కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపర్చాడు

దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపర్చాడు

‘మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడ్డారు.’—1 కొరిం. 6:11.

1. నెహెమ్యా యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు, ఘోరమైన ఏ సంఘటనలు ఆయన కంటబడ్డాయి? (ఈ ఆర్టికల్‌ ప్రారంభ చిత్రం చూడండి.)

 యెరూషలేములో పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. దుష్టుడైన ఓ అన్యుడు ఆలయములోని గదిలో ఉంటున్నాడు. లేవీయులు తమ బాధ్యతను గాలికొదిలేసి వెళ్తున్నారు. ఆరాధనలో ముందుండి నడిపించాల్సిన పెద్దలే, సబ్బాతు రోజున వ్యాపారాలు చేసుకుంటున్నారు. చాలామంది ఇశ్రాయేలీయులు అన్యులను పెళ్లిచేసుకుంటున్నారు. సా.శ.పూ. 443 తర్వాత కొద్దికాలానికి నెహెమ్యా యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు, ఆయన కంటబడిన ఘోరమైన సంఘటనల్లో అవి కొన్ని మాత్రమే.—నెహె. 13:6.

2. ఇశ్రాయేలీయులు ఎలా ఓ పరిశుద్ధ జనాంగమయ్యారు?

2 ఇశ్రాయేలీయులు దేవుని సమర్పిత ప్రజలు. సా.శ.పూ. 1513లో, ఇశ్రాయేలీయులు యెహోవా చిత్తం చేయడానికి సంసిద్ధత చూపించారు. వాళ్లు ఇలా అన్నారు: “యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదము.” (నిర్గ. 24:3) కాబట్టి, దేవుడు వాళ్లను పరిశుద్ధపర్చాడు లేదా తన స్వకీయ జనాంగంగా వాళ్లను ప్రత్యేకపర్చాడు. అది ఎంత గొప్ప గౌరవమో కదా! నలభై ఏళ్ల తర్వాత, మోషే వాళ్లకు ఇలా గుర్తుచేశాడు: “నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.”—ద్వితీ. 7:6.

3. నెహెమ్యా రెండోసారి యెరూషలేముకు వచ్చే సమయానికి యూదుల ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉంది?

3 విచారకరమైన విషయమేమిటంటే, పరిశుద్ధ జనాంగంగా ఉండాలని ఇశ్రాయేలీయులు మొదట్లో చూపించిన తాపత్రయం రానురాను తగ్గిపోయింది. అన్నికాలాల్లో యెహోవాను సేవిస్తున్న యూదులు కొంతమంది ఉన్నప్పటికీ, ఎక్కువమంది దేవుని చిత్తం చేయడం కన్నా పైకి పరిశుద్ధులుగా లేదా భక్తిపరులుగా కనిపించడానికే ఎక్కువ ప్రయాసపడేవాళ్లు. నెహెమ్యా రెండోసారి యెరూషలేముకు వచ్చే సమయానికల్లా, సత్యారాధనను పునరుద్ధరించేందుకు శేషించిన నమ్మకమైన యూదులు బబులోను నుండి యెరూషలేముకు వచ్చి సుమారు వంద సంవత్సరాలు గడిచాయి. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఇశ్రాయేలీయుల ఆసక్తి మళ్లీ సన్నగిల్లింది.

4. పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి మనకు సహాయపడే ఏ అంశాలను ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం?

4 ఒక విధంగా, దేవుడు నాటి ఇశ్రాయేలీయులను పరిశుద్ధపర్చినట్లే నేటి యెహోవాసాక్షులను కూడా పరిశుద్ధపర్చాడు. అభిషిక్త క్రైస్తవులు, అలాగే ‘గొప్పసమూహంలోని’ వాళ్లు పవిత్ర సేవ కోసం ప్రత్యేకించబడ్డారు కాబట్టి వాళ్లంతా పరిశుద్ధులే. (ప్రక. 7:9, 14, 15; 1 కొరిం. 6:11) కాలక్రమేణా ఇశ్రాయేలీయులు చేజార్చుకున్నట్లుగా, మనలో ఏ ఒక్కరం దేవుని ముందు మనకున్న పరిశుద్ధమైన స్థానాన్ని చేజార్చుకోకూడదు. ఆ ప్రమాదాన్ని తప్పించుకుని, పరిశుద్ధులుగా ఉంటూ యెహోవా సేవలో ఉపయోగపడాలంటే మనం ఏం చేయాలి? ఈ ఆర్టికల్‌లో మనం నెహెమ్యా 13వ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన నాలుగు అంశాల్ని పరిశీలిస్తాం: (1) చెడు సహవాసాలకు దూరంగా ఉండండి; (2) యెహోవా చేస్తున్న ఏర్పాట్లకు మద్దతివ్వండి; (3) ఆధ్యాత్మిక విషయాలకు మొదటిస్థానం ఇవ్వండి; (4) మీ క్రైస్తవ గుర్తింపును కాపాడుకోండి. ఇప్పుడు ఆ అంశాలను వివరంగా చూద్దాం.

చెడు సహవాసాలకు దూరంగా ఉండండి

యెహోవాపట్ల తనకున్న యథార్థతను నెహెమ్యా ఎలా చూపించాడు? (5, 6 పేరాలు చూడండి)

5, 6. ఎల్యాషీబు, టోబీయాలు ఎవరు? టోబీయాతో ఎల్యాషీబు ఎందుకు సహవసించి ఉండవచ్చు?

5 నెహెమ్యా 13:4-9 చదవండి. మన చుట్టూ అపరిశుద్ధమైన విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి, పరిశుద్ధంగా ఉండడం అంత సులభం కాదు. ఎల్యాషీబు, టోబీయాల గురించి ఆలోచించండి. ఎల్యాషీబు ప్రధాన యాజకుడు; అమ్మోనీయుడైన టోబీయా, యూదయలో పారసీక ప్రభుత్వం నియమించిన ఓ చిరుద్యోగి అయ్యుండవచ్చు. యెరూషలేము గోడల్ని తిరిగి కట్టడానికి నెహెమ్యా చేస్తున్న ప్రయత్నాల్ని టోబీయా, అతని సహచరులు వ్యతిరేకించారు. (నెహె. 2:10) అమ్మోనీయులు ఆలయ పరిసరాల్లోకి రాకూడదనే నియమం ఉంది. (ద్వితీ. 23:3) అలాంటప్పుడు, అమ్మోనీయుడైన టోబీయాను ప్రధాన యాజకుడు ఆలయంలోని భోజనశాలలో ఎలా ఉండనిచ్చాడు?

6 టోబీయా, ఎల్యాషీబుకు చాలా సన్నిహితుడయ్యాడు. టోబీయా, అతని కుమారుడు యోహానాను యూదా స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అంతేకాక, చాలామంది యూదులు టోబీయా గురించి గొప్పగా మాట్లాడేవాళ్లు. (నెహె. 6:17-19) ఎల్యాషీబు మనవళ్లలో ఒకడు సమరయ అధిపతియైన సన్బల్లటు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ సన్బల్లటు, టోబీయా సన్నిహిత సహచరుల్లో ఒకడు. (నెహె. 13:28) ఈ బంధుత్వాలను బట్టి చూస్తే, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అవిశ్వాసియైన ఆ వ్యతిరేకిని ఆలయంలో ఎందుకు ఉండనిచ్చాడో అర్థంచేసుకోవచ్చు. కానీ, నెహెమ్యా మాత్రం టోబీయా సామాన్లను భోజనశాల నుండి బయటకు పడేసి యెహోవా పట్ల తనకున్న యథార్థతను చూపించాడు.

7. పెద్దలు, మరితరులు దేవుని ముందు తమ పరిశుద్ధమైన స్థానాన్ని కళంకపర్చే పనేదీ చేయకుండా ఎలా జాగ్రత్తపడతారు?

7 దేవుని సమర్పిత ప్రజలమైన మనం ఎప్పుడైనా సరే మొదటిగా యథార్థత చూపించాల్సింది యెహోవాకే. ఆయన నీతి ప్రమాణాలకు కట్టుబడి ఉండకపోతే, మనం దేవుని ముందు పరిశుద్ధంగా ఉండలేం. మనం బంధుత్వాల కోసం బైబిలు ప్రమాణాలను పక్కనబెట్టకూడదు. క్రైస్తవ పెద్దలు తమ సొంత అభిప్రాయాలూ సొంత భావాల ప్రకారం కాదుగానీ, యెహోవా ఆలోచన ప్రకారం నడుచుకుంటారు. (1 తిమో. 5:21) యెహోవాతో తమకున్న సంబంధాన్ని పాడుచేసే వాటన్నిటికీ పెద్దలు దూరంగా ఉంటారు.—1 తిమో. 2:8.

8. సహవాసాల విషయంలో యెహోవా సమర్పిత సేవకులందరూ ఏమి గుర్తుంచుకోవాలి?

8 “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని మనం గుర్తుంచుకోవాలి. (1 కొరిం. 15:33) మన బంధువుల్లో కొంతమంది మన జీవితాలపై మంచి ప్రభావం చూపించకపోవచ్చు. యెరూషలేము గోడల్ని తిరిగి కట్టే పనిలో నెహెమ్యాకు మద్దతునివ్వడం ద్వారా ఎల్యాషీబు అక్కడి ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. (నెహె. 3:1) కానీ కాలం గడుస్తుండగా బహుశా టోబీయా, మరితరుల చెడు ప్రభావం వల్ల ఎల్యాషీబు యెహోవా దేవుని ముందు తనను తాను కళంకపర్చుకునే పనులు చేశాడు. అదే మంచి సహవాసులైతే బైబిలు చదవమని, క్రైస్తవ కూటాలకు హాజరవ్వమని, పరిచర్యలో పాల్గొనమని, అలాంటి ఇతర ప్రయోజనకరమైన క్రైస్తవ కార్యకలాపాల్లో పాలుపంచుకోమని మనల్ని ప్రోత్సహిస్తారు. సరైనది చేసేందుకు తోడ్పడే కుటుంబ సభ్యుల్ని మనం ఎంతో ప్రేమిస్తాం, అమూల్యంగా ఎంచుతాం.

యెహోవా ఏర్పాట్లకు మద్దతివ్వండి

9. ఆలయ ఏర్పాట్లలో ఎందుకు అవకతవకలు జరిగాయి? వాటినిబట్టి నెహెమ్యా ఎవరిని నిలదీశాడు?

9 నెహెమ్యా 13:10-13 చదవండి. నెహెమ్యా యెరూషలేముకు తిరిగి వచ్చే సమయానికల్లా ఆలయానికి వచ్చే విరాళాలు దాదాపు ఆగిపోయాయి. ఆ మద్దతు లేనందువల్ల లేవీయులు తమ బాధ్యతలను వదిలేసి పొలాల్లో పని చేయడానికి వెళ్లనారంభించారు. నెహెమ్యా ఆ పరిస్థితి గురించి అధికారులను నిలదీశాడు. బహుశా, అప్పటికి వాళ్లు తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్లు తమకు నియమించిన పనిని చేయకపోతుండవచ్చు అంటే, ప్రజల నుండి దశమభాగాల్ని వసూలు చేయకపోతుండవచ్చు, లేదా వసూలు చేసినా వాటిని ఆలయానికి పంపించకపోతుండవచ్చు. (నెహె. 12:44) అందుకే, నెహెమ్యా దశమభాగాల్ని వసూలు చేయించడానికి కదంతొక్కాడు. ఆలయంలోకి తెచ్చేవాటిని నిలువచేసే గదుల్నీ, అలాగే వచ్చిన భాగాల్ని పంచిపెట్టే పనినీ పర్యవేక్షించడానికి నెహెమ్యా కొంతమంది నమ్మకస్థులను నియమించాడు.

10, 11. సత్యారాధనకు మద్దతునిచ్చే విషయంలో దేవుని ప్రజలకు ఏ గొప్ప అవకాశం ఉంది?

10 దానిలో మనకేమైనా పాఠం ఉందా? ఉంది. ఎందుకంటే, మనకున్న విలువైన వాటితో యెహోవాను ఘనపర్చే గొప్ప అవకాశం మనకుందని అది గుర్తుచేస్తుంది. (సామె. 3:9) మనం యెహోవా పనికోసం విరాళాలు వేసినప్పుడు నిజానికి, యెహోవాకు చెందిన దాన్నే తిరిగి ఆయనకు ఇస్తాం. (1 దిన. 29:14-16) ఇవ్వడానికి మన దగ్గర ఉన్నది సరిపోదని మనకు అనిపించవచ్చు కానీ, ఇవ్వాలనే కోరిక ఉంటే మనందరమూ ఇవ్వగలం.—2 కొరిం. 8:12.

11 ఎనిమిదిమంది పిల్లలున్న ఓ కుటుంబం, ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్న వృద్ధ దంపతులను వారానికోసారి భోజనానికి పిలిచేది. ఎన్నో ఏళ్లపాటు వాళ్లు అలాగే చేశారు. అంతమంది పిల్లలున్నా ఆ తల్లి ఇలా అంటుండేది: “పది ప్లేట్లు పెట్టిన టేబుల్‌ మీద ఇంకో రెండు ప్లేట్లు పెట్టలేమా?” వారానికోసారి భోజనం పెట్టడం ఓ పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ అలా ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ పయినీరు దంపతులు ఎంతో కృతజ్ఞత చూపించారు. నిజానికి, ఈ దంపతుల వల్ల ఆ కుటుంబానికి ఎన్నో ఆశీర్వాదాలు వచ్చాయి. వాళ్ల ప్రోత్సాహకరమైన మాటలు, అనుభవాలు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి ఆ కుటుంబంలోని పిల్లలకు చక్కని ప్రేరణను ఇచ్చాయి. ఆ పిల్లలందరూ ఆ తర్వాత పూర్తికాల పరిచర్యలో అడుగుపెట్టారు.

12. సంఘంలో నియమిత పురుషులు ఎలాంటి మంచి మాదిరిని ఉంచుతున్నారు?

12 మనం మరో పాఠం కూడా నేర్చుకోవచ్చు. యెహోవా చేస్తున్న ఏర్పాట్లకు మద్దతునిచ్చే విషయంలో నెహెమ్యాలాగే నేడు నియమిత పురుషులు నాయకత్వం వహిస్తారు. సంఘంలోని ఇతరులు వాళ్ల మాదిరినుండి ప్రయోజనం పొందుతారు. పెద్దలు కూడా దైవిక ఏర్పాట్లకు మద్దతిచ్చే విషయంలో పౌలును ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన సత్యారాధనకు మద్దతునిచ్చాడు, అవసరమైన నిర్దేశాలను ఇచ్చాడు. ఉదాహరణకు, విరాళాలు ఇవ్వడానికి సంబంధించి ఆయన ఎన్నో చక్కని సలహాలు ఇచ్చాడు.—1 కొరిం. 16:1-3; 2 కొరిం. 9:5-7.

ఆధ్యాత్మిక విషయాలకు మొదటిస్థానం ఇవ్వండి

13. విశ్రాంతి దినాన్ని కొంతమంది యూదులు ఎలా అగౌరవపరిచారు?

13 నెహెమ్యా 13:15-21 చదవండి. మనం ఒకవేళ వస్తుపరమైన విషయాల్లో తలమునకలై ఉంటే మన ఆధ్యాత్మికత నెమ్మదిగా నీరుగారిపోయే అవకాశం ఉంది. నిర్గమకాండము 31:13 చూపిస్తున్నట్లుగా విశ్రాంతి దినం, ఇశ్రాయేలీయులు పరిశుద్ధ జనాంగంగా ఉన్నారని వాళ్లకు గుర్తుచేసేది. విశ్రాంతి దినాన్ని కుటుంబ ఆరాధనకు, ప్రార్థనకు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి కేటాయించాల్సి ఉండేది. నెహెమ్యా సమకాలీనుల్లో కొందరికి, విశ్రాంతి దినం కూడా మామూలు రోజుగా మారిపోయింది, ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయేవాళ్లు. ఆరాధనను అటకెక్కించేశారు. అక్కడ జరిగేదంతా గమనించిన నెహెమ్యా, విశ్రాంతి దినం ప్రారంభమయ్యే ముందు అంటే ఆరవ రోజు సాయంత్రాన విదేశీ వర్తకులను తరిమేసి ఆ పట్టణపు ద్వారాలు మూయించేవాడు.

14, 15. (ఎ) డబ్బు గురించిన ఆలోచనలను తగ్గించుకోకపోతే మనకేమి జరగవచ్చు? (బి) మనం ఎలా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించవచ్చు?

14 నెహెమ్యా నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఒక పాఠం ఏమిటంటే, మనం డబ్బు గురించిన ఆలోచనలను తగ్గించుకోవాలి. లేదంటే, మనం ఇట్టే పక్కకుమళ్లే ప్రమాదముంది లేదా మనం రెండు పడవల మీద కాళ్లు పెట్టే ప్రమాదం కూడా ఉంది. ప్రాముఖ్యంగా, మనం మన ఉద్యోగాన్ని ప్రేమిస్తుంటే ఆ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడం గురించి యేసు ఇచ్చిన హెచ్చరికను గుర్తుంచుకోండి. (మత్తయి 6:24 చదవండి.) నెహెమ్యాకు ఆర్థిక వనరులున్నా, ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు తన సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు? (నెహె. 5:14-18) తూరు పట్టణస్థులతో వ్యాపార లావాదేవీలు జరిపే బదులు తన సహోదరులకు సహాయం చేయడానికీ, యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చే పనులు చేయడానికీ అంకితమయ్యాడు. అలాగే నేడు కూడా క్రైస్తవ పెద్దలు, పరిచర్య సేవకులు సంఘానికి ప్రయోజనం చేకూర్చే పనులు చేయడం మీదే దృష్టి నిలుపుతారు. వాళ్లు చూపించే అలాంటి స్ఫూర్తిని బట్టి తోటి విశ్వాసులు వాళ్లను ప్రేమిస్తారు. తత్ఫలితంగా, దేవుని ప్రజల మధ్య ప్రేమ, సమాధానం, భద్రత విలసిల్లుతాయి.—యెహె. 34:25, 28.

15 ఇప్పుడు క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాల్సిన అవసరం లేకపోయినా, పౌలు ఇలా అన్నాడు: “దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.” (హెబ్రీ. 4:9, 10) క్రైస్తవులమైన మనం విధేయతతో యెహోవా సంకల్పానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించవచ్చు. మీరు, మీ ప్రియమైనవాళ్లు కుటుంబ ఆరాధనకు, కూటాల హాజరుకు, పరిచర్యకు మొదటిస్థానం ఇస్తున్నారా? ఉద్యోగ స్థలంలో మనం మన యజమానులతో, వ్యాపార సహవాసులతో దృఢంగా వ్యవహరించాల్సి రావచ్చు. ముఖ్యంగా రాజ్యసంబంధ ప్రాధాన్యతల్ని చిన్నచూపు చూసేవాళ్లతో మనం అలా ఉండాల్సిరావచ్చు. మనం పరిశుద్ధమైన వాటికి ప్రాధాన్యమిస్తూ, వాటిమీద సరైన ధ్యాస పెట్టాలంటే ఒక విధంగా మనం ‘తూరు పట్టణస్థులను తరిమేసి నగర గుమ్మములను మూసేయాల్సి’ రావచ్చు. దేవుడు మనల్ని పరిశుద్ధపర్చాడు కాబట్టి, మనల్ని మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘యెహోవా సేవ కోసం నేను ప్రత్యేకపర్చబడ్డానని నా జీవిత విధానం చూపిస్తోందా?’—మత్త. 6:33.

మీ క్రైస్తవ గుర్తింపును కాపాడుకోండి

16. నెహెమ్యా కాలంలో, దేవుని పరిశుద్ధ ప్రజలుగా ఇశ్రాయేలు జనాంగానికి ఉన్న గుర్తింపుకు ఎలా ముప్పు వాటిల్లింది?

16 నెహెమ్యా 13:23-27 చదవండి. నెహెమ్యా కాలంలో, ఇశ్రాయేలీయులు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం సామాన్య విషయమైపోయింది. నెహెమ్యా మొదటిసారి యెరూషలేమును సందర్శించినప్పుడు, అన్యులను పెళ్లి చేసుకోబోమని ప్రమాణం చేయించి, ఒప్పంద పత్రం మీద పెద్దలందరిచేత సంతకాలు చేయించాడు. (నెహె. 10:1-2; 30) అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత నెహెమ్యా కనుగొన్నదేంటంటే, వాళ్లు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడమే కాక దేవుని పరిశుద్ధ ప్రజలుగా తమకున్న గుర్తింపును పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆ అన్య స్త్రీలకు పుట్టిన పిల్లలకు హెబ్రీ భాష మాట్లాడడం గానీ, చదవడం గానీ రాదు. మరి ఆ పిల్లలు పెద్దయ్యాక ఇశ్రాయేలీయులమని భావిస్తారా? లేక అష్డోదీయులమని, అమ్మోనీయులమని, మోయాబీయులమని భావిస్తారా? హెబ్రీ భాష రాకుండా, ధర్మశాస్త్రాన్ని అర్థంచేసుకోగలరా? తమ తల్లులు ఆరాధించిన అబద్ధ దేవుళ్లను కాకుండా యెహోవా దేవుణ్ణి తెలుసుకొని, ఆయనను ఆరాధించాలనే నిర్ణయం తీసుకోవడం వాళ్లకు ఎలా వీలౌతుంది? తక్షణమే ఓ దృఢమైన చర్య అవసరమైంది. నెహెమ్యానే దానికి నడుంబిగించాడు.—నెహె. 13:28.

యెహోవాతో సన్నిహిత సంబంధం పెంచుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి (17, 18 పేరాలు చూడండి)

17. పిల్లలు యెహోవాతో వ్యక్తిగత సంబంధం కలిగివుండడానికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

17 నేడు మనం సరైన చర్యలు తీసుకుంటూ, క్రైస్తవ గుర్తింపును సంపాదించుకునేందుకు మన పిల్లలకు సహాయం చేయాలి. తల్లిదండ్రులారా, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నా పిల్లలు లేఖన సత్యమనే “స్వచ్ఛమైన భాషను” ఎంత బాగా మాట్లాడతారు? (జెఫ. 3:9, NW) నా పిల్లల సంభాషణను బట్టి ఏమి అర్థమౌతోంది? వాళ్ల మాటలు దేవుని ఆత్మకు అనుగుణంగా ఉన్నాయా లేక ఈ లౌకికాత్మకు అనుగుణంగా ఉన్నాయా?’ మీ పిల్లలు ఇంకాస్త మారాల్సి ఉందని మీకనిపిస్తే, నిరాశచెందకండి. ఏదైనా భాష నేర్చుకోవాలంటే సమయం పడుతుంది, ముఖ్యంగా మన చుట్టూ ఏకాగ్రతకు భంగం కలిగించేవి ఉన్నప్పుడు అలా జరుగుతుంది. మీ పిల్లలు, విశ్వాసంలో రాజీపడేలా చేసే ఒత్తిళ్లను ఎన్నో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఓపికను కనబరుస్తూ కుటుంబ ఆరాధనను, అలాంటి ఇతర అవకాశాల్ని ఉపయోగిస్తూ యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి. (ద్వితీ. 6:6-9) సాతాను లోకం నుండి వేరుగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను నొక్కిచెప్పండి. (యోహా. 17:15-17) మీ పిల్లల హృదయాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి.

18. యెహోవాకు సమర్పించుకునేలా తమ పిల్లల్ని సిద్ధం చేసే విషయంలో తల్లిదండ్రులే అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నారని ఎందుకు చెప్పవచ్చు?

18 ఏదేమైనా, యెహోవాను సేవించాలనే నిర్ణయం తీసుకోవాల్సింది పిల్లలే. అయినా, ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది. మీరు చక్కని ఆదర్శాన్ని ఉంచాలి, హద్దుల్ని స్పష్టంగా వివరించాలి, ఆయా నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాల గురించి పిల్లలతో చర్చించాలి. తల్లిదండ్రులారా, యెహోవాకు సమర్పించుకునేలా మీ పిల్లల్ని సిద్ధం చేసే విషయంలో మీకన్నా మెరుగైన స్థానంలో ఇంకెవ్వరూ లేరు. క్రైస్తవ గుర్తింపును సంపాదించుకొని, దాన్ని నిలబెట్టుకోవడానికి పిల్లలకు మీ సహాయం అవసరం. ఏదేమైనా, మనమందరం మన “వస్త్రములను” అంటే, క్రీస్తు అనుచరులమని గుర్తించడానికి దోహదపడే లక్షణాలను, ప్రమాణాలను నిలబెట్టుకోవడానికి ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలి.—ప్రక. 3:4, 5; 16:15.

‘మేలుకై జ్ఞాపకముంచుకుంటాడు’

19, 20. “మేలుకై” యెహోవా మనల్ని జ్ఞాపకముంచుకోవాలంటే మనం ఏమి చేయాలి?

19 మలాకీ ప్రవక్త కూడా నెహెమ్యా సమకాలీనుల్లో ఒకడు. “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము . . . వ్రాయబడెను” అని మలాకీ రాశాడు. (మలా. 3:16, 17) తనపట్ల భక్తిపూర్వక భయం చూపిస్తూ, తన నామాన్ని ప్రేమించేవాళ్లను యెహోవా ఎన్నడూ మర్చిపోడు.—హెబ్రీ. 6:10.

20 “నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము” అని నెహెమ్యా ప్రార్థించాడు. (నెహె. 13:31) మనం చెడు సహవాసాలకు దూరంగా ఉంటూ, యెహోవా చేస్తున్న ఏర్పాట్లకు మద్దతిస్తూ, ఆధ్యాత్మిక విషయాలకు మొదటిస్థానం ఇస్తూ, మన క్రైస్తవ గుర్తింపును కాపాడుకుంటూ ఉంటే నెహెమ్యా పేరులాగే మన పేర్లు కూడా దేవుని జ్ఞాపకార్థ గ్రంథములో ఉంటాయి. ‘మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకుంటూ’ ఉందాం. (2 కొరిం. 13:5) యెహోవాతో మనకున్న పరిశుద్ధమైన సంబంధాన్ని మనం కాపాడుకుంటే, “మేలుకై” ఆయన మనల్ని జ్ఞాపకముంచుకుంటాడు.