కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నారా?

మన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నారా?

‘అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని కటాక్షించెను.’—అపొ. 15:14.

1, 2. (ఎ) “దావీదు గుడారము” అంటే ఏమిటి? అది ఎలా తిరిగి నిర్మించబడుతుంది? (బి) నేడు ఎవరెవరు కలిసి యెహోవా సేవ చేస్తున్నారు?

 సా.శ. 49వ సంవత్సరం, యెరూషలేములో జరిగిన ఒక చారిత్రక పరిపాలక సభ కూటంలో శిష్యుడైన యాకోబు ఇలా అన్నాడు: “అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను [పేతురు] వివరించి యున్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా— ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది.”—అపొ. 15:13-18.

2 సిద్కియా తన సింహాసనాన్ని కోల్పోయినప్పుడు “దావీదు గుడారము [లేదా రాజరికం]” పడిపోయింది. (ఆమో. 9:11) అయితే దావీదు వంశస్థుడైన యేసు శాశ్వత రాజుగా ఆ “గుడారము” తిరిగి నిర్మించబడుతుంది. (యెహె. 21:27; అపొ. 2:29-36) యూదుల్లో నుండి, అన్యజనుల్లో నుండి రాజ్య వారసులను సమకూర్చే పనితో ఆమోసు ప్రవచన నెరవేర్పు ఆరంభమైందని ఆ చారిత్రక కూటంలో యాకోబు సూచించాడు. అభిషిక్త క్రైస్తవుల్లో శేషించిన వాళ్లు, లక్షలాదిమంది “వేరే గొఱ్ఱెలు” కలిసి యెహోవా సేవ చేస్తూ బైబిలు సత్యాన్ని ప్రకటిస్తున్నారు.—యోహా. 10:16.

యెహోవా ప్రజలు ఒక సవాలును ఎదుర్కొన్నారు

3, 4. యెహోవా ప్రజలు బబులోనులో తమ ఆధ్యాత్మికతను ఎలా కాపాడుకున్నారు?

3 యూదులు బబులోను చెరలోకి వెళ్లినప్పుడు “దావీదు గుడారము” పడిపోయిందనే విషయం స్పష్టమైంది. అయితే అబద్ధమతం విస్తృతంగా ఉన్న బబులోనులో దేవుని ప్రజలు ఆ 70 సంవత్సరాలు అంటే సా.శ.పూ. 607 నుండి సా.శ.పూ. 537 వరకు ఎలా తమ ఆధ్యాత్మికతను కాపాడుకున్నారు? ప్రస్తుతం సాతాను లోకంలో జీవిస్తున్న యెహోవా ప్రజలమైన మనం మన ఆధ్యాత్మికతను ఎలా కాపాడుకుంటున్నామో వాళ్లు కూడా అలాగే కాపాడుకున్నారు. (1 యోహా. 5:19) గొప్ప ఆధ్యాత్మిక స్వాస్థ్యం వల్లే అది సాధ్యమైంది.

4 దేవుని వాక్యం కూడా మన ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో భాగమే. బబులోను చెరలో ఉన్న యూదుల దగ్గర పూర్తి బైబిలు లేదు, కానీ వాళ్లకు పది ఆజ్ఞలతో సహా మోషే ధర్మశాస్త్రంలోని విషయాలు తెలుసు. వాళ్లకు “సీయోను కీర్తనలు” తెలుసు, వాళ్లు ఎన్నో సామెతలను గుర్తుచేసుకోగలిగారు, ఇంకా అంతకుముందు జీవించిన యెహోవా సేవకులు చేసిన పనులు కూడా వాళ్లకు తెలుసు. అవును, ఆ యూదులు సీయోనును గుర్తుచేసుకున్నప్పుడు ఏడ్చారు, వాళ్లు యెహోవాను మర్చిపోలేదు. (కీర్తన 137:1-6 చదవండి.) అందుకే వాళ్లు బబులోనులో ఉన్న అనేక అబద్ధ సిద్ధాంతాలు, ఆచారాల మధ్య కూడా ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండగలిగారు.

త్రిత్వ బోధ కొత్తదేం కాదు

5. ప్రాచీన బబులోనులో, ఐగుప్తులో త్రిత్వాలను ఆరాధించేవాళ్లని ఎలా చెప్పవచ్చు?

5 బబులోనీయులు తమ ఆరాధనలో త్రిత్వానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు. బబులోనుకు చెందిన ఒక త్రిత్వంలో సిన్‌ (చంద్ర దేవుడు), షామాష్‌ (సూర్య దేవుడు), ఇష్టార్‌ (సాఫల్యానికి, యుద్ధానికి దేవి) కలిసి ఉన్నట్లుగా చిత్రీకరించేవాళ్లు. ప్రాచీన ఐగుప్తులోనేమో సాధారణంగా ఒక దేవుడు, ఒక దేవత పెళ్లి చేసుకుని ఒక కుమారుణ్ణి కన్నట్లుగా చిత్రీకరించేవాళ్లు, “అలా ఆ ముగ్గురూ ఒక దైవిక త్రిత్వంలో భాగంగా ఉండేవాళ్లు. అందులో తండ్రి అన్నిసార్లూ ప్రముఖ వ్యక్తి కాదు, ఆయనది కేవలం భర్త పాత్రే, స్థానికుల దృష్టిలో దేవతదే ముఖ్యపాత్ర.” (న్యూ లారౌసి ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ మిథాలజీ) ఐగుప్తీయులు ఆరాధించే మరో త్రిత్వంలో ఆసిరిస్‌ దేవుడు, ఐసిస్‌ దేవత, వాళ్ల కుమారుడైన హోరస్‌ భాగంగా ఉండేవాళ్లు.

6. త్రిత్వం అంటే ఏమిటి? అలాంటి తప్పుడు బోధల వల్ల యెహోవా ప్రజలు ఎందుకు కలుషితం కాలేదు?

6 క్రైస్తవమత సామ్రాజ్యంలో కూడా త్రిత్వం ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురూ కలిసి ఒకే దేవుడని మత నాయకులు బోధిస్తారు. అయితే ఆ సిద్ధాంతం, యెహోవా ముగ్గురిలో ఒకడని, దేవుని తలలో కేవలం మూడో భాగమని బోధిస్తోంది కాబట్టి అది యెహోవా సర్వాధిపత్యంపై దాడి చేయడమే. అలాంటి తప్పుడు బోధల వల్ల యెహోవా ప్రజలు కలుషితం కాలేదు, ఎందుకంటే “ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా” అనే మాటలతో వాళ్లు ఏకీభవిస్తారు. (ద్వితీ. 6:4) యేసు ఆ మాటలనే మళ్లీ ఎత్తి చెప్పాడు, మరి నిజ క్రైస్తవులు ఎవరైనా ఆయనతో ఏకీభవించకుండా ఉంటారా?—మార్కు 12:29.

7. ఒకవైపు త్రిత్వాన్ని నమ్ముతూనే మరోవైపు యెహోవాకు సరైన విధంగా సమర్పించుకుని బాప్తిస్మం పొందడం ఎందుకు సాధ్యం కాదు?

7 “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం” ఇవ్వండి అంటూ యేసు అప్పగించిన పనికి, త్రిత్వ సిద్ధాంతానికి ఏమాత్రం పొసగదు. (మత్త. 28:19) నిజ క్రైస్తవునిగా, యెహోవాసాక్షిగా బాప్తిస్మం పొందాలనుకునే వాళ్లందరూ యెహోవాకున్న సర్వాధికారాన్ని గుర్తించాలి, అలాగే దేవుని కుమారుడైన యేసు స్థానాన్ని, అధికారాన్ని ఒప్పుకోవాలి. అంతేకాక పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తని, అది త్రిత్వంలో భాగం కాదని నమ్మాలి. (ఆది. 1:2) ఒకవైపు త్రిత్వాన్ని నమ్ముతూనే మరోవైపు యెహోవాకు సరైన విధంగా సమర్పించుకుని బాప్తిస్మం పొందడం సాధ్యం కాదు. దేవుణ్ణి అగౌరవపర్చే ఇలాంటి తప్పుడు బోధల బారినుండి మన ఆధ్యాత్మిక స్వాస్థ్యం మనల్ని కాపాడినందుకు మనమెంత సంతోషిస్తున్నామో కదా!

దయ్యాల సంబంధమైన విషయాలు దేవునికి అసహ్యం

8. దేవుళ్లకు, దయ్యాలకు సంబంధించి బబులోనీయులు ఏమి నమ్మేవాళ్లు?

8 బబులోనీయులు దేవుళ్లనే కాక దయ్యాలను, మంత్రతంత్రాలను కూడా నమ్మేవాళ్లు. దయ్యాలు మనుష్యుల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని, వాటి నుండి కాపాడమని ప్రజలు తమ దేవుళ్లకు ప్రార్థించేవాళ్లని ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది.

9. (ఎ) బబులోను చెరలోకి వెళ్లిన తర్వాత చాలామంది యూదులు తప్పుడు మత బోధల వల్ల ఎలా కలుషితం అయ్యారు? (బి) దయ్యాలతో పొత్తు పెట్టుకునే ప్రమాదాల నుండి మనం ఎలా కాపుదల అనుభవిస్తున్నాం?

9 బబులోను చెరలోకి వెళ్లిన తర్వాత చాలామంది యూదులు ఇటువంటి లేఖన విరుద్ధమైన బోధల వల్ల కలుషితం అయ్యారు. గ్రీకుల సిద్ధాంతాలు అంతకంతకూ ప్రాచుర్యం పొందడంతో, దయ్యాలు మేలు లేదా కీడు చేయగలవని నమ్మడం మొదలుపెట్టడం వల్ల యూదులు దయ్యాల ప్రభావంలో చిక్కుకున్నారు. దయ్యాలతో పొత్తు పెట్టుకునే ప్రమాదాల నుండి నేడు మన ఆధ్యాత్మిక స్వాస్థ్యం మనల్ని కాపాడుతోంది. బబులోనుకు సంబంధించిన అలాంటి మంత్రతంత్ర ఆచారాలను యెహోవా ఏమాత్రం అంగీకరించడని మనకు తెలుసు. (యెష. 47:1, 12-15) పైగా దయ్యాలకు సంబంధించిన ఆచారాలను యెహోవా ఎలా ఎంచుతున్నాడో మనం కూడా అలాగే ఎంచుతున్నాం.—ద్వితీయోపదేశకాండము 18:10-12; ప్రకటన 21:8 చదవండి.

10. మహాబబులోను ఆచారాలు, నమ్మకాల గురించి ఏమి చెప్పవచ్చు?

10 దయ్యాలకు సంబంధించిన ఆచారాలను పాటించింది ప్రాచీన బబులోను మాత్రమే కాదు, నేడు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను కూడా వాటిని పాటిస్తోంది. (ప్రక. 18:21-24) ద ఇంటర్‌ప్రిటర్స్‌ డిక్షనరీ ఆఫ్‌ ద బైబిల్‌ ఇలా వ్యాఖ్యానించింది: “[మహా]బబులోను ప్రభావం ఒక సామ్రాజ్యానికి లేదా ఒక సంస్కృతికి పరిమితం కాలేదు. దాని పేరు వినగానే గుర్తుకొచ్చేది భౌగోళికపరమైన దాని విస్తీర్ణమో లేదా అది రాజ్యమేలిన కాలమో కాదుగానీ అందులో జరిగిన విపరీతమైన విగ్రహారాధనే.” (1వ సంపుటి, 338వ పేజీ) దయ్యాలకు సంబంధించిన ఆచారాలు, విగ్రహారాధన వంటి ఎన్నో పాపాలకు ఒడిగడుతూ మహాబబులోను ఇంకా ఉనికిలో ఉంది, కానీ దానికి రోజులు దగ్గరపడ్డాయి.—ప్రకటన 18:1-5 చదవండి.

11. దయ్యాలకు సంబంధించిన ఆచారాల విషయంలో ఎలాంటి సమాచారాన్ని మన సంస్థ ప్రచురించింది?

11 “మంత్రయోగములు చేయకూడదు” అని యెహోవా చెప్పాడు. (లేవీ. 19:26) దయ్యాలకు సంబంధించిన ఆచారాలు 19వ శతాబ్దంలోని ప్రజల ఆలోచనా విధానాన్ని ఎంతగానో మార్చేశాయి. అందుకే జాయన్స్‌ వాచ్‌టవర్‌, మే 1885 సంచిక ఇలా వ్యాఖ్యానించింది: “చనిపోయిన వాళ్లు వేరే లోకంలో, వేరే స్థితిలో ఇంకా జీవించే ఉన్నారన్న నమ్మకం కొత్తదేం కాదు. ఇది ప్రాచీన మతాల్లో కూడా ఉండేది, పురాణాలన్నిటికీ ఈ నమ్మకమే మూలం.” చనిపోయిన వాళ్లు బ్రతికి ఉన్న వాళ్లతో మాట్లాడతారని నమ్మించేందుకు దయ్యాలే చనిపోయిన వాళ్లలా నటిస్తాయనీ, దానివల్ల దయ్యాలు ఎంతోమంది ఆలోచనల్ని, పనుల్ని ప్రభావితం చేశాయని కూడా ఆ సంచిక పేర్కొంది. దయ్యాల వ్యవహారాల గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయి? (ఆంగ్లం) అనే పేరుతో అప్పట్లో విడుదలైన చిన్న పుస్తకం కూడా దయ్యాలకు సంబంధించిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. ఇటీవల వచ్చిన ప్రచురణలు కూడా అలాంటి హెచ్చరికల్నే చేశాయి.

ఆత్మలు పాతాళలోకంలో యాతన పడుతున్నాయా?

12. చనిపోయిన వాళ్ల స్థితి గురించి సొలొమోను దైవ ప్రేరణతో ఏమి చెప్పాడు?

12 “సత్యము ఎరిగినవారందరు” ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. (2 యోహా. 1, 2) సొలొమోను చెప్పిన ఈ మాటలతో మనం ఏకీభవిస్తాం: “చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; . . . చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళము [మానవజాతి సామాన్య సమాధి] నందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”—ప్రసం. 9:4, 5, 10.

13. గ్రీకు మతం, హెల్లెనిక్‌ సంస్కృతి యూదులపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

13 చనిపోయిన వాళ్ల స్థితి గురించి యెహోవా యూదులకు తెలియజేశాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్‌ సైన్యాధిపతులు పంచుకున్నప్పుడు గ్రీకు మతాన్ని, హెల్లెనిక్‌ సంస్కృతిని ఉపయోగించుకుని యూదా, సిరియాలను ఐక్యం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. దానివల్ల మానవ ఆత్మ అమర్త్యమైనదని, పాతాళలోకంలో యాతన పెట్టే స్థలం ఒకటుందని చెప్పే అబద్ధ బోధలను యూదులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే యాతన అనుభవించే ఆత్మలున్న స్థలం గురించిన బోధ మొదట పుట్టింది గ్రీకు సంస్కృతిలో కాదు, నిజానికి బబులోనీయులు “పాతాళలోకం . . . భయాన్ని, భీతిని పుట్టించే ప్రదేశమని, . . . అది గొప్ప శక్తి ఉన్న భయంకరమైన దేవుళ్ల, దయ్యాల అజమాయిషీ కింద ఉండే లోకమని” నమ్మేవాళ్లు. (ద రిలీజియన్‌ ఆఫ్‌ బాబిలోనియా అండ్‌ అస్సీరియా) అవును, ఆత్మ అమర్త్యమైనదని బబులోనీయులు నమ్మారు.

14. మరణం, పునరుత్థానం గురించి యోబుకు, అబ్రాహాముకు ఏమి తెలుసు?

14 నీతిమంతుడైన యోబు దగ్గర లేఖనాలు లేకపోయినా, చనిపోయిన వాళ్ల స్థితి గురించి ఆయనకు తెలుసు. తాను చనిపోతే తనను పునరుత్థానం చేయాలనే బలమైన కోరిక ప్రేమగల యెహోవాకు ఉంటుందని యోబు అర్థం చేసుకున్నాడు. (యోబు 14:13-15) అబ్రాహాము కూడా పునరుత్థానాన్ని నమ్మాడు. (హెబ్రీయులు 11:17-19 చదవండి.) చనిపోయే అవకాశం లేని వాళ్లను పునరుత్థానం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆత్మ చనిపోకుండా ఎప్పటికీ బ్రతికేవుంటుందని వీళ్లు నమ్మలేదు. చనిపోయిన వాళ్ల స్థితిని అర్థం చేసుకోవడానికి, పునరుత్థానంపై విశ్వాసం కలిగివుండడానికి యోబు, అబ్రాహాములకు నిస్సందేహంగా దేవుని పరిశుద్ధాత్మే సహాయం చేసింది. ఈ సత్యాలు కూడా మన స్వాస్థ్యంలో భాగమే.

విమోచన క్రయధనం ద్వారా మనకు విడుదల అవసరం

15, 16. పాపమరణాల నుండి విడుదలయ్యే అవకాశం మనకు ఎలా దొరికింది?

15 వారసత్వంగా వచ్చిన పాప మరణాల బానిసత్వం నుండి మనల్ని దేవుడు ఎలా విడుదల చేస్తాడో తెలియజేసినందుకు కూడా మనం ఆయనకు ఎంతో కృతజ్ఞులం. (రోమా. 5:12) యేసు “పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు” వచ్చాడని మనకు తెలుసు. (మార్కు 10:45) మనకు ‘క్రీస్తుయేసునందు విమోచన’ కలుగుతుందని తెలుసుకుని ఎంత సంతోషిస్తున్నామో కదా!—రోమా. 3:22-24.

16 మొదటి శతాబ్దంలోని యూదులు, అలాగే అన్యులు పాప క్షమాపణ పొందాలంటే, వాళ్లు నిజమైన పశ్చాత్తాపం చూపించి, యేసు విమోచన క్రయధన బలిపై విశ్వాసం ఉంచాల్సి ఉండేది. ఇప్పుడు మన విషయంలో కూడా అంతే. (యోహా. 3:16, 36) త్రిత్వం, అమర్త్యమైన ఆత్మ వంటి అబద్ధ సిద్ధాంతాలను నమ్మే వ్యక్తి విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందలేడు. కానీ మనం పొందవచ్చు. ‘దేవుడు ప్రేమించిన కుమారుని’ గురించిన సత్యం మనకు తెలుసు, “ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.”—కొలొ. 1:13, 14.

యెహోవా నామం ధరించిన ప్రజలముగా ముందుకు సాగిపోదాం

17, 18. దేవుని ప్రజల ఆధునిక చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడ కనుగొనవచ్చు? దాని గురించి నేర్చుకోవడం వల్ల మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

17 మనం అనుసరిస్తున్న సత్య బోధల గురించి, దేవుని సేవకులముగా మనం అనుభవిస్తున్న వాటి గురించి, మనం ఆస్వాదిస్తున్న ఆధ్యాత్మిక, భౌతిక ఆశీర్వాదాల గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. వార్షిక పుస్తకాలు (ఆంగ్లం) ప్రపంచవ్యాప్తంగా మన కార్యకలాపాలకు సంబంధించిన ఉత్తేజకరమైన విషయాలను దశాబ్దాలుగా ప్రచురిస్తూనే ఉన్నాయి. ఫెయిత్‌ ఇన్‌ యాక్షన్‌ 1వ భాగం, 2వ భాగం వంటి వీడియోలు, యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) వంటి ప్రచురణలు దేవుని ప్రజల చరిత్రకు అద్దం పడతాయి. అలాగే మన పత్రికల్లో వచ్చే ప్రియమైన తోటి విశ్వాసుల అనుభవాలు మన మనసును కదిలిస్తాయి.

18 ప్రాచీన ఇశ్రాయేలీయులు తమను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ ప్రయోజనం పొందినట్లే, మనం కూడా యెహోవాసాక్షుల చరిత్ర గురించి తగినంత సమయం తీసుకుని ధ్యానిస్తే ప్రయోజనం పొందుతాం. (నిర్గ. 12:26, 27) దేవుని అద్భుత కార్యాలను చూసిన వృద్ధుడైన మోషే తోటి ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.” (ద్వితీ. 32:7) ‘యెహోవా ప్రజలముగా, ఆయన మంద గొర్రెలముగా’ మనం ఆయన చేసిన గొప్ప కార్యాలను ఇతరులకు చెబుతూ ఆయనను సంతోషంగా స్తుతిస్తాం. (కీర్త. 79:13) అలాగే దేవుని ప్రజల ఆధునిక చరిత్రను పరిశీలించి, దాని నుండి నేర్చుకుని, భవిష్యత్తు కోసం చక్కని ప్రణాళికలు వేసుకుందాం.

19. ఆధ్యాత్మిక వెలుగును ఆస్వాదిస్తున్న మనం ఏమి చేయాలి?

19 మనం చీకట్లో కాకుండా దేవుడిచ్చే వెలుగులో నడుస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞులం. (సామె. 4:18, 19) కాబట్టి మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేద్దాం, సత్యాన్ని ఇతరులకు ఉత్సాహంగా ప్రకటిద్దాం. సర్వోన్నత ప్రభువైన యెహోవాను ఇలా స్తుతించిన కీర్తనకర్తను అనుసరిద్దాం: “ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము.”—కీర్త. 71:16-18.

20. ఏయే వివాదాంశాలను మనం అర్థం చేసుకున్నాం? వాటి గురించి మీరెలా భావిస్తున్నారు?

20 యెహోవా సమర్పిత ప్రజలమైన మనం ఆయన సర్వాధిపత్యానికి, మానవుల యథార్థతకు సంబంధించిన వివాదాంశాలను అర్థం చేసుకున్నాం. యెహోవా విశ్వ సర్వాధిపతి అని, మన హృదయపూర్వక ఆరాధనకు అర్హుడని మనం ప్రకటిస్తాం. (ప్రక. 4:10, 11) ఆయన ఆత్మ మనమీద ఉంది కాబట్టి మనం దీనులకు సువార్త ప్రకటిస్తాం, నలిగిన హృదయం గలవారిని బలపరుస్తాం, దుఃఖిస్తున్న వారిని ఓదారుస్తాం. (యెష. 61:1, 2) దేవుని ప్రజల్ని, ఇతర మానవుల్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని సాతాను వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నా, మనం మాత్రం మన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచుతూ దేవునికి యథార్థంగా ఉండాలని, సర్వోన్నత ప్రభువైన యెహోవాను ఇప్పుడూ, ఎల్లప్పుడూ స్తుతించాలని గట్టిగా నిశ్చయించుకున్నాం.—కీర్తన 26:11; 86:12 చదవండి.