కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వ్యక్తిగత విషయాల్లో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోండి

వ్యక్తిగత విషయాల్లో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోండి

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.” —సామె. 3:5.

1, 2. నిర్ణయాలు తీసుకోవడమంటే మీకు ఇష్టమేనా? గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మీరెలా భావిస్తున్నారు?

 ప్రతీరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం గురించి మీరెలా భావిస్తారు? కొందరు తమకు సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకోవాలని కోరుకుంటారు. వాళ్లకు నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని వాదిస్తారు, తమ నిర్ణయాలు వేరేవాళ్లు తీసుకోవడమన్న ఆలోచననే ఇష్టపడరు. అయితే, ఇంకొందరు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి భయపడతారు. మరికొందరు నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన సలహాల కోసం పుస్తకాల మీద, సలహాదారుల మీద ఆధారపడుతూ ఎంతో డబ్బును ఖర్చు చేస్తారు.

2 పైన చెప్పినలాంటి పరిస్థితులను మనం కూడా కొన్నిసార్లు ఎదుర్కొంటాం. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కాబట్టి, వాటి విషయంలో మనమేమీ చేయలేమని మనకు తెలుసు. అయినప్పటికీ, జీవితంలోని చాలా విషయాల్లో నచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మనకు ఉంది. (గల. 6:5) ఏదేమైనా, మనం తీసుకునే నిర్ణయాలన్నీ సరైనవేననీ, వాటివల్ల మంచి ఫలితాలొస్తాయనీ చెప్పలేం.

3. నిర్ణయాలు తీసుకునే విషయంలో మనకెలాంటి నిర్దేశాలు ఉన్నాయి? నిర్ణయాలు తీసుకోవడం కొన్నిసార్లు ఎందుకు కష్టం?

3 జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రాముఖ్యమైన విషయాల్లో యెహోవా స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చాడు కాబట్టి ఆయన సేవకులమైన మనం సంతోషిస్తున్నాం. ఆ నిర్దేశాలు పాటిస్తే మనం యెహోవాను సంతోషపెట్టే, మనకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అయినా, మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలు, పరిస్థితులకు సంబంధించి బైబిల్లో సూటియైన నిర్దేశాలు లేవు. మరి అలాంటి సందర్భాల్లో మనం ఏమి చేయాలో ఎలా నిర్ణయించుకోవచ్చు? ఉదాహరణకు, దొంగతనం చేయకూడదని మనకు తెలుసు. (ఎఫె. 4:27, 28) కానీ కొంతమంది మాత్రం, ఇతరులకు చెందిన చాలా తక్కువ విలువైన వస్తువును తీసుకున్నా, లేదా నిజంగా అవసరం కొద్దీ దేన్నైనా తీసుకున్నా అది పెద్ద తప్పేమీ కాదని అంటారు. స్పష్టమైన నిర్దేశాలేవీ లేవని ప్రజలు అనుకుంటున్న కొన్ని విషయాల్లో మనం సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ఈ విషయంలో మనకేమైనా సహాయం ఉందా?

స్వస్థబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి

4. నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇతరులు బహుశా మనకు ఏ సలహా ఇవ్వవచ్చు?

4 మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నామని తోటి సహోదరునితో అన్నప్పుడు, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఆయన మనకు సలహా ఇవ్వవచ్చు. అవును, అది మంచి సలహానే. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం గురించి బైబిలు మనకు ఈ హెచ్చరికను ఇస్తోంది: “తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.” (సామె. 21:5) అయితే, స్వస్థబుద్ధితో నిర్ణయాలు తీసుకోవడం అంటే ఏమిటి? దానర్థం మనం పరిస్థితి గురించి జాగ్రత్తగా ఆలోచించి, సహేతుకంగా ఉంటూ, అన్ని విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడమనేనా? సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇవన్నీ అవసరమే, అయితే స్వస్థబుద్ధితో నిర్ణయాలు తీసుకోవడంలో అంతకంటే ఎక్కువే ఉంది.—రోమా. 12:3; 1 పేతు. 4:7.

5. మనకు పరిపూర్ణమైన స్వస్థబుద్ధి ఎందుకు లేదు?

5 మనలో ఏ ఒక్కరమూ పరిపూర్ణమైన స్వస్థబుద్ధితో పుట్టలేదని ఒప్పుకోవాల్సిందే. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే మనమందరం పాపులం, అపరిపూర్ణులం కాబట్టి మనకు పరిపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ మానసిక సామర్థ్యం లేవు. (కీర్త. 51:5; రోమా. 3:23) అంతేకాక, మనలో చాలామందికి గతంలో సాతాను “గ్రుడ్డితనము” కలుగజేశాడు; యెహోవా ఎవరో, ఆయన నీతియుక్త ప్రమాణాలేమిటో మనకు అప్పట్లో తెలియదు. (2 కొరిం. 4:4; తీతు 3:3) కాబట్టి మనకు మంచిదిగా, సరైనదిగా అనిపించిన దాన్నే ఆధారంగా తీసుకుని, ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకున్నా అది తప్పుడు నిర్ణయమే అవ్వవచ్చు.—సామె. 14:12.

6. స్వస్థబుద్ధిని పెంపొందించుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

6 మనం అపరిపూర్ణులమైనా, మన పరలోక తండ్రియైన యెహోవా మాత్రం అన్ని విషయాల్లో పరిపూర్ణుడు. (ద్వితీ. 32:4) సంతోషకరమైన విషయమేమిటంటే, మనం మనసును మార్చుకొని, స్వస్థబుద్ధిని కలిగి ఉండడానికి అవసరమైన సహాయాన్ని ఆయన ఇచ్చాడు. (2 తిమోతి 1:7 చదవండి.) క్రైస్తవులమైన మనం ఆలోచించి, పరిస్థితిని సరైన విధంగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి. మనం మన ఆలోచనల్ని, భావాల్ని నియంత్రించుకుని యెహోవాలాగే ఆలోచించడం, భావించడం, పనిచేయడం అలవాటు చేసుకోవాలి.

7, 8. ఒత్తిళ్లలో లేదా ఇబ్బందుల్లో కూడా స్వస్థబుద్ధితో నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమేనని ఏ అనుభవం చూపిస్తోంది?

7 ఈ అనుభవాన్ని పరిశీలించండి. సాధారణంగా, పనికోసం వేరే దేశాలకు వలస వెళ్లేవాళ్లు, పని చేసుకుంటూ డబ్బు సంపాదించుకోవడానికి వీలుగా, తమకు పుట్టిన పిల్లల్ని వెంటనే తమ స్వదేశంలోని బంధువుల ఇళ్లకు పంపిస్తారు. a విదేశంలో జీవిస్తున్న ఓ స్త్రీ పండంటి పిల్లవాడికి జన్మనిచ్చింది. అప్పటికే, ఆ తల్లి బైబిలు అధ్యయనం చేస్తూ మంచి ఆధ్యాత్మిక ప్రగతి సాధించింది. స్నేహితులు, బంధువులంతా కలిసి, ఆ పిల్లవాణ్ణి నానమ్మ-తాతయ్యల దగ్గరకు పంపించేయమని ఆమెను, ఆమె భర్తను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అయితే, ఆ స్త్రీ బైబిలు అధ్యయనంలో నేర్చుకున్నట్లు, ఆ పిల్లాడిని పెంచడం దేవుడు తనకిచ్చిన బాధ్యత అని గుర్తించింది. (కీర్త. 127:3; ఎఫె. 6:4) అప్పుడు ఆమె ఏం చేయాలి? పిల్లల్ని అలా పంపించడమే సరైనదని అందరూ అంటున్నారు కాబట్టి ఆమె తన పిల్లవాడిని పంపించేయాలా? లేక ఆర్థికంగా తనకు నష్టం జరుగుతుందని, కొంతమంది తిడతారని తెలిసినా తాను బైబిలు నుండి నేర్చుకున్నదాన్నే పాటించాలా? ఆమె స్థానంలో మీరే ఉంటే ఏమి చేసేవాళ్లు?

8 తోటివాళ్ల ఒత్తిళ్లు, ఇబ్బందుల మధ్య ఆ స్త్రీ యెహోవా ముందు తన హృదయాన్ని కుమ్మరించి ఆయన నిర్దేశాన్ని కోరింది. పరిస్థితి గురించి తనతో బైబిలు అధ్యయనం చేస్తున్న సహోదరితో, సంఘలోని ఇతరులతో మాట్లాడిన తర్వాత ఆమె ఆ విషయంలో యెహోవా ఆలోచన ఏమిటో అర్థం చేసుకుంది. అంతేకాకుండా, తల్లిదండ్రుల నుండి దూరమైతే, శైశవ దశలో ఉన్న ఆ పిల్లవాడి లేతమనసుకు అయ్యే గాయం గురించి కూడా ఆమె ఆలోచించింది. విషయం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో పరిశీలించిన తర్వాత పిల్లవాణ్ణి పంపించకూడదని ఆ తల్లి నిర్ణయించుకుంది. సంఘంలోని వాళ్లు అందించిన సహాయాన్ని, పిల్లవాడు సంతోషంగా, ఆరోగ్యంగా తమ దగ్గరే పెరగడాన్ని చూసి ఆ భర్త బైబిలు అధ్యయనానికి ఒప్పుకొని, తన భార్యతో పాటు కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టాడు.

9, 10. స్వస్థబుద్ధి కలిగివుండడం అంటే ఏమిటి? మనమెలా స్వస్థబుద్ధి కలిగివుండవచ్చు?

9 అది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. కానీ, స్వస్థబుద్ధితో నిర్ణయాలు తీసుకోవడం అంటే కేవలం మనకూ ఇతరులకూ నచ్చినదాన్నో లేదా సరైనదిగా అనిపించినదాన్నో చేయడం కాదని అది చూపిస్తోంది. మన అపరిపూర్ణ మనసు, హృదయం మరీ తొందరగా లేదా మరీ ఆలస్యంగా నడిచే గడియారం లాంటివి. అలాంటి గడియారాన్ని నమ్ముకుని పనులు చేస్తే తీవ్రమైన సమస్యలు రావచ్చు. (యిర్మీ. 17:9) దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఆలోచించడం, భావించడం నేర్చుకుంటే మనం సమస్యలను తప్పించుకోగలుగుతాము.—యెషయా 55:8, 9 చదవండి.

10 అందుకే బైబిలు ఇలా చెబుతోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామె. 3:5, 6) “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక” అనే మాటల్ని గమనించండి. తర్వాత “[యెహోవా] అధికారమునకు ఒప్పుకొనుము” అనే మాట ఉంది. అవును, ఆయన మాత్రమే పరిపూర్ణ స్వస్థబుద్ధి గలవాడు. అందుకే, మనం ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు బైబిలు తెరచి ఆ విషయం గురించి దేవుని అభిప్రాయం ఏమిటో తెలుసుకొని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. స్వస్థబుద్ధి కలిగివుండాలంటే మనం యెహోవాలాగే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.

మీ జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇవ్వండి

11. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలా నేర్చుకోవచ్చు?

11 తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో, వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో నేర్చుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా, సత్యంలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు లేదా ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక పరిణతి సాధిస్తున్న వాళ్లకు అది ఓ సవాలు. అలాంటివాళ్లు ఆధ్యాత్మిక శిశువులని బైబిలు వర్ణిస్తోంది, అయితే వాళ్లు కూడా నిజమైన ప్రగతి సాధించడం సాధ్యమే. ఓ శిశువు కింద పడకుండా నడవడం ఎలా నేర్చుకుంటాడో మీరెప్పుడైనా గమనించారా? ఆ శిశువు చిన్నచిన్న అడుగులు పదేపదే వేస్తూ నడవడం నేర్చుకుంటాడు. తెలివైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆధ్యాత్మిక శిశువులకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. పరిణతి చెందిన వాళ్లు “అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు” అని అపొస్తలుడైన పౌలు అన్న మాటలను గుర్తుచేసుకోండి. “అభ్యాసము”, “సాధకము” అనే మాటలు నిరంతరం, పదేపదే కృషి చేయాల్సివుంటుందని సూచిస్తున్నాయి. సత్యంలోకి కొత్తగా వచ్చిన వాళ్లు చేయాల్సింది అదే.—హెబ్రీయులు 5:13, 14 చదవండి.

రోజువారీ విషయాల్లో మనం సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇస్తాం (11వ పేరా చూడండి)

12. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?

12 ముందే ప్రస్తావించినట్లుగా, ప్రతీరోజు మనం చిన్నాపెద్దా నిర్ణయాలు ఎన్నో తీసుకోవాల్సివుంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, మనం దాదాపు 40 శాతం పనులను, జాగ్రత్తగా ముందే ఆలోచించి కాదుగానీ మన అలవాట్ల ఆధారంగానే చేస్తాం. ఉదాహరణకు, ప్రతీ రోజు ఉదయం మీరు ఏ బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అది చాలా చిన్న విషయమని మీకనిపించవచ్చు, అందుకే దానిగురించి పెద్దగా ఆలోచించరు పైగా తొందరలో ఉంటే అస్సలు ఆలోచించరు. కానీ, యెహోవా సేవకులకు ఎలాంటి బట్టలు తగినవో మీరు జాగ్రత్తగా ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. (2 కొరిం. 6:3, 4) మీరు బట్టలు కొంటున్నప్పుడు ప్రజలు ప్రస్తుతం ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారనే దానిగురించి బహుశా ఆలోచిస్తుండవచ్చు. అయితే అవి పద్ధతిగా ఉన్నాయా లేవా, వాటిని కొనడానికి మీదగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని ఆలోచిస్తారా? ఇలాంటి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటే, మనం మన జ్ఞానేంద్రియాలకు తగిన శిక్షణ ఇచ్చినవాళ్లమౌతాం. దానివల్ల పెద్దపెద్ద విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.—లూకా 16:10; 1 కొరిం. 10:31.

సరైనది చేయాలనే కృతనిశ్చయం పెంపొందించుకోండి

13. మనం చేయాలనుకున్న పనులను చేయాలనే కృతనిశ్చయాన్ని కలిగివుండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

13 నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే వాటికి కట్టుబడి ఉండి, ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. ఉదాహరణకు, ఓ వ్యక్తి సిగరెట్టు మానేయాలనుకుంటాడు, కానీ దాన్ని మానేయడానికి సరిపడా ప్రేరణ దొరకక మానలేకపోతుండవచ్చు. నిర్ణయించుకున్న దాని ప్రకారం నడవాలంటే ఒక వ్యక్తికి దృఢసంకల్పం అవసరం. కృతనిశ్చయాన్ని కొంతమంది కండరాలతో పోలుస్తారు. వాటిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే లేదా వ్యాయామం చేస్తే అవి అంత బలంగా తయారౌతాయి. కానీ మనం వాటిని చాలా అరుదుగా వాడుతుంటే అవి బలహీనమౌతాయి. అయితే, మనం నిర్ణయాలకు కట్టుబడి, వాటి ప్రకారం జీవించాలనే కృతనిశ్చయాన్ని బలపర్చుకోవాలంటే ఏం చేయాలి? యెహోవా మీద ఆధారపడాలి.—ఫిలిప్పీయులు 2:13 చదవండి.

14. తాను చేయాలనుకున్న దాన్ని చేయడానికి పౌలుకు సహాయం ఎలా దొరికింది?

14 పౌలు ఈ విషయాన్ని సొంత అనుభవం నుండి తెలుసుకున్నాడు. ఓ సందర్భంలో ఆయన ఇలా బాధపడ్డాడు: “మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.” తాను ఏమి చేయాలనుకున్నాడో, తాను ఏమి చేయాలో పౌలుకు తెలుసు కానీ దాన్ని ఎందుకో చేయలేకపోయాడు. ఆయన ఇలా ఒప్పుకున్నాడు: “అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.” మరి ఆయన సమస్యకు పరిష్కారం దొరికిందా? నిశ్చయంగా దొరికింది. ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు: “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమా. 7:18, 22-25) మరోచోట ఆయన ఇలా రాశాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”—ఫిలి. 4:13.

15. సరైనది చేయాలనే కృతనిశ్చయం మనకెందుకు ఉండాలి?

15 దేవుణ్ణి ప్రీతిపర్చాలంటే మనం సరైనది చేయాలి. కర్మెలు పర్వతం దగ్గర బయలు ఆరాధకులతో, భ్రష్టులైన ఇశ్రాయేలీయులతో ఏలీయా అన్న ఈ మాటలు గుర్తుతెచ్చుకోండి: “యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడి.” (1 రాజు. 18:21) ఇశ్రాయేలీయులకు ఏమి చేయాలో తెలుసు, కానీ వాళ్లు ఏ నిర్ణయం తీసుకోకుండా ‘రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు.’ దానికి పూర్తి భిన్నంగా యెహోషువ మంచి మాదిరినుంచాడు, ఆయన ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో . . . మీరు కోరుకొనుడి . . . నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.” (యెహో. 24:15) ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? యెహోషువ, ఆయనతో ఉన్నవాళ్లు “పాలు తేనెలు ప్రవహించు” వాగ్దాన దేశంలో నివసించే ఆశీర్వాదం పొందారు.—యెహో. 5:6.

జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోండి, ఆశీర్వాదాలు పొందండి

16, 17. యెహోవా చిత్తానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే కలిగే ప్రయోజనాలను ఉదాహరణతో చెప్పండి?

16 ఈ అనుభవాన్ని గమనించండి. ముగ్గురు పిల్లలున్న ఓ కుటుంబ పెద్ద కొత్తగా బాప్తిస్మం తీసుకున్నాడు. ఓ రోజు ఆయన తోటి ఉద్యోగి, ఎక్కువ జీతంతోపాటు మరిన్ని ప్రయోజనాలు దొరికే మరో కంపెనీకి మారదామని ఆ సహోదరునితో అన్నాడు. ఆ విషయం గురించి మన సహోదరుడు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాడు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వల్ల ఎక్కువ జీతం రాకపోయినా, వారాంతాల్లో సెలవులు ఉంటాయని, అందువల్ల కుటుంబమంతా కలిసి కూటాలకు, పరిచర్యకు వెళ్లవచ్చనే ఉద్దేశంతోనే ఆయన ఈ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకవేళ కొత్త ఉద్యోగంలో చేరితే కనీసం కొంతకాలం వరకైనా ఇవన్నీ చేయడం కుదరదనే విషయాన్ని ఆయన గ్రహించాడు. మీరే ఆ స్థానంలో ఉంటే ఏమి చేస్తారు?

17 ఎక్కువ జీతం కన్నా ఆధ్యాత్మిక ప్రయోజనాలే ముఖ్యం అనుకొని ఆ సహోదరుడు వేరే ఉద్యోగంలో చేరలేదు. తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆయన బాధపడ్డాడా? ఎంతమాత్రం లేదు. ఎక్కువ జీతం వల్ల కాదుగానీ, ఆధ్యాత్మిక ఆశీర్వాదాల వల్లే తన కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని ఆయన భావించాడు. పది సంవత్సరాల వయస్సున్న తమ పెద్ద కూతురు తమను, తోటి సహోదరసహోదరీలను, యెహోవాను ఎంతో ప్రేమిస్తుందని చెప్పినప్పుడు ఆయనా, ఆయన భార్యా ఎంతో ఆనందించారు. తాను యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నానని ఆమె చెప్పింది. యెహోవా ఆరాధనకు మొదటి స్థానం ఇచ్చే విషయంలో తన తండ్రి ఆదర్శంగా ఉన్నందుకు ఆ పాప ఎంత కృతజ్ఞత చూపించి ఉంటుందో కదా!

జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుని, దేవుని ప్రజల మధ్య ఆనందంగా ఉండండి (18వ పేరా చూడండి)

18. ప్రతీరోజు మనం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

18 గొప్ప మోషే అయిన యేసు, ఎన్నో దశాబ్దాలుగా సాతాను లోకమనే అరణ్యంలో యెహోవా సత్యారాధకులను నడిపిస్తున్నాడు. గొప్ప యెహోషువగా యేసు, ఈ కుళ్లు పట్టిన వ్యవస్థను పూర్తిగా రూపుమాపి, వాగ్దానం చేయబడిన నీతియుక్త కొత్త లోకంలోకి తన అనుచరులను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. (2 పేతు. 3:13) కాబట్టి, మన పాత ఆలోచనలవైపు, పాత అలవాట్లవైపు, విలువలవైపు, ఉద్దేశాలవైపు వెళ్లడానికి ఇది సమయం కాదు. బదులుగా, మన విషయంలో దేవుని చిత్తం ఏమిటో మరింత స్పష్టంగా తెలుసుకోవాలి. (రోమా. 12:2; 2 కొరిం. 13:5) కాబట్టి, దేవుని శాశ్వత ఆశీర్వాదాలను పొందేందుకు యోగ్యులమని, ప్రతీరోజు మనం తీసుకునే నిర్ణయాల్లో, ఎంపికల్లో చూపిద్దాం.—హెబ్రీయులు 10:38, 39 చదవండి.

a అలా పంపించడానికి మరో కారణం, ఆ నానమ్మ-తాతయ్యలు తమ మనుమడిని స్నేహితులకు, ఇతర బంధువులకు చూపించుకోవాలనుకోవడమే.