కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోండి

కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోండి

“దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.”​—కీర్త. 46:1.

1, 2. చాలామందికి ఎలాంటి కష్టాలు వచ్చాయి? అయితే దేవుని సేవకులు ఎలా ఉండాలి?

 మనం కష్టకాలాల్లో జీవిస్తున్నాం. భూమిని విపత్తులు ముంచెత్తుతున్నాయి. భూకంపాలు, సునామీలు, అగ్నిప్రమాదాలు, వరదలు, అగ్ని పర్వతాలు, పెద్దా చిన్నా తుఫాన్లు మానవులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాక కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో సతమతమవడం వల్ల భయం, దుఃఖం చోటుచేసుకుంటున్నాయి. ఊహించని విధంగా అకస్మాత్తుగా జరిగే సంఘటనలు ప్రతీ ఒక్కరి మీద ప్రభావం చూపిస్తున్నాయన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.​—ప్రసం. 9:11.

2 ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది దేవుని సేవకులు అలాంటి కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అయినా, అంతం సమీపిస్తోంది కాబట్టి భవిష్యత్తులో రాగల కష్టాలను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి మనం అలాంటి కష్టాల వల్ల ఉక్కిరిబిక్కిరి కాకుండా ఎలా ఉండవచ్చు? ప్రస్తుతం వచ్చే కష్టాల్ని మనం ఎలా ధైర్యంగా ఎదుర్కోవచ్చు?

కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ల నుండి నేర్చుకోండి

3. రోమీయులు 15:4 చూపిస్తున్నట్లుగా, మనల్ని కృంగదీసే సమస్యలు వచ్చినప్పుడు ఓదార్పును ఎలా పొందవచ్చు?

3 మునుపెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువమంది ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. అయితే మానవులకు అవి కొత్తేమీ కావు. తమకు వచ్చిన కష్టాల్ని సమర్థంగా ఎదుర్కొన్న కొంతమంది దేవుని సేవకుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.​—రోమా. 15:4.

4. దావీదుకు ఎలాంటి కష్టాలు వచ్చాయి? ఆయన వాటిని ఎలా ఎదుర్కోగలిగాడు?

4 దావీదు ఉదాహరణ పరిశీలించండి. రాజు ఆగ్రహానికి, శత్రువుల దాడికి ఆయన గురయ్యాడు, ఆయన భార్యలను శత్రువులు చెరపట్టుకుపోయారు, తను ఎంతగానో నమ్మిన వ్యక్తుల చేతుల్లో మోసపోయాడు, ఎంతో వేదనను అనుభవించాడు. అవేకాక ఇంకెన్నో కష్టాల్ని దావీదు అనుభవించాడు. (1 సమూ. 18:8, 9; 30:1-5; 2 సమూ. 17:1-3; 24:15, 17; కీర్త. 38:4-8) ఆ కష్టాల వల్ల ఆయన పడిన వేదన గురించి బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. కానీ, అవేవీ ఆయనను దేవుని నుండి దూరం చేయలేకపోయాయి. గట్టి విశ్వాసంతో ఆయన, “యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?” అన్నాడు.​—కీర్త. 27:1; కీర్తన 27:5, 10 చదవండి.

5. అబ్రాహాము శారాలు తమకు వచ్చిన కష్టాల్ని ఎలా ఎదుర్కోగలిగారు?

5 ఇప్పుడు అబ్రాహాము, శారాల గురించి ఆలోచిద్దాం. వాళ్లు తమ జీవితంలో ఎక్కువకాలం కొత్త ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని పరదేశుల్లా జీవించారు. వాళ్ల జీవితం అంత సాఫీగా ఏమీ సాగలేదు. కరవుకాటకాలు వచ్చినా, చుట్టుపక్కల దేశాల నుండి ప్రమాదాలు వచ్చినా వాళ్లు మనోనిబ్బరంతో వాటిని ఎదుర్కొన్నారు. (ఆది. 12:10; 14:14-16) ఇంతకీ వాటిని వాళ్లెలా ఎదుర్కోగలిగారు? “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీ. 11:8-10) అబ్రాహాము శారాలు తమ చుట్టూ ఉన్న ప్రజల వల్ల పక్కదారి పట్టకుండా భవిష్యత్తులో తమకు వచ్చే ఆశీర్వాదాల పైనే దృష్టి నిలిపారు.

6. మనం యోబు మాదిరిని ఎలా అనుకరించవచ్చు?

6 ఇక యోబు విషయానికొస్తే, ఆయన జీవితంలో నానా కష్టాలు పడ్డాడు. పరిస్థితులు ఒక్కసారిగా తలక్రిందులైపోయినప్పుడు ఆయనకు ఎలా అనిపించి ఉంటుందో ఆలోచించండి! (యోబు 3:3, 11) పైగా, అసలు ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయో అర్థంకాక ఆయన పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అయినా, దేవునిపై తనకున్న యథార్థతను, విశ్వాసాన్ని ఆయన ఏనాడూ కోల్పోలేదు. (యోబు 27:5 చదవండి.) ఆయన మనకు చక్కని మాదిరి కాదంటారా?

7. దేవుని సేవ చేస్తున్నప్పుడు పౌలు ఎలాంటి కష్టాలు అనుభవించాడు? ఆ సేవలో కొనసాగడానికి కావాల్సిన ధైర్యాన్ని ఆయన ఎలా పొందాడు?

7 మనం అపొస్తలుడైన పౌలు ఉదాహరణను కూడా మనసులో ఉంచుకోవడం మంచిది. ఆయన ‘పట్టణంలోని ఆపదలను, అరణ్యంలోని ఆపదలను, సముద్రంలోని ఆపదలను’ అనుభవించాడు. అంతేకాక ‘ఆకలిదప్పులతో, చలితో, దిగంబరత్వముతో’ గడిపానని ఆయన అన్నాడు. బహుశా, ఓడ బద్దలు కావడం వల్లేమో, “ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని” అని కూడా ఆయన అన్నాడు. (2 కొరిం. 11:23-27) ఓ ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడిన తర్వాత పౌలు ఎలాంటి వైఖరి చూపించాడో గమనించండి. “మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు . . . అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇకముందుకును తప్పించును” అని ఆయన అన్నాడు. (2 కొరిం. 1:8-10) పౌలుకు వచ్చినంత పెద్ద కష్టాలు మనలో చాలామందికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ, మనం కూడా మన జీవితంలో ఎంతో కొంత వేదనను అనుభవించి ఉంటాం కాబట్టి, కష్టాల్లో ఆయన చూపించిన ధైర్యం నుండి మనం ఓదార్పు పొందవచ్చు.

కష్టాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయకుండా చూసుకోండి

8. ప్రస్తుతం లోకంలోని కష్టాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఒక ఉదాహరణ ఇవ్వండి.

8 విపత్తులు, సవాళ్లు, ఒత్తిళ్లు చాలామందిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొంతమంది క్రైస్తవులు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. తన భర్తతో కలిసి ఒకప్పుడు ఆస్ట్రేలియాలో పూర్తికాల సేవచేసిన మేరీకి a రొమ్ము క్యాన్సర్‌ ఉందని తేలినప్పుడు ఆమెకు పిడుగు పడినట్లు అనిపించింది. ఆమె ఇలా అంది: “క్యాన్సర్‌ చికిత్స వల్ల నేను చాలా బలహీనపడిపోయాను. ఆత్మగౌరవాన్ని పూర్తిగా కోల్పోయాను.” దానికితోడు, వెన్నుపాము సర్జరీ అయిన తన భర్తను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమె మీద పడింది. ఒకవేళ మనకే అలాంటి పరిస్థితి వస్తే, మనం ఏమి చేయవచ్చు?

9, 10. (ఎ) మనం సాతానుకు ఏ అవకాశం ఇవ్వకూడదు? (బి) అపొస్తలుల కార్యములు 14:22లో ఉన్న వాస్తవాన్ని మనమెలా తాళుకోవచ్చు?

9 మనకు వచ్చే కష్టాలను అవకాశంగా తీసుకొని సాతాను మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. అయితే, మన సంతోషాన్ని నీరుగార్చే అవకాశాన్ని మనం సాతానుకు ఇవ్వకూడదు. “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు” అని సామెతలు 24:10 చెబుతోంది. మనం పైన పేరాల్లో ఉన్నటువంటి బైబిలు ఉదాహరణలను ధ్యానిస్తే, కష్టాల్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు.

10 మనం కష్టాలన్నిటినీ తీసివేయలేమనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవడం మంచిది. నిజానికి, కష్టాలు వస్తాయని మనం ఎదురుచూడవచ్చు. (2 తిమో. 3:12) “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను” అని అపొస్తలుల కార్యములు 14:22 చెబుతోంది. కాబట్టి, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయే బదులు దేవుడు మీకు సహాయం చేయగల సమర్థుడని గుర్తుంచుకొని ధైర్యంగా ఉండండి.

11. మనకు వచ్చే కష్టాలను తాళుకోవడానికి ఏమి చేయవచ్చు?

11 సంతోషాన్నిచ్చే విషయాలపై మనం మనసు నిలపాలి. దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.” (సామె. 15:13) మన జీవితంలో మార్చలేని వాటి గురించి చింతిస్తూ కూర్చుంటే మనం నిరుత్సాహపడతాం. యెహోవాయే మనకు నిజమైన సహాయం అందిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. విపత్తులు సంభవించినప్పుడు కూడా ఆయన తన వాక్యం ద్వారా ప్రోత్సాహాన్ని, సహోదర సహోదరీల ద్వారా మద్దతును, తన పరిశుద్ధాత్మ ద్వారా బలాన్ని మనకు దయచేస్తాడు. మనం ఈ విషయాల మీద దృష్టి నిలిపితే సంతోషాన్ని పొందుతాం. జీవితంలో మీరు అనుభవిస్తున్న కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చునే బదులు వాటిని తాళుకోవడానికి కావాల్సిన కృషి చేయండి, అలాగే మీ జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించండి.​—సామె. 17:22.

12, 13. (ఎ) విపత్తుల వల్ల వచ్చిన కష్టాల్ని దేవుని సేవకులు ఎలా తట్టుకోగలిగారు? ఒక ఉదాహరణ చెప్పండి. (బి) విపత్తులు వచ్చినప్పుడు, మన జీవితంలో దేనికి మొదటిస్థానం ఇస్తున్నామనేది ఎలా తెలుస్తుంది?

12 ఇటీవల, కొన్ని దేశాల్లో పెద్దపెద్ద విపత్తులు సంభవించాయి. గొప్ప విషయమేమిటంటే, ఆ దేశాల్లోని చాలామంది సహోదరులు అలాంటి పరిస్థితుల్లో కూడా మనోనిబ్బరాన్ని చూపించారు. 2010 ప్రారంభంలో చిలీ దేశంలో వచ్చిన గొప్ప భూకంపం వల్ల, సునామీ వల్ల చాలామంది సహోదరుల ఆస్తిపాస్తులు సర్వనాశనం అయ్యాయి, కొంతమందికైతే జీవనాధారం కూడా లేకుండా పోయింది. అయినా, మన సహోదరులు తమ ఆధ్యాత్మికతను కాపాడుకున్నారు. తన ఇంటిని కోల్పోయిన సామ్యేల్‌ ఇలా అన్నాడు: “ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా నేను, నా భార్య కూటాలకు, పరిచర్యకు వెళ్లడం ఏనాడూ మానుకోలేదు. అలాంటి అలవాటు వల్లే మేము కృంగిపోకుండా ఉన్నామని నేను నమ్ముతున్నాను.” వాళ్లిద్దరే కాక ఇతర సహోదర సహోదరీలు ఎంతోమంది ఆ విపత్తు గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా యెహోవా సేవలో కొనసాగారు.

13 ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో 2009 సెప్టెంబరులో కుండపోతగా కురిసిన వర్షాల వల్ల దాదాపు 80 శాతం నేల ముంపుకు గురైంది. ఎంతో ఆస్తిని కోల్పోయిన ఒక ధనవంతుడు ఇలా అన్నాడు: “ధనవంతులూ బీదలూ అనే తారతమ్యం లేకుండా అందరినీ ఈ వరద ఒకేలా కష్టాల్లో, బాధల్లో ముంచేసింది.” ఇది మనకు యేసు ఇచ్చిన ఈ జ్ఞానయుక్తమైన సలహాను గుర్తుచేస్తుంది: “పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.” (మత్త. 6:20) ఎప్పుడు పోతాయో తెలియని సిరిసంపదల వెంట పరుగులు తీస్తే మిగిలేది నిరాశే. అందుకే, యెహోవాతో మనకున్న మంచి సంబంధానికి మొదటిస్థానం ఇవ్వడం జ్ఞానయుక్తం. ఎన్ని విపత్తులు వచ్చినా సరే ఆ సంబంధం చెక్కుచెదరదు.​—హెబ్రీయులు 13:5, 6 చదవండి.

ఎందుకు ధైర్యం చూపించాలి?

14. మనం ఎందుకు ధైర్యంగా ఉండాలి?

14 తన ప్రత్యక్షత కాలంలో కష్టాలు ఉంటాయని చెబుతూ, వాటికి “జడియకుడి” అని యేసు అన్నాడు. (లూకా 21:9) మన రాజైన యేసు, విశ్వ సృష్టికర్తయైన యెహోవా మనకు తోడుగా ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ధైర్యంగా ఉండవచ్చు. అందుకే పౌలు ఈ మాటలతో తిమోతిని ప్రోత్సహించాడు: “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.”​—2 తిమో. 1:7.

15. దృఢ నమ్మకాన్ని చూపించిన దేవుని సేవకుల ఉదాహరణలు చెప్పండి. మనం కూడా అలాంటి ధైర్యాన్ని ఎలా కలిగి ఉండవచ్చో వివరించండి.

15 దేవుని సేవకులు దృఢ నమ్మకంతో చెప్పిన కొన్ని మాటల్ని గమనించండి. “యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది” అని దావీదు అన్నాడు. (కీర్త. 28:7) పౌలు కూడా నమ్మకంగా ఇలా అన్నాడు: “మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.” (రోమా. 8:37) అలాగే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, దేవునితో తనకున్న బలమైన సంబంధం గురించి తన శిష్యులతో యేసు దృఢంగా ఇలా అన్నాడు: “తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.” (యోహా. 16:32) వాళ్లు చెప్పిన మాటల్ని చూస్తే, వాళ్లలో ప్రతి ఒక్కరికీ యెహోవాపై చెక్కుచెదరని నమ్మకం ఉందని తెలుస్తోంది. దేవునిపై మనం కూడా అలాంటి నమ్మకాన్ని పెంపొందించుకుంటే, ప్రస్తుతం వచ్చే ఎలాంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం.​—కీర్తన 46:1-3 చదవండి.

దేవుడు చేసిన ఏర్పాట్లను వినియోగించుకుంటూ ధైర్యంగా ఉండండి

16. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

16 క్రైస్తవులకు ధైర్యం సొంత సామర్థ్యంపై ఆధారపడడం వల్ల కాదుగానీ, దేవుని గురించి తెలుసుకొని ఆయనపై ఆధారపడడం వల్లే వస్తుంది. దానికోసం మనం ఆయన వాక్యమైన బైబిలును అధ్యయనం చేయాలి. కృంగుదలతో బాధపడుతున్న ఓ సహోదరి తన సమస్యను అధిగమించడానికి తనకు ఏది సహాయపడుతుందో తెలియజేస్తూ ఇలా అంది: “నాకు ఊరట ఇచ్చే వృత్తాంతాలను నేను మళ్లీ మళ్లీ చదువుతాను.” మరి మన విషయమేమిటి? క్రమంగా కుటుంబ ఆరాధన చేసుకోమనే నిర్దేశాన్ని మనం పాటిస్తున్నామా? అవన్నీ చేస్తే మనం కీర్తనకర్త చూపించిన వైఖరినే చూపిస్తాం. ఆయనిలా అన్నాడు: “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.”​—కీర్త. 119:97.

17. (ఎ) మనం ధైర్యంగా ఉండడానికి ఏవి సహాయం చేస్తాయి? (బి) మన ప్రచురణల్లో వచ్చిన ఓ జీవిత కథ మీకు ఎలా సహాయం చేసిందో చెప్పండి.

17 యెహోవాపై మన నమ్మకాన్ని పెంచే సమాచారం ఉన్న బైబిలు ఆధారిత ప్రచురణలు కూడా మనకున్నాయి. మన ప్రచురణల్లో వచ్చే జీవిత కథల నుండి చాలామంది ప్రయోజనం పొందారు. ఆసియాలోని ఓ దేశానికి చెందిన సహోదరి ఒకరకమైన మానసిక సమస్యతో బాధపడుతోంది. అయితే, తనకున్నటువంటి సమస్యతోనే పోరాడి, దాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న ఒక మిషనరీ సహోదరుని జీవిత కథను చదివినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. ఆమె ఇలా రాసింది: “నాకున్న సమస్య ఏమిటో అర్థంచేసుకోవడానికి ఆ ఆర్టికల్‌ సహాయం చేసింది. అంతేకాక, ఆ సమస్యతో పోరాడి గెలవగలననే నమ్మకాన్ని అది నాకిచ్చింది.”

కష్టాలు వచ్చినప్పుడు యెహోవా సహాయాన్ని తీసుకోండి

18. మనం ఎందుకు తరచూ ప్రార్థన చేయాలి?

18 ప్రార్థన ద్వారా కూడా మనం యెహోవా సహాయాన్ని పొందవచ్చు. ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రార్థన మనకు సహాయం చేయగలదు. ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమో అపొస్తలుడైన పౌలు నొక్కిచెప్పాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలి. 4:6, 7) కష్టాలను తట్టుకోవడం కోసం మనం తరచూ ప్రార్థిస్తామా? బ్రిటన్‌కు చెందిన ఆలెక్స్‌ ఎంతోకాలంగా కృంగుదలతో బాధపడుతున్నాడు. “ప్రార్థనలో యెహోవాతో మాట్లాడడం వల్ల, బైబిలు చదువుతూ ఆయన మాటలు వినడం వల్ల” సమస్యతో పోరాడగలుగుతున్నానని ఆయన అన్నాడు.

19. క్రైస్తవ కూటాల విషయంలో మనం ఎలా భావించాలి?

19 యెహోవా మనకు కూటాల ద్వారా కూడా సహాయం చేస్తాడు. “యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది” అని ఒక కీర్తనకర్త రాశాడు. (కీర్త. 84:2) మనం కూడా అలాగే భావిస్తున్నామా? పైన ప్రస్తావించబడిన మేరీ క్రైస్తవ సహవాసం గురించి ఏమనుకుంటుందో చెబుతూ ఇలా అంది: “కూటాలకు వెళ్లడం చాలా ప్రాముఖ్యం. నా సమస్యతో పోరాడడానికి యెహోవా నాకు సహాయం చేయాలంటే నేను అక్కడ ఉండాల్సిందేనని నాకు తెలుసు.”

20. ప్రకటనా పనిలో పాల్గొనడం ద్వారా మనమెలా యెహోవా సహాయాన్ని పొందవచ్చు?

20 రాజ్య ప్రకటనా పనిలో చురుగ్గా పాల్గొనడం ద్వారా కూడా మనం యెహోవా సహాయాన్ని పొందవచ్చు. (1 తిమో. 4:16) ఆస్ట్రేలియాకు చెందిన ఓ సహోదరి ఎన్నో కష్టాల్ని అనుభవించింది. ఆమె ఇలా అంది: “ప్రకటనా పనికి వెళ్లాలంటే అసలు నాకు మనసు వచ్చేది కాదు. కానీ, తనతో కలిసి పరిచర్యలో పాల్గొనమని ఓ సంఘ పెద్ద నన్ను ఆహ్వానించాడు. దాంతో నేను వెళ్లాను. యెహోవాయే నాకు సహాయం చేశాడనిపించింది. ఆ తర్వాత నేను పరిచర్యలో పాల్గొన్న ప్రతీసారి నాకు ఎంతో సంతోషం కలిగింది.” (సామె. 16:20) యెహోవాపై విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఇతరులకు సహాయం చేస్తే తమ విశ్వాసం కూడా బలపడుతుందని చాలామంది గ్రహించారు. ప్రకటనా పనిలో పాల్గొనడం వల్ల, మనం మన సొంత సమస్యల గురించి ఆలోచించే బదులు శ్రేష్ఠమైన విషయాలపై దృష్టి నిలపగలుగుతాం.​—ఫిలి. 1:9-11.

21. కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏ నమ్మకాన్ని కలిగివుండవచ్చు?

21 ప్రస్తుతం వచ్చే కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా మనకు సహాయం చేయడానికి యెహోవా ఎన్నో ఏర్పాట్లు చేశాడు. కాబట్టి, ప్రస్తుతం వస్తున్న కష్టాల్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఆ ఏర్పాట్లన్నిటినీ వినియోగించుకోవాలి, ధైర్యం చూపించిన దేవుని సేవకుల మాదిరిని ధ్యానిస్తూ వాళ్లను అనుకరించాలి. అంతం సమీపిస్తుండగా మనకు బాధ కలిగించే సంఘటనలు ఎన్నో జరగవచ్చు. అయితే, ‘పడద్రోయబడినను నశించువారము కాము. మేము అధైర్యపడము’ అని చెప్పిన పౌలులా మనం భావించవచ్చు. (2 కొరిం. 4:9, 16) యెహోవా సహాయంతో మనకు వచ్చే కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చు.​2 కొరింథీయులు 4:17, 18 చదవండి.

a కొన్ని అసలు పేర్లు కావు.