కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆ దినం, ఆ గడియ మీకు తెలియదు’

‘ఆ దినం, ఆ గడియ మీకు తెలియదు’

“ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.”—మత్త. 25:13.

1-3. (ఎ) యేసు చెప్పిన రెండు ఉపమానాల్లోని అంశాలను ఏ సన్నివేశాలతో ఉదహరించవచ్చు? (బి) ఏ ప్రశ్నలకు మనం జవాబులు తెలుసుకోవాలి?

 ప్రముఖ అధికారి ఒకాయన అత్యవసరమైన పని కోసం తనను ఫలానా చోట దింపమని మిమ్మల్ని అడిగినట్లు ఊహించుకోండి. అయితే ఆయనను తీసుకెళ్లడానికి కొద్ది నిమిషాల ముందు మీ వాహనంలో సరిపడా ఇంధనం లేదని మీకు తెలిసింది. మీరు ఇంధనం పోయించుకోవడానికి ఆగమేఘాల మీద వెళ్లారు. మీరు అటు వెళ్లగానే ఆ అధికారి వచ్చాడు. ఆయన మీకోసం చూసి మీరు కనబడకపోయేసరికి ఏమాత్రం వేచిచూడకుండా, తనను తీసుకువెళ్లమని వేరే వాళ్లను అడిగాడు. మీరు త్వరగా అక్కడికి వచ్చి చూసేసరికి ఆ అధికారి మీ కోసం వేచిచూడకుండా వేరేవాళ్లతో వెళ్లాడని మీకు తెలిసింది. అప్పుడు మీకెలా అనిపిస్తుంది?

2 ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక అధికారిగా ఊహించుకోండి. మీరు కొన్ని ప్రాముఖ్యమైన పనుల కోసం ముగ్గురు సమర్థులైన వ్యక్తుల్ని ఎంచుకున్నారు. మీరు ఆ పనుల గురించి వాళ్లకు వివరంగా చెప్పారు, ముగ్గురూ ఆ పనులు చేయడానికి ముందుకు వచ్చారు. కానీ, కొన్నిరోజులు పోయాక మీరు వచ్చి చూసేసరికి, ఇద్దరు మాత్రమే తమకిచ్చిన పనులను చేశారని మీకు తెలిసింది. మూడో వ్యక్తేమో తనకిచ్చిన పని చేయకపోగా, కుంటి సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. నిజానికి ఆ వ్యక్తి తనకిచ్చిన పని చేయడానికి అసలు ఏమాత్రం ప్రయత్నించలేదు. అప్పుడు మీకెలా అనిపిస్తుంది?

3 అంత్యకాలంలో ఎందుకు కొంతమంది అభిషిక్తులు నమ్మకంగా ఉంటారో, ఎందుకు మరికొంతమంది నమ్మకంగా ఉండరో వివరించడానికి యేసు చెప్పిన కన్యకల గురించిన, తలాంతుల గురించిన ఉపమానాల్లో పైన ప్రస్తావించిన లాంటి సన్నివేశాలే ఉన్నాయి. a (మత్త. 25:1-30) సాతాను ప్రపంచం మీద దేవుని తీర్పును తాను అమలు చేసే “దినమైనను, గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి” అని అనడం ద్వారా యేసు తాను చెప్పాలనుకున్న విషయాన్ని నొక్కి చెప్పాడు. (మత్త. 25:13) ఆ ఉపదేశం నేడు మనకు కూడా వర్తిస్తుంది. యేసు ప్రోత్సహించినట్లు మెలకువగా ఉండడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? సిద్ధంగా ఉన్నామని ఎవరు నిరూపించుకున్నారు? మనం సదా మెలకువగా ఉండాలంటే ఏమి చేయాలి?

మెలకువగా ఉండడం ద్వారా ప్రయోజనం పొందండి

4. ‘మెలకువగా ఉండడం’ అంటే గడియారం చూస్తూ కూర్చోవడం కాదని ఎందుకు చెప్పవచ్చు?

4 ఫ్యాక్టరీలో పనిచేయడం, డాక్టరును సందర్శించడం, బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించడం వంటివాటి కోసం మనం ఓ సమయ పట్టికను పాటించాల్సి ఉంటుంది. అయితే, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటల్ని ఆర్పడం, విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం వంటి వాటికోసం మనం గడియారం చూసుకుంటూ పనిచేస్తే మన ధ్యాస పక్కకు మళ్లవచ్చు, కొన్నిసార్లు అది వేరే ప్రమాదానికి కూడా దారితీయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో గడియారం చూస్తూ పనిచేయడం కన్నా పని మీద ధ్యాస పెట్టడం చాలా ప్రాముఖ్యం. అలాగే, మనం అంతానికి మునుపెన్నటికన్నా చాలా దగ్గర్లో ఉన్నాం కాబట్టి యెహోవా చేసిన రక్షణ ఏర్పాట్ల గురించి ప్రకటించడం ఇప్పుడు మరింత ప్రాముఖ్యం. క్రైస్తవులుగా మనం మెలకువగా ఉండడమంటే గడియారం చూస్తూ కూర్చోవడం కాదు. నిజానికి, అంతం సరిగ్గా ఏ దినాన, ఏ గడియకు వస్తుందో తెలియకపోవడం వల్ల మనం కనీసం ఐదు విధాలుగా ప్రయోజనం పొందవచ్చు.

5. అంతం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం వల్ల మన హృదయంలో నిజంగా ఏముందో తెలుస్తుందని ఎలా చెప్పవచ్చు?

5 మొదటిగా, అంతం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం వల్ల మన హృదయంలో నిజంగా ఏముందో తెలుస్తుంది. నిజానికి, అలా తెలియకపోవడం వల్ల యెహోవాపట్ల విశ్వసనీయతను చూపించేలా మనకున్న స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించుకునే అవకాశం మనకు దొరుకుతుంది, అది మనకు ఒక గౌరవం కూడా. అంతం వచ్చే రోజు కోసం మనం ఎదురుచూస్తున్నాం. అయినా మనం యెహోవా మీదున్న ప్రేమతోనే ఆయనను ఆరాధిస్తాం కానీ, జీవం పొందాలన్న ఒకేఒక్క కారణంతో కాదు. (కీర్తన 37:4 చదవండి.) మనం నిండుమనసుతో ఆయనకు నచ్చిన పనుల్ని చేస్తాం, అంతేకాదు ఆయన మన ప్రయోజనం కోసమే మనకు బోధిస్తున్నాడని మనం గుర్తిస్తాం. (యెష. 48:17) ఆయన ఆజ్ఞలు భారమని మనం అస్సలు అనుకోం.—1 యోహా. 5:3.

6. మనం ప్రేమతో యెహోవాను సేవించినప్పుడు ఆయన ఎలా భావిస్తాడు?

6 రెండవదిగా, అంతం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం వల్ల మనకు యెహోవా హృదయాన్ని సంతోషపెట్టే అవకాశం దొరుకుతుంది. అంతం వచ్చే రోజు కోసమో లేదా కేవలం జీవమనే బహుమానం కోసమో కాకుండా యెహోవా మీద ప్రేమతోనే ఆయనను సేవిస్తే, తన శత్రువైన సాతాను వేసిన అబాండాలు తప్పని దేవుడు జవాబిచ్చేందుకు తోడ్పడతాం. (యోబు 2:4, 5; సామెతలు 27:11 చదవండి.) అపవాది కలిగించిన బాధల్ని, దుఃఖాన్ని గుర్తుంచుకొని మనం యెహోవా సర్వాధిపత్యాన్ని సంతోషంగా సమర్థిస్తాం, సాతాను దుష్ట పరిపాలనను తిరస్కరిస్తాం.

7. త్యాగపూరిత జీవితం గడపడం మంచిదని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

7 మూడవదిగా, అంతం వచ్చే తేదీ తెలియకుండా సేవచేయడం వల్ల మనం త్యాగపూరిత జీవితాన్ని గడపాలనే ప్రేరణను పొందుతాం. దేవుని గురించి తెలియని కొంతమంది ప్రజలు సహితం లోకం ఇంకెంతో కాలం నిలవదని నమ్ముతున్నారు. పొంచివున్న విపత్తుకు భయపడి వాళ్లు, ‘రేపు చనిపోతాం గనుక తిందాం, తాగుదాం’ అనే వైఖరిని చూపిస్తున్నారు. (1 కొరిం. 15:32) అయితే, మనకు అలాంటి భయం లేదు. వాళ్లలా మనం ఇతరులకు దూరంగా ఉంటూ స్వార్థపూరిత కోరికలను తీర్చుకోవాలని చూడం. (సామె. 18:1) కానీ, మనల్ని మనం ‘ఉపేక్షించుకొని,’ ఇతరులకు దేవుని రాజ్య సువార్త ప్రకటించేందుకు మన సమయాన్ని, శక్తిని, మరితర వనరులను ఉపయోగిస్తాం. (మత్తయి 16:24 చదవండి.) మనం సంతోషంగా దేవుని సేవ చేస్తాం, ప్రత్యేకంగా ఇతరులు ఆయన గురించి తెలుసుకునేందుకు సంతోషంగా సహాయం చేస్తాం.

8. మనం యెహోవా మీద, ఆయన వాక్యం మీద ఎక్కువగా ఆధారపడాలని బైబిల్లోని ఏ ఉదాహరణ చూపిస్తోంది?

8 నాలుగవదిగా, అంతం వచ్చే దినం, గడియ తెలియకపోవడం వల్ల మనం యెహోవా మీద మరింత ఎక్కువగా ఆధారపడతాం, ఆయన వాక్యాన్ని మన జీవితంలో అలవర్చుకోవడానికి మరింత శ్రద్ధగా కృషిచేస్తాం. మనలోని పాపప్రవృత్తి వల్ల మనం మన సొంత తెలివితేటలపై ఆధారపడడానికే మొగ్గుచూపుతాం. అందుకే, “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను” అని పౌలు క్రైస్తవులందరికీ సలహా ఇచ్చాడు. యెహోషువ నాయకత్వాన వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడానికి కొద్దికాలం ముందు దేవుని ప్రజల్లో ఇరవైమూడు వేలమంది యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయారు. ‘ఈ సంగతులు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను’ అని పౌలు అన్నాడు.—1 కొరిం. 10:8, 11, 12.

9. కష్టాలు ఎలా మనల్ని మెరుగుపర్చి దేవునికి మరింత సన్నిహితం చేస్తాయి?

9 ఐదవదిగా, ప్రస్తుతం మనకు వచ్చే కష్టాలు మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయి. (కీర్తన 119:71 చదవండి.) ఈ అంత్యదినాల్లోని పరిస్థితులు ‘అపాయకరంగా’ లేదా కష్టతరంగా ఉన్నాయి. (2 తిమో. 3:1-5) సాతాను ప్రపంచంలోని చాలామంది మనల్ని ద్వేషిస్తున్నారు కాబట్టి మన విశ్వాసం కారణంగా మనకు హింసలు రావచ్చు. (యోహా. 15:19; 16:2) అలాంటి శ్రమలు వచ్చినప్పుడు, మనల్ని మనం తగ్గించుకొని దేవుని నిర్దేశాన్ని కోరితే మన విశ్వాసం అగ్నిలో పుటం వేయబడినట్లుగా శుద్ధి అవుతుంది. ఆ శ్రమల వల్ల మనం యెహోవా సేవ చేయడం మానుకోం కానీ, ఊహించనంత ఎక్కువగా యెహోవాకు సన్నిహితమౌతాం.—యాకో. 1:2-4; 4:8.

10. సమయం ఎప్పుడు చాలా త్వరగా గడిచిపోతుంది?

10 సమయం గడవడం అనేది మన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మనం ఊరికే గడియారం చూస్తూ కూర్చోకుండా ఏదైనా పనిలో నిమగ్నమైతే సమయం ఇట్టే గడిచిపోతుంది. అలాగే, యెహోవా మనకు అప్పగించిన ఉత్తేజకరమైన పనిలో మనం నిమగ్నమైతే మనకు తెలియకుండానే ఆ దినం, ఆ గడియ వచ్చేస్తాయి. ఈ విషయంలో చాలామంది అభిషిక్తులు అద్భుతమైన మాదిరినుంచారు. 1914లో యేసు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఏమి జరిగిందో ఇప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం. అంతేకాక, కొంతమంది అభిషిక్తులు సిద్ధంగా ఉన్నట్లు ఎలా నిరూపించుకున్నారో కూడా చూద్దాం.

సిద్ధంగా ఉన్నామని అభిషిక్తులు నిరూపించుకున్నారు

11. ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొంతమంది అభిషిక్తులకు 1914 తర్వాత ఎందుకు అనిపించి ఉంటుంది?

11 కన్యకల గురించి, తలాంతుల గురించి యేసు చెప్పిన ఉపమానాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. పెళ్లి కుమారుడు లేదా యజమానుడు ఎప్పుడు వస్తాడో ముందే తెలిసివుంటే ఆ కన్యకలు, దాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి వాళ్లు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కొన్ని దశాబ్దాల పాటు అభిషిక్తులు 1914వ సంవత్సరాన్ని ప్రత్యేకమైనదిగా భావించినా, ఆ సంవత్సరంలో ఏమి జరగనుందో అప్పటికింకా వాళ్లకు స్పష్టంగా తెలియదు. వాళ్లు అనుకున్నట్టు జరగలేదు కాబట్టి, పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడని వాళ్లకు అనిపించి ఉంటుంది. ఓ సహోదరుడు ఇలా గుర్తుచేసుకున్నాడు: “[1914] అక్టోబరు మొదటి వారంలో మేము పరలోకానికి వెళ్తామని మాలో కొంతమందిమి నిజంగానే అనుకున్నాం.”

12. అభిషిక్తులు తాము నమ్మకస్థులమని, బుద్ధిమంతులమని ఎలా నిరూపించుకున్నారు?

12 ఎంతగానో ఎదురుచూసిన అంతం రాకపోయేసరికి వాళ్లు ఎంతటి నిరాశకు గురైవుంటారో ఒకసారి ఆలోచించండి. దాంతోపాటు, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సహోదరులకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఆ సమయంలో వాళ్లు కొంతమేరకు నిద్రలాంటి నిష్క్రియా స్థితిలోకి వెళ్లారు. కానీ, 1919లో మేల్కోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడు దేవుని ఆధ్యాత్మిక ఆలయాన్ని తనిఖీ చేసేందుకు యేసు వచ్చాడు. అయితే, కొంతమంది సిద్ధంగా ఉన్నట్లు నిరూపించుకోలేదు, దానివల్ల వాళ్లు రాజుకు సంబంధించిన ‘వ్యాపారాన్ని’ చూసుకుంటూ ఉండే గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. (మత్త. 25:16) ఒక విధంగా వాళ్లు బుద్ధిలేని కన్యకల్లా, తమ ఆధ్యాత్మిక నూనెను నింపుకునేందుకు కావాల్సిన సిద్ధపాట్లు చేసుకోలేదు. అంతేకాక, వాళ్లు సోమరిపోతు దాసునిలా రాజ్య సంబంధమైన విషయాల కోసం త్యాగాలు చేసేందుకు సుముఖత చూపించలేదు. అయితే అభిషిక్తుల్లో చాలామంది, క్లిష్టమైన ఆ యుద్ధ సంవత్సరాల్లో కూడా తమ యజమాని పట్ల దృఢమైన విశ్వసనీయతను, ఆయనను సేవించాలనే బలమైన కోరికను చూపించారు.

13. దాసుని తరగతి 1914 తర్వాత ఎలాంటి వైఖరి చూపించింది? ఇప్పుడు ఎలాంటి వైఖరి చూపిస్తోంది?

13 కావలికోట (ఆంగ్లం) ఫిబ్రవరి 1, 1916 సంచికలో ఇలా ఉంది: “సహోదరులారా, మనలో దేవుని పట్ల సరైన వైఖరి కలిగివున్నవాళ్లు దేవుడు చేసిన యే ఏర్పాట్ల విషయంలోనూ నిరాశ చెందలేదు. మనకు నచ్చినట్లు జరగాలని మనం కోరుకోలేదు; కాబట్టి 1914 అక్టోబరులో అంతం కోసం ఎదురుచూడడం తప్పని తెలుసుకున్నప్పుడు, ప్రభువు మన కోసం తన ప్రణాళికను మార్చుకోనందుకు మనం సంతోషించాం. ఆయన అలా మార్చుకోవాలని కూడా మనం అసలు ఆశించలేదు. కానీ మనం దేవుని ప్రణాళికల్ని, ఉద్దేశాలను సరిగ్గా అర్థంచేసుకోవాలని మాత్రం కోరుకున్నాం.” ఇప్పటికీ అభిషిక్తులు అదే వినయాన్ని, అదే భక్తిని చూపిస్తున్నారు. తాము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాళ్లమని చెప్పుకోరు కానీ భూమ్మీద ప్రభువు ‘వ్యాపార’ వ్యవహారాల్ని చూసుకోవాలనే కృత నిశ్చయం వాళ్లలో ఉంటుంది. ఇప్పుడు, భూనిరీక్షణ ఉన్న ‘వేరేగొర్రెలకు చెందిన గొప్ప సమూహంలోని’ క్రైస్తవులు, అభిషిక్తుల్ని ఆదర్శంగా తీసుకొని అప్రమత్తంగా ఉంటున్నారు, ఉత్సాహంగా దేవుని సేవ చేస్తున్నారు.—ప్రక. 7:9; యోహా. 10:16.

మనం కూడా సిద్ధంగా ఉన్నామని నిరూపించుకోవాలి

ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆధ్యాత్మిక ఆహారం కోసం ప్రయత్నించండి

14. ఆధ్యాత్మిక ఆహారం అందించడానికి దేవుడు ఉపయోగించుకుంటున్న సంస్థను అంటిపెట్టుకుని ఉండటం మనకు ఎలా కాపుదలగా ఉంటుంది?

14 అభిషిక్త క్రైస్తవుల్లాగే గొప్ప సమూహపు సభ్యులు కూడా ఆధ్యాత్మిక ఆహారం అందించడానికి దేవుడు ఉపయోగించుకుంటున్న సంస్థకు నమ్మకంగా అంటిపెట్టుకుని ఉంటున్నారు. దానివల్ల వాళ్లు ఒక విధంగా దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆధ్యాత్మిక నూనెను ఎప్పటికప్పుడు నింపుకుంటున్నారు. (కీర్తన 119:130; యోహాను 16:13 చదవండి.) అలా వాళ్లు బలాన్ని పొంది, పెద్దపెద్ద పరీక్షలు వచ్చినా అప్రమత్తంగా ఉంటూ క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉన్నామని నిరూపించుకుంటున్నారు. ఉదాహరణకు, ఒక నాజీ నిర్బంధ శిబిరంలోని సహోదరుల దగ్గర మొదట్లో ఒక్క బైబిలే ఉండేది. కాబట్టి, వాళ్లు మరింత ఆధ్యాత్మిక ఆహారం కావాలని ప్రార్థించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు, శిబిరంలోకి బందీగా వచ్చిన ఒక కొత్త సహోదరుడు కొన్ని వాచ్‌టవర్‌ సంచికలను తన కృత్రిమ చెక్క కాలులో రహస్యంగా తీసుకువచ్చాడని ఆ సహోదరులకు తెలిసింది. అప్పటి రోజుల్ని గుర్తుచేసుకుంటూ, ఆ నిర్బంధ శిబిరం నుండి బ్రతికిబయటపడ్డ అభిషిక్త సహోదరుడైన ఎర్నస్ట్‌ వాయర్‌ ఇలా అన్నాడు: “ఆ సంచికల్లో ఉన్న బలాన్నిచ్చే ఆధ్యాత్మిక విషయాలను మేము గుర్తుపెట్టుకునేందుకు యెహోవా అద్భుతరీతిలో మాకు సహాయం చేశాడు.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆహారం చాలా సులభంగా లభ్యమౌతోంది. కానీ, దానిపట్ల మనం ఎల్లప్పుడూ మెప్పు చూపిస్తున్నామా? యెహోవా పట్ల నమ్మకంగా, విశ్వసనీయంగా ఉంటూ ఆయన ఆధ్యాత్మిక బల్ల నుండి ఆహారాన్ని భుజించే వాళ్లను యెహోవా మెండుగా ఆశీర్వదిస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను.”

15, 16. క్రైస్తవ పరిచర్య విషయంలో తాము చూపించిన ఉత్సాహానికి ఒక జంట ఎలాంటి ప్రతిఫలం పొందారు? అలాంటి అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

15 క్రీస్తు సహోదరులకు పూర్తి మద్దతిస్తూ వేరే గొర్రెలు కూడా యజమాని అప్పగించిన పనిని అవిశ్రాంతంగా చేస్తున్నారు. (మత్త. 25:40) యేసు చెప్పిన ఉపమానంలోని సోమరి అయిన చెడ్డ దాసునిలా కాకుండా వాళ్లు రాజ్య సంబంధ విషయాలకు మొదటి స్థానం ఇవ్వడం కోసం ఎన్నో త్యాగాలను చేస్తూ తమ శక్తియుక్తులను ధారపోస్తున్నారు. ఉదాహరణకు, కెన్యా దేశంలో చైనా భాష మాట్లాడే ప్రజలున్న ప్రాంతంలో పరిచర్య చేసేందుకు జాన్‌, మాసాకోలను నియమించినప్పుడు వాళ్లు అక్కడికి వెళ్లడానికి కొంత సంశయించారు. కానీ, వాళ్లు తమ పరిస్థితుల గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాక అక్కడకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

16 తాము చేసిన ప్రయత్నాలకు వాళ్లు ఎన్నో మంచి ఫలితాలను పొందారు. “ఇక్కడ పరిచర్య అద్భుతంగా ఉంది!” అని వాళ్లు అన్నారు. వాళ్లు ఏడు బైబిలు అధ్యయనాలను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో ఉత్తేజకరమైన అనుభవాలను చవిచూశారు. వాళ్లు ఇంకా ఇలా అన్నారు: “ఇక్కడ సేవచేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు యెహోవాకు ప్రతీరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.” నిజానికి, అంతం ఎప్పుడు వచ్చినా సరే దేవుని సేవలో పూర్తిగా నిమగ్నమై ఉండాలనే కృతనిశ్చయం తమకు ఉందని ఇంకా ఎంతోమంది ఇతర సహోదరసహోదరీలు తమ నిర్ణయాల ద్వారా నిరూపించారు. గిలియడ్‌ పాఠశాలలో పట్టభద్రులై మిషనరీ సేవ చేపట్టిన వేలమంది గురించి ఆలోచించండి. ఆ ప్రత్యేక సేవ గురించి తెలుసుకోవడానికి కావలికోట అక్టోబరు 15, 2001 సంచికలోని “మన శక్తిమేరకు మనం చేద్దాం!” అనే ఆర్టికల్‌ని చదివి చూడండి. ఆసక్తికరమైన ఆ ఆర్టికల్‌ చదువుతూ మిషనరీ సేవలో ఒక రోజు ఎలా ఉంటుందో పరిశీలిస్తుండగా, దేవునికి మహిమ కలిగేలా మీరు మరింత ఎక్కువగా పరిచర్యలో ఎలా పాల్గొనవచ్చో, దానివల్ల ఆయన సేవలో మరింత ఆనందం ఎలా పొందవచ్చో ఆలోచించండి.

మీరు కూడా అప్రమత్తంగా ఉండండి

Tక్రైస్తవ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుంది

17. ఈ లోకం అంతమయ్యే దినం, గడియ తెలియకపోవడం వల్ల మనకు ఎలా మేలు జరిగింది?

17 ఈ లోకం అంతమయ్యే దినం, గడియ తెలియకపోవడం వల్ల మనకు మేలే జరిగింది. అంతం ఇంకా రాలేదని విసిగిపోయే బదులు లేదా నిరాశచెందే బదులు మనం మన పరలోక తండ్రియైన యెహోవాకు ఇష్టమైన పనులు చేయడంలో నిమగ్నమై ఆయనకు మరింత సన్నిహితం అయ్యాం. చెప్పాలంటే, నాగటి మీద చెయ్యి పెట్టి, అటూ ఇటూ చూడకుండా యజమాని అప్పగించిన పనిలో కొనసాగినందుకు ఎంతో సంతోషాన్ని అనుభవించాం.—లూకా 9:62.

18. దేవుని సేవను ఆపాలని మనమెందుకు అనుకోము?

18 దేవుని తీర్పు దినం అంతకంతకూ దగ్గరౌతోంది. యెహోవాను, యేసును నిరాశపర్చాలని మనలో ఎవ్వరమూ కోరుకోము. ఈ అంత్యదినాల్లో వాళ్లు మనకు అమూల్యమైన సేవావకాశాల్ని ఇచ్చారు. వాళ్లు మనపై నమ్మకం ఉంచినందుకు మనం ఎంత సంతోషిస్తున్నామో కదా!—1 తిమోతి 1:12, 13 చదవండి.

19. మనం సిద్ధంగా ఉన్నట్లు ఎలా నిరూపించుకోవచ్చు?

19 మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా మనమందరం దేవుడు మనకు అప్పగించిన ప్రకటనా పనిలో, శిష్యుల్ని చేసే పనిలో చివరివరకు నమ్మకంగా కొనసాగాలనే పట్టుదలతో ఉందాం. యెహోవా దినం ఖచ్చితంగా ఏ రోజు, ఏ గడియకు వస్తుందో మనకు ఇప్పటికీ తెలియదు. నిజానికి అది మనకు తెలియాల్సిన అవసరం ఉందంటారా? మనం సిద్ధంగా ఉన్నట్లు నిరూపించుకోగలం, నిరూపించుకుంటాం కూడా. (మత్త. 24:36, 44) యెహోవాపై పూర్తి నమ్మకముంచి, ఆయన రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చినంతకాలం మనం అస్సలు ‘సిగ్గుపడమని’ లేదా నిరాశచెందమని బలంగా నమ్ముతున్నాం.—రోమా. 10:11.