కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మహిమాన్విత రాజైన క్రీస్తును స్తుతించండి!

మహిమాన్విత రాజైన క్రీస్తును స్తుతించండి!

“నీ ప్రభావమును ధరించుకొని [“విజయం కోసం,” NW] బయలుదేరుము.”—కీర్త. 45:4.

1, 2. మనం 45వ కీర్తనను ఎందుకు పరిశీలించాలి?

 మహిమాన్వితుడైన ఓ రాజు సత్యాన్ని, నీతిని స్థాపించేందుకు స్వారీ చేస్తూ తన శత్రువుల మీద విజయం సాధించడానికి బయలుదేరతాడు. వాళ్లమీద అంతిమ విజయం సాధించాక ఆయన ఓ అందమైన వధువును వివాహమాడతాడు. తర్వాత వచ్చే అన్ని తరాల్లోని ప్రజలు ఆ రాజును గుర్తుంచుకుంటారు, స్తుతిస్తారు. అదే 45వ కీర్తన సారాంశం.

2 అయితే 45వ కీర్తన, సుఖాంతం వైపు సాగే అద్భుతమైన కథ మాత్రమే కాదు. అందులో నమోదైన సంఘటనలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే, అవి మన జీవితాల్ని ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు ఆ కీర్తనను శ్రద్ధగా పరిశీలిద్దాం.

“ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది”

3, 4. (ఎ) మనకు ఆసక్తి కలిగించే “దివ్యమైన సంగతి” ఏమిటి? అది మన హృదయాలను ఏమి చేస్తుంది? (బి) మనం ‘రాజు గురించి’ ఎలా పాడుతున్నాం? మన నాలుక ఎప్పుడు “కలమువలె” ఉంటుంది?

3 కీర్తన 45:1 చదవండి. కీర్తనకర్త హృదయాన్ని తాకి, దాన్ని “బహుగా ఉప్పొంగ” చేసిన ఆ “దివ్యమైన సంగతి” లేదా ‘మంచి విషయం’ ఒక రాజుకు సంబంధించినది. “ఉప్పొంగు” అని అనువదించిన హీబ్రూ క్రియాపదానికి “పొంగు” లేదా “మరుగు” అనే అర్థాలున్నాయి. ఆ మంచి విషయం వల్ల కీర్తనకర్త హృదయంలో ఉత్సాహం పొంగుకొచ్చి, ఆయన “నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె” తయారైంది.

4 మరి మన సంగతేమిటి? మన హృదయాన్ని తాకే ‘మంచి విషయం,’ మెస్సీయ రాజ్యానికి సంబంధించిన సువార్త. ప్రత్యేకించి 1914⁠లో ఆ రాజ్యసువార్త మరింత ‘మంచి విషయం’ అయ్యింది. ఎందుకంటే అప్పటి నుండి అది, భవిష్యత్తులో వచ్చే రాజ్యానికి సంబంధించిన సువార్తగా కాక, అప్పటికే పరలోకంలో పరిపాలన మొదలుపెట్టిన నిజమైన ప్రభుత్వానికి సంబంధించిన సువార్తగా మారింది. ఆ ‘రాజ్య సువార్తనే’ మనం “సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా” ప్రకటిస్తున్నాం. (మత్త. 24:14) ఆ రాజ్య సందేశం వల్ల మన హృదయాలు ‘ఉప్పొంగుతున్నాయా’? మనం రాజ్య సువార్తను ఉత్సాహంగా ప్రకటిస్తున్నామా? కీర్తనకర్తలాగే మనం కూడా ‘రాజు గురించి’ పాడతాం, అంటే మన రాజైన యేసుక్రీస్తు గురించి పాడతాం. ఆయన మెస్సీయ రాజ్యానికి రాజయ్యాడని మనం ప్రకటిస్తాం. దానితోపాటు, ఆయన పరిపాలనకు లోబడమని మనం లోక పరిపాలకులందరినీ, ప్రజలందరినీ ఆహ్వానిస్తాం. (కీర్త. 2:1, 3, 4-12) అంతేకాదు, ప్రకటనా పనిలో దేవుని వాక్యాన్ని విస్తృతంగా ఉపయోగించినప్పుడు, మన “నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె” ఉంటుంది.

మనం రాజైన యేసుక్రీస్తు గురించిన సువార్తను ఉత్సాహంగా ప్రకటిస్తాం

‘రాజు పెదవుల నుండి దయగల మాటలు జాలువారాయి’

5. (ఎ) యేసు ఏయే విధాలుగా “అతిసుందరుడు”? (బి) రాజు ‘పెదవుల నుండి దయగల మాటలు’ ఎలా జాలువారాయి? మనం ఈ విషయంలో ఆయనను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

5 కీర్తన 45:2 చదవండి. యేసు చూడ్డానికి ఎలా ఉంటాడో లేఖనాలు పెద్దగా చెప్పడం లేదు. అయితే యేసు పరిపూర్ణుడు కాబట్టి, “అతిసుందరుడు” అయ్యుంటాడు. అయితే, యెహోవాకు నమ్మకంగా, యథార్థంగా ఉండడమే ఆయనను అతిసుందరుణ్ణి చేసింది. అంతేకాక, యేసు రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు ‘దయగల మాటలు’ ఉపయోగించాడు. (లూకా 4:22; యోహా. 7:46) మనం పరిచర్యలో యేసును ఆదర్శంగా తీసుకుని, ప్రజల హృదయాల్ని తాకేలా మాట్లాడడానికి వ్యక్తిగతంగా కృషి చేస్తున్నామా?—కొలొ. 4:6.

6. దేవుడు యేసుకు శాశ్వతమైన దీవెన ఎలా ఇచ్చాడు?

6 యేసు పూర్ణహృదయంతో దేవుణ్ణి ఆరాధించాడు. అందుకే, యెహోవా ఆయన పరిచర్యను ఆశీర్వదించడంతోపాటు, ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆయనకు గొప్ప బహుమతి కూడా అనుగ్రహించాడు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలి. 2:8-11) యెహోవా యేసును అమర్త్యమైన జీవంతో పునరుత్థానం చేసి శాశ్వతమైన దీవెనను ఇచ్చాడు.—రోమా. 6:8, 9.

రాజు తన “చెలికాండ్రకంటే” హెచ్చించబడ్డాడు

7. దేవుడు యేసును తన “చెలికాండ్రకంటే” హెచ్చుగా ఎలా అభిషేకించాడు?

7 కీర్తన 45:6, 7 చదవండి. యేసుకు నీతి విషయంలో అపారమైన ప్రేమ ఉంది, దానితోపాటు తన తండ్రిని అగౌరవపర్చే వాటన్నిటిపట్ల తీవ్రమైన ద్వేషం ఉంది. అందుకే యెహోవా ఆయనను మెస్సీయ రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. దేవుడు యేసును తన “చెలికాండ్రకంటే,” అంటే యూదాను పాలించిన దావీదు వంశస్థులకన్నా హెచ్చుగా “ఆనందతైలముతో” అభిషేకించాడు. ఎలా? ఒక విషయం ఏమిటంటే, యేసును యెహోవాయే స్వయంగా అభిషేకించాడు. అంతేకాక యేసును రాజుగానూ ప్రధాన యాజకునిగానూ అభిషేకించాడు. (కీర్త. 2:3; హెబ్రీ. 5:5, 6) దేవుడు యేసును తైలంతో కాకుండా పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. పైగా యేసు పరిపాలించేది పరలోకం నుండి!

8. దేవుడే యేసు ‘సింహాసనమని’ ఎందుకు చెప్పవచ్చు? ఆయన రాజ్యం నీతియుక్తమైనదని ఎందుకు నమ్మవచ్చు?

8 యెహోవా 1914⁠లో తన కుమారుణ్ణి పరలోకంలో మెస్సీయ రాజ్యానికి రాజుగా నియమించాడు. ఆయన “రాజదండము న్యాయార్థమైన దండము” కాబట్టి, ఆయన పరిపాలనలో నీతి, సమానత్వం వర్ధిల్లుతాయి. ఆయన అధికారం సక్రమమైంది, ఎందుకంటే యెహోవా దేవుడే ఆయన ‘సింహాసనం.’ అంటే ఆయన రాజ్యానికి యెహోవాయే ఆధారం. అంతేకాదు, యేసు ‘సింహాసనం నిరంతరం నిలుస్తుంది.’ దేవుడు నియమించిన ఆ శక్తిమంతమైన రాజు పరిపాలన కింద యెహోవాను సేవిస్తున్నందుకు మీకు గర్వంగా లేదా?

రాజు ‘కత్తిని’ ధరించాడు

9, 10. (ఎ) క్రీస్తు తన కత్తిని ఎప్పుడు ధరించాడు? ఆయన దాన్ని వెంటనే ఎలా ఉపయోగించాడు? (బి) క్రీస్తు తన కత్తిని భవిష్యత్తులో ఎలా ఉపయోగిస్తాడు?

9 కీర్తన 45:3 చదవండి. యెహోవా తన రాజుకు “నీ కత్తి మొలను కట్టుకొనుము” అని చెప్పాడు. తన సర్వాధిపత్యాన్ని తిరస్కరించే వాళ్లందరిపై యుద్ధం చేయమని, తన తీర్పులు అమలుచేయమని యెహోవా అలా యేసుకు అధికారం ఇస్తున్నాడు. (కీర్త. 110:2) యేసు అపజయమే ఎరుగని యోధుడైన రాజు కాబట్టి ఆయన్ను “శూరుడు” అని పిలవడం సముచితమే. ఆయన 1914⁠లో తన కత్తిని ధరించి, సాతానును అతని దయ్యాలను ఓడించి వాళ్లను పరలోకం నుండి భూమ్మీదకు పడద్రోశాడు.—ప్రక. 12:7-9.

10 అయితే రాజు విజయోత్సవ స్వారీకి అది ఆరంభం మాత్రమే. ఆయన ఆ ‘విజయ’ పరంపరను పూర్తిచేయాలి. (ప్రక. 6:2) ఆయన, భూమ్మీదున్న సాతాను లోకానికి సంబంధించిన వాటన్నిటిపై యెహోవా తీర్పులను అమలుచేయాలి, సాతానును అతని దయ్యాలను అణిచిపెట్టాలి. ముందుగా అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను నాశనం అవుతుంది. దుష్టురాలైన ఆ “వేశ్యను” నాశనం చేయడానికి లోక పరిపాలకులను ఉపయోగించాలని యెహోవా ఉద్దేశించాడు. (ప్రక. 17:16, 17) తర్వాత, యోధుడైన ఆ రాజు సాతాను రాజకీయ వ్యవస్థను కూకటివేళ్లతోసహా పెకిలించివేస్తాడు. “పాతాళపు దూత” అని కూడా పిలవబడ్డ క్రీస్తు, అప్పుడు సాతానును అతని దయ్యాలను అగాధంలో బంధించి తన విజయోత్సవ స్వారీని ముగిస్తాడు. (ప్రక. 9:1, 11; 20:1-3) ఈ ఆసక్తికరమైన సంఘటనల గురించి 45వ కీర్తన ఎలా ప్రవచించిందో ఇప్పుడు చూద్దాం.

రాజు “సత్యమును” స్థాపించడానికి బయలుదేరాడు

11. క్రీస్తు ‘సత్యాన్ని స్థాపించడానికి’ ఎలా బయలుదేరాడు?

11 కీర్తన 45:4 చదవండి. ఈ రాజు యుద్ధం చేసేది రాజ్యాల్ని ఆక్రమించుకోవడానికో, ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికో కాదు. ఆయన ఉన్నతమైన లక్ష్యాలతో నీతియుక్తమైన యుద్ధాన్ని చేస్తాడు. ఆయన “సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు” బయలుదేరాడు. ఆయన సమర్థించాల్సిన అతిగొప్ప సత్యం, యెహోవా విశ్వసర్వాధిపత్యానికి సంబంధించినది. సాతాను యెహోవా మీద తిరుగుబాటు చేసి ఆయన పరిపాలనా హక్కును సవాలుచేశాడు. అప్పటినుండి ఆ ప్రాథమిక సత్యాన్ని దయ్యాలు, మనుషులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే యెహోవా సర్వాధిపత్యానికి సంబంధించిన సత్యాన్ని శాశ్వతంగా స్థాపించడానికి ఆ రాజుకు ఇప్పుడు సమయం వచ్చింది.

12. రాజు ఏ విధంగా ‘వినయాన్ని స్థాపించడానికి’ బయలుదేరాడు?

12 ఆ రాజు ‘వినయాన్ని స్థాపించడానికి’ కూడా బయలుదేరాడు. దేవుని అద్వితీయ కుమారునిగా వినయం విషయంలో, తన తండ్రి సర్వాధిపత్యానికి నమ్మకంగా లోబడివుండే విషయంలో యేసు అద్భుత ఆదర్శం. (యెష. 50:4, 5; యోహా. 5:19) ఆ రాజు పరిపాలన కింద ఉండే నమ్మకస్థులైన పౌరులందరూ తప్పకుండా ఆయన మాదిరిని అనుసరిస్తూ, అన్ని విషయాల్లో యెహోవా సర్వాధిపత్యానికి వినయంగా లోబడాలి. అలా చేసేవాళ్లు మాత్రమే దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలో ఉంటారు.—జెక. 14:16, 17.

13. క్రీస్తు ఎలా ‘నీతిని స్థాపిస్తాడు’?

13 “నీతిని” స్థాపించడానికి కూడా క్రీస్తు బయలుదేరాడు. ఆయన “దేవుని నీతిని” అంటే తప్పొప్పుల విషయంలో యెహోవా ఏర్పాటు చేసిన ప్రమాణాలను సమర్థిస్తాడు లేదా కాపాడతాడు. (రోమా. 3:21; ద్వితీ. 32:4) “రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును” అని యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవచించాడు. (యెష. 32:1) యేసు తన పరిపాలనలో, “నీతి నివసించే” ‘క్రొత్త ఆకాశాల్ని, క్రొత్త భూమిని’ తీసుకొస్తాడు. (2 పేతు. 3:13) దేవుడు వాగ్దానం చేసిన ఆ కొత్త లోకంలోని ప్రతీ ఒక్కరు యెహోవా ప్రమాణాల ప్రకారమే జీవించాలి.—యెష. 11:1-5.

రాజు “భీకరమైనవాటిని” జరిగిస్తాడు

14. క్రీస్తు కుడిచేయి ఎలా “భీకరమైనవాటిని” జరిగిస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

14 స్వారీ చేస్తున్న రాజు తన నడుముకు కత్తి ధరించాడు. (కీర్త. 45:3) అయితే ఆ కత్తిని కుడిచేత్తో పట్టుకుని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. కీర్తనకర్త ఇలా ప్రవచించాడు: ‘నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించును.’ (కీర్త. 45:4) యేసుక్రీస్తు హార్‌మెగిద్దోను యుద్ధంలో యెహోవా తీర్పులను అమలుచేసినప్పుడు తన శత్రువులకు వ్యతిరేకంగా “భీకరమైనవాటిని” జరిగిస్తాడు. అయితే, ఆయన సాతాను లోకాన్ని ఎలా నాశనం చేస్తాడో మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ, రాజు పరిపాలనకు లోబడమని దేవుడిచ్చిన హెచ్చరికను అలక్ష్యం చేసే భూనివాసులందరికీ ఆ నాశనం వణుకు పుట్టిస్తుంది. (కీర్తన 2:11, 12 చదవండి.) “ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటివిషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు” అని లోకాంతం గురించిన తన ప్రవచనంలో యేసు చెప్పాడు.—లూకా 21:26, 27.

15, 16. క్రీస్తుతోపాటు యుద్ధంలో పాల్గొనే ‘పరలోక సేనల్లో’ ఎవరెవరు ఉంటారు?

15 రాజు “ప్రభావముతోను మహామహిమతోను” వచ్చి తీర్పులను ఎలా అమలుచేస్తాడో చెబుతూ ప్రకటన గ్రంథం ఇలా వివరిస్తుంది: “పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.” —ప్రక. 19:11, 14, 15.

16 అయితే, క్రీస్తుతోపాటు యుద్ధంలో పాల్గొనే ‘పరలోక సేనలు’ ఎవరు? క్రీస్తు తన కత్తిని మొదటిసారి ధరించి సాతానును, అతని దయ్యాలను పరలోకం నుండి పడదోసినప్పుడు క్రీస్తుతోపాటు “అతని దూతలు” పాల్గొన్నారు. (ప్రక. 12:7-9) కాబట్టి హార్‌మెగిద్దోను సమయంలో కూడా క్రీస్తుతోపాటు యుద్ధంలో పాల్గొనే యోధుల్లో పరిశుద్ధ దేవదూతలు ఉంటారని చెప్పవచ్చు. ఆ సేనల్లో దూతలే కాకుండా ఇంకెవరైనా ఉంటారా? యేసు తన అభిషిక్త సహోదరులకు ఇలా వాగ్దానం చేశాడు: “నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు; జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు.” (ప్రక. 2:26, 27) కాబట్టి క్రీస్తు పరలోక సేనల్లో, అప్పటికే పరలోకానికి పునరుత్థానమైన ఆయన అభిషిక్త సహోదరులు కూడా ఉంటారు. క్రీస్తు ఇనుపదండంతో జనులను ఏలుతూ “భీకరమైనవాటిని” జరిగించే సమయంలో ఆ అభిషిక్త సహరాజులు ఆయనతోపాటు ఉంటారు.

రాజు తన విజయ పరంపరను పూర్తిచేస్తాడు

17. (ఎ) క్రీస్తు స్వారీ చేస్తున్న తెల్లని గుర్రం దేన్ని సూచిస్తుంది? (బి) కత్తి, విల్లు వేటిని సూచిస్తున్నాయి?

17 కీర్తన 45:5 చదవండి. యెహోవా దృష్టిలో పరిశుభ్రమైన, నీతియుక్తమైన యుద్ధానికి ప్రతీకగా ఉన్న తెల్లని గుర్రం మీద రాజు కూర్చున్నాడు. (ప్రక. 6:2; 19:11) ఆ రాజు దగ్గర కత్తితోపాటు, ఒక విల్లు కూడా ఉంది. బైబిలు ఇలా చెబుతుంది: “నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలువెళ్లెను.” క్రీస్తు తన శత్రువుల మీద తీర్పులను అమలుచేయడానికి ఉపయోగించే పద్ధతుల్ని కత్తి, విల్లు సూచిస్తున్నాయి.

భూమిని శుభ్రం చేయడానికి దేవుడు పక్షులను ఉపయోగించుకుంటాడు (18వ పేరా చూడండి)

18. క్రీస్తు ‘బాణాలు వాడిగా’ ఎలా ఉంటాయి?

18 రాజు దగ్గరున్న బాణాలు వాడిగలవని, అవి రాజు శత్రువుల గుండెలో చొచ్చి ప్రజల్ని కూలుస్తాయని కీర్తనకర్త కావ్యరూపంలో ప్రవచించాడు. ఆ సంహారం భూమంతటా జరుగుతుంది. యిర్మీయా ఇలా ప్రవచించాడు: “ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు.” (యిర్మీ. 25:33) ఇదే సందర్భాన్ని మరో ప్రవచనం ఇలా వర్ణిస్తుంది: “ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి—రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.”—ప్రక. 19:17, 18.

19. క్రీస్తు ఎలా తన జైత్రయాత్రను పూర్తిచేస్తాడు?

19 భూమ్మీదున్న సాతాను దుష్ట వ్యవస్థను నాశనం చేసిన తర్వాత, క్రీస్తు ‘ప్రభావాన్ని ధరించుకుని’ విజయాన్ని పూర్తి చేయడానికి ముందుకు సాగుతాడు. (కీర్త. 45:4) ఆయన సాతానును, అతని దయ్యాలను వెయ్యేళ్లపాటు అగాధంలో బంధించి తన జైత్రయాత్ర పూర్తిచేస్తాడు. (ప్రక. 20:2, 3) సాతాను, అతని దయ్యాలు మరణంవంటి నిష్క్రియ స్థితిలో ఉండడంతో మనుషులు ఆ చెడు ప్రభావం నుండి పూర్తిగా బయటపడి, అజేయుడైన తమ మహిమాన్విత రాజుకు పూర్తిగా లోబడగలుగుతారు. ఈ భూమంతా క్రమక్రమంగా పరదైసుగా మారడం వాళ్లు చూస్తారు. అయితే, అంతకంటే ముందే తమ రాజుతోనూ ఆయన పరలోక సహవాసులతోనూ కలిసి సంతోషించడానికి వాళ్లకు మరో కారణం కూడా ఉంటుంది. దానిగురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.