కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వార్షిక కూటం నివేదిక

ఐక్యతను రుచి చూపించిన, ఉత్తేజకరమైన ప్రణాళికలను వెలువరించిన కూటం!

ఐక్యతను రుచి చూపించిన, ఉత్తేజకరమైన ప్రణాళికలను వెలువరించిన కూటం!

వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా వార్షిక కూటాలు ఎప్పుడూ నూతనోత్సాహాన్ని నింపుతాయి. 2011 అక్టోబరు 1, శనివారం రోజు జరిగిన 127వ వార్షిక కూటం సరిగ్గా అలాంటి అనుభూతినే ఇచ్చింది! అమెరికా, న్యూజెర్సీలోని జెర్సీ నగరంలో ఉన్న యెహోవాసాక్షుల సమావేశ హాలులో ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన అతిథులు సమావేశమయ్యారు.

కూటానికి ఆనందంగా వచ్చిన సభికులను పరిపాలక సభ సభ్యుడు గెరిట్‌ లాష్‌ సాదరంగా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మనం సాటిలేని అంతర్జాతీయ ఐక్యతను అనుభవిస్తున్నామని దాదాపు 85 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో ఆయన అన్నాడు. అలాంటి ఐక్యత ఒక మంచి సాక్ష్యంగా పనిచేస్తుంది, యెహోవాకు ఘనత తీసుకొస్తుంది. నిజానికి ఈ కార్యక్రమంలో ఐక్యత గురించిన ప్రస్తావన చాలాసార్లు వచ్చింది.

మెక్సికో గురించి ఒక మంచి నివేదిక

కార్యక్రమం మొదటి భాగంలో యెహోవా ప్రజల మధ్య ఉన్న ఐక్యతను నొక్కిచెప్పారు. మధ్య అమెరికాలోని ఆరు బ్రాంచి కార్యాలయాలను మెక్సికో బ్రాంచి కార్యాలయంలో విలీనం చేయడం గురించి మెక్సికో బెతెల్‌ నుండి వచ్చిన సహోదరుడు బాల్టాసార్‌ పెర్లా తోటి బెతెల్‌ సభ్యుల్లో ముగ్గురిని ఇంటర్వ్యూ చేశాడు. విలీనం తర్వాత విభిన్న సంస్కృతులకు, దేశాలకు చెందిన సహోదరసహోదరీలు రావడంవల్ల మెక్సికో బెతెల్‌ కుటుంబానికి మరింత వైవిధ్యత చేకూరింది. వివిధ ప్రాంతాల నుండి గొప్ప సంఖ్యలో వచ్చిన తోటి విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. అది చూసినప్పుడు దేవుడు దేశాల మధ్య ఉన్న సరిహద్దులనే అడ్డుగోడల్ని కూల్చేశాడా అనిపించింది!

తమ దేశాల్లోని బ్రాంచి కార్యాలయాలు మెక్సికో బ్రాంచి కార్యాలయంతో విలీనమైపోయాయి కాబట్టి తాము యెహోవా సంస్థకు దూరమైపోయామనే భావన అక్కడున్న వాళ్లకు రాకుండా చూడడం ఒక సవాలు అనిపించింది. అందుకే, నేరుగా బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించడానికి వీలుగా మారుమూల ప్రాంతాల్లోని సంఘాలతో సహా ప్రతీ సంఘానికి ఈ-మెయిల్‌ సౌకర్యం కల్పించారు.

జపాన్‌ గురించిన తాజా నివేదిక

జపాన్‌లో 2011 మార్చిలో వచ్చిన భూకంపం వల్ల, సునామీల వల్ల మన సహోదరుల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నమయ్యాయో అక్కడి బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన జేమ్స్‌ లింటన్‌ వివరించాడు. చాలామంది సాక్షులు ఆత్మీయులను, ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నారు. విపత్తుకు గురవ్వని ప్రాంతంలోని సాక్షులు 3,100 కన్నా ఎక్కువ ఇళ్లలో బాధితులకు ఆశ్రయమిచ్చారు, కొన్ని వందల వాహనాలను వాళ్ల కోసం వినియోగించారు. రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీల్లో పనిచేసే స్వచ్ఛంద సేవకులు సహోదరుల ఇళ్లను మరమ్మత్తు చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. అవసరమైన ప్రతీచోట పనిచేయడానికి 1,700 కన్నా ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు ముందుకొచ్చారు. అమెరికా నుండి వచ్చిన స్వచ్ఛంద సేవకుల జట్టు ఒకటి రాజ్యమందిరాలను బాగు చేసేందుకు సహాయం చేసింది. ఆ పనికోసం 575 మంది స్వచ్ఛంద సేవకులు శ్రమించారు.

బాధితుల ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరాలను తీర్చడంపైనే సహోదరులు దృష్టి నిలిపారు. దాదాపు 400 కన్నా ఎక్కువమంది పెద్దలు కాపరి సందర్శనం అవసరమైన సహోదరులను సందర్శించారు. బాధితులను ప్రోత్సహించేందుకు, ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి ఇద్దరు జోన్‌ పర్యవేక్షకులు విపత్తు ప్రభావిత ప్రాంతానికి వచ్చినప్పుడు పరిపాలక సభ ఎంత శ్రద్ధ చూపిస్తుందో స్పష్టంగా తెలిసింది. భూవ్యాప్తంగా ఉన్న సాక్షులు తమ మాటల్లో, చేతల్లో అక్కడి సహోదరుల మీద చూపించిన శ్రద్ధ నిజంగా ఎంతో ఓదార్పునిచ్చింది.

చట్టపరమైన విజయాలు

బ్రిటన్‌ బ్రాంచి నుండి వచ్చిన స్టీఫెన్‌ హార్డీ ఇటీవల మనం సాధించిన చట్టపరమైన విజయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రేక్షకులు పూర్తి ఏకాగ్రతతో విన్నారు. ఉదాహరణకు, అసోసియేషన్‌ ఆఫ్‌ జెహోవస్‌ విట్నెసెస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ దాదాపు 369 కోట్ల రూపాయల పన్ను కట్టాలని ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన విషయం గురించి ఆ సహోదరుడు మాట్లాడాడు. అయితే, మత స్వేచ్ఛను సమర్థిస్తున్న యూరోపియన్‌ కన్వెన్షన్‌లోని 9వ ఆర్టికల్‌ను ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానం మనకు అనుకూలంగా తీర్పును ప్రకటించడంతో సమస్యకు తెరపడింది. ఆ తీర్పులోని ఈ మాటల్ని పరిశీలిస్తే ఈ కేసు డబ్బుకు సంబంధించింది కాదని అర్థమౌతోంది: ‘ఒక మత గుంపును అధికారికంగా ఒప్పుకోకపోవడం, దాన్ని నిర్వీర్యం చేయాలని చూడడం, దాని కార్యకలాపాలను కించపర్చేలా మాట్లాడడం వంటివన్నీ యూరోపియన్‌ కన్వెన్షన్‌లోని 9వ ఆర్టికల్‌ కల్పించిన హక్కుకు భంగం కలిగించేవే.’

అర్మేనియా దేశానికి సంబంధించిన కేసులో కూడా ఆ కోర్టు మనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సైనిక సేవ విషయంలో యూరోపియన్‌ కన్వెన్షన్‌ పౌరులకు మినహాయింపు ఇవ్వడం లేదని 1965 నుండి యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానం భావిస్తూ వచ్చింది. కానీ, ‘తీవ్రమైన అంతర్గత సంఘర్షణ మూలంగా సైనిక సేవను తిరస్కరించే హక్కును’ పౌరులకు కల్పించడం యూరోపియన్‌ కన్వెన్షన్‌ కర్తవ్యమని యూరోపియన్‌ కోర్టులో ఎక్కువ అధికారం గల ప్రధాన మండలి (గ్రాండ్‌ ఛేంబర్‌) ప్రకటించింది. ఆ తీర్పును బట్టి చూస్తే అర్మేనియాతో సహా అజర్‌బైజాన్‌, టర్కీ వంటి దేశాలు కూడా ఆ హక్కును కల్పించాలి.

నిర్మాణ ప్రాజెక్టులు

ఆ తర్వాత పరిపాలక సభ సభ్యుడు గయ్‌ పియర్స్‌ మాట్లాడుతూ, హాజరైనవాళ్లంతా న్యూయార్క్‌లో జరుగుతున్న మన నిర్మాణ పనుల గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారని అన్నాడు. న్యూయార్క్‌లో ఉన్న పాటర్‌సన్‌లో, వాల్‌కిల్‌లో జరుగుతున్న పనులకు అలాగే వార్విక్‌లో, టక్సీడోలో ఇటీవలే కొనుగోలు చేసిన స్థలాల్లో జరుగుతున్న పనులకు సంబంధించిన వీడియోను చూపించాడు. వాల్‌కిల్‌లో భవన నిర్మాణం 2014లో పూర్తయ్యేసరికి అదనంగా 300 కన్నా ఎక్కువ గదులు ఉపయోగంలోకి వస్తాయి.

వార్విక్‌లో మనం కొనుగోలు చేసిన 248 ఎకరాల స్థలంలో నిర్మాణ పనులు మొదలుపెట్టాలనే ఆలోచన ఉంది. సహోదరుడు గయ్‌ పియర్స్‌ ఇలా అన్నాడు: “వార్విక్‌ విషయంలో యెహోవా ఉద్దేశమేమిటో ఖచ్చితంగా తెలియకపోయినా, యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని అక్కడకు మార్చాలనే ఉద్దేశంతో ఆ స్థలంలో పనులు ప్రారంభిస్తున్నాం.” వార్విక్‌కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 50 ఎకరాల స్థలంలో యంత్రాలను, నిర్మాణ సామాగ్రిని ఉంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా ఆయన ఇలా అన్నాడు: “నిర్మాణ పనులకు అనుమతి దొరకగానే పనులు ప్రారంభించి నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. ఆ తర్వాత బ్రూక్లిన్‌లో ఉన్న మన ఆస్తుల్ని అమ్మేయవచ్చు.”

“మహాశ్రమలు దగ్గరౌతున్నాయనే విషయంలో పరిపాలక సభ అభిప్రాయం మారిందా?” అని ప్రేక్షకులను అడుగుతూ సహోదరుడు పియర్స్‌ ఇలా చెప్పాడు: “అస్సలు మారలేదు. మహాశ్రమల వల్ల ఆ పనికి ఆటంకం కలిగితే మరీ మంచిది, అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది?”

గర్జించే సింహం విషయంలో జాగ్రత్త!

ఆ తర్వాత పరిపాలక సభ సభ్యుడు స్టీఫెన్‌ లెట్‌ 1 పేతురు 5:8లోవున్న ఈ మాటల ఆధారంగా ప్రసంగమిచ్చాడు: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” సింహానికి ఉండే కొన్ని లక్షణాలను బట్టి చూస్తే, పేతురు అపవాదిని సింహంతో పోల్చడం తగినదేనని సహోదరుడు లెట్‌ అన్నాడు.

సాధారణంగా సింహం మనుష్యుల కన్నా బలమైనది, వేగంగా పరుగెత్తుతుంది కాబట్టి మనం దానితో, ఇంకో మాటలో చెప్పాలంటే సాతానుతో పోరాడడానికి లేదా అతనికి దొరకకుండా పారిపోవడానికి మనకున్న శక్తి సరిపోదు. మనకు యెహోవా సహాయం అవసరమౌతుంది. (యెష. 40:31) మాటున ఉండి దాడి చేసే సింహంలా సాతాను ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నవాళ్ల మీద దాడిచేస్తాడు కాబట్టి మనం ఆ అంధకారంలో పడిపోకుండా జాగ్రత్తపడాలి. సింహం సాధు జంతువులను, నిద్రిస్తున్న వాటి పిల్లలను చంపినట్టే, సాతాను మనుష్యుల్ని చంపుతాడు. అలా కర్కశంగా చంపడమంటే సాతానుకు ఇష్టం. సింహం ఆకలి తీరిన తర్వాత దాడికి గురైన జంతువు నామరూపాల్లేకుండా పోతుంది, అలాగే సాతానుకు చిక్కిన వాళ్ల ‘కడవరి స్థితి, మొదటి స్థితికంటె మరీ చెడ్డగా’ తయారౌతుంది. (2 పేతు. 2:20) కాబట్టి మనం సాతానును ఎదిరించాలి, మనం నేర్చుకున్న బైబిలు సూత్రాలను ఎల్లప్పుడూ పాటించాలి.​—1 పేతు. 5:9.

యెహోవా ఆలయంలో మీకున్న స్థానాన్ని బట్టి కృతజ్ఞతతో ఉండండి

ఆ తర్వాత, పరిపాలక సభ సభ్యుడు సామ్యూల్‌ హెర్డ్‌ మాట్లాడుతూ, “యెహోవా ఆలయంలో మనందరికీ ఒక స్థానం ఉంది” అన్నాడు. యేసు విమోచన క్రయధనం ఆధారంగా యెహోవా దేవుణ్ణి ఆరాధించే ఏర్పాటే ఆయన “ఆలయము.” ఈ ఆధ్యాత్మిక ఆలయంలో క్రైస్తవులందరికీ ఒక స్థానం ఉంది. దీన్ని మనం చాలా ప్రశస్తంగా ఎంచాలి. దావీదులా, మనం కూడా ‘యెహోవా మందిరములో జీవిత కాలమంతా నివసించాలని’ కోరుకుంటాం.​—కీర్త. 27:4.

కీర్తన 92:12-14ను ఉద్దేశించి మాట్లాడుతూ, “మనం ప్రగతి సాధించడానికి యెహోవా ఎలా సహాయం చేస్తాడు?” అని సహోదరుడు హెర్డ్‌ శ్రోతల్ని అడిగాడు. దానికి జవాబిస్తూ ఆయనిలా అన్నాడు, “ఆధ్యాత్మిక పరదైసులో దేవుడు మనకు ఆశ్రయమిస్తాడు, కాపాడతాడు, ఉత్తేజకరమైన సత్య జలాల్ని అందిస్తాడు. అందుకోసం మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం.” ఆ తర్వాత ఆయన ప్రేక్షకులను ఇలా ప్రోత్సహించాడు: “యెహోవా ఆలయంలో ఇప్పుడూ ఎల్లప్పుడూ తృప్తిగా జీవిద్దాం.”

క్రైస్తవులు దేవుని వాక్యాన్ని గౌరవిస్తారు

ఆ తర్వాత, పరిపాలక సభ సభ్యుడు డేవిడ్‌ స్ప్లేన్‌ ప్రసంగిస్తూ, క్రైస్తవులు అన్ని కాలాల్లోనూ దేవుని వాక్యాన్ని గౌరవించారని అన్నాడు. మొదటి శతాబ్దంలో, సున్నతికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి వాళ్లు దేవుని వాక్యం మీద ఆధారపడ్డారు. (అపొ. 15:16, 17) కానీ, రెండవ శతాబ్దంలో గ్రీకు తత్వజ్ఞానంలో శిక్షణ పొందిన నామకార్థ క్రైస్తవులు లేఖనాల కన్నా తమకున్న తత్వజ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఆ తర్వాత, మరితరులు బైబిలు బోధల్ని కాకుండా చర్చి పాదిరీల, రోమా చక్రవర్తుల తప్పుడు అభిప్రాయాల్ని బోధిస్తూ అబద్ధ సిద్ధాంతాలను పుట్టించారు.

సత్యాన్ని సమర్థించే నిజమైన అభిషిక్త క్రైస్తవులు ఈ భూమ్మీద అన్ని కాలాల్లోనూ ఉంటారని యేసు ఒక ఉపమానంలో సూచించాడని ఆ సహోదరుడు అన్నాడు. (మత్త. 13:24-30) ఫలానా వాళ్లు అభిషిక్తులని మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా, గడిచిన శతాబ్దాల్లో ఎంతోమంది లేఖన విరుద్ధమైన నమ్మకాల్ని, ఆచారాల్ని ఖండించారు. 9వ శతాబ్దంలో లయన్స్‌కు చెందిన ఆర్చ్‌బిషప్‌ అగోబార్‌, బ్రవీకి చెందిన పీటర్‌, 12వ శతాబ్దంలో లౌసాన్‌కు చెందిన హెన్రీ, వాల్డెస్‌ (వాల్డో), 14వ శతాబ్దంలో జాన్‌ విక్లిఫ్‌, 16వ శతాబ్దంలో విలియం టిండేల్‌, 19వ శతాబ్దంలో హెన్రీ గ్రూ, జార్జ్‌ స్టార్జ్‌ వంటివాళ్లందరూ తప్పుడు బోధల్ని ఖండించినవాళ్లే. వాళ్లలాగే, నేడు యెహోవాసాక్షులు లేఖన ప్రమాణాల్ని సమర్థిస్తున్నారు, సత్యానికి ఆధారం బైబిలేనని నమ్ముతున్నారు. అందుకే పరిపాలక సభ, “నీ వాక్యమే సత్యము” అని చెబుతున్న యోహాను 17:17ను 2012వ సంవత్సరం వార్షిక వచనంగా ఎంపిక చేసింది.

శిక్షణకు, సేవకు సంబంధించి పులకరింపజేసే మార్పులు

ఆ తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన ఆంథనీ మారిస్‌ మిషనరీలకు, ప్రత్యేక పయినీర్లకు సంబంధించిన కొన్ని మార్పుల గురించి ప్రకటించారు. 2012 సెప్టెంబరు కల్లా ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో, క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాల తరగతులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. గిలియడ్‌ పాఠశాల లక్ష్యం కూడా మారింది. అప్పటికే ఏదో ఒక రకమైన ప్రత్యేక పూర్తికాల సేవలో అంటే గిలియడ్‌ శిక్షణ లేకుండా మిషనరీలుగా సేవచేస్తున్న వాళ్లకూ, ప్రత్యేక పయినీర్లుగా, ప్రయాణ పర్యవేక్షకులుగా లేదా బెతెల్‌ సభ్యులుగా ఉన్నవాళ్లకూ గిలియడ్‌ పాఠశాల గత సంవత్సరం అక్టోబరు నుండి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అందులో పట్టభద్రులయ్యే వాళ్లు బ్రాంచి కార్యాలయాల్లో గానీ, ప్రయాణ సేవలో గానీ, ప్రకటనా పనిలో సంఘాల్ని ప్రోత్సహించే అవకాశం ఎక్కువగా ఉండే అధిక జనాభా గల ప్రాంతాల్లో గానీ సేవచేస్తూ దేవుని ప్రజల్ని బలపరుస్తారు, ఆధ్యాత్మికంగా స్థిరపరుస్తారు.

మరికొంతమంది ప్రత్యేక పయినీర్లు సువార్త చేరని మారుమూల ప్రాంతాల్లో ప్రకటనా పనిని ఆరంభిస్తారు. 2012 జనవరి 1 కల్లా ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలలో, క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాలలో పట్టభద్రులైన కొంతమందిని తాత్కాలిక ప్రత్యేక పయినీర్లుగా నియమిస్తారు, వాళ్లు మారుమూల ప్రాంతాల్లో సువార్త పనిని ఆరంభించి, దాన్ని విస్తృతపరుస్తారు. అలా నియమితులయ్యే వాళ్లు ముందుగా ఒక సంవత్సరం పాటు ప్రత్యేక పయినీర్లుగా ఉంటారు, ఆ విధంగా మూడు సంవత్సరాల వరకు వాళ్ల నియామకాన్ని బ్రాంచి కార్యాలయం ఒక్కో సంవత్సరం పొడిగిస్తుంది. ఈ కాలమంతటిలో చక్కని ఫలితాలను సాధించేవాళ్లను శాశ్వత ప్రత్యేక పయినీర్లుగా నియమిస్తారు.

2011 వార్షిక కూటంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తనకు మహిమ, స్తుతి కలిగేలా మనం ప్రకటనా పనిని విస్తృతపర్చడానికి, ప్రపంచవ్యాప్త సహోదరత్వాన్ని మరింతగా ఐక్యపర్చడానికి చేసిన కొత్త ఏర్పాట్లను యెహోవా ఆశీర్వదిస్తాడని ఆశిద్దాం.

[18, 19 పేజీల్లోని బాక్సు/చిత్రాలు]

వాళ్ల గురించి మరిన్ని వివరాలు తెలిశాయి

పరిపాలక సభ సభ్యులుగా సేవచేసిన తమ భర్తల్ని కోల్పోయిన తొమ్మిది మంది సహోదరీల్లో ఐదుగురిని ఆ రోజు ఇంటర్వ్యూ చేశారు. సహోదరీలు మారీన సిడ్లిక్‌, ఈడత్‌ స్యూటర్‌, మలీట జారస్‌, మెల్బ బ్యారీ, సిడ్నీ బార్బర్‌ సత్యాన్ని ఎలా తెలుసుకున్నారో, పూర్తికాల సేవలోకి ఎలా అడుగుపెట్టారో వివరించారు. తమ మధుర జ్ఞాపకాలను, తమ భర్తల గురించిన కొన్ని విషయాలను, తమ భాగస్వామితో కలిసి అనుభవించిన ఆశీర్వాదాలను వాళ్లు ప్రేక్షకులకు చెప్పారు. ఇంటర్వ్యూలు అయ్యాక ప్రేక్షకులు ఆంగ్ల పాటల పుస్తకంలోని “నమ్మకమైన స్త్రీలు, క్రైస్తవ సహోదరీలు” అనే శీర్షికగల 86వ పాటను పాడడం హృదయాలను కదిలించింది.

[చిత్రాలు]

(పైన) డానియేల్‌, మారీనా సిడ్లిక్‌; గ్రాంట్‌, ఈడత్‌ స్యూటర్‌; థియోడోర్‌, మలీట జారస్‌

(కింద) లాయిడ్‌, మెల్బ బ్యారీ; క్యారీ, సిడ్నీ బార్బర్‌

[16వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఆరు బ్రాంచి కార్యాలయాలను మెక్సికో బ్రాంచిలో విలీనం చేశారు

మెక్సికో

గ్వాటిమాల

హోండూరాస్‌

ఎల్‌ సాల్వడార్‌

నికరాగ్వా

కోస్టరికా

పనామా

[17వ పేజీలోని చిత్రం]

న్యూయార్క్‌లోని వార్విక్‌లో యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయ భవన సముదాయాల నమూనా