కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముఖపత్ర అంశం | చనిపోతే ఇక అంతా అయిపోయినట్లేనా?

మరణాన్ని జయించడానికి మనిషి చేసిన పోరాటం

మరణాన్ని జయించడానికి మనిషి చేసిన పోరాటం

ఖిన్‌ షి హ్వాంగ్‌ చక్రవర్తి

పాన్సే డే లేయాన్‌, అన్వేషకుడు

మరణం ఓ భయంకరమైన శత్రువు. దాన్ని జయించడానికి మనం శాయశక్తులా పోరాడతాం. మనకు బాగా కావాల్సిన వాళ్లు చనిపోయినప్పుడు, ఆ నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. యౌవనంలో ఉన్నప్పుడైతే, ఆ శత్రువు మన దరిదాపులకు కూడా రాదని అనుకుంటాం. అది మన దగ్గరకు వచ్చేవరకు ఆ భ్రమలోనే ఉండిపోతాం.

మరణానంతర జీవితం గురించి ప్రాచీన ఐగుప్తును పాలించిన ఫరోలు ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించివుండరు. వాళ్ల, వాళ్ల కింద పనిచేసిన వాళ్ల జీవితాల్లో ఎక్కువ భాగం, మరణాన్ని జయించాలనే ప్రయత్నాల్లోనే గడిచిపోయింది. వాళ్లు కట్టిన పిరమిడ్‌లు చూస్తే వాళ్లు ఎంతగా పోరాడారో తెలుస్తుంది. కానీ చివరకు వాళ్లు ఓడిపోయారు.

చైనాను పాలించిన చక్రవర్తులు కూడా మరణాన్ని జయించడానికి ప్రయత్నించారు. వాళ్లు ఎంచుకున్న మార్గం, ఒక రకమైన మిశ్రమాన్ని సేవించడం. ఖిన్‌ షి హ్వాంగ్‌ అనే చక్రవర్తి, మరణాన్ని దూరం చేసే ఒక ఔషధాన్ని తయారుచేయమని తన రసాయన శాస్త్రవేత్తలకు చెప్పాడు. వాళ్లు తయారుచేసిన చాలా ఔషధాల్లో హానికరమైన పాదరసం ఉండేది. బహుశా వాటిలో ఒకదాని వల్లే ఆ తర్వాత చక్రవర్తి చనిపోయాడు.

16వ శతాబ్దంలో, స్పెయిన్‌ దేశానికి చెందిన క్వాన్‌ పాన్సే డే లేయాన్‌ అనే అన్వేషకుడు, యౌవనపు జలధార కోసం వెదుకుతూ ప్యూర్టోరికో నుండి సముద్ర ప్రయాణం మొదలుపెట్టాడు. తన అన్వేషణలో, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని కనుగొన్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, నేటివ్‌ అమెరికన్లతో జరిగిన తగవులాటలో ఆయన మరణించాడు. అయితే, యౌవనపు జలధార ఉన్నదనడానికి ఇప్పటివరకు ఎలాంటి దాఖలాలూ లేవు.

ఫరోలు, చక్రవర్తులు, అన్వేషకులు ఇలా అందరూ మరణాన్ని జయించాలని ప్రయత్నాలు చేశారు. వాళ్లు అనుసరించిన పద్ధతులు మనకు నచ్చకపోయినా, మనలో ఎవ్వరమూ వాళ్ల ప్రయత్నాన్ని తప్పుపట్టం. నిజానికి, ఎప్పటికీ జీవిస్తూనే ఉండాలని లోలోపల మనందరం కోరుకుంటాం.

మరణాన్ని జయించడం సాధ్యమేనా?

మరణంతో పోరాడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది? అందుకు కారణాన్ని బైబిలు వివరిస్తుంది. మనల్ని సృష్టించిన యెహోవా దేవుని a గురించి అది ఇలా చెబుతుంది: “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును [లేదా, “అనంతకాలాన్ని”] నరుల హృదయమందుంచి యున్నాడు.” (ప్రసంగి 3:11) కేవలం 80 ఏళ్లే కాదు ఎల్లకాలం ఈ అందమైన భూమ్మీద జీవితాన్ని ఆనందించాలని మనం కోరుకుంటాం. (కీర్తన 90:10) ఆ కోరిక మన హృదయంలోనే ఉంది.

“శాశ్వత” కాలం జీవించాలనే కోరికను దేవుడు మన హృదయాల్లో ఎందుకు ఉంచాడు? మనల్ని బాధపెట్టడానికేనా? దేవుడు ఎప్పటికీ అలా చేయడు. నిజానికి, మరణంపై విజయం సాధ్యమేనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరణాన్ని పూర్తిగా తీసేసి నిత్యం జీవించేలా చేస్తాననే దేవుని వాగ్దానం గురించి బైబిలు పదేపదే చెబుతుంది.— “మరణంపై విజయం” అనే బాక్సు చూడండి.

స్వయంగా యేసుక్రీస్తే ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) కాబట్టి, మరణంపై చేస్తున్న పోరాటంలో గెలుపు సాధ్యమే. అయితే మనకోసం, దేవుడు మాత్రమే ఆ పోరాటాన్ని జయించగలడని యేసు స్పష్టం చేశాడు. (w14-E 01/01)

a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెబుతుంది.