కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటూ మీ స్వాస్థ్యాన్ని భద్రంగా కాపాడుకోండి

జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటూ మీ స్వాస్థ్యాన్ని భద్రంగా కాపాడుకోండి

“చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.”—రోమా. 12:9.

1, 2. (ఎ) యెహోవా సేవ చేయాలనే నిర్ణయాన్ని మీరెలా తీసుకున్నారు? (బి) మన ఆధ్యాత్మిక స్వాస్థ్యానికి సంబంధించి మనం ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?

 యెహోవా సేవచేస్తూ, యేసు అడుగుజాడల్లో నడవాలనే జ్ఞానయుక్తమైన నిర్ణయాన్ని లక్షలాదిమంది తీసుకున్నారు. (మత్త. 16:24; 1 పేతు. 2:21) మనం దేవునికి చేసుకున్న సమర్పణను తేలిగ్గా తీసుకోం. ఏవో కొన్ని లేఖనాల గురించిన మిడిమిడి జ్ఞానంతో కాదుగానీ, దేవుని వాక్యాన్ని బాగా అధ్యయనం చేశాకే మనం ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం. అలా, యెహోవా వాగ్దానం చేసిన స్వాస్థ్యం మీద మన విశ్వాసం కూడా బలపడింది. తన గురించి, తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి నేర్చుకునే వాళ్లకు యెహోవా ఆ స్వాస్థ్యాన్ని తప్పక అనుగ్రహిస్తాడు.—యోహా. 17:3; రోమా. 12:2.

2 నిజమైన క్రైస్తవులుగా కొనసాగాలంటే, మనం మన పరలోక తండ్రికి ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నల్ని పరిశీలిస్తాం: మన స్వాస్థ్యం ఏమిటి? మనం దాన్ని ఎలా ఎంచాలి? ఆ స్వాస్థ్యాన్ని తప్పకుండా పొందాలంటే మనం ఏమి చేయాలి? మనం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏవి తోడ్పడతాయి?

ఆ ‘స్వాస్థ్యం’ ఏమిటి?

3. (ఎ) అభిషిక్తులకు, (బి) ‘వేరే గొఱ్ఱెలకు’ ఏ స్వాస్థ్యం వేచివుంది?

3 “అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన” స్వాస్థ్యాన్ని అంటే పరలోకంలో క్రీస్తుతో పరిపాలించే అమూల్యమైన అవకాశాన్ని కొద్దిమంది క్రైస్తవులు మాత్రమే పొందుతారు. (1 పేతు. 1:3, 4) దాన్ని పొందాలంటే వాళ్లు ‘కొత్తగా జన్మించాలి.’ (యోహా. 3:1-3) యేసు అభిషిక్త అనుచరులతో కలిసి దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తున్న లక్షలాదిమంది ‘వేరే గొఱ్ఱెలు’ ఏ స్వాస్థ్యం పొందుతారు? (యోహా. 10:16) పాపులైన ఆదాము హవ్వలు పొందలేకపోయిన జీవితాన్ని అంటే దుఃఖం, మరణం, వేదన వంటివి లేని పరదైసు భూమిపై నిరంతర జీవితాన్ని వాళ్లు స్వాస్థ్యంగా పొందుతారు. (ప్రక. 21:1-4) అందుకే యేసు, తనతో పాటు వేలాడదీయబడిన ఖైదీతో ఇలా వాగ్దానం చేయగలిగాడు: “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను.”—లూకా 23:43.

4. ఇప్పటికే మనం ఏ ఆశీర్వాదాల్ని చవిచూస్తున్నాం?

4 ఇప్పుడు కూడా మనం ఆ స్వాస్థ్యాన్ని కొంతవరకు అనుభవిస్తున్నాం. క్రీస్తుయేసు అర్పించిన విమోచన క్రయధన బలి మీద విశ్వాసం ఉంచుతాం కాబట్టి మనం మనశ్శాంతిని, దేవునితో దగ్గరి సంబంధాన్ని అనుభవిస్తున్నాం. (రోమా. 3:23-25) దేవుని వాక్యంలో ఉన్న అమూల్యమైన వాగ్దానాల గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉంది. అంతేకాక, ప్రేమగల ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో భాగంగా ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం. యెహోవా సాక్షులుగా ఉండడం ఎంత గొప్ప దీవెన! అందుకే మనం ఈ స్వాస్థ్యాన్ని అమూల్యమైనదిగా ఎంచుతాం.

5. దేవుని ప్రజలు ఏమి చేసేలా ప్రలోభపెట్టాలని సాతాను ప్రయత్నించాడు? అతని తంత్రాలను ఎదిరించాలంటే మనం ఏమి చేయాలి?

5 మనకున్న అద్భుతమైన స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలంటే, మనం సాతాను కుట్రల విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తమ స్వాస్థ్యాన్ని కోల్పోయే నిర్ణయాలు తీసుకునేలా దేవుని ప్రజలను ప్రలోభపెట్టాలని సాతాను ప్రయత్నిస్తూ వచ్చాడు. (సంఖ్యా. 25:1-3, 9) ఇప్పుడు తన అంతం అతి దగ్గర్లో ఉందని సాతానుకు తెలుసు కాబట్టి, మనల్ని తప్పుదోవ పట్టించడానికి తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు. (ప్రకటన 12:12, 17 చదవండి.) మనం ‘అపవాది తంత్రాలను ఎదిరిస్తూ’ ఉండాలంటే మన స్వాస్థ్యాన్ని ఎల్లప్పుడూ అత్యంత అమూల్యంగా ఎంచాలి. (ఎఫె. 6:11) ఇస్సాకు మొదటి కుమారుడైన ఏశావు ఉదాహరణ, ఈ విషయంలో మనకు ఓ హెచ్చరికగా ఉంటుంది.

ఏశావులా ఉండకండి

6, 7. ఏశావు ఎవరు? ఏ స్వాస్థ్యం పొందే హక్కు ఏశావుకు లభించింది?

6 ఇంచుమించు 4,000 సంవత్సరాల క్రితం ఇస్సాకు రిబ్కాలకు కవల పిల్లలు పుట్టారు. వాళ్ల పేర్లు ఏశావు, యాకోబు. వాళ్లు పెరిగి పెద్దయ్యేకొద్దీ వాళ్ల మనస్తత్వాలు, అభిరుచులు మారాయి. “ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.” (ఆది. 25:27) “సాధువు” అని అనువదించిన హెబ్రీ పదం “యథార్థతను లేదా చివరకు అమాయకత్వాన్ని” కూడా సూచిస్తుందని ఓ బైబిలు అనువాదకుడైన రాబర్ట్‌ ఆల్టర్‌ రాశాడు.

7 ఏశావు యాకోబులకు 15 ఏళ్లున్నప్పుడు వాళ్ల తాతయ్య అబ్రాహాము మరణించినా, అబ్రాహాముకు యెహోవా చేసిన ప్రమాణం మాత్రం సజీవంగానే ఉంది. ఆ తర్వాత, అబ్రాహాము సంతానం ద్వారా భూమ్మీదున్న అన్ని జనాంగాల ప్రజలు ఆశీర్వాదాలు సంపాదించుకుంటారని చేసిన అదే ప్రమాణాన్ని యెహోవా ఇస్సాకుకు కూడా చేశాడు. (ఆదికాండము 26:3-5 చదవండి.) ఆదికాండము 3:15లోని నమ్మకమైన “సంతానము” అయిన మెస్సీయ అబ్రాహాము వంశంలోనే జన్మిస్తాడని ఆ ప్రమాణం వెల్లడించింది. చట్టబద్ధంగా ఆ ప్రమాణాన్ని పొందే హక్కు ఇస్సాకు పెద్ద కుమారునిగా ఏశావుకే దక్కుతుంది. ఎంత గొప్ప స్వాస్థ్యం పొందే హక్కు ఏశావుకు లభించింది! మరి అతను దాన్ని అమూల్యంగా ఎంచాడా?

8, 9. (ఎ) ఏశావు తన స్వాస్థ్యానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నాడు? (బి) కొన్నేళ్లకు, తాను తీసుకున్న నిర్ణయం గురించి ఏశావు ఏమి గుర్తించాడు? అప్పుడు ఎలా స్పందించాడు?

8 ఒకరోజు ఏశావు పొలం నుండి తిరిగి వచ్చే సమయానికి యాకోబు “కలగూరవంటకము” చేస్తున్నాడు. అప్పుడు ఏశావు, “నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుము” అని అడిగాడు. దానికి స్పందిస్తూ యాకోబు, “నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్ము” అని అడిగాడు. ఆ సందర్భంలో ఏశావు ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఊహించని రీతిలో ఏశావు, “జ్యేష్ఠత్వము నాకెందుకు?” అని అన్నాడు. ఆ సమయంలో ఏశావు గిన్నెడు కూర కోసం జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నాడు! ఆ హక్కును చట్టబద్ధం చేసుకునేందుకు యాకోబు, “నేడు నాతో ప్రమాణము చేయుము” అని పట్టుబట్టాడు. ఏమాత్రం ఆలోచించకుండా ఏశావు తన హక్కును అమ్ముకున్నాడు. ఆ తర్వాత, “యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.”—ఆది. 25:29-34.

9 అలా కొన్నేళ్లు గడిచాయి. తాను చనిపోతానని ఇస్సాకుకు అనిపించినప్పుడు, ఏశావు వదులుకున్న జ్యేష్ఠత్వపు హక్కు యాకోబుకే చెందేలా చేయడానికి రిబ్కా ఏర్పాట్లు చేసింది. తాను చేసిన తెలివితక్కువ పనిని చాలా ఆలస్యంగా గుర్తించిన ఏశావు తన తండ్రి ఇస్సాకు దగ్గరికెళ్లి ఇలా బతిమాలాడు: “ఓ నా తండ్రీ, నన్నును దీవించుము! . . . నాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా?” అప్పటికే యాకోబుకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మార్చలేనని ఇస్సాకు చెప్పినప్పుడు, ‘ఏశావు ఎలుగెత్తి ఏడ్చాడు.’—ఆది. 27:30-38.

10. ఏశావు యాకోబుల విషయంలో యెహోవా అభిప్రాయం ఏమిటి? ఎందుకు?

10 ఏశావు మనఃస్థితికి సంబంధించి లేఖనాల్లో కొట్టొచ్చినట్లు కనిపించే విషయమేమిటి? తన స్వాస్థ్యం ద్వారా రాబోయే ఆశీర్వాదాలు సంపాదించుకోవడం కన్నా తన శరీర కోరికలు తీర్చుకోవడమే తనకు ముఖ్యమని ఏశావు చూపించాడు. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమూల్యంగా ఎంచలేదంటే, బహుశా అతను దేవుణ్ణి కూడా నిజంగా ప్రేమించలేదు. పైగా, తాను చేసిన పనివల్ల తన సంతానం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అతను ఆలోచించలేదు. యాకోబు విషయానికొస్తే, ఆయన తన స్వాస్థ్యాన్ని అమూల్యంగా ఎంచాడు. ఉదాహరణకు ఆయన, భార్యను ఎంచుకునే విషయంలో తల్లిదండ్రుల మాటకు కట్టుబడ్డాడు. (ఆది. 27:46–28:3) ఓర్పు, స్వయంత్యాగం చూపించాల్సి వచ్చే ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయన మెస్సీయకు పూర్వీకుడు అయ్యాడు. మరి ఏశావు యాకోబుల విషయంలో యెహోవా అభిప్రాయం ఏమిటి? మలాకీ ప్రవక్త ద్వారా యెహోవా ఇలా అన్నాడు: ‘నేను యాకోబును ప్రేమించితిని; ఏశావును ద్వేషించితిని.’—మలా. 1:2, 3.

11. (ఎ) ఏశావు గురించి లేఖనాలు చెబుతున్న విషయాలు క్రైస్తవులమైన మనకు ఎలా ఉపయోగపడతాయి? (బి) పౌలు తాను రాసిన పత్రికలో, ఏశావు చేసిన పనిని ‘వ్యభిచారానికి’ ఎందుకు ముడిపెట్టాడు?

11 ఏశావు గురించి లేఖనాలు చెబుతున్న విషయాలు నేడు క్రైస్తవులకు ఏమైనా ఉపయోగపడతాయా? నిశ్చయంగా! ఎందుకంటే, “ఒక పూట కూటికొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులను హెచ్చరించాడు. (హెబ్రీ. 12:16) ఆ హెచ్చరిక మనకు కూడా వర్తిస్తుంది. మనం శరీర కోరికలకు లొంగిపోయి ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని కోల్పోయే పరిస్థితి రాకూడదంటే పరిశుద్ధమైన విషయాలను ఎల్లప్పుడూ అమూల్యంగా ఎంచాలి. ఇంతకీ పౌలు ఆ లేఖనంలో, ఏశావు చేసిన పనిని ‘వ్యభిచారానికి’ ఎందుకు ముడిపెట్టాడు? ఎందుకంటే ఏశావులా, శరీర సంబంధమైన ఆలోచనలతో మన మనస్సును నింపుకుంటే, వ్యభిచారం వంటి అనైతికమైన సుఖభోగాల కోసం పరిశుద్ధమైన వాటిని కాలదన్నే ప్రమాదం ఉంది.

మీ హృదయాన్ని ఇప్పుడే సిద్ధం చేసుకోండి

12. (ఎ) సాతాను మనల్ని ఎలా శోధిస్తాడు? (బి) కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సహాయకరంగా ఉండే లేఖన ఉదాహరణలు చెప్పండి.

12 మనం యెహోవా సేవకులం కాబట్టి, లైంగిక అనైతికతకు దారితీసే పరిస్థితులను వెతుక్కుంటూ వెళ్లం. యెహోవాకు అవిధేయత చూపించేలా ఇతరులు పెట్టే ప్రలోభాలను ఎదిరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. (మత్త. 6:13) కానీ, ఈ దిగజారిపోయిన లోకంలో మన యథార్థతను కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తుండగా సాతాను మన ఆధ్యాత్మికతను దెబ్బతీయడానికి అలుపెరగకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడు. (ఎఫె. 6:12) ‘సాధారణంగా అపరిపూర్ణ మనుష్యులకు కలిగే’ శోధనల్నే ప్రయోగించి మన అపరిపూర్ణ కోరికల్ని తనకు నచ్చినట్లు ఎలా వాడుకోవాలో ‘ఈ యుగసంబంధమైన దేవతగా’ ఉన్న అపవాదికి తెలుసు. (1 కొరిం. 10:8, 13) ఉదాహరణకు, ఒకానొక కోరికను అనైతిక పద్ధతిలో తీర్చుకునే అవకాశం వచ్చినట్లు ఊహించుకోండి. అప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఏశావులా, ఆత్రంగా ‘అది నాకు పెట్టు’ అంటారా? లేక పోతీఫరు భార్య ప్రలోభాల్ని ఎదిరించి, పారిపోయిన యాకోబు కుమారుడైన యోసేపులా ప్రవర్తిస్తారా?—ఆదికాండము 39:10-12 చదవండి.

13. (ఎ) నేడు చాలామంది ఏవిధంగా యోసేపులా ప్రవర్తించారు? కానీ కొందరు ఏవిధంగా ఏశావులా ప్రవర్తించారు? (బి) ఏశావులా ప్రవర్తించిన వాళ్లను చూసినప్పుడు మనం ఏమి చేయడం ప్రాముఖ్యమని గ్రహిస్తాం?

13 ఏశావులా ఉండాలో లేక యోసేపులా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు చాలామంది సహోదరసహోదరీలకు వచ్చాయి. వాళ్లలో అధికశాతం మంది జ్ఞానయుక్తంగా ప్రవర్తించి యెహోవా హృదయాన్ని సంతోషపెట్టారు. (సామె. 27:11) అయితే, కొంతమంది తోటి విశ్వాసులు శోధన ఎదురైనప్పుడు ఏశావులా ప్రవర్తించి, తమ ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. నిజానికి, ప్రతీ సంవత్సరం యెహోవాసాక్షుల సంఘాల్లో చోటుచేసుకునే బహిష్కరణల్లో, మరితర న్యాయపరమైన చర్యల్లో ఎక్కువశాతం లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించినవే. కాబట్టి, మన యథార్థతను పరీక్షించే పరిస్థితులు ఎదురుకాకముందే, ఇప్పుడే మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. (కీర్త. 78:6, 7) శోధనలకు ధీటుగా నిలబడడానికి, భవిష్యత్తులో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం కనీసం రెండు పనులు చేయవచ్చు.

ఆలోచించుకోండి, దృఢపర్చుకోండి

యెహోవా జ్ఞానం కోసం వెదికినప్పుడు మన కవచాన్ని దృఢపర్చుకుంటాం

14. ఏ ప్రశ్నల గురించి ఆలోచించుకుంటే మనం ‘చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉంటాం’?

14 మొదటిది, మనం మన పనుల వల్ల వచ్చే దుష్ఫలితాల గురించి ఆలోచించుకోవాలి. మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చిన యెహోవా మీద మన ప్రేమ ఎంత బలంగా ఉంటే, మన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని అంత అమూల్యంగా ఎంచుతాం. ఎంతైనా, మనం మన ప్రియమైనవాళ్లను గాయపర్చాలనుకోం. కానీ, వాళ్లకు నచ్చే పనులే చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకే, అపవిత్రమైన శరీర కోరికలకు మనం లొంగిపోతే మనకు, మనవాళ్లకు ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో కాస్త సమయం తీసుకొని ఆలోచించుకోవాలి. మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి: ‘స్వార్థంతో నేను ఆ పని చేస్తే యెహోవాతో నాకున్న సంబంధం ఏమౌతుంది? నా తప్పిదం వల్ల నా కుటుంబంపై, సంఘంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? నా పని వల్ల ఇతరులు అభ్యంతరపడతారా?’ (1 యోహా. 2:10) ఇంకా ఈ ప్రశ్నలు కూడా వేసుకోవచ్చు: ‘అడ్డదారిలో వచ్చే క్షణికానందం కోసం వేదనను మిగిల్చే తప్పు చేయడం సరైనదేనా? జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఎలుగెత్తి ఏడ్చిన ఏశావులా ఉండాలనుకుంటున్నానా?’ (హెబ్రీ. 12:17) అలాంటి ప్రశ్నల గురించి ఆలోచిస్తే, మనం ‘చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉంటాం.’ (రోమా. 12:9) అన్నిటికీ మించి యెహోవా మీద మనకున్న ప్రేమే ఆ స్వాస్థ్యాన్ని హత్తుకొని ఉండడానికి సహాయం చేస్తుంది.—కీర్త. 73:28.

15. మన ఆధ్యాత్మికత మీద దాడిచేసేవాటితో పోరాడేలా మన కవచాన్ని ఎలా దృఢపర్చుకోవచ్చు?

15 రెండవది, మన కవచాన్ని దృఢపర్చుకోవాలి. ఈ లోకంలో మన ఆధ్యాత్మికత మీద దాడిచేసేవాటితో పోరాడేలా మన కవచాన్ని దృఢపర్చుకోవడానికి యెహోవా ఎన్నో ఏర్పాట్లు చేశాడు. బైబిలు అధ్యయనం, క్రైస్తవ కూటాలు, పరిచర్య, ప్రార్థన వంటివి ఆయన చేసిన ఏర్పాట్లే. (1 కొరిం. 15:58) యెహోవాతో మనసువిప్పి మాట్లాడిన ప్రతీసారి, క్రైస్తవ పరిచర్యను చక్కగా చేసిన ప్రతీసారి మనం శోధనలతో పోరాడేందుకు అవసరమైన కవచాన్ని దృఢపర్చుకుంటాం. (1 తిమోతి 6:12, 18, 19 చదవండి.) మన కవచం ఎంత బలంగా ఉంటుందనేది చాలామట్టుకు మన ప్రయత్నాల మీదే ఆధారపడి ఉంటుంది. (గల. 6:7) సామెతలు రెండవ అధ్యాయం ఆ విషయాన్నే నొక్కిచెబుతోంది.

‘దానికోసం వెదుకుతూ ఉండండి’

16, 17. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనమెలా సంపాదించుకోవచ్చు?

16 జ్ఞానాన్ని, ఆలోచనా సామర్థ్యాన్ని సంపాదించుకోమని సామెతలు రెండవ అధ్యాయం మనల్ని ప్రోత్సహిస్తుంది. తప్పొప్పుల మధ్య ఉన్న తేడాను, అలాగే క్రమశిక్షణకూ విచ్ఛలవిడితనానికీ మధ్య ఉన్న తేడాను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ రెండు బహుమానాలు మనకు తోడ్పడతాయి. కానీ, మనం ఈ విషయంలో మనస్ఫూర్తిగా చేసే కృషిని బట్టే ఫలితం ఉంటుంది. ఆ ప్రాథమిక సత్యాన్నే పేర్కొంటూ బైబిలు ఇలా చెబుతోంది: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనిన యెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన యెడల తెలివికై మొఱ్ఱపెట్టిన యెడల వివేచనకై మనవిచేసిన యెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.”—సామె. 2:1-6.

17 కాబట్టి, సామెతల పుస్తకంలో పేర్కొన్న షరతులకు మనం ఒప్పుకున్న “యెడల,” జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని సంపాదించుకుంటాం. అంటే, యెహోవా మాటలకు అనుగుణంగా మన అంత రంగాన్ని మలచుకున్న యెడల, దేవుని నిర్దేశం కోసం పట్టుదలగా ప్రార్థించిన యెడల, దాగివున్న రత్నాల కోసం వెదికినట్లు దైవిక జ్ఞానం కోసం వెదికిన యెడల మనం శోధనలకు ధీటుగా నిలబడగలుగుతాం.

18. ఏమి చేస్తూ ఉండాలని మీరు నిర్ణయించుకున్నారు? ఎందుకు?

18 జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని పొందడానికి కృషిచేసే వాళ్లకు యెహోవా ఆ బహుమానాల్ని తప్పక ఇస్తాడు. మనం వాటిని వెదకడానికి, ఉపయోగించడానికి ఎంతగా ప్రయత్నిస్తామో అంతగా యెహోవాకు దగ్గరౌతాం. శోధనలు ఎదురైనప్పుడు, యెహోవాతో మనకున్న దగ్గరి సంబంధం కవచంలా పనిచేస్తుంది. యెహోవాకు దగ్గరై, ఆయన పట్ల భక్తిపూర్వక భయాన్ని కలిగి ఉంటే మనం తప్పు చేయడానికి మొగ్గుచూపం. (కీర్త. 25:14; యాకో. 4:8) కాబట్టి, యెహోవాతో స్నేహాన్ని ఆస్వాదిస్తూ, దైవిక జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకుందాం. అలా యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం, మన స్వాస్థ్యాన్ని కాపాడుకుందాం!