కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మోషే ప్రేమగల వ్యక్తి

మోషే ప్రేమగల వ్యక్తి

ప్రేమ అంటే ఏమిటి?

ప్రేమ అంటే ఇతరుల మీద ప్రగాఢమైన అనురాగం కలిగివుండడం. ప్రేమగల వ్యక్తి తన ఆప్తుల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడో తన మాటల్లో చేతల్లో చూపిస్తాడు, దానికోసం కొన్నిసార్లు తన ఇష్టాల్ని కూడా త్యాగం చేస్తాడు.

మోషే ప్రేమను ఎలా చూపించాడు?

మోషే దేవుని మీద ప్రేమ చూపించాడు. ఎలా చూపించాడు? ఓసారి 1 యోహాను 5:3 లోని ఈ మాటల్ని గుర్తుచేసుకోండి: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.” మోషే ఈ సూత్రానికి అనుగుణంగా జీవించాడు. తన కర్రను ఎర్ర సముద్రం మీదకి చాపడం లాంటి చిన్న పని దగ్గర నుండి బలవంతుడైన ఫరోను ఎదుర్కోవడం లాంటి పెద్ద పని వరకు దేవుడు చెప్పిన ప్రతీదాన్నీ మోషే చేశాడు. అది సులువైన పనైనా లేక కష్టమైన పనైనా మోషే చేశాడు. ‘అలాగే చేశాడు.’—నిర్గమకాండము 40:16.

మోషే తన తోటి ఇశ్రాయేలీయులను కూడా ప్రేమించాడు. యెహోవా తమను మోషే ద్వారానే నడిపిస్తున్నాడని గుర్తించిన ఇశ్రాయేలీయులు ఏ సమస్య ఎదురైనా మోషే దగ్గరికి వచ్చేవాళ్లు. నిర్గమకాండము 18:13-16లో ఇలా ఉంది: ‘ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండిరి.’ మోషే రోజంతా ఇశ్రాయేలీయుల సమస్యల్ని వినీవినీ ఎంతగా అలసిపోయేవాడో ఒక్కసారి ఊహించుకోండి. అయినాసరే మోషే వాళ్లను ప్రేమించాడు కాబట్టి వాళ్లకు సంతోషంగా సహాయం చేశాడు.

మోషే తన ఆప్తుల సమస్యలు వినడమే కాదు వాళ్ల కోసం ప్రార్థించాడు కూడా. అంతే కాదు తనను నొప్పించిన వాళ్ల కోసం కూడా ఆయన ప్రార్థించాడు. ఉదాహరణకు మోషే అక్క మిర్యాము మోషే మీద సణిగినప్పుడు యెహోవా ఆమెను కుష్ఠు రోగంతో శిక్షించాడు. మోషే అది చూసి సంతోషించే బదులు “దేవా, దయచేసి ఈమెను బాగుచేయుమని” వెంటనే యెహోవాకు ప్రార్థించాడు. (సంఖ్యాకాండము 12:13) ప్రేమ లేకపోతే మోషే అంత నిస్వార్థంగా ప్రార్థించి ఉండేవాడా?

మనం ఏమి నేర్చుకోవచ్చు?

దేవుని మీద లోతైన ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా మనం మోషేను అనుకరించవచ్చు. ఆ ప్రేమ వల్ల మనం దేవుని ఆజ్ఞలకు ‘హృదయపూర్వకంగా’ లోబడతాం. (రోమీయులు 6:17) మనం హృదయపూర్వకంగా యెహోవాకు లోబడితే ఆయన హృదయాన్ని సంతోషపెడతాం. (సామెతలు 27:11) అంతేకాదు మనం కూడా ప్రయోజనం పొందుతాం. మనం నిజమైన ప్రేమతో దేవుణ్ణి సేవిస్తే సరైన పనులే చేస్తాం, అదీ ఆనందంగా చేస్తాం.—కీర్తన 100:2.

ఇతరుల్ని నిస్వార్థంగా ప్రేమించడం ద్వారా కూడా మనం మోషేను అనుసరించవచ్చు. అలాంటి ప్రేమ మనకుంటే, మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తమ సమస్యల గురించి మనతో మాట్లాడేటప్పుడు మనం 1) మనస్ఫూర్తిగా వింటాం, 2) వాళ్ల బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, 3) వాళ్లంటే మనకు శ్రద్ధ ఉందని చూపిస్తాం.

మోషేలా మనమూ మన ప్రియమైనవాళ్ల కోసం ప్రార్థించవచ్చు. కొన్నిసార్లు వాళ్ల సమస్యలను పరిష్కరించే శక్తి మనకు లేదని అనిపించవచ్చు. వాళ్లతో “నేను మీ గురించి ప్రార్థించడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను” అని చెబుతూ ఒక్కోసారి మనం బాధపడతాం. అయితే, నీతిమంతుని విజ్ఞాపనకు ఎంతో బలం ఉంటుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. (యాకోబు 5:16) ఒకానొక వ్యక్తికి సహాయం చేయాలని బహుశా యెహోవా అప్పటివరకు అనుకొనివుండకపోవచ్చు, కానీ మనం చేసే ప్రార్థనలు ఆ వ్యక్తికి సహాయం చేసేలా యెహోవాను కదిలించవచ్చు. నిజానికి మన ఆత్మీయుల కోసం ప్రార్థించడం కన్నా వాళ్లకు మనం చేయగల గొప్ప సహాయం ఇంకేమైనా ఉంటుందా? a

మోషే జీవితాన్ని పరిశీలించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని మీరు అంగీకరించరా? మోషే కూడా మనలా సాధారణ మనిషే అయినా విశ్వాసం, వినయం, ప్రేమ చూపించే విషయంలో అసాధారణమైన ఆదర్శంగా నిలిచాడు. మనం ఎంత ఎక్కువగా మోషేను అనుసరిస్తే, మనకూ మన తోటి వాళ్లకూ అంత ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి.—రోమీయులు 15:4. ▪ (w13-E 02/01)

a దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం ఆయన ప్రమాణాల ప్రకారం జీవించడానికి మనస్ఫూర్తిగా కృషిచేయాలి. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే యెహోవా సాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 17వ అధ్యాయం చూడండి.