కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి

కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి

“క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.”1 పేతు. 2:21.

1, 2. (ఎ) గొర్రెల పట్ల సరైన శ్రద్ధ తీసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? (బి) యేసు కాలంలో చాలామంది కాపరిలేని గొర్రెల్లా ఎందుకు ఉన్నారు?

 కాపరి తన మందలోని గొర్రెల సంక్షేమం విషయంలో శ్రద్ధ తీసుకున్నప్పుడు అవి చక్కగా ఉంటాయి. గొర్రెల పెంపకం గురించిన ఒక పుస్తకం ఇలా చెబుతుంది: “తన గొర్రెలను పచ్చికబయళ్ల దగ్గరికి తీసుకెళ్లి వదిలేయడం తప్ప, వాటి గురించి ఏమాత్రం ఆలోచించని, వాటి బాగోగులు పట్టించుకోని కాపరికి కొన్ని సంవత్సరాలు తిరిగేలోగా బలహీనమైన, జబ్బుపడిన గొర్రెలే మిగులుతాయి.” అయితే కాపరి తన గొర్రెల విషయంలో మంచి శ్రద్ధ తీసుకున్నప్పుడు అవి ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.

2 సంఘం విషయంలో కూడా అది నిజం. క్రైస్తవ కాపరులు ప్రతీ గొర్రె మీద శ్రద్ధ, అవధానం ఉంచినప్పుడు సంఘమంతా ప్రయోజనం పొందుతుంది. “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్న” జనసమూహాన్ని చూసి యేసు కనికరపడిన సందర్భాన్ని మీరు గుర్తుతెచ్చుకోవచ్చు. (మత్త. 9:36) వాళ్లు అలాంటి దీనస్థితిలో ఎందుకున్నారు? ఎందుకంటే వాళ్లకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాల్సిన నాయకులే కఠినంగా, ప్రజల నుండి ఎక్కువ ఆశించేవాళ్లుగా, వేషధారులుగా ఉన్నారు. మందకు సహాయం చేస్తూ, వాళ్లను సంరక్షించే బదులు ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక నాయకులు ప్రజల మీద “భారమైన బరువులు” మోపారు.—మత్త. 23:4.

3. గొర్రెల్ని సంరక్షించేటప్పుడు సంఘపెద్దలు ఏ విషయం గుర్తుంచుకోవాలి?

3 కాబట్టి, నేటి క్రైస్తవ కాపరులకు అంటే నియమిత పెద్దలకు గంభీరమైన బాధ్యత ఉంది. వాళ్ల సంరక్షణలో ఉన్న గొర్రెలు యెహోవాకు, ‘మంచి కాపరియైన’ యేసుకు చెందినవి. (యోహా. 10:11) యేసు తన “అమూల్యమైన రక్తముచేత” గొర్రెలను “విలువపెట్టి” కొన్నాడు. (1 కొరిం. 6:20; 1 పేతు. 1:18, 19) ఆయన గొర్రెలను ఎంతగా ప్రేమించాడంటే వాటికోసం తన ప్రాణాన్ని కూడా ఇష్టంగా త్యాగం చేశాడు. తాము “గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు” అధికారానికి లోబడి ఉండాల్సిన ఉపకాపరులమని పెద్దలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.—హెబ్రీ. 13:20, 21.

4. ఈ ఆర్టికల్‌లో మనం ఏమి చూస్తాం?

4 మరైతే, క్రైస్తవ కాపరులు గొర్రెలతో ఎలా వ్యవహరించాలి? ‘నాయకులుగా ఉన్నవాళ్లకు లోబడి ఉండండి’ అని సంఘ సభ్యులను బైబిలు ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో, “మీకు అప్పగింపబడినవారిపై [“దేవుని స్వాస్థ్యంపై,” NW] ప్రభువులైనట్టు” ఉండవద్దని సంఘ పెద్దలకు కూడా ఉపదేశమిస్తుంది. (హెబ్రీ. 13:17; 1 పేతురు 5:2, 3 చదవండి.) అయితే, నియమిత పెద్దలు “ప్రభువులైనట్టు” ఉండకుండా మందమీద ఎలా నాయకత్వం వహించవచ్చు? మరో మాటలో చెప్పాలంటే, దేవుడు తమకిచ్చిన అధికార పరిధిని దాటకుండానే పెద్దలు గొర్రెల బాగోగులను ఎలా చూసుకోవచ్చు?

‘ఆయన తన రొమ్మున ఆనించుకొని వాటిని మోయును’

5. యెషయా 40:11 వచనంలోని వర్ణన యెహోవా గురించి ఏమి చెబుతుంది?

5 యెషయా ప్రవక్త యెహోవాను ఇలా వర్ణించాడు: “గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.” (యెష. 40:11) సంఘంలో ఉన్న బలహీనుల విషయంలో, కాపుదల అవసరమైనవాళ్ల విషయంలో యెహోవా ఎంతో శ్రద్ధ తీసుకుంటాడని ఆ వర్ణన బట్టి అర్థమౌతుంది. ఒక కాపరికి తన మందలోని ప్రతీ గొర్రెకున్న ప్రత్యేక అవసరాలేమిటో తెలుసు, వాటిని తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలాగే యెహోవాకు కూడా సంఘంలోని వాళ్ల అవసరాలేమిటో తెలుసు, వాటిని ఆయన సంతోషంగా తీరుస్తాడు. అప్పుడే పుట్టిన గొర్రెపిల్లను అవసరమైతే కాపరి ఎలాగైతే తన వస్త్రపు మడతలో పెట్టి మోస్తాడో, అలాగే “కనికరము చూపు తండ్రి” అయిన యెహోవా కూడా కష్టకాలాల్లో మనల్ని మోస్తాడు. మనకు ఏదైనా పెద్ద పరీక్ష ఎదురైనప్పుడు లేదా మనం కష్టాల్లో చిక్కుకున్నప్పుడు ఆయన ఆదరిస్తాడు, ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాడు.—2 కొరిం. 1:3, 4.

6. ఆధ్యాత్మిక కాపరులుగా పెద్దలు యెహోవాను ఎలా అనుకరించవచ్చు?

6 మన పరలోక తండ్రి నుండి ఆధ్యాత్మిక కాపరులు ఎంత అద్భుతమైన పాఠం నేర్చుకోవచ్చో గదా! యెహోవాలాగే వాళ్లు కూడా గొర్రెల అవసరాలను పట్టించుకోవాలి. సహోదరులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, వాళ్లకున్న ఏ అవసరాల మీద తక్షణం దృష్టిపెట్టాలో పెద్దలు తెలుసుకుంటే అవసరమైన ప్రోత్సాహం, మద్దతు ఇవ్వగలుగుతారు. (సామె. 27:23) అలా చేయాలంటే, పెద్దలు తోటి విశ్వాసులతో చక్కగా మాట్లాడుతూ ఉండాలి. అయితే వాళ్ల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకుండానే పెద్దలు తాము సంఘంలో చూసేవాటిని బట్టి, వినేవాటిని బట్టి వాళ్ల అవసరాలు గ్రహిస్తూ, ‘బలహీనులను సంరక్షించడానికి’ ప్రేమగా కృషిచేస్తారు.—అపొ. 20:35; 1 థెస్స. 4:10-12.

7. (ఎ) యెహెజ్కేలు, యిర్మీయా కాలాల్లో దేవుని గొర్రెలు ఎలా నిరాదరణకు గురయ్యాయి? (బి) అవిశ్వాసులైన ఆధ్యాత్మిక కాపరులను యెహోవా ఖండించడం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

7 యెహోవా ఖండించిన ప్రాచీనకాల కాపరుల వైఖరిని పరిశీలించండి. యెహెజ్కేలు, యిర్మీయా కాలాల్లో తన గొర్రెలను జాగ్రత్తగా కాయాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేసిన కొందరు కాపరులను యెహోవా ఖండించాడు. గొర్రెలను పట్టించుకునే దిక్కు కరువైనప్పుడు మందలోని గొర్రెలు క్రూర జంతువుల బారినపడ్డాయి, చెల్లాచెదురయ్యాయి. గొర్రెల కడుపు నింపే బదులు ఆ కాపరులు వాటిని దోచుకుని, వాటితో ‘తమ కడుపు నింపుకున్నారు.’ (యెహె. 34:7-10; యిర్మీ. 23:1) క్రైస్తవమత సామ్రాజ్యపు నాయకులను కూడా దేవుడు అలాంటి కారణాలను బట్టే తిరస్కరించాడు. కాబట్టి, క్రైస్తవ పెద్దలకు యెహోవా మంద పట్ల సరైన, ప్రేమపూర్వకమైన శ్రద్ధ ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఆ విషయం నొక్కిచెబుతుంది.

“మీకు మాదిరిగా ఈలాగు చేసితిని”

8. తప్పుడు వైఖరులను సరిచేసే విషయంలో యేసు ఎలా అద్భుతమైన మాదిరి ఉంచాడు?

8 దేవుని గొర్రెల్లో కొంతమంది అపరిపూర్ణత వల్ల యెహోవా తమనుండి కోరేవాటిని అంత త్వరగా అర్థం చేసుకోలేకపోవచ్చు. వాళ్లు బైబిలు సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకపోవచ్చు లేదా పరిణతి కలిగిన క్రైస్తవుల్లా ప్రవర్తించకపోవచ్చు. అలాంటి వాళ్లతో పెద్దలు ఎలా వ్యవహరించాలి? యేసు తన శిష్యులతో సహనంగా ప్రవర్తించిన తీరును వాళ్లు అనుకరించాలి. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్లుగా ఉంటారనే విషయం గురించి శిష్యులు ఎంతో వాదించుకున్నారు, కానీ యేసు మాత్రం వాళ్లమీద ఎన్నడూ కోప్పడలేదు. బదులుగా తన శిష్యులకు బోధిస్తూనే వచ్చాడు, వినయం చూపించడం గురించి ప్రేమగా సలహాలు ఇస్తూనే వచ్చాడు. (లూకా 9:46-48; 22:24-27) యేసు తన శిష్యుల పాదాలు కడిగి, వినయంగా ఎలా ఉండాలో వాళ్లకు చూపించాడు. నేడు సంఘపెద్దలు కూడా తప్పకుండా వినయం చూపించాలి.—యోహాను 13:12-15 చదవండి; 1 పేతు. 2:21.

9. ఎలాంటి వైఖరి కలిగివుండాలని యేసు తన శిష్యులకు చెప్పాడు?

9 ఆధ్యాత్మిక కాపరులు ఎలా ఉండాలనే విషయంలో యేసుకున్న వైఖరి ఒకప్పుడు యాకోబు, యోహానులు చూపించిన వైఖరికి భిన్నంగా ఉంది. ఆ ఇద్దరు అపొస్తలులు రాజ్యంలో ప్రముఖ స్థానాలు పొందాలని ఆశించారు. అయితే యేసు ఈ మాటలతో వాళ్ల వైఖరిని సరిదిద్దాడు: “అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను.” (మత్త. 20:25, 26) తమ సహవాసుల మీద ‘ప్రభుత్వము చేయాలనే’ లేదా ‘పెత్తనం చేయాలనే’ కోరికను అపొస్తలులు జయించాల్సిన అవసరముంది.

10. పెద్దలు మందతో ఎలా వ్యవహరించాలని యేసు ఆశిస్తాడు? ఈ విషయంలో పౌలు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

10 మందతో తాను వ్యవహరించిన విధంగానే క్రైస్తవ పెద్దలు కూడా వ్యవహరించాలని యేసు ఆశిస్తాడు. పెద్దలు తమ సహోదరుల మీద ప్రభువులుగా ఉండకుండా, వాళ్లకు సేవకులుగా ఉండడానికి ఇష్టపడాలి. అపొస్తలుడైన పౌలుకు అలాంటి వినయ స్వభావమే ఉంది, ఆయన ఎఫెసు సంఘంలోని పెద్దలకు ఇలా చెప్పాడు: ‘నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి ఎల్ల కాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో, పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.’ ఆ పెద్దలు వినయంగా ఉండాలని, తమ సహోదరుల కోసం ప్రయాసపడాలని పౌలు కోరుకున్నాడు. అందుకే ఆయన వాళ్లతో, “మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపలెననియు . . . అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని” అని అన్నాడు. (అపొ. 20:18, 19, 35) పౌలు కొరింథులోని సహోదరులకు రాస్తూ, తాను వాళ్ల విశ్వాసం మీద ప్రభువును కానని అన్నాడు. ఆయన కూడా వాళ్లలాగే వినయంగా దేవుని సేవచేశాడు, ఆనందంతో దేవుణ్ణి సేవించేలా వాళ్లకు సహాయం చేయాలని పౌలు కోరుకున్నాడు. (2 కొరిం. 1:24) వినయం విషయంలో, కష్టపడి పనిచేసే విషయంలో పౌలు నేటి పెద్దలకు ఎంతో ఆదర్శప్రాయుడు.

‘హితబోధను గట్టిగా చేపట్టండి’

11, 12. తోటి విశ్వాసి నిర్ణయం తీసుకోవడానికి పెద్దలు ఎలా సహాయం చేయవచ్చు?

11 ఒక సంఘ పెద్ద, “ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.” (తీతు 1:9) అయితే, ఆయన ఆ పనిని “సాత్వికమైన మనస్సుతో” చేయాలి. (గల. 6:1) సంఘంలోని సహోదరసహోదరీలు ఫలానా విధంగానే ప్రవర్తించాలని పట్టుబట్టే బదులు, ఒక మంచి ఆధ్యాత్మిక కాపరి వాళ్ల మనసును చేరేలా ఎలా మాట్లాడాలో ఆలోచిస్తాడు. ఒక సహోదరుడు ఓ ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు, పరిశీలించాల్సిన లేఖన సూత్రాలను సంఘపెద్ద నొక్కిచెప్పవచ్చు లేదా దానికి సంబంధించి ప్రచురణల్లో వచ్చిన సమాచారాన్ని ఆయనతో కలిసి చర్చించవచ్చు. ఆయన తీసుకునే నిర్ణయాలు యెహోవాతో ఆయనకున్న సంబంధంపై ఎలా ప్రభావం చూపిస్తాయో ఆలోచించమని కూడా ప్రోత్సహించవచ్చు. నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థనలో దేవుని నిర్దేశాన్ని అడగడం ఎందుకు ప్రాముఖ్యమో ఆ పెద్ద నొక్కిచెప్పవచ్చు. (సామె. 3:5, 6) సంఘపెద్ద తోటి విశ్వాసితో ఆ విషయాలు చర్చించిన తర్వాత, ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకే వదిలేయాలి.—రోమా. 14:1-4.

12 క్రైస్తవ పెద్దలకు ఉన్న ఏకైక అధికారం వాళ్లకు బైబిలు వల్లే వచ్చింది. కాబట్టి, వాళ్లు బైబిల్ని నైపుణ్యవంతంగా ఉపయోగించడం, దాని ఆధారంగానే సలహాలు ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. అలా చేయడం వల్ల పెద్దలు, తమ అధికారాన్ని ఏ రకంగానూ దుర్వినియోగం చేయకుండా ఉంటారు. ఏదేమైనా వాళ్లు ఉపకాపరులు మాత్రమే, సంఘంలోని ప్రతీ ఒక్కరు తాము తీసుకునే నిర్ణయాలను బట్టి తామే యెహోవాకు, యేసుకు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.—గల. 6:5, 7, 8.

‘మందకు మాదిరులుగా ఉండండి’

తమ కుటుంబ సభ్యులు పరిచర్యకు సిద్ధపడేలా పెద్దలు సహాయం చేస్తారు (13వ పేరా చూడండి)

13, 14. పెద్దలు ఏయే విషయాల్లో మందకు ఆదర్శంగా ఉండాలి?

13 తమకు ‘అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు’ ఉండవద్దని పెద్దలకు ఉపదేశించిన తర్వాత అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “మందకు మాదిరులుగా ఉండుడి.” (1 పేతు. 5:3) పెద్దలు మందకు మాదిరులుగా ఎలా ఉండవచ్చు? “అధ్యక్ష్యపదవిని ఆశించే” ఒక వ్యక్తి చేరుకోవాల్సిన రెండు అర్హతలను పరిశీలించండి. ఆయన “స్వస్థబుద్ధి” కలిగివుండాలి, “తన యింటివారిని బాగుగా ఏలువాడునై” ఉండాలి. ఒక సంఘ పెద్దకు కుటుంబం ఉంటే తన కుటుంబాన్ని పర్యవేక్షించే విషయంలో ఆయన ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎందుకంటే, “ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?” (1 తిమో. 3:1-3, 4, 5) ‘అధ్యక్ష్యపదవికి’ అర్హుడవ్వాలంటే ఒక వ్యక్తికి స్వస్థబుద్ధి ఉండాలి అంటే దైవిక సూత్రాలను స్పష్టంగా అర్థంచేసుకొని, వాటిని తన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఆయనకు తెలిసుండాలి. ఆయన ప్రశాంతంగా ఉంటాడు, తొందరపడి ఓ ముగింపుకు రాడు. పెద్దల్లో ఈ లక్షణాలను చూసినప్పుడు, సంఘ సభ్యులు వాళ్లమీద నమ్మకం ఉంచగలుగుతారు.

14 పరిచర్యలో ముందుండి నడిపించే విషయంలో కూడా పెద్దలు తోటి క్రైస్తవులకు చక్కని ఆదర్శాన్ని ఉంచుతారు. ఈ విషయంలో పెద్దలకు యేసు మంచి మాదిరి ఉంచాడు. యేసు భూజీవితంలో రాజ్య సువార్త ప్రకటించడం ఒక అంతర్భాగం. ఆ పని ఎలా చేయాలో ఆయన తన శిష్యులకు చూపించాడు. (మార్కు 1:38; లూకా 8:1) పెద్దలతో కలిసి పరిచర్య చేస్తూ, ప్రాణాల్ని రక్షించే ఈ పనిలో వాళ్లకున్న ఉత్సాహాన్ని చూసినప్పుడు, వాళ్ల బోధనా పద్ధతుల నుండి నేర్చుకున్నప్పుడు నేడు ప్రచారకులు ఎంత ప్రోత్సాహం పొందుతారో ఆలోచించండి! పెద్దలు ఎన్నో పనుల్లో తీరిక లేకుండావున్నా తమ సమయాన్ని, శక్తిని క్రమంగా వెచ్చిస్తూ సువార్త ప్రకటించినప్పుడు సంఘమంతా అలాంటి ఉత్సాహం చూపించాలనే ప్రోత్సాహం పొందుతుంది. కూటాలకు సిద్ధపడి వాటిలో పాల్గొనే విషయంలో, రాజ్యమందిరాన్ని శుభ్రపర్చి దాన్ని సరైన స్థితిలో ఉంచడం వంటి ఇతర పనుల్లో కూడా సంఘపెద్దలు తోటి సహోదరులకు చక్కని మాదిరిని ఉంచవచ్చు.—ఎఫె. 5:15, 16; హెబ్రీయులు 13:7 చదవండి.

పెద్దలు క్షేత్ర పరిచర్యలో ఆదర్శప్రాయులుగా ఉంటారు (14వ పేరా చూడండి)

‘బలహీనులకు ఊతమివ్వండి’

15. పెద్దలు కాపరి సందర్శనాలు చేయడానికిగల కొన్ని కారణాలేమిటి?

15 గొర్రె గాయపడినా లేదా జబ్బుపడినా మంచి కాపరి వెంటనే సహాయం చేస్తాడు. అలాగే సంఘపెద్దలు కూడా బాధపడుతున్న వాళ్లకు లేదా ఆధ్యాత్మిక సహాయం అవసరమైన వాళ్లకు వెంటనే సహాయం అందించాలి. వయసు పైబడ్డవాళ్ల, అనారోగ్యంతో ఉన్నవాళ్ల భౌతిక అవసరాల విషయంలో శ్రద్ధ చూపించడం అవసరం కావచ్చు అయితే వాళ్లకు ఆధ్యాత్మిక సహాయం, ప్రోత్సాహం ఇవ్వడం మరింత అవసరం. (1 థెస్స. 5:14) సంఘంలోని యువత ‘యౌవనేచ్ఛలతో’ పోరాడడం వంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుండవచ్చు. (2 తిమో. 2:22) కాబట్టి వాళ్లను సరిగ్గా కాయాలంటే, సంఘ సభ్యులను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని అర్థంచేసుకుంటూ, సరైన లేఖనాధార సలహాలను వాళ్లతో పంచుకుంటూ ప్రోత్సహించాలి. సకాలంలో అలాంటి సమస్యల్ని గుర్తిస్తే, అవి మరింత గంభీరమైన సమస్యలుగా మారకముందే వాటిని పరిష్కరించవచ్చు.

16. సంఘంలోని ఒక సభ్యునికి ఆధ్యాత్మిక సహాయం అవసరమైతే పెద్దలు ఎలాంటి సహాయం అందించవచ్చు?

16 అయితే సంఘంలోని ఒక సహోదరునికి గంభీరమైన సమస్య ఉండి, యెహోవాతో ఆయన సంబంధం ప్రమాదంలో ఉంటే అప్పుడేమి చేయాలి? యాకోబు ఇలా రాశాడు: “మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.” (యాకో. 5:14, 15) ఒకవేళ ఆధ్యాత్మికంగా బలహీనమైన వ్యక్తి స్వయంగా “సంఘపు పెద్దలను” పిలవకపోయినా, ఆయన పరిస్థితి గురించి పెద్దలకు తెలిసిన వెంటనే ఆయనకు సహాయం అందించాలి. పెద్దలు సహోదరులతో కలిసి ప్రార్థించినప్పుడు, సహోదరుల కోసం ప్రార్థించినప్పుడు, అవసరంలో చేయూతనిచ్చినప్పుడు వాళ్లు తమ సంరక్షణలోని గొర్రెలకు ఆధ్యాత్మికంగా ఎంతో ఊరట, ప్రోత్సాహం అందించిన వాళ్లవుతారు.—యెషయా 32:1, 2 చదవండి.

17. పెద్దలు ‘గొప్ప కాపరిని’ అనుకరించినప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుంది?

17 యెహోవా సంస్థలో తాము చేసే ప్రతీపనిలో క్రైస్తవ కాపరులు “గొప్ప కాపరియైన” యేసుక్రీస్తును అనుకరించడానికి శాయశక్తులా కృషి చేస్తారు. బాధ్యతగల అలాంటి సహోదరులు అందించే ఆధ్యాత్మిక సహాయం వల్ల మందలోని వాళ్లు బలంగా ఉంటారు, దేవుని సేవలో నమ్మకంగా కొనసాగుతారు. అందుకే, ప్రేమగల మన కాపరులకు, సాటిలేని కాపరియైన యెహోవాకు మనమెంతో రుణపడివున్నాం.