కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వెయ్యేళ్ల పరిపాలనలో, ఆ తర్వాతి కాలంలో శాంతిసమాధానాలు విలసిల్లుతాయి!

వెయ్యేళ్ల పరిపాలనలో, ఆ తర్వాతి కాలంలో శాంతిసమాధానాలు విలసిల్లుతాయి!

‘దేవుడు సర్వములో సర్వమౌతాడు.’—1 కొరిం. 15:28.

1. ‘గొప్పసమూహపు’ సభ్యులు ఏ ఉత్తేజకరమైన భవిష్యత్తును పొందుతారు?

 న్యాయవంతుడు, కనికరం గలవాడు అయిన రాజు సారధ్యంలో ఒక శక్తివంతమైన ప్రభుత్వం పరిపాలిస్తే, వెయ్యేళ్లలో అది దాని పౌరులకు ఎంత మేలు చేస్తుందో మీరు ఊహించగలరా? ఇప్పుడున్న చెడ్డ వ్యవస్థంతటికీ ముగింపు పలికే “మహాశ్రమలను” తప్పించుకోబోయే అసంఖ్యాక ‘గొప్పసమూహపు’ సభ్యులు ముందుముందు అద్భుతమైన సంఘటనలను చవిచూస్తారు.—ప్రక. 7:9, 14.

2. గత 6,000 సంవత్సరాలుగా మనుష్యుల పరిస్థితి ఎలా ఉంది?

2 ఆరువేల సంవత్సరాల మానవ చరిత్రను చూస్తే, సొంత ఆశయాలతో తమను తాము పాలించుకోవడం వల్ల మానవులకు తీరని దుఃఖం, విషాదం మిగిలాయని అర్థమౌతోంది. ‘ఒకడు మరియొకనిపై అధికారియై తనకు హాని తెచ్చుకుంటున్నాడు’ అని బైబిలు ఎప్పుడో చెప్పింది. (ప్రసం. 8:9) ఇప్పటి విషయమేమిటి? యుద్ధాలు, విప్లవాలే కాక పేదరికం, జబ్బులు, పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పులు వంటి మరికొన్ని సమస్యలు మనుష్యుల్ని పట్టిపీడిస్తున్నాయి. ‘ఏదేమైతే నాకేం?’ అనే ప్రజల వైఖరి మారకపోతే పరిస్థితులు ముందుముందు దారుణంగా ఉంటాయని ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు.

3. వెయ్యేళ్ల పరిపాలనలో ఏమి జరుగుతుంది?

3 మెస్సీయ రాజైన యేసుక్రీస్తు, ఆయన సహపరిపాలకులైన 1,44,000 మంది సారధ్యంలోని దేవుని రాజ్యం మనుష్యులకు, భూమికి జరిగిన నష్టాన్ని పూరిస్తుంది. “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు” అని యెహోవా చేసిన ఉత్తేజకరమైన వాగ్దానాన్ని, వెయ్యేళ్ల పరిపాలనలో ఆ రాజ్యం నిజం చేసి చూపిస్తుంది. (యెష. 65:17) మనం ఇంకా చూడని ఎలాంటి అద్భుతమైన సంఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకుంటాయి? ప్రస్తుతం ‘అదృశ్యంగా’ ఉన్న లేదా మనమింకా చూడని ఆ సంఘటనల గురించి దేవుని వాక్యంలోని ప్రవచనాల సహాయంతో మనం ఇప్పుడు పరిశీలిద్దాం.—2 కొరిం. 4:18.

‘జనులు ఇళ్లు కట్టుకుంటారు, ద్రాక్షతోటలు నాటించుకుంటారు’

4. గృహ వసతికి సంబంధించి ప్రజలు నేడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?

4 తను, తన భార్యాపిల్లలూ సురక్షితంగా ఉండేలా ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకోని వ్యక్తి ఎవరైనా ఉంటారా? నేటి ప్రపంచంలో కనీస సదుపాయాలున్న ఇల్లు ఉండడం పెద్ద సమస్యగా తయారైంది. కిక్కిరిసివున్న నగరాల్లో ప్రజలు ఇరుకిరుకు ఇళ్లల్లో జీవిస్తున్నారు. చాలామంది నగర శివార్లలో, మురికివాడల్లో గుడిసెలు వేసుకుని ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. సొంత ఇల్లు ఉండడం వాళ్లకు ఓ కలగానే మిగిలిపోతోంది.

5, 6. (ఎ) యెషయా 65:21, మీకా 4:4 ఎలా నెరవేరుతాయి? (బి) ఆ ఆశీర్వాదం పొందాలంటే మనం ఏమి చేయాలి?

5 సొంత ఇల్లు కట్టుకోవాలనే ప్రతీ ఒక్కరి కల రాజ్య పరిపాలనలో సాకారమౌతుంది, ఎందుకంటే యెషయా ఇలా ప్రవచించాడు, “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.” (యెష. 65:21) అయితే అప్పుడు పరిష్కారమయ్యేది సొంతింటి సమస్య మాత్రమే కాదు. ఇప్పుడు కూడా కొంతమందికి సొంత ఇళ్లు ఉన్నాయి, ఇంకొంతమందైతే విశాలమైన పెద్దపెద్ద భవంతుల్లో ఉంటున్నారు. అయితే వారి ఆర్థికస్థితి తారుమారైనప్పుడు ఆ ఇంటిని వాళ్లు కోల్పోవచ్చు లేక దొంగలు కన్నం వేస్తారనే భయం వాళ్లను ప్రతీ క్షణం వెంటాడవచ్చు. కానీ రాజ్య పాలనలో పరిస్థితి అలా ఉండదు. ‘ఎవరి భయము లేకుండా ప్రతి ఒక్కరూ తమ ద్రాక్షచెట్టు కింద, తమ అంజూరపు చెట్టు కింద కూర్చుంటారు’ అని ప్రవక్తయైన మీకా రాశాడు.—మీకా 4:4.

6 అలాంటి అద్భుతమైన భవిష్యత్తు కోసం వేచి చూస్తున్నాం కాబట్టి మనమిప్పుడు ఏమి చేయాలి? మనందరికీ కనీస సదుపాయాలున్న ఇల్లు అవసరమే. అయినా, బహుశా పెద్ద మొత్తంలో అప్పు చేసి మరీ మనకు నచ్చినట్లు ఇల్లు కట్టుకోవడానికి ప్రయాసపడే బదులు యెహోవా చేసిన వాగ్దానం మీద మనసు పెట్టడం జ్ఞానయుక్తం కాదంటారా? యేసు తన గురించి ఏమన్నాడో గుర్తుచేసుకోండి. “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదు.” (లూకా 9:58) ఎవ్వరికీ ఉండని అత్యంత శ్రేష్ఠమైన ఇంటిని సంపాదించుకునే లేదా నిర్మించుకునే శక్తిసామర్థ్యాలు ఉన్నా యేసు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ఎందుకంటే, దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వకుండా చేసే వాటిలో చిక్కుకొని పక్కదారి పట్టకూడదని యేసు కోరుకున్నాడు. మనం కూడా యేసును ఆదర్శంగా తీసుకుని వస్తుసంపదల మోజులో, అనవసరమైన చింతల్లో చిక్కుకోకుండా మన కంటిని తేటగా ఉంచుకుంటామా?—మత్త. 6:33, 34.

‘తోడేళ్లు, గొర్రెపిల్లలు కలిసి మేస్తాయి’

7. మనుష్యులకు, జంతువులకు మధ్య ఎలాంటి సంబంధం ఉండాలని యెహోవా మొదట సంకల్పించాడు?

7 యెహోవా భూమ్మీద అన్నింటినీ సృష్టించిన తర్వాత తన భౌతిక సృష్టికి మకుటమైన మనిషిని చేశాడు. ప్రధాన శిల్పియైన తన మొదటి కుమారునితో యెహోవా తన స్పష్టమైన ఉద్దేశాన్ని ఇలా చెప్పాడు, “మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని, భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక.” (ఆది. 1:26) అలా ఆదాముహవ్వలు, చివరికి మనుష్యులందరూ జంతువులను ఏలాలని లేదా వాటిని లోబరుచుకోవాలని యెహోవా సంకల్పించాడు.

8. జంతువులు సాధారణంగా ఎలా ప్రవర్తిస్తాయి?

8 జంతువులన్నిటినీ లోబరచుకుని వాటితో సమాధానంగా ఉండడం మనుష్యులకు నిజంగా సాధ్యమేనా? కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులతో చాలామంది ఎంతో సన్నిహితంగా ఉంటారు. కానీ క్రూర మృగాల సంగతేమిటి? “క్షీరదాలైన జంతువులకు భావోద్వేగాలు ఉంటాయనే విషయాన్ని జంతువులకు సమీపంగా జీవించి వాటిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు” అని ఒక నివేదిక చెబుతోంది. అయితే ఎవరైనా హాని చేయాలని చూసినప్పుడు అవి భయపడడం లేదా క్రూరంగా ప్రవర్తించడం మనం చూస్తుంటాం, కానీ వాటికి మృదువైన భావాలు ఉంటాయా? పైన పేర్కొన్న నివేదిక ఇంకా ఇలా చెబుతోంది, “తమ పిల్లలను పెంచేటప్పుడు క్షీరదాలు వాటికున్న అత్యంత గొప్ప సామర్థ్యాన్ని చూపిస్తాయి, తమ పిల్లలమీద ప్రేమానురాగాలు చూపించడమే ఆ సామర్థ్యం.”

9. జంతువుల విషయంలో ఎలాంటి మార్పు వస్తుందని మనం ఎదురుచూడవచ్చు?

9 అందుకే భవిష్యత్తులో మనుష్యులు జంతువులతో కలిసిమెలిసి ఉంటారనే విషయాన్ని బైబిల్లో చదివినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. (యెషయా 11:6-9; 65:25 చదవండి.) ఎందుకు? జలప్రళయం తర్వాత నోవహు, ఆయన కుటుంబం ఓడలోనుండి బయటకు వచ్చాక యెహోవా ఏం చెప్పాడో గుర్తుచేసుకోండి. ఆయనిలా చెప్పాడు, “మీ భయం, మీ బెదురు అడవి జంతువులన్నిటికిని కలుగును.” నిజానికి ఆ భయం, బెదురు ఉంటేనే వాటి మనుగడ సాధ్యమౌతుంది. (ఆది. 9:2, 3) మరి తన ఆది సంకల్పం నెరవేరేలా జంతువులకున్న భయాన్ని, బెదురును దేవుడు కాస్త తగ్గించలేడా? (హోషే. 2:18) దేవుని రాజ్యంలోకి అడుగుపెట్టే వాళ్లందరి కోసం ఎంత సంతోషకరమైన భవిష్యత్తు వేచివుందో కదా?

‘ఆయన ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు’

10. మనిషి జీవితంలో కన్నీళ్లు ఎందుకు సర్వసాధారణం?

10 సొలొమోను “సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను” చూసినప్పుడు ‘ఆదరించు దిక్కులేక, బాధింపబడుచున్నవారు కన్నీళ్లు విడుస్తున్నారని’ విలపించాడు. (ప్రసం. 4:1) పరిస్థితులు నేడు కూడా అలాగే ఉన్నాయి, చెప్పాలంటే ఇంకా దారుణంగా ఉన్నాయి. ఏదో ఒక కారణం వల్ల కన్నీళ్లు విడవని వాళ్లు మనలో ఎవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు ఆనందబాష్పాలు వచ్చినా, సాధారణంగా మనసులో బాధ ఉన్నప్పుడే కన్నీళ్లు వస్తాయి.

11. బైబిల్లో ఏ సంఘటన గురించి చదివినప్పుడు మీరు చలించిపోయారు?

11 మన మనసుల్ని తాకే భావోద్వేగ సన్నివేశాలున్న బైబిలు భాగాలను ఒకసారి గుర్తుచేసుకోండి. 127 సంవత్సరాల వయసున్న శారా చనిపోయినప్పుడు ‘అబ్రాహాము శారా గురించి అంగలార్చాడు, ఆమె గురించి ఏడ్చాడు.’ (ఆది. 23:1, 2) విధవరాళ్లైన తన ఇద్దరు కోడళ్లను నయోమి పంపించేటప్పుడు ‘వారు ఎలుగెత్తి యేడ్చారు.’ (రూతు 1:9, 10, 14) పెద్ద జబ్బుతో మంచం పట్టిన రాజైన హిజ్కియా తానిక బ్రతకనని అర్థం చేసుకున్నప్పుడు, ‘కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు.’ ఆ ప్రార్థనకు యెహోవా చలించిపోయుంటాడు. (2 రాజు. 20:1-5) యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పిన అపొస్తలుడైన పేతురు, కోడి కూత వినబడినప్పుడు ‘వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చిన’ సందర్భాన్ని చదివి చలించనివాళ్లు ఎవరుంటారు?—మత్త. 26:75

12. మనుష్యులకు కావాల్సిన ఉపశమనాన్ని రాజ్య పరిపాలన ఎలా ఇస్తుంది?

12 విషాదకరమైన పరిస్థితులు అవి చిన్నవైనా, పెద్దవైనా మనందరికీ ఎదురౌతాయి కాబట్టి మనుష్యులందరికీ ఇప్పుడు ఓదార్పు, ఉపశమనం కావాలి. వెయ్యేళ్ల పరిపాలనలో దేవుని రాజ్యం దాని పౌరులకు కావాల్సిన ఓదార్పు, ఉపశమనం అందిస్తుంది. అప్పుడు దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” (ప్రక. 21:4) దుఃఖం, ఏడుపు, వేదన గతించిపోవడం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది, అంతేకాదు చివరికి మానవజాతి అసలు శత్రువైన మరణాన్ని కూడా తీసివేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అదెలా జరుగుతుంది?

‘సమాధుల్లో ఉన్న వాళ్లందరూ బయటికి వస్తారు’

13. ఆదాము పాపం చేసినప్పటి నుండి మరణం మనుష్యులను ఎలా వేదిస్తోంది?

13 ఆదాము పాపం చేసినప్పటి నుండి మనుష్యుల మీద మరణం రాజ్యమేలుతోంది. పాపులైన మనుష్యులు ఆ శత్రువును ఎదిరించలేరు, దాని చేతికి చిక్కకుండా తప్పించుకోలేరు. అది అంతులేని బాధను, వేదనను మిగిలిస్తుంది. (రోమా. 5:12, 14) నిజానికి, కోట్లాదిమంది ‘జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడుతున్నారు.’—హెబ్రీ. 2:14, 15.

14. ‘మరణం నశింపజేయబడినప్పుడు’ ఏయే ప్రయోజనాలు ఉంటాయి?

14 ‘కడపటి శత్రువు అయిన మరణం నశింపజేయబడే’ సమయం వస్తుందని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 15:26) దానివల్ల రెండు గుంపుల ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు జీవిస్తున్న “గొప్ప సమూహము” సభ్యులు దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలోకి మరణం రుచి చూడకుండానే ప్రవేశించి నిత్యం జీవిస్తారు. అలాగే, ఇప్పటికే చనిపోయిన కోట్లాదిమందిని దేవుడు పునరుత్థానం చేస్తాడు. తిరిగి బ్రతికేవాళ్లను గొప్పసమూహపు సభ్యులు నూతనలోకంలోకి ఆహ్వానించేటప్పుడు ఎంత ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తాయో ఊహించండి! అప్పుడు ఆనందోత్సాహాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్న పునరుత్థాన సంఘటనలను ఒకసారి పరిశీలిద్దాం.—మార్కు 5:38-42; లూకా 7:11-17 చదవండి.

15. మీ ఆత్మీయులు పునరుత్థానం అయినప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?

15 “బహుగా విస్మయ మొందిరి,” “దేవుని మహిమపరచిరి” వంటి మాటల గురించి ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు అక్కడ ఉండివుంటే మీకు కూడా అలాగే అనిపించివుండేది. పునరుత్థానమై వచ్చే మన ఆత్మీయులను చూసినప్పుడు మనకు పట్టలేని ఆనందం కలుగుతుంది. “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు” అని యేసు అన్నాడు. (యోహా. 5:28, 29) నిజానికి, అలాంటిది జరగడం మనలో ఎవరమూ ఇంతవరకు చూడలేదు. అయితే ‘అదృశ్యమైన’ లేక మనమింకా చూడని అద్భుతమైన వాటిలో ఇది ఒకటి.

‘దేవుడు సర్వములో సర్వమౌతాడు’

రాజుగా తన బాధ్యతల్ని నిర్వర్తించాక, యేసు వినయంగా రాజ్యాన్ని తన తండ్రికి అప్పగిస్తాడు

16. (ఎ) మనమింకా చూడని ఆశీర్వాదాల గురించి ఎందుకు ఉత్సాహంగా మాట్లాడాలి? (బి) కొరింథులో ఉన్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి పౌలు ఏమి చెప్పాడు?

16 ఈ కష్టకాలాల్లో యెహోవాకు నమ్మకంగా ఉండేవాళ్లకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఆ గొప్ప ఆశీర్వాదాలను మనమింకా చూడకపోయినా, వాటిని స్పష్టంగా మనసులో ఉంచుకుంటే నిజంగా ప్రాముఖ్యమైన వాటికే ప్రాధాన్యతనిస్తాం. అంతేకాక లోకంలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండే తళుకుబెళుకులను చూసి పక్కదారిపట్టం. (లూకా 21:34; 1 తిమో. 6:17-19) కుటుంబ ఆరాధన చేసేటప్పుడు, తోటి విశ్వాసులతో, బైబిలు విద్యార్థులతో, ఆసక్తిగల వాళ్లతో మాట్లాడేటప్పుడు మనందరం మనకున్న అద్భుతమైన నిరీక్షణ గురించి, పొందబోయే ఆశీర్వాదాల గురించి ఉత్సాహంగా మాట్లాడదాం. అలా చేస్తే, ఆ ఆశీర్వాదాలు మన మనసుల్లో, హృదయాల్లో చెక్కుచెదరకుండా ఉంటాయి. తోటి క్రైస్తవులను ప్రోత్సహించడానికి అపొస్తలుడైన పౌలు అలాగే మాట్లాడాడు. ఆయన తన మాటలతో వాళ్లందరినీ క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగింపు దాకా తీసుకెళ్లాడు. 1 కొరింథీయులు 15:24, 25, 28 వచనాల్లో పౌలు చెప్పిన మాటల పూర్తి భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.చదవండి.

17, 18. (ఎ) మనుష్యుల చరిత్ర ప్రారంభంలో యెహోవా ఎలా ‘సర్వములో సర్వముగా’ ఉన్నాడు? (బి) దెబ్బతిన్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు ఏమి చేస్తాడు?

17 ఆ అద్భుతమైన ఆశీర్వాదాల గురించిన వివరణను, ‘దేవుడు సర్వములో సర్వమౌతాడు’ అనే మాటలతో ముగించడమే సముచితం. ఆ మాటలకు అర్థమేమిటి? పరిపూర్ణులైన ఆదాముహవ్వలు శాంతిసమాధానాలతో కూడిన యెహోవా విశ్వవ్యాప్త కుటుంబంలో భాగంగా ఉన్న రోజుల గురించి ఒకసారి ఆలోచించండి. విశ్వ సర్వాధిపతియైన యెహోవా పరలోకంలో, భూమ్మీద ఉన్న సమస్త సృష్టిని అప్పుడు నేరుగా పరిపాలించేవాడు. వాళ్లు దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడేవాళ్లు. అంతేకాక ఆయనను ఆరాధించే, ఆయన చేత ఆశీర్వాదాలు పొందే అవకాశం వాళ్లకు ఉండేది. అప్పట్లో దేవుడే వాళ్లకు సర్వస్వం లేదా “సర్వములో సర్వము.”

18 మానవులు సాతాను బుట్టలో పడి యెహోవా సర్వాధిపత్యానికి తిరుగుబాటు చేసినప్పుడు ఆ సమాధానకరమైన సంబంధం దెబ్బతింది. అయితే, 1914 నుండి ఆ సంబంధాన్ని పునరుద్ధరించే దిశగా మెస్సీయ రాజ్యం అడుగులు వేస్తోంది. (ఎఫె. 1:8-10) మనం ఇంకా చూడని “అదృశ్యమైన” విషయాలను వెయ్యేళ్ల పరిపాలనలో కళ్లారా చూస్తాం. ఆ తర్వాత “అంతము” వస్తుంది అంటే క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగుస్తుంది. అప్పుడేమి జరుగుతుంది? ‘పరలోకంలో, భూమ్మీద’ సమస్త అధికారం తన చేతుల్లోనే ఉన్నా యేసుకు అధికార వ్యామోహం లేదు, యెహోవా స్థానాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశం అసలే లేదు. ఆయన వినయంగా ‘తండ్రియైన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు.’ యేసు తనకున్న ప్రత్యేకమైన స్థానాన్ని, అధికారాన్ని “దేవుని మహిమార్థమై” ఉపయోగిస్తాడు.—మత్త. 28:18; ఫిలి. 2:9-11.

19, 20. (ఎ) యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరిస్తున్నామని రాజ్య పౌరులు ఎలా చూపిస్తారు? (బి) త్వరలోనే మనం ఏ గొప్ప ఆశీర్వాదాల్ని పొందుతాం?

19 అప్పటికల్లా రాజ్య పౌరులందరూ పరిపూర్ణతకు చేరుకుంటారు. వాళ్లు యేసును ఆదర్శంగా తీసుకొని వినయంగా, మనస్ఫూర్తిగా యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరిస్తారు. యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరించాలనే కోరిక తమకు ఉందని అంతిమ పరీక్షలో నెగ్గడం ద్వారా వాళ్లు చూపిస్తారు. (ప్రక. 20:7-10) ఆ తర్వాత, తిరుగుబాటుదారులందరూ అంటే సాతాను, అతని దయ్యాలతో సహా దుష్ట మానవులందరూ పూర్తిగా నాశనమౌతారు. అప్పుడు ఎంత విజయోత్సాహం, సంతోషం ఉంటాయో కదా! అప్పుడు ‘సర్వములో సర్వముగా’ ఉండే యెహోవాను విశ్వవ్యాప్త కుటుంబమంతా కలిసి సంతోషంగా స్తుతిస్తుంది.కీర్తన 99:1-3 చదవండి.

20 అతి త్వరలోనే దేవుని రాజ్యంలో మనం చవిచూడబోయే విషయాలను మనసులో ఉంచుకుంటే, దేవుని చిత్తం చేయడంపైనే దృష్టి నిలిపి, దానికోసం ప్రయాసపడతాం. మీరు సాతాను లోకం అందించే బూటకపు నిరీక్షణను, ఓదార్పును చూసి పక్కదారిపట్టకుండా ఉంటారా? యెహోవా సర్వాధిపత్యానికి మద్దతిస్తూ దాన్ని సమర్థించాలని మీరు గట్టిగా తీర్మానించుకుంటారా? ఎల్లకాలం అలా చేయాలనే కోరిక మీకుందని మీ పనుల్లో చూపించండి. అప్పుడు మీరు వెయ్యేళ్ల పరిపాలనలో, ఆ తర్వాతి కాలంలో శాంతిసౌభాగ్యాలతో విలసిల్లుతారు.