కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు

దేవుడు ఒక మర్మం అనే అబద్ధం

దేవుడు ఒక మర్మం అనే అబద్ధం

చాలామంది ఏం నమ్ముతారు?

క్రైస్తవ మతానికి చెందిన “మూడు పెద్ద శాఖలైన రోమన్‌ క్యాథలిక్‌, ఈస్టర్న్‌ ఆర్థోడాక్స్‌, ప్రొటెస్టెంట్‌ అనేవి తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురిలో ఒకే దేవుడు అని ఒప్పుకుంటున్నాయి. క్రైస్తవ మత శాస్త్రం ప్రకారం, అలా ఒప్పుకోవడం అంటే ముగ్గురు దేవుళ్లను గుర్తించడమని కాదు, బదులుగా ఈ ముగ్గురు వ్యక్తులూ నిజానికి ఒక్కరే అని గుర్తించడం.”—ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.

బైబిలు చెప్పే సత్యం

దేవుని కుమారుడైన యేసు తాను దేవునితో సమానమని గానీ తాను, తండ్రి ఒకే పదార్థమని గానీ చెప్పలేదు. బదులుగా యేసు ఇలా అన్నాడు: “నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను ... ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు.” (యోహాను 14:28) యేసు తన అనుచరుల్లో ఒకతనితో ఇలా చెప్పాడు: “నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను.”​—యోహాను 20:17.

ఇక పరిశుద్ధాత్మ (పవిత్రశక్తి) అనేది ఒక వ్యక్తి కాదు. తొలి క్రైస్తవులు “పవిత్రశక్తితో నిండిపోయారు.” అంతేకాదు యెహోవా ఇలా చెప్పాడు: “అన్నిరకాల ప్రజల మీద నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను.” (అపొస్తలుల కార్యాలు 2:1-4, 17) పవిత్రశక్తి త్రిత్వంలో భాగం కాదు. అది దేవుని చురుకైన శక్తి.

అది ఎందుకు ప్రాముఖ్యం?

క్యాథలిక్‌ పండితులైన కార్ల్‌ రాహ్నర్‌, హర్బర్ట్‌ వోర్‌గ్రిమ్‌లర్‌ ఇలా వివరిస్తున్నారు: త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే “అది వెల్లడి చేయబడాలి, వెల్లడైన తర్వాత కూడా అది అవగాహనకు పూర్తిగా అంతుపట్టదు.” మీరు ఎప్పటికీ తెలుసుకోలేని, అర్థంచేసుకోలేని ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించగలరా? కాబట్టి త్రిత్వ సిద్ధాంతం అనేది దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆయన్ని ప్రేమించడానికి ఒక పెద్ద అడ్డుగోడ లాంటిది.

అంతకుముందు ఆర్టికల్‌లో చూసిన మార్కోకి త్రిత్వం ఒక అడ్డుగోడలా అనిపించింది. అతను ఇలా అంటున్నాడు: “దేవుడు తన గుర్తింపును నా నుండి దాచిపెడుతున్నాడని నాకు అనిపించింది. దానివల్ల ఆయన నాకు ఇంకా దూరంగా, ఇంకా మర్మంగా, ఎప్పటికీ చేరుకోలేని వ్యక్తిగా కనిపించాడు.” అయితే ‘దేవుడు గందరగోళానికి మూలం కాదు.’ (1 కొరింథీయులు 14:33, అధస్సూచి) ఆయన తన గుర్తింపును మన నుండి దాచిపెట్టడం లేదు. మనం ఆయన్ని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ఇలా చెప్పాడు: “మేము ఏం ఆరాధిస్తున్నామో మాకు తెలుసు.”​—యోహాను 4:22.

మార్కో ఇంకా ఇలా అంటున్నాడు: “దేవుడు త్రిత్వంలో భాగం కాదని తెలుసుకున్న తర్వాత చివరికి ఆయనతో ఒక వ్యక్తిగత అనుబంధం పెంచుకోగలిగాను.” మనం దేవుణ్ణి, ఎప్పటికీ తెలుసుకోలేని ఒక అజ్ఞాత వ్యక్తిలా కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా చూస్తే, ఆయన్ని ప్రేమించడం చాలా తేలికౌతుంది. బైబిలు ఇలా చెప్తుంది: “ప్రేమ లేనివాళ్లకు దేవుడు తెలీదు, ఎందుకంటే దేవుడు ప్రేమ.”​—1 యోహాను 4:8.