కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కని సంభాషణతో మీ వివాహ బంధాన్ని పటిష్ఠం చేసుకోండి

చక్కని సంభాషణతో మీ వివాహ బంధాన్ని పటిష్ఠం చేసుకోండి

“సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.”—సామె. 25:11.

1. చక్కని సంభాషణ వల్ల కొందరు భార్యాభర్తలు ఎలా ప్రయోజనం పొందారు?

 కెనడాకు చెందిన ఓ సహోదరుడు ఇలా అన్నాడు: “ఇతరులతో గడిపే సమయంతో పోలిస్తే నా భార్యతోనే నేను ఎక్కువ సమయం గడుపుతాను. ఏదైనా సంతోషకరమైన విషయాన్ని తనతో పంచుకున్నప్పుడు నా ఆనందం రెట్టింపౌతుంది, బాధను పంచుకున్నప్పుడు నా బాధ సగానికి సగం తగ్గిపోతుంది.” ఆస్ట్రేలియాలోని ఓ భర్త ఇలా అన్నాడు: “మేము కలిసి గడిపిన ఈ 11 ఏళ్లలో, నా భార్యతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడవలేదు. మా వివాహ పటిష్ఠత గురించి నాకు, మా ఆవిడకు ఎలాంటి భయం గానీ చింత గానీ లేదు. మేమెప్పుడూ మనసువిప్పి మాట్లాడుకోవడం వల్లే అది సాధ్యమైంది.” కోస్టరికాలోని ఓ సహోదరి ఇలా అంది: “చక్కని సంభాషణ మా బంధానికి వన్నె తేవడమే కాక మమ్మల్ని యెహోవాకు దగ్గర చేసింది, శోధనల నుండి తప్పించింది, మా మధ్య ఉన్న అన్యోన్యతను, ప్రేమను కూడా పెంచింది.”

2. ఏ కారణాలవల్ల భార్యాభర్తలు చక్కగా సంభాషించుకోలేకపోవచ్చు?

2 మీరు, మీ జీవిత భాగస్వామి ఆహ్లాదకరంగా సంభాషించుకోగలుగుతున్నారా? లేక అర్థవంతంగా సంభాషించుకోవడం కష్టమనిపిస్తోందా? పెళ్లంటే భిన్నమనస్తత్వాలు గల ఇద్దరు అపరిపూర్ణ మనుష్యుల కలయిక కాబట్టి, అప్పడప్పుడు సమస్యలు రావడం సహజమే. పైగా వాళ్లవాళ్ల సంస్కృతి, పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా తేడాలుంటాయి. (రోమా. 3:23) అంతేకాక, వాళ్లు మాట్లాడే తీరు కూడా చాలా భిన్నంగా ఉండవచ్చు. వివాహ జీవితం గురించి పరిశోధన చేసే జాన్‌ ఎం. గాట్మన్‌, నాన్‌ సిల్వర్‌ ఇలా అన్నారు: “వివాహ బంధం చిరకాలం నిలవాలంటే ఒడిదుడుకుల్లో నిలదొక్కుకునే తత్వం, ధైర్యం, కృతనిశ్చయం ఉండాలి.”

3. కొందరు భార్యాభర్తలు తమ వివాహ బంధాన్ని ఎలా పటిష్ఠం చేసుకోగలిగారు?

3 వివాహం విజయవంతం కావాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ, దానివల్ల అంతులేని ఆనందం సొంతమౌతుంది. ఒకరినొకరు ప్రేమించుకునే భార్యాభర్తలు జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. (ప్రసం. 9:9) ఉదాహరణకు, ఇస్సాకు రిబ్కాల వివాహ బాంధవ్యాన్నే తీసుకోండి. (ఆది. 24:67) పెళ్లయి కొన్నేళ్లు గడిచిన తర్వాత కూడా వాళ్ల మధ్య ఉన్న అనురాగం చెక్కుచెదరలేదని లేఖనాలు చూపిస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా చాలామంది దంపతులు అలాగే ఉన్నారు. దానికి రహస్యం? వివేచన, ప్రేమ, ప్రగాఢ గౌరవం, వినయం వంటి లక్షణాల్ని పెంపొందించుకోవడం ద్వారా వాళ్లు తమ భావాల గురించి, భావోద్వేగాల గురించి దాపరికంలేకుండా, నొప్పించకుండా మాట్లాడుకోవడం నేర్చుకున్నారు. భార్యాభర్తలు ఇలాంటి ముఖ్యమైన లక్షణాల్ని చూపిస్తే, వాళ్ల మధ్య సంభాషణకు అంతరాయమనేదే ఉండదని మనం తర్వాతి పేరాల్లో చూస్తాం.

వివేచన కనబర్చండి

4, 5. ఒకరినొకరు మరింత బాగా అర్థంచేసుకోవడానికి వివేచన ఎలా తోడ్పడుతుంది? ఉదాహరణలు ఇవ్వండి.

4 “వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును” అని సామెతలు 1:5 చెబుతోంది. ఆ మాటలు వివాహానికి, కుటుంబ జీవితానికి కూడా సరిగ్గా సరిపోతాయి. (సామెతలు 24:3 చదవండి.) వివేకాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే విషయంలో దేవుని వాక్యానికి ఏదీ సాటిరాదు. ఆదికాండము 2:18 ప్రకారం దేవుడు, స్త్రీని పురుషునికి సాటియైన సహాయంగా సృష్టించాడు. అయితే వాళ్లను నిర్మించిన రీతిలో ఎంతో కొంత వ్యత్యాసం ఉంది. స్త్రీ మాట్లాడే తీరులోనే ఆమె పాత్ర ఏమిటో అర్థమౌతుంది. సాధారణంగా స్త్రీలు తమ భావాల గురించి, ప్రజల గురించి, బాంధవ్యాల గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు. తమను ప్రేమిస్తున్నామని చూపించేలా ఆప్యాయంగా మాట్లాడితే వాళ్లకు నచ్చుతుంది. మరోవైపున, పురుషులు సామాన్యంగా తమ భావాల గురించి మాట్లాడడానికి ఇష్టపడరు కానీ తమ పనుల గురించి, సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి మాట్లాడడానికి మొగ్గుచూపుతారు. అంతేకాదు, ఇతరులు తమను గౌరవించాలని కోరుకుంటారు.

5 బ్రిటన్‌కు చెందిన ఓ సహోదరి ఇలా అంది: “మా ఆయన నేను చెప్పేది పూర్తిగా వినే బదులు చిటికెలో సమస్యల్ని పరిష్కరించాలని చూస్తుంటాడు. కానీ అది నాకు చాలా చిరాకు పుట్టిస్తుంది. నిజానికి నేను సమస్య గురించి చెబుతున్నప్పుడు నాకు కావాల్సిందల్లా కాసింత సానుభూతి మాత్రమే.” ఓ భర్త ఇలా రాశాడు: “పెళ్లయిన కొత్తలో, నా భార్య ఏదైనా సమస్య గురించి చెప్పిన వెంటనే దానికి సత్వర పరిష్కారం ఇవ్వాలని చూసేవాణ్ణి. అయితే, ఆమెకు కావాల్సింది పరిష్కారం కాదనీ తన బాధ వినడమేననీ నాకు ఆ తర్వాత అర్థమైంది.” (సామె. 18:13; యాకో. 1:19) వివేచన కనబర్చే భర్త తన భార్య మనసును అర్థం చేసుకొని, సమస్యను పరిష్కరించే పద్ధతిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాక, ఆమె మనోభావాలు తనకు ముఖ్యమని ఆయన అభయమిస్తాడు. (1 పేతు. 3:7) ఆమె కూడా తన భర్త అభిప్రాయాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. భార్యాభర్తలిద్దరూ లేఖనాల్లో ఉన్న తమ బాధ్యతల్ని అర్థంచేసుకొని వాటిని చక్కగా నిర్వర్తించినప్పుడు వాళ్ల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాక, వాళ్లిద్దరూ కలిసి సత్ఫలితాలనిచ్చే జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

6, 7. (ఎ) భార్యాభర్తలు వివేచన కనబర్చడానికి ప్రసంగి 3:7లోని సూత్రం ఏ విధంగా సహాయం చేస్తుంది? (బి) భార్య ఎలా వివేచనను కనబర్చవచ్చు? భర్త ఏమి చేయడానికి ప్రయత్నించాలి?

6 ‘మౌనముగా నుండుటకు, మాటలాడుటకు సమయము కలదు’ అని వివేచన కనబర్చే దంపతులకు తెలుసు. (ప్రసం. 3:1, 7) పదేళ్ల క్రితం పెళ్లయిన ఓ సహోదరి ఇలా అంది: “కొన్ని సమయాల్లో సమస్య గురించి ఎత్తకపోవడమే మంచిదని నాకు అర్థమైంది. మా ఆయన తన ఉద్యోగం, తదితర బాధ్యతల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు నేను గమనిస్తే, కాస్త సమయం గడిచేంతవరకు నేను ఆయన ముందు కొన్ని విషయాలు ప్రస్తావించను. దానివల్ల మా సంభాషణ చాలా సాఫీగా సాగుతోంది.” బాగా ఆలోచించి ‘సమయోచితంగా పలికే మాటకున్న’ విలువను గుర్తించి వివేచన గల భార్యలు దయగా మాట్లాడతారు.—సామెతలు 25:11 చదవండి.

చిన్నచిన్న పనులే వివాహ జీవితంలో పెద్దపెద్ద సంతోషాల్ని తెస్తాయి

7 ఓ క్రైస్తవ భర్త తన భార్య మాట్లాడుతున్నప్పుడు వినడమే కాకుండా ఆయన మనసులోని భావాల్ని కూడా స్పష్టంగా వ్యక్తం చేయడానికి ప్రయత్నించాలి. గత 27 ఏళ్లుగా వివాహితుడిగా ఉన్న ఓ సంఘపెద్ద ఇలా అన్నాడు: “నా హృదయాంతరాల్లో ఉన్నవి నా భార్యకు చెప్పే విషయంలో నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది.” 24 ఏళ్ల క్రితం పెళ్లయిన మరో సహోదరుడు ఇలా అంటున్నాడు: “‘ఇప్పుడు దీని గురించి మాట్లాడకపోతేనే మంచిది, దానంతటదే సర్దుకుపోతుందిలే’ అనుకుంటూ ఏదీ బయటకు చెప్పేవాణ్ణికాదు. కానీ, మనసులో ఉన్నదాని గురించి మాట్లాడడం ఓ బలహీనత కాదని నేను గుర్తించాను. ఏదైనా విషయం మాట్లాడడం గురించి తర్జనభర్జన పడుతున్నప్పుడు నేను సరైన పదాల కోసం, సరైన పద్ధతి కోసం ప్రార్థిస్తాను. ఆ తర్వాత గట్టిగా శ్వాస తీసుకొని, మాట్లాడడం మొదలుపెడతాను.” ఏదైనా మాట్లాడాలంటే అనువైన సందర్భం కూడా అవసరమే. బహుశా, భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు అంటే దినవచనం చూస్తున్నప్పుడు లేదా బైబిలు చదువుతున్నప్పుడు ఆయా విషయాల గురించి మాట్లాడుకోవచ్చు.

8. వివాహ జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి క్రైస్తవ దంపతులకు ఎలాంటి అదనపు సహాయం అందుబాటులో ఉంది?

8 భార్యాభర్తలు చక్కగా సంభాషించుకోవాలంటే, వాళ్లిద్దరికీ సంభాషణా తీరును మెరుగుపర్చుకోవాలనే తపన ఉండాలి, దానికోసం ప్రార్థించాలి. పాత పద్ధతుల్ని మార్చుకోవడం కష్టమన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. నేటి లోకంలో చాలామంది దంపతులు అవసరమైన మార్పులు చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ, భార్యాభర్తలు యెహోవాను ప్రేమిస్తూ, ఆయన పరిశుద్ధాత్మ సహాయం కోసం వేడుకుంటూ, తమ బంధాన్ని పవిత్రమైనదిగా ఎంచినప్పుడు తమలో ఆ ఇష్టం కలుగుతుంది. 26 ఏళ్లుగా వివాహితురాలిగా ఉన్న ఓ సహోదరి ఇలా అంది: “వివాహ జీవితానికి సంబంధించి నేను, మా ఆయన యెహోవాకున్న అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి, విడిపోవడమనే ఊసే మేము ఎత్తం. దానివల్ల, మేమిద్దరం కలిసి చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవడానికి ఇంకా ఎక్కువగా కృషి చేయగలుగుతున్నాం.” అలాంటి నమ్మకత్వం, దైవభక్తి మన దేవుడైన యెహోవాకు నచ్చుతాయి, ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొస్తాయి.—కీర్త. 127:1.

ప్రేమను పెంచుకోండి

9, 10. ఏయే విధాలుగా భార్యాభర్తలు తమ వివాహ బంధాన్ని పటిష్ఠం చేసుకోవచ్చు?

9 భార్యాభర్తలు “పరిపూర్ణతకు అనుబంధమైన” ప్రేమను చూపించడం అత్యంత ప్రాముఖ్యం. (కొలొ. 3:14) జీవితంలోని సుఖదుఃఖాలను కలిసి అనుభవిస్తున్నప్పుడు, నమ్మకమైన భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ వృద్ధి చెందుతుంది. దానివల్ల, వాళ్లు ఒకరికొకరు ప్రియాతిప్రియమైన నేస్తాలౌతారు, ఎప్పుడూ కలిసి సమయం గడపాలని కోరుకుంటారు. అదంతా జరగాలంటే, సినిమాల్లో చూపించినట్లు ఎప్పుడో ఒకసారి చేసే గొప్ప పనులు సరిపోవు. లెక్కలేనన్ని చిన్నచిన్న విషయాలే తమ జీవితాన్ని పచ్చగా ఉంచుతాయి. ఉదాహరణకు హత్తుకోవడం, మెచ్చుకోవడం, ఓ కార్డు/పువ్వు లాంటివి ఇవ్వడం, అనురాగం ఒలికే చిరునవ్వు చిందించడం, లేదా ‘ఇవాళ నీ పని ఎలా జరిగింది?’ అని అడగడం వంటి చిన్నచిన్న పనులు వివాహ జీవితంలో పెద్దపెద్ద సంతోషాల్ని తెస్తాయి. గత 19 ఏళ్లుగా వివాహ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్న ఓ భర్త, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవడానికి తాము ఇప్పటికీ, రోజులో కొన్నిసార్లయినా ఫోను చేసుకుంటామని లేదా మెసేజీలు పంపించుకుంటామని తెలిపాడు.

10 ప్రేమ ఉంటే భార్యాభర్తలు ఒకరినొకరు మరింత బాగా అర్థంచేసుకోవడానికి ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు. (ఫిలి. 2:4) దానివల్ల, అపరిపూర్ణతలున్నా తమ మధ్య ప్రేమ మరింత బలోపేతం అవుతుంది. వివాహ జీవితం విజయవంతం కావడం అనేది ఒక్కరోజులో, ఒక్కపనితో ఆగిపోయేది కాదు, ఆ బంధం పటిష్ఠం అవుతూనే ఉంటుంది. కాబట్టి, మీకు పెళ్లయి ఉంటే ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘నా భార్య/భర్త గురించి నాకు ఎంత బాగా తెలుసు? ఆయా విషయాల గురించి మా ఆయన/ఆవిడ మనసులోని మాటను నేను అర్థంచేసుకుంటున్నానా? నేను చేసుకున్న వ్యక్తి గురించి నేనెంత తరచుగా ఆలోచిస్తాను? బహుశా మొదట్లో నన్ను ఆకట్టుకున్న లక్షణాలను గుర్తుచేసుకుంటూ ఉంటానా?’

గౌరవించడం నేర్చుకోండి

11. వివాహ జీవితం విజయవంతం కావాలంటే భార్యాభర్తల మధ్య గౌరవం ఎందుకు ఉండాలి? ఉదాహరణ చెప్పండి.

11 అత్యంత సంతోషంగా ఉండే దంపతులు కూడా అన్ని విషయాల్ని ఒకేలా ఆలోచించకపోవచ్చు. ప్రేమగల దంపతుల మధ్య కూడా అభిప్రాయభేదాలు వస్తుంటాయి. ఉదాహరణకు, అబ్రాహాము శారాల మధ్య అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు పొడచూపాయి. (ఆది. 21:9-11) అయినా, వాటివల్ల వాళ్ల బంధం బీటలువారలేదు. ఎందుకంటే, వాళ్లు ఒకరిపట్ల ఒకరు గౌరవమర్యాదలు చూపించుకున్నారు. కొన్ని సందర్భాల్లో శారాతో మాట్లాడేటప్పుడు అబ్రాహాము, “దయచేసి” అనే మాటను ఉపయోగించాడు. (ఆది. 12:13) శారా కూడా అబ్రాహాముకు లోబడుతూ, ఆయనను తన ‘యజమానిగా’ పరిగణించేది. (ఆది. 18:12) భార్యాభర్తల మధ్య గౌరవం లోపించినప్పుడు, అది వాళ్లు మాట్లాడే తీరులో, స్వరంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. (సామె. 12:18) ఆ సమస్య గురించి మాట్లాడుకోకపోతే, వివాహ బంధానికి ముప్పు వాటిల్లవచ్చు.—యాకోబు 3:7-10, 17, 18 చదవండి.

12. కొత్తగా పెళ్లయిన వాళ్లు గౌరవపూర్వకంగా మాట్లాడడానికి ఎందుకు ప్రత్యేకంగా కృషి చేయాలి?

12 కొత్తగా పెళ్లయిన వాళ్లు ఒకరితో ఒకరు దయగా, గౌరవపూర్వకంగా మాట్లాడడానికి ప్రత్యేకమైన కృషి చేయాలి. అప్పుడే వాళ్లు ఒకరితో ఒకరు అరమరికలు, దాపరికాలు లేకుండా మాట్లాడుకునే వాతావరణం నెలకొంటుంది. ఓ భర్త ఇలా అంటున్నాడు: “పెళ్లయిన తొలి సంవత్సరాల్లో ఎన్ని సంతోషాలున్నా, కొన్నిసార్లు విసుగు తెప్పించే పరిస్థితులు ఉండనే ఉంటాయి. మీరు మీ భార్య మనసును, అలవాట్లను, అవసరాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అలాగే ఆమె మిమ్మల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పరిస్థితి అంత సజావుగా ఏమీ ఉండకపోవచ్చు. అయితే, మీరు సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుంటూ, కాస్త హాస్యాన్ని పండిస్తూ, అలాగే వినయం, ఓర్పు, యెహోవాపై నమ్మకం వంటి చక్కటి లక్షణాలను చూపిస్తే మీ మధ్య సడలని బంధం ఏర్పడుతుంది.” అది అక్షర సత్యం కాదంటారా!

మనస్ఫూర్తిగా వినయం చూపించండి

13. వివాహ జీవితం సంతోషంగా, సాఫీగా సాగాలంటే వినయం ఎందుకు అవసరం?

13 దంపతుల మధ్య జరిగే చక్కని సంభాషణ తోటలో ప్రశాంతంగా పారే పిల్లకాలువ లాంటిది. అది నిరాటంకంగా సాగాలంటే భార్యాభర్తలు ‘వినయమనస్కులై’ ఉండాలి. (1 పేతు. 3:8) పెళ్లయి 11 ఏళ్లయిన ఓ సహోదరుడు ఇలా అన్నాడు: “భేదాలు సమసిపోవడానికి వినయానికి మించిన దగ్గరి తోవ లేదు. ఎందుకంటే, అది ఉన్నప్పుడు మీరు సత్వరమే ‘క్షమించు’ అని అడగగలుగుతారు.” 20 ఏళ్లుగా సంతోషంగా వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఓ సంఘపెద్ద ఇలా అన్నాడు: “కొన్ని సందర్భాల్లో, ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పడం కన్నా ‘క్షమించు’ అని అడగడమే మరింత ప్రాముఖ్యం. దానికి కావాల్సిన వినయాన్ని సంపాదించుకోవడానికి అత్యంత దగ్గరి దారుల్లో ప్రార్థన ఒకటి. నేను, మా ఆవిడ కలిసి యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు మా అపరిపూర్ణత, అలాగే దేవుని కృప మాకు గుర్తుకొస్తాయి. ఆ చిన్న జ్ఞాపికే సరైన కోణంలో ఆలోచించేందుకు నాకు తోడ్పడుతుంది.”

వివాహ జీవితంలో చక్కగా సంభాషించుకుంటూ ఉండండి

14. గర్వం వివాహ బంధాన్ని ఎలా దెబ్బతీస్తుంది?

14 అయితే గర్వం మాత్రం, సామరస్యంగా ఉండడానికి ససేమిరా తోడ్పడదు. అది క్షమాపణ అడగాలన్న కోరికగానీ, దానికి కావాల్సిన ధైర్యంగానీ లేకుండా చేస్తుంది కాబట్టి అది సంభాషణకు పెద్ద అవాంతరంగా నిలుస్తుంది. గర్విష్ఠి అయిన వ్యక్తి, తాను చేసిన తప్పుకు “నన్ను క్షమించు” అని అడగాల్సిందిపోయి కుంటి సాకులు చెబుతాడు. అలాంటి వాళ్లు తమ బలహీనతను ధైర్యంగా ఒప్పుకునే బదులు ఇతరుల తప్పుల్ని వేలెత్తి చూపిస్తారు. ఎవరైనా తమను నొప్పిస్తే వాళ్లతో సమాధానపడాల్సింది పోయి కఠినమైన మాటలతో పగ తీర్చుకుంటారు లేదా మౌనాన్ని ఆయుధంగా వాడతారు. (ప్రసం. 7:9) అవును, గర్వం వివాహ బంధానికి నిప్పు అంటించవచ్చు. “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవడం శ్రేయస్కరం.—యాకో. 4:6.

15. ఎఫెసీయులు 4:26, 27లోని సూత్రాన్ని పాటిస్తే, తమ మధ్య తలెత్తే సమస్యల్ని దంపతులు ఎలా పరిష్కరించుకుంటారో వివరించండి.

15 మనలో అసలు గర్వమే పొడచూపదనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. మనం దాన్ని గుర్తించి, వెంటనే తగిన చర్య తీసుకోవాలి. పౌలు తన తోటి క్రైస్తవులకు ఇలా రాశాడు: “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.” (ఎఫె. 4:26, 27) దేవుని వాక్యాన్ని పాటించకపోతే అనవసరమైన బాధ తప్పదు. “కొన్ని సందర్భాల్లో నేను, మావారు ఎఫెసీయులు 4:26, 27లోని సలహాను పాటించలేదు” అని ఓ సహోదరి వాపోయింది. “దానివల్ల, కొన్ని రాత్రులు కంటి మీద కునుకు పడలేదు” అని కూడా ఆమె అంది. సమాధానపడాలనే లక్ష్యంతో సాధ్యమైనంత త్వరగా సమస్య గురించి చర్చించుకుంటే ఎంత బాగుంటుంది! అయితే, అవతలి వ్యక్తికి కోపం చల్లారేవరకు కాస్త వేచి ఉండాల్సి రావచ్చు. అంతేకాక, సరైన మనఃస్థితి కోసం యెహోవా సహాయాన్ని కోరడం కూడా సముచితమే. అలాంటి మనఃస్థితి సంపాదించుకోవాలంటే వినయం కూడా కావాలి. అది ఉంటే మనం వ్యక్తి మీద కాదుగానీ సమస్య మీద దృష్టి నిలుపుతాం. లేదంటే పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది.—కొలొస్సయులు 3:12, 13 చదవండి.

16. ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామి బలాల మీద దృష్టి నిలపడానికి వినయం ఎలా సహాయం చేస్తుంది?

16 వినయం, అణకువ ఉంటే ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామి లోపాల మీద కాక బలాల మీద దృష్టి నిలుపుతాడు. ఉదాహరణకు, కుటుంబ ప్రయోజనం కోసం ఉపయోగపడే కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు భార్యకు ఉండవచ్చు. ఒకవేళ భర్తకు వినయం, అణకువ ఉంటే ఆమె తనకు పోటీ అనుకోడు కానీ, ఆమెకున్న సామర్థ్యాలను చక్కగా ఉపయోగించమని భుజం తడతాడు. అలా ఆమె తనకు ఎంతో అమూల్యమైనదని చూపిస్తాడు. (సామె. 31:10, 28, 29; ఎఫె. 5:28, 29) అలాగే వినయం, అణకువ ఉన్న భార్య కూడా తన సామర్థ్యాల గురించి గొప్పలు పోదు లేదా తన భర్తను తక్కువచేసి మాట్లాడదు. అన్నిటికీ పైగా వాళ్లిద్దరూ “ఏక శరీరము” కాబట్టి ఎవరికి గాయమైనా ఇద్దరూ బాధపడాల్సి వస్తుంది.—మత్త. 19:4, 5.

17. నేడు, క్రైస్తవుల వివాహ జీవితం సంతోషంగా సాగుతూ యెహోవాకు ఘనత తేవాలంటే ఏమి చేయాలి?

17 అబ్రాహాము-శారాల లేదా ఇస్సాకు-రిబ్కాల వివాహ జీవితంలా మీ దాంపత్యం కూడా చిరకాలం సంతోషంగా సాగుతూ యెహోవాకు ఘనత తేవాలని మీరు తప్పక కోరుకుంటారు కదా? అలాగైతే వివాహ జీవితానికి సంబంధించి యెహోవాకున్న అభిప్రాయాన్నే మీరూ కలిగి ఉండండి. దేవుని వాక్యం అధ్యయనం చేసి జ్ఞానవివేచనలు సంపాదించుకోండి. మీ జీవిత భాగస్వామి గురించి మెప్పుకోలుగా ఆలోచిస్తూ “యెహోవా పుట్టించు జ్వాల” అయిన నిజమైన ప్రేమను అలవర్చుకోండి. (పరమ. 8:6) వినయం పెంపొందించుకోవడానికి గట్టిగా కృషి చేయండి. మీ భాగస్వామి పట్ల గౌరవం చూపించండి. ఇవన్నీ చేస్తే మీ వివాహ జీవితం మీకు, మీ పరలోక తండ్రియైన యెహోవాకు సంతోషాన్ని తీసుకొస్తుంది. (సామె. 27:11) నిజానికి, 27 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఓ సహోదరునికున్న ఈ భావాలే మీకూ ఉండవచ్చు: “నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించలేను. మా వివాహ బంధం రోజురోజుకూ బలోపేతం అవుతోంది. యెహోవా మీద మాకున్న ప్రేమ వల్ల, మేము క్రమంగా ఒకరితో ఒకరం సంభాషించుకోవడం వల్ల మా బంధం పటిష్ఠం అయ్యింది.”