కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వినయం చూపించడంలో యేసు మంచి మాదిరి ఉంచాడు

వినయం చూపించడంలో యేసు మంచి మాదిరి ఉంచాడు

“నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.”—యోహా. 13:15.

1, 2. భూమ్మీద తాను గడిపిన చివరి రాత్రి యేసు తన అపొస్తలులకు ఏ పాఠం నేర్పించాడు?

 భూమ్మీద యేసు గడిపిన చివరి రాత్రి అది. ఆయన యెరూషలేములోని ఒక ఇంటి మేడగదిలో తన అపొస్తలులతో ఉన్నాడు. రాత్రి భోజనం చేసేటప్పుడు, యేసు లేచి తన పైవస్త్రం తీసి పక్కనబెట్టి తన నడుముకు ఒక తువాలు చుట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక పళ్లెములో నీళ్లు పోసి తన శిష్యుల పాదాలు కడిగి తువాలుతో తుడిచాడు. అలా చేశాక మళ్లీ తన పైవస్త్రం వేసుకున్నాడు. ఇంతకీ యేసు ఎందుకు తన శిష్యుల పాదాలు కడిగాడు?—యోహా. 13:3-5.

2 యేసే స్వయంగా ఇలా వివరించాడు: “నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? . . . ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.” (యోహా. 13:12-15) దాసుడు చేయాల్సిన పనిని తనే స్వయంగా చేయడం ద్వారా యేసు నేర్పించిన పాఠం వాళ్ల మనసుల్లో చెరగని ముద్రవేసింది. ముందుముందు వినయంగా ఉండాలని అది శిష్యుల్ని ప్రోత్సహించింది.

3. (ఎ) యేసు రెండు సందర్భాల్లో వినయం గురించి ఎలా నొక్కిచెప్పాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

3 యేసు వినయం గురించి నొక్కి చెప్పడం అదే మొదటిసారి కాదు. అంతకుముందు ఒకసారి తన శిష్యులు ఎవరు గొప్ప అని వాదించుకున్నప్పుడు యేసు ఓ చిన్నబిడ్డను తన పక్కన నిలబెట్టుకొని వాళ్లకు ఇలా చెప్పాడు: “ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడు.” (లూకా 9:46-48) ఇతరుల కన్నా గొప్పగా ఉండేందుకు పరిసయ్యులు ప్రాకులాడుతారనే విషయాన్ని మనసులో పెట్టుకొని యేసు ఇలా అన్నాడు: “తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.” (లూకా 14:11) తన శిష్యులు వినయంగా ఉండాలని అంటే గర్వం, పొగరు వంటి లక్షణాలకు తావివ్వకుండా దీనమనస్సు కలిగి ఉండాలన్నదే యేసు కోరిక. ఇప్పుడు మనం యేసు చూపించిన వినయం గురించి పరిశీలిస్తూ, ఆయనను ఎలా అనుకరించవచ్చో ఆలోచిద్దాం. అంతేకాక, వినయం చూపించే వాళ్లతోపాటు ఇతరులు కూడా ఆ లక్షణం వల్ల ఎలా ప్రయోజనం పొందుతారో చూద్దాం.

‘వినకుండా నేను తొలగిపోలేదు’

4. దేవుని అద్వితీయ కుమారుడు ఈ భూమ్మీదకు రాకముందు ఎలా వినయం చూపించాడు?

4 దేవుని అద్వితీయ కుమారుడు ఈ భూమ్మీదకు రాకముందు కూడా వినయం చూపించాడు. ఆయన పరలోకంలో ఎన్నో యుగాలపాటు తన తండ్రితో ఉన్నాడు. తండ్రితో యేసుకున్న సన్నిహిత సంబంధం గురించి యెషయా గ్రంథం ఇలా చెబుతోంది: “అలసిన వానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు, వినకుండ నేను తొలగిపోలేదు.” (యెష. 50:4, 5) యేసు వినయం చూపిస్తూ యెహోవా బోధించిన విషయాల్ని చాలా శ్రద్ధగా విన్నాడు. సత్య దేవుడు చెప్పిన విషయాల్ని ఆయన ఎంతో ఆత్రంగా, ఇష్టంగా నేర్చుకున్నాడు. పాపులైన మానవుల మీద కనికరం చూపించడం ద్వారా యెహోవా కనబర్చిన వినయాన్ని యేసు ప్రత్యక్షంగా చూశాడు.

5. అపవాదితో వాదన జరిగినప్పుడు ప్రధానదూతయైన మిఖాయేలుగా యేసు ఎలా వినయాన్ని, అణకువను చూపించాడు?

5 అయితే పరలోకంలో కొందరు దేవదూతలు యేసులా మంచి స్వభావాన్ని చూపించలేదు. ఉదాహరణకు, అపవాదియైన సాతానుగా మారిన దేవదూత యెహోవా నుండి నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. వినయంగా ఉండే బదులు గర్వాన్ని, అహంకారాన్ని చూపించి సాతాను యెహోవా మీద తిరుగుబాటు చేశాడు. కానీ, యేసు మాత్రం పరలోకంలో తనకున్న స్థానాన్ని బట్టి అసంతృప్తి చెందలేదు, తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. ‘మోషే శరీరం గురించి అపవాదితో వాదన’ జరిగినప్పుడు కూడా ప్రధానదూతయైన మిఖాయేలుగా యేసు హద్దు దాటలేదు. బదులుగా వినయాన్ని, అణకువను చూపించాడు. ఈ విశ్వానికి సర్వోన్నత న్యాయాధిపతియైన యెహోవా తాను అనుకున్న సమయంలో, తనదైన పద్ధతిలో విషయాల్ని చక్కబరుస్తాడని యేసు నమ్మాడు.—యూదా 9 చదవండి.

6. మెస్సీయగా ఈ భూమ్మీదకు రావడానికి దేవుడు ఇచ్చిన నియామకాన్ని అంగీకరించడంలో యేసు ఎలా వినయం చూపించాడు?

6 మెస్సీయగా తన పాత్రకు సంబంధించిన ప్రవచనాల గురించి యేసు పరలోకంలో ఉండగానే తెలుసుకున్నాడు. కాబట్టి, తాను ముందుముందు ఎదుర్కోబోయే కష్టాల గురించి ఆయనకు అప్పుడే తెలిసి ఉంటుంది. అయినా, మెస్సీయగా భూమ్మీదకు వచ్చి మరణించడానికి సంబంధించిన నియామకాన్ని యేసు అంగీకరించాడు. ఎందుకు? దేవుని అద్వితీయ కుమారుడు చూపించిన వినయాన్ని నొక్కిచెబుతూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.”—ఫిలి. 2:6, 7.

మానవునిగా ఉన్నప్పుడు ‘తన్ను తాను తగ్గించుకున్నాడు’

యేసు చూపించిన వినయం మనకెలా ప్రయోజనాల్ని చేకూరుస్తుంది?

7, 8. చిన్నప్పుడు, పెద్దవాడైన తర్వాత యేసు ఏయే విధాలుగా వినయం చూపించాడు?

7 “ఆయన [యేసు] ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను” అని పౌలు రాశాడు. (ఫిలి. 2:8) యేసు చిన్నప్పటి నుండే వినయంగా నడుచుకున్నాడు. అపరిపూర్ణ తల్లిదండ్రులైన యోసేపు మరియల సంరక్షణలో పెరిగినప్పటికీ యేసు వినయంగా ‘వారికి లోబడ్డాడు.’ (లూకా 2:51) తమ తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా లోబడి ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందే పిల్లలకు యేసు ఎంత చక్కని మాదిరో కదా!

8 పెద్దవాడయ్యాక కూడా, తన ఇష్టాయిష్టాల్ని పక్కనబెట్టి యెహోవా చిత్తానికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా యేసు వినయం చూపించాడు. (యోహా. 4:34) యేసు తన పరిచర్యలో దేవుని పేరును ఉపయోగించాడు. అంతేకాక యెహోవా లక్షణాల గురించి, మానవుల పట్ల ఆయనకున్న సంకల్పం గురించి ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకునేలా సహృదయులకు సహాయం చేశాడు. యెహోవా గురించి తాను నేర్పించినదానికి అనుగుణంగా యేసు జీవించాడు. ఉదాహరణకు, మాదిరి ప్రార్థన ప్రారంభంలో యేసు ఈ మాటలు ఉపయోగించాడు: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్త. 6:9, 10) యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చడానికే ప్రాధాన్యతను ఇవ్వాలని యేసు ఆ మాటల్లో తన శిష్యులకు నేర్పించాడు. నేర్పించడమే కాదు తానే స్వయంగా అలా ప్రవర్తించాడు కూడా. అందుకే యేసు తన భూపరిచర్య ముగింపులో యెహోవాకు చేసిన ప్రార్థనలో ఇలా అనగలిగాడు: “వారికి [అపొస్తలులకు] నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను.” (యోహా. 17:26) అంతేకాక, యేసు తాను ఈ భూమ్మీద సాధించిన వాటన్నిటిని బట్టి యెహోవాకే ఘనత చెల్లించాడు.—యోహా. 5:19.

9. మెస్సీయ గురించి జెకర్యా ఏమని ప్రవచించాడు? యేసు ఆ ప్రవచనాన్ని ఎలా నెరవేర్చాడు?

9 మెస్సీయ గురించి జెకర్యా ఇలా రాశాడు: “సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.” (జెక. 9:9) యేసు సా.శ. 33లో పస్కా పండుగకు ముందు యెరూషలేముకు వచ్చినప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది. యేసు వచ్చే దారిలో జనసమూహాలు తమ పైవస్త్రాలను, చెట్టుకొమ్మలను పరిచారు. నిజానికి, ఆయన రాకతో పట్టణమంతా జయధ్వనులతో మారుమ్రోగిపోయింది. యేసు రాజని ప్రజలు స్తుతించిన ఆ సందర్భంలో కూడా ఆయన వినయంగానే ఉన్నాడు.—మత్త. 21:4-11.

10. చనిపోయేంతవరకు మనస్ఫూర్తిగా విధేయత చూపించి యేసు ఏమి నిరూపించాడు?

10 యేసు మ్రాను మీద చనిపోయేంతవరకు వినయ విధేయతలతో నడుచుకున్నాడు. అలా, ఎంత పెద్ద పరీక్ష వచ్చినా మానవులు యెహోవా పట్ల నమ్మకంగా ఉండగలరని యేసు నిరూపించాడు. అంతేకాక, మానవులు స్వార్థం కోసమే యెహోవాను సేవిస్తారని సాతాను వేసిన నింద తప్పని యేసు నిరూపించాడు. (యోబు 1:9-11; 2:4) క్రీస్తు పరిపూర్ణ యథార్థత చూపించడం ద్వారా యెహోవా సర్వాధిపత్యం సరైనదని, నీతియుక్తమైనదని నిరూపించాడు. వినయస్థుడైన తన కుమారుడు చూపించిన చెక్కుచెదరని విశ్వసనీయతను చూసి యెహోవా ఎంతో సంతోషించాడు.—సామెతలు 27:11 చదవండి.

11. యేసు అర్పించిన విమోచన క్రయధన బలి వల్ల నమ్మకస్థులైన మానవులకు ఏ అవకాశాలు వచ్చాయి?

11 మ్రాను మీద మరణించి యేసు మానవుల కోసం విమోచన క్రయధనం కూడా చెల్లించాడు. (మత్త. 20:28) దానివల్ల, యెహోవా తన నీతియుక్త ప్రమాణాల ఆధారంగా మానవుల పాపాల్ని క్షమించడం సాధ్యమైంది. అంతేకాక, మానవులు నిరంతరం జీవించడానికి మార్గం సుగమమైంది. పౌలు ఇలా రాశాడు: “ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.” (రోమా. 5:18) యేసు చనిపోవడం వల్ల ఆత్మాభిషిక్త క్రైస్తవులకు పరలోకంలో అమర్త్యమైన జీవం పొందే అవకాశం దొరికింది, ‘వేరేగొర్రెలు’ ఈ భూమ్మీద నిత్యం జీవించడానికి మార్గం సుగమమైంది.—యోహా. 10:16; రోమా. 8:16, 17.

‘నేను దీనమనస్సు గలవాడను’

12. అపరిపూర్ణ మానవులతో వ్యవహరిస్తున్నప్పుడు యేసు ఎలా సాత్వికాన్ని, వినయాన్ని చూపించాడు?

12 “ప్రయాసపడి భారము మోసికొనుచున్న” ప్రజలందర్నీ తన దగ్గరకు రమ్మని యేసు ఆహ్వానించాడు. ఆయన ఇలా అన్నాడు: “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.” (మత్త. 11:28, 29) వినయం, సాత్వికం ఉండడం వల్ల యేసు అపరిపూర్ణ మానవులతో దయగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాడు. తన శిష్యుల సామర్థ్యానికి మించిన పనుల్ని ఆయన వాళ్లకు అప్పగించలేదు. యేసు వాళ్లను మెచ్చుకున్నాడు, ప్రోత్సహించాడు. తాము అసమర్థులమని, దేనికీ పనికిరానివాళ్లమని శిష్యులు అనుకునేలా యేసు ఎన్నడూ ప్రవర్తించలేదు. వాళ్లతో కఠినంగా, క్రూరంగా వ్యవహరించలేదు. బదులుగా తనకు సన్నిహితమై తన బోధల్ని పాటిస్తే విశ్రాంతి దొరుకుతుందని యేసు వాళ్లకు అభయమిచ్చాడు. ఎందుకంటే ఆయన కాడి సులువైనది, ఆయన భారము తేలికైనది. అందుకే స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు అలా అందరూ ఇష్టంగా ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు.—మత్త. 11:30.

కనికరం చూపించే విషయంలో యేసు మనకు ఆదర్శం

13. దీనావస్థలో ఉన్న ప్రజల పట్ల యేసు ఎలా కనికరం చూపించాడు?

13 ఇశ్రాయేలులోని సామాన్య ప్రజలతో కలిసి జీవించిన యేసు వాళ్ల దీనావస్థను చూసి కనికరపడ్డాడు, ప్రేమతో వాళ్ల అవసరాల పట్ల శ్రద్ధ చూపించాడు. యెరికో దగ్గర యేసుకు ఇద్దరు గుడ్డివాళ్లు తారసపడ్డారు. అందులో ఒకరి పేరు బర్తిమయి. యేసు సహాయం కోసం వాళ్లు పట్టుదలగా కేకలు వేశారు కానీ ఊరకుండుమని వాళ్లను జనులు గద్దించారు. సహాయం కోసం గుడ్డివాళ్ల అరుపులను పట్టించుకోకుండా యేసు తన దారిన తాను వెళ్లగలిగేవాడే. కానీ ఆయన వాళ్లను తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పి, వాళ్ల మీద జాలిపడి స్వస్థపరిచాడు. యేసు తన తండ్రియైన యెహోవాను అనుకరిస్తూ వినయాన్ని, పాపులైన దీనుల పట్ల కనికరాన్ని చూపించాడు.—మత్త. 20:29-34; మార్కు 10:46-52.

“తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును”

14. యేసు వినయంగా జీవించడం వల్ల ఏ ప్రయోజనాలు వచ్చాయి?

14 యేసుక్రీస్తు వినయంగా జీవించడం వల్ల సంతోషం వెల్లివిరిసింది, గొప్ప ప్రయోజనాలు చేకూరాయి. తన ప్రియకుమారుడు వినయంగా తన చిత్తాన్ని చేయడం చూసి యెహోవా సంతోషించాడు. యేసు సాత్వికాన్ని, దీనమనస్సును చూపించినందువల్ల అపొస్తలులు, ఇతర శిష్యులు విశ్రాంతి పొందారు. ఆయన మాదిరి వల్ల, బోధల వల్ల, ఆయన ప్రేమతో మెచ్చుకోవడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలనే ప్రేరణను వాళ్లు పొందారు. యేసు వినయం చూపించినందువల్ల సామాన్య ప్రజలు ఎంతో ప్రయోజనం పొందారు. వాళ్లు ఆయన సహాయాన్ని చవిచూశారు, ఆయన బోధల్ని విన్నారు, ఆయన నుండి ప్రోత్సాహాన్ని పొందారు. నిజానికి, యేసు అర్పించిన విమోచన క్రయధన బలి వల్ల విశ్వాసంగల మానవులందరూ శాశ్వత ప్రయోజనాల్ని పొందుతారు.

15. వినయం చూపించినందు వల్ల యేసు ఎలాంటి ప్రయోజనం పొందాడు?

15 మరి వినయం చూపించినందువల్ల యేసు ఏమైనా ప్రయోజనం పొందాడా? అవును పొందాడు. ఎందుకంటే, “తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును” అని ఆయన తన శిష్యులతో చెప్పాడు. (మత్త. 23:12) ఆ మాటలు ఆయన విషయంలో నిజమయ్యాయి. పౌలు ఇలా వివరించాడు: “అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” యేసు భూమ్మీద జీవించినంత కాలం వినయంగా, విశ్వసనీయంగా నడుచుకున్నాడు కాబట్టి యెహోవా ఆయనను హెచ్చించి పరలోకంలో, భూమ్మీద ఆయనకు సమస్త అధికారాన్ని ఇచ్చాడు.—ఫిలి. 2:9-11.

యేసు ‘సత్యమును, వినయమును ధరించుకొని బయలుదేరును’

16. దేవుని కుమారుడు భవిష్యత్తులో కూడా వినయాన్ని చూపిస్తూనే ఉంటాడని ఎలా చెప్పవచ్చు?

16 దేవుని కుమారుడు భవిష్యత్తులో కూడా వినయం చూపిస్తూనే ఉంటాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్న యేసు తన శత్రువుల మీద ఎలా చర్య తీసుకుంటాడో ప్రవచిస్తూ కీర్తనకర్త ఇలా పాడాడు: “సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము.” (కీర్త. 45:4) యేసు నీతిసత్యాలతోనే కాక వినయంతో హార్‌మెగిద్దోను యుద్ధానికి బయల్దేరతాడు. వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో మెస్సీయ రాజు ‘సమస్తమైన ఆధిపత్యాన్ని, సమస్తమైన అధికారాన్ని, బలాన్ని కొట్టివేస్తాడు.’ మరి ఆయన ఆ తర్వాత కూడా వినయాన్ని చూపిస్తూనే ఉంటాడా? అవును. ఎందుకంటే, ఆయన ‘తన తండ్రియైన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు.’—1 కొరింథీయులు 15:24-28 చదవండి.

17, 18. (ఎ) యెహోవా సేవకులు యేసులా వినయం చూపించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

17 మన విషయమేమిటి? మన మాదిరికర్తయైన యేసును అనుకరిస్తూ మనం కూడా వినయం చూపిస్తామా? రాజైన యేసుక్రీస్తు హార్‌మెగిద్దోనులో తీర్పుతీర్చడానికి వచ్చినప్పుడు వినయంగా, నీతిగా నడుచుకునేవాళ్లను మాత్రమే రక్షిస్తాడు. కాబట్టి, మనం రక్షణ పొందాలంటే వినయాన్ని వృద్ధి చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అంతేకాక, యేసు వినయం చూపించినందువల్ల ఆయనకూ ఇతరులకూ ప్రయోజనాలు చేకూరాయి. వినయం చూపిస్తే మనకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

18 యేసులా వినయం చూపించడానికి మనకేది సహాయం చేస్తుంది? ఎన్ని సవాళ్లు వచ్చినా వినయం చూపించడానికి మనమెలా కృషి చేయవచ్చు? ఈ ప్రశ్నలకు తర్వాతి ఆర్టికల్‌లో జవాబులు చూస్తాం.