కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చు?

స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చు?

‘ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, తన్నుతాను ఉపేక్షించుకొనవలెను.’—మత్త. 16:24.

1. యేసు స్వయంత్యాగ స్ఫూర్తిని సంపూర్ణంగా ఎలా చూపించాడు?

 భూమ్మీదున్నప్పుడు యేసు స్వయంత్యాగ స్ఫూర్తిని సంపూర్ణంగా చూపించాడు. దేవుని చిత్తం చేయడం కోసం ఆయన తన కోరికలను, సౌఖ్యాలను మనస్ఫూర్తిగా పక్కన పెట్టాడు. (యోహా. 5:30) హింసాకొయ్యపై చనిపోయేటప్పుడు కూడా నమ్మకస్థునిగా ఉండి, తన స్వయంత్యాగ స్ఫూర్తికి అవధులు లేవని చూపించాడు.—ఫిలి. 2:8.

2. స్వయంత్యాగ స్ఫూర్తిని మనం ఎలా చూపించగలం? ఎందుకు చూపించాలి?

2 యేసును అనుసరించే మనం కూడా స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించాలి. ఇంతకీ స్వయంత్యాగ స్ఫూర్తి అంటే ఏమిటి? ఒక్కమాటలో చెప్పాలంటే, ఇతరులకు సహాయం చేయడం కోసం సొంత ఇష్టాలను వదులుకోవడమే స్వయంత్యాగ స్ఫూర్తి. ఒకరకంగా, అది స్వార్థానికి విరుద్ధమైనది. (మత్తయి 16:24 చదవండి.) నిస్వార్థంగా ఉండడం వల్ల మనం సొంత భావాలకు, ఇష్టాయిష్టాలకు బదులు ఇతరుల భావాలకు, ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం ఇవ్వగలుగుతాం. (ఫిలి. 2:3, 4) నిజానికి, నిస్వార్థ గుణానికి మన ఆరాధనలో చాలా ప్రాముఖ్యత ఉందని యేసు బోధించాడు. ఎలా? త్యాగాలు చేసేలా మనల్ని కదిలించే ప్రేమ, యేసు నిజ శిష్యుల గుర్తింపు చిహ్నం. (యోహా. 13:34, 35) స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించే ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో ఉన్నందుకు మనం అనుభవించే ఆశీర్వాదాల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి!

3. దేనివల్ల మన స్వయంత్యాగ స్ఫూర్తి బలహీనపడవచ్చు?

3 అయితే, మనలోని స్వయంత్యాగ స్ఫూర్తిని మనకు తెలియకుండానే బలహీనపర్చగల శత్రువుని మనం ఎదుర్కొంటున్నాం. స్వార్థంగా ప్రవర్తించాలనిపించే బలహీనతే ఆ శత్రువు. ఆదాముహవ్వలు ఎలా స్వార్థపరులయ్యారో ఒక్కసారి గుర్తుచేసుకోండి. దేవునిలా అవ్వాలనే స్వార్థ కోరికను తీర్చుకోవడానికి హవ్వ ప్రయత్నించింది. ఆమె భర్త స్వార్థంతో, ఆమెను సంతోషపెట్టాలని మాత్రమే చూశాడు. (ఆది. 3:5, 6) అపవాది ఆదాముహవ్వలను సత్యారాధనకు దూరం చేసినప్పటి నుండి, స్వార్థం చూపించేలా ప్రజలను ప్రలోభపెడుతూనే ఉన్నాడు. అతడు యేసును కూడా అలాగే ప్రలోభపెట్టాలని ప్రయత్నించాడు. (మత్త. 4:1-9) అనేక రకాలుగా స్వార్థం చూపించేలా ప్రజలను ప్రలోభపెడుతూ, సాతాను మనకాలంలో కూడా చాలామందిని తప్పుదారి పట్టించాడు. ప్రపంచమంతటా వ్యాపించిన స్వార్థమనే లక్షణం మనకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.—ఎఫె. 2:2.

4. (ఎ) మనం స్వార్థపూరిత కోరికలను ప్రస్తుతం తీసివేసుకోగలమా? వివరించండి. (బి) మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

4 స్వార్థాన్ని ఇనుముకు పట్టే తుప్పుతో పోల్చవచ్చు. ఇనుప వస్తువులను బయటపెట్టినప్పుడు తుప్పుపడతాయి. అయితే, తుప్పు ఎక్కువై ఆ వస్తువులు పనికిరాకుండాపోయే వరకు వాటిని పట్టించుకోకపోవడం ప్రమాదాల్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అదేవిధంగా, మనలో ఉన్న అపరిపూర్ణతను, స్వార్థపు కోరికలను ప్రస్తుతం తీసివేసుకోలేకపోయినా, వాటివల్ల వచ్చే ప్రమాదాల గురించి అప్రమత్తంగా ఉంటూ, వాటితో పోరాడుతూనే ఉండాలి. (1 కొరిం. 9:26, 27) మనలో ఉన్న స్వార్థపు ఛాయలను ఎలా గుర్తించవచ్చు? స్వయంత్యాగ స్ఫూర్తిని మరింతగా ఎలా వృద్ధి చేసుకోవచ్చు?

స్వార్థపు జాడలను పరిశీలించుకోవడానికి బైబిల్ని ఉపయోగించండి

5. (ఎ) బైబిలు ఓ అద్దంలా ఎలా ఉపయోగపడుతుంది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) మనల్ని మనం పరిశీలించుకునేటప్పుడు ఏమి చేయకూడదు?

5 అద్దంలో చూస్తూ మనం ఎలా ఉన్నామో పరిశీలించుకున్నట్లే, బైబిల్లో చూస్తూ మన అంతరంగాన్ని పరిశీలించుకుని, మనలోని లోపాలను సరిచేసుకోవాలి. (యాకోబు 1:22-25 చదవండి.) అయితే, మనం అద్దాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడే మనం ఎలా ఉన్నామో స్పష్టంగా చూడగలుగుతాం. ఉదాహరణకు, మనం అద్దంలో హడావిడిగా చూసుకుంటే, చిన్నదే అయినా తప్పకుండా సరిచేసుకోవాల్సిన ఓ లోపాన్ని గమనించలేకపోవచ్చు. లేదా అద్దాన్ని ఎదురుగా కాకుండా కొంచెం పక్క నుండి చూస్తే మన ముఖం కాకుండా వేరేవాళ్ల ముఖం కనిపించవచ్చు. అదేవిధంగా, మనం బైబిల్ని కేవలం పైపైన లేదా వేరేవాళ్ల లోపాల్ని కనిపెట్టడం కోసం చదివితే, మనలోవున్న స్వార్థం వంటి లోపాల్ని ఆ అద్దంలో చూసుకోలేము.

6. మనం సంపూర్ణమైన నియమంలో ఎలా “నిలుకడగా” ఉండవచ్చు?

6 ఉదాహరణకు, మనం ప్రతిరోజూ బైబిలు చదువుతుండవచ్చుగానీ, మనలో మొగ్గతొగుడుతున్న స్వార్థాన్ని మనం గుర్తించకపోవచ్చు. అదెలా సాధ్యం? ఈ విషయాన్ని పరిశీలించండి: యాకోబు చెప్పిన ఉదాహరణలోని వ్యక్తి అద్దంలో తనను తాను జాగ్రత్తగానే చూసుకున్నాడు. ఆ వ్యక్తి అద్దంలో ‘తన సహజముఖాన్ని చూసుకున్నాడు’ అని యాకోబు రాశాడు. ఆయన ఈ సందర్భంలో, ‘నిశితంగా లేదా జాగ్రత్తగా పరిశీలించడం’ అనే భావాన్నిచ్చే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. అయితే ఆ వ్యక్తి చేసిన తప్పేంటి? యాకోబు ఇలా కొనసాగించాడు: “వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును.” ఆ వ్యక్తి అద్దం చూసుకున్నా, దేన్నీ సరిచేసుకోకుండానే వెళ్లిపోయాడు. అయితే, పూర్తి ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తి ‘సంపూర్ణమైన నియమములో తేరి చూడడంతో పాటు’ దానిలో “నిలుకడగా” ఉంటాడు. దేవుని సంపూర్ణమైన నియమాన్ని చదివి మర్చిపోయే బదులు ఆ వ్యక్తి దానిలో “నిలుకడగా” ఉంటాడు, అంటే పట్టుదలతో ఆ బోధల్ని పాటిస్తూ ఉంటాడు. ‘మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజంగా నాకు శిష్యులై ఉంటారు’ అని అన్నప్పుడు యేసు కూడా ఆ విషయాన్నే చెప్పాడు.—యోహా. 8:31.

7. మనలోని స్వార్థపు జాడలను పరిశీలించుకోవడానికి బైబిల్ని ఎలా ఉపయోగించవచ్చు?

7 కాబట్టి, మనలోని స్వార్థపు జాడలతో విజయవంతంగా పోరాడాలంటే మనం మొదటిగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ఏయే విషయాలను సరిచేసుకోవాలో అప్పుడు మనకు తెలుస్తుంది. అయితే మనం ఇంకో పని కూడా చేయాలి. పరిశోధన చేస్తూ మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఒకానొక బైబిలు వృత్తాంతాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాక ఇలా ప్రశ్నించుకోండి: ‘ఆ పరిస్థితిలో నేనుంటే ఏమి చేసుండేవాణ్ణి? సరైన నిర్ణయమే తీసుకునేవాణ్ణా?’ అన్నిటికంటే ముఖ్యంగా, చదివి, ధ్యానించి నేర్చుకున్న వాటిని పాటించడానికి కృషి చేయండి. (మత్త. 7:24, 25) అయితే, రాజైన సౌలుకు, అపొస్తలుడైన పేతురుకు సంబంధించిన వృత్తాంతాలు స్వయంత్యాగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి మనకెలా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం.

సౌలు జీవితం ఒక హెచ్చరిక

8. సౌలు రాజైన కొత్తలో ఎలా ఉండేవాడు? ఆ విషయం మనకెలా తెలుసు?

8 రాజైన సౌలు జీవితాన్ని పరిశీలిస్తే, స్వార్థం ఒక వ్యక్తిలోని స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా తినివేస్తుందో అర్థమవుతుంది. సౌలు రాజైన కొత్తలో వినయంగా, అణకువగానే ఉన్నాడు. (1 సమూ. 9:21) ఆయన తన రాచరికానికి వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లను శిక్షించకుండా వదిలేశాడు, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి వాళ్లను శిక్షించే అవకాశమున్నా సౌలు ఆ పని చేయలేదు. (1 సమూ. 10:27) అలాగే పరిశుద్ధాత్మ నిర్దేశానికి లోబడి, యుద్ధంలో ఇశ్రాయేలీయులను ముందుండి నడిపించి అమ్మోనీయులను ఓడించాడు. కానీ ఘనతను మాత్రం ఆయన వినయంగా యెహోవాకే ఇచ్చాడు.—1 సమూ. 11:6, 11-13.

9. సౌలు స్వార్థపు ఆలోచనలను ఎలా వృద్ధి చేసుకున్నాడు?

9 అలాంటి సౌలు ఆ తర్వాత, తుప్పులా తినివేసే స్వార్థపు ఆలోచన, గర్వం తనలో వృద్ధయ్యేందుకు అవకాశమిచ్చాడు. యుద్ధంలో అమాలేకీయులను ఓడించినప్పుడు ఆయన యెహోవాకు లోబడే బదులు, తన సొంత కోరికలకే ప్రాధాన్యమిచ్చాడు. దోపుడు సొమ్మును నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే, సౌలు మాత్రం దురాశతో తీసుకున్నాడు. తర్వాత అహంకారంతో తనకొరకు ఒక జయసూచకమైన శిలను నిలబెట్టించాడు. (1 సమూ. 15:3, 9, 12) ఆ పని యెహోవాకు నచ్చలేదని సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు సౌలు సాకులు వెదుకుతూ, దేవుడిచ్చిన ఆజ్ఞలో తాను పాటించిన విషయాన్ని గొప్పగా చెప్పుకున్నాడు. తప్పును మాత్రం వేరేవాళ్ల మీద తోసేశాడు. (1 సమూ. 15:16-21) దానికితోడు, గర్వాన్ని తలకెక్కించుకున్న సౌలు ప్రజల ముందు పరువు దక్కించుకోవాలనే ఆలోచించాడుగానీ దేవుణ్ణి సంతోషపెట్టడం గురించి ఆలోచించలేదు. (1 సమూ. 15:30) మనం స్వయంత్యాగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి సౌలు జీవితాన్ని ఓ అద్దంలా ఎలా ఉపయోగించవచ్చు?

10, 11. (ఎ) స్వయంత్యాగ స్ఫూర్తిని కాపాడుకోవాలంటే మనం సౌలు జీవితం నుండి ఏ పాఠాలు నేర్చుకోవాలి? (బి) సౌలు నడిచిన చెడు మార్గానికి దూరంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

10 సౌలు జీవితం నుండి నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, మనం మొదట్లో స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించాం కాబట్టి ఎలాంటి ప్రయత్నం చేయకుండానే జీవితాంతం దాన్ని చూపిస్తూ ఉంటామని ఎన్నడూ అనుకోకూడదు. (1 తిమో. 4:10) సౌలు కొంతకాలంపాటు బాగానే ఉండి దేవుని అనుగ్రహాన్ని పొందాడని గుర్తుంచుకోండి, కానీ ఆ తర్వాత తనలో వృద్ధి అవుతున్న స్వార్థపు ఆలోచనలను ఆయన తీసేసుకోలేకపోయాడు. సౌలు అవిధేయతను చూసి యెహోవా చివరకు ఆయనను తిరస్కరించాడు.

11 రెండవదిగా, మనం చక్కగా పాటిస్తున్న విషయాల మీదే మనసుపెడుతూ, సరిచేసుకోవాల్సిన అంశాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే, అద్దంలో కొత్తబట్టల్ని చూసుకుని మురిసిపోతూ, ముఖం మీదున్న మురికిని ఏమాత్రం పట్టించుకోని వాళ్లలా ఉంటాం. సౌలు చూపించినంత గర్వం, మితిమీరిన ఆత్మవిశ్వాసం మనలో ఉండకపోవచ్చు, కానీ అలాంటి చెడు ప్రవర్తనకు నడిపించే లక్షణాలకు మాత్రం మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మనకు ఎవరైనా సలహా ఇస్తే, సౌలులా మనల్ని మనం సమర్థించుకోకుండా, సమస్యను తక్కువచేసి చూపకుండా, ఇతరుల మీదకు తప్పునెట్టకుండా ఉందాం. మనస్ఫూర్తిగా సలహాను స్వీకరించడం అన్నివిధాలా మంచిది.—కీర్తన 141:5 చదవండి.

12. మనం ఒకవేళ గంభీరమైన పాపం చేస్తే, స్వయంత్యాగ స్ఫూర్తి ఎలా సహాయపడుతుంది?

12 మనం ఒకవేళ ఏదైనా గంభీరమైన పాపం చేస్తే ఏమి చేయాలి? సౌలు తన పరువు గురించి మాత్రమే ఆలోచించాడు, అందుకే ఆయన దేవునికి మళ్లీ దగ్గరవ్వలేకపోయాడు. కానీ స్వయంత్యాగ స్ఫూర్తి ఉంటే పరువుప్రతిష్ఠల గురించి ప్రాకులాడకుండా, అవసరమైన సహాయాన్ని పొందుతాం. (సామె. 28:13; యాకో. 5:14-16) తన 12వ ఏట నుండి అశ్లీల చిత్రాలు చూస్తున్న ఓ సహోదరుడు, దశాబ్దంపైనే ఆ అలవాటును రహస్యంగా కొనసాగించాడు. ఆయనిలా అంటున్నాడు: “నా తప్పును నా భార్య ముందు, సంఘపెద్దల ముందు ఒప్పుకోవడం చాలా కష్టమైంది. అయితే తప్పు ఒప్పుకున్నప్పటి నుండి, పెద్ద భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. నన్ను పరిచర్య సేవకునిగా తీసేసినప్పుడు నా స్నేహితుల్లో కొందరు, తమ నమ్మకాన్ని వమ్ముచేశానని బాధపడ్డారు. అయితే, నా పరిచర్యను యెహోవా అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువగా ఇష్టపడుతున్నాడని తెలుసు, ఎవరేమనుకున్నా ఆయన అభిప్రాయమే నాకు ముఖ్యం.”

పేతురు స్వార్థాన్ని అధిగమించాడు

13, 14. పేతురు స్వార్థపు స్వభావాన్ని ఎలా చూపించాడు?

13 అపొస్తలుడైన పేతురు కూడా, యేసు దగ్గర శిక్షణ తీసుకున్నంత కాలం స్వయంత్యాగ స్ఫూర్తి చూపించాడు. (లూకా 5:3-11) అయితే ఆయన, స్వార్థపు ఆలోచనలతో పోరాడాల్సివచ్చింది. ఉదాహరణకు, దేవుని రాజ్యంలో ప్రముఖ స్థానాలు పొందాలని యాకోబు, యోహానులు పథకం వేసినప్పుడు పేతురు చాలా కోప్పడ్డాడు. తనకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తానని యేసు అప్పటికే తనతో అన్నాడు కాబట్టి, రాజ్యంలో అలాంటి ప్రముఖ స్థానం తనకే చెందాలని పేతురు బహుశా అనుకొనివుంటాడు. (మత్త. 16:18, 19) ఏదేమైనా, తన శిష్యులు తమ సహోదరుల మీద ‘ప్రభుత్వం చేయకుండా’ జాగ్రత్తగా ఉండాలని యాకోబు, యోహానుతో సహా పేతురును, ఇతర అపొస్తలులను కూడా యేసు హెచ్చరించాడు.—మార్కు 10:35-45.

14 పేతురు ఆలోచనా విధానాన్ని సరిచేయాలని యేసు ప్రయత్నించిన తర్వాత కూడా, పేతురు తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటూనే ఉన్నాడు. అపొస్తలులు తనను తాత్కాలికంగా విడిచిపెట్టి వెళ్లిపోతారని యేసు చెప్పినప్పుడు, పేతురు మిగతా వాళ్లను తక్కువ చేస్తూ తనను హెచ్చించుకుంటూ, తానొక్కణ్ణి మాత్రం నమ్మకంగా ఉంటానని అన్నాడు. (మత్త. 26:31-33) అయితే పేతురుది మితిమీరిన ఆత్మవిశ్వాసమని తేలిపోయింది, ఆ రాత్రే ఆయన స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించలేకపోయాడు. తనను తాను కాపాడుకోవడానికి, యేసు ఎవరో తెలియదని పేతురు మూడుసార్లు అన్నాడు.—మత్త. 26:69-75.

15. పేతురు జీవితం ఎందుకు ప్రోత్సాహకరంగా ఉంది?

15 పేతురుకు బలహీనతలు, వైఫల్యాలు ఉన్నా ఆయన జీవితం మనకు ప్రోత్సాహకరంగా ఉంది. స్వయంగా చేసిన కృషితోపాటు, పరిశుద్ధాత్మ సహాయంతో పేతురు తన లోపాలను సరిచేసుకొని ఆశానిగ్రహాన్ని, నిస్వార్థమైన ప్రేమను చూపించగలిగాడు. (గల. 5:22, 23) ఆయన ఆ తర్వాత అంతకంటే తీవ్రమైన పరీక్షలను కూడా ఓపిగ్గా సహించాడు. అపొస్తలుడైన పౌలు తనను నలుగురిలో గద్దించినప్పుడు కూడా పేతురు వినయంగా ఉన్నాడు. (గల. 2:11-14) పౌలు తన స్థాయిని కించపర్చినట్లు పేతురు భావించలేదు, పగ పెట్టుకోలేదు. కానీ పౌలుపై ప్రేమ చూపిస్తూనే వచ్చాడు. (2 పేతు. 3:15) స్వయంత్యాగ స్ఫూర్తిని వృద్ధి చేసుకునేందుకు మనకు పేతురు జీవితం ఎంతో ఉపయోగపడుతుంది.

పౌలు సరిదిద్దినప్పుడు పేతురు ఎలా స్పందించాడు? మనం కూడా అలాగే స్పందిస్తామా? (15వ పేరా చూడండి)

16. పరీక్షలు ఎదురైనప్పుడు మనం స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా చూపించవచ్చు?

16 పరీక్షలు ఎదురైనప్పుడు మీరెలా స్పందిస్తారో ఆలోచించండి. ప్రకటిస్తున్నందుకు పేతురును, ఇతర అపొస్తలులను చెరసాలలో వేసి కొట్టినప్పుడు, “[యేసు] నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున” వాళ్లు సంతోషించారు. (అపొ. 5:41) అలాగే మీరు కూడా హింసలు వచ్చినప్పుడు, పేతురును అనుకరిస్తూ, స్వయంత్యాగ స్ఫూర్తిని చూపిస్తూ యేసు అడుగుజాడల్లో నడవడానికి వాటిని అవకాశాలుగా చూడవచ్చు. (1 పేతురు 2:20, 21 చదవండి.) అలాంటి మనస్తత్వం మీకు ఉంటే, సంఘ పెద్దలు మీకు ఇచ్చిన క్రమశిక్షణ నుండి ప్రయోజనం పొందుతారు. ఇతరులు మీకు సలహాలిస్తే నొచ్చుకోకుండా పేతురులా స్పందించండి.—ప్రసం. 7:9.

17, 18. (ఎ) మన ఆధ్యాత్మిక లక్ష్యాల విషయంలో మనం ఏమని ప్రశ్నించుకోవచ్చు? (బి) మన హృదయంలో ఏదో మూల స్వార్థం ఉందని తెలిస్తే, ఏమి చేయవచ్చు?

17 ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకునేటప్పుడు కూడా మీకు పేతురు మాదిరి సహాయం చేస్తుంది. మీరు స్వయంత్యాగ స్ఫూర్తిని చూపిస్తూ ఆ లక్ష్యాలను చేరుకోవచ్చు. అయితే, ప్రముఖులుగా ఉండాలనే కోరికతో మాత్రం అలా చేయకండి. అందుకే, మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘నేనెందుకు మరింత మెరుగ్గా, మరింత ఎక్కువగా యెహోవా సేవ చేయాలనుకుంటున్నాను? ప్రముఖ స్థానాల కోసం యేసును అభ్యర్థించిన యాకోబులా, యోహానులా నాక్కూడా సంఘంలో సొంత గుర్తింపు లేదా అధికారం పొందాలనే కోరిక ఏ మూలనైనా ఉందా?’

18 మీ హృదయంలో ఏదో మూల అలాంటి స్వార్థం ఉందని తెలిస్తే, మీ ఆలోచనలను, భావాలను సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని యెహోవాను వేడుకోండి; తర్వాత, మీ ఘనతపై కాకుండా యెహోవాకు రావాల్సిన ఘనతపై మనసు పెట్టడానికి గట్టిగా కృషి చేయండి. (కీర్త. 86:11) అలాగే, ఇతరుల దృష్టి మీమీదకు మళ్లించని లక్ష్యాల కోసం పనిచేయవచ్చు. ఉదాహరణకు, ఆత్మఫలంలో మీకు కష్టంగా అనిపించే ఏదైనా లక్షణాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి కృషి చేయవచ్చు. లేదా, మీరు కూటాల కోసం బాగానే సిద్ధపడుతున్నా, రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే పనిలో పాల్గొనాలనే ఆసక్తి మీలో అంతగా లేకపోతే, రోమీయులు 12:16⁠లోని సలహాను పాటించడాన్ని ఓ లక్ష్యంగా పెట్టుకోవచ్చు.—చదవండి.

19. దేవుని వాక్యమనే అద్ధంలో మన లోపాల్ని చూసుకున్నప్పుడు, నిరుత్సాహపడకుండా ఉండాలంటే మనం ఏమి చేయవచ్చు?

19 దేవుని వాక్యమనే అద్ధంలో మనల్ని మనం చూసుకుని, మనలోని చిన్నచిన్న లోపాలను, చివరికి స్వార్థపు జాడలను కూడా గమనించినప్పుడు కొన్నిసార్లు నిరుత్సాహానికి గురికావచ్చు. ఒకవేళ ఆ పరిస్థితి మీకు ఎదురైతే, యాకోబు చెప్పిన ఉదాహరణలోని ధన్యుడైన వ్యక్తి గురించి ఆలోచించండి. తన లోపాల్ని గుర్తించిన ఆ వ్యక్తికి వాటిని సరిచేసుకోవడానికి ఎంత సమయం పట్టిందో యాకోబు చెప్పలేదు, ఆ వ్యక్తి లోపాలన్నిటినీ సరిచేసుకోగలిగాడని కూడా ఆయన పేర్కొనలేదు; అయితే ఆ వ్యక్తి ‘సంపూర్ణమైన నియమములో నిలుకడగా ఉన్నాడు’ అని మాత్రం యాకోబు నొక్కిచెప్పాడు. (యాకో. 1:25) ఆ వ్యక్తి అద్దంలో చూసుకున్నదాన్ని గుర్తుపెట్టుకుని, లోపాలు సరిచేసుకోవడానికి కృషి చేస్తూనే ఉన్నాడు. అవును, మీరిక మెరుగుపడలేరనే ఆలోచనతో నిరాశ చెందకండి, మీలోని లోపాల్ని చూసి అతిగా నిరుత్సాహపడకండి. (ప్రసంగి 7:20 చదవండి.) సంపూర్ణమైన నియమంలో క్రమంగా తేరి చూస్తూ, స్వయంత్యాగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కృషి చేస్తూ ఉండండి. యెహోవా మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, మీ తోటి సహోదరుల్లో చాలామందికి ఇప్పటికే సహాయం చేశాడు కూడా. వాళ్లూ మీలాగే అపరిపూర్ణులే అయినా, యెహోవా అనుగ్రహాన్నీ ఆశీర్వాదాల్నీ ఆస్వాదిస్తున్నారు.