కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు, ఇతరులకు ప్రయోజనం చేకూరేలా దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

మీకు, ఇతరులకు ప్రయోజనం చేకూరేలా దేవుని వాక్యాన్ని ఉపయోగించండి

“నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను.” —కీర్త. 119:128.

1. మనకు దేవుని వాక్యం మీద పూర్తి నమ్మకం ఎందుకుండాలి?

 ఒక బైబిలు విద్యార్థి పరిచర్యలో పాల్గొనడానికి అర్హుడా కాడా అనే విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు సంఘ పెద్దలు, ‘ఆ వ్యక్తి బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని నమ్ముతున్నట్లు, ఆయన మాటలు చూపిస్తున్నాయా?’ అని ఆలోచిస్తారు. a రాజ్య ప్రచారకులు అవ్వాలని కోరుకుంటున్నవాళ్ల విషయంలో, ఆ మాటకొస్తే దేవుని సేవకులందరి విషయంలో ఆ ప్రశ్నకు స్పష్టంగా అవుననే జవాబు రావాలి. ఎందుకని? దేవుని వాక్యం మీద పూర్తి నమ్మకం, పరిచర్యలో దాన్ని ఉపయోగించే సామర్థ్యం మనకుంటే, దేవుణ్ణి తెలుసుకుని రక్షణ పొందేలా ఇతరులకు సహాయం చేయగలుగుతాం.

2. మనమెందుకు, ‘నేర్చుకొని రూఢియని తెలిసికొన్న వాటియందు నిలుకడగా’ ఉండాలి?

2 తిమోతికి రాస్తూ దేవుని వాక్యానికి గల ప్రాముఖ్యతను అపొస్తలుడైన పౌలు నొక్కి చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: ‘నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్న వాటియందు నిలుకడగా ఉండుము.’ సువార్తను నమ్మేందుకు తిమోతికి ప్రేరణ ఇచ్చిన బైబిలు సత్యాలను మనసులో ఉంచుకుని పౌలు అలా రాశాడు. నేడు కూడా బైబిలు సత్యాలు మన జీవితాల్లో అలాంటి ప్రభావమే చూపిస్తున్నాయి. అంతేకాక “రక్షణార్థమైన జ్ఞానము” కలిగి జీవించడానికి మనకు సహాయం చేస్తున్నాయి. (2 తిమో. 3:14, 15) పౌలు రాసిన తర్వాతి మాటల్ని అంటే 2 తిమోతి 3:16, 17లోని మాటల్ని బైబిలు రచయిత దేవుడేనని చెప్పేందుకు మనం తరచూ ఉపయోగిస్తాం. (చదవండి.) అయితే, ఆ మాటల్లో మనకు అదనపు ప్రయోజనం చేకూర్చే విషయం కూడా ఉంది. ఇప్పుడు ఆ వచనాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం. అలా చేస్తే, యెహోవా “ఉపదేశములన్నియు యథార్థములు” అనే మన నమ్మకం బలపడుతుంది.—కీర్త. 119:128.

‘ఉపదేశించుటకు ప్రయోజనకరం’

3-5. (ఎ) పెంతెకొస్తు రోజున పేతురు ఇచ్చిన ప్రసంగానికి ఒక సమూహం ఎలా స్పందించింది, ఎందుకు? (బి) థెస్సలోనికలోని చాలామంది సత్యాన్ని ఎందుకు అంగీకరించారు? (సి) మన పరిచర్య విషయంలో నేటి ప్రజల్ని ఏది ఆకట్టుకుంటోంది?

3 “నేను మీయొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను” అని యేసు ఇశ్రాయేలు జనాంగంతో అన్నాడు. (మత్త. 23:34) యేసు తన శిష్యుల గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరిచర్యలో లేఖనాలను ఉపయోగించడం వాళ్లకు ఆయన నేర్పించాడు. సా.శ. 33 పెంతెకొస్తు రోజున, ‘శాస్త్రుల్లో’ లేక బహిరంగ ఉపదేశకుల్లో ఒకడైన అపొస్తలుడైన పేతురు, యెరూషలేములో ఒక పెద్ద సమూహం ముందు ప్రసంగించాడు. ఆ ప్రసంగంలో ఆయన హెబ్రీ లేఖనాల నుండి కొన్ని వాక్యాలను ఉల్లేఖించాడు. ఆయన ఆ లేఖనాల అన్వయింపును తెలిపినప్పుడు చాలామంది శ్రోతలు ‘హృదయములో నొచ్చుకున్నారు.’ గతంలో వాళ్లు చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడ్డారు. ఇంచుమించు మూడువేల మంది దేవుణ్ణి క్షమాపణ వేడుకుని క్రైస్తవులు అయ్యారు.—అపొ. 2:37-41.

4 మరో బహిరంగ ఉపదేశకుడైన అపొస్తలుడైన పౌలు యెరూషలేములోనే కాక వేరే చోట్ల కూడా సువార్త ప్రకటించాడు. ఉదాహరణకు, మాసిదోనియాలోని థెస్సలోనిక నగరంలోవున్న సమాజమందిరంలో ఆరాధిస్తున్న వాళ్లతో పౌలు మాట్లాడాడు. ‘క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు’ పౌలు “వారితో మూడు విశ్రాంతిదినములు తర్కించుచుండెను.” దాని ఫలితం? ‘వారిలో [యూదుల్లో] కొందరు,’ అలాగే ‘గ్రీసు దేశస్థుల్లో చాలామంది’ విశ్వాసులయ్యారు.—అపొ. 17:1-4.

5 నేడు దేవుని సేవకులు బైబిలు ఉపయోగించే తీరు చాలామందిని ఆకట్టుకుంటోంది. స్విట్జర్లాండ్‌లో మన సహోదరి ఒక ఇంటివద్ద ఓ లేఖనాన్ని చదివి వినిపించినప్పుడు ఆ గృహస్థుడు ఇలా అడిగాడు: “మీరు ఏ చర్చీ వాళ్లు?” అప్పుడు ఆమె ఇలా జవాబిచ్చింది: “నేను, నా స్నేహితురాలు యెహోవాసాక్షులం.” అందుకు ఆయన ఇలా అన్నాడు: “నాకు ఈ పాటికే అర్థమై ఉండాల్సింది. మా ఇంటికొచ్చి మరీ బైబిలు తీసి చదివేది ఇంకెవ్వరు, ఒక్క యెహోవాసాక్షులు తప్ప!”

6, 7. (ఎ) సంఘానికి బోధిస్తున్నవాళ్లు బైబిలును చక్కగా ఎలా ఉపయోగించవచ్చు? (బి) బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నప్పుడు లేఖనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం?

6 మనం బోధించేటప్పుడు బైబిల్ని మరింత ఎక్కువగా ఎలా ఉపయోగించవచ్చు? మీకు సంఘంలో వేదిక మీద ప్రసంగించే సదావకాశం ఉన్నట్లయితే, నిర్దిష్టమైన బైబిలు లేఖనాలను ఉపయోగించండి. ముఖ్య లేఖనాలను సొంత మాటల్లో చెప్పడం, కంప్యూటర్‌ప్రింట్‌ తీసిన కాపీ నుండి లేదా ఎలక్ట్రానిక్‌ పరికరం నుండి చదవడం వంటివి చేసే బదులు బైబిలు తెరిచి దాని నుండి చదవండి. మీ శ్రోతలను కూడా బైబిలు తెరిచి చూడమని ప్రోత్సహించండి. అంతేకాదు మీ శ్రోతలు యెహోవాకు దగ్గరయ్యేందుకు సహాయం చేసేలా సమయం తీసుకుని లేఖనాలను అన్వయించండి. అర్థంచేసుకోవడానికి చాలా కష్టంగా ఉండే ఉపమానాలను, నవ్వించేందుకు మాత్రమే ఉపయోగపడే అనుభవాలను చెప్పే బదులు దేవుని వాక్యాన్ని వివరించేందుకు ఆ సమయాన్ని ఉపయోగించండి.

7 మనం బైబిలు అధ్యయనాలను నిర్వహించేటప్పుడు ఏ విషయాలను మనసులో ఉంచుకోవాలి? మనం క్రైస్తవ ప్రచురణలను ఉపయోగిస్తున్నప్పుడు బైబిలు లేఖనాలను నొక్కి చెప్పడం మర్చిపోకూడదు. పేరాల్లో ప్రస్తావించిన లేఖనాలను చదవమని బైబిలు విద్యార్థిని ప్రోత్సహించాలి. అలాగే వాటి భావాన్ని అర్థంచేసుకోవడానికి సహాయం చేయాలి. ఎలా? పెద్దపెద్ద వివరణలు ఇచ్చుకుంటూ అధ్యయనాన్ని ఉపన్యాసంలా మార్చే బదులు, వ్యాఖ్యానించమని బైబిలు విద్యార్థిని ప్రోత్సహించాలి. ఆయన ఏది నమ్మాలో లేదా ఎలా ఉండాలో మనమే చెప్పే బదులు, ఆ విద్యార్థి సరైన నిర్ధారణకు వచ్చేలా చేసే చక్కని ప్రశ్నలను వేయాలి. b

“ఖండించుటకు” ప్రయోజనకరం

8. పౌలుకు ఎలాంటి అంతర్గత పోరాటం ఎదురైంది?

8 ‘ఖండించడం’ లేదా గద్దించడం సంఘ పెద్దల బాధ్యతని మనం తరచూ అనుకుంటాం. నిజమే, ‘పాపంచేసేవారిని గద్దించే’ బాధ్యత సంఘపెద్దలకు ఉంది. (1 తిమో. 5:20; తీతు 1:13) కానీ, మనల్ని మనం గద్దించుకోవడం కూడా ప్రాముఖ్యమే. ఆదర్శ క్రైస్తవుడైన పౌలుకు నిర్మలమైన మనస్సాక్షి ఉండేది. (2 తిమో. 1:3) అయినా, ఆయన ఇలా రాశాడు: “వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.” ఆ మాటల సందర్భాన్ని పరిశీలిస్తే, తనలోవున్న పాపపు ప్రవృత్తిని అణచివేసుకునేందుకు పౌలు ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో మనకు మరింత బాగా అర్థమౌతుంది.—రోమీయులు 7:21-25 చదవండి.

9, 10. (ఎ) పౌలు ఎలాంటి బలహీనతలతో పోరాడి ఉంటాడు? (బి) తనలోని పాపపు ప్రవృత్తితో పౌలు ఎలా పోరాడి ఉంటాడు?

9 పౌలు ఎలాంటి బలహీనతలతో పోరాడాడు? అవేమిటో ఆయన నిర్దిష్టంగా చెప్పకపోయినా, తాను ఒకప్పుడు “హానికరుడను” అని తిమోతికి రాశాడు. (1 తిమో. 1:12, 13) ఆయన మారకముందు, క్రైస్తవులంటేనే కోపంతో రగిలిపోయేవాడు. క్రీస్తు అనుచరుల గురించి తన మనోభావాలు ఎలా ఉండేవో చెబుతూ ఆయన ఇలా ఒప్పుకున్నాడు: ‘వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై ఉంటిని.’ (అపొ. 26:11) పౌలు తన కోపాన్ని తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. కానీ, కొన్నిసార్లు తన భావావేశాల్ని, మాటల్ని అణచుకోవడం ఆయనకు కష్టమైవుంటుంది. (అపొ. 15:36-39) మరి ఆయన దాన్ని ఎలా అధిగమించాడు?

10 కొరింథులోని క్రైస్తవులకు రాస్తున్నప్పుడు, తనను తాను గద్దించుకోవడానికి తనకు ఏమి సహాయం చేసిందో పౌలు వివరించాడు. (1 కొరింథీయులు 9:26, 27 చదవండి.) ఆయన తన బలహీనతలతో పోరాడడానికి గట్టి చర్యలు తీసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన లేఖన ఉపదేశం కోసం చూసి ఉంటాడు, వాటిని అన్వయించుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించి ఉంటాడు, తగిన మార్పులను చేసుకోవడానికి శ్రమించి ఉంటాడు. c పౌలు మాదిరి నుండి మనం ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే, మనం కూడా పౌలులాగే మన అపరిపూర్ణతలతో పోరాడుతున్నాం.

11. నిజంగా సత్యమార్గంలో నడుస్తున్నామో లేదో నిర్ధారించుకోవడానికి ఏవిధంగా మనల్ని మనం ‘శోధించుకుంటూ’ ఉండవచ్చు?

11 ఆరాధనకు సంబంధించిన కార్యకలాపాల్లో మనం ఎన్నడూ ప్రస్తుతం చేస్తున్న దానితో సరిపెట్టుకోకూడదు. బదులుగా, నిజంగా సత్యమార్గంలో నడుస్తున్నామో లేదో నిర్ధారించుకోవడానికి మనల్ని మనం ‘శోధించుకుంటూ’ ఉండాలి. (2 కొరిం. 13:5) బైబిల్లో కొలొస్సయులు 3:5-10 వంటి లేఖనాలను చదువుతున్నప్పుడు, ఇలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘పాపపు కోరికలను చంపుకోవడానికి నేను కృషిచేస్తున్నానా లేక నైతికంగా బలహీనంగా తయారౌతున్నానా? ఇంటర్నెట్‌వాడుతున్నప్పుడు, అనుకోకుండా అనైతిక వెబ్‌సైట్లు కనిపిస్తే, వాటిని మూసేస్తానా? లేక అలాంటి సైట్ల కోసం ఇంకా వెదుకుతానా?’ బైబిలు ఉపదేశాన్ని అలా వ్యక్తిగతంగా అన్వయించుకున్నప్పుడు, మనం ‘మెలకువగా ఉండి మత్తులముకాకుండా’ ఉండగలుగుతాం.—1 థెస్స. 5:6-8.

“తప్పు దిద్దుటకు” ప్రయోజనకరం

12, 13. (ఎ) ‘సరిదిద్దేటప్పుడు’ మన ముఖ్యోద్దేశం ఏమై ఉండాలి? ఈ విషయంలో యేసు మాదిరిని మనం ఎలా అనుకరించవచ్చు? (బి) సరిదిద్దేటప్పుడు మనం ఎలా మాట్లాడకూడదు?

12 “తప్పు దిద్దుటకు” అని అనువదించబడిన గ్రీకు పదానికి “చక్కగా చేయు, సరిదిద్దు, యథాస్థానానికి చేర్చు” అనే అర్థాలు ఉన్నాయి. కొన్నిసార్లు, మనలను లేదా మన పనులను అపార్థం చేసుకున్న వాళ్ల ఆలోచనను సరిదిద్దేందుకు మనం చొరవ తీసుకోవాలి. ఉదాహరణకు, యేసు “సుంకరులతోను పాపులతోను” దయగా వ్యవహరిస్తున్నాడని యుదా మతనాయకులు ఆరోపించారు. అందుకు యేసు ఇలా స్పందించాడు: “రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా . . . గనుక—కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడి.” (మత్త. 9:11-13) ఆయన ఓపికతో, దయతో అందరికీ దేవుని వాక్యాన్ని వివరించాడు. అందుకే, “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు” అని వినయస్థులు తెలుసుకోగలిగారు. (నిర్గ. 34:6) ప్రజలకున్న అపోహలను ‘సరిదిద్దడానికి’ దేవుని కుమారుడు కృషి చేసినందువల్ల ఎంతోమంది సువార్తను నమ్మారు.

13 ఇతరులకు సహాయం చేసే విషయంలో మనం యేసు మాదిరిని అనుకరించవచ్చు. కోపంగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఉన్నపళంగా, ‘మీతో ఒక విషయం మాట్లాడాలి!’ అని అనవచ్చు. కానీ 2 తిమోతి 3:16, 17 అలా చెప్పట్లేదు. ఆ విధంగా ఇతరుల మనోభావాలను పట్టించుకోకుండా మాట్లాడే అధికారాన్ని ‘లేఖనాలు’ మనకు ఇవ్వట్లేదు. “కత్తిపోటువంటి” సూటిపోటి మాటలు తరచూ ఇతరుల మనసును గాయపరుస్తాయే గానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.—సామె. 12:18.

14-16. (ఎ) ఇతరులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సహాయపడేలా సంఘ పెద్దలు పరిస్థితులను ఎలా ‘సరిదిద్దవచ్చు’? (బి) తల్లిదండ్రులు పిల్లలను లేఖనాధారంగా ‘సరిదిద్దడం’ ఎందుకు ప్రాముఖ్యం?

14 ‘తప్పుదిద్దేటప్పుడు’ మనం ఓపికతో, దయతో ఎలా వ్యవహరించవచ్చు? ఉదాహరణకు, చీటికిమాటికి తగవులు పడుతున్న ఒక వివాహ జంట తమ సమస్య పరిష్కారం కోసం ఓ సంఘపెద్ద సహాయం కోరారనుకోండి. అప్పుడు ఆ సంఘపెద్ద ఏం చేస్తాడు? ఎవరి పక్షమూ వహించకుండా ఆయన వాళ్లతో బైబిలు సూత్రాలను తర్కించవచ్చు. బహుశా కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకంలోని 3వ అధ్యాయంలో ఉన్న సూత్రాలను ఉపయోగించి మాట్లాడవచ్చు. వాళ్లతో చర్చిస్తున్నప్పుడు, భార్యాభర్తలు వ్యక్తిగతంగా తాము ఏ ఉపదేశాన్ని అన్వయించుకోవాలో గ్రహిస్తారు. కొన్నిరోజుల తర్వాత, వాళ్ల పరిస్థితి ఎంతవరకు మెరుగుపడిందో ఆ పెద్ద అడిగి తెలుసుకోవచ్చు. అవసరమైతే, మరింత సహాయాన్ని అందించవచ్చు.

 15 పిల్లలను ఆధ్యాత్మికంగా బలపర్చడానికి తల్లిదండ్రులు వాళ్లను ఎలా ‘సరిదిద్దవచ్చు’? ఉదాహరణకు, కౌమారదశలో ఉన్న మీ అమ్మాయి చెడు స్నేహం మానుకునేలా ఆమెకు మీరు సహాయం చేయాలనుకుంటున్నారు. ముందుగా మీరు, ఆ స్నేహితుల గురించిన వివరాలు తెలుసుకోండి. నిజంగా, మీకు ఆందోళన కలిగించే విషయం ఏదైనా ఉంటే ఆమెతో మాట్లాడండి. బహుశా మీరు, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం), 2వ సంపుటి నుండి కొన్ని అంశాలను చర్చించవచ్చు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు మీ అమ్మాయితో కాస్త ఎక్కువ సమయాన్ని గడపవచ్చు. పరిచర్యలో లేదా కుటుంబ ఆటవిడుపుల్లో మీ అమ్మాయి మనఃస్థితి ఎలా ఉందో మీరు గమనించవచ్చు. మీరు ఓపికతో, దయతో వ్యవహరిస్తే, ప్రేమతో మీరు చూపిస్తున్న శ్రద్ధను మీ అమ్మాయి గ్రహించవచ్చు. తద్వారా ఆమె మీరు ఇచ్చే ఉపదేశాన్ని పాటించడానికి ఇష్టపడుతుంది, తన జీవితంలో ఎదురుకాగల పెనుప్రమాదాన్ని తప్పించుకుంటుంది.

తల్లిదండ్రులు తమ పిల్లలను ‘సరిదిద్దేందుకు’ బైబిలును ఉపయోగిస్తూ దయగా మాట్లాడితే పిల్లలు పెనుప్రమాదాల్ని తప్పించుకోగలుగుతారు ( 15వ పేరాను చూడండి)

16 ఆరోగ్యం విషయంలో ఆందోళనపడుతున్న వాళ్లను, ఉద్యోగం పోయినందుకు దిగులుపడుతున్న వాళ్లను, కొన్ని బైబిలు బోధల విషయంలో తికమకపడుతున్న వాళ్లను మనం అలాగే ఓపికగా, దయగా ప్రోత్సహించాలి. దేవుని వాక్యం ఆధారంగా ‘సరిదిద్దినప్పుడు’ యెహోవా ప్రజలకు గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి.

‘నీతియందు శిక్షచేయుటకు ప్రయోజనకరం’

17. క్రమశిక్షణను మనం ఎందుకు కృతజ్ఞతతో స్వీకరించాలి?

17 “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” (హెబ్రీ. 12:11) విశ్వాసులైన తల్లిదండ్రులు ఇచ్చిన క్రమశిక్షణ వల్ల ప్రయోజనం పొందామని చాలామంది క్రైస్తవులు ఒప్పుకుంటారు. క్రైస్తవ పెద్దల ద్వారా యెహోవా ఇచ్చే క్రమశిక్షణను అంగీకరిస్తే మనం నిత్యజీవ మార్గంలో నిలిచి ఉంటాం.—సామె. 4:13.

18, 19. (ఎ) ‘నీతియందు శిక్ష చేస్తున్నప్పుడు’ సామెతలు 18:13లోని ఉపదేశం పాటించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) తప్పిదస్థులతో వ్యవహరిస్తున్నప్పుడు సంఘ పెద్దలు ప్రేమ, సాత్వికం చూపిస్తే సాధారణంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

18 సమర్థవంతమైన క్రమశిక్షణను ఇవ్వడం కూడా ఒక కళే. క్రైస్తవులు “నీతియందు” క్రమశిక్షణను ఇవ్వాలని యెహోవా చెప్పాడు. (2 తిమో. 3:16, 17) కాబట్టి, ఈ విషయంలో మనం బైబిలు సూత్రాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. అలాంటి ఒక సూత్రం సామెతలు 18:13లో ఉంది: “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.” తీవ్రమైన పాపం చేశాడనే అభియోగం మోపబడిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు పెద్దలు, ముందుగా విషయాన్ని పూర్తిగా విచారణ చేసి నిజానిజాలన్నిటినీ తెలుసుకోవాలి. (ద్వితీ. 13:13, 14) అప్పుడే పెద్దలు అతనికి “నీతియందు” క్రమశిక్షణను ఇవ్వగలుగుతారు.

19 అంతేకాక, ఇతరులను “సాత్వికముతో” సరిదిద్దాలని దేవుని వాక్యం క్రైస్తవ పెద్దలను ఉపదేశిస్తోంది. (2 తిమోతి 2:24-26 చదవండి.) నిజమే, ఒక వ్యక్తి యెహోవాకు చెడ్డపేరు తీసుకువచ్చి, అమాయకులను బాధపెట్టి ఉండవచ్చు. అయినప్పటికీ, సంఘ పెద్దలు అతనికి కోపంగా ఉపదేశాన్నిస్తే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అయితే పెద్దలు ‘దేవుని అనుగ్రహాన్ని’ అనుకరిస్తే, తప్పిదస్థుడు పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందవచ్చు.—రోమా. 2:4.

20. పిల్లలకు క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఏ సూత్రాలను పాటించాలి?

20 “ప్రభువు [“యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను” పిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు బైబిలు సూత్రాలను పాటించాలి. (ఎఫె. 6:4) ఎవరో చెప్పిన మాటలను బట్టి తండ్రి పిల్లవాడిని శిక్షించకూడదు. క్రైస్తవ కుటుంబంలో మితిమీరిన కోపానికి తావులేదు. యెహోవా “ఎంతో జాలియు కనికరమును గలవాడు.” కాబట్టి, పిల్లలను క్రమశిక్షణలో పెట్టే బాధ్యత ఉన్న తల్లిదండ్రులు ప్రేమతో కూడిన అలాంటి లక్షణాలు చూపించడానికి ప్రయత్నించాలి.—యాకో. 5: 11.

యెహోవా మనకు ఇచ్చిన అమూల్యమైన బహుమానం

21, 22. కీర్తన 119:97-104లోని ఏ మాట, యెహోవా వాక్యం గురించి మీ మనసులో ఉన్నదాన్ని చక్కగా వ్యక్తం చేస్తోంది?

21 దైవభక్తి గల ఒక వ్యక్తి తాను దేవుని ధర్మశాస్త్రాన్ని ఎందుకు అమితంగా ప్రేమించాడో చెప్పాడు. (కీర్తన 119:97-104 చదవండి.) దాన్ని అధ్యయనం చేసి ఆయన జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని సంపాదించుకున్నాడు. అందులో ఉన్న ఉపదేశాన్ని పాటించడం వల్ల ఆయన, ఎంతోమందిని నానా అవస్థలకు గురిచేసిన తప్పుడు మార్గాలకు దూరంగా ఉండగలిగాడు. బైబిలు చదవడమంటే ఆయనకు ఎంతో హాయి, సంతృప్తి. తన జీవితంలో ఎన్నో ప్రయోజనకరమైన ఉపదేశాలను ఇచ్చిన దేవునికి లోబడాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు.

22 మీరు “ప్రతి లేఖనమును” అమూల్యమైనదిగా ఎంచుతారా? అవి, దేవుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తాడనే మీ విశ్వాసాన్ని పెంచుతాయి. పాపం చేయడం వల్ల వచ్చే ప్రాణాంతకమైన పర్యవసానాల నుండి దేవుని ప్రేరేపిత ఉపదేశం మిమ్మల్ని కాపాడుతుంది. దేవుని వాక్యాన్ని నైపుణ్యంగా వివరించడం వల్ల, నిత్యజీవపు మార్గంలోకి వచ్చేలా, అందులోనే కొనసాగేలా ఇతరులకు సహాయం చేయవచ్చు. సర్వజ్ఞాని, ప్రేమగల దేవుడు అయిన యెహోవాను సేవిస్తుండగా, మనం “ప్రతి లేఖనమును” పూర్తిగా ఉపయోగించుకుందాం.

a యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 79, 80 పేజీలు చూడండి.

b బోధిస్తున్నప్పుడు యేసు తరచూ ప్రజలను, “మీకేమి తోచుచున్నది?” అని అడిగేవాడు. ఆ తర్వాత వాళ్ల జవాబు కోసం వేచి చూసేవాడు.—మత్త. 18:11, 12; 21:28; 22:42.

c పౌలు తాను రాసిన పత్రికల్లో, పాపపు ఆలోచనలను అధిగమించడానికి సంబంధించి ఎంతో ప్రోత్సాహాన్ని అందించాడు. (రోమా. 6:12; గల. 5:16-18) తాను ఇతరులకు ఇచ్చిన ఉపదేశాలను పౌలు స్వయంగా అన్వయించుకుని ఉంటాడని మనం నమ్మవచ్చు.—రోమా. 2:21.