కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఔదార్యానికి, అర్థంచేసుకునే మనస్తత్వానికి ఉన్న విలువను గుర్తించండి

యెహోవా ఔదార్యానికి, అర్థంచేసుకునే మనస్తత్వానికి ఉన్న విలువను గుర్తించండి

“యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీదనున్నవి.”—కీర్త. 145:9.

1, 2. యెహోవాకు స్నేహితులుగా ఉండేవాళ్లకు ఏ అవకాశం ఉంది?

 మానిక అనే క్రైస్తవ సహోదరి ఇలా చెబుతోంది; “మాకు పెళ్లయి దాదాపు 35 ఏళ్లు కావొస్తోంది. నాకు, మా ఆయనకు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అయినా, ఇప్పటికీ మేమిద్దరం ఒకరి గురించి ఒకరం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నాం!” ఎందరో దంపతుల విషయంలో, స్నేహితుల విషయంలో కూడా అది నిజం.

2 మనం ప్రేమించే వాళ్ల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి మనం ఇష్టపడతాం. అయితే, మనం సంపాదించుకోగల అత్యంత ప్రాముఖ్యమైన స్నేహితుడు యెహోవాయే. మనం ఎన్నటికీ ఆయన గురించి పూర్తిగా తెలుసుకోలేం. (రోమా. 11:33) యెహోవా లక్షణాల గురించి తెలుసుకుంటూ, వాటి విషయంలో మన కృతజ్ఞతను పెంచుకునే అవకాశం, ఆనందం మనకు నిరంతరం ఉంటాయి.—ప్రసం. 3:11.

3. ఈ ఆర్టికల్‌లో దేని గురించి చూస్తాం?

3 ముందటి ఆర్టికల్‌లో యెహోవా స్నేహశీలత, నిష్పక్షపాతం గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని మన కృతజ్ఞతను పెంచుకున్నాం. యెహోవాకున్న మరో రెండు ఆకర్షణీయమైన లక్షణాల గురించి ఈ ఆర్టికల్‌లో చూద్దాం. అవి: ఔదార్యం, అర్థం చేసుకునే మనస్తత్వం. వాటి గురించి పరిశీలించడంవల్ల, “యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీదనున్నవి” అని మరింత మెరుగ్గా గ్రహిస్తాం.—కీర్త. 145:9.

యెహోవా ఔదార్యంగలవాడు

4. నిజమైన ఔదార్యం అంటే ఏమిటి?

4 ఔదార్యం అంటే ఏమిటి? అపొస్తలుల కార్యములు 20:35లో నమోదైన యేసు మాటల్లో దానికి సమాధానం కనిపిస్తోంది. ఆయన ఇలా అన్నాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” ఆ చిన్న వాక్యంలో యేసు, నిజమైన ఔదార్యం అంటే ఏమిటో చెప్పాడు. ఔదార్యం గలవాళ్లు తమ సమయాన్ని, శక్తిని, వనరులను ఇతరుల ప్రయోజనార్థం ధారాళంగా, సంతోషంగా ఉపయోగిస్తారు. వాస్తవానికి, బహుమానం చిన్నదా పెద్దదా అనే దాన్నిబట్టి కాదుగానీ, దాన్ని ఏ ఉద్దేశంతో ఇస్తున్నారనే దాన్నిబట్టే ఔదార్యాన్ని కొలవాలి. (2 కొరింథీయులు 9:7 చదవండి.) ‘శ్రీమంతుడైన’ లేక సంతోషంగల యెహోవా దేవునికి మించిన ఔదార్యవంతులు ఎవ్వరూ లేరు.—1 తిమో. 1:8-11.

5. యెహోవా ఏయే విధాలుగా ఔదార్యం చూపిస్తున్నాడు?

5 యెహోవా ఎలా ఔదార్యం చూపిస్తాడు? తనను ఆరాధించని వాళ్లతో సహా మనుష్యులందరికీ అవసరమైనవి ఆయన దయచేస్తున్నాడు. నిజానికి, “యెహోవా అందరికీ ఉపకారి.” “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్త. 5:45) అందుకే అపొస్తలుడైన పౌలు అవిశ్వాసులతో మాట్లాడుతూ, యెహోవా “ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు” చేశాడని చెప్పగలిగాడు. (అపొ. 14:17) అవును, యెహోవా మనుష్యులందరికీ ఔదార్యం చూపిస్తున్నాడు.—లూకా 6:35.

6, 7. (ఎ) యెహోవా ప్రత్యేకించి ఎవరి అవసరాలు తీర్చడానికి సంతోషిస్తాడు? (బి) తన నమ్మకమైన ఆరాధకుల అవసరాలను దేవుడు ఎలా తీరుస్తాడు? ఓ అనుభవం చెప్పండి.

6 యెహోవా ప్రత్యేకించి తన నమ్మకమైన సేవకుల అవసరాలు తీర్చడానికి ఎంతో సంతోషిస్తాడు. దావీదు రాజు ఇలా అన్నాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.” (కీర్త. 37:25) ఎందరో నమ్మకమైన క్రైస్తవులు యెహోవా చూపించే అలాంటి శ్రద్ధను చవిచూశారు. ఓ అనుభవాన్ని పరిశీలించండి.

7 పూర్తికాల సేవలో ఉన్న నాన్సీకి, కొన్ని సంవత్సరాల క్రితం అనుకోని చిక్కొచ్చి పడింది. ఆమె ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చెప్పింది: “ఆ మరుసటి రోజు నేను ఇంటి అద్దె కట్టాలి. దాని కోసం నాకు 66 డాలర్లు (దాదాపు 3,400 రూపాయలు) కావాలి. ఆ డబ్బు ఎక్కడ నుండి తీసుకురావాలో నాకు పాలుపోలేదు. దాని గురించి దేవునికి ప్రార్థించుకొని, నేను చేస్తున్న వెయిట్రెస్‌ ఉద్యోగానికి బయలుదేరాను. వారంలో అది అంత రద్దీగా ఉండే రోజు కాదు కాబట్టి, ఎక్కువ టిప్స్‌ వస్తాయన్న ఆశ కూడా లేదు. తీరా చూస్తే, ఆ రోజు రాత్రి రెస్టారెంట్‌కు చాలామంది వచ్చారు. పని ముగించుకుని, వచ్చిన టిప్స్‌ లెక్క చూసుకున్నప్పుడు మొత్తం 66 డాలర్లు ఉన్నాయి.” సరిగ్గా తనకేమి కావాలో దాన్ని యెహోవా ఉదారంగా ఇచ్చాడని నాన్సీకి పూర్తి నమ్మకం కుదిరింది.—మత్త. 6:33.

8. యెహోవా అత్యంత ఉదారంగా ఇచ్చిన బహుమానం ఏమిటి?

8 యెహోవా అత్యంత ఉదారంగా ఇచ్చిన బహుమానం అందరికీ అందుబాటులో ఉంది. ఏమిటా బహుమానం? తన కుమారుని విమోచన క్రయధనం. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యేసు అన్నాడు. (యోహా. 3:16) ఇక్కడ “లోకం” అంటే మానవజాతి. నిశ్చయంగా, యెహోవా అత్యంత ఉదారంగా ఇచ్చిన బహుమానం, దాన్ని స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లందరికీ అందుబాటులో ఉంది. యేసు మీద విశ్వాసం చూపే వాళ్లు, ‘జీవాన్ని సమృద్ధిగా’ పొందుతారు అంటే నిత్యజీవాన్ని సొంతం చేసుకుంటారు! (యోహా. 10:10) యెహోవా ఔదార్యానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది?

యెహోవాలా ఔదార్యం చూపించండి

యెహోవాలా ఔదార్యం చూపించాలనే ప్రోత్సాహం ఇశ్రాయేలీయులకు అందింది ( 9వ పేరా చూడండి)

9. యెహోవా చూపించినట్టు ఔదార్యాన్ని మనమెలా చూపించవచ్చు?

 9 యెహోవా చూపించినట్టు ఔదార్యాన్ని మనమెలా చూపించవచ్చు? మనం “సుఖముగా అనుభవించుటకు” యెహోవా “సమస్తమును మనకు ధారాళముగ” దయచేస్తున్నాడు. కాబట్టి ఇతరుల సంతోషానికి దోహదపడేలా మనం కూడా మనకున్న వనరుల్లో ‘పాలిచ్చువారుగా’ ఉండాలి. (1 తిమో. 6:17-19) మన ప్రియమైన వాళ్లకు బహుమతులు ఇవ్వడానికి, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి మనం సంతోషంగా మనకున్న వాటిని ఉపయోగిస్తాం. (ద్వితీయోపదేశకాండము 15:7 చదవండి.) ఎల్లప్పుడూ ఔదార్యాన్ని చూపిస్తూ ఉండడానికి మనమేమి చేయవచ్చు? కొంతమంది క్రైస్తవులు ఈ పద్ధతిని పాటిస్తారు: వాళ్లు ఏదైనా బహుమతి అందుకున్నప్పుడు, తమ వంతుగా తాము కూడా వేరే ఎవరికైనా బహుమతినిచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తారు. ఉదార స్వభావాన్ని పెంపొందించే ఎందరో సహోదరసహోదరీలతో క్రైస్తవ సంఘం కళకళలాడుతుంది.

10. ఔదార్యాన్ని చూపించే ఏ అత్యుత్తమ అవకాశం మనకుంది?

10 మాటల్లో, చేతల్లో ఔదార్యాన్ని చూపే అత్యుత్తమ అవకాశం మనందరికీ ఉంది. అదెలా? ఇతరులకు సహాయం చేయడానికి, వాళ్లను ప్రోత్సహించడానికి మన సమయాన్ని, శక్తిని ఉపయోగించినప్పుడు అలా చేస్తాం. (గల. 6:10) దీన్ని మనం ఎంతవరకు చేస్తున్నామో పరిశీలించుకోవడానికి ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘తమ బాధలు చెప్పుకుంటున్నప్పుడు, నేను కాస్త సమయమిచ్చి వింటాననే అభిప్రాయం ఇతరులకు ఉందా? ఎవరైనా ఫలాని పనిలో సహాయం కోరినప్పుడు, నా పరిస్థితులు అనుకూలిస్తే వెంటనే సహాయం చేయడానికి నేను సుముఖంగా ఉంటానా? నా కుటుంబ సభ్యులను లేదా తోటి విశ్వాసులను మనస్ఫూర్తిగా మెచ్చుకుని ఎంత కాలమైంది?’ ‘ఇవ్వడం’ అలవాటు చేసుకుంటే మనం యెహోవాకు, మన స్నేహితులకు మరింత దగ్గరౌతామని నిస్సందేహంగా చెప్పవచ్చు.—లూకా 6:38; సామె. 19:17.

11. ఏయే విధాలుగా మనం యెహోవాకు ఉదారంగా ఇవ్వగలం?

 11 మనం యెహోవాకు కూడా ఉదారంగా ఇవ్వవచ్చు. “నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము” అని లేఖనాలు చెబుతున్నాయి. (సామె. 3:9) ఆయన సేవ కోసం మనం ధారాళంగా వెచ్చించగల సమయం, శక్తి, వనరులే ఆ “ఆస్తి.” చిన్నపిల్లలు కూడా యెహోవాకు ఉదారంగా ఇవ్వడం నేర్చుకోవచ్చు. జేసన్‌ తన పిల్లల గురించి ఇలా అంటున్నాడు: “మా కుటుంబం రాజ్యమందిరంలో విరాళం ఇస్తున్నప్పుడు, దగ్గరుండి మా పిల్లల చేత్తో విరాళాల పెట్టెలో వేయిస్తాం. దానివల్ల, వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే ‘మేము కూడా యెహోవాకు ఇస్తున్నాం’ అనే ఆనందం వాళ్లలో కనిపిస్తుంది.” యెహోవాకు ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూసిన పిల్లలు, సాధారణంగా పెద్దయ్యాక కూడా ఔదార్యం చూపిస్తుంటారు.—సామె. 22:6.

యెహోవాకు అర్థంచేసుకునే మనస్తత్వం ఉంది

12. అర్థంచేసుకునే మనస్తత్వం అంటే ఏమిటి?

12 యెహోవాకున్న మరో ఆకర్షణీయమైన లక్షణం, అర్థంచేసుకునే మనస్తత్వం. అర్థంచేసుకునే మనస్తత్వం అంటే ఏమిటి? ఆ లక్షణాన్ని వర్ణించే మూలభాషా పదానికి “సమ్మతించడం” అనే అర్థముంది. (తీతు 3:1, 2, NW) అర్థంచేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్లు అదేపనిగా నియమాలు పట్టుకుని వేలాడరు, పద్ధతుల కోసం మితిమీరి పట్టుబట్టరు, మరీ కఠినంగా లేదా కటువుగా ఉండరు. ఆ మంచి లక్షణం ఉన్నవాళ్లు ఇతరుల పరిస్థితుల్ని అర్థంచేసుకుని వాళ్లతో మృదువుగా వ్యవహరిస్తారు. అలాంటి వాళ్లు ఇతరుల అభిప్రాయాలను వింటారు, సముచితమైతే వాటికి సమ్మతిస్తారు, తమ నిర్ణయాల్లో సర్దుబాట్లు కూడా చేసుకుంటారు.

13, 14. (ఎ) యెహోవా అర్థంచేసుకునే మనస్తత్వం ఎలా చూపిస్తాడు? (బి) అర్థంచేసుకునే మనస్తత్వం గురించి, దేవుడు లోతు విషయంలో చేసిన దాని నుండి మనం ఏమి నేర్చుకుంటాం?

13 యెహోవా అర్థంచేసుకునే మనస్తత్వం ఎలా చూపిస్తాడు? ఆయన తన సేవకుల అభిప్రాయాలకు విలువిస్తూ, చాలా సందర్భాల్లో వాళ్ల కోరికల్ని మన్నించాడు. మచ్చుకి, నీతిమంతుడైన లోతు విషయంలో యెహోవా చేసిన దానిగురించి ఆలోచించండి. సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చేయాలని నిర్ణయించినప్పుడు యెహోవా, అక్కడ నివసిస్తున్న లోతును కొండలకు పారిపొమ్మని స్పష్టంగా చెప్పాడు. అయితే ఏదో కారణం వల్ల, మరో ప్రాంతానికి పారిపోతానని లోతు వేడుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, తన నిర్ణయాన్ని మార్చుకోమని లోతు ఏకంగా యెహోవానే అడిగాడు.—ఆదికాండము 19:17-20 చదవండి.

14 ఇది చదివిన వెంటనే, లోతు బలహీనుడని లేదా విధేయత లేనివాడని మీకు అనిపించవచ్చు. నిజానికి యెహోవా లోతును ఎలాగైనా కాపాడి ఉండగలిగేవాడే కాబట్టి, లోతు భయపడాల్సిన పనిలేదు. కానీ, ఆయన భయపడ్డాడు, ఆ భయంవల్లే ఆయన మరో ప్రాంతానికి వెళ్తానని వేడుకున్నాడు, యెహోవా దానికి సమ్మతించాడు. సొదొమగొమొఱ్ఱాలతో పాటు నాశనం చేయాలనుకున్న ఓ పట్టణానికి యెహోవా లోతును పారిపోనిచ్చాడు. (ఆదికాండము 19:21, 22 చదవండి.) దీన్నిబట్టి యెహోవా మొండిగా, కటువుగా ఉండడని స్పష్టంగా తెలుస్తోంది. ఆయనకు సమ్మతించే స్వభావం, అర్థంచేసుకునే మనస్తత్వం ఉన్నాయి.

15, 16. యెహోవాకున్న అర్థంచేసుకునే మనస్తత్వం ధర్మశాస్త్రంలో కూడా ఎలా వెల్లడైంది? (ఈ ఆర్టికల్‌లో ప్రారంభ చిత్రాన్ని చూడండి.)

15 యెహోవాకున్న అర్థంచేసుకునే మనస్తత్వం, ధర్మశాస్త్రంలో కూడా ఎలా కనిపిస్తుందో పరిశీలించండి. ఇశ్రాయేలీయుడు ఎవరైనా గొర్రెను లేదా మేకను బలిగా అర్పించలేనంత బీదరికంలో ఉంటే, అతను రెండు గువ్వలను లేదా రెండు పావురాలను అర్పణగా సమర్పించవచ్చు. మరి, కనీసం పావురాలను కూడా అర్పించలేని వాళ్ల సంగతేమిటి? యెహోవా అలాంటి వాళ్లకు, కాస్తంత పిండిని అర్పించే అవకాశాన్ని కల్పించాడు. అలాగని ఎలాంటి పిండిని అర్పించినా ఫర్వాలేదని ఆయన చెప్పలేదు. కానీ, గౌరవనీయులైన అతిథుల కోసం ఉపయోగించే “మెత్తని పిండి” లేదా శ్రేష్ఠమైన పిండి అయ్యుండాలని చెప్పాడు. (ఆది. 18:6) అలా ‘శ్రేష్ఠమైన పిండిని’ అర్పించడం ఎందుకు అంత ప్రాముఖ్యం?—లేవీ. 5:7, 11, NW.

16 మిమ్మల్ని మీరు ఓ బీద ఇశ్రాయేలీయుడుగా ఊహించుకోండి. కొంచెం పిండి తీసుకుని బలిపీఠం దగ్గరకు వెళ్లేసరికి, ధనవంతులైన ఇశ్రాయేలీయులు బలి ఇవ్వడానికి పశువులను తీసుకొస్తుంటారు. ఆ పశువులతో పోలిస్తే, మీరు తెచ్చిన పిండి ఎందుకూ కొరగానిదని మీకు అనిపించవచ్చు. అయితే, మీరు అర్పించేది యెహోవా దృష్టిలో విలువైనదేనని అప్పుడు మీకు జ్ఞాపకం వస్తుంది. ఆయన దానికి ఎందుకు అంత విలువనిస్తాడు? దానికి ఒక కారణం: యెహోవా శ్రేష్ఠమైన పిండిని ఇవ్వమన్నాడు. ఒకరకంగా పేద ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా అంటున్నాడు: ‘వేరేవాళ్లు ఇచ్చినంత మీరు ఇవ్వలేకపోయినా, మీకున్నదాంట్లో శ్రేష్ఠమైన దాన్ని ఇస్తున్నారని నాకు తెలుసు.’ యెహోవా తన సేవకుల పరిమితుల్ని, పరిస్థితుల్ని అర్థంచేసుకుంటాడని మనం నిశ్చయంగా చెప్పవచ్చు.—కీర్తన 103:14.

17. ఎలాంటి సేవను యెహోవా ఖచ్చితంగా అంగీకరిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు?

 17 యెహోవా మన పరిస్థితుల్ని అర్థంచేసుకుని, మనం పూర్ణాత్మతో చేసే సేవను అంగీకరిస్తాడనే వాస్తవం మనకు ఎంతో ఊరటనిస్తుంది. (కొలొ. 3:23) ఇటలీ దేశంలోని కాన్‌స్టెన్స్‌ అనే వృద్ధ సహోదరి ఇలా అంది: “నేను ఎల్లప్పుడూ అన్నిటికన్నా ఇష్టంగా చేసేపని, నా సృష్టికర్త గురించి ఇతరులతో మాట్లాడడమే. అందుకే నేను ప్రకటిస్తుంటాను, బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తుంటాను. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎక్కువ చేయలేకపోతున్నందుకు కొన్నిసార్లు బాధపడుతుంటాను. అయితే అలాంటి సమయంలో, యెహోవాకు నా పరిమితులు తెలుసనీ, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడనీ, నేను చేస్తున్న సేవకు ఆయన విలువిస్తున్నాడనీ గుర్తుచేసుకుంటాను.”

యెహోవాలా అర్థంచేసుకునే మనస్తత్వాన్ని చూపించండి

18. తల్లిదండ్రులు యెహోవాలా ప్రవర్తించగల ఒక సందర్భం ఏమిటి?

18 యెహోవాలా మనం కూడా అర్థంచేసుకునే మనస్తత్వాన్ని ఎలా చూపించవచ్చు? లోతు విషయంలో యెహోవా చేసిన దాని గురించి మరోసారి ఆలోచించండి. అధికారం తన చేతిలోవున్నా యెహోవా, లోతు అభిప్రాయాన్ని దయగా విన్నాడు. అంతేకాదు, లోతు కోరిక మేరకు యెహోవా తన నిర్ణయాన్ని కాస్త సవరించుకున్నాడు. మీకు పిల్లలుంటే, మీరు కూడా యెహోవాలా ప్రవర్తించగలరా? మీ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, దాన్ని విని సముచితమైతే వాళ్లు కోరినదానికి సమ్మతిస్తారా? కుటుంబంలో పాటించాల్సిన పద్ధతుల గురించి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చర్చిస్తారని కావలికోట సెప్టెంబరు 1, 2007 సంచిక పేర్కొంది. ఉదాహరణకు, పిల్లలు ఖచ్చితంగా ఫలానా సమయానికల్లా ఇంటికి రావాలని నిర్ణయించే హక్కు తల్లిదండ్రులకు ఉంది. అయినా, క్రైస్తవ తల్లిదండ్రులు దాని విషయంలో పిల్లల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవచ్చు. బైబిలు సూత్రాలను ఉల్లంఘించనంతవరకు, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కాస్త వెసులుబాటు కల్పించవచ్చు. కుటుంబంలో పాటించాల్సిన నియమాల విషయంలో పిల్లల అభిప్రాయాలను తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకున్నప్పుడు, పిల్లలు ఆ నియమాలను అర్థంచేసుకుని, వాటిని పాటించడానికి ఎక్కువ సుముఖంగా ఉంటారు.

19. సంఘ పెద్దలు యెహోవాలా అర్థంచేసుకునే మనస్తత్వాన్ని చూపించడానికి ఎలా కృషి చేయవచ్చు?

19 తోటి విశ్వాసుల పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సంఘ పెద్దలు యెహోవాలా అర్థంచేసుకునే మనస్తత్వాన్ని చూపించడానికి కృషి చేస్తారు. పేద ఇశ్రాయేలీయులు అర్పించిన బలులకు కూడా యెహోవా విలువిచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో కూడా కొంతమంది సహోదరసహోదరీలు, ఆరోగ్య సమస్యల వల్ల లేదా వయసు పైబడడం వల్ల అంతెక్కువగా పరిచర్య చేయలేకపోవచ్చు. ఈ ప్రియ సహోదరసహోదరీలు వాళ్ల పరిమితులను బట్టి నిరాశచెందుతుంటే సంఘపెద్దలు ఏమి చేయవచ్చు? తమకున్న దాంట్లో శ్రేష్ఠమైనదాన్ని ఇస్తున్నందుకు యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడనే భరోసా ఇచ్చి పెద్దలు వాళ్లను ఓదార్చవచ్చు.—మార్కు 12:41-44.

20. మన పరిమితుల్ని అర్థంచేసుకోవడమంటే యెహోవా సేవలో వెనకడుగు వేయడమనా? వివరించండి.

20 అలాగని, మనమీద మనం మరీ ఎక్కువ దయ చూపించుకుంటూ దేవుని సేవలో వెనకడుగు వేసే పరిస్థితి తెచ్చుకోకూడదు. (మత్త. 16:22) మన బాధ్యతను తేలిగ్గా తీసుకుంటూ, ‘నేను చేయగలిగింది ఇంతే’ అని చెప్పుకోవడానికి ప్రయత్నించకూడదు. బదులుగా, రాజ్యానికి సంబంధించిన పనులు చేయడానికి మనం ‘పోరాడాలి’ లేదా ప్రయాసపడాలి. (లూకా 13:24) మనం ఈ విషయంలో రెండు సూత్రాలను మనసులో ఉంచుకోవాలి. మొదటిది, యెహోవా సేవలో వెనకడుగు వేయకుండా ప్రయాసపడాలి. రెండవది, యెహోవా ఎన్నడూ మనం ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువ ఆశించడని గుర్తుంచుకోవాలి. మనకున్న వాటిలో శ్రేష్ఠమైనది ఆయనకు ఇచ్చినప్పుడు ఆయన తప్పకుండా సంతోషిస్తాడు. మనకు విలువనిస్తూ, మన పరిస్థితుల్ని అర్థంచేసుకునే అలాంటి యజమానికి మనం ఎంతో సంతోషంగా సేవచేయాలి. తర్వాతి ఆర్టికల్‌లో, మనం యెహోవాకున్న ఆకర్షణీయమైన మరో రెండు లక్షణాల గురించి చూస్తాం.—కీర్త. 73:28.

“నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.”—సామె. 3:9 ( 11వ పేరా చూడండి)

“మీరేమి చేసినను . . . మనస్ఫూర్తిగా చేయుడి.”—కొలొ. 3:23 ( 17వ పేరా చూడండి)