కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది

మన పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది

మన పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది

రాజైన ఆసా తన సైన్యాలను వెంటబెట్టుకుని ఒక లోయలోకి దూసుకెళ్లాడు. ఆయన యూదా పర్వత ప్రాంతాల నుండి కింద ఉన్న తీర ప్రాంత మైదానాల వరకు వేగంగా ప్రయాణిస్తూ లోయ విశాలంగా మారుతున్న చోట కాసేపాగి ఆయాసం తీర్చుకున్నాడు. అక్కడి లోయలో పెద్ద శత్రుసైన్యం మకాం వేసివుంది. కూషు దేశానికి చెందిన ఆ శత్రు సైన్యపు సంఖ్య అక్షరాలా పది లక్షలు. కానీ, ఆసా సైన్యం చూస్తే ఐదున్నర లక్షల మంది కూడా లేరు.

యుద్ధం పొంచివున్న ఆ సమయంలో ఆసా మదిలో అన్నిటికన్నా ఎక్కువగా ఏది మెదిలివుండవచ్చు? సైన్యాధిపతులకు ఆజ్ఞలు జారీచేయడమా? సైన్యాలను ప్రోత్సహించడమా? కుటుంబానికి ఉత్తరాలు పంపడమా? అవేవీ కాదు! అలాంటి సంక్షోభకరమైన పరిస్థితిలో ఆసా ప్రార్థన చేశాడు.

ఆసా ఏమని ప్రార్థించాడో, ఆ సందర్భంలో ఏమి జరిగిందో పరిశీలించడానికి ముందు ఆయన ఎలాంటివాడో పరిశీలిద్దాం. అసలు అప్పుడు ఆయన ఎందుకు ప్రార్థించాడు? ఆ సమయంలో దేవుని సహాయం కోసం ప్రార్థించడం సరైనదేనా? తన సేవకులు చేసే పనులను యెహోవా ఎలా ఆశీర్వదిస్తాడనే దాని గురించి ఆసాకు సంబంధించిన వృత్తాంతం మనకు ఏమి నేర్పిస్తోంది?

ఆసా చేసిన మంచి పనులు

ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా చీలిపోయిన తర్వాతి 20 ఏళ్లలో, యూదా ప్రజలు అన్యమత ఆచారాల వల్ల పూర్తిగా భ్రష్టుపట్టి పోయారు. సా.శ.పూ. 977లో ఆసా రాజయ్యే సమయానికల్లా, రాజు ఆస్థానంలోని వాళ్లు కూడా కనానీయుల సంతాన సాఫల్య దేవతలను ఆరాధిస్తూ దిగజారిపోయి ఉన్నారు. కానీ ఆసా మాత్రం ‘తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా నడుచుకున్నాడు’ అని ఆయన పరిపాలనకు సంబంధించిన బైబిలు వృత్తాంతం చెబుతోంది. ఆసా ‘అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించాడు.’ (2 దిన. 14:2, 3) అంతేకాక మతం పేరిట విపరీతమైన లైంగిక దుర్నీతికి పాల్పడుతున్న “పురుషగాములను” యూదా రాజ్యంలో నుంచి ఆయన వెళ్లగొట్టాడు. అంతేకాక, ‘పితరుల దేవుడైన యెహోవాను’ ఆశ్రయించమని, దేవుని ‘ధర్మశాస్త్రమును, ఆయన విధిని’ పాటించమని కూడా ఆసా ప్రజలను ప్రోత్సహించాడు.—1 రాజు. 15:12, 13; 2 దిన. 14:4.

సత్యారాధన విషయంలో ఆసాకు ఉన్న ఆసక్తికి మెచ్చి దానికి ప్రతిఫలంగా యెహోవా ఆయనకు ఎన్నో ఏళ్ల పాటు నెమ్మదిని అనుగ్రహించాడు. అందుకే రాజు ఇలా చెప్పగలిగాడు, “మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు.” ప్రజలు ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ యూదా రాజ్యంలోని నగరాలను పటిష్ఠం చేసుకున్నారు. “వారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి” అని బైబిలు చెబుతోంది.—2 దిన. 14:1, 6, 7.

యుద్ధ భూమిలో

ఆసా మంచి పనులు చేశాడు కాబట్టి , లేఖనాల్లో ప్రస్తావించబడిన అతి పెద్ద మానవ సైన్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన యెహోవాకు ప్రార్థన చేశాడంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. విశ్వాసంతో చేసే పనులకు యెహోవా ప్రతిఫలం ఇస్తాడని ఆసాకు తెలుసు. ప్రార్థనలో ఆసా యెహోవా సహాయం కోసం వేడుకున్నాడు. దేవుని మీద ఆధారపడి ఆయన సహాయం తీసుకున్నట్లయితే, ఎంత బలగమున్న సైన్యమైనా, ఎంత శక్తిగల సైన్యమైనా తమను ఏమీ చేయలేదని ఆసా గుర్తించాడు. ఆ పోరులో తాము ఓడిపోతే యెహోవా నామానికి అపకీర్తి వస్తుంది కాబట్టి, ఆసా దేవునికి చేసిన ప్రార్థనలో ఆ విషయాన్నే చేరుస్తూ ఇలా విన్నవించుకున్నాడు, “మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము. నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి యున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము.” (2 దిన. 14:11) ఆయన చేసిన ప్రార్థనను ఇంకో మాటలో చెబితే ఇలా ఉంటుంది, ‘యెహోవా, కూషీయులు నీ మీదే దాడి చేస్తున్నారు. అల్పులైన ఈ మానవులు నీ నామము ధరించిన వాళ్లను ఓడిస్తే నీ నామానికి కళంకం వస్తుంది కాబట్టి అలా జరగనివ్వకు.’ దానికి జవాబుగా “యెహోవా ఆ కూషీయులను ఆసా యెదుటను, యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.”—2 దిన. 14:12.

ఈ రోజుల్లో యెహోవా ప్రజలు శక్తిగల ఎంతోమంది వ్యతిరేకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వాళ్లతో మనం అసలైన యుద్ధ భూమిలో నిజమైన ఆయుధాలతో యుద్ధం చేయం. తన నామమున ఆధ్యాత్మిక యుద్ధం చేసే నమ్మకమైన సేవకులందరికీ యెహోవా విజయాన్ని ప్రతిఫలంగా ఇస్తాడని మనం గట్టిగా నమ్మవచ్చు. అంతటా వ్యాపించివున్న లైంగిక విచ్ఛలవిడితనానికి లొంగిపోకుండా ఉండడానికి, మన బలహీనతలను జయించడానికి, మన కుటుంబాన్ని చెడు ప్రభావాల నుండి కాపాడడానికి మనం వ్యక్తిగతంగా పోరాడాల్సి ఉంటుంది. అయితే మనం ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా, ఆసా చేసిన ప్రార్థన నుండి మనం ప్రోత్సాహాన్ని పొందవచ్చు. ఆయన పొందిన విజయం యెహోవా విజయమని చెప్పవచ్చు. దేవుని మీద ఆధారపడే వాళ్లందరూ ఏమి ఆశించవచ్చో అది చూపించింది. మానవులెవ్వరూ యెహోవాపై విజయం సాధించలేరు.

ప్రోత్సాహం, హెచ్చరిక

ఆసా యుద్ధం నుండి తిరిగి వచ్చిన తరువాత అజర్యా ప్రవక్త ఆయనను కలిసి ఆయనను ప్రోత్సహించడమే కాదు ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. ఆ ప్రవక్త ఇలా అన్నాడు, “ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును. . . . మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.”—2 దిన. 15:1, 2, 7.

ఈ మాటలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. మనం నమ్మకంగా యెహోవా సేవ చేసినంత కాలం ఆయన మనకు తోడుగా ఉంటాడని ఆ మాటలు చూపిస్తున్నాయి. మనం సహాయం కోసం ఆయనను వేడుకుంటే ఆయన మన ప్రార్థన తప్పక వింటాడని మనం నమ్మవచ్చు. “ధైర్యము వహించుడి” అని అజర్యా చెప్పాడు. సాధారణంగా, సరైనది చేయాలంటే ఎంతో ధైర్యం అవసరమౌతుంది, కానీ యెహోవా సహాయంతో మనం సరైనది చేయవచ్చు.

ఆసా అవ్వయైన మయకా ‘అసహ్యమైన ఒక దేవతాస్తంభం చేయించి’ నిలబెట్టించింది. అందువల్ల ఆసా ఆమెను “పట్టపుదేవి” స్థానం నుండి తొలగించాల్సి వచ్చింది. ఆయనకు కష్టం అనిపించినా ఆ పని చేశాడు, అంతేకాక ఆ విగ్రహాన్ని కూడా కాల్చేశాడు. (1 రాజు. 15:13) ఆసా కృతనిశ్చయాన్ని, ధైర్యాన్ని చూపించినందుకు యెహోవా ఆయనను ఆశీర్వదించాడు. మన సొంతవాళ్లు యెహోవా పట్ల యథార్థంగా ఉన్నా లేకపోయినా మనం ఆసాలాగే ధైర్యంగా యెహోవాను అంటిపెట్టుకుని ఉండాలి, ఆయన నీతి ప్రమాణాలను పాటిస్తూ ఉండాలి. మనమలా నమ్మకంగా ఉంటే యెహోవా మనకు తగిన ప్రతిఫలం ఇస్తాడు.

ఆసాకు మరో ప్రతిఫలం లభించింది. మతభ్రష్ట ఉత్తర రాజ్యంలోని చాలామంది ఇశ్రాయేలీయులు ఆసాకు యెహోవా తోడుగా ఉన్నాడని గ్రహించి యూదా రాజ్యంలోకి వచ్చారు. వాళ్లు సత్యారాధనను ఎంత విలువైనదిగా ఎంచారంటే, వాళ్లు యెహోవా సేవకుల మధ్య జీవించడానికి తమ ఇళ్లను కూడా వదిలి వచ్చేశారు. అప్పుడు ఆసా, యూదాలోని వాళ్లందరూ సంతోషంగా, ‘పూర్ణహృదయంతో, పూర్ణమనస్సుతో ఆయనను వెదకుతామని ప్రమాణము చేశారు.’ దానివల్ల ఏమి జరిగింది? “యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.” (2 దిన. 15:9-15) నీతిని ప్రేమించేవాళ్లు స్వచ్ఛారాధన చేయడం మొదలుపెడితే మనకు ఎంత సంతోషం కలుగుతుందో కదా!

అయితే, అజర్యా ప్రవక్త చెప్పిన మాటల్లో ఒక హెచ్చరిక కూడా ఉంది. ఆయనిలా హెచ్చరించాడు, ‘మీరు యెహోవాను విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు.’ మన విషయంలో ఎన్నడూ అలా జరగకుండా చూసుకోవాలి, లేకపోతే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి! (2 పేతు. 2:20-22) ఆసాకు అలాంటి హెచ్చరికను ఇవ్వమని యెహోవా అజర్యాకు ఎందుకు చెప్పాడో లేఖనాలు వివరించడం లేదు కానీ రాజు మాత్రం ఆ హెచ్చరికను పట్టించుకోలేదు.

“నీవు మతి తప్పి ప్రవర్తించితివి”

ఆసా పరిపాలన 36వ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. తన ప్రజలు ఆసా పట్ల, స్వచ్ఛారాధన పట్ల యథార్థంగా ఉండకుండా చేయాలనేమో బయెషా యెరూషలేముకు ఉత్తరాన 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామా నగర పొలిమేరలను పటిష్ఠం చేయడం మొదలుపెట్టాడు. కూషీయులు దాడిచేయడానికి వచ్చినప్పుడు దేవుని సహాయం తీసుకున్న ఆసా ఈసారి అలా చేయకుండా మనుష్యులపై ఆధారపడ్డాడు. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం మీద దాడి చేయమని కోరుతూ ఆయన సిరియా రాజుకు బహుమతి పంపించాడు. సిరియన్లు వచ్చి కొన్నిసార్లు దాడి చేసేసరికి, బయెషా రామా నుండి వెళ్లిపోయాడు.—2 దిన. 16:1-5.

ఆసా పనులు యెహోవాకు నచ్చలేదు, ఆ విషయం ఆయనకు చెప్పడానికి యెహోవా హనానీ ప్రవక్తను పంపించాడు. కూషీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు తనకు ఎలా సహాయం చేశాడో ఆసాకు తెలుసు కాబట్టి, “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” అని ఆయన గ్రహించి ఉండాల్సింది. ఆసాకు ఎవరో తప్పుడు సలహా ఇచ్చి ఉంటారు. లేదా బయెషా, ఆయన సైన్యాల వల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండదనీ, సొంతగా వాళ్లను ఎదుర్కోగలననీ ఆసా అనుకుని ఉంటాడు. ఏదేమైనా, ఆసా యెహోవాపై ఆధారపడకుండా మానవ ఆలోచనపై ఆధారపడ్డాడు. “ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును” అని హనానీ చెప్పాడు.—2 దిన. 16:7-9.

దానికి ఆసా కోపంగా ప్రతిస్పందించాడు. ఆయన ఆగ్రహంతో హనానీ ప్రవక్తను బందీగృహంలో వేయించాడు. (2 దిన. 16:10) ‘ఎన్నో ఏళ్లపాటు విశ్వసనీయంగా ఉన్న నన్ను గద్దించడమేంటి!’ అని ఆసా అనుకుని ఉంటాడా? వయసు పైబడుతున్నందుకు ఆయన కాస్త విచక్షణ కోల్పోయి ఉంటాడా? ఈ విషయం గురించి బైబిలు ఏమీ చెప్పడం లేదు.

ఆసా తన పరిపాలన 39వ సంవత్సరంలో, పాదాల్లో వచ్చిన జబ్బుతో ఎంతో బాధపడ్డాడు. “దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను” అని ఆ వృత్తాంతం చెబుతోంది. అప్పుడు ఆసా తన ఆధ్యాత్మికత గురించి శ్రద్ధ తీసుకోలేదనిపిస్తోంది. తన పరిపాలన 41వ సంవత్సరంలో చనిపోయే సమయానికి ఆసా బహుశా ఆధ్యాత్మికంగా అదే స్థితిలో ఉండివుంటాడు.—2 దిన. 16:12-14.

ఆసాకున్న మంచి లక్షణాలు, స్వచ్ఛారాధన పట్ల ఆయనకున్న ఆసక్తి ఆయన చేసిన తప్పుల్ని మించిపోయాయి అనిపిస్తోంది. ఆయన యెహోవా సేవ చేయడం ఎన్నడూ మానేయలేదు. (1 రాజు. 15:14) మరి దీన్ని బట్టి చూస్తే ఆయన జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? గతంలో యెహోవా మనకు ఎలా సహాయం చేశాడనేదాని గురించి ఆలోచించాలని నేర్చుకుంటాం. అలా ఆలోచిస్తే, మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన సహాయం కోసం ప్రార్థించాలనే పురికొల్పును పొందుతాం. అయితే, మనం ఎన్నో సంవత్సరాల పాటు నమ్మకంగా యెహోవా సేవ చేశాం కాబట్టి మనకు లేఖన ఉపదేశం అవసరం లేదని అనుకోకూడదు. గతంలో మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఇప్పుడు తప్పు చేస్తే యెహోవా మనల్ని గద్దిస్తాడు. అప్పుడు మనం వినయంగా ఆ గద్దింపును స్వీకరిస్తే ప్రయోజనం పొందుతాం. అన్నింటికన్నా ముఖ్యంగా, మనం మన పరలోక తండ్రిని విడిచిపెట్టనంత వరకూ ఆయన మనల్ని విడిచిపెట్టడు. ‘తనపట్ల యథార్థ హృదయంగల వారి కోసం యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తోంది.’ ఆయన వాళ్ల తరఫున తన బలాన్ని ఉపయోగించి వాళ్లకు ప్రతిఫలం ఇస్తాడు. ఆసా విషయంలో యెహోవా అలాగే చేశాడు, మన విషయంలో కూడా అలాగే చేస్తాడు.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

ఆధ్యాత్మిక యుద్ధం చేసే నమ్మకమైన సేవకులకు యెహోవా ప్రతిఫలం ఇస్తాడు

[10వ పేజీలోని బ్లర్బ్‌]

యెహోవా దృష్టిలో సరైనది చేయాలంటే ఎంతో ధైర్యం అవసరమౌతుంది