కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఇదిగో నేను సదాకాలము మీతో కూడ ఉన్నాను’

‘ఇదిగో నేను సదాకాలము మీతో కూడ ఉన్నాను’

“ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” —మత్త. 28:20.

1. (ఎ) గోధుమలు, గురుగుల ఉపమాన సారాంశం చెప్పండి. (బి) యేసు దానికి ఇచ్చిన వివరణ ఏమిటి?

 యేసు చెప్పిన రాజ్య ఉపమానాల్లో ఒకటి, పొలంలో గోధుమలు విత్తిన ఓ రైతు గురించీ, ఆ తర్వాత అదే పొలంలో గోధుమల మధ్య గురుగులు నాటిన ఓ శత్రువు గురించీ చెబుతోంది. అందులో గోధుమల కన్నా గురుగులే ఎక్కువగా పెరిగాయి. అయితే, ఆ రైతు తన దాసులతో కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగనియ్యుడి” అని ఆజ్ఞాపించాడు. కోతకాలంలో ఆ గురుగులను నాశనం చేసి, గోధుమల్ని ఒకచోట సమకూర్చారు. ఆ ఉపమాన భావాన్ని యేసే స్వయంగా వివరించాడు. (మత్తయి 13:24-30, 37-43 చదవండి.) ఈ ఉపమానం మనకు ఏమి వెల్లడిచేస్తోంది? (“గోధుమలు, గురుగులు” అనే చార్టు చూడండి.)

2. (ఎ) ఉపమానంలోని రైతు పొలంలో జరిగిన సంఘటనలు వేటిని సూచిస్తున్నాయి? (బి) ఉపమానంలోని ఏ భాగాన్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం?

2 ఆ రైతు పొలంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే, యేసు గోధుమల తరగతినంతటినీ అంటే తన రాజ్యంలో తనతోపాటు పరిపాలించబోయే అభిషిక్త క్రైస్తవులను మానవాళి నుండి ఎప్పుడు, ఎలా సమకూరుస్తాడో అర్థమౌతుంది. విత్తే పని సా.శ. 33 పెంతెకొస్తు రోజున మొదలైంది. ఈ విధానం అంతమయ్యే సమయానికి ఇంకా భూమ్మీద మిగిలి ఉన్న అభిషిక్తులు తమ చివరి ముద్రను పొంది, ఆ తర్వాత పరలోకానికి తీసుకెళ్లబడినప్పుడు ఆ సమకూర్చే పని పూర్తౌతుంది. (మత్త. 24:31; ప్రక. 7:1-4) పర్వత శిఖరం మీద నిల్చొని చూస్తే చుట్టుపక్కల ప్రదేశమంతా కనిపించినట్లే, యేసు చెప్పిన ఉపమానాన్ని పరిశీలిస్తే అప్పటి నుండి సుమారు 2,000 సంవత్సరాలుగా చోటుచేసుకుంటున్న ఆయా సంఘటనలను అర్థం చేసుకోగలుగుతాం. రాజ్యానికి సంబంధించిన ఏ సంఘటనలు ఇప్పుడు మన కాలంలో జరుగుతున్నాయి? ఆ ఉపమానం విత్తే కాలాన్ని, పెరిగే కాలాన్ని, కోత కాలాన్ని ప్రస్తావిస్తోంది. అయితే, ఈ ఆర్టికల్‌లో మనం ముఖ్యంగా కోతకాలం గురించే పరిశీలిస్తాం. a[1]

యేసు శ్రద్ధగల కాపుదలలో

3. (ఎ) మొదటి శతాబ్దం తర్వాత పరిస్థితి ఎలా తయారైంది? (బి) మత్తయి 13:28లో ఏ ప్రశ్న ఉంది? దాన్ని ఎవరు అడిగారు? (అధస్సూచిని కూడా చూడండి.)

3 సా.శ. రెండవ శతాబ్దం ప్రారంభంలో నకిలీ క్రైస్తవులు లోకమనే పొలంలో కనిపించినప్పుడు ‘గురుగులు అగపడ్డాయి.’ (మత్త. 13:26) నాల్గవ శతాబ్దానికల్లా గురుగుల్లాంటి క్రైస్తవులు అభిషిక్త క్రైస్తవుల సంఖ్యను ఎంతగానో మించిపోయారు. ఆ ఉపమానంలోని దాసులు, గురుగులను పెరికివేయడానికి తమ యజమాని అనుమతి కోరినట్లు గుర్తుచేసుకోండి. b[2] (మత్త. 13:28) అప్పుడు యజమాని ఏమన్నాడు?

4. (ఎ) యజమానియైన యేసు చెప్పిన జవాబు నుండి ఏమి తెలుస్తోంది? (బి) గోధుమల్లాంటి క్రైస్తవులు ఎవరన్నది ఎప్పుడు స్పష్టమైంది?

4 గోధుమలు, గురుగుల గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగనియ్యుడి.” మొదటి శతాబ్దం నుండి మనకాలం వరకు అన్ని కాలాల్లోనూ ఈ భూమ్మీద కొంతమంది గోధుమల్లాంటి అభిషిక్త క్రైస్తవులు ఉంటారని ఆ ఆజ్ఞ చూపిస్తోంది. యేసు ఆ తర్వాత చెప్పిన ఈ మాటలు ఆ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి: “నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్త. 28:20) అంటే, యేసు అభిషిక్త క్రైస్తవులను అంత్యకాలం వరకు రక్షిస్తాడు. అయితే, అభిషిక్త క్రైస్తవుల కంటే గురుగుల్లాంటి క్రైస్తవులు ఎక్కువమంది ఉన్నారు కాబట్టి, ఆ కాలమంతటిలో ఎవరు గోధుమల తరగతికి చెందినవాళ్లో మనం ఖచ్చితంగా చెప్పలేం. ఏదేమైనా, కోతకాలం మొదలవ్వడానికి కొన్ని దశాబ్దాల ముందు గోధుమల తరగతి ఎవరన్నది స్పష్టమైంది. ఎలా?

దూత “ముందుగా మార్గము సిద్ధపరచుట”

5. మలాకీ ప్రవచనం మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరింది?

5 గోధుమలు, గురుగుల ఉపమానాన్ని యేసు చెప్పడానికి శతాబ్దాల ముందే, ఆ ఉపమానంలో కనిపిస్తున్న సంఘటనల గురించి యెహోవా మలాకీ ప్రవక్త ద్వారా ప్రవచించాడు. (మలాకీ 3:1-4 చదవండి.) బాప్తిస్మమిచ్చు యోహానే ‘మార్గము సిద్ధపరచిన దూత.’ (మత్త. 11:10, 11) యోహాను సా.శ. 29లో వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు తీర్పుతీర్చే సమయం దగ్గరపడింది. ఆ తర్వాత వచ్చిన రెండవ దూత అంటే, “నిబంధన దూత” యేసే. ఆయన యెరూషలేము దేవాలయాన్ని రెండుసార్లు శుద్ధిచేశాడు. మొదటిసారి ఆయన పరిచర్య ప్రారంభంలో, రెండవసారి ఆయన పరిచర్య ముగింపులో. (మత్త. 21:12, 13; యోహా. 2:14-17) దాన్నిబట్టి, యేసు శుద్ధిచేసే పని ఓ కాలనిడివిలో జరిగిందని తెలుస్తోంది.

6. (ఎ) మలాకీ ప్రవచనం విస్తృతస్థాయిలో ఎలా నెరవేరింది? (బి) యేసు ఆధ్యాత్మిక ఆలయాన్ని ఎప్పుడు తనిఖీ చేశాడు? (అధస్సూచి కూడా చూడండి.)

6 మలాకీ ప్రవచనం విస్తృతస్థాయిలో ఎలా నెరవేరింది? 1914కు ముందు వరకున్న కొన్ని దశాబ్దాల్లో సీ.టి. రస్సెల్‌, ఆయన సన్నిహిత సహవాసులు బాప్తిస్మమిచ్చు యోహాను చేసినలాంటి పనే చేశారు. ఆ ముఖ్యమైన పనిలో భాగంగా వాళ్లు బైబిలు సత్యాలను తిరిగి వెలుగులోకి తెచ్చారు. ఆ బైబిలు విద్యార్థులు క్రీస్తు విమోచన క్రయధనానికి ఉన్న నిజమైన అర్థాన్ని బోధించారు, నరకాగ్ని అబద్ధమనే విషయాన్ని బట్టబయలు చేశారు, అన్యజనుల కాలాలు ముగింపుకు రానున్నాయని ప్రకటించారు. అయినా ఆ కాలంలో, క్రీస్తు అనుచరులమని చెప్పుకుంటున్న మత గుంపులు కోకొల్లలుగా ఉండేవి. అందుకే, చాలా ప్రాముఖ్యమైన ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది: ఆ గుంపుల్లో ఎవరు గోధుమల తరగతికి చెందినవాళ్లు? ఆ చిక్కుముడిని విప్పడానికి, యేసు 1914లో ఆధ్యాత్మిక ఆలయాన్ని తనిఖీ చేయడం ఆరంభించాడు. ఆ తనిఖీచేసే పని, శుద్ధిచేసే పని 1914 నుండి 1919 తొలి భాగం వరకున్న కాలనిడివిలో జరిగింది. c[3]

తనిఖీచేసిన, శుద్ధిచేసిన సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు

7. యేసు 1914లో తనిఖీ చేయడం ప్రారంభించినప్పుడు ఏమి కనుగొన్నాడు?

7 యేసు తనిఖీ చేయడం ప్రారంభించినప్పుడు ఏమి కనుగొన్నాడు? అప్పటికి 30కన్నా ఎక్కువ సంవత్సరాలుగా ప్రకటనా పనిలో విస్తృతంగా పాల్గొనడానికి తమ శక్తిని, వనరుల్ని ధారపోస్తున్న ఉత్సాహవంతులైన బైబిలు విద్యార్థుల చిన్న గుంపును కనుగొన్నాడు. d[4] ఆ కొన్ని దృఢమైన గోధుమవెన్నులు సాతాను విత్తిన గురుగుల ప్రభావానికి లోనుకాలేదని కనుగొన్నప్పుడు యేసు, దేవదూతలు ఎంత సంతోషించి ఉంటారో కదా! అయినా, ఆ ‘లేవీయులను’ అంటే అభిషిక్తులను శుద్ధి చేయాల్సిన అవసరం అప్పటికీ ఉండనే ఉంది. (మలా. 3:2, 3; 1 పేతు. 4:17) అలాగని ఎందుకు చెప్పవచ్చు?

8. ఎలాంటి పరిస్థితులు 1914 తర్వాత నెలకొన్నాయి?

8 తాము 1914 చివర్లో పరలోకానికి వెళ్లనందుకు కొందరు బైబిలు విద్యార్థులు నిరాశ చెందారు. 1915లో, 1916లో సంస్థ వెలుపలి నుండి వచ్చిన వ్యతిరేకత వల్ల ప్రకటనా పని మందగించింది. విచారకరమైన విషయం ఏమిటంటే, 1916 అక్టోబరులో సహోదరుడు రస్సెల్‌ చనిపోయిన తర్వాత సంస్థ లోపలి నుండే వ్యతిరేకత మొదలైంది. వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఏడుగురు డైరెక్టర్లలో నలుగురు, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ నాయకత్వం వహించాలనే నిర్ణయానికి ఎదురుతిరిగారు. వాళ్లు సహోదరుల్లో విభజన సృష్టించడానికి ప్రయత్నించారు, కానీ 1917 ఆగస్టులో వాళ్లు బెతెల్‌ వదిలి వెళ్లిపోయారు. అది ఒకవిధంగా సంస్థను శుద్ధి చేసింది. మరోవైపు, కొందరు బైబిలు విద్యార్థులు మనుష్యుల భయానికి లొంగిపోయారు. అయినా, ఓ గుంపుగా బైబిలు విద్యార్థులు యేసు చేపట్టిన శుద్ధీకరణను మనస్ఫూర్తిగా స్వీకరించారు, అవసరమైన మార్పులు చేసుకున్నారు. అప్పుడు, యేసు వాళ్లను నిజమైన క్రైస్తవ గోధుమలుగా స్వీకరించి, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల్లో ఉన్న వాళ్లతో సహా నకిలీ క్రైస్తవులందరినీ తిరస్కరించాడు. (మలా. 3:5; 2 తిమో. 2:19) ఆ తర్వాత ఏమి జరిగింది? దాన్ని తెలుసుకోవడానికి మనం మళ్లీ గోధుమలు, గురుగుల ఉపమానం దగ్గరికి వద్దాం.

కోతకాలం మొదలయ్యాక ఏమి జరుగుతుంది?

9, 10. (ఎ) కోతకాలం గురించి మనం ఇప్పుడు ఏమి పరిశీలిస్తాం? (బి) కోతకాలంలో మొదటిగా ఏమి జరిగింది?

9 “కోత యుగసమాప్తి” అని యేసు అన్నాడు. (మత్త. 13:39) ఆ కోతకాలం 1914లో మొదలైంది. కోతకాలంలో జరుగుతాయని యేసు చెప్పిన ఐదు సంఘటనల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

10 మొదటిగా, గురుగులను కూర్చడం. ‘కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కట్టలు కట్టి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును’ అని యేసు అన్నాడు. దేవదూతలు 1914 తర్వాత, “రాజ్యకుమారులు” అయిన అభిషిక్త క్రైస్తవుల నుండి గురుగుల్లాంటి క్రైస్తవులను వేరు చేయడం ద్వారా ‘గురుగులను కూర్చడం’ మొదలుపెట్టారు.—మత్త. 13:30, 38, 41.

11. ఇప్పటి వరకు, నకిలీ క్రైస్తవుల నుండి నిజక్రైస్తవులను వేరుగా ఉంచింది ఏమిటి?

11 ఆ కూర్చే పని మొదలైన కొంతకాలానికి ఆ రెండు గుంపుల మధ్య వ్యత్యాసం మరింత స్పష్టమైంది. (ప్రక. 18:1, 4) మహాబబులోను పడిపోయిందని 1919కల్లా అర్థమైంది. నకిలీ క్రైస్తవుల నుండి నిజక్రైస్తవులను వేరుగా ఉంచింది ఏమిటి? ప్రకటనా పని. ప్రతీ ఒక్కరు రాజ్య ప్రకటనా పనిలో పాల్గొనడం చాలా ప్రాముఖ్యమని బైబిలు విద్యార్థుల్లో నాయకత్వం వహిస్తున్న సహోదరులు నొక్కి చెప్పారు. ఉదాహరణకు, 1919లో ప్రచురితమైన ఆ పని ఎవరికి అప్పగించబడింది (ఆంగ్లం) అనే కరపత్రం, అభిషిక్త క్రైస్తవుల్లో ప్రతీ ఒక్కరు ఇంటింటికి వెళ్లి ప్రకటించాలని పిలుపునిచ్చింది. అందులో ఇలా ఉంది: “ఆ పని మన వల్ల కాదనిపించవచ్చు కానీ, అది ప్రభువు పని కాబట్టి ఆయనిచ్చే బలంతో మనం దాన్ని చేయగలుగుతాం. అందులో పాల్గొనే గొప్ప అవకాశం మీకుంది.” దానికి ఎలాంటి స్పందన వచ్చింది? అప్పటి నుండి బైబిలు విద్యార్థులు తమ ప్రకటనా పనిని ముమ్మరం చేశారని 1922లో ప్రచురితమైన ఓ కావలికోట నివేదించింది. కొంతకాలానికే, ఇంటింటికి వెళ్లి ప్రకటించడం ఆ నమ్మకమైన క్రైస్తవుల గుర్తింపు చిహ్నం అయ్యింది, ఇప్పటికీ అదే మన గుర్తింపు.

12. గోధుమల తరగతికి చెందిన వాళ్లను సమకూర్చడం ఎప్పటి నుండి జరిగింది?

12 రెండవదిగా, గోధుమలను కూర్చడం. “గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడి” అని యేసు తన దూతలకు ఆజ్ఞాపించాడు. (మత్త. 13:30) 1919 నుండి అభిషిక్త క్రైస్తవులు పునఃస్థాపిత క్రైస్తవ సంఘంలోకి చేర్చబడ్డారు. ఈ విధానం అంతమయ్యే సమయానికి ఇంకా ఈ భూమ్మీద ఉండే అభిషిక్త క్రైస్తవులు, తమ పరలోక బహుమానాన్ని అందుకున్నప్పుడు సమకూర్చడం పూర్తౌతుంది.—దాని. 7:18, 22, 27.

13. మహావేశ్య అంటే, క్రైస్తవమత సామ్రాజ్యం కూడా భాగంగా ఉన్న మహాబబులోను ప్రస్తుత వైఖరి ఎలా ఉందని ప్రకటన 18:7 చెబుతోంది?

13 మూడవదిగా, ‘ఏడ్పు, పండ్లుకొరుకుట.’ దేవదూతలు గురుగులను కట్టలుగా కట్టిన తర్వాత ఏమి జరుగుతుంది? గురుగుల తరగతికి చెందిన వాళ్ల పరిస్థితి గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.” (మత్త. 13:42) అది ఇప్పుడే జరుగుతోందా? లేదు. నేడు మహావేశ్యలో భాగంగా ఉన్న క్రైస్తవమత సామ్రాజ్యం, ఇప్పటికీ తన గురించి తాను ఇలా చెప్పుకుంటోంది: “నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడను.” (ప్రక. 18:7) నిజానికి, తాను ఆధిపత్యం చెలాయిస్తున్నానని క్రైస్తవమత సామ్రాజ్యం భావిస్తోంది, అంతేగాక అది రాజకీయ నాయకుల మీద ‘రాణిగా కూర్చుంటాను’ అని అనుకుంటోంది. ప్రస్తుతానికి, గురుగుల తరగతికి చెందినవాళ్లు ఏడవడం లేదు గానీ, గొప్పలుపోతున్నారు. అయితే, ఆ పరిస్థితి మారనుంది.

రాజకీయ నాయకులతో క్రైస్తవమత సామ్రాజ్యానికున్న చెలిమికి త్వరలోనే తెరపడనుంది (13వ పేరా చూడండి)

14. (ఎ) నకిలీ క్రైస్తవులు ఎప్పుడు, ఎందుకు ‘పండ్లు కొరుక్కుంటారు’? (బి) మత్తయి 13:42కు మన అవగాహనలో వచ్చిన సవరణ, కీర్తన 112:10లోని మాటలతో ఎలా సరిపోతుంది? (అధస్సూచి చూడండి.)

14 మహాశ్రమల కాలంలో, అబద్ధమత వ్యవస్థంతా నాశనం అయ్యాక, అప్పటివరకు అందులో భాగంగా ఉన్న వాళ్లు తమను తాము కాపాడుకోవడానికి ఒక సురక్షిత స్థలం కోసం పరుగులు తీస్తారు కానీ, అది వాళ్లకు దొరకదు. (లూకా 23:30; ప్రక. 6:15-17) అప్పుడు, నాశనం నుండి తప్పించుకోలేమని గుర్తించి, దిక్కుతోచని స్థితిలో వాళ్లు కోపంతో ‘ఏడుస్తూ పండ్లు కొరుక్కుంటారు.’ మహాశ్రమల గురించిన ప్రవచనంలో యేసు చెప్పినట్టుగా, వాళ్లు ఆ నిస్సహాయ స్థితిలో ‘రొమ్ము కొట్టుకొని’ ఏడుస్తారు. e[5]మత్త. 24:30; ప్రక. 1:7.

15. గురుగులకు ఏమి జరుగుతుంది? ఎప్పుడు?

15 నాలుగవదిగా, అగ్నిగుండంలో పడేయడం. గురుగుల కట్టలకు ఏమి జరుగుతుంది? దేవదూతలు గురుగుల్లాంటి వాళ్లను ‘అగ్నిగుండములో పడేస్తారు.’ (మత్త. 13:41) అంటే, వాళ్లు పూర్తిగా నాశనమౌతారని అర్థం. కాబట్టి, అబద్ధమత వ్యవస్థల్లో అప్పటివరకు భాగంగా ఉన్నవాళ్లు మహాశ్రమల చివరి భాగమైన హార్‌మెగిద్దోనులో నాశనమౌతారు.—మలా. 4:1.

16, 17. (ఎ) యేసు తన ఉపమానంలో పేర్కొన్న చివరి సంఘటన ఏమిటి? (బి) ఆ సంఘటన భవిష్యత్తులో జరగనుందనే నిర్ధారణకు మనమెందుకు వచ్చాం?

16 ఐదవదిగా, తేజరిల్లడం. యేసు తన ప్రవచనాన్ని ఇలా ముగించాడు: “అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.” (మత్త. 13:43) అది ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? ఆ మాటలు భవిష్యత్తులో నెరవేరతాయి. ప్రస్తుతం భూమిపై జరుగుతున్న దాని గురించి యేసు చెప్పలేదు గానీ, భవిష్యత్తులో పరలోకంలో జరగనున్న దాని గురించి చెప్పాడు. f[6] ఈ నిర్ధారణకు రావడానికిగల రెండు కారణాలను పరిశీలించండి.

17 మొదటిగా, “ఎప్పుడు” అనే ప్రశ్నను చూద్దాం. యేసు ఇలా అన్నాడు: “అప్పుడు నీతిమంతులు . . . తేజరిల్లుదురు.” ఈ లేఖనంలో “అప్పుడు” అనే పదం, యేసు అంతకుముందే చెప్పిన సంఘటన చోటుచేసుకునే సమయాన్ని అంటే, ‘గురుగులు అగ్నిగుండములో పడవేయబడే’ సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది. అది మహాశ్రమల చివరి భాగంలో జరుగుతుంది. కాబట్టి, అభిషిక్త క్రైస్తవులు ‘తేజరిల్లడం’ అనేది కూడా భవిష్యత్తులోనే జరుగుతుందని దీన్నిబట్టి తెలుస్తోంది. రెండవదిగా, “ఎక్కడ” అనే ప్రశ్నను పరిశీలిద్దాం. ‘నీతిమంతులు రాజ్యములో తేజరిల్లుదురు’ అని యేసు అన్నాడు. దానర్థం ఏమిటి? మహాశ్రమల తొలి భాగం ముగిసిన తర్వాత ఇంకా ఈ భూమ్మీద మిగిలి ఉన్న అభిషిక్తులందరూ అప్పటికే తమ చివరి ముద్రను పొంది ఉండాలి. ఆ తర్వాత, మహాశ్రమల గురించిన ప్రవచనంలో యేసు చెప్పినట్లే, వాళ్లు పరలోకానికి సమకూర్చబడతారు. (మత్త. 24:31) నీతిమంతులు అక్కడ తమ “తండ్రి రాజ్యములో” తేజరిల్లుతారు. హార్‌మెగిద్దోను యుద్ధం ముగిసిన కొద్దికాలానికే వాళ్లు ‘గొఱ్ఱెపిల్ల పెళ్లిలో’ యేసుకు పెళ్లికుమార్తెగా ఉంటారు.—ప్రక. 19:6-9.

మనం ఎలా ప్రయోజనం పొందుతాం

18, 19. యేసు చెప్పిన గోధుమలు, గురుగుల ఉపమానాన్ని పరిశీలించడం వల్ల మనం ఏయే విధాలుగా ప్రయోజనం పొందాం?

18 ఆ ఉపమానాన్ని పరిశీలించడం వల్ల మనమెలా ప్రయోజనం పొందాం? మూడు విధాలుగా ప్రయోజనం పొందాం. ఒకటి, అది మన అవగాహనను మరింత పెంచింది. యెహోవా, ఈ దుష్టత్వాన్ని అనుమతించడానికి గల ఓ ప్రాముఖ్యమైన కారణాన్ని ఆ ఉపమానం తెలియజేస్తోంది. ఆయన ‘కరుణాపాత్ర ఘటములైన’ గోధుమల తరగతిని తయారుచేయడానికి ‘ఉగ్రతాపాత్రమైన ఘటములను . . . సహించాడు.’ g[7] (రోమా. 9:22-24) రెండు, అది మన విశ్వాసాన్ని పెంచింది. అంతం దగ్గరపడుతుండగా, మన శత్రువులు మనపై మరింత ఎక్కువగా దాడి చేస్తారు కానీ, “విజయము పొందజాలరు.” (యిర్మీయా 1:19 చదవండి.) మన పరలోక తండ్రి అయిన యెహోవా ఎన్నో ఏళ్లుగా గోధుమల తరగతిని కాపాడుకుంటూ వచ్చినట్టే, మనకు కూడా “సదాకాలము” యేసు ద్వారా, దేవదూతల ద్వారా తోడుగా ఉంటాడు.—మత్త. 28:20.

19 మూడు, ఆ ఉపమానం గోధుమల  తరగతిని గుర్తుపట్టడానికి తోడ్పడింది. అదెందుకు అంత ప్రాముఖ్యం? అంత్యదినాల గురించి ఎన్నో వివరాలతో కూడిన ప్రవచనాన్ని చెబుతున్నప్పుడు యేసు వేసిన ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే, గోధుమల తరగతి ఎవరో గుర్తించడం ప్రాముఖ్యం. ఆయన ఇలా అడిగాడు: “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?” (మత్త. 24:45) తర్వాతి రెండు ఆర్టికల్స్‌ దానికి సంతృప్తికరమైన జవాబిస్తాయి.

 

a 2వ పేరా: [1] ఈ ఉపమానంలోని వేరే అంశాల భావాన్ని ఒకసారి గుర్తుచేసుకోవడానికి దయచేసి కావలికోట మార్చి 15, 2010 సంచికలో ‘నీతిమంతులు సూర్యునిలా తేజరిల్లుతారు’ అనే ఆర్టికల్‌ చదవండి.

b 3వ పేరా: [2] యేసు అపొస్తలులు మరణించారు, భూమ్మీద మిగిలిన అభిషిక్తులు దాసులతో కాకుండా గోధుమలతో పోల్చబడ్డారు కాబట్టి, ఆ ఉపమానంలోని దాసులు దేవదూతలకు సూచనగా ఉన్నారు. ఉపమానంలో తర్వాతి భాగం చూపిస్తున్నట్లుగా, గురుగులను కూర్చే కోతగాండ్రు దేవదూతలు.—మత్త. 13:39.

c 6వ పేరా: [3] ఇది సవరించిన అవగాహన. యేసు 1918లో తనిఖీ చేశాడని ఇదివరకు అనుకునేవాళ్లం.

d 7వ పేరా: [4] బైబిలు విద్యార్థులు 1910 నుండి 1914 వరకు 40,00,000 పుస్తకాలు, 20,00,00,000 కరపత్రాలు పంచిపెట్టారు.

e 14వ పేరా: [5] మత్తయి 13:42కు ఇది సవరించిన అవగాహన. నకిలీ క్రైస్తవుల అసలు రూపాన్ని అంటే, వాళ్లు “దుష్టుని కుమారులు” అనే విషయాన్ని “రాజ్యకుమారులు” బట్టబయలు చేసినందుకు ఆ నకిలీ క్రైస్తవులు ఎన్నో దశాబ్దాలుగా ‘ఏడుస్తూ పండ్లు కొరుక్కుంటున్నారు’ అని ఇంతకుముందు మన ప్రచురణలు పేర్కొన్నాయి. (మత్త. 13:38) అయితే, ‘పండ్లు కొరుక్కోవడం’ అనేది నాశనానికి సంబంధించిన విషయమని గమనించాలి.—కీర్త. 112:10.

f 16వ పేరా: [6] “బుద్ధిమంతులైతే [అభిషిక్త క్రైస్తవులు] ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు” అని దానియేలు 12:3 చెబుతోంది. ప్రకటనా పనిలో పాల్గొనడం ద్వారా వాళ్లు ఇంకా భూమ్మీద ఉండగానే ప్రకాశిస్తారు. ఏదేమైనా మత్తయి 13:43, వాళ్లు పరలోక రాజ్యంలో తేజరిల్లే సమయం గురించి మాట్లాడుతోంది. ఆ రెండు లేఖనాలూ ఒకే పనిని అంటే, ప్రకటనా పనిని సూచిస్తున్నాయని ఇంతకుముందు అనుకున్నాం.