కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అత్యల్పులుగా ఉండండి

అత్యల్పులుగా ఉండండి

“మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడు.”​—లూకా 9:48.

1, 2. యేసు తన శిష్యులకు ఏ ఉపదేశమిచ్చాడు? ఎందుకు?

 అది సా.శ. 32వ సంవత్సరం. యేసు గలిలయలో ఉండగా ఒక సమస్య తలెత్తింది. ఆయన అపొస్తలుల్లో కొంతమంది ‘తమలో ఎవరు గొప్ప’ అని వాదించుకోవడం మొదలుపెట్టారు. ఆ సందర్భాన్ని వివరిస్తూ సువార్త రచయితయైన లూకా ఇలా రాశాడు: “తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి​—ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను.” (లూకా 9:46-48) అలా, ఎందుకు వినయంగా ఉండాలో యేసు సహనంగా, స్థిరంగా వాళ్లకు బోధించాడు.

2 అత్యల్పులుగా ఉండమని యేసు ఇచ్చిన ఉపదేశం మొదటి శతాబ్దపు యూదుల ఆలోచనా విధానానికి తగినట్లుగా ఉందా? లేక వ్యతిరేకంగా ఉందా? ఆ కాలంలోని ప్రజల ఆలోచనా విధానం గురించి థియోలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌ ఇలా చెబుతోంది: “ఎవరు గొప్ప అనే ప్రశ్న ప్రతీ సందర్భంలో ఉత్పన్నమయ్యేది, తమకు తగినంత గౌరవం దక్కడం చాలా ప్రాముఖ్యమని ప్రతి ఒక్కరూ అనుకునేవాళ్లు, దాని గురించి అదేపనిగా ఆలోచించేవాళ్లు.” అలాంటి ప్రజల్లా ఆలోచించవద్దని యేసు తన శిష్యులకు ఉపదేశించాడు.

3. (ఎ) అత్యల్పునిగా ఉండడమంటే ఏమిటి? అలా ఉండడం కొన్నిసార్లు మనకు ఎందుకు కష్టమనిపించవచ్చు? (బి) అత్యల్పులుగా ఉండడానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు?

3 ‘అత్యల్పుడు’ అని అర్థమిచ్చే గ్రీకు పదం అణకువ, వినయం కలిగిన దీనుడైన వ్యక్తిని, అంతగా ప్రాముఖ్యంకాని లేదా పెద్దగా గౌరవం చూరగొనని, ఇతరుల్ని ప్రభావితం చేయలేని వ్యక్తిని సూచిస్తోంది. యేసు ఒక చిన్నబిడ్డను చూపించి వినయంగా, అణకువగా ఉండాలని తన అపొస్తలులకు స్పష్టంగా చెప్పాడు. ఈ రోజుల్లోని నిజ క్రైస్తవులు కూడా ఆ ఉపదేశాన్ని పాటించడం చాలా ప్రాముఖ్యం. అయితే వినయంగా ఉండడం మనకు కొన్ని సందర్భాల్లో కష్టమనిపించవచ్చు. మనలో స్వతహాగా ఉండే గర్వం కారణంగా మనం ఇతరుల కంటే గొప్పగా ఉండడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. పోటీతత్వం ఉన్న వాతావరణంలో పెరగడం వల్ల, లోకంలో ప్రజలు చూపించే స్ఫూర్తి వల్ల మనం కూడా కొన్నిసార్లు అహంకారులుగా, కయ్యానికి కాలుదువ్వే వాళ్లుగా, ఇతరుల్ని చెప్పుచేతల్లో పెట్టుకునే స్వభావంగల వాళ్లుగా తయారయ్యే ప్రమాదం ఉంది. మనం అత్యల్పులుగా ఎలా ఉండవచ్చు? మనలో ‘అత్యల్పుడు గొప్పవానిగా’ ఎలా ఉంటాడు? మనం ఏయే విషయాల్లో వినయం చూపించడానికి కృషి చేయాలి?

“ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము”

4, 5. మనం వినయాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు? ఓ అనుభవం చెప్పండి.

4 మనకన్నా యెహోవా ఎంత గొప్పవాడో ఆలోచిస్తే మనం వినయాన్ని పెంపొందించుకోవచ్చు. నిజం చెప్పాలంటే, “ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.” (యెష. 40:28) యెహోవా గొప్పతనానికి సంబంధించిన కొన్ని అంశాల గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.” (రోమా. 11:33) పౌలు సుమారు 2,000 సంవత్సరాల క్రితం ఆ మాటలు రాశాడు. అప్పటి నుండి మనుష్యులు ఎన్నో రంగాల్లో విశేష జ్ఞానం సంపాదించినా సృష్టికర్త గురించి వాళ్లు తెలుసుకుంది సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే. మనం యెహోవా గురించి ఎంత తెలుసుకున్నా ఆయన గురించి, ఆయన పనుల గురించి, ఆయన మార్గాల గురించి ఎన్నటికీ పూర్తిగా తెలుసుకోలేమని వినయంగా అంగీకరిస్తాం.

5 దేవుని మార్గాలను పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదని గ్రహించడం వల్లే జోయెల్‌ a తనను తాను అత్యల్పునిగా ఎంచుకోవడం నేర్చుకున్నాడు. చిన్నప్పటినుండి ఆయనకు విజ్ఞానశాస్త్రం అంటే ఎంతో మక్కువ. అందుకే విశ్వం గురించి వీలైనంత ఎక్కువగా నేర్చుకోవాలనే తపనతో ఆయన ఖగోళ భౌతికశాస్త్రం అభ్యసించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు. ఆయనిలా అన్నాడు: “ఇప్పుడున్న విజ్ఞానశాస్త్ర సిద్ధాంతాలతో ఈ విశ్వాన్ని పూర్తిగా అర్థంచేసుకోలేమనే విషయాన్ని నా చదువుల వల్ల నేను గ్రహించాను. దాంతో నేను న్యాయశాస్త్రం అభ్యసించడం మొదలుపెట్టాను.” జోయెల్‌ విద్యను ముగించుకున్నాక జిల్లా న్యాయవాదిగా నియమితుడయ్యాడు, ఆ తర్వాత జడ్జి కూడా అయ్యాడు. కొంతకాలానికి జోయెల్‌, ఆయన భార్య యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టి, బాప్తిస్మం తీసుకుని యెహోవా సేవకులయ్యారు. అంత పెద్ద చదువులు చదివినా, పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినా జోయెల్‌ అత్యల్పునిగా ఎలా ఉండగలిగాడు? “యెహోవా గురించి, ఈ విశ్వం గురించి ఎంత నేర్చుకున్నా, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకోవడం వల్లే” అని జోయెల్‌ ఏమాత్రం తడుముకోకుండా చెప్పాడు.

సువార్త ప్రకటించే గొప్ప అవకాశాన్ని ఇచ్చి యెహోవా మనల్ని ఘనపర్చాడు

6, 7. (ఎ) వినయం చూపించే విషయంలో యెహోవా ఎలా అత్యుత్తమ మాదిరిగా ఉన్నాడు? (బి) దేవుని వినయం ఒక వ్యక్తిని ఎలా “గొప్ప” చేస్తుంది?

6 యెహోవా దేవుడే వినయం చూపిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల కూడా మనం వినయంగా ఉండగలుగుతాం. మనం “దేవుని జతపనివారమై యున్నాము” అనే విషయం గురించి ఆలోచించండి. (1 కొరిం. 3:9) తన వాక్యమైన బైబిల్ని ఉపయోగిస్తూ పరిచర్య చేసే అవకాశాన్ని మనకిచ్చి మహోన్నతుడైన యెహోవా మనల్ని ఘనపరుస్తున్నాడు. మనం నాటి, నీళ్లు పోస్తూ సాగుచేస్తున్న సత్యపు విత్తనాలను వృద్ధి చేసేది యెహోవా దేవుడే అయినా తనతోపాటు పనిచేసే అరుదైన గౌరవాన్ని మనకు ఇచ్చాడు. (1 కొరిం. 3:6, 7) దేవుడు వినయాన్ని చూపిస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ కాదా? అవును, యెహోవా వినయం చూపిస్తున్నాడనే విషయం మనసులో ఉంచుకుంటే మనం కూడా అత్యల్పులముగా ప్రవర్తించాలనే ప్రోత్సాహాన్ని పొందుతాం.

7 దేవుడు చూపించిన వినయం, కీర్తనకర్తయైన దావీదు మనసులో చెరగని ముద్ర వేసింది. ఆయన యెహోవాను ఇలా కీర్తించాడు: “నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్పచేయును.” (2 సమూ. 22:36) యెహోవా వినయం చూపించడం వల్లే అంటే ఆయన ఎన్నో మెట్లు దిగివచ్చి, తనమీద శ్రద్ధ నిలపబట్టే తాను ఇశ్రాయేలులో రాజు అవ్వగలిగానని దావీదు గుర్తించాడు. (కీర్త. 113:5-8) మన విషయంలో కూడా యెహోవా అలాగే ప్రవర్తించలేదా? మనకున్న లక్షణాల్లో, సామర్థ్యాల్లో, సేవా అవకాశాల్లో యెహోవా నుండి “పొందనిది ఏది?” (1 కొరిం. 4:7) తనను తాను తగ్గించుకునే వ్యక్తి యెహోవా దృష్టిలో విలువైన సేవకునిగా తయారౌతాడు, ఆ విధంగా అత్యల్పుడైన ఆ వ్యక్తి ‘గొప్పవానిగా’ ఉంటాడు. (లూకా 9:48) ఇప్పుడు దాని గురించి మరింత వివరంగా చూద్దాం.

మీలో ‘అత్యల్పుడు గొప్పవానిగా’ ఉంటాడు

8. మనకు వినయం ఉంటే యెహోవా సంస్థ పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది?

8 దేవుని సంస్థలో కొనసాగాలన్నా, సంఘ ఏర్పాటుకు సహకరించాలన్నా మనం వినయం చూపించడం చాలా అవసరం. ఉదాహరణకు, సాక్షుల కుటుంబంలో పెరిగిన జెస్సికా అనే యువతి అనుభవాన్ని పరిశీలించండి. నచ్చినట్లు జీవించాలనే కోరికతో ఆమె సంఘానికి దూరమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె మళ్లీ సంఘంతో సహవసించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె యెహోవా సంస్థలో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తూ, సంఘానికి పూర్తి మద్దతు ఇస్తోంది. ఆమెలో ఆ మార్పు ఎలా వచ్చింది? ఆమె ఇలా చెప్పింది, “నేను వినయం, అణకువ అనే రెండు ప్రాముఖ్యమైన లక్షణాలను అర్థంచేసుకుని, వాటిని ఎలా చూపించాలో నేర్చుకోవడం వల్లే ఇంటిలాంటి దేవుని సంస్థకు మళ్లీ దగ్గరయ్యాను.”

9. (ఎ) వినయంగల వ్యక్తి యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం విషయంలో ఎలాంటి వైఖరి చూపిస్తాడు? (బి) అలాంటి వాళ్లు యెహోవా దృష్టిలో విలువైన వాళ్లని ఎందుకు చెప్పవచ్చు?

9 వినయంగల వ్యక్తి యెహోవా ఏర్పాట్ల విషయంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆహారం విషయంలో మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపిస్తాడు. అలాంటి వ్యక్తి బైబిలుతో పాటు, కావలికోట, తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికలను శ్రద్ధగా చదువుతాడు. అలాంటి వ్యక్తులు కొత్తగా లభ్యమయ్యే ప్రతీ బైబిలు సాహిత్యాన్ని పూర్తిగా చదివిన తర్వాతే వాటిని పుస్తకాల అరలో పెడతారు. మనం క్రైస్తవ ప్రచురణలను చదువుతూ, వాటిని అధ్యయనం చేస్తూ వినయంగా యెహోవాకు కృతజ్ఞత చూపిస్తే ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తాం. అప్పుడు యెహోవా మనల్ని తన సేవలో మరింత ఎక్కువగా ఉపయోగించుకుంటాడు.​—హెబ్రీ. 5:13, 14.

10. సంఘంలో మనం అత్యల్పులుగా ఎలా నడుచుకోవచ్చు?

10 అత్యల్పునిగా ప్రవర్తించే వ్యక్తి మరో విధంగా కూడా ‘గొప్పవానిగా’ ఉంటాడు. ప్రతీ సంఘంలో పరిశుద్ధాత్మ నిర్దేశంతో నియమించబడే కొంతమంది అర్హులైన పురుషులు పెద్దలుగా సేవచేస్తారు. సంఘ కూటాలు, క్షేత్ర పరిచర్య, కాపరిపని వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం వాళ్లు ఏర్పాట్లు చేస్తారు. అలాంటి వాటికి ఇష్టపూర్వకంగా మద్దతిస్తూ వినయాన్ని చూపిస్తే మనం సంఘంలో ఆనందం, శాంతి, ఐక్యత వంటివి నెలకొనడానికి తోడ్పడతాం. (హెబ్రీయులు 13:7, 17 చదవండి.) మీరు ఒక సంఘపెద్దగా లేదా పరిచర్య సేవకునిగా సేవచేస్తుంటే, అలాంటి గొప్ప అవకాశాన్ని యెహోవా మీకిచ్చినందుకు మీరు వినయంగా ఆయనకు కృతజ్ఞత చూపిస్తారు కదా.

11, 12. ఏ స్వభావం ఉంటే మనం యెహోవా సంస్థలో మరింత విలువైన వ్యక్తులుగా ఉంటాం? ఎందుకు?

11 అత్యల్పునిగా నడుచుకునే వ్యక్తి ‘గొప్పవానిగా’ లేదా యెహోవా సంస్థలో మరింత విలువైన వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే వినయం వల్ల ఆయన మరింత శ్రేష్ఠంగా, మెరుగ్గా దేవుని సేవ చేస్తాడు. మొదటి శతాబ్దంలోని అపొస్తలులు తమ చుట్టూ ఉన్న ప్రజల్లా ఆలోచించేవాళ్లు కాబట్టే ‘అత్యల్పులుగా ఉండమని’ యేసు వాళ్లకు ఉపదేశం ఇచ్చాడు. “తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము” పుట్టిందని లూకా 9:46 చెబుతోంది. తోటి విశ్వాసుల కన్నా మెరుగైన వాళ్లమని లేదా ఇతరులకన్నా గొప్పవాళ్లమని బహుశా మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు. మన చుట్టూ ఉన్న చాలామంది గర్విష్ఠులుగా, స్వార్థపరులుగా ఉన్నారు. వినయంగా నడుచుకోవడం ద్వారా మనం గర్వానికి దూరంగా ఉండాలి. మనం అలా ఉంటూ యెహోవా చిత్తానికి మొదటి స్థానం ఇస్తే, తోటి సహోదరసహోదరీలకు సేదదీర్పును ఇచ్చే మంచి స్నేహితులముగా ఉంటాం.

12 అత్యల్పులుగా ఉండమని యేసు ఇచ్చిన ఉపదేశం నిజంగా మనలో ప్రేరణ కలిగిస్తుంది. మనం జీవితంలోని అన్ని రంగాల్లో అత్యల్పులముగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. మనమిప్పుడు అలాంటి మూడు రంగాలను చూద్దాం.

అత్యల్పులుగా ఉండడానికి కృషి చేయండి

13, 14. భార్యాభర్తలిద్దరూ అత్యల్పులుగా ఎలా నడుచుకోవచ్చు? ఆ విధంగా చేస్తే వాళ్ల వివాహబంధం ఎలా ఉంటుంది?

13 మీ భార్యతో/భర్తతో. నేడు చాలామంది తమ హక్కుల కోసం ఎంతగా ప్రాకులాడతారంటే వాటిని కాపాడుకోవడానికి కొన్నిసార్లు ఇతరుల హక్కులకు కూడా భంగం కలిగిస్తారు. అయితే అత్యల్పునిగా నడుచుకునే వ్యక్తి మాత్రం పౌలు చెప్పిన వైఖరిని చూపిస్తాడు. ఆయనిలా రాశాడు: “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.” (రోమా. 14:19) అత్యల్పులుగా ప్రవర్తించే వ్యక్తులు ప్రతీ ఒక్కరితో, ముఖ్యంగా తాము ఎంతగానో ప్రేమించే తమ వివాహ భాగస్వామితో శాంతిగా, సమాధానంగా ఉంటారు.

14 సరదాగా సమయం గడిపే విషయం గురించి ఆలోచించండి. వినోదం విషయంలో భార్యాభర్తలకు వేర్వేరు అభిరుచులు ఉండవచ్చు. ఖాళీ సమయంలో ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి ఏదైనా పుస్తకం చదవాలని బహుశా భర్త కోరుకోవచ్చు. భార్యకేమో ఇద్దరూ కలిసి సరదాగా బయటకు వెళ్లి భోజనం చేయాలని లేదా స్నేహితులను కలవాలని అనిపించవచ్చు. భర్త తన ఇష్టాయిష్టాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా వినయంగా తన భార్య అభిరుచులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆయనను గౌరవించడం ఆమెకు సులభమవ్వదా? అలాగే భార్య కూడా తనకు నచ్చినట్లు మాత్రమే చేయకుండా తన భర్త అభిరుచులను పట్టించుకుంటే ఆమెను ప్రేమించడం, ఆమెకు విలువివ్వడం ఆయనకు ఇంకెంత సులభంగా ఉంటుందో కదా. భార్యాభర్తలిద్దరూ అత్యల్పులుగా నడుచుకుంటే వివాహబంధం బలపడుతుంది.​—ఫిలిప్పీయులు 2:1-4 చదవండి.

15, 16. ఎలాంటి వైఖరి ఉంటే మంచిదని దావీదు 131వ కీర్తనలో చెప్పాడు? అలాంటి వైఖరి ఉంటే మనం సంఘంలో ఎలా ప్రవర్తిస్తాం?

15 సంఘంలో. తమ కోరికలను వెంటనే తీర్చుకోవాలని నేడు లోకంలో చాలామంది చూస్తుంటారు. అలాంటి వాళ్లకు సహనం ఏ మాత్రం ఉండదు, దేనికోసమైనా వేచిచూడడం అంటే వాళ్లకు పెద్ద పరీక్షే. వినయాన్ని పెంపొందించుకుంటే మనం యెహోవా కోసం ఎదురుచూడగలుగుతాం. (కీర్తన 131:1-3 చదవండి.) అలాచేస్తే మనం భద్రతను, ఆశీర్వాదాలను చవిచూడడమే కాక ఆదరణ, సంతృప్తి కూడా పొందుతాం. అందుకే యెహోవా కోసం ఓపికగా ఎదురుచూడమని దావీదు తన తోటి ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడు.

16 వినయంగా యెహోవా కోసం వేచి చూస్తే మీరు కూడా దావీదు పొందినలాంటి ఓదార్పునే పొందవచ్చు. (కీర్త. 42:5) బహుశా మీరు ‘దొడ్డపనిని అపేక్షిస్తూ, అధ్యక్ష్యపదవి’ కోసం అర్హతలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు. (1 తిమో. 3:1-7) ఒక సంఘ పెద్దకు కావాల్సిన మంచి లక్షణాలను పరిశుద్ధాత్మ సహాయంతో వృద్ధి చేసుకోవడానికి మీరు చేయగలిగినదంతా చేయడం చాలా ప్రాముఖ్యం. కానీ ఇతరులతో పోలిస్తే మీకు సేవ అవకాశాలు ఆలస్యంగా వస్తున్నాయని మీకనిపిస్తుండవచ్చు. అయితే, సేవా నియామకాల కోసం ఓపికగా ఎదురుచూసే వినయస్థులు సంతోషంగా యెహోవా సేవ చేస్తారు, ఏ నియామకాన్ని ఇచ్చినా ఆనందంగా చేస్తారు.

17, 18. (ఎ) క్షమాపణ అడగడం వల్ల, ఇతరులను క్షమించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయి? (బి) సామెతలు 6:1-5లో ఏ మంచి సలహా ఉంది?

17 ఇతరులతో. “క్షమించండి” అని అడగడం చాలామందికి కష్టంగా ఉంటుంది. అయితే యెహోవా సేవకులు తమ తప్పులను ఒప్పుకుని క్షమాపణ అడగడం ద్వారా వినయాన్ని వృద్ధిచేసుకుంటారు. ఇతరుల తప్పులను మన్నించడానికి కూడా వాళ్లు సిద్ధంగా ఉంటారు. గర్వం మనుష్యుల మధ్య అడ్డుగోడల్ని కడుతుంది, వివాదాలకు దారితీస్తుంది. కానీ క్షమించే వైఖరి సంఘంలో శాంతిసమాధానాలు పెంపొందిస్తుంది.

18 కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మనం ఇతరులతో చేసుకున్న ఒకానొక ఒప్పందానికి కట్టుబడి ఉండలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం నిజాయితీగా క్షమాపణ కోరడం ద్వారా మనల్ని మనం తగ్గించుకోవాలి. బహుశా దాని వైఫల్యానికి అవతలి వాళ్లు కూడా కొంతమేరకు కారణమైనా, వినయంగల క్రైస్తవుడు తనవైపు నుండి జరిగిన పొరపాటు గురించే బాధపడతాడు, దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.​సామెతలు 6:1-5 చదవండి.

మీరు ఏయే సందర్భాల్లో అత్యల్పులుగా నడుచుకోవచ్చు?

19. అత్యల్పులుగా ఉండమని బైబిలు ఇచ్చే ఉపదేశం పట్ల మనమెందుకు కృతజ్ఞత కలిగివుండాలి?

19 అత్యల్పులుగా ఉండమనే బైబిలు ప్రోత్సాహాన్ని అందుకున్నందుకు మనమెంత కృతజ్ఞతతో ఉన్నామో కదా! వినయం చూపించడం కొన్నిసార్లు మనకు కష్టమనిపించినా సృష్టికర్తతో మన స్థాయిని పోల్చి చూసుకున్నప్పుడు, అలాగే ఆయన ఎలా వినయం చూపిస్తున్నాడో అర్థంచేసుకున్నప్పుడు మనం ఆ చక్కని లక్షణాన్ని పెంపొందించుకోగలుగుతాం. అలా చేస్తే మనం యెహోవా దృష్టిలో విలువైన సేవకులమని నిరూపించుకుంటాం. కాబట్టి మనలో ప్రతీ ఒక్కరం అత్యల్పులుగా నడుచుకోవడానికి కృషి చేద్దాం.

a అసలు పేర్లు కావు.