కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా క్షమాగుణం వల్ల మనకు లభించే ప్రయోజనం ఏమిటి?

యెహోవా క్షమాగుణం వల్ల మనకు లభించే ప్రయోజనం ఏమిటి?

‘యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము గల దేవుడు. ఆయన దోషమును, అపరాధమును, పాపమును క్షమించును.’​—నిర్గ. 34:6, 7.

1, 2. (ఎ) యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో ఎలా వ్యవహరించాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నను పరిశీలిస్తాం?

 నె హెమ్యా కాలంలో కొంతమంది లేవీయులు ఒకసారి బహిరంగంగా ప్రార్థిస్తూ, తమ పితరులు యెహోవా ఆజ్ఞలకు అదేపనిగా అవిధేయత చూపించారనే విషయాన్ని ప్రస్తావించారు. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు అవిధేయత చూపించినా యెహోవా మాత్రం, ‘క్షమించుటకు సిద్ధమైన దేవునిగా, దయావాత్సల్యతలు గలవానిగా, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవానిగా’ వాళ్లతో వ్యవహరించాడు. నెహెమ్యా కాలంలో స్వదేశానికి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పట్ల కూడా యెహోవా కృప చూపిస్తూనే వచ్చాడు.​—నెహె. 9:16, 17.

2 ఇప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘యెహోవా క్షమాగుణం వల్ల నాకు లభించే ప్రయోజనం ఏమిటి?’ ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి మనం గతంలో యెహోవా దేవుడు దావీదుతో, మనష్షేతో వ్యవహరించిన తీరు గురించి పరిశీలిద్దాం. వాళ్లిద్దరూ యెహోవా క్షమాగుణం వల్ల ప్రయోజనం పొందిన వ్యక్తులే.

దావీదు చేసిన ఘోరమైన పాపాలు

3-5. దావీదు ఎలా ఘోరమైన పాపాలకు ఒడిగట్టాడు?

3 దావీదు దైవభయంగల వ్యక్తి అయినప్పటికీ ఘోరమైన పాపాలు చేశాడు. వాటిలో రెండు పాపాలు వివాహ దంపతులైన ఊరియా, బత్షెబల విషయంలో చేసినవి. వాటివల్ల తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయినా యెహోవా దేవుడు దావీదుతో వ్యవహరించిన తీరును పరిశీలిస్తే, యెహోవా క్షమాగుణం గురించి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ సన్నివేశాల్ని పరిశీలిద్దాం.

4 అమ్మోనీయుల రాజధాని పట్టణమైన రబ్బాను ముట్టడించేందుకు దావీదు తన సేనలను పంపించాడు. అది యొర్దాను నదికి అవతల యెరూషలేముకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ సమయంలో యెరూషలేము రాజభవనంలోనే ఉన్న దావీదు తన ఇంటి మిద్దె మీద నడుస్తూ ఊరియా భార్యయైన బత్షెబ స్నానం చేయడాన్ని చూశాడు. అప్పుడు ఆమె భర్త కూడా ఇంట్లో లేడు. దావీదు బత్షెబను పొందాలనే కోరికతో ఆమెను రాజభవనంలోకి రప్పించుకొని ఆమెతో వ్యభిచారం చేశాడు.​—2 సమూ. 11:1-4.

5 బత్షెబ గర్భవతి అయ్యిందని తెలిసినప్పుడు, దావీదు ఊరియాను యుద్ధం నుండి యెరూషలేముకు రప్పించి బత్షెబతో ఊరియా ఒక రాత్రి గడిపేలా ఏర్పాటు చేశాడు. కానీ, దావీదు ఎంత ప్రలోభపెట్టినా ఊరియా తన ఇంటికి వెళ్లలేదు. కాబట్టి, రాజైన దావీదు ఊరియాను “యుద్ధము మోపుగా జరుగుచున్న చోట” నిలబెట్టమని, మిగిలిన సైనికులను దూరంగా ఉంచమని తన సైన్యాధికారికి ఓ లేఖ రాయించి పంపించాడు. దావీదు పన్నాగం ఫలించి ఊరియా యుద్ధంలో చనిపోయాడు. (2 సమూ. 11:12-17) రాజు తాను చేసిన వ్యభిచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఓ అమాయకుణ్ణి పొట్టనబెట్టుకున్నాడు.

దావీదు మారుమనస్సు పొందాడు

6. దావీదు చేసిన పాపాలను చూసి దేవుడు ఎలా స్పందించాడు? దాన్నిబట్టి యెహోవా గురించి మనకు ఏమి అర్థమౌతోంది?

6 దావీదు చేసిన వాటినన్నిటినీ యెహోవా చూశాడు. యెహోవాకు మరుగైనదేదీ లేదు. (సామె. 15:3) కొంతకాలానికి దావీదు రాజు బత్షెబను పెళ్లి చేసుకున్నా, “దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.” (2 సమూ. 11:27) దావీదు చేసిన ఘోరమైన పాపాలను చూసి దేవుడు ఎలా స్పందించాడు? ఆయన తన ప్రవక్తయైన నాతానును దావీదు దగ్గరకు పంపించాడు. క్షమాగుణంగల యెహోవా బహుశా దావీదుపై కనికరం చూపించడానికి కావాల్సిన కారణాన్ని వెదకడం కోసం నాతానును ఆయన దగ్గరికి పంపించాడు. యెహోవా వ్యవహరించిన విధానం మీ మనసును కదిలించడం లేదా? పశ్చాత్తాపపడమని యెహోవా దావీదును ఒత్తిడి చేయలేదు కానీ, దావీదు తన తప్పు తెలుసుకునేలా ఓ చిన్న కథ చెప్పేందుకు నాతానును ప్రేరేపించాడు. (2 సమూయేలు 12:1-4 చదవండి.) సున్నితమైన ఆ పరిస్థితితో వ్యవహరించడానికి ఉపయోగించిన ఆ పద్ధతి ఎంతో చక్కగా పనిచేసింది.

7. నాతాను చెప్పిన కథ విన్న దావీదు ఎలా స్పందించాడు?

7 నాతాను చెప్పిన కథ వల్ల దావీదు తాను చేసిన అన్యాయాన్ని గ్రహించాడు. ఆ కథలోని ధనవంతునిపై దావీదు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, “యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు” అని అన్నాడు. అన్యాయానికి గురైన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని కూడా దావీదు అన్నాడు. ఆ తర్వాత నాతాను అన్న మాట దావీదుకు పిడుగుపాటులా అనిపించింది. ఎందుకంటే, “ఆ మనుష్యుడవు నీవే” అని నాతాను అన్నాడు. దావీదు చేసిన పనివల్ల ఆయన “యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును” అని, ఆయన కుటుంబంలో సంక్షోభం చోటుచేసుకుంటుందని నాతాను దావీదుకు చెప్పాడు. దావీదు తాను చేసిన తప్పుల వల్ల పదిమందిలో అవమానాల పాలౌతాడని కూడా నాతాను చెప్పాడు. తన పాపం ఎంత ఘోరమైనదో గ్రహించిన దావీదు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ యెహోవాకు విరోధంగా ‘పాపం చేశానని’ ఒప్పుకున్నాడు.​—2 సమూ. 12:5-14.

దావీదు ప్రార్థన, దేవుని క్షమాపణ

8, 9. దావీదులో అంతర్లీనంగా ఉన్న భావాల్ని 51వ కీర్తన ఎలా వ్యక్తం చేస్తోంది? ఆ కీర్తన చదివితే మనం యెహోవా గురించి ఏమి తెలుసుకోవచ్చు?

8 రాజైన దావీదు ఆ తర్వాత కూర్చిన ఓ కీర్తనను పరిశీలిస్తే ఆయన హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడ్డాడని మనకు అర్థమౌతుంది. మన మనసును కదిలించే ఎన్నో విన్నపాలు 51వ కీర్తనలో ఉన్నాయి. దావీదు తన పాపాలను ఒప్పుకోవడమే కాదు వాటి విషయంలో పశ్చాత్తాపం కూడా చూపించాడని ఆ కీర్తనను బట్టి తెలుస్తుంది. ఆయన దేవునితో తనకున్న సంబంధం గురించే ఎక్కువగా ఆలోచించాడు. “నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను” అని దావీదు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఇలా వేడుకున్నాడు: “దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము . . . నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.” (కీర్త. 51:1-4, 7-12) మీరు చేసిన తప్పుల గురించి మీరు కూడా అంతే మనస్ఫూర్తిగా, అంతే నిష్కపటంగా యెహోవాతో మాట్లాడతారా?

9 పాపాల వల్ల వచ్చిన పర్యవసానాల నుండి యెహోవా దావీదును కాపాడలేదు. ఆ పర్యవసానాలను ఆయన జీవితమంతా అనుభవించాడు. అయితే, “విరిగి నలిగిన” దావీదు హృదయాన్ని అంటే ఆయన పశ్చాత్తాపాన్ని చూసి యెహోవా ఆయనను క్షమించాడు. (కీర్తన 32:5 చదవండి; కీర్త. 51:17) ఒక వ్యక్తి నిజమైన మనస్తత్వం ఏమిటో, ఆయన ఏ కారణాల వల్ల పాపం చేశాడో సర్వశక్తిగల దేవుడైన యెహోవా అర్థం చేసుకుంటాడు. వ్యభిచారం చేసిన వాళ్లకు మోషే ధర్మశాస్త్రం ప్రకారం న్యాయాధిపతులు మరణ శిక్ష విధిస్తారు. కానీ, దావీదు బత్షెబల విషయంలో యెహోవాయే జోక్యం చేసుకొని కనికరంతో వ్యవహరించాడు. (లేవీ. 20:10) అంతేకాక, వాళ్ల కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా కూడా నియమించాడు.​—1 దిన. 22:9, 10.

10. (ఎ) దేన్నిబట్టి కూడా యెహోవా దావీదును క్షమించి ఉంటాడు? (బి) యెహోవా క్షమాపణను పొందాలంటే ఒక వ్యక్తి ఏమి చేయాలి?

10 సౌలు విషయంలో దావీదు కనికరం చూపించినందు వల్ల కూడా బహుశా యెహోవా దావీదును క్షమించి ఉంటాడు. (1 సమూ. 24:4-7) మనం ఇతరులతో వ్యవహరించినట్లే యెహోవా మనతో వ్యవహరిస్తాడని చెబుతూ యేసు ఇలా అన్నాడు: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.” (మత్త. 7:1, 2) వ్యభిచారం, నరహత్య వంటి పెద్దపెద్ద పాపాల్ని కూడా యెహోవా క్షమిస్తాడని తెలుసుకోవడం ఎంత ఊరటనిస్తుందో కదా! మనకు క్షమించే స్వభావం ఉంటే, మన పాపాలను యెహోవా ముందు ఒప్పుకుంటే, మనం మారుమనస్సు పొందితే ఆయన మనల్ని తప్పక క్షమిస్తాడు. పాపులు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడితే యెహోవా వాళ్లకు “విశ్రాంతికాలములు” అనుగ్రహిస్తాడు.​—అపొస్తలుల కార్యములు 3:19, 20 చదవండి.

మనష్షే ఘోరమైన పాపాలు చేసినా పశ్చాత్తాపపడ్డాడు

11. రాజైన మనష్షే ఏయే విధాలుగా దేవుని దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు?

11 యెహోవా ఎంతమేరకు క్షమిస్తాడో చూపించే మరో ఉదాహరణను పరిశీలించండి. దావీదు పరిపాలన ఆరంభించిన సుమారు 360 ఏళ్లకు మనష్షే యూదా జనాంగం మీద రాజయ్యాడు. ఆయన చేసిన 55 ఏళ్ల పరిపాలన దుష్టత్వానికి పెట్టింది పేరు. మనష్షే చేసిన నీచాతినీచమైన పనుల వల్ల యెహోవా ఆయనను తిరస్కరించాడు. ఆయన బయలు దేవతలకు బలిపీఠాలు కట్టించాడు, “ఆకాశనక్షత్రములన్నిటిని” పూజించాడు, తన కుమారులను ‘అగ్నిగుండం దాటించాడు,’ మంత్రతంత్ర అభ్యాసాలను ప్రోత్సహించాడు. అవును, మనష్షే ‘యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడిచాడు.’​—2 దిన. 33:1-6.

12. మనష్షే ఎలా యెహోవావైపు తిరిగాడు?

12 కొంతకాలానికి, అష్షూరీయులు మనష్షేను బంధించి బబులోనుకు చెరగా తీసుకొనిపోయారు. మోషే ఇశ్రాయేలీయులతో చెప్పిన ఈ మాటల్ని బహుశా మనష్షే బబులోనులో ఉన్నప్పుడు గుర్తుచేసుకొని ఉంటాడు: ‘ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినవలెను.’ (ద్వితీ. 4:30) నిజంగానే మనష్షే యెహోవావైపు తిరిగాడు. ఎలా? (21వ పేజీలో చిత్రీకరించినట్లుగా) మనష్షే “తన్నుతాను బహుగా తగ్గించుకొని” యెహోవాకు ‘మొరపెట్టుకున్నాడు.’ (2 దిన. 33:12, 13) మనష్షే యెహోవాకు చేసిన ప్రార్థనలో ఏ మాటల్ని ఉపయోగించాడో బైబిలు చెప్పడం లేదు కానీ, ఆయన 51వ కీర్తనలో దావీదు ఉపయోగించినలాంటి పదాల్నే బహుశా ఉపయోగించి ఉంటాడు. విషయమేదైనా మనష్షే పూర్తిగా మారుమనస్సు పొందాడు.

13. యెహోవా మనష్షేను ఎందుకు క్షమించాడు?

13 మనష్షే చేసిన ప్రార్థనలకు యెహోవా ఎలా స్పందించాడు? ‘ఆయన మనష్షే విన్నపాలను ఆలకించాడు.’ దావీదులాగే, మనష్షే కూడా తాను చేసిన పాపాలు ఎంతో ఘోరమైనవని గుర్తించి నిజమైన పశ్చాత్తాపాన్ని కనబర్చాడు. అందుకే యెహోవా ఆయనను క్షమించి, యెరూషలేములో మళ్లీ రాజుగా కొనసాగేలా రాజరికాన్ని తిరిగి ఇచ్చాడు. దానివల్ల, “యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.” (2 దిన. 33:13) మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడే వాళ్లను కనికరంగల దేవుడైన యెహోవా క్షమిస్తాడనేందుకు మరో రుజువును చూడడం ఎంత ఓదార్పుకరంగా ఉందో కదా!

యెహోవా క్షమించడం వల్ల మనష్షే యెరూషలేములో తన రాజరికాన్ని తిరిగి పొందాడు

యెహోవా ఎల్లప్పుడూ క్షమిస్తూనే ఉంటాడా?

14. యెహోవా ఎప్పుడు ఒక వ్యక్తిని క్షమిస్తాడు?

14 దావీదులా, మనష్షేలా ఘోరమైన పాపాలు చేసి యెహోవాను క్షమాపణ అడిగే పరిస్థితి కొంతమంది క్రైస్తవులకు రావచ్చు. అయితే ఆ ఇద్దరు రాజుల్ని యెహోవా క్షమించాడు కాబట్టి, నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు ఘోరమైన పాపాల్ని సహితం యెహోవా క్షమిస్తాడని అర్థమౌతోంది.

15. ప్రజల్ని యెహోవా ఎల్లప్పుడూ క్షమిస్తూనే ఉంటాడా?

15 అలాగని, మానవుల పాపాలను అన్నిటినీ యెహోవా ఎల్లప్పుడూ క్షమిస్తూనే ఉంటాడని అనుకోవడం సముచితం కాదు. ఇప్పుడు మనం దావీదు మనష్షేల వైఖరిని, అవిధేయత చూపించిన ఇశ్రాయేలీయుల, యూదుల వైఖరితో పోల్చి చూద్దాం. యెహోవా నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించడం ద్వారా దావీదు మారుమనస్సు పొందేందుకు ఓ అవకాశమిచ్చాడు. దానికి దావీదు కృతజ్ఞత చూపించి మారుమనస్సు పొందాడు. మనష్షే బాధల్లో ఉన్నప్పుడు నిజమైన పశ్చాత్తాపం చూపించాడు. కానీ ఇశ్రాయేలు, యూదా జనాంగాలు మాత్రం తమ పాపాల విషయంలో అంతగా పశ్చాత్తాపపడలేదు. అందుకే యెహోవా వాళ్లను క్షమించలేదు. బదులుగా, వాళ్ల తిరుగుబాటు ధోరణిని తాను ఎలా దృష్టిస్తున్నానో తెలియజేయడానికి యెహోవా వాళ్ల దగ్గరికి ప్రవక్తల్ని పంపిస్తూ వచ్చాడు. (నెహెమ్యా 9:30 చదవండి.) వాళ్లు బబులోను చెర నుండి విడుదలై స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా, యెహోవా వాళ్ల దగ్గరికి ఎజ్రా, మలాకీ వంటి నమ్మకమైన ప్రతినిధుల్ని పంపిస్తూ వచ్చాడు. దేవుని ఇష్టానికి అనుగుణంగా ప్రవర్తించినప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతో సంతోషాన్ని పొందారు.​—నెహె. 12:43-47.

16. (ఎ) పశ్చాత్తాపం చూపించిన కారణంగా ఇశ్రాయేలు జనాంగం ఎలాంటి పర్యవసానం ఎదుర్కొంది? (బి) దైవభక్తి ఉన్న కొంతమంది ఇశ్రాయేలీయులకు ఏ అవకాశం ఉంది?

16 యేసును ఈ భూమ్మీదకు పంపించి ఓ పరిపూర్ణమైన విమోచన క్రయధన బలిని అర్పించాక, యెహోవా జంతు బలుల ఏర్పాటును రద్దు చేశాడు. (1 యోహా. 4:9, 10) యేసు ఈ మాటలు అన్నప్పుడు తన తండ్రి మనోభావాల్నే వ్యక్తం చేశాడు: “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.” (మత్త. 23:37, 38) పాపంలో మునిగిపోయి ఏ మాత్రం పశ్చాత్తాపం చూపించని ఇశ్రాయేలు జనాంగం స్థానంలో ఆధ్యాత్మిక ఇశ్రాయేలు జనాంగం ఉనికిలోకి వచ్చింది. (మత్త. 21:43; గల. 6:16) మరి సహజ ఇశ్రాయేలు జనాంగంలోని దైవభయం గల వ్యక్తుల మాటేమిటి? దేవునిపై, యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధనంపై విశ్వాసం చూపించి యెహోవా క్షమాపణ నుండి, కనికరం నుండి వాళ్లు ప్రయోజనం పొందవచ్చు. తమ పాపాలకు పశ్చాత్తాపపడకుండా చనిపోయినవాళ్లు ఒకవేళ నూతన లోకంలో పునరుత్థానం చేయబడితే, తమ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసే అవకాశం వాళ్లకు దొరుకుతుంది.​—యోహా. 5:28, 29; అపొ. 24:14, 15.

యెహోవా క్షమాపణ నుండి ప్రయోజనం పొందండి

17, 18. మనం ఎలా యెహోవా క్షమాపణను పొందవచ్చు?

17 యెహోవా క్షమాగుణాన్ని బట్టి మనం ఎలా స్పందించాలి? దావీదు, మనష్షే చూపించినలాంటి వైఖరే మనమూ చూపించాలి. మనం పాపులమని గుర్తించాలి, మన తప్పులకు పశ్చాత్తాపపడాలి, క్షమించమని యెహోవాను మనస్ఫూర్తిగా వేడుకోవాలి, మనలో శుద్ధ హృదయాన్ని కలుగజేయమని యెహోవాకు విన్నవించుకోవాలి. (కీర్త. 51:10) ఒకవేళ మనం ఘోరమైన పాపం చేస్తే, సంఘ పెద్దల ఆధ్యాత్మిక సహాయాన్ని తీసుకోవాలి. (యాకో. 5:14, 15) మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, యెహోవా ఎలాంటి దేవుడో మనసులో ఉంచుకుంటే ఓదార్పు పొందుతాం. తాను ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుణ్ణని, వేవేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమిస్తానని’ యెహోవా మోషేతో అన్నాడు. యెహోవా ఇప్పటికీ అలాగే ఉన్నాడు.​—నిర్గ. 34:6, 7.

18 పశ్చాత్తాపపడిన ఇశ్రాయేలీయుల పాపాల తాలూకు మరకల్ని పూర్తిగా తొలగిస్తానని చూపించడానికి యెహోవా ఓ శక్తివంతమైన పోలికను ఉపయోగించాడు. “ఎఱ్ఱనివైన” వాళ్ల పాపాలను “హిమమువలె” తెల్లగా చేస్తానని వాళ్లతో అన్నాడు. (యెషయా 1:18 చదవండి.) కాబట్టి, యెహోవా క్షమాగుణం వల్ల మనకు లభించే ప్రయోజనం ఏమిటి? మన పాపాలు, తప్పులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. అయితే, యెహోవా పట్ల కృతజ్ఞతతో మనం నిజమైన పశ్చాత్తాపం చూపిస్తేనే అది సాధ్యమౌతుంది.

19. మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

19 యెహోవా క్షమాపణను పొందుతున్న మనం, ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు యెహోవాను ఎలా అనుకరించవచ్చు? ఘోరమైన పాపాలు చేసి, ఆ తర్వాత నిజమైన పశ్చాత్తాపం చూపించినవాళ్లను మనమెలా క్షమించవచ్చు? మనం మన హృదయాల్ని పరిశీలించుకొని ‘దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు’ అయిన మన యెహోవా తండ్రిని సాధ్యమైనంత ఎక్కువగా ఎలా అనుకరించవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.​—కీర్త. 86:5.