కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు—జూన్‌ 2013

పాఠకుల ప్రశ్నలు—జూన్‌ 2013

ఆదికాండము 6:2, 4 ప్రస్తావిస్తున్నట్లుగా, జలప్రళయానికి ముందు జీవించిన “దేవుని కుమారులు” ఎవరు?

ఈ పదబంధం దేవుని ఆత్మ కుమారులను సూచిస్తోందని రుజువులు చూపిస్తున్నాయి. ఏమిటా రుజువులు?

పైన పేర్కొన్న లేఖనాల్లో మొదటిది ఇలా చెబుతోంది: “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.”—ఆది. 6:2.

“దేవుని కుమారులు,” “దైవ కుమారులు,” “దైవ పుత్రులు” అనే పదబంధాలు హెబ్రీ లేఖనాల్లోని ఆదికాండము 6:2, 4లో; యోబు 1:6 అథఃస్సూచిలో; యోబు 38:7 అథఃస్సూచిలో; కీర్తన 89:6లో కనిపిస్తాయి. ఆ లేఖనాలు ఈ “దేవుని కుమారుల” గురించి ఏమి చెబుతున్నాయి?

యోబు 1:6 అథఃస్సూచి ప్రస్తావిస్తున్న “దైవ కుమారులు” దేవుని సన్నిధిలో సమకూడడానికి వెళ్లిన ఆత్మ ప్రాణులేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్లలో “భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు” యెహోవా సన్నిధికి వచ్చిన సాతాను కూడా ఉన్నాడు. (యోబు 1:7; 2:1, 2) అలాగే, దేవుడు భూమికి “మూల రాతిని” వేసినప్పుడు ‘దేవదూతలు (“దేవుని కుమారులు,” అథఃస్సూచి) ఆనందించి జయధ్వనులు’ చేశారని యోబు 38:4-7 వచనాలు చెబుతున్నాయి. దేవుడు అప్పటికి ఇంకా మనుష్యులను సృష్టించలేదు కాబట్టి ఆ “దేవుని కుమారులు” తప్పకుండా దేవదూతలే అయ్యుంటారు. కీర్తన 89:6 ప్రస్తావిస్తున్న “దైవ పుత్రులు” మనుష్యులు కారు కానీ, ఖచ్చితంగా దేవుని సమక్షంలోని పరలోక ప్రాణులే.

మరి, ఆదికాండము 6:2, 4 వృత్తాంతంలోని “దేవుని కుమారులు” ఎవరు? పైన చెప్పుకున్న లేఖన వాస్తవాలను బట్టి చూస్తే, ఆ పదబంధం పరలోకం నుండి భూమ్మీదకు వచ్చిన దేవుని ఆత్మ కుమారులనే సూచిస్తుంది అన్న నిర్ధారణకు వస్తాం.

దేవదూతలు లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపించారన్నది నమ్మడం కొంతమందికి కష్టంగా ఉంటుంది. పరలోకంలో పెళ్లి, లైంగిక సంబంధాలు ఉండవని మత్తయి 22:30లోని యేసు మాటలను బట్టి తెలుస్తోంది. అయితే, కొన్ని సందర్భాల్లో దేవదూతలు మానవ శరీరాలు దాల్చినప్పుడు మనుష్యులతో కలిసి అన్నపానాలు పుచ్చుకున్నారు. (ఆది. 18:1-8; 19:1-3) కాబట్టి అలా మానవ శరీరాలు దాల్చినప్పుడు, స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వాళ్లకు సాధ్యమయ్యిందనే నిర్ధారణకు మనం రావచ్చు.

కొంతమంది దేవదూతలు అలా చేశారని మనం నమ్మేందుకు లేఖన రుజువులున్నాయి. సొదొమ పురుషులు అసహజమైన శరీర కోరికలతో చేసిన పాపాన్ని, “తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచి” వచ్చిన దేవదూతలు చేసిన పాపంతో యూదా 6, 7 పోలుస్తోంది. దేవదూతలకు, సొదొమ వాళ్లకు మధ్య పోలిక ఏంటంటే, వాళ్లిరువురూ విశృంఖలంగా “వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులై” నడుచుకున్నారు. అలాంటి వృత్తాంతమే ఉన్న 1 పేతురు 3:19, 20 అవిధేయులైన దేవదూతలను ‘నోవహు దినాలకు’ ముడిపెడుతోంది. (2 పేతు. 2:4, 5) కాబట్టి, నోవహు దినములలో అవిధేయులైన దేవదూతలు చేసిన పనిని సొదొమ గొమొఱ్ఱా ప్రజలు చేసిన పాపంతో పోల్చవచ్చు.

పై వివరణను బట్టి చూస్తే, ఆదికాండము 6:2, 4లోని “దేవుని కుమారులు” ఎవరంటే మానవ శరీరాలు దాల్చి స్త్రీలతో వ్యభిచారం చేసిన దేవదూతలే.

యేసు “చెరలో ఉన్న ఆత్మలయొద్దకు . . . వెళ్లి వారికి ప్రకటించెను” అని బైబిలు చెబుతోంది. (1 పేతు. 3:19, 20) దాని అర్థం ఏమిటి?

“దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో అవిధేయులైన” వారే ఆ ఆత్మలు అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (1 పేతు. 3:19, 20) దేవునికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో సాతానుతో చేతులు కలిపిన ఆత్మప్రాణుల గురించే పేతురు రాశాడని స్పష్టంగా తెలుస్తోంది. “తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతల” గురించి యూదా ప్రస్తావిస్తూ, దేవుడు వాళ్లను ‘మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో బంధించి భద్రముచేసెను’ అని అన్నాడు.—యూదా 6.

ఈ ఆత్మ ప్రాణులు నోవహు కాలంలో ఎలా అవిధేయత చూపించారు? జలప్రళయానికి ముందు ఈ దుష్ట దూతలు మానవ రూపం దాల్చారు. అయితే వాళ్ల విషయంలో దేవుని ఉద్దేశం అది కాదు. (ఆది. 6:2, 4) అంతేకాదు, స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకొని ఆ దూతలు అసహజ ప్రవృత్తిని చూపించారు. ఎందుకంటే దేవుడు ఆత్మ ప్రాణుల్ని, స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి సృష్టించలేదు. (ఆది. 5:2) అవిధేయులైన ఈ దుష్ట దూతలను దేవుడు తగిన సమయంలో నాశనం చేస్తాడు. ప్రస్తుతానికైతే, యూదా పేర్కొన్నట్లు, వాళ్లు “కటికచీకటిలో” ఉన్నారు. మరో మాటలో వాళ్లు ఆధ్యాత్మిక బంధకాల్లో ఉన్నారు.

ఇంతకీ యేసు “చెరలో ఉన్న ఆత్మలకు” ఎప్పుడు, ఏ విధంగా ప్రకటించాడు? యేసు ‘ఆత్మవిషయంలో బ్రదికింపబడిన’ తర్వాత అది జరిగిందని పేతురు రాశాడు. (1 పేతు. 3:18-20) యేసు “ప్రకటించెను” అని కూడా పేతురు రాశాడని గమనించండి. “ప్రకటించెను” అనే మాటను బట్టి చూస్తే పేతురు తన మొదటి పత్రికను రాయడానికి ముందే అలా ప్రకటించడం జరిగిపోయిందని అర్థమౌతోంది. కాబట్టి, యేసు తన పునరుత్థానం తర్వాత కొంతకాలానికి, ఆ దుష్ట దూతలకు అన్నివిధాల తగిన, న్యాయబద్ధమైన శిక్ష రాబోతుందని ప్రకటించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు మీద ఆశలు చిగురింపజేసే విషయాల్ని యేసు వాళ్లకు ప్రకటించలేదు కానీ, తీర్పు సందేశాన్ని ప్రకటించాడు. (యోనా 1:1, 2) యేసు తన విశ్వాసాన్ని నిరూపించుకొని మరణం వరకు యథార్థంగా ఉన్నాడు. సాతానుకు తన మీద ఏమాత్రం పట్టులేదని నిరూపించే విధంగా పునరుత్థానం చేయబడిన తర్వాత యేసుకు వాళ్లపై రానున్న శిక్ష గురించి ప్రకటించడానికి తగిన ఆధారం లభించింది.—యోహా. 14:30; 16:8-11.

యేసు భవిష్యత్తులో సాతానును, ఆ దుష్ట దూతలను బంధించి అగాధంలో పడేస్తాడు. (లూకా 8:30, 31; ప్రక. 20:1-3) అప్పటి వరకు, అవిధేయులైన ఈ ఆత్మ ప్రాణులు ఆధ్యాత్మిక అంధకారంలో మగ్గుతుంటారు. అంతిమంగా వాళ్లు నాశనం అవ్వడం తథ్యం!—ప్రక. 20:7-10.