కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా​—⁠మన దాత, సంరక్షకుడు

యెహోవా​—⁠మన దాత, సంరక్షకుడు

“ఒక వ్యక్తి నన్ను నమ్ముకుంటే, నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.”—​కీర్త. 91:14, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

1, 2. మన కుటుంబ పరిస్థితుల్లో, సత్యం తెలుసుకున్న విధాల్లో ఎలాంటి తేడాలు ఉన్నాయి?

 యెహోవా దేవుడే కుటుంబ ఏర్పాటును చేశాడు. (ఎఫె. 3:14) ఒకవేళ మనం ఒకే కుటుంబ సభ్యులమైనా, మన లక్షణాలూ పరిస్థితులూ వేర్వేరుగా ఉంటాయి. మనలో, చిన్నప్పటి నుండి పెద్దవాళ్లయ్యేంత వరకు అమ్మానాన్నలతో కలిసివున్నవాళ్లు ఉన్నారు. అనారోగ్యం వల్ల, ప్రమాదాల వల్ల, మరేదైనా కారణం వల్ల తమ తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్లున్నారు. తమ తల్లిదండ్రులు ఎవరో తెలియని వాళ్లూ ఉన్నారు.

2 అలాగే, మనలో ప్రతీ ఒక్కరం యెహోవా ఆరాధకుల కుటుంబంలోకి వేర్వేరు విధాలుగా వచ్చాం. బహుశ మనలో కొంతమందిమి ‘సత్యంలో పెరిగివుండవచ్చు’ అంటే, మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి మనకు దైవిక సూత్రాలు నేర్పించి ఉండవచ్చు. (ద్వితీ. 6:6, 7) లేదా వేలమంది ఇతరులవలె, యెహోవా సేవకులు చేసిన ప్రకటనా పనివల్ల సత్యం నేర్చుకుని ఉండొచ్చు.—రోమా. 10:13-15; 1 తిమో. 2:3, 4.

3. మనందరం ఏయే విషయాల్లో ఒకేలా ఉన్నాం?

3 ఇలాంటి తేడాలు ఎన్ని ఉన్నా, కొన్ని విషయాల్లో మనందరం ఒకేలా ఉన్నాం. ఆదాము అవిధేయత తీసుకొచ్చిన ఫలితాలు అనుభవిస్తూ అపరిపూర్ణత, పాపం, మరణాన్ని అందరం వారసత్వంగా పొందాం. (రోమా. 5:12) అయినప్పటికీ, సత్యారాధకులమైన మనం యెహోవాను “మా తండ్రి” అని పిలువగలుగుతున్నాం. “యెహోవా, నీవే మాకు తండ్రివి” అని పిలిచే అవకాశం ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఉండేదని యెషయా 64:8 చెబుతోంది. అంతేకాదు, యేసు కూడా “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అనే మాటలతోనే మాదిరి ప్రార్థనను మొదలుపెట్టాడు.—మత్త. 6:9, 10.

4, 5. వేటిని పరిశీలించడం వల్ల, మన పరలోక తండ్రైన యెహోవా పట్ల మన కృతజ్ఞత పెంచుకోవచ్చు?

4 మన పరలోక తండ్రి, విశ్వాసంతో ప్రార్థించే తన ప్రజల గురించి శ్రద్ధ తీసుకుంటూ, అవసరమైన కాపుదల అనుగ్రహిస్తాడు. “ఒక వ్యక్తి [సత్యారాధకుడు] నన్ను నమ్ముకుంటే, నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను” అని యెహోవా అంటున్నాడని కీర్తనకర్త రాశాడు. (కీర్త. 91:14, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అవును, యెహోవా ప్రేమతో తన ప్రజలను శత్రువుల నుండి తప్పిస్తూ, రక్షిస్తాడు. వాళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి రానివ్వడు.

5 మన పరలోక తండ్రి పట్ల కృతజ్ఞత పెంచుకోవడానికి, ఆయన గురించిన మూడు అంశాలను పరిశీలిద్దాం. అవి: యెహోవా (1) మన దాత; (2) మన సంరక్షకుడు; (3) మన సాటిలేని స్నేహితుడు. వీటిని పరిశీలిస్తూ దేవునితో మన సంబంధం ఎలా ఉందో ధ్యానిద్దాం, మన తండ్రిగా ఆయనను ఎలా ఘనపర్చవచ్చో ఆలోచిద్దాం. వాటితోపాటు, తనకు దగ్గరయ్యే వాళ్ల మీద యెహోవా దేవుడు కుమ్మరించే దీవెనల గురించి కూడా ఆలోచిద్దాం.—యాకో. 4:8.

యెహోవా మన గొప్ప దాత

6. యెహోవా “శ్రేష్ఠమైన ప్రతి యీవి” అనుగ్రహించే దేవుడని ఎలా చెప్పవచ్చు?

6 “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును” అని శిష్యుడైన యాకోబు రాశాడు. (యాకో. 1:17) మన ప్రాణమే యెహోవా ఇచ్చిన అద్భుత బహుమతి. (కీర్త. 36:9) దేవుని చిత్తం చేయడానికి మన జీవితాల్ని ఉపయోగించినప్పుడు, మనం ఇప్పుడు విస్తారమైన దీవెనలు పొందుతాం. దానితోపాటు, నూతన లోకంలో నిరంతరం జీవిస్తాం. (సామె. 10:22; 2 పేతు. 3:13) అయితే, ఆదాము అవిధేయత వల్ల వచ్చిన ఈ విషాదకరమైన పరిస్థితుల్లో అదెలా సాధ్యం?

7. మనం దేవునికి దగ్గరయ్యే మార్గాన్ని ఆయనెలా తెరిచాడు?

7 యెహోవా లెక్కలేనన్ని విధాలుగా గొప్ప దాతనని చూపిస్తున్నాడు. ఉదాహరణకు, ఆయన కృపను బట్టి మనల్ని రక్షిస్తున్నాడు. మనందరం పాపులమే, ఆదాము నుండి అపరిపూర్ణతను సంతరించుకున్నవాళ్లమే. (రోమా. 3:23) అయితే, యెహోవా మన మీదున్న ప్రేమతో చొరవ తీసుకుని మనం తనకు దగ్గరయ్యే మార్గాన్ని తెరిచాడు. “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది” అని అపొస్తలుడైన యోహాను రాశాడు.—1 యోహా. 4:9, 10.

8, 9. యెహోవా తాను గొప్ప దాతనని అబ్రాహాము, ఇస్సాకు విషయంలో ఎలా చూపించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

8 విధేయత చూపించే మనుషులు నిరంతరం జీవించడానికి యెహోవా దేవుడు ప్రేమతో ఎంత గొప్ప ఏర్పాటు చేస్తాడో సా.శ.పూ. 19వ శతాబ్దంలో జరిగిన ఓ సంఘటన చూపించింది. హెబ్రీయులు 11:17-19 వచనాలు ఇలా వివరిస్తున్నాయి: “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, —ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన ఏక కుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.” యెహోవా దేవుడు చేయబోయేదాన్ని ఆ సంఘటన చూపించింది. ఆయన మానవజాతిని కాపాడడానికి తన కుమారుడైన క్రీస్తును అర్పించాడు.—యోహాను 3:16, 36 చదవండి.

9 మరణం అంచుల నుండి దేవుడు తనను తప్పించినప్పుడు, ఇస్సాకు ఎంత ఊరట పొందుంటాడు! తనకు బదులుగా అర్పించడానికి పొట్టేలును అనుగ్రహించినందుకు ఇస్సాకు తప్పకుండా దేవునికి కృతజ్ఞత చూపించి ఉంటాడు. (ఆది. 22:10-13) అందుకే ఆ స్థలానికి “యెహోవా యీరే” అనే పేరు వచ్చింది. దానికి అర్థం “యెహోవా చూచుకొనును” లేదా ‘యెహోవా దయచేయును.’—ఆది. 22:14; అథఃస్సూచి.

సమాధానపడే అవకాశం దయచేశాడు

10, 11. “సమాధాన పరచు పరిచర్య” చేసే విషయంలో ఎవరు ముందున్నారు, వాళ్లు దాన్ని ఎలా చేశారు?

10 యెహోవా తాను గొప్ప దాతనని చూపించిన విధానాన్ని ధ్యానిస్తే, పౌలులాగే మనం కూడా యేసుక్రీస్తుకున్న ప్రాముఖ్యతను గుర్తించి కృతజ్ఞత చూపిస్తాం. పౌలు ఇలా రాశాడు: “అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.”—2 కొరిం. 5:14, 15.

11 దేవుని మీదున్న ప్రేమతో, ఆయన సేవచేసే అమూల్యమైన అవకాశం దొరికిందనే కృతజ్ఞతతో తొలి క్రైస్తవులు “సమాధాన పరచు పరిచర్య” చేసే బాధ్యతను ఆనందంగా స్వీకరించారు. వాళ్లు సువార్త ప్రకటించి, శిష్యులను చేయడం వల్ల సత్యాన్ని ఇష్టపడే అనేక మందికి దేవునితో సమాధానపడి, ఆయన స్నేహాన్ని సంపాదించుకుని, చివరకు ఆయన ఆధ్యాత్మిక పిల్లలయ్యే అవకాశం దొరికింది. ఇప్పుడున్న అభిషిక్త క్రైస్తవులు కూడా ఆ పరిచర్యనే చేస్తున్నారు. దేవునికి, క్రీస్తుకు రాయబారులుగా వీళ్లు చేస్తున్న సేవవల్ల సరైన మనోవైఖరిగల ప్రజలు యెహోవాకు దగ్గరై, విశ్వాసులవుతున్నారు.—2 కొరింథీయులు 5:18-20 చదవండి; యోహా. 6:44; అపొ. 13:48.

12, 13. యెహోవా ఎన్నో బహుమతులు దయచేస్తున్నందుకు మనం కృతజ్ఞత ఎలా చూపించవచ్చు?

12 భూపరదైసులో జీవించాలని ఎదురు చూస్తున్న క్రైస్తవులందరూ, గొప్ప దాతయైన యెహోవా మీదున్న కృతజ్ఞతవల్ల అభిషిక్తులతో కలిసి రాజ్యసువార్త ప్రకటిస్తున్నారు. ఈ పనిలో మనం దేవుడు దయచేసిన మరో గొప్ప బహుమతి, బైబిలును ఉపయోగిస్తున్నాం. (2 తిమో. 3:16, 17) మన పరిచర్యలో దేవుని వాక్యాన్ని నైపుణ్యంగా ఉపయోగించినప్పుడు, ఇతరులకు నిత్యజీవాన్ని సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తాం. ఈ పనిలో తోడ్పడడానికి, మనలో ప్రతీ ఒక్కరం యెహోవా అనుగ్రహించే మరో బహుమతి మీద ఆధారపడతాం, అదే పరిశుద్ధాత్మ. (జెక. 4:6; లూకా 11:13) పరిచర్య వల్ల చక్కని ఫలితాలు వస్తున్నాయని ప్రతీ సంవత్సరం వచ్చే యెహోవాసాక్షుల వార్షిక పుస్తకము (ఆంగ్లం) చూపిస్తుంది. మన తండ్రి, మన దాత అయిన యెహోవాను స్తుతించే ఈ పనిలో పాలుపంచుకోవడం ఎంత గొప్ప గౌరవం!

13 దేవుడు వీటన్నిటినీ దయచేస్తున్నాడు కాబట్టి, మనం ఈ విషయాల గురించి ఆలోచించడం మంచిది: ‘నేను పరిచర్యలో చేయగలిగినదంతా చేస్తూ, యెహోవా ఇస్తున్న వాటన్నిటికీ ఆయనకు మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నానని చూపిస్తున్నానా? మరింత బాగా సువార్త ప్రకటించాలంటే నేను ఇంకా ఏయే విషయాల్లో మెరుగుపడాలి?’ మన జీవితాల్లో రాజ్యానికి సంబంధించిన విషయాలకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవుడు దయచేస్తున్న అద్భుతమైన బహుమతులకు కృతజ్ఞత చూపిస్తాం. మనం అలా చేసినప్పుడు మన అవసరాలు తీరేలా యెహోవా చూసుకుంటాడు. (మత్త. 6:25-33) దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం ఆయన ఇష్టపడేవి చేస్తూ, ఆయన హృదయాన్ని సంతోషపెట్టడానికి శాయశక్తులా కృషి చేయాలని తప్పకుండా కోరుకుంటాం.—సామె. 27:11.

14. యెహోవా తన ప్రజలను ఎలా సంరక్షిస్తున్నాడు?

14 “నేను శ్రమలపాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే” అని దావీదు పాడాడు. (కీర్త. 40:17) యెహోవా ఒక గుంపుగా తన ప్రజలను ఎన్నోసార్లు రక్షించాడు. ప్రత్యేకించి, శత్రువులు వాళ్లను క్రూరంగా హింసించినప్పుడు, అదే పనిగా దాడి చేసినప్పుడు ఆయన అలా చేశాడు. అలాంటి పరిస్థితుల్లో సహాయం అందిస్తున్నందుకు, మనకోసం ఎప్పటికప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక ఏర్పాట్లు చేస్తున్నందుకు మనం దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం.

యెహోవా సంరక్షిస్తాడు

15. ఓ ప్రేమగల తండ్రి తన కొడుకును ఎలా రక్షించాడో అనుభవం చెప్పండి.

15 ప్రేమగల తండ్రి తన పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంతోపాటు, వాళ్లను కాపాడతాడు. వాళ్లేదైనా ప్రమాదంలో చిక్కుకుంటే కాపాడడానికి వెంటనే ప్రయత్నిస్తాడు. ఓ సహోదరుడు, చిన్నప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటున్నాడు. ఓ రోజు ఆయనా వాళ్ల నాన్నా పరిచర్యకు వెళ్లారు. ఇంటికి తిరిగివచ్చే సమయానికి దారిలోని చిన్న ఏరు ఆ రోజు కురిసిన భారీ వర్షంవల్ల పొంగిపొర్లుతుంది. అవతలి ఒడ్డుకు చేరాలంటే, ఒకరాయి మీద నుండి మరో రాయి మీదకు దూకుతూ వెళ్లడం తప్ప మరో దారిలేదు. ఆ అబ్బాయి వాళ్ల నాన్నకన్నా ముందు వెళ్తూ ఒక రాయి మీదకు దూకినప్పుడు కాలు జారి నీటిలో పడి, రెండు మునకలేశాడు. వెంటనే చెయ్యి పట్టుకుని పైకిలాగి రక్షించిన తండ్రి పట్ల ఆ అబ్బాయి ఎంత కృతజ్ఞత చూపించి ఉంటాడు! ఈ లోకాధికారి సాతాను, అతని దుష్ట లోకం కారణంగా మన మీదకు వచ్చే వరదల్లాంటి ప్రమాదాల నుండి మన పరలోక తండ్రి మనల్ని రక్షిస్తాడు. నిజంగా, యెహోవా సాటిలేని సంరక్షకుడు.—మత్త. 6:13; 1 యోహా. 5:19.

16, 17. అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయాన్ని, రక్షణను ఎలా అందించాడు?

16 యెహోవా తన ప్రజలను ప్రేమతో ఎలా సంరక్షిస్తాడో నిరూపించిన ఓ సంఘటనను ఇప్పుడు చూద్దాం. ఆయన ఐగుప్తు బంధకాల నుండి సా.శ.పూ. 1513⁠లో ఇశ్రాయేలీయుల్ని విడిపించి, అద్భుతరీతిలో ఎర్ర సముద్రం దాటించిన తర్వాత ఆ సంఘటన జరిగింది. వాళ్లు సీనాయి పర్వతానికి వెళ్లే దారిలోని అరణ్యం గుండా నడుచుకుంటూ రెఫీదీము ప్రాంతాన్ని చేరుకున్నారు.

17 నిస్సహాయులుగా కనిపిస్తున్న ఇశ్రాయేలు జనాంగం మీద దాడిచేసి, ఆదికాండము 3:15⁠లోని ప్రవచనం నేరవేరకుండా అడ్డుకోవాలని సాతాను శతవిధాలా ప్రయత్నించాడు. దానికోసం అతను, దేవుని ప్రజలకు శత్రువులైన అమాలేకీయుల్ని కూడా ఉపయోగించుకున్నాడు. (సంఖ్యా. 24:20) అయితే యెహోషువ, మోషే, అహరోను, హూరు అనే నలుగురు నమ్మకస్థులను ఉపయోగించి యెహోవా ఏమి చేశాడో పరిశీలించండి. యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే, అహరోను, హూరు దగ్గర్లోని కొండ మీద ఉన్నారు. మోషే చేతులు పైకెత్తి ఉంచినంతసేపు యుద్ధంలో ఇశ్రాయేలీయులు పైచేయి సాధించారు. అయితే ఆయన చేతులు నొప్పిపెట్టినప్పుడు అహరోను, హూరు ఆయనకు ఊతమిచ్చారు. కాబట్టి, యెహోవా సహాయంతో, ఆయనిచ్చిన రక్షణతోనే, యెహోషువ “అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.” (నిర్గ. 17:8-13) అందుకే మోషే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి, దానికి “యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు. ఆ పేరుకు “యెహోవా నా ధ్వజం” (పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అని అర్థం.—నిర్గమకాండము 17:14, 15 చదవండి.

సాతాను కబంధహస్తాల నుండి మనల్ని రక్షిస్తున్నాడు

18, 19. దేవుడు మనకాలంలో తన సేవకులను ఎలా రక్షించాడు?

18 తనను ప్రేమిస్తూ, విధేయత చూపించేవాళ్లను యెహోవా రక్షిస్తాడు. శత్రువులు దాడి చేసినప్పుడు మనం కూడా రెఫీదీము వద్ద ఇశ్రాయేలీయులు చేసినట్లు రక్షణ కోసం దేవుని వైపే చూస్తాం. ఒక గుంపుగా యెహోవా దేవుడు మనల్ని ఎన్నోసార్లు కాపాడి, సాతాను కబంధహస్తాల నుండి రక్షిస్తున్నాడు. క్రైస్తవ తటస్థతకు కట్టుబడి ఉన్న మన సహోదరులను దేవుడు రక్షించిన ఎన్నో సందర్భాలను గుర్తుతెచ్చుకోండి. నాజీలు పాలించినప్పుడు జర్మనీలోను, మరితర దేశాల్లోను 1930-45 మధ్యకాలంలో అదే జరిగింది. హింస ఎదురైన సందర్భాల్లో దేవుని కాపుదలను చవిచూసిన వాళ్ల జీవితకథలు, వార్షిక పుస్తకము వివరించే అనుభవాలు చదివినప్పుడు, వాటి గురించి ఆలోచించినప్పుడు యెహోవా మన ఆశ్రయమనే నమ్మకం మరింత బలపడుతుంది.—కీర్త. 91:2.

కష్టకాలాల్లో నమ్మకంగా ఉండేలా మనకు సహాయం చేయడానికి యెహోవా మన తోటి విశ్వాసులను ఉపయోగించగలడు (18-20 పేరాలు చూడండి)

19 యెహోవా తన సంస్థ ద్వారా, దాని ప్రచురణల ద్వారా ఎప్పటికప్పుడు ప్రేమపూర్వక సలహాలు ఇస్తూ మనల్ని సంరక్షిస్తున్నాడు. వాటివల్ల ఈ మధ్యకాలంలో మనం పొందిన ప్రయోజనాల గురించి ఆలోచించండి. లోకం అంతకంతకు విచ్చలివిడితనంతో, అశ్లీలతతో నిండిపోతుంటే; వాటి బారిన పడకుండా మనల్ని కాపాడడానికి యెహోవా మనకు అవసరమైన సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు. ఉదాహరణకు, సోషల్‌నెట్‌వర్కింగ్‌ దుర్వినియోగం వల్ల ఏర్పడే చెడ్డ స్నేహాల జోలికిపోవద్దని ఆయన మనల్ని తండ్రిలా వారిస్తున్నాడు. a1 కొరిం. 15:33.

20. సంఘం ద్వారా మనం ఎలాంటి కాపుదల, నిర్దేశం పొందుతున్నాం?

20 మనం నిజంగా “యెహోవాచేత ఉపదేశము” పొందుతున్నామని చూపించాలంటే ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా పాటించాలి. (యెష. 54:13) సురక్షితమైన ఆవాసాల్లాంటి సంఘాల్లో లేఖనాలను ఉపయోగిస్తూ, సహాయాన్నీ సలహాలనూ అందించే నమ్మకస్థులైన పురుషులు పెద్దలుగా సేవ చేస్తుంటారు కాబట్టి, చక్కని దిశానిర్దేశాన్నీ కాపుదలనూ పొందుతాం. (గల. 6:1) యెహోవా ముఖ్యంగా ‘మనుష్యుల్లో ఈవుల్ని’ ఉపయోగించుకుంటూ మనపై ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తున్నాడు. (ఎఫె. 4:7, 8) మరి మనం చేయాల్సింది ఏమిటి? మనస్ఫూర్తిగా లోబడుతూ, విధేయత చూపించాలి, అప్పుడే దేవుని దీవెనలు పొందుతాం.—హెబ్రీ. 13:17.

21. (ఎ) ఏమి చేయాలని మనం తీర్మానించుకోవాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో దేని గురించి తెలుసుకుంటాం?

21 కాబట్టి, పరిశుద్ధాత్మ నడిపించే దారిలో వెళ్తూ, మన పరలోక తండ్రి ఇచ్చే నిర్దేశానికి పూర్తిగా లోబడాలని తీర్మానించుకుందాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చూపిన సాటిలేని ఆదర్శం గురించి ధ్యానిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడవడానికి కూడా కృషి చేద్దాం. తుదిశ్వాస వరకూ విధేయత చూపించడంవల్ల యేసు గొప్ప ప్రతిఫలం పొందాడు. (ఫిలి. 2:5-11) పూర్ణహృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచినప్పుడు మనం కూడా అలాగే ఆశీర్వాదాలు పొందుతాం. (సామె. 3:5, 6) కాబట్టి, మన సాటిలేని సంరక్షకుడు, దాత అయిన యెహోవా దేవునిపై ఎల్లప్పుడూ ఆధారపడదాం. ఆయన సేవ చేసే అవకాశం దొరకడం ఎంత గొప్ప భాగ్యం! మన తండ్రి శ్రద్ధకు ప్రతిబింబమైన మూడో అంశం గురించి, అంటే ఆయన మన స్నేహితుడనే విషయం గురించి ఆలోచించినప్పుడు ఆయన మీద మనకున్న ప్రేమ మరింత పెరుగుతుంది. యెహోవా మనకు ఏ విధంగా సాటిలేని స్నేహితుడో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

a కావలికోట, 2011 ఆగష్టు 15 సంచిక, 3-5 పేజీల్లోని “భూవ్యాప్తంగా అందుబాటులోవున్న ఇంటర్నెట్‌ను జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?” కావలికోట, 2012 ఆగష్టు 15 సంచిక, 20-29 పేజీల్లోని “సాతాను ఉరుల విషయంలో జాగ్రత్త!” “స్థిరంగా ఉంటూ సాతాను ఉచ్చుల్ని తప్పించుకోండి” వంటి ఆర్టికల్స్‌లో అలాంటి సూచనలు వచ్చాయి.