కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞానవంతులు ‘నైపుణ్యవంతమైన నిర్దేశాన్ని’ సంపాదించుకుంటారు

జ్ఞానవంతులు ‘నైపుణ్యవంతమైన నిర్దేశాన్ని’ సంపాదించుకుంటారు

జ్ఞానవంతులు ‘నైపుణ్యవంతమైన నిర్దేశాన్ని’ సంపాదించుకుంటారు

కొందరు జీవితాన్ని సుదీర్ఘ సముద్ర ప్రయాణంతో పోల్చారు. అయినా జీవిత ప్రయాణాన్ని విజయవంతంగా సాగించడానికి మానవ జ్ఞానం సరిపోదని ఎన్నోసార్లు రుజువైంది. చాలామంది తుఫానులాంటి జీవన ఒడిదుడుకుల్లో ప్రమాదాల బారినపడ్డారు. (కీర్త. 107:23, 27) ఇంతకీ, జీవితంలో ఎదురయ్యే కష్టాలను సముద్ర ప్రయాణంలో ఉండే కష్టాలతో ఎందుకు పోల్చవచ్చు?

ప్రాచీన కాలంలో, సముద్ర ప్రయాణం చేయడం ఒక సాహసంలా ఉండేది, దానికి చాలా అనుభవం అవసరమయ్యేది. అది ఒక కళ, ఓడ నడపడంలో ఆరితేరిన వాళ్ల దగ్గర దాన్ని నేర్చుకునేవాళ్లు. (అపొ. 27:9-11) ఓడ నడిపే వ్యక్తి పాత్ర ఎంతో ముఖ్యమైనదని చూపించడానికి అనేక ప్రాచీన చిత్రపటాల్లో అతణ్ణి మిగతా వాళ్ల కంటే పెద్దగా చిత్రించేవాళ్లు. సముద్ర ప్రయాణం చేసేవాళ్లు ఆ సాహసానికి ఒడిగట్టే ముందు నక్షత్రాల గురించి, వీచే గాలి గురించి, ఉపయోగకరమైన ఇతర విషయాల గురించి తెలుసుకునేవాళ్లు. కొందరు ఓడ నావికులు ‘జ్ఞానవంతులని’ చూపించడానికి బైబిలు ‘నైపుణ్యంగల వాళ్లు’ అనే పదాన్ని ఉపయోగించింది.—యెహె. 27:8, NW అధస్సూచి.

పూర్వం సముద్ర ప్రయాణం ఎంత కష్టంగా ఉండేదో ఈ రోజుల్లో జీవిత సమస్యలతో పోరాడడం కూడా అంతే కష్టంగా ఉండవచ్చు. అలాంటి సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు?

‘నైపుణ్యవంతమైన నిర్దేశాన్ని’ ఎలా సంపాదించుకోవచ్చు?

జీవితం సముద్ర ప్రయాణం లాంటిదనే విషయాన్ని మనసులో ఉంచుకుని, బైబిల్లో ఉన్న ఈ సత్యాన్ని పరిశీలించండి, “జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును. వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను [“నైపుణ్యవంతమైన నిర్దేశాన్ని,” NW] సంపాదించుకొనును.” (సామె. 1:5, 6) ఇక్కడ ‘నైపుణ్యవంతమైన నిర్దేశం’ అని అనువదించబడిన హీబ్రూ పదం ప్రాచీన నావికాధికారి చేసే పనులను గురించి కూడా తెలియజేస్తుంది. అది నైపుణ్యంతో నడిపించే, నిర్దేశించే సామర్థ్యాన్ని సూచిస్తుంది.

మనం ‘నైపుణ్యవంతమైన నిర్దేశాన్ని’ సంపాదించుకొని జీవితం అనే ఈ సముద్రంలో విజయవంతంగా ప్రయాణించడం ఎలాగో తెలుసుకోవచ్చు. అయితే దానికెంతో కృషి అవసరం. సామెతల గ్రంథం సూచిస్తున్నట్లుగా మనం ‘జ్ఞానాన్ని, గ్రహణశక్తిని, బుద్ధి కుశలతను’ ఉపయోగించాలి. (సామె. 1:2-6; 2:1-9) అంతేగాక దేవుని నిర్దేశం సంపాదించుకోవడానికి మనం పట్టుదలతో కృషి చేయాలి. ఎందుకంటే, భక్తిహీనులు కూడా ‘ఆలోచనలు చెప్పగలరు’ కానీ అవి మోసకరమైన పనులు చేయడానికి తప్ప ఎందుకూ పనికిరావు.—సామె. 12:5.

దేవుని నిర్దేశం సంపాదించుకోవడానికి కృషి చేయాలంటే మనం ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ప్రాముఖ్యం. అలా అధ్యయనం చేస్తే మనం యెహోవా గురించి, ఆయన పరిపూర్ణ ప్రతిబింబమైన యేసుక్రీస్తు గురించి విలువైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. (యోహా. 14:9) అంతేగాక క్రైస్తవ కూటాల్లో మనం ఎన్నో జ్ఞానవంతమైన ఉపదేశాల్ని పొందవచ్చు. మన తల్లిదండ్రులతో సహా అనుభవమున్న ఇతర క్రైస్తవుల నుండి కూడా మనమెంతో నేర్చుకోవచ్చు.—సామె. 23:22.

ప్రమాదాల్ని పసిగట్టి ఏమి చేయాలో ముందుగానే నిర్ణయించుకోండి

ముఖ్యంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ‘నైపుణ్యవంతమైన నిర్దేశం’ చాలా అవసరమౌతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏమి చేయాలనే విషయంలో సందేహాలు వస్తే మనకు ఏమీ పాలుపోక ఏదోక నిర్ణయం తీసుకుంటే నాశనకరమైన ఫలితాలు రావచ్చు.—యాకో. 1:5, 6.

ఆసక్తికరమైన విషయమేమిటంటే ‘నైపుణ్యవంతమైన నిర్దేశం’ అని అనువదించబడిన పదం యుద్ధానికి సంబంధించి కూడా ఉపయోగించారు. ‘వివేకంతో [“నైపుణ్యవంతమైన నిర్దేశంతో,” NW] యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము’ అని బైబిలు చెబుతోంది.—సామె. 20:18; 24:6.

యుద్ధంలో వ్యూహం పన్నే యుద్ధ సూత్రధారిలా, మనం కూడా మన ఆధ్యాత్మికతకు పొంచివున్న ప్రమాదాల్ని పసిగట్టాలి. (సామె. 22:3) ఉదాహరణకు, మీరు ఒక కొత్త ఉద్యోగాన్ని లేదా పదోన్నతిని అంగీకరించాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సిరావచ్చు. అలాంటప్పుడు, ఎంత జీతం దొరుకుతుంది, వెళ్లి రావడానికి ఎంత సమయం పడుతుంది వంటి విషయాల గురించి మీరు ఆలోచిస్తారు. కానీ, ఆ పని బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటుందా, పనివేళలు క్రైస్తవ కార్యకలాపాలకు అడ్డుపడతాయా వంటి వాటి గురించి కూడా ఆలోచించాలి.—లూకా 14:28-30.

లోరెటా అనే సహోదరి ఒక కంపెనీలో మంచి ఉద్యోగం చేసేది. ఆ కంపెనీని వేరే ప్రదేశానికి మారుస్తున్నప్పుడు, అక్కడ లోరెటాకు ఒక ముఖ్యమైన పోస్టు ఇస్తామన్నారు. ఆ కంపెనీ యజమానులు ఆమెతో, “ఇలాంటి అవకాశం జీవితంలో మళ్లీ రాదు, అక్కడికి దగ్గర్లో రాజ్యమందిరం కూడా ఉందట” అన్నారు. కానీ తన జీవితాన్ని సరళం చేసుకుని సృష్టికర్తను మరింత ఎక్కువగా సేవించాలని లోరెటా అప్పటికే నిర్ణయించుకుంది. అయితే ఆ కొత్త పోస్టు క్రైస్తవ కార్యకలాపాలకు తగినంత సమయం లేకుండా చేస్తుందని ఆమె గ్రహించింది. ఆ కంపెనీ యజమానుల్లో ఒకరు, ఆమెను మాత్రమే కంపెనీలో నుండి తీసేయకూడదనుకుంటున్నామని వ్యక్తిగతంగా ఆమెతో చెప్పినప్పటికీ, ఆమె ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. ఇప్పటికి దాదాపు 20 ఏళ్లుగా క్రమ పయినీరు సేవ చేస్తున్న లోరెటా ‘నైపుణ్యవంతమైన నిర్దేశానికి,’ దేవుని వాక్యంలోని సలహాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని నమ్ముతోంది. ఆమె యెహోవాతో తనకున్న సంబంధాన్ని బలపర్చుకుంది, బైబిలు సత్యాన్ని అంగీకరించేందుకు అనేకమందికి సహాయంచేసే మంచి అవకాశం పొందింది.

కుటుంబంలో కూడా ‘నైపుణ్యవంతమైన నిర్దేశం’ అవసరం. పిల్లల్ని పెంచడం ఎన్నో సంవత్సరాలపాటు ఉండే బరువైన బాధ్యత. తమ కుటుంబం యెహోవాకు సన్నిహితంగా ఉండడానికి సహాయపడే విషయంలో, కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులందరి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. (సామె. 22:6) క్రైస్తవ తల్లిదండ్రులు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి, ‘పెరిగి పెద్దయ్యాక తలెత్తే సమస్యలను జ్ఞానవంతంగా ఎదుర్కోవాలంటే యెహోవాకు దగ్గరవ్వాలని మా మాటల ద్వారా, మాదిరి ద్వారా మా పిల్లలకు నేర్పిస్తున్నామా? ఉన్నంతలోనే తృప్తిగా జీవిస్తూ క్రైస్తవ పరిచర్యపై దృష్టి పెట్టాలంటే ఏమి చేయాలో అర్థం చేసుకోవడానికి మా జీవన విధానం వాళ్లకు సహాయం చేస్తోందా?’—1 తిమో. 6:6-10, 18, 19.

లోకంలోని ప్రజలు సాధారణంగా వస్తుపరమైన లేదా సామాజికపరమైన లక్ష్యాలను సాధించడానికి కృషిచేస్తుంటారు. కానీ, అలాంటివి జీవితంలో నిజమైన విజయాన్ని చేకూర్చవు. ఈ విషయాన్ని రాజైన సొలొమోను గ్రహించాడు. ఆయన దైవ ప్రేరణతో ఇలా రాశాడు, “దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు.” (ప్రసం. 8:12) దేవుని వాక్యం ఆధారంగా ఉన్న, దానికి అనుగుణంగా ఉన్న ‘నైపుణ్యవంతమైన నిర్దేశం’ సంపాదించుకోవడం ఎంత జ్ఞానయుక్తమైనదో ఆ లేఖనం నిరూపిస్తోంది.—2 తిమో. 3:16, 17.

[30వ పేజీలోని చిత్రం]

ఓడ నడిపే వ్యక్తి పాత్ర ఎంతో ముఖ్యమైనదని చూపించడానికి అతణ్ణి ఓడలోని మిగతా వాళ్ల కంటే పెద్దగా చిత్రించేవాళ్లు

[క్రెడిట్‌ లైను]

Su concessione del Ministero per i Beni e le Attività Culturali. ఈ చిత్రాన్ని ఏ విధంగానూ పునరుత్పత్తి చేయకూడదు లేదా నకలు చేయకూడదు.