కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అలసిపోకుండా మేలు చేయండి’

‘అలసిపోకుండా మేలు చేయండి’

“మనము మేలుచేయుట యందు విసుకక యుందము.”—గల. 6:9.

1, 2. యెహోవా విశ్వవ్యాప్త సంస్థ గురించి ఆలోచించడం వల్ల మన నమ్మకం ఎలా పెరుగుతుంది?

 ఓ గొప్ప విశ్వవ్యాప్త సంస్థలో ఉన్నామన్న ఆలోచనే మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది! యెహెజ్కేలు 1వ అధ్యాయంలో, దానియేలు 7వ అధ్యాయంలో నమోదైన దర్శనాలు, యెహోవా తన సంకల్పాన్ని పూర్తిగా నెరవేరేలా పరిస్థితుల్ని మలుస్తున్నాడని చూపిస్తున్నాయి. సువార్త ప్రకటనా పని మీద దృష్టి నిలిపేలా, ఆ పనిలో పాల్గొనే వాళ్ల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేలా, సత్యారాధనను విస్తృతపర్చేలా యెహోవా సంస్థలోని భూసంబంధ భాగాన్ని యేసు నడిపిస్తున్నాడు. అది యెహోవా సంస్థ మీద ఎంత నమ్మకాన్ని కలిగిస్తుంది!—మత్త. 24:45.

2 మనం యెహోవా అద్భుతమైన సంస్థతో కలిసి ముందుకు సాగుతున్నామా? సత్యం విషయంలో మనకున్న ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతోందా లేక తగ్గిపోతోందా? అలాంటి ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడు, మనం నెమ్మదిగా అలసిపోతున్నామని లేదా మన ఉత్సాహం కొద్దిగా తగ్గిందని మనం గుర్తించవచ్చు. నిజంగానే అలా జరిగే అవకాశం ఉంది. మొదటి శతాబ్దంలో, ఉత్సాహంగా సేవచేసిన యేసు గురించి ఆలోచించమని అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు ఉపదేశమిచ్చాడు. యేసు చూపిన ఆదర్శం గురించి ఆలోచిస్తే, ‘అలసట పడకుండా, ప్రాణాలు విసుకకుండా’ ఉండగలుగుతారని పౌలు వాళ్లకు చెప్పాడు. (హెబ్రీ. 12:3) అదే విధంగా, యెహోవా సంస్థ ప్రస్తుతం సాధిస్తున్న వాటిని వివరించిన ముందటి ఆర్టికల్‌ని నిశితంగా పరిశీలించడం వల్ల ఇప్పటికే మనం ఉత్సాహం, ఓర్పు నిలబెట్టుకోవడానికి కావాల్సిన సహాయాన్ని పొంది ఉంటాం.

3. మనం అలసిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఈ ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

3 అయితే, మనం అలసిపోకుండా ఉండాలంటే అది మాత్రమే సరిపోదని పౌలు సూచించాడు. మనం “మేలుచేయుట యందు విసుకక” ఉండాలని ఆయన చెప్పాడు. (గల. 6:9) పౌలు సలహాను పాటించాలంటే మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. మనం స్థిరంగా ఉంటూ యెహోవా సంస్థతోపాటు ముందుకు సాగడానికి సహాయం చేసే ఐదు రంగాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ తర్వాత, మనం లేదా మన కుటుంబాలు మరింత దృష్టి నిలపాల్సిన రంగాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించుకోవచ్చు.

ప్రోత్సాహం కోసం, ఆరాధన కోసం సమకూడండి

4. సత్యారాధనలో, కూటాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఎందుకు చెప్పవచ్చు?

4 ఎన్నో శతాబ్దాలుగా యెహోవా సేవకుల కార్యకలాపాల్లో కూటాలు ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. పరలోకంలో కూడా సముచితమైన సందర్భాల్లో దేవదూతలందరూ యెహోవా సన్నిధికి ఆహ్వానింపబడుతుంటారు. (1 రాజు. 22:19; యోబు 1:6; 2:1; దాని. 7:10) పూర్వకాలంలో, ఇశ్రాయేలు జనాంగం కూడా ‘విని నేర్చుకోవడానికి’ సమకూడాల్సి ఉండేది. (ద్వితీ. 31:10-12) మొదటి శతాబ్దంలోని యూదులు లేఖనాల్ని చదవడానికి సమాజమందిరాలకు వెళ్లేవాళ్లు. (లూకా 4:16; అపొ. 15:21) క్రైస్తవ సంఘం స్థాపితమవ్వడంతో క్రమంగా సమకూడే ఏర్పాటుకు సంతరించుకున్న ప్రాముఖ్యత అలాగే కొనసాగింది. ఇప్పటికీ మన ఆరాధనలో కూటాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజక్రైస్తవులు ‘ప్రేమ చూపిస్తారు, సత్కార్యాలు చేస్తారు.’ మనం ‘[యెహోవా] దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా ఒకరినొకరం’ ప్రోత్సహించుకుంటూ ఉండాలి.—హెబ్రీ. 10:24, 25.

5. కూటాల్లో ఒకరినొకరం ఎలా ప్రోత్సహించుకోవచ్చు?

5 ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి ఓ ప్రాముఖ్యమైన విధానం ఏమిటంటే కూటాల్లో పాల్గొనడం. కూటాల్లో ఓ ప్రశ్నకు జవాబివ్వడం, ఓ లేఖన అన్వయింపును తెలపడం, బైబిలు సూత్రాలను పాటించడం ఎంత జ్ఞానయుక్తమో తెలిపే ఓ చిన్నపాటి అనుభవం చెప్పడం వంటివాటి ద్వారా మన విశ్వాసాన్ని బహిరంగంగా వ్యక్తం చేయవచ్చు. (కీర్త. 22:22; 40:9) మనం కూటాలకు ఎన్ని సంవత్సరాల నుండి హాజరౌతున్నా, పిల్లలూ పెద్దలూ హృదయపూర్వకంగా ఇచ్చే వ్యాఖ్యానాలు ఇప్పటికీ మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు.

6. మనం ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండడానికి కూటాలు ఎలా సహాయం చేస్తాయి?

6 మనం క్రమంగా సమకూడడం ప్రాముఖ్యమని యెహోవా చెప్పడానికి ఇంకా ఏ కారణాలు ఉన్నాయి? కూటాలు, సమావేశాలు పరిచర్యలో మనం ధైర్యంగా మాట్లాడడానికి, వ్యతిరేకించేవాళ్లతో లేదా ఉదాసీనంగా ఉండేవాళ్లతో వ్యవహరించడానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తాయి. (అపొ. 4:23, 31) కూటాల్లో జరిగే లేఖన చర్చలు మనల్ని బలపరుస్తాయి, మన విశ్వాసాన్ని స్థిరపరుస్తాయి. (అపొ. 15:32; రోమా. 1:11, 12) ఆరాధన కోసం సమకూడినప్పుడు మనం వినే బోధలు, మనకు దొరికే ప్రోత్సాహం నిజమైన సంతోషాన్ని రుచి చూపిస్తాయి, మన ‘కష్ట దినాలను పోగొట్టి నెమ్మదిని కలుగజేస్తాయి.’ (కీర్త. 94:12, 13) భూవ్యాప్తంగా యెహోవాసాక్షుల కూటాల్లో, సమావేశాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలను సిద్ధం చేసే పనిని పరిపాలక సభలోని టీచింగ్‌ కమిటీ పర్యవేక్షిస్తుంది. సంవత్సరం పొడవునా ప్రతీవారం చక్కని కూటాల్ని ఆస్వాదించగలిగేలా జరుగుతున్న ఏర్పాట్లకు మనమెంత కృతజ్ఞులం!

7, 8. (ఎ) క్రైస్తవ కూటాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? (బి) కూటాలు మీకు ఆధ్యాత్మికంగా ఎలా సహాయం చేస్తున్నాయి?

7 కూటాలు మన వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే కాదు. అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ముఖ్యంగా మనం యెహోవాను ఆరాధించడానికే సమకూడతాం. (కీర్తన 95:7 చదవండి.) మహిమాన్వితుడైన మన దేవుణ్ణి స్తుతించడం అనేది మనకు లభించిన గొప్ప అవకాశం. (కొలొ. 3:16) కూటాలకు క్రమంగా హాజరౌతూ వాటిలో భాగం వహించడం ద్వారా మనం చెల్లించే ఆరాధనకు యెహోవా అర్హుడు. (ప్రక. 4:10, 11) అందుకే, ‘కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానకూడదు’ అని బైబిలు మనకు ఉపదేశిస్తోంది.—హెబ్రీ. 10:24, 25.

8 యెహోవా ఈ దుష్ట విధానాన్ని నాశనం చేసేంతవరకు ఓర్పు చూపించడానికి క్రైస్తవ కూటాలు మనకు సహాయం చేస్తాయని నమ్ముతున్నామా? అలాగైతే, తీరిక లేని మన జీవితాల్లో మనం తప్పక సమయం కేటాయించాల్సిన ‘శ్రేష్ఠమైన కార్యాల్లో’ కూటాలు కూడా ఉన్నాయని గుర్తిస్తాం. (ఫిలి. 1:9, 10) అనివార్య పరిస్థితుల్లో తప్ప మన సహోదరులతో కలిసి యెహోవాను ఆరాధించడానికి దొరికే అవకాశాన్ని చేజార్చుకోకూడదు.

యథార్థ హృదయంగల ప్రజల కోసం వెదకండి

9. ప్రకటనాపని ప్రాముఖ్యమైనదని మనకెలా తెలుసు?

9 ప్రకటనాపనిలో పూర్తిగా పాల్గొనడం ద్వారా కూడా మనం యెహోవా సంస్థతో కలిసి ముందుకు సాగవచ్చు. యేసు భూమ్మీదున్నప్పుడు ఈ ప్రకటనాపనిని మొదలుపెట్టాడు. (మత్త. 28:19, 20) అప్పటి నుండి యెహోవా సంస్థ ప్రాముఖ్యంగా రాజ్య ప్రకటనా పని మీద, శిష్యుల్ని తయారు చేసే పని మీద దృష్టి నిలుపుతోంది. దేవదూతలు మన పనికి సహకరిస్తూ, “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వాళ్ల దగ్గరికి మనల్ని నడిపిస్తున్నారని ఆధునిక కాలంలో ఎన్నో అనుభవాలు రుజువుచేస్తున్నాయి. (అపొ. 13:48; ప్రక. 14:6, 7) నేడు, అత్యంత ప్రాముఖ్యమైన ఈ పనికి మద్దతునిచ్చేందుకు యెహోవా సంస్థలోని భూసంబంధ భాగం ఏర్పాటు చేయబడింది, వ్యవస్థీకరించబడింది. మన జీవితంలో పరిచర్య కూడా ముఖ్యమైన భాగంగా ఉందా?

10. (ఎ) సత్యం పట్ల మనకున్న ఆసక్తిని ఎలా సజీవంగా ఉంచుకోవచ్చో చూపించే అనుభవం చెప్పండి. (బి) అలసిపోకుండా ఉండేందుకు పరిచర్య మీకెలా సహాయం చేసింది?

10 పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా సత్యం పట్ల మనకున్న ఆసక్తిని సజీవంగా ఉంచుకోవచ్చు. ఉదాహరణకు, ఎంతోకాలం నుండి సంఘపెద్దగా, క్రమ పయినీరుగా సేవచేస్తున్న మిఛల్‌ అనే సహోదరుడు ఏమి చెబుతున్నాడో గమనించండి. ఆయనిలా అంటున్నాడు: “సత్యం గురించి ప్రజలతో మాట్లాడడమంటే నాకు చాలా ఇష్టం. కావలికోట, తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికల్లో వచ్చే ఓ కొత్త ఆర్టికల్‌ గురించి ఆలోచించినప్పుడు, ప్రతీ సంచికలో ఉండే సముచితమైన, సహేతుకమైన సమాచారాన్ని, అందులోని జ్ఞానాన్ని, అవగాహనను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది! ప్రజలు ఎలా స్పందిస్తారో, వాళ్లలో ఆసక్తిని ఎలా రగిలించవచ్చో చూడడానికి పరిచర్యకు వెళ్లాలనిపిస్తుంది. నా పరిచర్య నన్ను స్థిరంగా ఉంచుతోంది. ఎలాగైనా సరే, నా సొంత పనులన్నిటినీ పరిచర్యకు ముందుగానీ, తర్వాతగానీ చేసేలా ఏర్పాటు చేసుకుంటాను.” ఆయనలాగే, మనం పరిశుద్ధ సేవలో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొంటే మనం ఈ అంత్యదినాల్లో స్థిరంగా ఉండగలుగుతాం.—1 కొరింథీయులు 15:58 చదవండి.

ఆధ్యాత్మిక ఏర్పాట్లను ఆస్వాదించండి

11. యెహోవా నుండి వచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం ఎందుకు పూర్తిగా ఆరగించాలి?

11 మనకు బలాన్ని ఇచ్చేందుకు యెహోవా విస్తారమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ముద్రిత రూపంలో మనకు అందిస్తున్నాడు. ఏదైనా ప్రచురణ చదివిన తర్వాత, ‘అరే! నాకు కావాల్సిందే ఇందులో వచ్చింది. యెహోవా ఈ పత్రికను నా కోసమే రాయించాడేమో!’ అనుకున్న సందర్భాలు ఖచ్చితంగా మన జీవితంలో ఉండే ఉంటాయి. అదేదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు, అలాంటి ఏర్పాట్ల ద్వారా యెహోవా మనకు ఉపదేశమిస్తున్నాడు, నిర్దేశమిస్తున్నాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను.” (కీర్త. 32:8) మనకు లభ్యమయ్యే ఆధ్యాత్మిక ఆహారాన్ని పూర్తిగా ఆరగించి, దానిలోని విషయాల్ని నెమరు వేసుకుంటామా? అలాచేస్తే, కష్టతరమైన ఈ అంత్యదినాల్లో మనం చక్కగా ఫలించే పచ్చని చెట్టులా ఉంటాం, ఆధ్యాత్మికంగా వాడిపోకుండా ఉండగలుగుతాం.—కీర్తన 1:1-3; 35:28; 119:97 చదవండి.

12. ఆధ్యాత్మిక ఏర్పాట్లను చిన్నచూపు చూడకూడదంటే మనమేమి చేయాలి?

12 ఆరోగ్యవంతమైన ఆధ్యాత్మిక ఏర్పాట్లు క్రమంగా జరగడం వెనకున్న కృషి గురించి కూడా ఆలోచిస్తే బావుంటుంది. సమాచారాన్ని పరిశోధించి, రాసి, మెరుగులు దిద్ది, చిత్రాలతో అలంకరించి, అనువదించి మన ప్రచురణల్లో, మన వెబ్‌సైట్‌లో అందించే పనంతటినీ పరిపాలక సభలోని రైటింగ్‌ కమిటీ పర్యవేక్షిస్తుంది. ముద్రణా పనిని చూసుకునే బ్రాంచి కార్యాలయాలు మన ప్రచురణల్ని అన్ని ప్రాంతాల్లోని సంఘాలకు చేరవేస్తాయి. ఇంతకీ ఈ పనంతా ఎందుకు జరుగుతోంది? యెహోవా ప్రజలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని పుష్టిగా అందించడానికే ఇదంతా! (యెష. 65:13) యెహోవా సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం.—కీర్త. 119:27.

సంస్థాగత ఏర్పాట్లకు మద్దతివ్వండి

13, 14. పరలోకంలో యెహోవా ఏర్పాట్లకు ఎవరు మద్దతిస్తున్నారు? భూమ్మీద అలాంటి మద్దతును మనమెలా ఇవ్వవచ్చు?

13 అపొస్తలుడైన యోహాను తనకు కలిగిన దర్శనంలో, దేవుని శత్రువుల మీద గెలుపొందడానికి యేసు ఓ తెల్లని గుర్రం మీద వస్తున్నట్లు చూశాడు. (ప్రక. 19:11-15) యేసు వెంట నమ్మకమైన దేవదూతలతోపాటు భూజీవితాన్ని నమ్మకంగా ముగించుకొని పరలోక బహుమానాన్ని పొందిన అభిషిక్తులు కూడా ఉన్నారని తెలుసుకోవడం మన విశ్వాసాన్ని ఎంత బలపరుస్తుంది! (ప్రక. 2:26, 27) యెహోవా ఏర్పాట్లకు మద్దతు ఇచ్చే విషయంలో వాళ్లంతా మనకు గొప్ప ఆదర్శం.

14 అలాగే, ఇంకా భూమ్మీద ఉండి, సంస్థకు నాయకత్వం వహిస్తున్న క్రీస్తు అభిషిక్త సహోదరులు చేస్తున్న పనికి గొప్పసమూహపు సభ్యులు పూర్తి మద్దతిస్తున్నారు. (జెకర్యా 8:23 చదవండి.) యెహోవా చేస్తున్న ఏర్పాట్లకు మన వంతు మద్దతును ఎలా ఇవ్వవచ్చు? ఒకటి, నాయకత్వం వహిస్తున్న వాళ్లకు లోబడి ఉండడం ద్వారా మనమలా చేయవచ్చు. (హెబ్రీ. 13:7, 17) అలా లోబడి ఉండడం అనేది మన స్థానిక సంఘం నుండే మొదలౌతుంది. సంఘ పెద్దల గురించి మనం మాట్లాడే మాటలు వాళ్లమీద, వాళ్ల పర్యవేక్షణ మీద గౌరవాన్ని పెంచుతున్నాయా? విశ్వాసంగల ఈ సహోదరులను గౌరవించమని, లేఖన సలహాల కోసం వాళ్లను సంప్రదించమని మన పిల్లల్ని ప్రోత్సహిస్తున్నామా? అదనంగా, ప్రపంచవ్యాప్త పనికి మద్దతు ఇచ్చేలా మన డబ్బును ఉపయోగించడం గురించి కుటుంబంగా కలిసి చర్చిస్తున్నామా? (సామె. 3:9; 1 కొరిం. 16:2; 2 కొరిం. 8:12) రాజ్యమందిరాన్ని మంచిస్థితిలో ఉంచేందుకు లభించే చక్కని అవకాశం ప్రాముఖ్యమైనదని ఎంచుతున్నామా? అలాంటి గౌరవం, ఐక్యత ఉన్న చోట యెహోవా తన పరిశుద్ధాత్మను ధారాళంగా దయచేస్తాడు. ఈ అంత్యదినాల్లో అలసిపోకుండా ఉండేందుకు కావాల్సిన సహాయాన్ని మనం పరిశుద్ధాత్మ ద్వారా పొందుతాం.—యెష. 40:29-31.

మన సందేశానికి తగినట్లుగా జీవించండి

15. యెహోవా గొప్ప సంకల్పానికి తగిన విధంగా జీవించడానికి మనం ఎందుకు అనుక్షణం పోరాడుతూనే ఉండాలి?

15 చివరిగా, మనం నమ్మకంగా ఉంటూ యెహోవా సంస్థతో కలిసి ముందుకు సాగడానికి, “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు” మన జీవితాల్ని మనం ప్రకటించే సందేశానికి అనుగుణంగా ఉంచుకోవాలి. (ఎఫె. 5:10, 11) మన అపరిపూర్ణ శరీరం, సాతాను ప్రయత్నాలు, ఈ దుష్ట లోకం వంటివాటి కారణంగా మనం చెడు ప్రభావాలతో అనుక్షణం పోరాడుతున్నాం. ప్రియ సహోదర సహోదరీల్లారా, మీలో కొందరు యెహోవాతో మీకున్న సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రతీరోజు తీవ్రమైన పోరాటం చేయాల్సి వస్తోంది. అది మిమ్మల్ని యెహోవాకు ప్రియాతిప్రియమైనవారిగా చేస్తుంది. కాబట్టి పట్టువిడువకండి! యెహోవా సంకల్పానికి తగిన విధంగా జీవిస్తే మనం గొప్ప సంతృప్తిని పొందుతాం, మన ఆరాధన వ్యర్థం కాకుండా చూసుకోగలుగుతాం.—1 కొరిం. 9:24-27.

16, 17. (ఎ) ఒకవేళ ఏదైనా ఘోరమైన పాపానికి పాల్పడితే, మనం ఏమి చేయాలి? (బి) అనూష ఉదాహరణ నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

16 ఒకవేళ ఏదైనా ఘోరమైన పాపానికి పాల్పడితే, మనమేమి చేయాలి? సాధ్యమైనంత తొందరగా సహాయాన్ని కోరండి. పాపాన్ని దాచిపెడితే పరిస్థితులు ఇంకా దారుణంగా తయారౌతాయి. తన పాపాల విషయంలో మౌనంగా ఉన్నప్పుడు, ‘దినమంతా తాను చేసిన ఆర్తధ్వనివలన తన ఎముకలు క్షీణించాయి’ అని దావీదు రాశాడు. (కీర్త. 32:3) రహస్యంగా చేసిన పాపాల్ని దాచిపెడితే మనం భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా నీరసించిపోతాం, కానీ ‘దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం.’—సామె. 28:13.

17 అనూష ఉదాహరణ పరిశీలించండి. a ఆమె కౌమారప్రాయంలో ఉన్నప్పుడు క్రమపయినీరుగా సేవ చేసింది. కానీ, మెల్లగా ఆమె ద్వంద్వ జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది. దానివల్ల ఆమెకు ఎంతో హాని జరిగింది. ఆమె ఇలా అంటోంది: “తప్పు చేస్తున్నాననే బాధతో నా మనస్సాక్షి సతమతమైంది. నేను ఎప్పుడూ దుఃఖంతో కృంగిపోయి ఉండేదాన్ని.” ఆమె ఏమి చేసింది? ఒకరోజు కూటంలో, యాకోబు 5:14, 15లోని మాటలను చర్చించినప్పుడు, తనకు సహాయం అవసరమని గుర్తించి, వెంటనే పెద్దల్ని సంప్రదించానని ఆమె అంది. అప్పుడు జరిగిన దాని గురించి ఆమె ఇలా చెబుతోంది: “ఆ లేఖనాలు నా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని బాగుచేయడానికి యెహోవా రాసి ఇచ్చిన మందుల్లా అనిపించాయి. ఆ మందులు మింగడానికి కష్టంగానే ఉన్నా, అవి స్వస్థత చేకూర్చాయి. ఆ లేఖనాల్లో ఉన్న సలహాలు పాటించాను, అవి బాగా పనిచేశాయి.” కొన్నేళ్లు గడిచాక, ఆమె మళ్లీ నూతన బలంతో, మంచి మనస్సాక్షితో ఉత్సాహంగా యెహోవా సేవ చేయడం మొదలుపెట్టింది.

18. మనం ఏ కృతనిశ్చయంతో ఉండాలి?

18 ఈ అంత్యదినాల్లో యెహోవా గొప్ప సంస్థలో ఉండే అవకాశం మనకు లభించడం ఓ అద్భుతమైన వరం! ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటిని ఎన్నడూ చిన్నచూపు చూడకూడదని గట్టిగా నిర్ణయించుకుందాం. మనం కుటుంబంగా స్థానిక సంఘంతో కలిసి యెహోవాను ఆరాధించేలా క్రమంగా కూటాలకు హాజరవ్వడానికి కృషిచేద్దాం, పరిచర్యలో యథార్థ హృదయం గలవాళ్లను ఆసక్తిగా కనుగొనడానికి ప్రయత్నిద్దాం, ఆధ్యాత్మిక ఆహారం క్రమంగా మనకు అందేలా జరుగుతున్న ఏర్పాట్లను అమూల్యంగా ఎంచుదాం. అంతేకాక మన మధ్య నాయకత్వం వహిస్తున్న వాళ్లకు మద్దతిద్దాం, మనం ప్రకటించే సందేశానికి అనుగుణంగా జీవిద్దాం. అలాచేస్తే మనం యెహోవా సంస్థతో కలిసి ముందుకు సాగుతాం, ఎన్నడూ అలసిపోకుండా మేలు చేస్తాం!

a అసలు పేరు కాదు.