కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనంలో జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోండి

యౌవనంలో జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోండి

“యౌవనులు కన్యలు . . . యెహోవా నామమును స్తుతించుదురు.”కీర్త. 148:12, 13.

1. చాలామంది యౌవన క్రైస్తవులు ఎలాంటి అద్భుతమైన అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు?

 మనం చాలా ప్రాముఖ్యమైన కాలంలో జీవిస్తున్నాం. మునుపెన్నడూ లేని విధంగా అన్నీ దేశాల నుండి లక్షలమంది సత్యారాధన వైపు తిరుగుతున్నారు. (ప్రక. 7:9, 10) చాలామంది యౌవనులు, “జీవజలమును ఉచితముగా” పుచ్చుకోమని ఇతరులను ఆహ్వానిస్తూ ఆ పనిలో పులకరింపజేసే అనుభవాలను సొంతం చేసుకుంటున్నారు. (ప్రక. 22:17) ఇంకొంతమంది యౌవనులు బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తూ ప్రజలు మెరుగైన జీవితాన్ని అనుభవించేలా సహాయం చేస్తున్నారు. మరి కొందరేమో, వేరే భాషా క్షేత్రాల్లో సువార్త ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు. (కీర్త. 110:3; యెష. 52:7) సంతృప్తినిచ్చే ఈ పనిలో మీరు కూడా భాగం వహించాలంటే ఏమి చేయాలి?

2. యెహోవా యౌవనులకు బాధ్యతలు అప్పగించడానికి ఇష్టపడుతున్నాడని తిమోతి ఉదాహరణ ఎలా చూపిస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

2 యౌవనులైన మీరు ఇప్పుడు చేసుకునే ఎంపికల వల్ల, భవిష్యత్తులో యెహోవాను సంతోషంగా సేవించే మరిన్ని అవకాశాలు దొరుకుతాయి. ఉదాహరణకు, తిమోతి జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోవడం వల్లే, దాదాపు 20 ఏళ్ల ప్రాయంలోనే మిషనరీ సేవను చేపట్టగలిగాడు. (అపొ. 16:1-3) ఆ సేవ మొదలుపెట్టిన బహుశా కొన్ని నెలలకే తిమోతికి పౌలు ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు. తీవ్రమైన హింసల వల్ల పౌలు కొత్తగా ఏర్పడిన థెస్సలొనీకలోని సంఘాన్ని విడిచిరావాల్సి వచ్చింది, అందుకే అక్కడకు వెళ్లి సహోదరులను బలపరచమని ఆయన తిమోతికి చెప్పాడు. (అపొ. 17:5-15; 1 థెస్స. 3:1, 2, 6) అప్పుడు తిమోతికి ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఊహించండి!

మీ అత్యంత ప్రాముఖ్యమైన ఎంపిక

3. మీరు చేసుకోగల అత్యంత ప్రాముఖ్యమైన ఎంపిక ఏమిటి? అది మీరు ఎప్పుడు చేసుకోవాలి?

3 ముఖ్యమైన ఎంపికలు చేసుకోవడానికి యౌవనమే సరైన సమయం. అయితే యెహోవాను సేవించాలని నిర్ణయించుకోవడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఎంపిక. ఆ ఎంపిక చేసుకోవడానికి ఏది సరైన సమయం? “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని యెహోవా చెబుతున్నాడు. (ప్రసం. 12:2) యెహోవా అంగీకరించే విధంగా ఆయనను “స్మరణకు” తెచ్చుకునే ఏకైక మార్గం, ఆయనను పూర్ణహృదయంతో సేవించడమే. (ద్వితీ. 10:12) అది మీరు చేసుకోగల అత్యంత ప్రాముఖ్యమైన ఎంపిక. అది మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.—కీర్త. 71:5.

4. ఏ ముఖ్యమైన నిర్ణయాలు మీరు యెహోవాను ఎలా సేవిస్తారనే దానిపై ప్రభావం చూపిస్తాయి?

4 అయితే, యెహోవాను సేవించాలనే ఎంపికతో పాటు ఇతర ఎంపికలు కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు, ‘పెళ్లి చేసుకోవాలా, వద్దా? చేసుకుంటే ఎవరిని చేసుకోవాలి? ఎలాంటి ఉద్యోగం చేయాలి?’ వంటివాటి గురించి కూడా మీరు ఆలోచిస్తుండవచ్చు. ఇవన్నీ ముఖ్యమైన నిర్ణయాలే, అయితే యెహోవాను హృదయపూర్వకంగా సేవించాలని ముందుగా నిర్ణయించుకోండి. (ద్వితీ. 30:19, 20) ఎందుకు? ఎందుకంటే, ఆ నిర్ణయాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడివున్నాయి. పెళ్లి, ఉద్యోగం వంటి విషయాల్లో చేసుకునే ఎంపికలు మీరు యెహోవాను ఎలా సేవిస్తారనే దానిపై ప్రభావం చూపిస్తాయి. (లూకా 14:16-20 పోల్చండి.) అదేవిధంగా, దేవుణ్ణి సేవించాలనే మీ కోరిక పెళ్లి, ఉద్యోగం వంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, అత్యంత ప్రాముఖ్యమైనదాని విషయంలో ముందు నిర్ణయం తీసుకోండి.—ఫిలి. 1:9-11.

యౌవనంలో మీరు ఏమి చేస్తారు?

5, 6. సరైన ఎంపికలు చేసుకుంటే మంచి అనుభవాలు ఎదురౌతాయని చూపించే అనుభవాన్ని చెప్పండి. (ఈ సంచికలో ఉన్న, “చిన్నప్పుడే నేను చేసుకున్న ఎంపిక” ఆర్టికల్‌ కూడా చూడండి.)

5 దేవుణ్ణి సేవించాలనే ఎంపిక చేసుకున్నాక, మీరు ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడో ఆలోచించండి. ఆయనను ఎలా సేవించాలో అప్పుడు మీరు నిర్ణయించుకోవచ్చు. జపాన్‌కు చెందిన యూయిచిరో అనే సహోదరుడు ఇలా రాశాడు: “నాకు 14 ఏళ్లున్నప్పుడు, ఒక సంఘ పెద్దతో పరిచర్యకు వెళ్లాను. నేను పరిచర్యలో ఆనందంగా లేనని గుర్తించిన ఆ సహోదరుడు సౌమ్యంగా ఇలా అన్నాడు: ‘యూయిచిరో, ఇంటికివెళ్లి నీ టేబుల్‌ ముందు కూర్చుని యెహోవా నీకు ఏమేమి చేశాడో జాగ్రత్తగా ఆలోచించు.’ ఆయన చెప్పినట్లే చేశాను. నిజానికి, నేను కొన్ని రోజులపాటు దాని గురించి ఆలోచించాను, ప్రార్థించాను. మెల్లమెల్లగా నా వైఖరిలో మార్పు వచ్చింది. కొద్దిరోజుల్లోనే, యెహోవా సేవలోని ఆనందాన్ని ఆస్వాదించగలిగాను. మిషనరీల గురించి కూడా ఇష్టంగా చదువుతూ, మరింత ఎక్కువగా దేవుణ్ణి సేవించడం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను.”

6 యూయిచిరో ఇంకా ఇలా అంటున్నాడు: “వేరే దేశాల్లో యెహోవా సేవ చేసేందుకు దోహదపడే ఎంపికలు చేసుకోవడం మొదలుపెట్టాను. ఉదాహరణకు, నేను ఇంగ్లీషు భాషా కోర్సులో చేరాను. నా పాఠశాల చదువు అయిపోయాక, ఇంగ్లీషు నేర్పించే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ పయినీరు సేవ మొదలుపెట్టాను. 20 ఏళ్ల వయసులో మంగోలియా భాష నేర్చుకోవడం మొదలుపెట్టి, ఆ భాష మాట్లాడే ప్రచారకుల గుంపును కలిశాను. రెండేళ్ల తర్వాత అంటే 2007లో మంగోలియా దేశానికి వెళ్లాను. అక్కడి పయినీర్లతో పరిచర్య చేస్తున్నప్పుడు, ఎంతోమంది సత్యం విషయంలో ఆకలిదప్పులతో ఉన్నారని గమనించి, అక్కడే ఉండి వాళ్లకు సహాయం చేయాలని కోరుకున్నాను. దానికోసం కావాల్సిన ప్రణాళికలు వేసుకోవడానికి జపాన్‌కు తిరిగొచ్చాను. నేను 2008, ఏప్రిల్‌ నుండి మంగోలియాలో పయినీరు సేవ చేస్తున్నాను. ఇక్కడి జీవితం అంత సులభం కాదు. కానీ ప్రజలు సువార్తకు సానుకూలంగా స్పందిస్తున్నారు, వాళ్లు యెహోవాకు దగ్గరయ్యేలా నేను సహాయం చేయగలుగుతున్నాను. నేను అతి శ్రేష్ఠమైన జీవితాన్ని ఎంపిక చేసుకున్నానని నాకనిపిస్తుంది.”

7. మన కోసం మనం ఏ ఎంపికలు చేసుకోవాలి? ఈ విషయంలో మనకు మోషే ఎలా ఆదర్శంగా ఉన్నాడు?

7 ఒక యెహోవాసాక్షిగా తన జీవితాన్ని ఎలా గడపాలో ప్రతీ వ్యక్తి స్వయంగా ఎంపిక చేసుకోవాలి. (యెహో. 24:15) మీరు పెళ్లి చేసుకోవాలా వద్దా, ఎవరిని చేసుకోవాలి లేదా ఎలాంటి ఉద్యోగం చేయాలి వంటివి మేము చెప్పలేం. కొద్దిపాటి శిక్షణతో వచ్చే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడం మీకు వీలౌతుందా? క్రైస్తవ యౌవనులైన మీలో కొంతమంది నిరుపేద పల్లెల్లో జీవిస్తుండవచ్చు, ఇతరులు పెద్దపెద్ద నగరాల్లో జీవిస్తుండవచ్చు. మీరు వ్యక్తిత్వాల్లో, సామర్థ్యాల్లో, అనుభవాల్లో, ఇష్టాల్లో, విశ్వాసంలో భిన్నంగా ఉండవచ్చు. ప్రాచీన ఐగుప్తులోని హెబ్రీ యువకుల జీవితాలకు మోషే జీవితానికి ఉన్నంత తేడాలు మీ మధ్య కూడా ఉండవచ్చు. యువకునిగా ఉన్నప్పుడు మోషేకు రాజ గృహంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, కానీ మిగతా హెబ్రీయులేమో దాసులుగా ఉన్నారు. (నిర్గ. 1:13, 14; అపొ. 7:21, 22) మీలాగే వాళ్లు కూడా ఎంతో ప్రాముఖ్యమైన కాలాల్లో జీవించారు. (నిర్గ. 19:4-6) అయితే, తమ జీవితాన్ని ఎలా ఉపయోగించాలనే ఎంపికను వాళ్లలో ప్రతీ ఒక్కరు చేసుకోవాల్సి వచ్చింది. మోషే సరైన ఎంపిక చేసుకున్నాడు.—హెబ్రీయులు 11:24-27 చదవండి.

8. ఎంపికలు చేసుకునే విషయంలో యౌవనులకు ఎలాంటి సహాయం అందుబాటులో ఉంది?

8 మీరు జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడు. ఎలా? అన్ని పరిస్థితుల్లోనూ మీకు ఉపయోగపడే బైబిలు సూత్రాలు బోధించడం ద్వారా. (కీర్త. 32:8) ఆ సూత్రాలను ఎలా అన్వయించుకోవచ్చో అర్థంచేసుకోవడానికి క్రైస్తవ తల్లిదండ్రులు, సంఘపెద్దలు మీకు సహాయం చేస్తారు. (సామె. 1:8, 9) మీరు ఇప్పుడే జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకునేలా మీకు సహాయం చేసే మూడు బైబిలు సూత్రాలను చూద్దాం.

మీకు సహాయం చేసే మూడు బైబిలు సూత్రాలు

9. (ఎ) ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చి యెహోవా ఎలా మనల్ని గౌరవించాడు? (బి) ‘రాజ్యాన్ని మొదట వెదకడం’ ద్వారా మనం ఏమి తెలియజేస్తాం?

9 ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. (మత్తయి 6:19-21, 24-26, 31-34 చదవండి.) ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చి యెహోవా మనల్ని గౌరవించాడు. మీ యౌవనంలో ఎంత భాగాన్ని రాజ్య ప్రకటనా పనికి కేటాయించాలో యెహోవా చెప్పట్లేదు. అయితే, రాజ్యాన్ని మొదట వెదకడానికి సహాయం చేసే సూత్రాన్ని యేసు మనకిచ్చాడు. ఆ సూత్రాన్ని పాటించే విధానం ద్వారా, దేవునిపట్ల మీకు ఎంత ప్రేమ ఉందో, పొరుగువాళ్ల పట్ల ఎంత శ్రద్ధ ఉందో, నిత్యజీవ నిరీక్షణ పట్ల మీకెంత కృతజ్ఞత ఉందో చూపిస్తారు. పెళ్లి, ఉద్యోగం వంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు “ఆయన రాజ్యమును నీతిని మొదట” వెదకడంకన్నా వస్తుపరమైన వాటి గురించే ఎక్కువ ఆందోళన పడుతున్నట్లు చూపిస్తున్నాయా?

10. యేసుకు ఏది సంతోషాన్నిచ్చింది? మీరు సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి?

10 ఇతరులకు సేవచేయడంలో ఆనందాన్ని పొందండి. (అపొస్తలుల కార్యములు 20:20, 21, 24, 35 చదవండి.) జీవితానికి సంబంధించిన ఆ ప్రాథమిక సూత్రాన్ని యేసు బోధించాడు. ఆయన జీవితాన్ని చాలా ఆనందంగా గడిపాడు, ఎందుకంటే ఆయన తన ఇష్టాన్ని కాదుగానీ తన తండ్రి ఇష్టాన్నే నెరవేర్చాడు. వినయస్థులు సువార్తకు ప్రతిస్పందించడం చూసి యేసు ఎంతో సంతోషించాడు. (లూకా 10:21; యోహా. 4:34) ఇతరులకు సహాయం చేయడం వల్ల వచ్చే ఆనందాన్ని మీరు ఇప్పటికే పొందివుంటారు. యేసు బోధించిన సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మీరు ఖచ్చితంగా సంతోషిస్తారు, యెహోవా కూడా సంతోషిస్తాడు.—సామె. 27:11.

11. బారూకు ఎందుకు తన సంతోషాన్ని కోల్పోయాడు? యెహోవా ఏ సలహా ఇచ్చాడు?

11 యెహోవాను సేవించడం వల్ల అంతులేని ఆనందాన్ని పొందుతాం. (సామె. 16:20) యిర్మీయా కార్యదర్శి, బారూకు ఆ విషయాన్ని మర్చిపోయాడు. యెహోవా సేవలో ఏమాత్రం సంతోషించని పరిస్థితి అతనికి ఓసారి ఎదురైంది. యెహోవా ఆయనకిలా చెప్పాడు: “నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను.” (యిర్మీ. 45:3, 5) బారూకుకు ఏది సంతోషాన్ని ఇచ్చివుండేదని మీరనుకుంటున్నారు, తన కోసం గొప్పవాటిని వెదకడమా? నమ్మకమైన దేవుని సేవకునిగా యెరూషలేము నాశనాన్ని తప్పించుకోవడమా?—యాకో. 1:12.

12. రామీరో ఏ ఎంపిక వల్ల ఆనందాన్ని సొంతం చేసుకున్నాడు?

12 రామీరో అనే సహోదరుడు ఇతరులకు సేవ చేయడంలోని ఆనందాన్ని చవిచూశాడు. ఆయనిలా అంటున్నాడు: “ఆండీస్‌ పర్వతాల్లో ఉన్న ఓ పల్లెలోని నిరుపేద కుటుంబం మాది. అందుకే, విశ్వవిద్యాలయంలోని నా పైచదువుల కోసం మా అన్నయ్య ఫీజు కడతానని చెప్పినప్పుడు అదో మంచి అవకాశం అనిపించింది. కానీ ఓ యెహోవాసాక్షిగా ఆ మధ్యే బాప్తిస్మం తీసుకున్న నాకు, ఓ పయినీరుతో కలిసి ఒక చిన్నపట్టణంలో పరిచర్య చేసే అవకాశం వచ్చింది. నేను అక్కడి వెళ్లాను, నన్ను నేను పోషించుకోవడానికి జుట్టు కత్తిరించే పని నేర్చుకుని షాప్‌ పెట్టుకున్నాను. మేము లేఖనాల గురించి ప్రజలకు బోధించినప్పుడు చాలామంది సానుకూలంగా స్పందించారు. తర్వాత, నేను స్థానిక భాషలో కొత్తగా ఏర్పడిన సంఘంతో సహవసించడం మొదలుపెట్టాను. నేను పది సంవత్సరాలుగా పూర్తికాల సేవ చేస్తున్నాను. తమ మాతృభాషలో సువార్త నేర్చుకునేలా ప్రజలకు సహాయం చేసినప్పుడు కలిగిన సంతోషాన్ని మరే పని నాకివ్వలేదు.”

రామీరో యౌవనం నుండే యెహోవాను ఆనందంగా సేవిస్తున్నాడు (12వ పేరా చూడండి)

13. యెహోవాను మరింతగా సేవించడానికి యౌవనం ఎందుకు సరైన సమయం?

13 యౌవనంలోనే యెహోవాను సేవించడంలో ఆనందించండి. (ప్రసంగి 12:1, 2 చదవండి.) ముందు మంచి ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత యెహోవా సేవ మొదలుపెట్టొచ్చనే ఆలోచన రానీయకండి. యెహోవాను పూర్ణహృదయంతో సేవించడానికి యౌవనమే సరైన సమయం. చాలామంది యౌవనులకు అంతగా కుటుంబ బాధ్యతలు ఉండవు, కష్టమైన నియామకాలను కూడా చకచకా చేసే ఆరోగ్యం, శక్తి ఉంటాయి. మీ యౌవనంలో యెహోవా కోసం మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? బహుశా పయినీరు సేవ మీ గమ్యం కావచ్చు. వేరే భాషా క్షేత్రాల్లో సేవ చేయాలని మీరనుకుంటుండవచ్చు, లేదా ప్రస్తుతం ఉన్న సంఘంలోనే ఇంకా ఎక్కువ సేవ చేసే మార్గాల కోసం చూస్తుండవచ్చు. మీ లక్ష్యం ఏదైనప్పటికీ, మిమ్మల్ని మీరు పోషించుకోగలగాలి. ‘ఎలాంటి ఉద్యోగం ఎంచుకుంటాను? దానికోసం ఎంత శిక్షణ అవసరం?’ అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి.

బైబిలు సూత్రాల సహాయంతో జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోండి

14. ఉద్యోగం కోసం వెదుకుతున్నప్పుడు మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

14 మనం పరిశీలించిన ఆ మూడు బైబిలు సూత్రాలు, ఎలాంటి ఉద్యోగం చేయాలో నిర్ణయించుకునేందుకు మీకు సహాయం చేయగలవు. మీ స్కూల్‌/కాలేజీ కౌన్సిలర్స్‌కు మీ ప్రాంతంలో ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో తెలిసివుండవచ్చు. అంతేకాక, ఉద్యోగాలు చూపించే ప్రభుత్వ సంస్థలు, స్థానికంగా ఏ ఉద్యోగానికి డిమాండ్‌ ఉందో, మీకు నచ్చిన రంగంలో ఏయే అవకాశాలున్నాయో సమాచారం ఇవ్వవచ్చు. అలాంటి సంస్థలు ఇచ్చే సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. కానీ ఒక విషయంలో జాగ్రత్త, యెహోవాను ప్రేమించనివాళ్లు మీ మనసుల్లో లోకాన్ని ప్రేమించేలా విషభీజాలు నాటవచ్చు. (1 యోహా. 2:15-17) లోకం అందించే వాటిని మీరు చూసినప్పుడు, మీ హృదయం మిమ్మల్ని ఇట్టే మోసగిస్తుంది. —సామెతలు 14:15 చదవండి; యిర్మీ. 17:9.

15, 16. ఉద్యోగం విషయంలో మీకు ఎవరు మంచి సలహా ఇవ్వగలరు?

15 ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నాక మీకు ఓ జ్ఞానయుక్తమైన సలహా అవసరం. (సామె. 1:5) అయితే, బైబిలు సూత్రాలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగం ఎంచుకోవడానికి మీకు ఎవరు సహాయం చేయగలరు? యెహోవానూ మిమ్మల్నీ ప్రేమిస్తూ మీ గురించి, మీ పరిస్థితుల గురించి బాగా తెలిసిన వాళ్లతో మాట్లాడి సలహా తీసుకోండి. మీరు మీ సామర్థ్యాలను, ఉద్దేశాలను బేరీజు వేసుకోవడానికి వాళ్లు సహాయం చేస్తారు. వాళ్లు చెప్పే మాటలు, మీరు మీ లక్ష్యాల గురించి మరోసారి ఆలోచించుకునేలా చేయవచ్చు. ఒకవేళ మీ తల్లిదండ్రులు యెహోవాను ప్రేమించేవాళ్లైతే ఈ విషయంలో వాళ్లు మీకు ఎంతో సహాయం చేయగలుగుతారు. అంతేకాకుండా, మీ సంఘ పెద్దలు ఆధ్యాత్మిక అర్హతలుగల పురుషులు కాబట్టి మీకు సరైన నడిపింపు ఇవ్వగలరు. పయినీర్లతో, ప్రయాణ పర్యవేక్షకులతో కూడా మాట్లాడండి. వాళ్లు పూర్తికాల సేవ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? వాళ్లు పయినీరు సేవను ఎలా ప్రారంభించగలిగారు? తమను ఎలా పోషించుకుంటున్నారు? తమ పరిచర్య వల్ల ఎలాంటి సంతృప్తిని సొంతం చేసుకుంటున్నారు?—సామె. 15:22.

16 మీ గురించి బాగా తెలిసినవాళ్లు మీకు మంచి సలహా ఇవ్వగలరు. ఉదాహరణకు, స్కూల్‌ చదువులు ఇబ్బందిగా అనిపించి, ఆ కష్టాన్ని తప్పించుకోవడానికి స్కూల్‌ మానేసి పయినీరు సేవ చేయాలని మీకు అనిపిస్తుంటే అప్పుడెలా? మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ ఉద్దేశాన్ని గ్రహించి, మీరు యెహోవాను మరింత ఎక్కువగా సేవించాలంటే అవసరమైన పట్టుదలను పెంపొందించుకోవడానికి స్కూల్‌ విద్య ప్రాముఖ్యమని గుర్తించేలా మీకు సహాయం చేయవచ్చు.—కీర్త. 141:5; సామె. 6:6-10.

17. మనం ఎలాంటి ఎంపికలకు దూరంగా ఉండాలి?

17 విశ్వాసాన్ని నీరుగార్చి, యెహోవా నుండి దూరం చేసే ప్రమాదాలు ఆయనను సేవించే ప్రతి ఒక్కరికీ ఎదురౌతాయి. (1 కొరిం. 15:33; కొలొ. 2:8) అయితే, కొన్ని రకాల ఉద్యోగాలు వేరేవాటి కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక ప్రమాదాలకు దారితీస్తాయి. ఫలానా ఉద్యోగం చేయడం వల్ల మీ ప్రాంతంలోని కొంతమంది ‘విశ్వాసవిషయమైన ఓడ బద్దలైపోయిందా’? (1 తిమో. 1:19) దేవునితో మీకున్న సంబంధాన్ని ప్రమాదంలో పడేసే ఎంపికలకు దూరంగా ఉండడం జ్ఞానయుక్తం.—సామె. 22:3.

యౌవనంలోనే ఆనందంగా దేవుణ్ణి సేవించండి

18, 19. యెహోవాను సేవించాలని ఇంకా అనిపించకపోతే ఏమి చేయాలి?

18 యెహోవాను సేవించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే, యౌవనంలో మీకు దొరికే ప్రతీ సేవావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ఉత్తేజకర కాలాల్లో ఆనందంగా యెహోవా సేవ చేయడానికి తోడ్పడే ఎంపికలు చేసుకోండి.—కీర్త. 148:12, 13.

19 మరోవైపు, యెహోవాను సేవించాలని మీకింకా అనిపించకపోతే మీరేమి చేయాలి? యెహోవాపై విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండండి. దేవుని ఆశీర్వాదాలు పొందేందుకు తాను చేసిన కృషిని వివరించిన తర్వాత పౌలు ఇలా రాశాడు: “అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.” (ఫిలి. 3:15, 16) యౌవనులారా, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తుంచుకోండి, ఆయనిచ్చే సలహా అత్యుత్తమమైనది. మీరు యౌవనంలో జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోవడానికి యెహోవా సహాయం చేసేంతగా ఇంకెవ్వరూ చేయలేరు.