కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘పిల్లలు’ ఇచ్చిన ప్రోత్సాహం

‘పిల్లలు’ ఇచ్చిన ప్రోత్సాహం

2009 డిసెంబరులో, రష్యా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రష్యాలోని టాగన్రోగ్‌లో ఉన్న స్థానిక యెహోవాసాక్షుల కార్యాలయాన్ని మూసివేశారు, రాజ్యమందిరాన్ని జప్తుచేశారు, మనం ముద్రిస్తున్న వాటిలో 34 ప్రచురణలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రకటించారు. ఆ తీర్పు వల్ల ప్రభావితులైన సాక్షుల ఫోటోలను, పిల్లల ఫోటోలను, ఆ తీర్పుకు సంబంధించిన సమాచారాన్ని యెహోవాసాక్షుల అధికారిక వెబ్‌సైట్‌లో సంస్థ పెట్టింది.

The children in Australia

కొన్ని నెలల తర్వాత, ఆ కోర్టు తీర్పును చూసిన ఆస్ట్రేలియాలోని క్వీన్‌లాండ్‌లో ఉన్న ఒక సాక్షుల కుటుంబం ఓ పెట్టెను, ఓ ఉత్తరాన్ని రష్యాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపించింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: “ప్రియమైన సహోదరులారా, రష్యాలోని సహోదరులు పడుతున్న కష్టాలను బట్టి, వాళ్లు చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి మా పిల్లలు అలెగ్జాండర్‌, లెరీస ఎంతో చలించిపోయారు. ఎంతో దూరాన ఉన్న పిల్లలు కూడా టాగన్రోగ్‌లోని పిల్లల్లాగే నమ్మకంగా సేవచేస్తున్నారని, అక్కడి పిల్లల గురించి ఆలోచిస్తున్నారని చూపించడానికి మా పిల్లలు కొన్ని కార్డులను, ఉత్తరాలను రాశారు, మేము బహుమతులున్న ఒక చిన్న ప్యాకెట్‌ను తయారుచేశాం. వాటిని అక్కడి పిల్లల కోసం పంపిస్తున్నాం. మా పిల్లలు వాళ్ల కోసం తమ ప్రేమాప్యాయతలను పంపిస్తున్నారు.”

ఆ బహుమతులను అందుకున్న టాగన్రోగ్‌లోని పిల్లలు ఆస్ట్రేలియాలోని సాక్షుల కుటుంబానికి తమ కృతజ్ఞతను తెలుపుతూ ఉత్తరాలు రాశారు. రష్యాలోని బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్న ఓ సహోదరుడు, ఆ చిన్నారులు ఇచ్చిన ప్రోత్సాహానికి కదిలించబడి వాళ్లకు ఇలా ఉత్తరం రాశాడు: “చేయని తప్పుకు శిక్ష అనుభవించేటప్పుడు ఇక్కడి సాక్షులకు, పిల్లలకు ఎలా అనిపిస్తుందో మీరు ఊహించవచ్చు. ఇక్కడి సహోదరసహోదరీలు ఏ తప్పూ చేయకపోయినా, వాళ్ల రాజ్యమందిరాన్ని స్వాధీనపర్చుకున్నారు. దాని వల్ల వాళ్లు కుమిలిపోయారు. ఎక్కడో వేరే దేశంలో ఉన్న సహోదరులు ఇక్కడి వాళ్ల గురించి ఆలోచిస్తున్నారని తెలుసుకోవడం వీళ్లకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు చూపించిన ప్రేమకు, ఉదార స్ఫూర్తికి కృతజ్ఞతలు.”​—కీర్త. 8:2.

ఆస్ట్రేలియాలోని పిల్లల (కుడి) నుండి బహుమతులను అందుకున్న రష్యాలోని పిల్లలు (ఎడమ)

మనమందరం నిజంగా ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో భాగంగా ఉన్నాం. ఒకరి మీద ఒకరు చూపిస్తున్న ప్రేమ సహాయంతో జీవితంలో ఎదురయ్యే కఠినమైన పరీక్షలను, కష్టాలను మనం ఎదుర్కోగలుగుతాం. ఓ పక్క కోర్టుల్లో యెహోవాసాక్షుల ప్రచురణలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయనే చర్చలు జరుగుతుండగా, సాక్షులైన పిల్లలు మాత్రం వివిధ దేశాలకు, విభిన్న సంస్కృతులకు చెందిన సాక్షుల పిల్లల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలను మన యెహోవాసాక్షుల పిల్లలు సార్థకం చేస్తున్నారు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”​—యోహా. 13:35.