కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ‘అనుదినం నా భారాన్ని భరిస్తున్నాడు’

యెహోవా ‘అనుదినం నా భారాన్ని భరిస్తున్నాడు’

భరించలేని అనారోగ్య సమస్యతో నేను బాధపడుతున్నాను, ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నాది. అయినా ఇప్పటివరకు, మన ప్రియ పరలోక తండ్రి నా జీవితంలో ఇచ్చిన ప్రేమపూర్వక మద్దతును నేను రుచి చూశాను. అంతేకాక, గత 24 ఏళ్ల నుండి పయినీరుగా యెహోవా సేవచేసే ప్రత్యేక ఆనందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను.

నేను 1956లో స్పైనా బిఫిడా అనే ఆరోగ్య సమస్యతో పుట్టాను. నా వెన్నెముకలో ఉన్న నాడీ నాళం పూర్తిగా మూసుకుపోనందువల్ల, నా నాడులు పాడై, నడక కష్టమవ్వడమే కాక ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి.

నేను పుట్టడానికి కొంతకాలం ముందు, యెహోవాసాక్షుల మిషనరీ దంపతులు మా అమ్మానాన్నలతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టారు. నా చిన్నప్పుడు మేము నమీబియాలోని ఊసాకోస్‌ అనే ఊర్లో ఉండేవాళ్లం, మా ఊర్లో అక్కడక్కడ కేవలం కొద్దిమంది ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు. కాబట్టి, కూటాల్లో చర్చించాల్సిన సమాచారాన్ని మేము కుటుంబంగా కలిసి అధ్యయనం చేసేవాళ్లం. ఏడేళ్ల ప్రాయంలో నాకు ఓ సర్జరీ (urostomy) అయ్యింది. ఆ సర్జరీతో, మూత్రవిసర్జన జరిగేందుకు వీలుగా నా శరీరంలో ఓ కృత్రిమ రంధ్రాన్ని ఏర్పర్చారు. నాకు 14 ఏళ్లున్నప్పుడు మూర్ఛరోగం వచ్చింది. మరోవైపున, నేను హైస్కూల్‌ విద్యను కూడా పూర్తిచేయలేకపోయాను. ఎందుకంటే దగ్గర్లో ఏ పాఠశాల లేదు, పైగా నాకు ఎప్పుడూ మా అమ్మానాన్నల సహాయం అవసరమయ్యేది.

అయినా, యెహోవాతో నాకున్న సంబంధాన్ని బలపర్చుకోవాలని నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు మన సంస్థ ప్రచురిస్తున్న చాలా ప్రచురణలు నా మాతృభాష అయిన ఆఫ్రికాన్స్‌లో లేవు కాబట్టి, నేను మన పుస్తకాలు చదవడం కోసమని ఇంగ్లీషు నేర్చుకున్నాను. 19 ఏళ్ల వయసులో నేను రాజ్యప్రచారకురాలినై బాప్తిస్మం తీసుకున్నాను. ఆ తర్వాతి నాలుగు సంవత్సరాల్లో నాకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి, దానికి తోడు భావోద్వేగపరమైన సమస్యలు కూడా ఎదుర్కొన్నాను. అంతేకాక, మా ఊరు ఓ ఉమ్మడి సమాజంలా ఉండేది కాబట్టి, మనుష్య భయం వల్ల నేను పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనలేకపోయాను.

నాకు దాదాపు 23 ఏళ్లున్నప్పుడు, మా కుటుంబం నమీబియా నుండి దక్షిణాఫ్రికాకు మారింది. అక్కడ మొట్టమొదటిసారిగా నేను ఓ సంఘంతో సహవసించడం మొదలుపెట్టాను. అది ఓ అద్భుతమైన అనుభూతి! అయితే అక్కడ నాకు, (మలవిసర్జన జరిగేందుకు శరీరంలో ఓ కృత్రిమ రంధ్రాన్ని ఏర్పాటుచేసేందుకు) కొలొస్టమీ అనే మరో సర్జరీ జరిగింది.

కొంతకాలానికి, మా ప్రాంతీయ పర్యవేక్షకుడు పయినీరు సేవ గురించి మాట్లాడడం విన్నాను. ఆయన చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకాయి. పయినీరు సేవ చేసేందుకు నా ఆరోగ్యం అనుమతించదని నాకు తెలుసు. కానీ, ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో యెహోవా నన్ను మోయడాన్ని నేను చవిచూశాను కాబట్టి, నేను క్రమ పయినీరు సేవ చేసేందుకు దరఖాస్తు పెట్టుకున్నాను. అయితే, నా ఆరోగ్య సమస్యల దృష్ట్యా సంఘ పెద్దలు నా దరఖాస్తును ఆమోదించడానికి సంకోచించారు.

అయినా సరే, నేను రాజ్య ప్రకటనాపనిలో చేయగలిగినదంతా చేయాలని తీర్మానించుకున్నాను. మా అమ్మ సహాయంతో, ఇతరుల మద్దతుతో నేను ఓ ఆరు నెలల పాటు పయినీర్లు ఇచ్చేన్ని గంటలు ఇవ్వగలిగాను. అది పయినీరు సేవ చేయాలనే నా దృఢ నిశ్చయాన్ని నిరూపించింది, నా ఆరోగ్య సమస్యలతో నెట్టుకురాగలనని చూపించింది. కాబట్టి, నేను మళ్లీ పయినీరు సేవ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను, ఈసారి నా దరఖాస్తును పెద్దలు ఆమోదించారు. 1988, సెప్టెంబరు 1న నేను క్రమ పయినీరు అయ్యాను.

పయినీరుగా నేను అన్నివేళలా యెహోవా సహాయాన్ని రుచి చూశాను. నా ఆరోగ్య పరిస్థితి గురించే ఆలోచించుకుంటూ కూర్చునే బదులు కొత్తవాళ్లకు సత్యం నేర్పించడం అలాంటి ఆలోచనల నుండి కాపాడింది, బలాన్ని ఇచ్చింది. అంతేకాకుండా, ఆధ్యాత్మికంగా కూడా ఎదిగేలా చేసింది. యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకునేలా ఎంతోమందికి సహాయం చేయడంలో ఉన్న గొప్ప ఆనందం కూడా నాకు దక్కింది.

ఇప్పటికీ నా ఆరోగ్య పరిస్థితి అలానే ఉంది. కానీ యెహోవా ‘అనుదినం నా భారాన్ని భరిస్తున్నాడు.’ (కీర్త. 68:19) యెహోవా సహాయం వల్ల, నేను భారంగా బ్రతకడం లేదుగానీ బ్రతికి ఉండడంలోని సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను.