కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

అవివాహితులుగా ఉండాలనుకునే వాళ్లు ఒంటరి జీవితమనే బహుమానాన్ని ఏదో అంతుచిక్కని రీతిలో పొందారని మత్తయి 19:10-12 లోని యేసు మాటలు సూచిస్తున్నాయా?

యేసు ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పాడో పరిశీలించండి. పరిసయ్యులు విడాకుల గురించి మాట్లాడినప్పుడు వివాహం విషయంలో యెహోవా ప్రమాణం ఏమిటో యేసు వాళ్లకు స్పష్టంగా చెప్పాడు. ‘తన భార్యయందు మానభంగసూచన ఏదో ఒకటి కనబడినప్పుడు భర్త పరిత్యాగ పత్రిక రాసి’ ఆమెకు విడాకులు ఇవ్వవచ్చని ధర్మశాస్త్రం చెప్పింది. అయితే, సృష్టి ఆరంభంలో యెహోవా అలాంటి ఏర్పాటు చేయలేదు. (ద్వితీ. 24:1, 2) యేసు ఇలా అన్నాడు: “వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు.”​—మత్త. 19:3-9.

ఆ మాటలు విన్న శిష్యులు, “భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదు” అని యేసుతో అన్నారు. దానికి సమాధానమిస్తూ యేసు ఇలా అన్నాడు: “అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక.”​—మత్త. 19:10-12.

కొంతమంది లోపంతో పుట్టడం వల్ల, మరికొంతమంది ప్రమాదం వల్ల లేదా తమ అవయవం తొలగించబడడం వల్ల నపుంసకులు అవుతారు. అయితే ఇంకొంతమంది ఇష్టపూర్వకంగా నపుంసకులుగా ఉంటారు. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనే సామర్థ్యం ఉన్నప్పటికీ వాళ్లు ఆశానిగ్రహాన్ని కలిగివుంటూ “పరలోక రాజ్యము నిమిత్తము” అవివాహితులుగానే ఉంటారు. రాజ్య సేవకు అంకితమయ్యేందుకు వాళ్లు యేసులాగే అవివాహితులుగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఒంటరి జీవితమనే వరం వాళ్లకు పుట్టుకతో రాలేదు లేదా ఏదోవిధంగా వాళ్లకు దొరకలేదు. కానీ, వాళ్లు అలా ఒంటరిగా ఉండాలని నిశ్చయించుకున్నారు, అంటే ఒకరకంగా దానికోసం ఇష్టపూర్వకంగా కృషి చేశారు.

యేసు చెప్పిన విషయాన్ని తర్వాత అపొస్తలుడైన పౌలు మరింతగా వివరించాడు. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా క్రైస్తవులందరూ దేవునికి నచ్చిన విధంగా సేవించవచ్చని చెబుతూనే, అవివాహితులుగా ఉండాలని తమ “మనస్సులో నిశ్చయించుకొనిన” వాళ్లు మరింత ఎక్కువ సేవ చేస్తారని పౌలు అన్నాడు. ఎలా? పెళ్లైన క్రైస్తవుడు తన భార్య బాగోగులు చూసుకోవడం కోసం, ఆమెను సంతోష పెట్టడం కోసం తన సమయాన్ని, శక్తిని కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు పెళ్లికాని క్రైస్తవులకు అలాంటి బాధ్యత ఉండదు కాబట్టి, వాళ్లు దేవుని సేవ కోసం తమ పూర్తి సమయాన్ని, శక్తిని ధారపోయగలుగుతారు. అందుకే వాళ్లు ఒంటరి జీవితాన్ని దేవుడిచ్చిన ‘వరంగా’ భావిస్తారు.​—1 కొరిం. 7:6, 7, 32-38.

కాబట్టి, క్రైస్తవులు ఒంటరి జీవితమనే అనుగ్రహాన్ని లేదా బహుమానాన్ని ఏదో అంతుచిక్కని రీతిలో పొందుతారని బైబిలు చూపించడం లేదు. కానీ, ఎలాంటి ఆటంకాలూ లేకుండా వీలైనంత ఎక్కువగా దేవుని సేవ చేసేందుకు వాళ్లు అవివాహితులుగా ఉండడానికి కృషి చేస్తారు. అలాంటి సదుద్దేశంతో అవివాహితులుగా ఉండాలని తీర్మానించుకున్న వాళ్లను తోటి క్రైస్తవులు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి.