కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముఖపత్ర అంశం | మనకు దేవుడు అవసరమా?

అసలు ఆ ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది?

అసలు ఆ ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది?

“దేవుడు లేకుండా మీరు సంతోషంగా ఉన్నారా? లక్షలమంది సంతోషంగా ఉన్నారు.” ఓ నాస్తికుల గుంపుకు చెందిన పెద్ద పోస్టరుమీద ఈమధ్యే ఆ మాటలు కనిపించాయి. అంటే, తమకు దేవుడు అవసరంలేదని వాళ్లు అనుకుంటున్నారన్నది స్పష్టం.

మరోవైపు, దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకునే చాలామంది అసలు దేవుడే లేడన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. సాల్వాటోర్‌ ఫీజీకెల్లా అనే క్యాథలిక్‌ ఆర్చిబిషప్‌ తన చర్చీ సభ్యుల గురించి ఇలా అన్నాడు: “నేడు, మమ్మల్ని చూసేవాళ్లెవ్వరూ మేము క్రైస్తవులమని అనుకోరు. ఎందుకంటే, మా జీవన విధానం కూడా అన్యుల జీవన విధానంలాగే ఉంటుంది.”

కొందరికైతే, దేవుని గురించి ఆలోచించే తీరికే లేదు. దేవుడు మనకు అందనంత దూరంలో ఉంటాడని, మన జీవితాల్లో ఆయన ప్రమేయం ఏమీ ఉండదని వాళ్లు అనుకుంటారు. మహా అయితే అలాంటివాళ్లు సమస్యలు వచ్చినప్పుడో, సహాయం అవసరమైనప్పుడో దేవుని గురించి ఆలోచిస్తారు. వాళ్ల దృష్టిలో దేవుడంటే పిలవగానే పరుగెత్తుకొచ్చే ఓ పనోడు.

ఇంకొందరు, తమ మతం బోధించే విషయాలు పనికిరావని అనుకుంటారు, కాబట్టి వాటిని పాటించరు. ఈ ఉదాహరణ చూడండి: జర్మనీలోని క్యాథలిక్కుల్లో దాదాపు మూడొంతుల మంది, పెళ్లికి ముందు స్త్రీపురుషులు కలిసి జీవించడం తప్పేమీకాదని నమ్ముతున్నారు. కానీ నిజానికి వాళ్ల చర్చీగానీ, బైబిలుగానీ అలా బోధించడం లేదు. (1 కొరింథీయులు 6:18; హెబ్రీయులు 13:4) అలా తమ మతబోధలతో సంబంధంలేకుండా జీవిస్తున్నది ఒక్క క్యాథలిక్కులే కాదు. అలాంటివాళ్లు ఇతర మతాల్లో కూడా ఉన్నారు. తమ మతస్థులు ‘నాస్తికుల్లాగే’ జీవిస్తున్నారని చాలా మతాల్లోని బోధకులు విలపిస్తున్నారు.

ఇవన్నీ పరిశీలించాక, మనకు నిజంగా దేవుడు అవసరమా? అనే ప్రశ్న వస్తుంది. ఇది కొత్త ప్రశ్నేమీ కాదు. ఆ ప్రశ్న మొదట ఎప్పుడు తలెత్తిందో బైబిల్లోని తొలి పేజీల్లో ఉంది. దాని జవాబు కోసం, ఆదికాండము పుస్తకం ప్రస్తావిస్తున్న ఇంకొన్ని వివాదాంశాలను కూడా పరిశీలిద్దాం. (w13-E 12/01)