కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవాకు లోబడడం వల్ల నేను ఎన్నో దీవెనలు పొందాను

యెహోవాకు లోబడడం వల్ల నేను ఎన్నో దీవెనలు పొందాను

“నోవహు నుండి మనం ఎంత అద్భుతమైన పాఠాన్ని నేర్చుకుంటాం! ఆయన దేవునికి లోబడ్డాడు, తన కుటుంబాన్ని ప్రేమించాడు. వాళ్లందరూ ఆ ఓడలోకి వెళ్లడం వల్ల జలప్రళయాన్ని తప్పించుకున్నారు” అని మా నాన్న వివరించాడు.

మా నాన్నకు సంబంధించి నాకు గుర్తున్న తొలి జ్ఞాపకాల్లో అదొకటి. ఆయన అణకువగా ఉండేవాడు, కష్టపడి పనిచేసేవాడు. ఆయన న్యాయాన్ని ప్రేమించే వ్యక్తి కావడం వల్ల, 1953లో బైబిలు సందేశం విన్న వెంటనే దానికి ఆకర్షితుడయ్యాడు. అప్పటి నుండి తాను నేర్చుకున్న వాటిని మాకు నేర్పించడానికి తన శక్తిమేర కృషిచేసేవాడు. మా అమ్మ మొదట్లో తన క్యాథలిక్‌ ఆచారాల్ని వదిలిపెట్టడానికి సుముఖత చూపించలేదు. కానీ ఆ తర్వాత అమ్మ కూడా బైబిలు సత్యాల్ని అన్వయించుకోవడం మొదలుపెట్టింది.

మాతో బైబిలు అధ్యయనం చేయడం మా తల్లిదండ్రులకు కష్టమయ్యేది. ఎందుకంటే మా అమ్మ చదువు అంతంత మాత్రమే, నాన్నేమో రోజంతా పొలంలో శ్రమించేవాడు. కొన్నిసార్లు ఆయన ఎంతగా అలసిపోయేవాడంటే, అధ్యయన సమయంలో నిద్రను ఆపుకోలేకపోయేవాడు. ఆయన కష్టం ఊరికే పోలేదు. పెద్దదాన్ని నేనే కాబట్టి చెల్లికి, అలాగే తమ్ముళ్లిద్దరికి సత్యం నేర్పించడంలో సహకరించాను. నోవహు తన కుటుంబాన్ని ప్రేమించాడని, దేవునికి లోబడ్డాడని మా నాన్న ఎప్పుడూ చెప్పే విషయం కూడా నేను వాళ్లకు నేర్పించిన వాటిలో ఒకటి. ఈ బైబిలు వృత్తాంతమంటే నాకెంతో ఇష్టం. అనతికాలంలోనే, ఇటలీకి చెందిన ఎడ్రియాటిక్‌ తీర పట్టణమైన రోజేటో డెల్యీ ఆబ్రూట్సీలో ఉన్న రాజ్యమందిరంలో కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టాం.

మా అమ్మతో కలిసి నేను 1955లో పశ్చిమాన ఉన్న పర్వతాలను దాటుకుంటూ రోములో జరిగిన సమావేశానికి వెళ్లినప్పుడు నాకు కేవలం 11 ఏళ్లే. మేము హాజరైన మొట్టమొదటి సమావేశం అదే. అప్పటినుండి నేను ఈ సమావేశాల్ని క్రైస్తవ జీవితంలో అత్యంత సుందరమైన వాటిలో ఒకటిగా భావిస్తున్నాను.

ఆ తర్వాతి సంవత్సరంలో, నేను బాప్తిస్మం తీసుకున్నాను. వెనువెంటనే పూర్తికాల సేవ కూడా మొదలుపెట్టాను. మా ఇంటికి 300 కిలోమీటర్ల దూరంలో రోముకు దక్షిణాన ఉన్న లాటీనాలో నేను ప్రత్యేక పయినీరుగా నియమించబడ్డాను. నాకప్పుడు 17 ఏళ్లు. ఆ నగరం అప్పుడప్పుడే ఏర్పడుతున్నందువల్ల, ఇరుగుపొరుగు వాళ్లేమనుకుంటారో అన్న ఆలోచన ఎవ్వరిలోనూ ఉండేది కాదు. నేను, నా తోటి పయినీరు ఎన్నో బైబిలు ప్రచురణలను ఇచ్చినందుకు ఎంతో ఆనందించాం. కానీ అప్పటికి నేను ఇంకా చిన్నదాన్నే కాబట్టి నాకు మా ఇల్లు ఎంతో గుర్తొచ్చేది. అయినా నేను నాకివ్వబడిన నిర్దేశానికే లోబడాలనుకున్నాను.

మా పెళ్లినాడు

తర్వాత, 1963లో “ఎవర్‌లాస్టింగ్‌ గుడ్‌ న్యూస్‌” అనే అంతర్జాతీయ సమావేశం కోసం జరిగే ఏర్పాట్లలో సహాయం చేసేందుకు నన్ను మిలాన్‌కు పంపించారు. ఆ సమావేశంలో నేను స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేశాను. నాతోపాటు ఇంకెంతోమంది పనిచేశారు. వాళ్లలో, ఫ్లోరెన్స్‌ నగరం నుండి వచ్చిన పావోలో పీకోలీ అనే యువ సహోదరుడు కూడా ఉన్నాడు. సమావేశపు రెండో రోజున ఆయన, అవివాహితులుగా ఉండడం గురించి స్ఫూర్తిదాయక ప్రసంగాన్నిచ్చాడు. ఆ సహోదరుడు అసలు పెళ్లే చేసుకోడని నేననుకోవడం నాకు గుర్తుంది. అయితే ఆ తర్వాత మా మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. మా లక్ష్యాలు, యెహోవా మీద ప్రేమ, ఆయనకు లోబడాలనే బలమైన కోరిక, ఇలా ఎన్నో విషయాల్లో ఇరువురి ఆలోచనలు ఒకటేనని మాకు కొన్నిరోజులకు అర్థమైంది. ఆ తర్వాత 1965లో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం.

మత నాయకులను ఎదుర్కొన్న సందర్భాలు

నేను ఫ్లోరెన్స్‌లో పది సంవత్సరాలపాటు క్రమ పయినీరుగా సేవచేశాను. సంఘాల్లో అభివృద్ధిని, ముఖ్యంగా యౌవనుల ఆధ్యాత్మిక ప్రగతిని చూసినప్పుడు నేను సంతోషంతో ఉప్పొంగిపోయేదాన్ని. నేను, మావారు ఆ యౌవనులతో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవాళ్లం, వాళ్లతో సరదాగా సమయం గడిపేవాళ్లం. పావోలో ఎక్కువగా వాళ్లతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడేవాడు. నా భర్తతో సమయం గడపాలని నాకుండేది, కానీ ఆయన ఆ యౌవనుల పట్ల, సంఘంలోని కుటుంబాల పట్ల శ్రద్ధ చూపిస్తూ వాళ్లకోసం సమయం వెచ్చించడం కూడా అవసరమేనని నేను గుర్తించాను. పావోలో సహాయం వల్ల వాళ్లంతా ఎంతో ప్రయోజనం పొందేవాళ్లు.

అప్పట్లో మేము నిర్వహించిన ఎన్నో బైబిలు అధ్యయనాల గురించి ఆలోచిస్తే నాకు ఇప్పటికీ పట్టలేని ఆనందం కలుగుతుంది. మేము బైబిలు అధ్యయనం చేసిన వాళ్లలో ఆడ్రీయానా ఒకరు. ఆమె తాను నేర్చుకుంటున్న విషయాల గురించి మరో రెండు కుటుంబాలతో మాట్లాడింది. అప్పుడు వాళ్లు త్రిత్వం, అమర్త్యమైన ఆత్మ వంటి చర్చీ సిద్ధాంతాల గురించి మాతో మాట్లాడడానికి ఓ మతగురువును రమ్మన్నారు. తీరా చూస్తే, ఆ చర్చకు ముగ్గురు బిషప్‌స్థాయి మతగురువులు వచ్చారు. బైబిలు స్పష్టమైన బోధలతో వాళ్లు ఇచ్చిన వివరణల్ని పోల్చి చూసినప్పుడు అవి తికమకపెట్టేవిగా, అర్థంపర్థంలేనివిగా ఉన్నాయని మా బైబిలు విద్యార్థులు ఇట్టే గ్రహించారు. ఆ చర్చ నిజంగా ఓ మలుపురాయి. ఎందుకంటే కొంతకాలానికి ఆ కుటుంబాలకు చెందిన దాదాపు 15 మంది సాక్షులయ్యారు.

ప్రస్తుతం మనం పరిచర్యలో ఉపయోగించే పద్ధతులు చాలా భిన్నంగా ఉన్నాయన్నది నిజమే. అయితే ఆ రోజుల్లో, మతగురువులతో జరిపే భేటీల్లో పావోలో “ఆరితేరాడు.” సాక్షులుకాని గుంపు ముందు జరిగిన ఓ చర్చ నాకు గుర్తుంది. ఆ గుంపులోని కొందరు ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగేలా వ్యతిరేకులు ముందుగానే వ్యూహం పన్నారని అర్థమైంది. అయితే చర్చ అనుకోని మలుపు తిరిగింది. ‘ఎన్నో శతాబ్దాలుగా జరుగుతున్నట్లు చర్చీలు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా?’ అని ఆ గుంపులో ఎవరో అడిగారు. అప్పుడు ఆ మతగురువులు ఇరకాటంలో పడ్డారని అర్థమైంది. ఉన్నట్టుండి లైట్లు ఆరిపోయాయి, దాంతో ఆ సభ అర్థాంతరంగా ముగిసింది. ఆ రోజు చర్చ తమకు అనుకూలంగా జరగకపోతే కరెంటు తీసేందుకు ఆ మతగురువులు ముందుగానే కుట్ర పన్నారని మాకు కొన్నేళ్లకు తెలిసింది.

కొత్త నియామకాలు

మా పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత మేము ప్రయాణ సేవ చేసేందుకు ఆహ్వానాన్ని అందుకున్నాం. పావోలోకు మంచి ఉద్యోగం ఉండేది కాబట్టి, ఆ ఆహ్వానాన్ని స్వీకరించడం అంత సులువు కాలేదు. అయితే, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాక మేము ఆ కొత్త నియామకాన్ని స్వీకరించాం. మాకు ఆతిథ్యాన్నిచ్చిన కుటుంబాలతో ఆనందంగా సమయం గడిపేవాళ్లం. సాయంకాలాల్లో తరచూ మేమంతా కలిసి అధ్యయనం చేసుకునేవాళ్లం. ఆ తర్వాత, పావోలో వాళ్ల పిల్లలకు స్కూల్‌ హోమ్‌వర్క్‌లో, ముఖ్యంగా గణితంలో సహాయపడేవాడు. పావోలోకు చదవడమంటే చాలా మక్కువ కాబట్టి, తాను చదివిన ఆసక్తికరమైన, ప్రోత్సాహకరమైన విషయాల్ని ఉత్సాహంగా మాతో పంచుకునేవాడు. సోమవారాల్లో సువార్త ప్రకటించడానికి మేము సాక్షుల్లేని చిన్న పట్టణాలకు వెళ్లి, సాయంకాలం ఏర్పాటు చేసిన ప్రసంగానికి అక్కడి ప్రజల్ని ఆహ్వానించేవాళ్లం.

మేమిద్దరం యౌవనులతో సరదాగా సమయం గడిపేవాళ్లం, పావోలో ఎక్కువగా వాళ్లతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడేవాడు

ప్రయాణ సేవ ఆరంభించిన రెండేళ్లకే మమ్మల్ని రోములోని బెతెల్‌లో సేవ చేయడానికి ఆహ్వానించారు. పావోలోను చట్టపరమైన విషయాలు చూసుకోవడానికి, నన్నేమో పత్రికా విభాగంలో పనిచేయడానికి నియమించారు. ఈ మార్పుకు అలవాటుపడడం కాస్త కష్టమనిపించినా, మేము దానికి లోబడాలనే నిశ్చయించుకున్నాం. ఇటలీలో బ్రాంచి కార్యాలయం క్రమక్రమంగా విస్తరించడం, సహోదరుల సంఖ్య గణనీయంగా పెరగడం చూసినప్పుడు మాకు ఎంతో ఆనందం కలిగింది. ఆ సమయంలోనే, ఇటలీలోని యెహోవాసాక్షులకు చట్టపరమైన గుర్తింపు లభించింది. ఈ రకమైన సేవలో కూడా మేము నిజంగా ఎంతో ఆనందాన్ని చవిచూశాం.

బెతెల్‌లో అప్పగించిన పనిని పావోలో ఎంతో ఇష్టంగా చేసేవాడు

మేము బెతెల్‌లో సేవచేస్తున్న సమయంలో, రక్తం విషయంలో మన బైబిలు ఆధారిత నమ్మకాల గురించి ఇటలీలో సంచలనం రేగింది. దీనికి సంబంధించి 1980 తొలినాళ్లలో నడిచిన ఓ కోర్టు కేసు అలజడి సృష్టించింది. తమ కూతురి మరణానికి యెహోవాసాక్షులైన ఆమె తల్లిదండ్రులే కారణమంటూ వాళ్లపై అభియోగం మోపారు. నిజానికి, మధ్యధరా ప్రాంతంలో చాలామందికి సంక్రమించే తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధివల్ల ఆ పాప చనిపోయింది. ఆ తల్లిదండ్రుల తరఫున వాదిస్తున్న న్యాయవాదులకు బెతెల్‌ కుటుంబంలోని సహోదర సహోదరీలు కావాల్సిన సహాయాన్ని అందించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి, రక్తం విషయంలో దేవుని వాక్యం చెబుతున్న దాన్ని సరిగ్గా అర్థంచేసుకునేలా సహాయం చేయడానికి ఓ కరపత్రాన్ని, ఓ ప్రత్యేక తేజరిల్లు! (ఆంగ్లం) సంచికను బ్రాంచి కార్యాలయం ముద్రించింది. ఆ కేసు నడుస్తున్న నెలల్లో, పావోలో రోజుకు 16 గంటలు చొప్పున నిర్విరామంగా పనిచేసేవాడు. ఆయన చేస్తున్న ఈ ప్రాముఖ్యమైన పనిలో సహకరించడానికి నేను శాయశక్తులా కృషి చేశాను.

జీవితంలో మరో మలుపు

మా పెళ్లయిన 20 సంవత్సరాల తర్వాత మా జీవితంలో అనుకోని మలుపులు చోటుచేసుకున్నాయి. నేను తల్లిని కాబోతున్నానేమో అని పావోలోకు చెప్పే సమయానికి నాకు 41 ఏళ్లు, పావోలోకు 49. ఆ తేదీన ఆయన తన డైరీలో రాసుకున్న ఈ మాటల్ని నేను చూశాను: “ప్రార్థన: ఒకవేళ అదే నిజమైతే మేము పూర్తికాల సేవలో ఉండడానికి, ఆధ్యాత్మికంగా మందగించకుండా ఉండడానికి, అలాగే మాదిరికరమైన తల్లిదండ్రులుగా ఉండడానికి మాకు సహాయం చేయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా గత 30 ఏళ్లుగా నేను వేదిక నుండి ప్రసంగించిన వాటిలో కనీసం ఒక్క శాతమైనా ఆచరణలో పెట్టడానికి సహాయం చేయి.” ఆయన ప్రార్థనకు, నా ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడని తర్వాత వచ్చిన ఫలితాల్ని బట్టి చెప్పగలను.

ఈలారీయా పుట్టడంతో మా జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. నిజాయితీగా చెప్పాలంటే, సామెతలు 24:10 పేర్కొంటున్నట్లు మేమూ నిరుత్సాహపడ్డాం. అక్కడ ఇలా ఉంది: “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.” పరస్పరం ప్రోత్సహించుకోవడానికి ఉన్న విలువను గుర్తుంచుకొని, మేము ఒకరికొకరం అండగా నిలిచాం.

పూర్తికాల సేవలో నిమగ్నమైవున్న తల్లిదండ్రులకు పుట్టినందుకు తానెంతో సంతోషిస్తున్నానని ఈలారీయా తరచూ చెబుతుంది. తనను మేము పట్టించుకోలేదన్నట్లు తను ఎన్నడూ భావించలేదు. తను కూడా సాధారణ కుటుంబంలోని పిల్లల్లాగే పెరిగింది. పగలంతా నేను తనను చూసుకునేదాన్ని. సాయంత్రాలు ఇంటికి వచ్చిన తర్వాత పావోలోకు ఎంత పని ఉన్నా ఈలారీయాతో ఆడేవాడు, హోమ్‌వర్క్‌ చేయించేవాడు. తన పని పూర్తి చేసుకోవడానికి తెల్లవారుజామున రెండుమూడు గంటల వరకు మెలకువగా ఉండాల్సి వస్తుందని తెలిసినా పాపతో అలాగే సమయం గడిపేవాడు. “నాన్నే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌” అని ఈలారీయా తరచూ అంటుండేది.

ఈలారీయాకు క్రైస్తవ ప్రవర్తన నేర్పించడానికి మేము ఎప్పటికప్పుడు క్రమశిక్షణ ఇచ్చేవాళ్లం. కొన్నిసార్లైతే కాస్త స్థిరంగానే వ్యవహరించాల్సి వచ్చేది. ఒక సందర్భంలో తను తన స్నేహితురాలితో ఆడుకుంటున్నప్పుడు తప్పుగా ప్రవర్తించింది. అలా ఎందుకు ప్రవర్తించకూడదో మేము బైబిలు ఆధారంగా తనకు వివరించాం. ఆ తర్వాత దగ్గరుండి మరీ ఆ స్నేహితురాలికి క్షమాపణ చెప్పించాం.

తన తల్లిదండ్రులు పరిచర్య పట్ల చూపించిన ప్రేమను అమూల్యమైనదిగా ఎంచుతున్నానని ఈలారీయా చెబుతుంటుంది. ఇప్పుడు తనకూ పెళ్లయింది కాబట్టి యెహోవాకు లోబడడం, ఆయన నిర్దేశాన్ని పాటించడం ఎంత ప్రాముఖ్యమో మరింత బాగా అర్థంచేసుకుంటోంది.

దుఃఖంలో కూడా యెహోవాకు లోబడ్డాను

పావోలోకు క్యాన్సర్‌ అని 2008లో తేలింది. మొదట్లో ఆయన కోలుకోగలడని అనిపించింది. పైపెచ్చు, ఆయనే నన్ను ఎంతో ప్రోత్సహించేవాడు. అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య సలహా కోసం ప్రయత్నిస్తూనే, భవిష్యత్తును ఎదుర్కోవడానికి సహాయం చేయమని మేము ముగ్గురం కలిసి యెహోవాకు గంటల తరబడి ప్రార్థించేవాళ్లం. అయినా, ఒకప్పుడు ఎంతో బలంగా, చలాకీగా ఉన్న మావారు క్రమక్రమంగా నీరసించిపోవడం చూశాను. 2010లో ఆయన మరణించినప్పుడు నేను తల్లడిల్లిపోయాను. కానీ, మేమిద్దరం కలిసి గడిపిన 45 సంవత్సరాల్లో సాధించినవాటి గురించి జ్ఞాపకం చేసుకుంటూ నేను కాస్త ఓదార్పు పొందుతున్నాను. యెహోవా సేవలో మేము చేయగలిగినదంతా చేశాం. మేము చేసిన సేవకు శాశ్వత విలువ ఉంటుందని నాకు తెలుసు. యోహాను 5:28, 29లోని యేసు మాటలకు అనుగుణంగా పావోలో పునరుత్థానం కోసం నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను.

“లోలోపల నేనింకా నోవహు కథను ప్రేమించిన ఆ చిన్న పిల్లనే. నా కృత నిశ్చయం ఇప్పటికీ మారలేదు”

లోలోపల నేనింకా నోవహు కథను ప్రేమించిన ఆ చిన్న పిల్లనే. నా కృత నిశ్చయం ఇప్పటికీ మారలేదు. యెహోవా నన్ను ఏది అడిగినా సరే, నేను ఆయనకు లోబడాలనుకుంటున్నాను. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలకోర్చినా, ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా అవన్నీ మన ప్రేమగల దేవుడు కుమ్మరించే అద్భుతమైన ఆశీర్వాదాల ముందు తక్కువేనని నాకు తెలుసు. యెహోవాకు లోబడితే తప్పక ప్రతిఫలం ఉంటుందని నేను నమ్మకంగా చెప్పగలను.