కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

100 ఏళ్ల రాజ్యపాలన​—⁠మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

100 ఏళ్ల రాజ్యపాలన​—⁠మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

‘యుగములకు రాజైన ప్రభువా [“యెహోవా,” NW] దేవా, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి.’ప్రక. 15:3, 4.

1, 2. దేవుని రాజ్యం దేన్ని నెరవేరుస్తుంది? రాజ్యం తప్పకుండా వస్తుందని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

 సా.శ. 31 వసంతకాలంలో, కపెర్నహూములోని ఓ కొండమీద యేసు తన శిష్యులకు “నీ రాజ్యము వచ్చుగాక” అని ప్రార్థించమని నేర్పించాడు. (మత్త. 6:9, 10) ‘అసలా రాజ్యం ఎప్పటికైనా వస్తుందా?’ అని నేడు చాలామంది సందేహిస్తుంటారు. అయితే దేవుని రాజ్యం రావాలని మనం మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలకు జవాబు దొరుకుతుందనే నమ్మకంతో ఉండవచ్చు.

2 యెహోవా పరలోకంలోనూ భూమ్మీదా ఉన్న తన కుటుంబాన్ని ఏకం చేయడానికి ఆ రాజ్యాన్ని ఉపయోగిస్తాడు. ఆయన సంకల్పం తప్పకుండా నిజమౌతుంది. (యెష. 55:10, 11) నిజానికి, యెహోవా మనకాలంలో ఇప్పటికే రాజయ్యాడు! గడిచిన 100 ఏళ్లలో జరిగిన ఎన్నో పులకరింపజేసే సంఘటనలు ఆ విషయాన్ని నిరూపిస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉన్న తన నమ్మకమైన పౌరుల కోసం యెహోవా ఘనమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నాడు. (జెక. 14:9; ప్రక. 15:3, 4) అయితే యెహోవా రాజవ్వడం, యేసు నేర్పిన ప్రార్థనలోని ‘దేవుని రాజ్యం రావడం,’ ఈ రెండూ ఒకటి కాదు. ఈ రెండు సంఘటనల మధ్యవున్న తేడా ఏమిటి? ఆ సంఘటనలు మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

యెహోవా నియమించిన రాజు చర్య తీసుకున్నాడు

3. (ఎ) యేసు ఎప్పుడు, ఎక్కడ రాజయ్యాడు? (బి) దేవుని రాజ్యం 1914లో పరిపాలన మొదలుపెట్టిందని మీరెలా నిరూపిస్తారు? (అథఃస్సూచి చూడండి.)

3 “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు” అని దాదాపు 2,500 సంవత్సరాల క్రితం బైబిలు ప్రవచించింది. ఆ మాటలను దేవుని సేవకులు 19వ శతాబ్దం చివర్లో అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. (దాని. 2:44) అందుకే 1914 ప్రాముఖ్యమైన సంవత్సరమని అప్పటికీ కొన్ని దశాబ్దాల ముందు నుండి బైబిలు విద్యార్థులు ప్రకటించారు. ఆ కాలంలో చాలామంది భవిష్యత్తు గురించి ఎంతో ఆశతో ఉన్నారు, “1914లో లోకమంతా ఆశతో, వాగ్దానాలతో నిండిపోయింది” అని ఓ రచయిత వర్ణించాడు. అయితే అదే సంవత్సరం చివర్లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో బైబిలు ప్రవచనం నిజమైంది. ఆ తర్వాత వచ్చిన కరువులు, భూకంపాలు, జబ్బులు, వాటితోపాటు నెరవేరిన ఇతర ప్రవచనాలు 1914లో యేసుక్రీస్తు పరలోకంలో రాజుగా పరిపాలన మొదలుపెట్టాడని తిరుగులేని విధంగా నిరూపించాయి. a తన కుమారుణ్ణి మెస్సీయ రాజుగా నియమించినప్పుడు యెహోవా ఓ కొత్త భావంలో నిజంగా రాజయ్యాడు!

4. యేసు రాజైన వెంటనే చేసిన మొట్టమొదటి పని ఏమిటి? ఆయన తర్వాత ఎవరిపై దృష్టి సారించాడు?

4 రాజైన తర్వాత యేసు చేసిన మొట్టమొదటి పని, తన తండ్రి ప్రధాన శత్రువైన సాతానుతో యుద్ధం చేయడం. యేసు, ఆయన దూతలు కలిసి సాతానును, అతని దయ్యాలను పరలోకం నుండి పడద్రోశారు. దానివల్ల పరలోకంలో అవధుల్లేని సంతోషం కలిగింది, అయితే భూమికి మాత్రం తీవ్రమైన శ్రమల కాలం మొదలైంది. (ప్రకటన 12:7-9, 12 చదవండి.) ఆ తర్వాత, రాజు భూమ్మీదున్న తన పౌరులమీద దృష్టి సారించి, దేవుని చిత్తం చేసేలా వాళ్లను శుద్ధీకరించాడు, వాళ్లకు బోధించాడు, వాళ్లను సంస్థీకరించాడు. ఈ మూడు విషయాల్లో యేసు ఇచ్చిన నిర్దేశానికి వాళ్లు లోబడడం మనకు ఎలా ఆదర్శంగా ఉందో ఇప్పుడు చూద్దాం.

మెస్సీయ రాజు యథార్థవంతులైన తన పౌరులను శుద్ధీకరించాడు

5. ఏ శుద్ధీకరణ 1914 నుండి 1919 తొలిభాగం వరకు జరిగింది?

5 అలా యేసు పరలోకాన్ని శుభ్రం చేశాక, యెహోవా ఆయనకు భూమ్మీదున్న తన ప్రజల ఆధ్యాత్మిక స్థితిని పరీక్షించి, శుద్ధీకరించే పని అప్పగించాడు. మలాకీ ప్రవక్త ఆ పనిని ఆధ్యాత్మిక శుద్ధీకరణగా వర్ణించాడు. (మలా. 3:1-3) ఆ పని 1914 నుండి 1919 తొలిభాగం వరకు జరిగిందని చరిత్ర చూపిస్తుంది. b యెహోవా విశ్వవ్యాప్త కుటుంబంలో సభ్యులమవ్వాలంటే మనం పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. (1 పేతు. 1:14-16) అబద్ధమతాల వల్ల లేదా ఈ లోక రాజకీయాల వల్ల ఏమాత్రం కలుషితం కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి.

6. ఆధ్యాత్మిక ఆహారం మనకు ఎలా అందుతుంది? ఆ ఆహారం ఎందుకు ప్రాముఖ్యం?

6 యేసు అప్పుడు రాజుగా తన అధికారాన్ని ఉపయోగించి ఒక ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి’ నియమించాడు. ఆ దాసుడు యేసు సంరక్షణలోని ‘ఒక్క మందలో’ ఉన్న సభ్యులకు పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా అందిస్తాడు. (మత్త. 24:45-47; యోహా. 10:16) క్రీస్తు అభిషిక్త సహోదరుల చిన్న గుంపు 1919 నుండి, ‘ఇంటివారికి’ ఆహారం పెట్టే బరువైన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తుంది. ఆ దాసుడు అందించే ఆధ్యాత్మిక ఆహారం మనం విశ్వాసంలో ఎదిగేలా సహాయం చేస్తుంది. అంతేకాక ఆధ్యాత్మిక, నైతిక, మానసిక, భౌతిక విషయాల్లో పరిశుభ్రంగా ఉండాలనే మన నిశ్చయాన్ని మరింత బలపరుస్తుంది. ఈ ఆధ్యాత్మిక ఆహారం వల్ల మనం ఉపదేశం పొందుతూ, నేడు భూమ్మీద జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన ప్రకటనా పనిలో పాల్గొనేలా సన్నద్ధులమవుతాం. మీరు ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా?

తన పౌరులు భూమంతటా ప్రకటించేలా రాజు బోధించాడు

7. భూమ్మీదున్నప్పుడు యేసు ఏ ప్రాముఖ్యమైన పని చేశాడు? ఆ పని ఎప్పటి వరకు కొనసాగుతుంది?

7 యేసు భూమ్మీద పరిచర్య మొదలుపెట్టినప్పుడు, “నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని” అన్నాడు. (లూకా 4:43) మూడున్నర సంవత్సరాలు ఆ పనే ప్రాణంగా యేసు జీవించాడు. తన శిష్యులకు ఆయనిలా నిర్దేశమిచ్చాడు: ‘మీరు వెళ్లుచు, పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.’ (మత్త. 10:7) తన అనుచరులు “భూదిగంతముల వరకు” ప్రకటనా పనిని వ్యాప్తి చేస్తారని పునరుత్థానమైన తర్వాత యేసు చెప్పాడు. (అపొ. 1:8) అంతం వచ్చేంత వరకు ఈ ప్రాముఖ్యమైన పనిలో వాళ్ల వెన్నంటే ఉంటానని యేసు భరోసా ఇచ్చాడు.—మత్త. 28:19, 20.

8. భూమ్మీదున్న తన పౌరులు ప్రకటించేలా రాజు ఎలా పురికొల్పాడు?

8 “ఈ రాజ్య సువార్త” 1919 కల్లా కొత్త అర్థాన్ని సంతరించుకుంది. (మత్త. 24:14) పరలోకంలో అప్పటికే ఏలుతున్న రాజు, శుద్ధీకరించిన భూపౌరుల చిన్న గుంపును సమకూర్చాడు. ఆ గుంపు యేసు నిర్దేశానికి లోబడి, పరలోకంలో ఏలుతున్న దేవుని రాజ్యం గురించిన సువార్తను భూమంతటా ఉత్సాహంగా ప్రకటించడం మొదలుపెట్టింది. (అపొ. 10:42) ఉదాహరణకు 1922, సెప్టెంబరులో అమెరికాలోని, ఒహాయోలో ఉన్న సీడార్‌ పాయింట్‌ దగ్గర జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశానికి దాదాపు 20,000 మంది హాజరయ్యారు. సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ “రాజ్యం” అనే అంశంపై ప్రసంగిస్తూ ‘ఇదిగో, రాజు ఏలుతున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి’ అని అన్నప్పుడు హాజరైన వాళ్ల హృదయాలు ఎంత పులకరించివుంటాయో ఒక్కసారి ఊహించండి. వాళ్లలో 2,000 మంది ఓ ప్రత్యేక ‘సేవా దినంలో’ పాల్గొని, సమావేశ స్థలం నుండి సుమారు 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల దగ్గరకు కూడా వెళ్లి ప్రకటించారు. హాజరైన వాళ్లలో ఒకాయన ఇలా అన్నాడు: “రాజ్యాన్ని ప్రకటించమనే పిలుపును, అక్కడ హాజరైనవాళ్ల ఉత్సాహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను!” చాలామంది ఆయనలాగే భావించారు.

9, 10. (ఎ) రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? (బి) ఈ శిక్షణ వల్ల మీరు వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందారు?

9 చురుకైన రాజ్య ప్రచారకుల సంఖ్య 1922 కల్లా 58 దేశాల్లో 17,000 దాటిపోయింది. అయితే వాళ్లందరికీ తగిన శిక్షణ అవసరం. మొదటి శతాబ్దంలో యేసు తన శిష్యులకు ఏమి ప్రకటించాలో, ఎక్కడ ప్రకటించాలో, ఎలా ప్రకటించాలో స్పష్టంగా చెప్పాడు. (మత్త. 10:5-7; లూకా 9:1-6; 10:1-11) అదే పద్ధతిలో యేసు నేడుకూడా రాజ్యప్రకటనా పనిలో పాల్గొనే వాళ్లందరికీ, సమర్థవంతంగా ప్రకటించేందుకు కావాల్సిన నిర్దేశాలు, ఉపకరణాలు అందేలా చూస్తున్నాడు. (2 తిమో. 3:16, 17) ఆయన సంఘం ద్వారా పరిచర్య కోసం కావాల్సిన శిక్షణ ఇస్తున్నాడు. అందుకు ఆయన ఉపయోగించే ఒక మార్గం, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. దీన్ని ప్రస్తుతం భూవ్యాప్తంగా 1,11,000 కన్నా ఎక్కువ సంఘాల్లో నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల నుండి పూర్తి ప్రయోజనం పొందడం ద్వారా సుమారు 78 లక్షలకన్నా ఎక్కువమంది సువార్తికులు అన్ని రకాల ప్రజలకు నచ్చేలా ప్రకటించగలుగుతున్నారు, బోధించగలుగుతున్నారు. —1 కొరింథీయులు 9:20-23 చదవండి.

10 దైవపరిపాలనా పరిచర్య పాఠశాలతో పాటు సంఘ పెద్దలకు, పయినీర్లకు, ఒంటరి సహోదరులకు, క్రైస్తవ దంపతులకు, బ్రాంచి కమిటీ సభ్యులకు-వాళ్ల భార్యలకు, ప్రయాణ పర్యవేక్షకులకు-వాళ్ల భార్యలకు, మిషనరీలకు శిక్షణ ఇచ్చేందుకు ఇతర బైబిలు పాఠశాలలు కూడా ఉన్నాయి. c “క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాల” కోర్సుకు హాజరైన కొందరు తమ కృతజ్ఞతను ఇలా వ్యక్తం చేశారు: “మేము తీసుకున్న ఈ ప్రత్యేక శిక్షణ వల్ల యెహోవామీద మా ప్రేమ ఇంకా ఎక్కువైంది, దానితోపాటు ఇతరులకు సహాయం చేసేందుకు మరింతగా సన్నద్ధులమయ్యాం.”

11. వ్యతిరేకత ఉన్నా రాజ్య ప్రచారకులు ప్రకటనా పనిలో ఎలా కొనసాగగలుగుతున్నారు?

11 రాజ్యాన్ని ప్రకటించేందుకు, బోధించేందుకు జరుగుతున్న ఈ విస్తారమైన కృషిని మన శత్రువు గమనిస్తున్నాడు. సాతాను రాజ్య సందేశం మీద, దాన్ని ప్రకటించే వాళ్లమీద నేరుగానూ దొంగచాటుగానూ దాడిచేస్తూ ఆ పనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావు. యెహోవా తన కుమారుడైన యేసును “సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను” హెచ్చించాడు. (ఎఫె. 1:20-22) రాజుగా యేసు తన అధికారాన్ని ఉపయోగించి తన శిష్యులను కాపాడుతూ, నిర్దేశిస్తూ తన తండ్రి చిత్తం నెరవేరేలా చూస్తున్నాడు. d యెహోవా ప్రజలు సువార్త ప్రకటిస్తూ, లక్షల మంది యథార్థ హృదయులకు యెహోవా మార్గాల గురించి బోధిస్తున్నారు. ఈ గొప్ప పనిలో పాల్గొనడం మనకు దొరికిన అరుదైన అవకాశం!

తన పౌరులు మరింత గొప్పపని చేసేలా రాజు సంస్థీకరించాడు

12. రాజ్య స్థాపన నుండి జరిగిన కొన్ని సంస్థాగత మార్పులను వివరించండి.

12 యేసు 1914లో రాజైనప్పటి నుండి, దేవుని సేవకులు సంస్థీకరించబడిన తీరును శుద్ధిచేస్తూనే ఉన్నాడు. (యెషయా 60:17 చదవండి.) ప్రతీ సంఘంలో ప్రకటనా పనికి సారధ్యం వహించేందుకు 1919లో సేవా నిర్దేశకుణ్ణి నియమించడం జరిగింది. 1927లో, ప్రతీ ఆదివారం ఇంటింటి పరిచర్య చేయడం మొదలైంది. రాజ్య మద్దతుదారులు 1931లో యెహోవాసాక్షులు అనే లేఖనాధార నామం ధరించి, మరింత గొప్ప పని చేయడం కోసం ఉత్సాహంతో ఉరకలేశారు. (యెష. 43:10-12) సంఘంలో బాధ్యతల కోసం పురుషుల్ని ఎన్నుకోవడానికి బదులు, దైవపరిపాలనా పద్ధతిలో నియమించడం 1938 నుండి మొదలైంది. 1972లో, సంఘాన్ని పర్యవేక్షించడానికి సంఘ పైవిచారణకర్త స్థానంలో పెద్దల సభను ఏర్పాటు చేశారు. ‘తమ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాసే’ పనికోసం అర్హతలు సాధించమని సంస్థ పురుషులను ప్రోత్సహించింది. (1 పేతు. 5:2) ప్రపంచవ్యాప్తంగా రాజ్యపనిని పర్యవేక్షించడం కోసం 1976లో పరిపాలక సభ ఆరు కమిటీలుగా సంస్థీకరించబడింది. యెహోవా నియమించిన మెస్సీయ రాజు సముచితంగానే రాజ్యపౌరులను క్రమక్రమంగా దైవపరిపాలనా పద్ధతిలో సంస్థీకరించాడు.

13. రాజ్యం 100 ఏళ్లలో సాధించిన విషయాలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి?

13 మెస్సీయ రాజు తన మొదటి 100 ఏళ్ల పాలనలో ఏమేమి సాధించాడో పరిశీలించండి. యెహోవా నామానికి ప్రాతినిధ్యం వహించేలా ఆయన ఒక గుంపును శుద్ధీకరించాడు. మెస్సీయ రాజు 239 దేశాల్లో రాజ్య సువార్త ప్రకటనా పనిని నిర్దేశిస్తూ, యెహోవా మార్గాల గురించి లక్షలమందికి బోధించాడు. తన తండ్రి చిత్తం చేయాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 78 లక్షలకన్నా ఎక్కువమంది రాజ్య పౌరులను ఏకం చేశాడు. (కీర్త. 110:3) నిస్సందేహంగా, మెస్సీయ రాజ్యం ద్వారా యెహోవా ఘనమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నాడు. అయితే, ఇంతకన్నా అద్భుతమైన సంఘటనలు భవిష్యత్తులో జరగనున్నాయి!

మెస్సీయ రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాలు

14. (ఎ) “నీ రాజ్యము వచ్చుగాక” అని ప్రార్థించేటప్పుడు నిజానికి మనం దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నాం? (బి) 2014 వార్షిక వచనం ఏమిటి? అది ఎందుకు సముచితం?

14 యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుకు 1914లో రాజ్యాధికారం ఇవ్వడం, “నీ రాజ్యము వచ్చుగాక” అని మనం చేసే విన్నపానికి సంపూర్ణ జవాబు కాదు. (మత్త. 6:9, 10) యేసు తన ‘శత్రువుల మధ్య పరిపాలన చేస్తాడు’ అని బైబిలు ముందే చెప్పింది. (కీర్త. 110:2) సాతాను చెప్పుచేతల్లో ఉన్న మానవ ప్రభుత్వాలు ఇప్పటికీ ఆ రాజ్యాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కాబట్టి దేవుని రాజ్యం రావాలని ప్రార్థించేటప్పుడు నిజానికి మనం మెస్సీయ రాజు, ఆయన సహపరిపాలకులు మానవ పరిపాలనను అంతమొందించి, భూమ్మీదున్న రాజ్య శత్రువులను పూర్తిగా తుడిచిపెట్టాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అలా, దేవుని రాజ్యం “ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును” అని దానియేలు 2:44 ప్రవచించిన మాటలు నెరవేరుతాయి. ఆ రాజ్యం తనను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేస్తుంది. (ప్రక. 6:1, 2; 13:1-18; 19:11-21) అది జరగడానికి ఇంకెంతో కాలం లేదు. దేవుని రాజ్యం పరలోకంలో పాలన మొదలుపెట్టి 100 ఏళ్లు అవుతున్న ఈ తరుణంలో, మత్తయి 6:9, 10 వచనాల్లో ఉన్న “నీ రాజ్యము వచ్చుగాక” అనే మాటల్ని 2014 వార్షిక వచనంగా తీసుకోవడం ఎంత సముచితమో!

2014 వార్షిక వచనం: “నీ రాజ్యము వచ్చుగాక.”​—మత్తయి 6:9, 10.

15, 16. (ఎ) వెయ్యేళ్ల పాలనలో ఎలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగనున్నాయి? (బి) మెస్సీయ రాజుగా యేసు చేసే చివరి పని ఏమిటి? అది యెహోవా సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తుంది?

15 మెస్సీయ రాజు దేవుని శత్రువులందర్నీ నాశనం చేసిన తర్వాత సాతానును, అతని దయ్యాలను అగాధంలో పడేసి వెయ్యేళ్లు బంధిస్తాడు. (ప్రక. 20:1-3) అలా చెడు ప్రభావాలు లేకుండాపోయాక, ఆ రాజ్యం యేసు విమోచన క్రయధన ప్రయోజనాలను మనుషులకు అందిస్తూ, ఆదాము పాపపు ప్రభావాలను పూర్తిగా తీసేస్తుంది. మెస్సీయ రాజు, చనిపోయిన కోట్లాది మందిని పునరుత్థానం చేసి, యెహోవా గురించి వాళ్లందరికీ నేర్పించే పనిని భూవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాడు. (ప్రక. 20:12, 13) ఏదెను తోటలోని పరదైసు పరిస్థితులు భూమంతటా విస్తరిస్తాయి. నమ్మకస్థులైన మనుషులందరూ పరిపూర్ణులౌతారు.

16 క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగిసేసరికి, మెస్సీయ రాజ్యం దాని సంకల్పాన్ని పూర్తిగా నెరవేరుస్తుంది. అప్పుడు యేసు ఆ రాజ్యాన్ని తన తండ్రికి అప్పగిస్తాడు. (1 కొరింథీయులు 15:24-28 చదవండి.) అప్పుడు యెహోవాకూ, భూమ్మీదున్న ఆయన పిల్లలకూ మధ్య మధ్యవర్తి ఉండాల్సిన అవసరం లేదు. పరలోకంలోవున్న, భూమ్మీదున్న దేవుని పిల్లలందరూ తమ తండ్రి విశ్వవ్యాప్త కుటుంబంలో ఐక్యం అవుతారు.

17. రాజ్యం విషయంలో మీరు ఏమని తీర్మానించుకున్నారు?

17 ఆ రాజ్యం 100 ఏళ్లలో చేసిన అద్భుత కార్యాలు గమనించినప్పుడు, పరిస్థితులన్నీ యెహోవా నియంత్రణలోనే ఉన్నాయని, భూమి విషయంలో ఆయన సంకల్పం తప్పకుండా నెరవేరుతుందనే భరోసాతో ఉంటాం. కాబట్టి మనం రాజుకు యథార్థ పౌరులుగా ఉంటూ, రాజును ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉందాం. అలా చేస్తూ, “నీ రాజ్యము వచ్చుగాక” అని మనం మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలకు యెహోవా త్వరలోనే జవాబిస్తాడనే నమ్మకంతో ఉందాం.

c కావలికోట 2012, సెప్టెంబరు 15 సంచికలోని 13-17 పేజీల్లో ఉన్న “మరింత ఎక్కువగా యెహోవా సేవచేయడానికి తోడ్పడే పాఠశాలలు—అవి యెహోవా ప్రేమకు నిదర్శనాలు” ఆర్టికల్‌ చూడండి.

d వివిధ దేశాల్లో సాధించిన చట్టపరమైన విజయాల కోసం కావలికోట 1998, డిసెంబరు 1 సంచికలోని 19-22 పేజీలు చూడండి.