కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు “సత్క్రియలయందు ఆసక్తి” చూపిస్తున్నారా?

మీరు “సత్క్రియలయందు ఆసక్తి” చూపిస్తున్నారా?

“యేసుక్రీస్తు . . . సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను.”—తీతు 2:13, 14.

1, 2. యెహోవాసాక్షులకు ఏ అపూర్వమైన గౌరవం దక్కింది? దాన్ని పొందడం గురించి మీకెలా అనిపిస్తోంది?

 ఏవైనా విశిష్టమైనవి సాధించినందుకు బహుమతి అందుకోవడాన్ని చాలామంది గొప్ప గౌరవంగా భావిస్తారు. ఉదాహరణకు, పొసగని గుంపుల మధ్య, విడిపోయిన జాతుల మధ్య శాంతి నెలకొల్పడానికి కృషి చేసిన కొందరు నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. అలాంటిది, సృష్టికర్తతో శాంతియుత సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి ప్రజలకు సహాయం చేసేందుకు తన రాయబారిగా వెళ్లమని దేవుడే పంపిస్తే ఇంకెంత గౌరవం!

2 ఆ అపూర్వమైన గౌరవం యెహోవాసాక్షులమైన మనకు మాత్రమే దక్కింది. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు మనల్ని నడిపిస్తుండగా మనం, “దేవునితో సమాధానపడుడని” ప్రజల్ని బతిమాలుతున్నాం. (2 కొరిం. 5:20) ప్రజల్ని తనవైపు ఆకర్షించేందుకు యెహోవా మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 235కన్నా ఎక్కువ దేశాల్లోని లక్షలాదిమందికి దేవునితో మంచి సంబంధం ఏర్పడి, వాళ్లు నిత్యజీవం పొందాలనే ఆశతో జీవించడానికి అదే కారణం. (తీతు 2:11) “ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా” పుచ్చుకోమని మనం ఎంతో ఆసక్తిగా ఆహ్వానిస్తాం. (ప్రక. 22:17) అమూల్యమైన ఆ బాధ్యతకు ఎంతో విలువనిస్తూ, దాన్ని అంకిత భావంతో నిర్వర్తిస్తాం కాబట్టి, మనం “సత్క్రియలయందాసక్తిగల” ప్రజలమని చెప్పవచ్చు. (తీతు 2:14) మనం సత్క్రియల్లో ఆసక్తి కలిగివుండడం వల్ల, ప్రజలు యెహోవాకు ఎలా దగ్గరౌతారో ఇప్పుడు చూద్దాం. అలా దగ్గరవడానికి తోడ్పడే ఒక మార్గం మన ప్రకటనా పని.

యెహోవాను, యేసును అనుకరిస్తూ ఆసక్తి చూపించండి

3. “యెహోవా ఆసక్తి” మనకు ఏ భరోసా ఇస్తుంది?

3 దేవుని కుమారుని పరిపాలన సాధించనున్నవాటి గురించి చెబుతూ, యెషయా 9:7 ఇలా అంటోంది: “సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.” మానవజాతిని రక్షించడానికి మన పరలోక తండ్రి పడుతున్న తపనను ఆ మాటలు స్పష్టంగా చూపిస్తున్నాయి. యెహోవాకున్న ఆసక్తిని చూస్తే, రాజ్యప్రచారకులుగా దేవుడు మనకు అప్పగించిన పనిని మనస్ఫూర్తిగా, ఉత్సాహంగా, ఆసక్తిగా చేయాలని అర్థమౌతుంది. దేవునికి దగ్గరయ్యేలా ప్రజలకు సహాయం చేయాలనే మన ఆకాంక్ష, ఆయన ఆసక్తికి ప్రతీక. కాబట్టి, దేవుని తోటి పనివాళ్లుగా మనం చేయగలిగినదంతా చేస్తూ సువార్త ప్రకటించే పనిలో పూర్తిగా పాలుపంచుకోవాలని తీర్మానించుకున్నామా?—1 కొరిం. 3:9.

4. పరిచర్యలో సడలని ఆసక్తి చూపించే విషయంలో యేసు మనకెందుకు ఆదర్శం?

4 యేసుకున్న ఆసక్తి గురించి కూడా ఆలోచించండి. ఆయన పరిచర్యలో సడలని ఆసక్తి చూపించి మనకు తిరుగులేని ఆదర్శంగా నిలిచాడు. తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా, వేదనకరమైన తన మరణం వరకు ఆయన ఆసక్తిగా ప్రకటించాడు. (యోహా. 18:36, 37) యేసు తనను తాను అర్పించుకునే సమయం దగ్గరపడేకొద్దీ, యెహోవాను తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయాలని మరింత బలంగా తీర్మానించుకున్నాడు.

5. యేసు ఏవిధంగా, తాను చెప్పిన అంజూరపు చెట్టు ఉపమానంలోని తోటమాలిలా పనిచేశాడు?

5 సా.శ. 32 శరదృతువులో యేసు ఓ ఉపమానం చెప్పాడు. అందులో ఆయన, మూడు సంవత్సరాలపాటు ఫలించని అంజూరపు చెట్టు గురించి మాట్లాడాడు. యజమాని తన తోటలోని ఆ చెట్టును నరికివేయమని చెప్పినప్పుడు, తోటమాలి దానికి ఎరువు పెట్టడానికి కొంత గడువు అడిగాడు. (లూకా 13:6-9 చదవండి.) యేసు చేసిన ప్రకటనా పనివల్ల కాసిన ఫలాలని పిలువదగ్గ శిష్యులు అప్పుడు కొద్ది మందే ఉన్నారు. అయితే ఆ ఉపమానంలో చెప్పినట్లు, యేసు మిగిలిన కొంత గడువును అంటే ఆరు నెలల కాలాన్ని యూదయ, పెరయ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రకటించడానికి ఉపయోగించాడు. యేసు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, తన సందేశాన్ని ‘విన్నా గ్రహింపని’ తోటి ఇశ్రాయేలీయుల గురించి విలపించాడు.—మత్త. 13:13-15; లూకా 19:41.

6. మనం ఎందుకు మరింత తీవ్రంగా ప్రకటనాపని చేయాలి?

6 అంతం అతి సమీపంలో ఉంది కాబట్టి, ప్రక టనాపనిని మరింత తీవ్రంగా చేయడం ప్రాముఖ్యం కాదా? (దానియేలు 2:41-45 చదవండి.) యెహోవాకు సాక్షులుగా ఉండడం ఎంతటి గొప్ప గౌరవం! ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడేవాళ్లు ఈ భూమ్మీద మనం తప్ప ఎవ్వరూ లేరు. ఓ వార్తాపత్రికలో వ్యాసకర్తగా పనిచేసే ఒకావిడ, “మంచివాళ్లకు చెడు ఎందుకు జరుగుతుంది?” అనే ప్రశ్నను సమాధానమివ్వడం సాధ్యంకాని ప్రశ్న అని సంబోధించింది. తెలుసుకోవడానికి ఇష్టపడే వాళ్లందరికీ అలాంటి ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న జవాబుల్ని తెలియజెప్పడం క్రైస్తవులుగా మన బాధ్యత, మనకు దక్కిన గౌరవం. దేవుడు అప్పగించిన ఈ బాధ్యతను “ఆత్మయందు తీవ్రతగలవారై” నెరవేర్చడానికి మనకెన్నో కారణాలున్నాయి. (రోమా. 12:11) యెహోవా అండదండలతో మనం ప్రకటనాపనిని ఆసక్తిగా చేసినప్పుడు యెహోవాను తెలుసుకోవడానికి, ఆయనను ప్రేమించడానికి ఇతరులకు సహాయం చేస్తాం.

స్వయంత్యాగ స్ఫూర్తి యెహోవాను ఘనపరుస్తుంది

7, 8. స్వయంత్యాగ స్ఫూర్తి యెహోవాను ఎలా ఘనపరుస్తుంది?

7 అపొస్తలుడైన పౌలులాగే, మనం కూడా పరిచర్య చేయడం వల్ల “జాగరములు,” “ఉపవాసములు” చేయాల్సిరావచ్చు. (2 కొరిం. 6:5) ఈ పదాలు, స్వయంత్యాగ స్ఫూర్తిని చక్కగా వర్ణిస్తున్నాయి. అంతేగాక వాటిని చదివినప్పుడు, తమను తాము పోషించుకుంటూ పరిచర్యకు మొదటి స్థానం ఇస్తున్న పయినీర్లు మన మదిలో మెదలవచ్చు. తమను తాము “పానార్పణముగా” చేసుకుని, అంకిత భావంతో ప్రజలకు సేవచేయడానికి వేరే దేశాలకు తరలి వెళ్లే మిషనరీల గురించి కూడా ఆలోచించండి. (ఫిలి. 2:17) యెహోవా గొర్రెలను చూసుకోవడానికి భోజనాన్ని, నిద్రను కూడా త్యాగం చేస్తూ కష్టపడుతున్న సంఘ పెద్దల మాటేమిటి? అనారోగ్యం వల్ల, వయసు పైబడడం వల్ల ఇబ్బందిపడుతున్నా, కూటాల్లో పరిచర్యలో పాల్గొనడానికి తమ చేతనైనదంతా చేస్తున్న ప్రచారకులు కూడా మన మధ్య ఉన్నారు. అలా స్వయంత్యాగ స్ఫూర్తితో దేవుణ్ణి సేవిస్తున్న వాళ్లను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయాలు ఉప్పొంగుతాయి. మన సహోదరులు చేస్తున్న కృషి వల్ల మన పరిచర్య మీద ఇతరులకు సదుద్దేశం ఏర్పడుతుంది.

8 సాక్షికాని ఓ పాఠకుడు, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని లింకన్‌షైర్‌ నగరం నుండి వెలువడే బోస్టన్‌ టార్గెట్‌ పత్రికకు ఇలా వ్రాశాడు: “రానురాను ప్రజలకు మతాల మీద నమ్మకం నీరుగారిపోతోంది . . . చర్చీ పరిచారకులు రోజంతా ఏం చేస్తున్నట్టు? ప్రజలను కలుసుకోవడానికి క్రీస్తు వెళ్లినట్లు వాళ్లు వెళ్లడం లేదు . . . బయటకు వెళ్లి, ప్రజల్ని కలుస్తూ, నిజంగా సత్యాన్ని ప్రకటిస్తున్న యెహోవాసాక్షుల మతానికి మాత్రమే ప్రజల గురించి పట్టింపు ఉన్నట్లు అనిపిస్తోంది.” సుఖభోగాల కోసం పరితపించేవాళ్లతో నిండిపోతున్న లోకంలో, మన స్వయంత్యాగ స్ఫూర్తి యెహోవాను ఎంతో ఘనపరుస్తుంది.—రోమా. 12:1.

మీరు పరిచర్య చేస్తూ కనిపిస్తే చాలు, చూసేవాళ్లకు అదే గొప్ప సాక్ష్యం

9. సత్క్రియల్లో ఆసక్తిని కాపాడుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

9 పరిచర్య విషయంలో మన ఆసక్తి సన్నగిల్లుతుందనిపిస్తే ఏమి చేయవచ్చు? ప్రకటనాపని ద్వారా యెహోవా ఏమి సాధిస్తున్నాడో ఆలోచిస్తే, అలాంటి పరిస్థితి నుండి బయటపడవచ్చు. (రోమీయులు 10:13-15 చదవండి.) యెహోవా నామం మీద విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే రక్షణ కలుగుతుంది. అయితే, ప్రజలు అలా ప్రార్థించాలంటే మనం ప్రకటించాలి. దీన్ని గ్రహించినప్పుడు సత్క్రియల్లో ఆసక్తిని కాపాడుకుని, రాజ్యసువార్తను ప్రకటించడంలో పట్టుదలగా కొనసాగవచ్చు.

చక్కని ప్రవర్తన ప్రజలను దేవునివైపు ఆకర్షిస్తుంది

మీ నిజాయితీని, కృషిని ఇతరులు తప్పక గమనిస్తారు

10. మన చక్కని ప్రవర్తన ప్రజలను యెహోవావైపు ఆకర్షిస్తుందని ఎందుకు చెప్పవచ్చు?

10 పరిచర్య చేయడానికి ఆసక్తి ఎంతో ప్రాముఖ్యమే అయినా, ప్రజల్ని దేవుని వైపు ఆకర్షించాలంటే మాత్రం అదొక్కటే సరిపోదు. దానికి కావాల్సిన రెండో అంశం, చక్కని క్రైస్తవ ప్రవర్తన. “మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక” అని రాసినప్పుడు మన ప్రవర్తన ఎంత ప్రాముఖ్యమో పౌలు స్పష్టంగా చూపించాడు. (2 కొరిం. 6:3) మేలుకరమైన మాటలు, సరైన ప్రవర్తన దైవిక బోధను అలంకరించి, ఇతరులను యెహోవా ఆరాధన వైపు ఆకర్షిస్తాయి. (తీతు 2:9, 10) అంతెందుకు, మనం క్రీస్తులా ప్రవర్తించడాన్ని యథార్థ హృదయంగల ప్రజలు గమనించినప్పుడు వచ్చిన సత్ఫలితాల గురించి మనం తరచూ వింటుంటాం.

11. మన ప్రవర్తన వల్ల వచ్చే ఫలితాల గురించి మనమెందుకు జాగ్రత్తగా ఆలోచించాలి?

11 మన ప్రవర్తనవల్ల మంచి జరిగినట్లే, చెడు కూడా జరగవచ్చు. అందుకే మనం ఉద్యోగ స్థలంలో, ఇంట్లో, పాఠశాలలో, అలా ఎక్కడైనా సరే మన పరిచర్యను, ప్రవర్తనను ఎవ్వరూ వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా చూసుకుంటాం. మనం కావాలని పాపం చేస్తుంటే, పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. (హెబ్రీ. 10:26, 27) దీన్ని మనసులో ఉంచుకుంటే మనం ఏమి చేస్తున్నామో, మన జీవిత విధానాన్ని చూసి ఇతరులు ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా పరిశీలించుకుంటాం. ఈ లోకపు నైతిక విలువలు దిగజారిపోయేకొద్దీ, “దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో” యథార్థహృదయులు మరింత స్పష్టంగా గమనిస్తారు. (మలా. 3:18) ప్రజల్ని దేవునితో సమాధానపర్చడానికి మన చక్కని ప్రవర్తన ఎంతో దోహదపడుతుందని నిశ్చయంగా చెప్పవచ్చు.

12-14. విశ్వాసం విషయంలో ఎదురయ్యే పరీక్షలను మనం సహించడం చూసినప్పుడు ఇతరులకు మన పరిచర్య మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? ఉదాహరణ చెప్పండి.

12 కొరింథీయులకు రాసిన ఉత్తరంలో పౌలు తనకు శ్రమలు, ఇబ్బందులు ఎదురయ్యాయని; తాను దెబ్బలు తిన్నానని; చివరకు చెరసాలలో కూడా గడిపానని చెప్పాడు. (2 కొరింథీయులు 6:4, 5 చదవండి.) మన విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు మనం చూపే ఓర్పు, ఇతరులను సత్యం వైపు ఆకర్షిస్తుంది. అంగోలా దేశంలో ఏమి జరిగిందో చూడండి. కొన్నేళ్ల క్రితం అక్కడ ఓ ప్రాంతంలో యెహోవాసాక్షుల్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ప్రయత్నించారు. ఇద్దరు ప్రచారకుల్ని, సత్యంపట్ల ఆసక్తితో కూటాలకు వస్తున్న మరో 30 మందిని వ్యతిరేకులు చుట్టుముట్టారు. తర్వాత అక్కడున్న జనాల్ని పోగుచేసి వాళ్లు చూస్తుండగా ఈ 32 మందిని రక్తం వచ్చేంత వరకు కొరడాలతో కొట్టారు. ఆడవాళ్లను, చిన్నపిల్లలను కూడా విడిచిపెట్టలేదు. యెహోవాసాక్షులు చెప్పేది వినడానికి కూడా ప్రజలు భయపడాలనే ఆ తతంగమంతా. కానీ అది జరిగాక, ఆ ప్రాంతంలోని చాలామంది తమతో బైబిలు అధ్యయనం చేయమని సాక్షుల్ని అడిగారు! అప్పటినుండి, ఆ ప్రాంతంలో రాజ్యసువార్త ప్రకటనాపని ముందుకు సాగి, గణనీయమైన అభివృద్ధి, ఎన్నో ఆశీర్వాదాలు వచ్చాయి.

13 మనం బైబిలు సూత్రాలకు స్థిరంగా కట్టుబడి ఉండడం వల్ల ఎంత మంచి ఫలితాలు వస్తాయో ఆ సంఘటన చూపిస్తోంది. పేతురుతో పాటు, ఇతర అపొస్తలులు చూపిన ధైర్యం, దేవునితో సమాధానపడడానికి ఎంతమందిని నడిపించిందో మనకు తెలీదు. (అపొ. 5:17-29) అలాగే మనం కూడా ఆరునూరైనా సరైనది చేస్తే మన తోటి విద్యార్థులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు సత్యంవైపు ఆకర్షితులవ్వొచ్చు.

14 ప్రతీక్షణం మన సహోదరులు ఎక్కడో ఓ చోట హింసలకు గురౌతూనే ఉన్నారు. మచ్చుకు, ఆర్మేనియా దేశంలో క్రైస్తవ తటస్థత కారణంగా దాదాపు 40 మంది సహోదరులను జైల్లో వేశారు. రానున్న నెలల్లో మరెందరినో నిర్బంధించే అవకాశం ఉంది. ఎరిట్రియ దేశంలో 55 మంది యెహోవా సేవకుల్ని జైల్లో పెట్టారు. వాళ్లలో, 60 ఏళ్లు పైబడిన వాళ్లు కూడా ఉన్నారు. దక్షిణ కొరియాలో సుమారు 700 మంది సాక్షులు తమ విశ్వాసాన్ని బట్టి జైల్లో మగ్గుతున్నారు. అక్కడ 60 ఏళ్లుగా ఇదే పరిస్థితి. వివిధ దేశాల్లోని మన సహోదరులు హింసలు పడుతున్నా విశ్వాసం చూపిస్తున్నారు. అది దేవునికి ఘనతను తీసుకురావాలని, సత్యారాధన పక్షాన నిలబడేలా నీతిని ప్రేమించేవాళ్లకు సహాయం చేయాలని ప్రార్థిద్దాం.—కీర్త. 76:8-10.

15. మన నిజాయితీని చూసి కూడా ప్రజలు సత్యం వైపు ఆకర్షితులౌతారని రుజువు చేసే అనుభవం చెప్పండి.

15 మన నిజాయితీని చూసి కూడా ప్రజలు సత్యం వైపు ఆకర్షితులు కావచ్చు. (2 కొరింథీయులు 6:4, 5, 7, 8 చదవండి.) ఈ అనుభవాన్ని చూడండి: ప్రయాణించేది కొంతదూరమే కాబట్టి టికెట్టు తీసుకోవాల్సిన అవసరంలేదని ఓ పరిచయస్థురాలు చెప్తున్నా మన సహోదరి ఒకామె టికెట్టు మెషీన్‌లో డబ్బులు వేసి బస్సు టికెట్టు తీసుకుంది. పక్క స్టాపువరకు ప్రయాణిస్తున్నా టికెట్టు తీసుకోవడమే సరైనదని ఆ సహోదరి వివరించింది. ఆ తర్వాత, ఆమె స్నేహితురాలు బస్సు దిగిపోయింది. ఇదంతా వింటున్న ఆ బస్సు డ్రైవరు మన సహోదరిని, “మీరు యెహోవాసాక్షా?” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఎందుకలా అడిగారు?” అంది. అందుకు ఆ డ్రైవరు, “బస్సు టికెట్టు తీసుకోవడం గురించి మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్నాను, అంత ఖచ్చితంగా ఉండే చాలాకొద్దిమందిలో యెహోవాసాక్షులు ఉన్నారని, వాళ్లు అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటారని నాకు తెలుసు” అన్నాడు. కొన్ని నెలలు గడిచాక, ఓ కూటంలో ఆ సహోదరిని పలకరించిన ఓ వ్యక్తి ఇలా అన్నాడు, “మీకు నేను గుర్తున్నానా? ఆ రోజు, టికెట్టు తీసుకోవడం గురించి మీతో మాట్లాడిన బస్సు డ్రైవరును నేనే. మీ ప్రవర్తన చూసి, యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలని అప్పుడే అనుకున్నాను.” మన నిజాయితీయే మనల్ని నమ్మకమైన పరిచారకులుగా నిలబెడుతుంది.

ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపర్చే లక్షణాలు చూపించండి

16. దీర్ఘశాంతం, ప్రేమ, దయ వంటి లక్షణాలు ప్రజలను ఎందుకు ఆకట్టుకుంటాయి? ఉదాహరణ చెప్పండి.

16 దీర్ఘశాంతం, ప్రేమ, దయ వంటి లక్షణాలు చూపించినప్పుడు ప్రజల్ని యెహోవాకు దగ్గర చేసే పనిలో మనమూ పాల్గొంటాం. మనల్ని గమనించే కొంతమంది యెహోవా గురించి, ఆయన సంకల్పాల గురించి, ఆయన ప్రజల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడవచ్చు. ఆలోచనా తీరు, ప్రవర్తన విషయంలో నిజ క్రైస్తవులకు, భక్తిపరుల్లా నటించే వాళ్లకు మధ్యవున్న తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కొంతమంది మతనాయకులు, తమ దగ్గరకొచ్చే జనాల్ని మోసం చేసి సంపాదించిన డబ్బుతో కోట్లకు పడగలెత్తారు, విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన వాహనాలు కొనుక్కున్నారు. ఒకాయనైతే ఏకంగా కుక్కలబోనుకే ఏ.సీ. పెట్టించాడు. నిజం చెప్పాలంటే, క్రీస్తు అనుచరులమని చెప్పుకునే చాలామందికి ‘ఉచితంగా ఇవ్వాలనే’ ఆలోచన ఏ కోశానా ఉండదు. (మత్త. 10:8) బదులుగా, పూర్వకాల ఇశ్రాయేలులోని భ్రష్టుపట్టిన యాజకుల్లానే ఈ మతనాయకులు కూడా ‘కూలికి బోధిస్తారు,’ అందులోనూ వాళ్లు ఎక్కువగా లేఖనాలకు విరుద్ధమైనవే నేర్పిస్తారు. (మీకా 3:11) అలాంటి బూటకపు ప్రవర్తన, ప్రజలకు దేవునితో సమాధానపడే అవకాశాన్ని కల్పించదు.

17, 18. (ఎ) మనం యెహోవా లక్షణాలను చూపించినప్పుడు ఆయనను ఎలా ఘనపర్చవచ్చు? (బి) ఆసక్తిగా సత్క్రియలు చేస్తూ ఉండాలని మీరెందుకు తీర్మానించుకున్నారు?

17 బూటకపు మతనాయకులకు భిన్నంగా నిజక్రైస్తవులు చేసే బోధలు, పొరుగువాళ్ల కోసం వాళ్లు చేసే మంచి పనులు ప్రజల హృదయాలను ఆకట్టుకుంటాయి. ఒక సందర్భంలో, ఇంటింటి పరిచర్య చేస్తున్న మన సహోదరుడు ఓ ఇంటికి వెళ్లగానే, ఆ ఇంట్లోని వృద్ధ విధవరాలు ఆయనను వెళ్లిపొమ్మంది. ఆయన డోర్‌బెల్‌ కొట్టినప్పుడు, తను వంటగదిలో బల్బు బిగించడానికి నిచ్చెన మీద నిలబడ్డానని చెప్పింది. అందుకు మన సహోదరుడు, “అది మీరొక్కరే చేయడం అంత సురక్షితం కాదు” అన్నాడు. ఆ తర్వాత ఆ పయినీరు బల్బు మార్చి తన దారిన వెళ్లిపోయాడు. జరిగినదాన్ని తెలుసుకున్న ఆ విధవరాలి కొడుకు, ఎంతో ముగ్ధుడై ఆ సహోదరుడికి కృతజ్ఞతలు తెలపడానికి ఆయన కోసం వెదికాడు. కొంతకాలానికి ఆయన బైబిలు అధ్యయనం మొదలుపెట్టాడు.

18 సత్క్రియలు చేస్తూనే ఉండాలని మీరెందుకు తీర్మానించుకున్నారు? పరిచర్యలో ఆసక్తిగా కొనసాగుతూ, దేవుని చిత్తాన్ని చేస్తుంటే యెహోవాను ఘనపరుస్తామని, రక్షణపొందేలా ఇతరులకు సహాయం చేయగలమని బహుశా మీరు అర్థంచేసుకుని ఉంటారు. (1 కొరింథీయులు 10:31-33 చదవండి.) దేవుని పట్ల, తోటి మానవుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేయాలనే కోరిక మనలో ఉబికినప్పుడు మనం ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తాం, దేవునికిష్టమైన విధంగా ప్రవర్తిస్తాం. (మత్త. 22:37-39) ఆసక్తిగా సత్క్రియలు చేస్తే అంతులేని ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాం. అంతేకాదు, మనుష్యులందరూ సత్యారాధన పట్ల ఆసక్తితో మన సృష్టికర్తయైన యెహోవాను ఘనపర్చే రోజు కోసం సంతోషంగా వేచిచూస్తాం.