కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మరింత ఎక్కువగా యెహోవా సేవచేయడానికి తోడ్పడే పాఠశాలలు అవి యెహోవా ప్రేమకు నిదర్శనాలు

మరింత ఎక్కువగా యెహోవా సేవచేయడానికి తోడ్పడే పాఠశాలలు అవి యెహోవా ప్రేమకు నిదర్శనాలు

యెహోవా మహా గొప్ప బోధకుడు. (యోబు 36:22) ప్రేమను బట్టే ఆయన ఇతరులకు బోధిస్తాడు, శిక్షణను ఇస్తాడు. ఉదాహరణకు, ‘తాను చేయువాటి నెల్లను యేసుకు అగపరచడానికి’ కూడా యెహోవాను పురికొల్పింది ప్రేమే. (యోహా. 5:20) యెహోవాసాక్షులమైన మనం తనను ఘనపర్చడానికి, ఇతరులకు సహాయం చేయడానికి గట్టిగా కృషి చేస్తుండగా యెహోవా దేవుడు ప్రేమతో “శిష్యునికి తగిన నోరు” మనకు దయచేస్తాడు.​—యెష. 50:4.

యెహోవాలా ప్రేమ చూపిస్తూ పరిపాలక సభలోని టీచింగ్‌కమిటీ పది శిక్షణా పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఆసక్తి, అనుకూలమైన పరిస్థితులు ఉన్న సహోదరసహోదరీలు ఆ పాఠశాలల్లో చేరవచ్చు. మీరు వీటిని దేవుని ప్రేమకు నిదర్శనాలుగా ఎంచుతున్నారా?

ఆ పది పాఠశాలలకు సంబంధించిన కొన్ని వివరాలను, వాటికి హాజరైన సహోదరసహోదరీల అనుభవాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అలా పరిశీలిస్తుండగా, ‘దేవుడు ఇస్తున్న ఆ శిక్షణ నుండి నేనెలా ప్రయోజనం పొందవచ్చు?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

దేవుడు ఇస్తున్న శిక్షణ నుండి ప్రయోజనం పొందండి

‘ప్రేమకు కర్తయగు దేవుడైన’ యెహోవా మన జీవితానికి ఓ అర్థం చేకూరేలా శిక్షణ ఇస్తాడు, సవాళ్లను అధిగమించేలా సిద్ధం చేస్తాడు, పరిచర్యలో అవధుల్లేని ఆనందాన్ని పొందేలా మనకు సహాయం చేస్తాడు. (2 కొరిం. 13:11) యేసు ‘ఆజ్ఞాపించిన వాటినన్నిటిని గైకొనాలని ఇతరులకు బోధిస్తూ’ వాళ్లకు సహాయం చేయడానికి మొదటి శతాబ్దపు శిష్యుల్లాగే మనమూ కావాల్సిన శిక్షణ పొందుతున్నాం.​—మత్త. 28:20.

మనం ఆ పాఠశాలల్లో అన్నిటికీ హాజరు కాలేకపోవచ్చు, కానీ వాటిలో కొన్నిటి నుండైనా ప్రయోజనం పొందవచ్చు. వాటిలో దొరికే బైబిలు ఉపదేశాలను అన్వయించుకోవచ్చు. అంతేకాక నిష్ణాతులైన యెహోవా సేవకులతో పరిచర్యలో కలిసి పనిచేయడం ద్వారా మన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు.

‘ఈ పాఠశాలల్లో ఏ ఒక్కదానికైనా హాజరవ్వడానికి నా పరిస్థితులు అనుకూలిస్తాయా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

అమూల్యమైన ఈ పాఠశాలలకు మద్దతు ఇస్తూ వాటి నుండి నేర్చుకోవడాన్ని యెహోవా ఆరాధకులు ఒక అరుదైన అవకాశంగా భావిస్తారు. మీరు పొందే శిక్షణ మిమ్మల్ని యెహోవాకు మరింత సన్నిహితుల్ని చేయడంతో పాటు మీ బాధ్యతల్ని, ముఖ్యంగా సువార్త ప్రకటించే బాధ్యతను నిర్వర్తించేందుకు మిమ్మల్ని అన్నివిధాలా సిద్ధం చేయాలని మేము కోరుకుంటున్నాం.