస్తారు?

14 అన్వర్‌ a అనే వ్యక్తి ఒక మధ్య ప్రాచ్య దేశంలో ముస్లిమ్‌గా పెరిగాడు. ఆయన కొంతకాలం పాటు ఉత్తర అమెరికాలో ఉన్నప్పుడు యెహోవాసాక్షులు ఆయన ఇంటికి వచ్చారు. “మత సంబంధమైన పోరాటాలను బట్టి, క్రైస్తవ ధర్మ విచారణ సభలను బట్టి ఆ సమయానికి నాకు క్రైస్తవుల మీద సదభిప్రాయం లేదు. అయితే, స్వతహాగా నాకు కుతూహలం ఎక్కువ కాబట్టి బైబిలు అధ్యయనానికి ఒప్పుకున్నాను” అని ఆయన చెప్పాడు. కొంతకాలానికే, ఆయన తిరిగి స్వదేశానికి వెళ్లిపోయినప్పుడు యెహోవాసాక్షులతో సంప్రదింపులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లు గడిచాక, ఆయన యూరప్‌కు వలస వెళ్లినప్పుడు అక్కడ మళ్లీ బైబిలు అధ్యయనం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు, “బైబిలు ప్రవచనాల నెరవేర్పు, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న అంతర్గత పొందిక, బైబిల్లో పరస్పర విరుద్ధమైన విషయాలు లేకపోవడం, యెహోవా ఆరాధకుల మధ్య ఉన్న ప్రేమ వంటి వాటిని బట్టి బైబిలు దేవుని వాక్యమనే నమ్మకం కుదిరింది” అని ఆయన అన్నాడు. 1998లో అన్వర్‌ బాప్తిస్మం తీసుకున్నాడు.

15 ఆశా అనే 16 ఏళ్ల అమ్మాయి నిష్ఠగల హిందువుల కుటుంబంలో పెరిగింది. ‘నేను గుడికి వెళ్లినప్పుడు లేదా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భక్తిగా ప్రార్థించేదాన్ని. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుని గురించి అసలు ఆలోచించేదాన్నికాదు. అయితే యెహోవాసాక్షులు మా ఇంటికి రావడంతో నా జీవితం పూర్తిగా మారిపోయింది’ అని ఆమె అంది. ఆశా బైబిలు అధ్యయనం చేసి దేవుని గురించి తెలుసుకొని ఆయనకు దగ్గరైంది. బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని ఆమెను ఏది ఒప్పించింది? ఆమె దానికిలా చెప్పింది, “నాకు వచ్చిన ప్రతీ ప్రశ్నకు బైబిల్లో జవాబు దొరికింది. దేవుణ్ణి చూడకుండానే అంటే గుడికి వెళ్లి ఒక విగ్రహానికి మొక్కకుండానే ఆయనపై విశ్వాసం ఉంచడానికి బైబిలు నాకు సహాయం చేసింది.”

16 పౌలా అనే అమ్మాయి క్యాథలిక్‌గా పెరిగింది కానీ టీనేజీ దాటే సమయానికి, దేవుని గురించి తెలుసుకోవడం అసంభవమనే ముగింపుకు వచ్చింది. ఆ సమయంలో ఏమి జరిగిందో చెబుతూ ఆమె ఇలా అంది, “నేను ఒక స్నేహితుణ్ణి చాలా నెలల తర్వాత కలిశాను. హిప్పీ ఫ్యాషన్‌ నడుస్తున్న ఆ సమయంలో ఆ స్నేహితుడు ఎంతో మారిపోయి, జుట్టు కత్తిరించుకొని శుభ్రంగా సంతోషంగా ఉండడం చూసి, ‘ఏమైంది నీకు ఇలా మారిపోయావ్‌, ఇన్నాళ్లు ఏమైపోయావ్‌?’ అని అడిగాను. తాను యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్నానని చెప్పి నాకు సాక్ష్యమివ్వడం మొదలుపెట్టాడు.” దేవుని గురించి తెలుసుకోవడం అసంభవమని అనుకున్న ఆమె లేఖన సత్యానికి అంత శక్తి ఉండడం చూసి, బైబిలు సందేశానికి ఆకర్షితురాలై, బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని అంగీకరించింది.

“నీ వాక్యము నా పాదములకు దీపము”

17. ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానిస్తే మీకు ఏ ప్రయోజనం కలుగుతుంది?

17 యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన అద్భుతమైన బహుమతి బైబిలు. ప్రతీరోజు దాన్ని చదివి, ఆనందం పొందండి. అలా చేస్తే బైబిలుపై, దాన్నిచ్చిన యెహోవాపై మీకు ప్రేమ అధికమవుతుంది. (కీర్త. 1:1, 2) వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేసుకొనే ప్రతీసారి, మీ ఆలోచనల్ని నిర్దేశించుకునేందుకు పరిశుద్ధాత్మను ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి. (లూకా 11:13) బైబిల్లో దేవుని తలంపులు ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని చదివి, ధ్యానిస్తే మీరు కూడా దేవునిలాగే ఆలోచిస్తారు.

18. బైబిలు నుండి నేర్చుకుంటూనే ఉండాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు?

18 మీరు సత్యం గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ, నేర్చుకున్న వాటిని పాటించండి. (కీర్తన 119:105 చదవండి.) బైబిలు చదవడాన్ని అద్దంలో చూసుకోవడంతో పోల్చవచ్చు. మీలో మార్పులు చేసుకోవడం అవసరమని గుర్తిస్తే, ఆ మార్పుల్ని చేసుకోండి. (యాకో. 1:23-25) మీ నమ్మకాలను సమర్థించుకోవడానికి, సాత్వికుల హృదయాల్లో నుండి అబద్ధ బోధల్ని తీసేయడానికి బైబిలును ఖడ్గంలా ఉపయోగించండి. (ఎఫె. 6:17) మీరలా చేస్తూ, బైబిల్ని రాయడానికి ఉపయోగించుకోబడిన ప్రవక్తలు, మరితరులు నిజంగా ‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారనే’ విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చూపించండి.

[అధస్సూచి]

a కొన్ని అసలు పేర్లు కావు.

[అధ్యయన ప్రశ్నలు]

[29వ పేజీలోని బ్లర్బ్‌]

ప్రతీరోజు బైబిలు చదవండి. అలా చేస్తే దాన్నిచ్చిన యెహోవాపై మీకు ప్రేమ అధికమవుతుంది

[26వ పేజీలోని చిత్రం]

లేఖ మీద ఎవరు సంతకం చేస్తే, ఆ లేఖ వాళ్లు రాసినదిగానే పరిగణించబడుతుంది