కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని తీర్పులు క్రూరమైనవా?

దేవుని తీర్పులు క్రూరమైనవా?

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి, బైబిల్లోని రెండు సందర్భాల్లో దేవుడు తీర్చిన తీర్పుల గురించి క్లుప్తంగా చూద్దాం. అవి (1) నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం, (2) కనానీయుల నాశనం.

నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం

కొంతమంది ఇలా అంటారు: “నోవహును, అతని కుటుంబాన్ని తప్ప మిగతా మనుషులందరినీ జలప్రళయంలో నాశనం చేశాడు కాబట్టి దేవుడు చాలా క్రూరుడు.”

బైబిలు ఇలా చెబుతోంది: “దుర్మార్గుడు చస్తే నాకేమీ సంతోషం కలగదు. వారి విధానాలు వదలివేసి బ్రతికితేనే నాకు సంతోషం” అని దేవుడు అన్నాడు. (యెహెజ్కేలు 33:11, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అంటే, నోవహు కాలంలో దుష్టులు నాశనం అయినందుకు దేవుడు ఏమాత్రం సంతోషించలేదు. మరైతే, ఆయన ఎందుకు అలా చేశాడు?

దానికి సమాధానంగా, దేవుడు గతంలో భక్తిహీనులకు తీర్పు తీర్చినప్పుడు, ఆయన భవిష్యత్తులోని భక్తిహీనుల కోసం ఒక నమూనా ఉంచాడని బైబిలు చెబుతోంది. (2 పేతురు 2:5, 6) ఏమిటా నమూనా?

మొదటిగా, ప్రజల్ని నాశనం చేయడం తనకు బాధకలిగించినా, తోటి మనుషులను బాధపెట్టే క్రూరులను విడిచిపెట్టనని, ఆ పనులకు వాళ్లను బాధ్యుల్ని చేస్తానని దేవుడు చూపించాడు. సమయం వచ్చినప్పుడు ఆయన అన్యాయాల్నీ, బాధల్నీ పూర్తిగా రూపుమాపాడు.

రెండవదిగా, దేవుడు తీర్పును అమలు చేసే ముందు ప్రజలను ప్రేమతో హెచ్చరిస్తాడని కూడా అర్థం అవుతోంది. నోవహు నీతిని ప్రకటించాడు, కానీ చాలామంది దాన్ని పెడచెవినబెట్టారు. ‘జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు వాళ్లు ఎరుగక పోయిరి’ అని బైబిలు చెబుతోంది.—మత్తయి 24:39.

దేవుడు ఆ తర్వాత కూడా అదే నమూనాను పాటించాడా? అవును. ఉదాహరణకు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తమ చుట్టుపక్కల దేశాల్లోని ప్రజల్లా దుర్మార్గంగా ప్రవర్తిస్తే, వాళ్ల భూములను ఆక్రమించుకుని, వాళ్ల రాజధాని యెరూషలేమును నాశనం చేసి, వాళ్లను బంధీలుగా తీసుకుపోయే అవకాశం వాళ్ల శత్రువులకు ఇస్తానని దేవుడు హెచ్చరించాడు. కొంతకాలానికి, నిజంగానే ఇశ్రాయేలీయులు దుర్మార్గంగా ప్రవర్తించారు, చివరికి చిన్నపిల్లల్ని బలిగా అర్పించారు. యెహోవా చర్య తీసుకున్నాడా? తీసుకున్నాడు, అయితే దానికి ముందు ప్రవక్తల్ని తన ప్రజల దగ్గరకు పంపించి, పరిస్థితి చేయిదాటిపోకముందే మారమని వాళ్లను పదేపదే హెచ్చరించాడు. అంతేకాదు, ఆయనిలా మాటిచ్చాడు, “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.”—ఆమోసు 3:7.

ఇది మీరెందుకు తెలుసుకోవాలి? యెహోవా గతంలో తీర్పు తీర్చినప్పుడు అనుసరించిన పద్ధతి మనలో భవిష్యత్తు మీద ఆశను చిగురింపజేస్తోంది. తోటివాళ్లను బాధపెట్టే క్రూరులకు దేవుడు త్వరలోనే తీర్పు తీరుస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. బైబిలు చెబుతున్నట్లు, ‘కీడు చేయువారు నిర్మూలమగుదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.’ (కీర్తన 37:9-11) అలా మానవజాతిని బాధల నుండి విడిపించడానికి దేవుడు తీర్చబోయే తీర్పు దేనికి నిదర్శనం? క్రూరత్వానికా, కనికరానికా?

కనానీయుల నాశనం

కొంతమంది ఇలా అంటారు: “కనానీయుల నాశనం యుద్ధం ముసుగులో సాగిన మారణకాండ, అది ఈ రోజుల్లో జరిగే జాతినిర్మూలన వంటిదే.”

బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన [దేవుని] చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు.” (ద్వితీయోపదేశకాండము 32:4) దేవుని న్యాయ తీర్పులు, మనుషులు చేసే యుద్ధాల్లాంటివి కావు. ఎందుకు? ఎందుకంటే, దేవుడు మనిషి హృదయాన్ని చదవగలడు అంటే అతని అంతరంగాన్ని చూడగలడు. మనుషులకు అది అసాధ్యం.

ఉదాహరణకు సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చేయాలని దేవుడు నిర్ణయించినప్పుడు, ఆ తీర్పు న్యాయబద్ధంగా ఉండాలని నమ్మకస్థుడైన అబ్రాహాము కోరుకున్నాడు. న్యాయానికి కట్టుబడే తన దేవుడు “దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము” చేస్తాడనే తలంపే అబ్రాహామును ఎంతో కలవరపెట్టింది. అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఓపికగా మాట్లాడుతూ, సొదొమ పట్టణంలో కనీసం పదిమంది నీతిమంతులు ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేయనని హామీ ఇచ్చాడు. (ఆదికాండము 18:20-33) దేవుడు ఆ ప్రజల హృదయాలను పరిశీలించాడని, వాళ్ల దుష్టత్వం ఏ స్థాయిలో ఉందో గమనించాడని స్పష్టంగా తెలుస్తోంది.—1 దినవృత్తాంతములు 28:9.

కనానీయుల విషయంలో కూడా దేవుడు అలా న్యాయంగా తీర్పుతీర్చిన తర్వాతే వాళ్లను నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. కనానీయులు క్రూరత్వానికి పేరుగాంచారు, వాళ్లు పిల్లలను బతికుండగానే మంటల్లో వేసి దేవతలకు బలిచ్చేవాళ్లు. a (2 రాజులు 16:3) తమ దేశాన్ని స్వాధీనపర్చుకోమని ఇశ్రాయేలీయులకు యెహోవా ఆజ్ఞాపించినట్లు కనానీయులకు తెలుసు. తెలిసి కూడా మొండిగా అక్కడే ఉండి, యుద్ధానికి దిగిన ఆ కనానీయులు, ఇశ్రాయేలీయులతోనే కాదు వాళ్లకు అండగా ఉన్నానని అనేకసార్లు నిరూపించుకున్న యెహోవాతో కూడా తలపడ్డారు.

అయితే దుష్టత్వం విడిచిపెట్టి, యెహోవా ఇచ్చిన ఉన్నత నైతిక విలువల ప్రకారం జీవించడానికి ముందుకొచ్చిన కనానీయులను దేవుడు కనికరించాడు. రాహాబు అనే వేశ్యను, ఆమె కుటుంబాన్ని కాపాడడం అందుకు ఓ ఉదాహరణ. అదే విధంగా, తమను కనికరించమని కనానులోని గిబియోను నగరవాసులు వేడుకున్నప్పుడు దేవుడు వాళ్లను, వాళ్ల పిల్లలను కాపాడాడు.—యెహోషువ 6:25; 9:3, 24-26.

ఇది మీరెందుకు తెలుసుకోవాలి? దేవుడు కనానీయులకు తీర్పుతీర్చిన విధానం నుండి మనం ఓ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. ‘భక్తిహీనుల తీర్పు, నాశనం జరిగే దినాన్ని’ మనం అతి త్వరలో చూడబోతున్నాం. (2 పేతురు 3:7) మనం యెహోవాను ప్రేమిస్తే, ఆయన తన న్యాయ పరిపాలనను వ్యతిరేకించే వాళ్లను నాశనం చేసి, మనుషుల బాధల్ని పూర్తిగా తీసివేసినప్పుడు ప్రయోజనం పొందుతాం.

కనానీయులు క్రూరత్వానికి పేరుగాంచారు, వాళ్లు దేవుణ్ణి, ఆయన ప్రజల్ని మొండిగా వ్యతిరేకించారు

తల్లిదండ్రుల ఎంపికల మీద పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని యెహోవా ప్రేమగా గుర్తుచేస్తున్నాడు. దేవుని వాక్యం ఇలా అంటోంది: ‘మీరూ మీ సంతానమూ బ్రతికేలా జీవాన్ని కోరుకోండి. మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మాట వింటూ, ఆయనను ఏ మాత్రం విడవకుండా ఉండడం అనేదానిని కోరుకోండి.’ (ద్వితీయోపదేశకాండము 30:19, 20, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఇలా చెప్పే దేవుడు క్రూరుడా? లేక మనుషులను ప్రేమిస్తూ, వాళ్లు సరైన దారిలో నడవాలని కోరుకునే దయామయుడా? (w13-E 05/01)

a కనానీయులు తమ దేవతలకు పిల్లలను బలిచ్చేవాళ్లని చూపించే రుజువులు పురావస్తు శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో బయటపడ్డాయి.