కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇది మన ఆధ్యాత్మిక స్వాస్థ్యం

ఇది మన ఆధ్యాత్మిక స్వాస్థ్యం

‘ఇది యెహోవా సేవకుల స్వాస్థ్యము.’—యెష. 54:17.

1. మానవుల ప్రయోజనం కోసం యెహోవా ప్రేమతో ఏమి భద్రపర్చి ఉంచాడు?

 ‘శాశ్వత జీవం గల దేవుడైన’ యెహోవా మానవుల కోసం జీవాన్నిచ్చే సందేశాన్ని భద్రపర్చి ఉంచాడు. “ప్రభువు [యెహోవా] వాక్యము ఎల్లప్పుడును నిలుచును” కాబట్టి, ఆ సందేశం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. (1 పేతు. 1:22-24) అలాంటి ప్రాముఖ్యమైన సందేశాన్ని యెహోవా ప్రేమతో తన వాక్యమైన బైబిల్లో భద్రపర్చి ఉంచినందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా!

2. తన ప్రజల కోసం యెహోవా తన వాక్యంలో ఏమి భద్రపర్చి ఉంచాడు?

2 తన ప్రజలు తన నామాన్ని ఉపయోగించేలా యెహోవా తన వాక్యంలో దాన్ని భద్రపర్చాడు. ‘భూమ్యాకాశముల ఉత్పత్తి క్రమం’ గురించి చెబుతున్న సందర్భంలో లేఖనాలు మొదట “దేవుడైన యెహోవా” గురించి ప్రస్తావించాయి. (ఆది. 2:4) యెహోవా నామం పది ఆజ్ఞలున్న రాతి పలకల మీద కూడా అద్భుతరీతిలో ఎన్నోసార్లు చెక్కబడింది. ఉదాహరణకు, మొదటి ఆజ్ఞ ప్రారంభంలో “నీ దేవుడనైన యెహోవాను నేనే” అని ఉంది. (నిర్గ. 20:1-17) యెహోవా వాక్యాన్ని, ఆయన నామాన్ని తుడిచిపెట్టాలని సాతాను శతవిధాల ప్రయత్నించినా సర్వాధిపతియైన యెహోవా వాటిని కాపాడాడు కాబట్టి ఆయన నామం ఎల్లకాలం నిలుస్తుంది.

3. మతపరమైన తప్పుడు బోధలు వ్యాప్తిలో ఉన్నా, దేవుడు ఏమి భద్రపర్చి ఉంచాడు?

3 యెహోవా తన వాక్యంలో సత్యాన్ని కూడా భద్రపర్చి ఉంచాడు. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన తప్పుడు బోధలు ఎన్నో ఉన్నా, దేవుడు మనకు ఆధ్యాత్మిక వెలుగును, సత్యాన్ని ఇచ్చినందుకు మనం ఆయనకు కృతజ్ఞులం. (కీర్తన 43:3, 4 చదవండి.) మిగతా మానవజాతంతా చీకట్లో మగ్గుతుంటే, మనం మాత్రం యెహోవా ఇచ్చిన ఆధ్యాత్మిక వెలుగులో సంతోషంగా నడుస్తున్నాం.—1 యోహా. 1:6, 7.

అమూల్యమైన మన స్వాస్థ్యం

4, 5. మనం 1931 నుండి ఏ ప్రత్యేకమైన అవకాశాన్ని ఆస్వాదిస్తున్నాం?

4 క్రైస్తవులమైన మనకు అమూల్యమైన స్వాస్థ్యం ఉంది. కోలిన్స్‌ కోబిల్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీ ఇలా చెబుతోంది: ‘ఒక దేశానికి సంబంధించి తరతరాలుగా సంక్రమిస్తున్న లక్షణాలు, సాంప్రదాయాలు లేదా అక్కడి జీవన స్థితిగతులు అన్నీ కలిపితే ఆ దేశపు స్వాస్థ్యం.’ అలాగే దేవుని వాక్యం విషయంలో ఖచ్చితమైన జ్ఞానం; యెహోవా, ఆయన సంకల్పాల విషయంలో స్పష్టమైన అవగాహన వంటివన్నీ మన ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో ఉన్నాయి. ఆ స్వాస్థ్యంలో ఓ ప్రత్యేకమైన అవకాశం కూడా ఉంది.

1931లో జరిగిన సమావేశంలో యెహోవాసాక్షులు అనే పేరును మనం ఆనందంగా స్వీకరించాం

5 1931లో, అమెరికాలోని ఓహాయోలో ఉన్న కోలంబస్‌లో జరిగిన సమావేశంలో ఆ ప్రత్యేకమైన అవకాశాన్ని పొందాం. ఆ సమావేశ కార్యక్రమ పట్టికలో “JW” అనే అక్షరాలు కనిపించాయి. ‘ఆ అక్షరాలకు అర్థం ఏమై ఉంటుందా అని అందరూ ఆలోచించసాగారు’ అని ఓ సహోదరి గుర్తుచేసుకుంది. అప్పటివరకు బైబిలు విద్యార్థులు అని పిలువబడిన మనం 1931 జూలై 26 ఆదివారం రోజున ఓ తీర్మానం ద్వారా యెహోవాసాక్షులు (ఆంగ్లంలో Jehovah’s Witnesses) అనే పేరును స్వీకరించాం. లేఖనాధారమైన ఆ పేరును స్వీకరించినందుకు ఎంతో పులకించిపోయాం. (యెషయా 43:12 చదవండి.) “సమావేశ హాలంతా హర్షధ్వానాలతో, చప్పట్లతో మారుమ్రోగిపోయిన ఆ సందర్భాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను” అని ఓ సహోదరుడు అన్నాడు. మనం తప్ప లోకంలో ఎవ్వరూ ఆ పేరును కోరుకోవడం లేదు. అయితే ఎనభై కన్నా ఎక్కువ సంవత్సరాలుగా తన నామాన్ని ధరించే గొప్ప అవకాశాన్నిచ్చి యెహోవా మనల్ని ఆశీర్వదించాడు. యెహోవాసాక్షులుగా ఉండడం ఎంత ప్రత్యేకమైన అవకాశమో కదా!

6. ఖచ్చితమైన ఏ సమాచారం మన ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో భాగం?

6 గత కాలాల్లోని యెహోవా సేవకుల ద్వారా అందిన ఖచ్చితమైన, అమూల్యమైన సమాచారం కూడా మన ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో భాగమే. ఉదాహరణకు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ఆలోచించండి. యెహోవాను ఎలా సంతోష పెట్టాలనే దాని గురించి వాళ్లు, వాళ్ల కుటుంబాలు కలిసి తప్పక చర్చించుకొని ఉంటారు. కాబట్టి, “దేవునికి విరోధముగా పాపము” మూటగట్టుకునేలా చేసే లైంగిక అనైతికతను నీతిమంతుడైన యోసేపు తిరస్కరించాడంటే ఆశ్చర్యపోనవసరం లేదు. (ఆది. 39:7-9) క్రైస్తవ సాంప్రదాయాలు కూడా మాటల ద్వారా లేదా మాదిరి ద్వారా తర్వాతి తరాలకు అందాయి. ప్రభువు రాత్రి భోజనానికి సంబంధించి అపొస్తలుడైన పౌలు క్రైస్తవ సంఘాలకు తెలియజేసిన విషయాలు ఆ కోవకే చెందుతాయి. (1 కొరిం. 11:2, 23) నేడు యెహోవాను “ఆత్మతోను, సత్యముతోను” ఆరాధించడానికి కావాల్సిన వివరాలు మనకోసం బైబిల్లో ఉన్నాయి. (యోహాను 4:23, 24 చదవండి.) బైబిలు మనుష్యులందరికీ వెలుగును ఇచ్చేదే అయినా, ప్రత్యేకంగా యెహోవా సేవకులమైన మనకు అది మరీ అమూల్యమైనది.

7. మన హృదయాన్ని స్పృశించే ఏ వాగ్దానం మన ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో భాగం?

7 ఇటీవలే మన ప్రచురణల్లో వచ్చిన ఆధునిక కాల అనుభవాలు కూడా మన ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో భాగమే. అవి ‘యెహోవా మన పక్షాన’ ఉన్నాడని నిరూపిస్తున్నాయి. (కీర్త. 118:7) ఆ విషయాన్ని మనసులో ఉంచుకుంటే హింసలు ఎదురైనప్పుడు కూడా మనం సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాం. మన హృదయాన్ని స్పృశించే ఈ వాగ్దానం కూడా రోజురోజుకీ రెట్టింపు అవుతున్న మన ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో ఓ భాగమే: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.” (యెష. 54:17) మనకు శాశ్వత హాని చేసే శక్తి సాతాను దగ్గరున్న ఏ ఆయుధానికీ లేదు.

8. ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

8 యెహోవా వాక్యాన్ని నాశనం చేయాలని, ఆయన నామాన్ని రూపుమాపాలని, సత్యాన్ని అణగద్రొక్కాలని సాతాను ఎంతో ప్రయత్నించాడు. కానీ, సాతాను చేసిన ప్రయత్నాలన్నిటినీ యెహోవా నిర్వీర్యం చేశాడు. సాతాను ఎప్పటికీ యెహోవాకు ధీటుగా నిలబడలేడు. ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మనం ఈ ప్రశ్నల్ని పరిశీలిస్తాం: (1) యెహోవా తన వాక్యాన్ని ఎలా కాపాడాడు? (2) యెహోవా తన నామాన్ని ఎలా భద్రపర్చాడు? (3) మన పరలోక తండ్రి మనకు సత్యాన్ని ఎలా ఇచ్చాడు, దాన్నెలా కాపాడుతూ వచ్చాడు?

యెహోవా తన వాక్యాన్ని కాపాడాడు

9-11. బైబిలు ఎన్నో కుట్రలకు, దాడులకు తట్టుకొని నిలబడిందని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

9 ఎలాంటి అవాంతరాలు వచ్చినా యెహోవా తన వాక్యాన్ని కాపాడాడు. క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “ఆల్బిజెన్సులకు, వాల్డెన్సులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం నేపథ్యంలో, కౌన్సిల్‌ ఆఫ్‌ టూలూజ్‌ 1229లో సాధారణ ప్రజలు వాటిని [తమ భాషల్లో అందుబాటులో ఉన్న బైబిళ్లను] చదవడాన్ని నిషేధించింది . . . 1234లో స్పెయిన్‌లోని టెరగోనలో జేమ్స్‌ I నేతృత్వంలో జరిగిన సమావేశంలో కూడా అలాంటి నిషేధాన్నే ప్రకటించారు. . . . హోలీ ఆఫీస్‌ అనుమతి లేకుండా ఇతర భాషల్లో [బైబిళ్లను] ముద్రించడాన్ని, కలిగివుండడాన్ని 1559లో పాల్‌ IV తయారు చేసిన పట్టిక (ఇండెక్స్‌) నిషేధించినప్పుడు రోమన్‌ బిషప్‌ అధికారిక కార్యాలయం మొట్టమొదటిసారిగా ఈ విషయంలో కలుగజేసుకున్నట్లయింది.”

10 బైబిల్ని నాశనం చేయడానికి ఎన్నో కుట్రలు, దాడులు జరిగినా యెహోవా దాన్ని కాపాడాడు. సుమారు 1382లో జాన్‌ విక్లిఫ్‌, ఆయన సహవాసులు మొట్టమొదటిసారిగా బైబిలును ఆంగ్లంలోకి అనువదించారు. బైబిలును అనువదించిన మరో వ్యక్తి విలియమ్‌ టిండేల్‌. ఆయనను 1536లో చంపేశారు. తనను మ్రానుకు వేలాడదీసినప్పుడు ఆయన, ‘ప్రభువా! ఇంగ్లాండ్‌ రాజు కళ్లు తెరువు’ అని అరిచినట్లు ఓ నివేదిక చెబుతోంది. ఆ తర్వాత ఆయనను ఉరివేసి తగలబెట్టారు.

11 బైబిలు ఎన్నో వ్యతిరేకతల్ని తట్టుకొని నిలబడింది. ఉదాహరణకు, మైల్స్‌ కవర్‌డేల్‌ అనే వ్యక్తి అనువదించిన ఆంగ్ల బైబిలు 1535లో వెలుగుచూసింది. టిండేల్‌ అనువదించిన “కొత్త నిబంధన” గ్రంథాన్ని, “పాత నిబంధన” గ్రంథంలోని ఆదికాండము నుండి దినవృత్తాంతముల పుస్తకాలను కవర్‌డేల్‌ తన అనువాదం కోసం ఉపయోగించుకున్నాడు. కవర్‌డేల్‌ మిగతా పుస్తకాలను లాటిన్‌ భాష నుండి అనువదించాడు, కొన్నిటిని మార్టిన్‌ లూథర్‌ తర్జుమా చేసిన జర్మన్‌ భాషా బైబిలు నుండి అనువదించాడు. అయితే, మనకాలంలో ఆయా భాషల్లో అందుబాటులో ఉన్న పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం దాని స్పష్టతకు, విశ్వసనీయతకు, పరిచర్యలో ఉపయోగానికి పేరుగాంచింది. సాతాను గానీ, మనుష్యులు గానీ యెహోవా వాక్యాన్ని నాశనం చేయలేకపోయినందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం.

యెహోవా తన నామాన్ని భద్రపర్చాడు

దేవుని వాక్యం కోసం టిండేల్‌ వంటి వ్యక్తులు తమ ప్రాణాల్ని త్యాగం చేశారు

12. దేవుని పేరును భద్రపర్చడంలో నూతనలోక అనువాదం ఎలాంటి పాత్ర పోషించింది?

12 యెహోవా బైబిల్లో తన నామాన్ని భద్రపర్చాడు. ఈ విషయంలో నూతనలోక అనువాదం కీలక పాత్ర పోషించింది. అంకిత భావంగల అనువాదకుల కమిటీ సభ్యులు దాని ఉపోద్ఘాతంలో ఇలా రాశారు: ‘యెహోవా పేరును అది ఉండాల్సిన స్థానంలో తిరిగి పెట్టడమే ఈ అనువాదపు ముఖ్య విశిష్టత. ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఆంగ్ల రూపమైన “Jehovah” అనే పేరును హెబ్రీ లేఖనాల్లో 6,973 సార్లు, గ్రీకు లేఖనాల్లో 237 సార్లు తిరిగి పెట్టాం.’ నూతనలోక అనువాదం ఇప్పుడు మొత్తంగా లేదా భాగంగా 116 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 17,85,45,862 కన్నా ఎక్కువ కాపీలు ముద్రించబడ్డాయి.

13. మానవ సృష్టి ఆరంభం నుండే దేవుని పేరు మానవులకు తెలుసని ఎందుకు చెప్పవచ్చు?

13 మానవ సృష్టి ఆరంభం నుండే యెహోవా పేరు మానవులకు తెలుసు. ఆదాముహవ్వలకు ఆ పేరు తెలుసు, దాని ఖచ్చితమైన ఉచ్చారణ తెలుసు. నోవహు కూడా యెహోవా నామాన్ని ఉపయోగించాడు. జలప్రళయం తర్వాత తన కుమారుడైన హాము తనను అగౌరవపర్చినప్పుడు ఆయన ఇలా అన్నాడు: “షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, [హాము కుమారుడైన] కనాను అతనికి దాసుడగును.” (ఆది. 4:1; 9:26) దేవుడే స్వయంగా ఇలా అన్నాడు: “యెహోవాను నేనే; ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను.” ఆ తర్వాత దేవుడు ఇలా కూడా అన్నాడు: “నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు.” (యెష. 42:8; 45:5) తన నామం భద్రపర్చబడేలా, భావి తరాల వాళ్లు దాన్ని తెలుసుకునేలా యెహోవా చూశాడు. యెహోవా దేవుని నామాన్ని ఉపయోగించడం, ఆయనకు సాక్షులుగా సేవచేయడం ఎంత గొప్ప అవకాశమో కదా! ఒక విధంగా మనమందరం బిగ్గరగా ఇలా అంటున్నాం: “మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము.”—కీర్త. 20:5.

14. దేవుని పేరు కనిపించేది బైబిల్లో మాత్రమే కాదని చూపించే ఉదాహరణలు ఇవ్వండి.

14 దేవుని పేరు కనిపించేది బైబిల్లో మాత్రమే కాదు. ఉదాహరణకు, మృత సముద్రానికి తూర్పున 21 కి.మీ. దూరంలో ఉన్న ధీబాన్‌లో దొరికిన ఓ మోయాబు శిల విషయమే తీసుకోండి. అది ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ పేరుతో పాటు, మోయాబు రాజైన మేషా ఇశ్రాయేలీయుల మీద చేసిన తిరుగుబాటు గురించి కూడా ప్రస్తావిస్తోంది. (1 రాజు. 16:28; 2 రాజు. 1:1; 3:4, 5) అయితే ఆ శిలకు సంబంధించిన ఓ విశిష్టత ఏమిటంటే, దానిమీద దేవుని పేరును సూచించే నాలుగు హెబ్రీ అక్షరాలు (టెట్రాగ్రామ్మెటన్‌) ఉన్నాయి. అంతేకాక, ఇజ్రాయేల్‌ దేశంలో దొరికిన మట్టి పాత్రల అవశేషాల్లో భాగమైన లాకీషు ఉత్తరాల్లో కూడా ఆ పేరు చాలాసార్లు ఉంది.

15. సెప్టువజింటు అంటే ఏమిటి? అది ఎలా ఉనికిలోకి వచ్చింది?

15 దేవుని పేరును భద్రపర్చడంలో తొలి అనువాదకుల పాత్ర కూడా ఉంది. సా.శ.పూ. 607 నుండి సా.శ.పూ. 537 వరకు బబులోను చెరలో ఉన్న తర్వాత చాలామంది యూదులు యూదాకు, ఇశ్రాయేలు దేశానికి తిరిగి రాలేదు. సా.శ.పూ. మూడవ శతాబ్దానికల్లా చాలామంది యూదులు అలెగ్జాండ్రియాలో, ఐగుప్తులో స్థిరపడ్డారు. అప్పటి అంతర్జాతీయ భాష గ్రీకు కాబట్టి వాళ్లకు ఆ భాషలో హెబ్రీ లేఖనాలు అవసరమయ్యాయి. దాంతో సా.శ.పూ. రెండవ శతాబ్దానికల్లా సెప్టువజింటు వర్షన్‌ తయారైంది. అలా హెబ్రీ లేఖనాలు గ్రీకు భాషలో అందుబాటులోకి వచ్చాయి. దానికి సంబంధించిన కొన్ని ప్రతుల్లో యెహోవా దేవుని పేరు హెబ్రీ అక్షరాల్లో ఉంది.

16. 1640లో మొదటిసారిగా ప్రచురితమైన ఒక పుస్తకంలో దేవుని పేరు ఉందని చెప్పే ఉదాహరణ ఇవ్వండి.

16 ఇంగ్లాండ్‌కు చెందిన అమెరికన్‌ కాలనీల్లో ముద్రించబడిన మొదటి సాహిత్యమైన బే సామ్‌ బుక్‌లో (Bay Psalm Book) దేవుని పేరు ఉంది. (1640లో ముద్రితమైన) దాని అసలు ప్రతిలో హెబ్రీ భాష నుండి అప్పటి ఆంగ్ల భాషలోకి అనువదించబడిన కీర్తనల గ్రంథం ఉంది. “ధన్యుడు” ‘దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడని’ చెప్పే కీర్తన 1:1, 2 వంటి వచనాల్లో ఆ పుస్తకం యెహోవా పేరును ఉపయోగించింది. దేవుని పేరుకు సంబంధించిన మరింత సమాచారం కోసం నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం) బ్రోషురు చూడండి.

యెహోవా ఆధ్యాత్మిక సత్యాన్ని కాపాడాడు

17, 18. (ఎ) “సత్యము” అనే పదాన్ని మీరెలా నిర్వచిస్తారు? (బి) ‘సువార్త సత్యంలో’ ఏవేవి ఉన్నాయి?

17 మనం ‘సత్యదేవుడైన యెహోవాను’ ఆనందంగా సేవిస్తున్నాం. (కీర్త. 31:5) ‘ఊహించినవి లేదా కల్పించినవి కాకుండా వాస్తవాలన్నీ ఉంటేనే ఫలానా దాన్ని సత్యమని అంటాం’ అని కోలిన్స్‌ కోబిల్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీ చెబుతోంది. బైబిల్లో “సత్యము” అని తరచూ అనువాదమైన హెబ్రీ పదం నిజమైన, ఆధారపడదగిన, నమ్మకమైన, వాస్తవమైన దాన్ని సూచిస్తుంది. అంతేకాక, “సత్యము” అని అనువాదమైన గ్రీకు పదం వాస్తవమైన లేదా ఖచ్చితమైన, సరైన దాన్ని సూచిస్తుంది.

18 యెహోవా దేవుడు ఆధ్యాత్మిక సత్యాన్ని కాపాడడమే కాక, దానికి సంబంధించిన జ్ఞానం మనకు విస్తారంగా అందుబాటులో ఉండేలా చూశాడు. (2 యోహా. 1, 2) “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” అని బైబిలు చెబుతున్నట్లుగా సత్యానికి సంబంధించిన మన అవగాహన క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. (సామె. 4:18) అంతేకాక “నీ వాక్యమే సత్యము” అని ప్రార్థించిన యేసు మాటలతో మనం పూర్తిగా ఏకీభవిస్తాం. (యోహా. 17:17) దేవుని వాక్యంలో క్రైస్తవ బోధల సముదాయమైన “సువార్త సత్యము” ఉంది. (గల. 2:14) యెహోవా పేరుకు, ఆయన సర్వాధిపత్యానికి, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలికి, పునరుత్థానానికి, రాజ్యానికి సంబంధించిన వాస్తవాలు కూడా ఆ బోధల్లో ఉన్నాయి. సత్యం వెలుగులోకి రాకుండా చేయడానికి సాతాను ఎంత ప్రయత్నించినా యెహోవా దాన్ని ఎలా కాపాడాడో ఇప్పుడు పరిశీలిద్దాం.

సత్యం మీద జరిగిన ఓ దాడిని యెహోవా నిర్వీర్యం చేశాడు

19, 20. నిమ్రోదు ఎవరు? అతని కాలంలో జరిగిన ఏ ప్రయత్నం విఫలమైంది?

19 జలప్రళయం తర్వాత, “యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి” వచ్చింది. (ఆది. 10:9) యెహోవాను వ్యతిరేకించే వ్యక్తిగా నిమ్రోదు నిజానికి సాతానును ఆరాధించాడు, అలాంటి వ్యతిరేకుల్ని ఉద్దేశిస్తూ చాలాకాలం తర్వాత యేసు ఇలా అన్నాడు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు . . . సత్యమందు నిలిచినవాడు కాడు.”—యోహా. 8:44.

20 బాబెలుతోపాటు హిద్దెకెలు, యూఫ్రటీసు నదుల మధ్య ఉన్న పట్టణాలు కూడా నిమ్రోదు అధికారం కింద ఉండేవి. (ఆది. 10:10) బహుశా ఆయన నిర్దేశం కిందే బాబెలు పట్టణాన్ని, దాని గోపురాన్ని నిర్మించడం సుమారు సా.శ.పూ. 2269లో మొదలుపెట్టి ఉంటారు. మనుష్యులు భూమంతటా విస్తరించాలన్న యెహోవా సంకల్పానికి విరుద్ధంగా ఆ నిర్మాణ పనివాళ్లు, “మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండి” అని మాట్లాడుకున్నారు. అయితే వాళ్లు తమ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, “యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసి,” ఆ గోపురం కట్టేవాళ్లను భూమంతటా చెదరగొట్టాడు. (ఆది. 11:1-4, 8, 9) మనుష్యులందరూ తననే ఆరాధించేలా ఒక మతాన్ని మొదలుపెట్టాలని సాతానే ఇదంతా చేసివుంటే గనుక, అతడు చేసింది విఫలయత్నమే అని చెప్పవచ్చు. మానవ చరిత్రంతటిలో యెహోవా ఆరాధన కొనసాగుతూనే వచ్చింది, అది రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది.

21, 22. (ఎ) అబద్ధమతం వల్ల సత్యారాధన ఉనికి ఎన్నడూ ప్రమాదంలో పడలేదని ఎందుకు చెప్పవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

21 అబద్ధమతం వల్ల సత్యారాధన ఉనికి ఎన్నడూ ప్రమాదంలో పడలేదు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే మన గొప్ప ఉపదేశకుడైన యెహోవా తన వాక్యాన్ని భద్రంగా కాపాడాడు, మానవజాతికి తన పేరును బయలుపర్చాడు, అంతేకాక అంతులేని ఆధ్యాత్మిక సత్యానికి ఊటగా ఉంటున్నాడు. (యెష. 30:20, 21) సత్యానికి అనుగుణంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. అయితే అలా చేయాలంటే మనం యెహోవాపై పూర్తిగా ఆధారపడుతూ, ఆయన ఆత్మ నిర్దేశాన్ని పాటిస్తూ ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండాలి.

22 కొన్ని అబద్ధ సిద్ధాంతాలు ఎలా పుట్టుకొచ్చాయో తర్వాతి ఆర్టికల్‌లో మనం పరిశీలిస్తాం. లేఖనాల వెలుగులో పరీక్షించినప్పుడు వీటిలో ఏ మాత్రం సత్యం లేదనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అంతేకాక, సత్యాన్ని తిరుగులేని విధంగా కాపాడే యెహోవా మన ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో భాగమైన సత్యపు బోధలను నేర్పించి మనల్ని ఎలా ఆశీర్వదించాడో కూడా చూస్తాం.