కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిని చూస్తే జీవముగల దేవుడు ఉన్నాడని తెలుస్తుంది

సృష్టిని చూస్తే జీవముగల దేవుడు ఉన్నాడని తెలుస్తుంది

“ప్రభువా [“యెహోవా,” NW], మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి . . . గనుక నీవే మహిమ పొందనర్హుడవు.”ప్రక. 4:10, 11.

1. మన విశ్వాసం బలంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

 తమ కళ్లతో చూస్తేగానీ ఏ విషయాన్ని నమ్మమని చాలామంది అంటారు. అయితే, “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు” అని బైబిలు చెబుతుంది. (యోహా. 1:18) కంటికి కనబడని దేవుని మీద విశ్వాసం ఉంచేలా అలాంటి వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు? దానితోపాటు, ‘అదృశ్యదేవుడైన’ యెహోవాపై మన విశ్వాసం బలంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? (కొలొ. 1:15) అలా చేయాలంటే మనం మొదటిగా, యెహోవా గురించిన సత్యాన్ని మరుగుచేసే బోధలను గుర్తించాలి. ఆ తర్వాత బైబిల్ని నైపుణ్యంగా ఉపయోగించి, “దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించే” బోధలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి.—2 కొరిం. 10:4, 5.

2, 3. దేవుని గురించిన సత్యం తెలుసుకోకుండా ఏ రెండు బోధలు ప్రజల్ని గుడ్డివాళ్లను చేస్తున్నాయి?

2 దేవుని గురించిన సత్యం తెలుసుకోకుండా ప్రజల్ని గుడ్డివాళ్లను చేస్తున్న ఒక తప్పుడు బోధ, పరిణామ సిద్ధాంతం. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ బోధ బైబిలుకు విరుద్ధమైనది, పైగా అది ప్రజలకు ఏ నిరీక్షణా ఇవ్వదు. జీవం దానంతటదే ఉనికిలోకి వచ్చిందని పరిణామ సిద్ధాంతం చెబుతుంది. మనుషుల జీవితానికి ఎలాంటి సంకల్పం లేదన్నట్లు అది బోధిస్తుంది.

3 మరోవైపున కొంతమంది చర్చీ నాయకులేమో, భూమి దానిమీదున్న జీవరాశితో సహా ఈ విశ్వమంతా కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితమే సృష్టించబడిందని బోధిస్తారు. సృష్టివాదం అనే ఈ సిద్ధాంతాన్ని బోధించేవాళ్లు బహుశా బైబిలును గౌరవిస్తుండవచ్చు, కానీ ఈ సృష్టంతటినీ దేవుడు కేవలం 24 గంటల నిడివిగల 6 రోజుల్లోనే తయారుచేశాడని వాళ్లు వాదిస్తుంటారు. వాళ్లు నమ్మేది తప్పని నిరూపించే అనేక విశ్వసనీయ విజ్ఞానశాస్త్ర రుజువులు దొరికినా వాటిని అంగీకరించరు. అలా, సృష్టివాదం బైబిలు చెబుతోన్న విషయాలు తప్పన్నట్లు, సహేతుకమైనవి కావన్నట్లు చూపిస్తూ నిజానికి బైబిల్ని అగౌరవపరుస్తుంది. అలాంటి బోధకులు మొదటి శతాబ్దానికి చెందిన కొంతమందిని మనకు గుర్తుకుతెస్తారు, వాళ్లకు దేవుని గురించి ఆసక్తివున్నా, వాళ్ల ఆసక్తి ‘జ్ఞానానుసారంగా’ లేదని బైబిలు చెబుతోంది. (రోమా. 10:2) లోతుగా పాతుకుపోయిన పరిణామ సిద్ధాంతం, సృష్టివాదం వంటి బోధలు తప్పని మనం దేవుని వాక్యాన్ని ఉపయోగించి ఎలా నిరూపించవచ్చు? a అలా చేయాలంటే, మనం బైబిలు బోధల గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకోవడానికి మనస్ఫూర్తిగా కృషి చేయాలి.

రుజువుల మీద, సరైన తర్కం మీద ఆధారపడిందే విశ్వాసం

4. మన విశ్వాసం దేనిమీద ఆధారపడి ఉండాలి?

4 మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలని బైబిలు చెబుతోంది. (సామె. 10:14) మనం మనుషుల తత్వజ్ఞానం లేదా మతాచారాల ఆధారంగా కాకుండా రుజువుల ఆధారంగా, సరైన తర్కం ఆధారంగా తన మీద విశ్వాసం పెంచుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీయులు 11:1 చదవండి.) యెహోవాపై బలమైన విశ్వాసం పెంచుకోవాలంటే, ఆయన ఉన్నాడని ముందు మనం గట్టిగా నమ్మాలి. (హెబ్రీయులు 11:6 చదవండి.) ఎవరినో ఒకరిని నమ్మాలనే కోరికతో మనం యెహోవాను నమ్మట్లేదు గానీ, మన ఆలోచనా సామర్థ్యంతో నిజానిజాలను పరీక్షించి మనం ఆయనను నమ్ముతున్నాం.—రోమా. 12:1, 2.

5. దేవుడు ఉన్నాడని మనం ఎందుకు నమ్మవచ్చో ఒక కారణం చెప్పండి?

5 దేవుణ్ణి మనం చూడలేకపోయినా ఆయన ఉన్నాడని ఎందుకు గట్టిగా నమ్మవచ్చో అపొస్తలుడైన పౌలు ఒక కారణం చెబుతున్నాడు. యెహోవా గురించి ఆయనిలా రాశాడు: “ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.” (రోమా. 1:20) దేవుణ్ణి నమ్మనివాళ్లు ఈ మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరెలా సహాయం చేయవచ్చు? సృష్టికర్త శక్తిని, జ్ఞానాన్ని వెల్లడిచేసే సృష్టిలోని రుజువుల్ని మీరు వాళ్లతో చర్చించవచ్చు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

సృష్టి దేవుని శక్తిని వెల్లడిచేస్తుంది

6, 7. మనల్ని కాపాడడానికి యెహోవా ఏర్పాటు చేసిన ఏ రెండు కవచాల్లో ఆయన శక్తి వెల్లడౌతుంది?

6 మనల్ని సురక్షితంగా ఉంచడానికి యెహోవా ఏర్పాటు చేసిన రెండు కవచాల్లో ఆయన శక్తి స్పష్టంగా వెల్లడౌతుంది. అవి భూమ్మీది వాతావరణం, అయస్కాంత క్షేత్రం. వాతావరణాన్నే తీసుకుంటే, అది కేవలం మనం ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇవ్వడం కంటే ఎక్కువే చేస్తుంది. అది, అంతరిక్షం నుండి వాయువేగంతో దూసుకొచ్చే అనేక శకలాల నుండి భూమిని ఓ కవచంలా కాపాడుతుంది. భూమ్మీద ఎంతో వినాశనం కలిగించగల ఆ రాతి శకలాలు సాధారణంగా భూవాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. దానివల్ల అప్పుడప్పుడు రాత్రిపూట ఆకాశంలో సుందరమైన కాంతి రేఖలు కనిపిస్తాయి.

7 భూమ్మీది అయస్కాంత క్షేత్రం కూడా మనల్ని హాని నుండి కాపాడుతుంది. భూమి లోపల ఉండే కేంద్రపు పైపొరల్లో ఎక్కువగా ద్రవరూపంలోని ఇనుము ఉంటుంది. అది పుట్టించే శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం భూమి చుట్టూ ఉండడంతోపాటు అంతరిక్షం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ క్షేత్రం సూర్యుని నుండి, దానిమీద జరిగే హానికరమైన విస్ఫోటనాల నుండి మనల్ని కాపాడుతుంది. ఈ విస్ఫోటనాల వల్ల ప్రమాదకరమైన రేడియోధార్మికత భూమి వైపుకు వస్తుంది. దానివల్ల భూమ్మీదున్న జీవరాశి మలమలా మాడిపోకుండా ఈ కవచం కాపాడుతుంది. భూ అయస్కాంత క్షేత్రం రేడియోధార్మికతను గ్రహించుకుంటుంది లేదా బయటకు పంపించివేస్తుంది. అయస్కాంత క్షేత్రం చేసే పనిని, ఉత్తర దక్షిణ ధ్రువాల్లో రాత్రిపూట ఆకాశంలో కనువిందు చేసే రంగురంగుల కాంతి పుంజాల్లో చూడవచ్చు. అవును, నిస్సందేహంగా యెహోవా “బలాతిశయము” గల దేవుడు.—యెషయా 40:26 చదవండి.

సృష్టి దేవుని జ్ఞానాన్ని వెల్లడిచేస్తుంది

8, 9. భూమ్మీద జీవం కొనసాగేలా యెహోవా ఏర్పాటు చేసిన చక్రాల్లో ఆయన జ్ఞానం ఎలా వెల్లడౌతుంది?

8 భూమ్మీద జీవం కొనసాగేలా యెహోవా ఏర్పాటు చేసిన కొన్ని చక్రాల్లో ఆయన జ్ఞానం వెల్లడౌతుంది. ఉదాహరణకు, అధిక జనసాంద్రత ఉన్న పట్టణంలో మీరు జీవిస్తున్నట్లు ఊహించుకోండి. చుట్టూ గోడలున్న ఆ పట్టణానికి మంచినీటి సరఫరా లేదు, వ్యర్థాలు బయటికి పోయే మార్గం కూడా లేదు. కొద్ది కాలంలోనే ఆ పట్టణం చెత్తాచెదారంతో నిండిపోయి నివాసానికి పనికిరాకుండా పోతుంది. ఒక రకంగా ఈ భూమి ఆ పట్టణం లాంటిదే. భూమ్మీద మంచినీళ్లు పరిమితంగానే ఉన్నాయి, పైగా ఇక్కడి వ్యర్థాలను వదిలించుకోవడం అంత సులభమేమీ కాదు. అయినా ఈ భూమి తరతరాలుగా కోట్లాది ప్రాణులను పోషించగలుగుతోంది. అదెలా సాధ్యం? జీవానికి అవసరమైన ప్రాముఖ్యమైన వాటిని మళ్లీమళ్లీ వాడుకునే అద్భుత సామర్థ్యం భూమికి ఉంది కాబట్టే అది సాధ్యమౌతోంది.

9 ఆక్సిజన్‌ చక్రానే తీసుకోండి. కోట్లకొలది జీవులు ఆక్సిజన్‌ను పీల్చుకొని, కార్బన్‌ డైయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. అయినా ఈ భూమ్మీద ఆక్సిజన్‌ అయిపోవడం లేదు, మనం విడుదల చేసే కార్బన్‌ డైయాక్సైడ్‌ “వ్యర్థ” వాయువుతో వాతావరణం పూర్తిగా నిండిపోవడం లేదు. ఎందుకు? దానికి కారణం ‘కిరణజన్య సంయోగక్రియ’ (photosynthesis) అనే అద్భుత ప్రక్రియ. ఆ ప్రక్రియలో పచ్చని మొక్కలు కార్బన్‌ డైయాక్సైడ్‌ను, నీటిని, సూర్యకాంతిని గ్రహించి పిండి పదార్థాలను, ఆక్సిజన్‌ను తయారుచేస్తాయి. ఆ ఆక్సిజన్‌ను మనం తీసుకోవడంతో ఆక్సిజన్‌ చక్రం పూర్తౌతుంది. యెహోవా తాను సృష్టించిన మొక్కల ద్వారా అక్షరార్థంగానే “అందరికిని జీవమును ఊపిరిని” దయచేస్తున్నాడు. (అపొ. 17:25) అది సాటిలేని యెహోవా జ్ఞానానికి ప్రతీక కాదా!

10, 11. యెహోవా అద్భుత జ్ఞానాన్ని ఒక రకమైన సీతాకోకచిలుక, తూనీగ ఎలా వెల్లడిచేస్తున్నాయి?

10 మన సాటిలేని గ్రహం మీద మనుగడ సాగిస్తున్న ఎన్నో రకాల జీవుల్లో కూడా యెహోవా అద్భుత జ్ఞానం కనిపిస్తుంది. భూమ్మీద దాదాపు 20 లక్షల నుండి 10 కోట్ల రకాల జీవజాతులు ఉన్నట్లు అంచనా. (కీర్తన 104:24 చదవండి.) వాటిలోని కొన్ని ప్రాణుల రూపకల్పనలో యెహోవా జ్ఞానం ఎలా వెల్లడౌతుందో పరిశీలించండి.

తూనీగ కంటిని రూపొందించిన తీరులో యెహోవా జ్ఞానం కనబడుతుంది; వృత్తంలో అదే కన్ను కొన్ని రెట్లు పెద్దదిగా (11వ పేరా చూడండి)

11 ఉదాహరణకు, ఒక రకమైన సీతాకోకచిలుక మెదడు దాదాపు ఆవగింజంత ఉంటుంది. కానీ ఆ సీతాకోకచిలుకకు ఎంత సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయంటే అది సూర్యుని సహాయంతో కెనడా నుండి మెక్సికోలోని ఒకానొక అడవికి, అంటే దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరైతే సూర్యుడు ఉదయించినప్పుడు, అస్తమించినప్పుడు అదెలా ప్రయాణిస్తుంది? సూర్యుని కదలికల ప్రభావం దానిమీద పడకుండా యెహోవా ఆ సీతాకోకచిలుక మెదడును సృష్టించాడు. ఇక తూనీగ విషయమే తీసుకుంటే, దానికి రెండు సంయుక్త కళ్లు ఉంటాయి. ఒక్కో కంటిలో సుమారు 30,000 కటకాలు ఉంటాయి. అయినా వాటన్నిటి నుండి వచ్చే సంకేతాల్ని అర్థం చేసుకుని, తన చుట్టుపక్కల జరిగే అతిచిన్న మార్పును కూడా గుర్తించే సామర్థ్యం దాని మెదడుకు ఉంది.

12, 13. జీవుల్లోని కణాలను యెహోవా సృష్టించిన విధానం ఎందుకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది?

12 జీవుల్లోని కణాలను యెహోవా సృష్టించిన విధానం ఇంకా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉదాహరణకు మీ శరీరాన్నే చూడండి, దాంట్లో దాదాపు 10 కోట్ల కోట్లు కణాలుంటాయి. ప్రతీ కణంలో సన్నని తాడువంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని డిఆక్సిరైబో న్యూక్లియిక్‌ యాసిడ్‌ (DNA) అంటారు. మీ శరీర నిర్మాణానికి కావాల్సిన ఎంతో సమాచారం దానిలో ఉంటుంది.

13 DNAలో ఎంత సమాచారం పడుతుందో తెలుసా? ఒక గ్రాము DNAలో పట్టే సమాచారాన్ని సీడీలో పట్టే సమాచారంతో పోల్చి చూద్దాం. మీరు ఒక నిఘంటువులోని సమాచారాన్నంతా ఒక్క సీడీలో నిక్షిప్తం చేయవచ్చు, కేవలం ఒక ప్లాస్టిక్‌ పళ్లెం వంటి సీడీలో అంత సమాచారం పట్టడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే ఒకే ఒక్క గ్రాము DNAలో దాదాపు 10 లక్షల కోట్ల సీడీల్లో పట్టే సమాచారం ఉంటుంది! మరో విధంగా చెప్పాలంటే ఒక స్పూన్‌లో పట్టే DNAలో, ఇప్పుడు భూమ్మీదున్న జనాభాకు సుమారు 350 రెట్ల ప్రజల శరీర నిర్మాణానికి అవసరమయ్యే సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చు!

14. శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలు యెహోవా గురించి మీరెలా భావించేలా చేస్తున్నాయి?

14 మానవ శరీర నిర్మాణానికి అవసరమైన సమాచారం సూచనార్థకమైన పుస్తకంలో రాసిపెట్టి ఉందని రాజైన దావీదు వివరించాడు. యెహోవా దేవుని గురించి ఆయనిలా చెప్పాడు: “నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.” (కీర్త. 139:16) తన సొంత శరీరాన్ని యెహోవా ఎంత అద్భుతంగా సృష్టించాడో ఆలోచించినప్పుడు దావీదు యెహోవాను స్తుతించకుండా ఉండలేకపోయాడు. గత కొన్ని సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలు కూడా, మన శరీరాన్ని అద్భుతంగా తయారుచేసిన యెహోవాపట్ల మనకున్న భక్తిపూర్వక భయాన్ని పెంచుతాయి. వాళ్లు కనుగొన్న విషయాలు, కీర్తనకర్త యెహోవా గురించి రాసిన ఈ మాటలను ఒప్పుకోవడానికి మనకు మరో కారణాన్ని ఇస్తాయి: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” (కీర్త. 139:14) మరైతే, ‘జీవముగల దేవుడు’ ఉన్నాడనడానికి ఈ సృష్టిలో ఉన్న రుజువుల్ని ప్రజలు ఎందుకు చూడలేకపోతున్నారు?

జీవముగల దేవుణ్ణి ఘనపర్చడానికి ప్రజలకు సహాయం చేయండి

15, 16. (ఎ) యెహోవాకున్న సృష్టి సామర్థ్యంపై మన కృతజ్ఞతను సంస్థ ఇచ్చే ప్రచురణలు ఎలా పెంపొందించాయి? (బి) “ఇది రూపించబడిందా?” ఆర్టికల్స్‌లో మీకు ఏది బాగా నచ్చింది?

15 దశాబ్దాలుగా తేజరిల్లు! (ఆంగ్లం) పత్రిక, జీవముగల దేవుడున్నాడని సృష్టి ఎలా వెల్లడిచేస్తుందో అర్థం చేసుకోవడానికి లక్షలమందికి సహాయం చేస్తూనే ఉంది. ఉదాహరణకు, “సృష్టికర్త ఉన్నాడా?” అనే అంశంతో 2006, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు! తెలుగు సంచిక ప్రచురితమైంది. పరిణామ సిద్ధాంతాన్ని, సృష్టివాదాన్ని గుడ్డిగా నమ్మేవాళ్లకు కనువిప్పు కలిగించాలన్నదే ఆ సంచిక ఉద్దేశం. ఆ ప్రత్యేక సంచిక గురించి ఓ సహోదరి అమెరికాలోని బ్రాంచి కార్యాలయానికి ఇలా రాసింది: “ఈ ప్రత్యేక సంచికను పంచిపెట్టే కార్యక్రమం అద్భుతంగా సాగింది. ఒక మహిళ 20 పత్రికలు కావాలని అడిగింది. ఆమె జీవశాస్త్రం బోధించే టీచరు, తన విద్యార్థులకు తలా ఓ కాపీ ఇవ్వాలని ఆమె కోరుకుంది.” ఒక సహోదరుడు ఇలా రాశాడు: “నేను 1940 మలినాళ్ల నుండి ఉత్సాహంగా పరిచర్యలో పాల్గొంటున్నాను, నాకిప్పుడు దాదాపు 75 సంవత్సరాలు. అయితే ఇన్ని సంవత్సరాల్లో నేను పరిచర్యలో పొందిన ఆనందం కన్నా ఈ ప్రత్యేక సంచికను పంచిపెట్టిన నెలలో ఎక్కువ ఆనందాన్ని పొందాను.”

16 ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా తేజరిల్లు! (ఆంగ్లం) సంచికల్లో “ఇది రూపించబడిందా?” అనే ఆర్టికల్స్‌ ఉంటున్నాయి. ఈ చిన్న ఆర్టికల్స్‌, సృష్టిలోని అద్భుతాల్ని మన దృష్టికి తీసుకొచ్చి, సృష్టికర్త చేసిన మహాగొప్ప కార్యాలను అనుకరించాలని మనుషులు ఎలా ప్రయత్నిస్తున్నారో చూపిస్తున్నాయి. 2010 జిల్లా సమావేశంలో విడుదలైన జీవం సృష్టించబడిందా? (ఆంగ్లం) అనే బ్రోషుర్‌ కూడా యెహోవాను ఘనపర్చడానికి మనకు సహాయం చేస్తుంది. యెహోవాకున్న సృష్టి సామర్థ్యంపై మన కృతజ్ఞత పెంచేలా చూడచక్కని చిత్రాలతో, బోధించే బొమ్మలతో ఆ బ్రోషుర్‌ రూపొందింది. నేర్చుకున్న విషయాల గురించి ఆలోచించడానికి ప్రతీ పాఠం చివర్లో ప్రశ్నలు ఉన్నాయి. ఇంటింటి పరిచర్యలో, బహిరంగంగా లేదా అనియతంగా సాక్ష్యం ఇచ్చేటప్పుడు మీరు ఈ బ్రోషుర్‌ను ఉపయోగిస్తూ ప్రయోజనం పొందుతున్నారా?

17, 18. (ఎ) తల్లిదండ్రులారా, మీ పిల్లలు తమ విశ్వాసం గురించి మరింత ఆత్మవిశ్వాసంతో మాట్లాడడానికి మీరు ఎలా సహాయం చేయవచ్చు? (బి) సృష్టికి సంబంధించిన ఈ రెండు బ్రోషుర్లను మీ కుటుంబ ఆరాధనలో ఎలా ఉపయోగించారు?

17 తల్లిదండ్రులారా, కుటుంబ ఆరాధనలో మీ పిల్లలతో కలిసి ఈ రంగురంగుల బ్రోషుర్‌ను పరిశీలించారా? మీరలా చేస్తే, జీవముగల దేవునిపై కృతజ్ఞతను పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేసినవాళ్లవుతారు. మీకు బహుశా ఉన్నత పాఠశాలకు వెళ్లే ఎదుగుతున్న పిల్లలు ఉండవచ్చు. పరిణామ సిద్ధాంతం వంటి తప్పుడు బోధల్ని నేర్పించేవాళ్ల లక్ష్యం అలాంటి పిల్లలే. శాస్త్రవేత్తలు, టీచర్లు పరిణామ సిద్ధాంతం నిజమని బోధిస్తున్నారు, ప్రకృతి సంబంధించిన టీవీ కార్యక్రమాలు, సినిమాలు కూడా అది నిజమన్నట్లు చూపిస్తున్నాయి. అలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టేలా మీ పిల్లలకు సహాయం చేయడానికి, జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఆంగ్లం) అనే మరో బ్రోషుర్‌ ఉపయోగించవచ్చు. అది కూడా 2010 జిల్లా సమావేశంలోనే విడుదలైంది. జీవం సృష్టించబడిందా? బ్రోషుర్‌లాగే ఈ ప్రచురణ కూడా తమ ఆలోచనా సామర్థ్యం పెంచుకోమని పిల్లలను ప్రోత్సహిస్తుంది. (సామె. 2:10, 11) పాఠశాలలో తాము నేర్చుకునే విషయాలు ఎంత వరకు వాస్తవమో పరిశీలించడానికి ఈ బ్రోషుర్‌ వాళ్లకు సహాయం చేస్తుంది.

తల్లిదండ్రులారా, మీ పిల్లలు తమ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి సహాయం చేయండి (17వ పేరా చూడండి)

18 పరిణామ సిద్ధాంతాన్ని నిరూపించే కొన్ని జీవుల అవశేషాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారని చెప్పే సంచలన వార్తలను చూసి మోసపోకుండా విద్యార్థులకు జీవారంభం బ్రోషుర్‌ సహాయం చేస్తుంది. అలాంటి వార్తలు, మనిషి తక్కువ స్థాయి జీవులనుండి వచ్చాడని నిజంగా నిరూపిస్తున్నాయో లేదో తమకు తామే నిర్ధారించుకోమని ఈ బ్రోషుర్‌ వాళ్లను ప్రోత్సహిస్తుంది. అలాగే జీవం దానంతటదే ఉద్భవించిందనే విషయాన్ని శాస్త్రవేత్తలు తమ పరిశోధనాశాలల్లో నిరూపించారని ఎవరైనా అన్నప్పుడు ఎలా జవాబివ్వవచ్చో కూడా నేర్పిస్తుంది. తల్లిదండ్రులారా, మీరు ఈ రెండు బ్రోషుర్లు ఉపయోగిస్తే మీ పిల్లలకు ఎంతో సహాయం చేసినవాళ్లవుతారు. దానివల్ల, సృష్టికర్త ఉన్నాడని మీ పిల్లలు ఎందుకు నమ్ముతున్నారో చెప్పమని ఎవరైనా అడిగినప్పుడు వాళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పగలుగుతారు.—1 పేతురు 3:15 చదవండి.

19. మనందరికీ ఎలాంటి అరుదైన అవకాశం ఉంది?

19 సృష్టి గురించి యెహోవా సంస్థ మనకు అందిస్తున్న ప్రచురణలను చదివినప్పుడు ఆయన రమణీయమైన లక్షణాల గురించి ఎంతో తెలుసుకుంటాం. ఆ రుజువులన్నీ మనం యెహోవాను హృదయపూర్వకంగా స్తుతించేలా చేస్తాయి. (కీర్త. 19:1, 2) సమస్తాన్ని సృష్టించిన యెహోవాకు మహిమ, ఘనత ఇవ్వడం మనకు దొరికిన అరుదైన అవకాశం, వాటిని పొందడానికి ఆయన మాత్రమే అర్హుడు!—1 తిమో. 1:17.

a సృష్టివాదాన్ని నమ్మేవాళ్లతో ఎలా మాట్లాడాలో మరింత సమాచారం కోసం వజ్‌ లైఫ్‌ క్రియేటడ్‌? (ఆంగ్లం) అనే బ్రోషుర్‌లో 24 నుండి 28 పేజీలు చూడండి.